శ్రేష్టమైన శ్రావణ లక్ష్మి

మేలిమి గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహం, ఆనందం, శాంతం, సామరస్యం, సౌమనస్యం …. ఈ శుభ గుణాలకు సాకారమే శ్రీ లక్ష్మి. ఈ శుభగుణాలే ప్రతివారు ఆశించేవి. అందుకే లక్ష్మీ ఆరాధన.

శ్రావణ మాసం కొత్తందాలు, కొత్త మొలకలు, పచ్చదనాలు మొదలయ్యే చల్లని నెల. వర్షాకాల వైభవంలో శ్రావణమాసం పవిత్రమైన దేవీ పూజలకు తరుణం. ‘ఆర్ద్రాం పుష్కరిణీం’ అని శ్రీ సూక్తం వర్ణించినట్లు – ఆర్ద్రత కలిగిన కరుణ రసస్వరూపిణి జగదంబను గౌరిగా, లక్ష్మిగా ఆరాధించే మాసమిది. శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారం, పౌర్ణమి వంటి పావన పర్వాలు ఈ నెలకు ప్రత్యేక శోభను సంతరిస్తాయి.

శ్రావణ సోమవారాలు శివునికి అత్యంత ప్రీతికరాలు. అందుకే ఉత్తరాదిలో కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శివక్షేత్రాలు శివవ్రతాచరణ చేసే భక్తులతో కళకళలాడుతుంది. ఈ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం విశేషము. మంగళవారం గౌరి వత్రాలు, శుక్రవారం లక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ హయగ్రీవ జయంతి, సుబ్రహ్మణ్య, కృష్ణ, విష్ణువు, వృషభాది దేవతలకు ప్రీతికరమైన ఈ సకలదేవతా మాసం ఒక మంగళకర వాతావరణాన్ని దర్శించింది మన సంప్రదాయం.

అమ్మవారు రసస్వరూపిణి. అందుకే రసమయుడైన చంద్రుని కళల వృద్ధిని అనుసరించి ఆమెను మనం ఆరాధించడం. ‘చన్ద్రాం చన్ద్ర సహోదరీం’ అని లక్ష్మీనామాలు. చంద్రుని తోబుట్టువని పురాణాల మాట. ఆహ్లాదం, ప్రసన్నత, ఆర్ద్రత, నిండుదనం,ప్రీతి… మొదలైనవి చంద్ర భావనలు. ఈ భావనల దేవత లక్ష్మి.

జగతిని పోషించే ఐశ్వర్యశక్తి, లక్షణ శక్తి లక్ష్మి. ఏ వస్తువు లక్షణం దానికి ఐశ్వర్యం. ప్రకృతిలో ప్రతి పదార్ధానికి ఉండవల్సిన లక్షణ సమృద్ధి, కళ లక్ష్మీ స్వరూపం.

‘సిద్దలక్ష్మిః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ
శ్రీ ర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నాదా మమ సర్వదా’

ఏ కార్యమైనా సిద్ధే ప్రయోజనం. అది లేనపుడు కార్యానికి ప్రయత్నమే ఉండదు. అందుకే ‘సిద్ధి’ అనేది మొదటి లక్ష్మి. సిద్ధించిన కార్యభారం నుంచి విముక్తులవుతాం. ఆ ముక్తియే ‘మోక్షలక్ష్మి’.

ప్రతికూల పరిస్థితులను దాటడమే జయలక్ష్మి. పనికి కావల్సిన తెలివితేటలు, సమయస్ఫూర్తి సరియైన నిర్ణయశక్తి, విజ్ఞానం… వంటివన్నీ విద్యాలక్ష్మి. అదే ‘సరస్వతి’. ఫలితంగా పొందే సంపద, ఆనందం శ్రీ లక్ష్మి. దాని వలన కల్గిన శ్రేష్టత్వం, ఉన్నతి వరలక్ష్మి. చివరి గమ్యం ఇదే. అందుకే వరలక్ష్మీ వ్రతం అంటే మిగిలిన ఐదు లక్ష్ములను కూడా ఆరాధించి, ఆ అనుగ్రహాన్ని పొందటమే.

‘వర’ అంటే శ్రేష్టమైనది అని అర్ధం. ప్రతీవారు ప్రతిరంగంలో, ప్రత్యంశంలో శ్రేష్టతనే ఆశిస్తారు. ఆ శ్రేష్టతే దేవీ స్వరూపం. శుద్ధ సత్వ స్వరూపంతో భాసించే జగజ్జనని శ్రీ లక్ష్మి. కొందరు అష్టలక్ష్ములుగా, కొందరు షోడశ లక్ష్ములుగా సంభావిస్తున్నా, ఆమె మాత్రం అనంతలక్ష్మి.

సూర్య కాంతి, చంద్ర కాంతి, అగ్నిదీప్తి, భూమి, గరిమ, జలంశీతలత, క్షేత్రాల పచ్చదనం, పుష్పిత, సౌందర్యం, ఫలశోభ, ఆరోగ్యం, ఉత్సాహం, గగనపు వైశాల్యం, సముద్రాల గాంభీర్యం, కంఠాన పలుకు, శరీరంలో చైతన్యం, విద్యలలో విజ్ఞానం.. ఇలా అనంతమైన విభూతులు ఎన్నో ఒకే పరమేశ్వరుని ఈ అనంత శక్తులే లక్ష్ములు. ఇన్ని శక్తులను వెదజల్లే ఏకైక పరమేశ్వర శక్తే వరలక్ష్మీ. ఇన్ని వరాలను కురిపించే ఆ తల్లికి మొక్కులు.

ఈ పూజలో ఆరాధించే స్వరూపం ‘కలశం’. కలశంలో బియ్యమో, జలమో వేసి పచ్చని చిగుళ్లు పెట్టి, దానిపై ఫలాన్ని ఉంచి ఆరాధించడం గొప్ప విశేషం. బ్రహ్మాండమే కలశంలో సంపద, పచ్చదనం (మంగళం), సత్ఫలం నిండి ఆరాధన పొందుతున్నాయి.

శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వత్రం అని సనాతన సంప్రదాయం. ఈ వ్రతంనాడు ఆనవాయితీగా చెప్పకునే కథ చక్కని పత్రికలతో, ధర్మ సూచనలతో కూడి ఉన్నది. సౌమ్యమైన, ప్రేమాత్మకమైన, ఒద్దికైన జీవితాన్ని గడుపుతూ, గృహిణీ ధర్మాన్ని సమర్ధంగా సాగిస్తున్న చారుమతీ దేవిని లక్ష్మి అనుగ్రహించిన కథ ఇది.

‘చారుమతి’ అనే పేరే చక్కని సంకేతం. సుందరమైన బుద్ధియే చారుమతి. దురాలోచనలు, దుష్ట సంకల్సాలు, దుర్గుణాలు, లేని మంచి మనసే చారుమతి. అటువంటి మంచి మనస్సునే మహాలక్ష్మి అనుగ్రహిస్తుందని ఈ కథ చెప్పిన మొదటి సందేశం.

పొందే సంపదలన్నీ దేవతా స్వరూపాలుగా, ప్రసాదాలుగా దర్శింపజేసే సత్సంప్రదాయాలు మనవి.

శ్రావణ మాసంలో విశిష్టదినాలు:

శ్రీ రమా సహిత సత్యనారాయణ వ్రతం: శ్రవణా నక్షత్రం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. కనుక, శ్రావణ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా మంచిది.

శ్రీ నాగుల చవితి: పూర్ణిమకు ముందు వచ్చే చతుర్ధి, అనగా శుద్ధ చతుర్ధి రోజున సుబ్రహ్మణ్య లేక నాగ దేవత అభిషేకములు విశేషము. ఈ రోజున నాగ అభిషేకం చేసినవారికి సంతాన సంబంధ దోషములు నివృత్తి అవుతాయని నమ్మకం.

శ్రీ పుత్రదా ఏకాదశీ వ్రతం: పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి, అనగా శుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు. ఈ రోజుని లలితా ఏకాదశీ అని కూడా అంటారు. పుత్ర సంతానం కలగటానికి ఈ రోజున పుత్రదా ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తారు.

శ్రీ సంతోషీమాతా వ్రతం మరియు రక్షా బంధనం: శ్రావణ పూర్ణిమ శ్రీ సంతోషీమాతా జయంతి. ఈ రోజున శ్రీ సంతోషీమాతా వ్రతము చాలా విశేషము. శ్రావణ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. స్త్రీలు అన్నదమ్ములకు, సోదర సమానులకు రక్షను (రాఖీని) కట్టటం వలన శుభ ఫలితములు చేకూరుతాయి.

ఉపాకర్మ మరియు నూతన యజ్ఞోపవీత ధారణ: నూతనంగా ఉపనయనం అయిన వటువు ఈ రోజున కృష్ణాజిన విసర్జన చేసి యజ్ఞోపవీతము మార్చుకోవాలి. అట్లాగే విధిగా ఉపనయన సంస్కారం అయిన వారందరూ యజ్ఞోపవీతాన్ని (జంధ్యాన్ని) మార్చుకొని గాయత్రీ జపం చేసుకోవాలి.

శ్రీ లలితా సహస్రనామ పారాయణ: శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతి అని పురాణ వచనము. ఈ రోజు విష్ణు ప్రీతిగా చేసే అర్చన, ఆరాధన, వ్రతములు విశేష ఫలితాన్ని ఇస్తాయి. అట్లాగే, ఈ రోజున హయగ్రీవుని ద్వారా ఉపదేశించబడిన శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టటం మంచిది. తద్వారా మనుషులలో వుండే ఆహాకారం తొలగిపోయి అందరితో సమ భావన కలిగి వుంటారు.

శ్రీ గురు రాఘవేంద్ర జయంతి: పూర్ణిమ తర్వాత వచ్చే విదియ, అనగా బహుళ విదియ రోజున శ్రీ గురు రాఘవేన్ద్రుల వారు సజీవంగా సమాధిలోకి వెళ్ళిన రోజు. ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన, అభిషేకములు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. గురునాధ పొంగళ్ళు వున్నవారు ఈ రోజున శ్రీ రాఘవేంద్ర అర్చన ఖచ్చితంగా చేసుకోవాలి.

శ్రీ సంకట హరణ చతుర్ధి: బహుళ చతుర్ధి రోజున శ్రీ గణపతుల వారికి అభిషేక, అర్చన, వ్రతాదులు చేయటం వలన అన్ని కష్టములు తొలగి మంచి ఫలితములు కలుగుతాయి.

శ్రీ కృష్ణా అష్టమి: బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణ జయంతి కనుక, ఆ రోజున పిల్లలతో శ్రీ కృష్ణ పూజ చేయించి వెన్న, అటుకులు నైవేద్యం పెట్టించటం మంచిది. తద్వారా ఆ పిల్లలకి అన్ని విధాల కష్టాలను తేలికగా ఎదుర్కునే సామర్ధ్యం కలుగుతుంది. ఈ రోజునే జన్మాష్టమి అని కూడా అంటారు.

శ్రీ ఏకాదశీ వ్రతం: బహుళ ఏకాదశి రోజున ఏకాదశీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మనస్సులో వుండే కోరికలు శీఘ్రంగా నెరవేరతాయి. ఈ రోజునవెన్న నైవేద్యం పెట్టటము మంచిది.

శ్రీ వృషభ అమావాస్య: వేదములను కాపాడటానికి శ్రీ మహా విష్ణుమూర్తి శ్రావణ పూర్ణిమ రోజున శ్రీ హయగ్రీవునిగా జన్మించాడు. శ్రావణ అమావాస్య రోజున వృషభ పూజా చాలా విశేషము. ఈ రోజున వృషభ పూజ చేయటం వలన అకాల మృత్యువు తొలగి పోయి దీర్ఘ ఆయుస్సు చేకూరుతుంది.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *