తెలుగు నాటక సాహిత్యంలో సింగరాజు లింగరాజు ఒక విలక్షణమైన పాత్ర. భారతీయ సాహిత్యంలోనే ఒక అపూర్వ సృష్టి. స్వార్ధం, లౌక్యం, పిసినిగొట్టుతనం కలబోసుకుని పుట్టిన పాత్ర. ‘ధనం మూలం మిదమ్ జగత్తు’ అనే సూత్రానికి భాష్యకారుడు అతనే! లింగరాజుకు డబ్బే సర్వస్వం! ఈ చరాచర ప్రపంచంలో ప్రతి వస్తువునూ డబ్బు అనే కళ్లద్దాల ద్వారానే చూస్తాడు ఆ మహానుభావుడు. అతడు దేవుణ్ని ప్రార్ధించేది తనకు సుఖశాంతులు ప్రసాదించమని కాదు, తన ఇంట్లో ధనరాసులు కుమ్మరించమని. కట్నంతో మూటలు కట్టుకోవచ్చని అతడు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. కుర్నవాణ్ణి కాలేజీకి పంపిస్తున్నాడే డబ్బు ఖర్చుపెట్టి అనుకుంటే పప్పులో కాలేసినట్టే! కాలేజీ విజ్ఞాభివృధ్ధికోసం కాదు, కట్నం ‘రేటు’ పెరగటం కోసం. లింగరాజు చేసే ప్రతీ పనికీ, వెనుక పద్మవ్యూహంలాంటి తిరకాసు ‘కాసే’.
అందుకే ప్రొద్దునే నిద్రలేచి లింగరాజు, ‘‘భగవతీ! భాగ్యలక్ష్మీ, ప్రణామంబు, నీదాసానుదాసుండ, నీ పాదముక్తుండ, నీ దివ్యరూపంబె నిత్యంబు భావింతు నీ దివ్యనామెంబే నిక్కంబుగా నిద్రలో గూడా జపింతు, నాదిక్కు, నా మొక్కు, నాయండ, నా దండ నీవే సూమా! భార్యయుం, గీర్యయుం, బిడ్డలుం, గిడ్డలు, దేవుడుం, గీవుడున్, మోక్షముం, గీక్షమున్, సర్వమున్నీవే! సత్యంబు, నీకై నిరాహారినై యుందు, నీకై నిశలు నిద్రమాన్కోందు, నీకై శరీరాభిమానంబు వర్జింతు, నీకై యతస్య ప్రమాణంబు లెన్నేనియు గావింతు నీ యాన! ఈ పెట్టెయే నీ పవిత్రాలయం, నేనే నీయర్చకుండన్, యదార్ధంబుగా నాదు ప్రాణంబులె నీదు పూజాసుమంబుల్ శరీరంబే నైవేద్య కుంభంబు, నా ఇంటనే యుండి, నీ పూజం గొంచునే ఇంటికి నంపింనం బోయి, యా ఇల్లుమట్టంబు గావించి, నా ఇంటికిందెచ్చి నాకిచ్చు దుండంగదే కన్నతల్లీ! నమస్తే, నమస్తే నమః’’ అంటూ లక్ష్మీదండకం ముమ్మారు పఠించి, సర్వే జనః దుఃఖినోభవంతు అని శాంతి వచనాలు పలుకుతాడు.
లింగరాజు జననం 1922లో జరిగినప్పటికీ, నేటికీ మన సమాజంలో లింగరాజులకు కొదవలేదు. ధన రాకాసి, కట్న పిశాచి నేటి సమాజంలో కూడా ప్రబలంగానే ఉంది. కాళ్ళకూరి నారాయణరావు గారు సృష్టించిన లింగరాజు మీద ఈ భూమండంలో ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. మనిషన్నవాడెవడూ లింగరాజును గౌరవించిన ఆనవాళ్ళు లేవు. ఎవరేమనుకున్నా లింగరాజుకి కలిగే నష్టంలేదు. అతనికి సంఘంతో పనిలేదు. పరువు, మర్యాద, ఆత్మాభిమానం వంటి భేషజాలకు అతను బహుదూరం. లోభత్వానికి లింగరాజు నిలువుటద్దమే కాదు. పొదుపును గురించి అనర్ఘళంగా ఉపన్యసించ గలిగే ఘనాపాఠి. వంటమనిషికి ప్రతిపూట వంట సామాను వంట కట్టెలు, పిడకలు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, చివరికి నిప్పు పుల్ల కూడా గీచి, గీచి లెక్కలడిగి మరీ యిస్తాడు. పొయ్యిలో కట్టెలు కావల్సివస్తే, కరివేపాకు చెట్టుమీది కాకి గూడు పడద్రోసి ఆ పూట వంట చేయ్యమని సలహా యివ్వటం అతనిలోని పినాసితనానికి పరాకాష్ట. ‘‘పక్షిగూడు పడగొట్టడం పాపం కదండీ’ అని అంటే, ‘పాపమేమిటి నీ బొంద! ఖర సంవత్సరంలో మా యింటి వంటంతా కాకి గూళ్లతోనే వెళ్ళిపోయిందని గత చరిత్రను చెప్పుకొని మురిసిపోతాడు.
అంతేకాక, లోకం పోకడ గురించి లింగరాజు అభిప్రాయం, అవగాహన నేటి సమాజ తీరుతెన్నులు చూస్తే తప్పుకాదేమో అన్నట్టుగా ఉంటాయి. ఈ కింది గేయంలో పరికించండి:
ప్రాయికంబు జెట్టు పాతువాడొకండు
వరుస బండ్ల మొక్కు వాడొకండు
కష్టపడి గృహంబు గట్టువాడొకండు
వసతిగ నివసించు వాడొకండు
ఆస్తికై వ్యాజ్యంబు లాడువాడొకండు
వచ్చినది మృంగు వాడొకండు
కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు
వలపు కాండై పొందు వాడొకండు
అట్లే, ధనము కూర్చునట్టి వాడొక్కండు
పడిగం దగులబెట్టు వాడొకండు
ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన
లీలగాదు దీని కేల గోల?
ధనమునే ప్రధానంగా కొలిచే ప్రబుధ్దులకు తలమాణికం లింగరాజు సింగరాజు అనడానికి ఈ కింది పద్యమే మచ్చుతునక.
సంపద మహత్వమెరుగని చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని సలుపండైయ్యె
చచ్చునప్పుడు వెనువెంట సకలధనము
తీసికొనిపోవు విధమేని తెలుపండైయ్యో
లింగరాజు ఎంతటి పినాసీ అయినా అతనిలో ప్రత్యేకత అతని చమత్కార ధోరణి. నిత్య సంభాషణల్లో కురిసే హాస్యరసం నయగారా జలపాతాన్ని గుర్తుకి తెస్తుంది. లింగరాజులాంటి స్వార్ధచింతుడిలో హాస్యమేమిటా అని మీకు అనుమానం రావచ్చు. నిజానికి లింగరాజు హాస్యచతురుడు కాడు. అతని లోభితనం నుంచి, పేరాశ నుంచి, సంకుచిత మనస్తత్వం నుంచి, డబ్బుకోసం ఏ గడ్డయినా కరిచే అతని నైచ్య ప్రవృత్తి నుంచి స్వభావసిద్ధంగా హాస్యం పెల్లుబుకుతుంది. ఎదుటి మనిషిని నవ్వించాలనే ధృక్ఫథం అతనిలో ఏ కోశానా లేని హాస్యపాత్ర. నాటక కర్త కాళ్ళకూరి గారి కలం కన్ను గప్పి ఎదిగిన సింగరాజు లింగరాజు పాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారి లోగిళ్ళలో నవ్వుల చిరుజల్లులు వెదజల్లూతూ నిత్యనూతనంగా భాసిస్తూనే ఉంటుంది.
సౌమ్యశ్రీ రాళ్లభండి
తొలిరోజుల్లో రంగస్థలంపై ప్రజాదరణ పొందిన పాటలు, పద్యాలు, బాణీలను సినిమాల్లో చొప్పించేవారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలం, పసుమర్తి యజ్ఞ నారాయణశాస్త్రి, కొప్పరపు సుబ్బారావు, చందాల కేశవదాసు వంటి రంగస్థల ప్రముఖుల పాటలు సినిమాల్లో ఎక్కువగా విన్పించేవి. సముద్రాల రాఘవాచార్య, పింగళి నాగేంద్రరావుల ప్రవేశంతో తెలుగు పాట కొత్త నడకలు నేర్చింది. వ్యావహారశైలిని పొదవుకుని ముందుకు నడిచింది. సినీ సాహిత్యంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది.
పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా తెలుగు సినీ పాటకు ఒరవడి దిద్ది రాబోవు తరాలకు మార్గదర్శకులైన సముద్రాల రాఘవచార్యులగారు, అతి సులువైన పదాలతో రాసిన పాటలు, సృష్టించిన మాటలు ప్రజల మనసులో, తెలుగువారి పెదాలపై నిలిచే పాటలను అందించిన పింగళి నాగేంద్రల సినీ సాహిత్యాన్ని విని ఆనందించండి.
తొలితరం రచయితలు – సముద్రాల, పింగళి..
తెలుగు సినీ స్వర్ణయుగంలో సముద్రాల, పింగళిగార్ల తర్వాత చెప్పుకోదగ్గవారు తెలుగు సినీపాటకు పరిపుష్టతను చేకూర్చిన వారు ఆచార్య ఆత్రేయ, ఆరుద్రలు. ఒకరు గోత్రమైతే, మరొకరు నక్షత్రం. తమ ఒంటిపేర్లకంటే, గోత్ర, నక్షత్ర నామాలతోనే సినీ వినీలాకాశంలో ప్రకాశించిన కవులు వీరు. సాహిత్య విలువలు కలిగి, మాధుర్య ప్రధానమైన పాటలు తెలుగు శ్రోతలను అలరారిస్తున్న 50, 60 దశకంలో వీరివురు సందర్భోచితంగా, పాత్రోచితంగా పాటలను రాసి అందరిని మెప్పించారు.
చిన్ని చిన్ని పదాలతో స్పష్టమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయగారు ఆయనకు ఆయనే సాటి. పదాలు చిన్నవైనా తరచి చూస్తేగాని, వాటి లోతుల్లోకి తొంగి చూస్తేగాని ఆ పదాల్లో ఇమిడివున్న, దాగివున్న తాత్విక జ్ఞానం, జీవిత సత్యాలు మనసుకు పట్టవు. శ్రీశ్రీగారి చేత ఇతను ‘ఆరుద్ర’ కాడు, ‘ఆరో రుద్రుడు’ అని మెప్పుపొందిన బహుముఖప్రజ్ఞాశాలి ఆరుద్ర. అంత్యప్రాసలే తన చేవ్రాలుగా సినీసాహితీ ప్రపంచంలో తనదంటూ ఒక ముద్రను వేశారు.
ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర...
పాల్కురికి సోమనాథుడు తెలుగులో మొట్టమొదట రచించిన బసవ పురాణం మొదలుకుని, తర్వాత వెలువడిన మార్కండేయ పురాణం, వెన్నలకంటి సూరన విష్ణు పురాణం, నందిమల్లయ్య, ఘంట పింగనల వరాహ పురాణం, ఎర్రన రాసిన నరసింహ పురాణం, శ్రీనాథుని భీమేశ్వర పురాణాలతోపాటు అనేక క్షేత్ర పురాణాలను అనేక మంది కవులు తెలుగువారి ముంగిళ్లలోకి తీసుకువచ్చారు. ఈ పురాణాలు మన జానపదులను, వారి సాహిత్యాన్ని కూడా ప్రభావితపర్చాయి. శ్రీకృష్ణలీలలు, శ్రీరామ పట్టాభిషేకం, శశిరేఖా పరిణయం, రుక్మిణీ కళ్యాణం, భక్త ప్రహ్లాద, మహిషాసుర వధ ఇలా అనేక పురాణ ఘట్టాలు జానపద కళారూపాలకు ఇతివృత్తాలై, జనబాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లాయి.
జానపద కళారూపాల్లో రామాయణ, భారత గాథలు ప్రస్ఫుటంగా కన్పించినా, భాగవత ఇతివృత్తాలకు కూడా తగిన ఆదరణ లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా, కృష్ణలీలలు, రేపల్లెలో చిన్నికృష్ణుని చిలిపి చేష్టలు, గోపికా గీతాలు వంటివి జానాదరణ పొందాయి. యశోద లాలి --
‘‘లాలి కృష్ణయ్య నీలమేఘ శ్యామన్న
పాలా గోపాలన్న పవ్వళించగ రావయ్య
శృంగారించీన మంచి బంగారు ఉయ్యాలలో
ఆదిశేషుని పాన్పుమీద పవ్వళించగ రావయ్య
ఇంద్రలోకాన నీకెవ్వరు కావలనయ్యా
లలితాంగ శ్రీ సత్య భామాదేవి కావలనా...
రుక్మిణీయు కావలెనా రాధాదేవి కావలనా...’’
బృందావన కృష్ణుని రాసలీలలు, రాధాకృష్ణుని ప్రణయ గాథలు, గోపికలు కృష్ణుని చిలిపి చేష్టల గురించి ఫిర్యాదు చేసిన సందర్భంలో యశోద-గోపిక-కృష్ణుల సంవాదాలు, హృదయరంజకంగా జానపదులు మలిచారు.
గోపిక: పెరుగు చిలుకుచుండగా నా మరుగున నిలుచున్న కృష్ణుడు
పెరుగు చారెడు నించుకొని జుర్రి పరుగిడి పోయినాడు
అడుగవే తల్లి అడుగావే
యశోద: అడిగినంత వెన్న నీకు పెడుదునే మన యింట్లో లేదా
దుడుకుతునమున పొరుగిండ్లకు దొంగిలి తిన బోవనేల కృష్ణా
పడుచులపై నీకు చలమేలనురా.
కృష్ణుడు: దేవరాకు పెట్ట వలెనని యీవరా కనుకొంటుయంటిరి
ఆ దేవుడేమొ జుర్రిపోతే తెలియకానా మీద పెట్టిరి
గోపికలు: గొల్ల భామలంతా గూడి చల్లలమ్మను బోవుచుండగ
చల్లబానకు సుంకమిమ్మని చిల్లులూ పడగొట్టినాడు అడుగావే తల్లీ
యశోద: యేమిరామృష్ణయ్య గొల్లభామలు చల్లనమ్మబోతె
చల్లబానకు సుంకమిమ్మని చిల్లులూ పడగొట్టినావట కృష్ణా
కృష్ణుడు: చిల్లులూగ సమయమున, వడగండ్ల వర్షమొచ్చి బానలు
చిల్లులూ పడగొట్టనేమొ, చిల్లరాపనులెగుర తల్లి తెలియాచెతల్లి
గోపిక: గొల్లభామలంతా గూడి, స్నానమాచరించేటప్పుడు చీరల్నియు
తీసుకొని చెట్టుపై గూర్చిండినాడు.
తల్లీ తనయుని తప్పులు దెల్పెదమె
యశోద: యేలరా కృష్ణయ్య గొల్లభామలు స్నానము జేయగ
చీరెలన్నియు తీసుకొని చెట్టుపై కూర్చిండి నావట కృష్ణా
కృష్ణుడు: చెట్టుపై కూర్చిండి నేను పండుతినే సమయమందు సుడిగాలి వచ్చి
చీరల్నియు చెట్టుపైబడ నేసెతల్లి తెలియదె తల్లితెలియదె.
ఇలా కృష్ణుని తుంటరి పనులను గోపికలు ఏకరువు పెట్టగా యశోద, కృష్ణుని నిలదీసిన తీరు, కాళీయ మర్ధనం, గోవర్ధన గిరి నెత్తడం వంటి అనేక దివ్యగాథలను మనోజ్ఞంగా జానపదులు తమ పదాలలో రక్తి కట్టించారు. ఇక మధురానగరికి చల్లనమ్మబ్రోవ దారివిడవమని గోపికలు కృష్ణుని వేడు కోలాట పాటలు –
కృష్ణుడు: మత్తగజగమనరో మీ అత్త ఆజ్ఞ మీరనుచు
తత్తరీనని బొంకెదవు నీటక్కరి తనమెల్ల మానుము
గోపిక: బల్లు బల్లున తెల్లవారెను పల్లెలకు చల్లలమ్మ పోవల
మల్ల వచ్చిన వెనకనీతో మాటలుంటె నిలుతుగానీ
కొత్త కోడళ్లతో కృష్ణస్వామి చేసే పరాచికాలు –
గోపిక: రేపెల్ల వాడలాకు కృష్ణమూరితీ నీవు ఏమి పని కొచ్చినావు చిన్ని మాధవా
కృష్ణుడు: రేపల్లె వాడలకు గొల్లభామా నేను పాలు పెరుగు వెన్న కొస్తి పల్ల వాధరీ
గోపిక: కొత్త కొడలినయ్య క్రిష్ణమూరితీ మా అత్తానన్న అడగవయ్యా చిన్ని మాధవా
కృష్ణుడు: కొత్తా కోడలివైతే గొల్లభామా నీకు రొక్క మిస్తా పుచ్చుకొయె పల్లవాధరీ
గోపిక: నీ రొక్కములు నా కొద్దు కృష్ణమూరితీ నీకు కోటప్ప కన్న కట్టవయ్యా చిన్ని మాధవా
కృష్ణుడు: కోటప్ప కన్న కడతానే గొల్లభామా నా కల్లలాడు కోర్కెదీర్చు పల్ల వాధరీ
గోపిక: అట్లా మాట్లాడబోక కృష్ణమూరితీ నీవు రోత పట్టి పోతువు చిన్నిమాధవా
కృష్ణుడు: ఉల్లి మల్లి చీర దెస్తి గొల్లభామా నా కల్ల చూడు కోర్కె దీరు గొల్లభామా
గోపిక: మంచిపని చేస్తివయ్యా కృష్ణమూరితీ మా యింటి వాడు గోపగాడు చిన్ని మాధవా
కృష్ణుడు: మంచిపని చేయకుంటే గొల్లభామా నన్ను మాధవుడందురంటే పల్లవాధరీ.
ఇలా అనేక విధాలుగా రేపల్లెలో చిన్నికృష్ణుని చిలిపి చేష్టలలో జానపదులు ఓలలాడారు.
తేటగీతి
‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని ఏనాడో శ్రీశ్రీగారు అన్నారు. ఆ నరజాతి ఘోషను, మహాప్రస్థానాన్ని వెయ్యి పద్యాలలో ఇనుమిండించుకున్న దృశ్య,శ్రవణ కావ్యం శ్రీ గరికపాటి నరసింహరావుగారు రచించిన ‘సాగరఘోష’ పద్యకావ్యం. ఆది శంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో ప్రపంచ దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన దర్శనకావ్యమిది.
మొత్తం 1116 పద్యాలతో నిండిన ఈ కావ్యంలో అవతారికలో 36పద్యాలు, ఒక అశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడిని పారవేస్తామా? లేదే? దాచుకుని, దాచుకుని తింటాము. అలాగే వృత్తాలు పాతవే అయినా కొత్త ఇతివృతంతో కొత్త ఆవకాయలా నోరూరిస్తుంది ఈ కావ్యం.
ఉ|| వేదము కన్న ముందుగ వివేకము నేర్పును కన్నతల్లి, ఆ
పాదము నాకు సర్వ సమభావము. భావము నందు నిల్పె, ఓం
నాద శిఖాగ్ర సీమయగు నా జనయిత్రిని గొల్చినంత ఏ
భేదము లేమి నిల్చునిక! వేదములౌను సమస్త వేదముల్
అంటూ మాతృదేవతకు అంజలిఘటించి, భారతీయ తత్త్వానికి, ఆథ్యాత్మికతకు మూలస్తంభమైన, ఆ ఆదిశంకరునికే
కన్యాదానము జేసెడి ధన్యత చేకూరలేదు, తప్పదు కవితా
కన్యాదానము చేసెద, సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే
అంటూ తన కావ్యపుత్రికను అంకితమిచ్చే సాహసం చేశాడు కవి.
పాఠకుని ఊహలకతీతంగా ఈ కావ్యానికి కవి నాంది పలికాడు. ప్రౌఢవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చుని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉండగా, ఆవును చేరిన లేగదూడ వలే ఒక సుడికూన, ఆ కవి ఒళ్ళో చేరుతుంది. ఆ కూనను చూసి ఒడిలో చేరిన పసిపాపగా భావించి, కవి ప్రేమగా చేరదీసి, లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా తగులుతుంది. ‘పాల మీగడ వలె, దూదిపింజె వలె, స్వచ్ఛంగా ఉండవలసిన నీటి కెరటానివి, ఇలా ఉన్నావేమిటి?’ అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుండి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఈ విధంగా ఉందని ఆ సుడికూన వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే సేదతీరి పయనమవుతానని అర్ధిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే స్వాగత సత్కార్యాలు చేసి,
కం: జోజో తరంగ బాలా!
జోజో! డిండీర చేల! జో! ఘననీలా!
జోజో! మౌక్తిక డోలా!
జోజో! మృదుభావలీల! జో! జలకీలా!
అంటూ జోలపాడి సేదతీరుస్తాడు. తరంగం మేల్కొన్న తర్వాత అది తాకి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని కవి అర్ధిస్తాడు. కవి హృదయాన్ని ఎరిగిన ఆ తరంగబాల చెప్పిన మానవుని జీవితగాథే సాగర ఘోషై మానవాళిని ఉప్పెనలా ముంచెత్తింది.
ఇందులో ప్రతి పద్యము నేటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు నిదర్శనము. ప్రత్యక్ష సాక్ష్యము!
చూచెడి దెల్లమిథ్య, కనుచూపును మిథ్యయె, నిన్నునీవుగా
చూచెడి దాక ఈ జగతి జూచెడి దెల్ల వృథా వృథా వృథా!
చూచెడి చూపువెన్కగల చూపును శోధన చేయుమయ్యదే
చూచిన నింక లోకమును చూచెడిదేమి? సమస్తమయ్యదే!
మానవ జీవన స్రవంతిలో కొట్టుకొనిపోయిన వైశిష్ట్యాలకు, మరుగునపడిన మానవతకు మూగసాక్షి సాగరఘోష. ఆదిశంకరాచర్య, రామానుజాచార్య, మహ్మద్ ప్రవక్త, ఏసుక్రీస్తు, రామకృష్ణ, వివేకానందుడు, రమణ మహర్షి వంటి ప్రవక్తలు, నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య, షేక్స్పయిర్, టాల్ స్టాయి, విశ్వకవి రవీంద్రుడు సాక్ష్యాలుగా నిలువగా నీటి పుట్టుకతో ప్రారంభమై, దశావతారాలు, ప్రాచీన నాగరికత, జైన-బుద్ద మార్గాలు, శైవ-వైష్ణవ తత్త్వాలు, గ్రీకుల నుంచి మొదలై గజనీ-ఘోరీ దండయాత్రలతోపాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, ఫ్రెంచి, రష్యా విప్లవాలు, కమ్యూనిజం, మార్క్సిజం, వైజ్ఞానికావిష్కరణలు, మందుపాతరలు, అణుబాంబులు, అందాలపోటీలు, కాలుష్యాలు, వసుధైక కుటుంబంలో మమేకమై సాగర గర్భంలో మౌనంగా మిళితమైపోయాయి.
మానవ పరిణామ క్రమానికేకాదు, కవి హృదయ ఘోష కూడా నిలువుటద్దం ఈ పద్యకావ్యం. పరిణామాలు కాలానుగుణమైనా మితిమీరిన మానవ దృక్ఫథాలను కవి అడుగడునా దుయ్యపట్టి, తనదైన రీతిలో వ్యంగ్య బాణాలు సంధించారు. సాగర ఘోషలోని కవి దార్శించిన జీవన పరిణామాలలో కొన్ని మచ్చుతునకలు.
ఆ.వె||వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొంద
వచ్చు, సుఖము పొందవచ్చు కాని
భూతదయయె లేని భోగమ్ము లందటే
కలియుగాంత మనుచు తెలియరేల?
తే.గీ|| గుండెలో దూరినట్టి గుండుకాదు
పుణ్యభూమికి ఒక రాచపుండుగాని
నేలకూలిన వాడొక్క నేతగాడు
జాతి కేతనమును నేయు నేతగాడు|| (గాంధీజీ గురించి)
చ||మగడు గతించినాడనిన మానిని దుఃఖము పట్టలేము, మీ
తెగువ విచిత్రమౌను, వెతతీర్చుటకై పతిపీఠమిచ్చి ఆ
మగువను మంత్రి చేయుదురు మానవతా గుణమన్న మీయదే!
తగదని పల్కువారెవరు తప్పును నొప్పగు సానుభూతిలో|| (భారతీయ రాజకీయాలపై చురక)
కం|| ధరలాకాశము నంటెను
సరకులు పాతాళమందు చక్కగ దా
ధరకింక భగీరథుడో
నరుడో దిగిరావలెగద! న్యాయము చేయన్
సీ|| పూటపూటకు పెక్కుపోటీల పరీక్షల
తలనొప్పిచే మను తల్లడిల్ల
బస్తాల బరువున్న పుస్తకాలను మోసి
బంగారుమైదీవ క్రుంగిపోవ
కాపీలు సాగించు కన్నబిడ్డలగాంచి
కాటుక మొగమొల్ల క్రమ్ముకొనగ
పాండిత్యమేలేని పంతులయ్యల చూచి
నెరివేణి సవరంపు నీడనిలువ. (విద్యారంగ దుస్థితి)
ఉ|| నాటికి నిప్పు విప్లవమె, నాటికి నాటికి వృద్ధిజెంద పై
నాటికి చక్రవిప్లవము, నవ్యయుగమ్మున దివ్యమైన కం
ప్యూటరు పూర్ణవిప్లవము, మూడును ముఖ్యములైన, వేల వే
మాటలు? మానవ ప్రగతి మార్గము నందున మైలురాళ్లివే! (శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి)
శా|| మూఢాగ్రేసర చక్రవర్తు లిటలీ ముస్సోలినీ హిట్లరుల్
గాఢద్వేషము చూపగా అమెరికా గత్యంతరాపేక్షతో
గూఢత్వంబున మిత్రరాజ్యములతో కూటమ్ముగావించి శం
భో! ఢాంఢాం ఢఢఢాం ఢఢాంఢ మణుబాంబుల్ పేల్చె పృథ్వీస్థలిన్||
ఉ|| గుండెకుగుండె చూపగల గుండెలులేక పరోక్షమందు బ్ర
హ్మాండము బుగ్గిచేయుటె మహాహవ ధర్మమటన్నచో జగ
ద్భాండము వీరిహస్తముల భద్రముగా నెటులుండు? ఇంకనె
ట్లుండును చిత్తశాంతి? ఎటులండును గుండెలపైన చేతులున్. (అణుబాంబులపై వ్యథ)
ఇలా మొత్తం వెయ్యి పద్యాలు దేనికదే ధీటుగా ఉండిగా, ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నముద్ద ఇస్తే, ఎలా గబుక్కున అంతా నోటిలో పెట్టుకుని తబ్బిబ్బవుతాడో అలాగే సాగరఘోష పద్యాలన్నీ మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరగా, కొనమెరుపులా, పాల కొసరులా తెలుగు సంస్కృతిని గురించిన పద్యాలు-
చ|| కనగ విచిత్రమయ్యె! వడగట్టిన గంగను బోలు పంచెయున్
కనబడబోదు, పద్యములకట్టలు దాచిన రెండుజేబులన్
ఘనమగు లాల్చిలేదు, కనగా భరతావని కేతనమ్ము పో
లిన పొడవైన కండు వరింపదు కంఠము, వాణికన్నులం
దున తెలిమోదబిందువలు దూసినహారము కానరాదు, నే
ననుటయుకాదు కాని తగునా! కవిగారికి మ్లేచ్ఛవేషముల్.
ఉ|| భాషయు దూరమయ్యె, పరభాషయె మీప్రియభామయయ్యె, ఇం
గ్లీషును మాధ్యమంబుగ వరించిరి, అద్దియటుండనిండు, సం
భాషణకైన చెల్లదొకొ! పద్య మనోహరమైన భాష, స్వ
ర్భాషకు తుల్యభాష, పదబంధ సుగంధమయాంధ్ర భాషయే.
సీ|| భాషయా తెలుగన్న! భావనాంభోధిలో
బంగారు నోడలో పయనమౌను
భావమా తెలుగన్న! భాషావధూటికి
పాదార్చనము చేయు పద్మమగును
పద్యమా తెలుగన్న! పట్టాభిషిక్తులౌ
తెలుగు మారాజుల తేజమగును
వచనమా తెలుగున్న! బండరాళ్లనునైన
చెమ్మ పుట్టించెడి సేద్యమగును.
గీ|| అట్టిమీభాష హృదయమ్ము పట్టుకొనుడు
వట్టి పరభాషపై మోజు వదలుకొనుడు
మమ్మిడాడీల మాటలు మానుడింక
అమ్మనాన్నల అనురాగమందు డింక||
సౌమ్యశ్రీ రాళ్లభండి
ఆ మాట అనగానే మనముందు గయ్యాళి సూర్యాకాంతం రూపం దర్శనమిస్తుంది. అది మన తప్పుకాదు. పరిస్థితుల ప్రభావం. అత్తగారనగానే కోడళ్లని వేపుకు తినే పాత్రలే మన మనసులో మెదలుతాయి గాని, “దొంగలెవరో, దొర్లెవరో మనకెట్లా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే, నల్లగా నాపరాళ్లలాగ, పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటినిండా నూనెరాసుకుని, దొంగతనాలకూ, దోపిళ్లకూ వస్తూండేవాళ్లు...,” అని అమాయకత్వం వెలిబుచ్చే ‘అత్తగారు’ కేవలం భానుమతి రామకృష్ణగారి ఊహల్లోనే ఉదయిస్తారు.
కల్తీలేని భాష, భావాలు, భావనలతో తెలుగింటి అత్తగారు ఇలాగే ఉండాలని అందరూ ఆశించి, ఆకాంక్షించే అపురూప సృష్టి భానుమతి అత్తగారు. ఈ అత్తగారిలో కనబడే వ్యక్తిత్వమల్లా కాలదోషం పట్టని ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు, కట్టుబాట్లు వీటన్నింటిని పేనివుంచే చాదస్తము. ఇది వాస్తవికతకు ఎంతో దగ్గరైన ప్రాత. ప్రతి వీథిలోనూ రామాలయం ఉన్నట్లే, ప్రతీ ఇంట్లోనూ ఒక అత్తగారు తప్పనిసరి. తాపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే ఆవిడ మనస్తత్వం, కోడలిని, ఇంటిని కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగే నేర్పరితనం, నిమ్మకాయెంతో, ఆవకాయా అంతే, ఆవెంతో గేదంతే అనుకునే అజ్ఞానం, అమాయకత్వం వెరసి ‘అత్తగారు.’
బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని మల్లు పంచ, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం, కొత్తని చూసి వింత పడడం, పాత సంగతులని ఆప్యాయంగా తలుచుకోవడం, అవకాశం దొరికితే పెత్తనం చేయాలన్న ఉబలాటం, ఒకమాట అని పది మాటలు పడ్డా అవి ఎవరికీ తెలియకూడదన్న లౌక్యం. వీటికి మారురూపే ‘అత్తగారు.’
అన్ని నాకే తెలుసనే ధీమా, తాను చేసే ప్రతి పని (నిర్వాకం) పై గట్టి నమ్మకం. అవి బెడిసి కొడితే తన తప్పును తాను ఒప్పుకోవటమేమిటి? విడ్డూరం. అసలు తాను తప్పు చేస్తే కాదా, తన చుట్టూ ఉన్న వాళ్లు చేతకాక తప్పులు చేస్తారు. తనదే తప్పని రుజువైతే, మొహం దాటేయడం తనకేం కొత్తకాదు. ఇహ ఆవిడ వంట చేస్తే వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం ఆ బ్రహ్మతరంకాదు. అయితే, ఆవిడకు పాయసం, వడలు, చేగోడీలు, మురుకులు, అప్పడాలు, వడియాలు అంటే మహా ఇష్టం. అవి వండి, ప్రియమైన వారికి వడ్డించి వారిని దడిపించటం అంటే మరీ ఇష్టం. ఆవిడలో చాదస్తం, ఆచారలపట్ల మక్కువ కాస్త ఎక్కువైనా, ప్రేమకు ఆచారంలేదనే సహృదయం గల నిండు మనిషి.
ఇక ఆవిడ కాస్త మెల్లగా మాట్లాడితే, తంజావూరు తంబూరా మంద్రస్థాయి అనవచ్చు, అదే గొంతు పెంచారో కలకత్తా మెయిలే, కంఠం ఎత్తి మాట్లాడినపుడు మాత్రం కందిరీగలు ఘోష పెడుతున్నట్టుంది అంతే! అవడానికి పాతకాలం మనిషైనా, జాలీ మూడ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఇంటిలో కాఫీ నిల్, రేపు మీకు నో కాఫీ అంటు పొడిమాటలు ఇంగ్లీషులో అలవోకగా దొర్లించేయగలరు.
అన్నట్టు మన అత్తగారు అవడానికి ఆంధ్రా గడుసుపిండమేగాని మధురాంతకంలో పుట్టి, చెంగల్పట్టులో పెరిగారు. అందుకే ఆవిడకు అరవ సాంప్రదాయం కూడా కరతళామలకం. అంతెందుకూ ఆలయాలు, ఆచారాలు అరవ దేశంలో ఉన్నట్టు ఆంధ్రాదేశంలో ఉండవంటారు ఆవిడ. అందుకే అరవ సంవత్సరాది కూడా ఆంధ్రా స్టైల్లో ఘనంగా జరుపుకుంటారు.
ఇంతెందుకు షడ్రసోపేతమైన భోజనం చేసి తాంబూలం వేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో, భానుమతి అత్తగారిని తలుచుకుంటే అటువంటి అనుభూతే కలుగుతుందని చెప్పొచ్చు. ఉగాది పచ్చడిలో రుచుల్లా అత్తగారిలో కూడా అన్ని భావోద్రేకాలు పరిపూర్ణంగా మనకు గోచరిస్తాయి. తెలుగు సాహిత్య రంగంలో అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే సజీవమూర్తి అత్తగారి పాత్ర.
సౌమ్యశ్రీ రాళ్లభండిపదం కాదది, ప్రపంచానికి మేలు కొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, సాహితీ జగత్తుకే మణిహారం. తన అభ్యుదయ కవిత్వాల ద్వారా సమాజంలో కుళ్లుని తూర్పార బట్టిన శ్రీశ్రీ, ఎన్నో కమనీయమైన చిత్ర గీతాలను కూడా సినీ అభిమానులకు అందించారు. కత్తిలాంటి పదునైన మాటనైనా, కోమలమైన పదాన్నయినా శాసించి జనారంజకంగా మలచగలిగే శక్తి ఒక్క శ్రీశ్రీక ఉందంటే అతిశయోక్తి కాదేమో.
`తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు..` అని ప్రశ్నించే, గర్జించే శ్రీశ్రీ, `నా హదయంలో నిదురించే చెలి, కలలోనే కవ్వించే సఖీ...` అనే ప్రణయ గీతం రాయగలగడం ఆయనకే చెల్లింది. అటు విప్లవ కవిగా, ఇటు సినీకవిగా జోడు గుర్రాల స్వారి నల్లేరు మీద బండి నడకలా ఆయన సాగించగలిగారు. ఆహుతి సినిమాలోని `ప్రేమయే జనన మరణ లీల...` గీతం ద్వారా తన సినీ జీవితానికి అంకురార్పణ చేసిన శ్రీశ్రీ సరళమైన పదాలతో ఎంతో లోతైన అర్ధాన్ని తన గీతాల ద్వారా ప్రజలకు అందించారు. `వెలుగు-నీడలు` సినిమాలోని `కలకానిది, నిజమైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు...` అనే పాట అందుకు నిదర్శనం. అక్కా-చెల్లెళ్లు చిత్రంలోని `వినరాని మాటలే..` అనే పాటలే `జీవితమే ఒక చదరంగం పావులే కదా జీవులందరూ, తెలియనిది ఆట, కనబడదొక బాట...` అని జీవిత సారానంతా ఒక్క వాక్యయంలో వివరించాడు. `ఆకాశవీధిలో, అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనె, సయ్యాటలాడెనే..`, `తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో హ్రదయ రాగం`, `మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడకరుండిన అదే భాగ్యమో` వంటి సుమధుర గీతాలను శ్రీశ్రీ కలం నుంచి వెలువడ్డాయంటే ఎందరో నమ్మకపోవచ్చు.
అయితే, శ్రీశ్రీ అభ్యుదయ భావాలను సినీ గీతాల్లో కూడా ప్రదర్శించారు. యమగోల చిత్రంలోని `సమరానికి నేగే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం..`, భూమికోసం లోని `ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా..` మరో ప్రపంచంలోని `ఆకాశమంటే మేడలతో, ఆకలిమంటల పీడలతో ధనికుల కోసం పేదలు కట్టిన మహా మంచి ప్రపంచం.. ఓహోహో మరో ప్రపంచం..`లు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. అలాగే, `పాదవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయగీతికా..` అనే వెలుగు-నీడలులోని దేశభక్తి గీతంలో కూడా `ఆకాశం అందుకునే ధరలోకవైపు, అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకున్న నీదేశం ఎటు దిగజారు..` అని ప్రశ్నించడంలో `ప్రతి మనిషి, మరో మనిషిని దోచుకునేవాడే..` అనడంలోనూ, `ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వ`మని వాపోయినట్టే అన్పిస్తుంది.
జానపదం ధ్వనించే `ఓ రంగయో పూలరంగయో..`పాటను చాలామంది కొసరాజు రచనగా భ్రమిస్తారు. ఈ గీతం రాసిన శ్రీశ్రీ, వాగ్ధానం సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన రేలంగిపైన చిత్రీకరించిన హరికథను, సంగీత లక్ష్మి చిత్రంలోని క్రష్ణార్జున సంవాదాన్ని కూడా రాసి సకల కళాప్రావీణ్యుడననిపించుకున్నాడు. కురుక్షేత్రంలోని పతాక సన్నివేశానికి రాసిన `ధర్మక్షేత్రం, ఇది కురుక్షేత్రం..` అనే పాటలో కఠినమైన పదాలను కూర్చిన శ్రీశ్రీ దేవతలో `బొమ్మని చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుకా...` అని సరళమైన పదాలనుపయోగించి మెప్పించాడు. ఇలా మాటలను, అక్షరాలను శాసించగలడు కనకే తెలుగు సినీ రచయితలలో శ్రీశ్రీకి మాత్రమే జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. అల్లూరి సీతారామరాజు చిత్రానికే హైలెట్ అనిపించుకున్న `తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా` పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. మళ్లీ పాతిక వసంతాలు గడిస్తేగాని మరో తెలుగు సినీరచయితకు ఈ అవార్డు లభించలేదన్నది గమనార్హం.
చిలకా-గోరింక సినిమాలో హాస్యజంట పద్మనాభం, రమాప్రభలపై చిత్రీకరించిన `చెమ్చాతో సముద్రాన్ని తోడశక్యమా` అనే పాటను రాసిన శ్రీశ్రీ పంతులమ్మ, భార్యాభర్తలు సినిమా కోసం పద్యాయలను సైతం రాసి అందరిని మెప్పించారు. మొదట్లో డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు రాసి తిరుగులేనివాడిగా పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ క్రమేపి తెలుగు ప్రేక్షకుల హ్రదయ పీఠాన్ని అలంకరించారు. దేవుడు చేసిన మనుష్యుల్లారా లో టైటిల్ సాంగ్, గాంధారి గర్వభంగంలో మానవుని శక్తి, యుక్తులను తెలిపే `పదునాలుగు లోకముల దురేలేదే .. చూడగా మనుష్యుడిల మహానుభావుడే (ఈ పాటను అనుకరిస్తూ తర్వాత బాలభారతంలో `మానవుడే, మహనీయుడు, శక్తిపరుడు యుక్తిపరుడు..` అనే పాటను మరో సినీకవి రాశాడు), తోడికోడళ్లులో `కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదానా..` గుండమ్మ కథలో `లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..` శభాష్ రాముడులోని `జయంబు నిశ్చయంబురా భయండు లేదురా..` పాడిపంటలు, మనుష్యులు మారాలి, కులగోత్రాలు, విప్లవశంఖం, పునర్జన్మ, శ్రీక్రష్ణతులాభారం, పంతాలు-పట్టింపులు, పెళ్లీడు పిల్లలు, దానవీరశురకర్ణ, ఆరాధన ఇలా ఎన్నో చిత్రాల్లో మరిపించే, మనసుల కదిలించే, ప్రేరణ కలిగించే పాటలను ప్రేక్షకులకు అందించిన శ్రీశ్రీ చెప్పదల్చుకుంటే, అర్ధం చేసుకోగలిగే శక్తి ఉంటే ప్రతిపదం, కోటితంత్రులై జనజీవనహేళను తెలుపుతాయని నిరూపించాడు. జీవితంలోని ఎన్నోచేదు నిజాలను `తలచేది జరగదు, జరిగేది తెలియద`ని చెపుతూ, `శోధించి, సాధించాలి అదే ధీరగుణమని` తన గీతాల ద్వారా ఆంధ్రులకు సందేశాన్నిచ్చి చిత్ర జగత్తులో ధ్రవతారగా నిలిచిపోయాడు.
సౌమ్యశ్రీ రాళ్ళభండి
చెట్టులెక్కగలవా
ఓ నరహరి పుట్టలెక్కగలవా
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా?
ఓ నరహరి చిగురుకోయగలవా?
ఇది ఒక జానపద గీతం కాదు, పల్లెవాసుల నోటి నుంచి వెలువడిన హాస్య రసానుభూతి. ఉగ్రరూపుడైన నరసింహుడు, దుర్వాసముని శాప కారణాన భిల్ల కన్యగా పుట్టిన సముద్ర తనయ చెంచులక్ష్మిని చూసి తన ఉగ్రాన్ని ఉపసంహరించుకుని మానవ రూపం దాల్చి, ఆమెను పెండ్లాడిన వృత్తాంతం జానపద సాహిత్యంలో చెంచులక్ష్మి యక్షగానంగా, చెంచు భాగవతంగా ప్రసిద్ధిగాంచింది. లక్ష్మీనరసింహుల ఈ సరససల్లాపాలను ఎంతో భావకతతో తన పదాలలో బంధించాడు అన్నమయ్య.
ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు
చెంత రమాదేవిఁ గూడె శ్రీ నరసింహుఁడు
సరిఁగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ
సొరిది మోములు తొంగి చూచుకొంటాను
విరులచెండులఁగొని వేటలాడుకొంటాను
సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు
భవనాశిలోని నీరు పైఁ జల్లులాడుకొంటాను
నవకపు సిరులను నవ్వుకొంటాను
జవళిఁ గెమ్మోవులు సన్నలఁజూపుకొంటాను
చివన నిందిరినంటె శ్రీ నరసింహుడు
వేమరుఁ దొడలెక్కువ వీడుదోడులాడుకొంటా
ప్రేమమునఁ గాఁగిళ్ళఁ బెనఁగుకొంటా
ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి
శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుఁడు
తరిగిండ వెంగమాంబ అయితే ఏకంగా చెంచులక్ష్మితో సరసాలలో మునిగిన దేవదేవుడు తన పలుకులను ఆలకించక ఉదాసీనతతో వ్యవహరిస్తున్నాడని తాను రచించిన నృసింహశతకములో ఆ వేంకటనాథునిపై కినుకు వహించింది.
మానక నేను పిల్చినను మక్కువ లేక పరాకుసేసితో? వీనుల సోఁక లేక తగ విశ్వము పాలనసేయఁబోతివో? పూని మహావినోదమున భోగము మీఱఁగఁ జెంచుభామతోఁ గోనలనుండి రావో? తరి గొండ నృసింహ! దయాపయోనిథీ!పద్మ, కూర్మ, అగ్ని, విష్ణు పురాణాలు పేర్కొన్న శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో నాలుగవ అవతారమైన నరసింహస్వామిని అన్నమయ్య భక్తిశ్రద్ధలతో, పారవశ్యంతో ‘అనిశము దలఁచరో అహోబిలం, అనంత ఫలదం బహోబిలం’ అంటూ తన పదకవితలతో అలకరించాడు. అన్నమయ్య జీవితాన్ని అహిబిల క్షేత్రం ఎంతగానూ ప్రభావితం చేసింది. అహోబిలం పీఠాధిపతి అయిన శ్రీమాన్ అడివన్ శఠగోపయతి అన్నమయ్యకు వైష్ణవ ధర్మాన్ని, వేదాంతాన్ని ప్రభోదించాడు. అంతేకాక 32 అక్షరాల మహానారసింహమంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీ వేంకటేశ్వరుని తర్వాత పెక్కు కీర్తనలలో నృసింహస్వామిని అన్నమయ్య కొలవటంతోపాటు నారసింహావతార గాథను 11 చరణాలలో ‘నరసింహ విజయము’గా కీర్తించి మనందరిని మోక్షపథం వైపు నడిపించాడు. వినరయ్య నరసింహవిజయము జనులాల అనిశము సంపదలు నాయువు నొసఁగును మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె అదరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె అంతటఁ బ్రహ్లాదుఁడు ‘అన్నిటానున్నాఁ’డనియె పంతమున దానవుఁడు బాలునిఁ జూచి యెంతయుఁ గడఁకతోడ ‘ఇందులోఁ జూపు’మని చెంతనున్న కంబము చేతఁగొని వేసె అటమీఁదట బ్రహ్మాండం బదరుచు కుటిల భయంకర ఘోషముతో చిట చిట చిటమని పెట పెట పెటమని పటపట మనుచును బగిలెఁ గంబము కులగిరు లదరెను కుంభిని వడఁకెను తలఁకిరి దైత్యులు తల్లడిలి కలఁగెను జగములు కంపించె జగములు ప్రళయ కాలగతిఁ బాటిల్లె నపుడు ఘననారసింహుఁ డదె కంబము నందు వెడలె కనుపట్టె నదిగొ చక్ర జ్వాలలు మునుకొని వెడలెఁ గార్ముకముక్త శరములు కనకకశివునకుఁ గలఁగె గుండియలు అడరె నద్దేవుని కోపాగ్నులు బెడిదపు - మిడుఁగురుల తోడుత మిన్నులుముట్టి పిడుగులురాలేటి భీకర నఖరములు గడుసు రక్కసునికి గాలములై తగిలె తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని కడుపు చించెను వాని గర్వమడఁగ వెడలెఁ జిల్లున వాని వేఁడి నెత్తురు నింగికి పొడి వొడియాయ శత్రు భూషణము లెల్లను నెళ నెళన విరిచె నిక్క వాని యెముకలు పెళ పెళ నారిచి పెచ్చు వెరిగె హరి జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె తళుకుఁ గోరలు తళ తళమని మెరిచె పెటలించి నరములు పెరికి కుప్పలువేసి గుటగుటమని రొప్పె గోవిందుఁడు చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి కుటిల దానవుఁ జూచి ‘ఖో’ యని యార్చెను తెంచి శిరోజములు దిక్కులకు వాని - పంచ ప్రాణములు గొనెఁ బరమాత్ముఁడు అంచెల నీ రీతిని ప్రహ్లాదుని పగ నీఁగె మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు చిప్పిల వరములిచ్చీ శ్రీ వేంకటేశుఁడు జీవరాశులన్నిటిలో తానే వ్యక్తంగాను, అవ్యక్తంగాను పరమాత్మ భాసిల్లి, సర్వాత్మలలోనూ తన తేజస్సును ప్రజ్వలింపచేసే స్వామి తత్త్వాన్ని ఈ నృసింహ మంత్రం తెలుపుతోంది. అదేవిధంగా, నివురు గప్పిన నిప్పులా పరాక్రమాన్ని తనలో దాచుకోవడేం శ్రేష్టమని నరసింహావతారం మనకు చెప్పకనే చెపుతోంది. ఉగ్రమూర్తి అయిన నరసింహుని హూంకారాన్ని విన్నంతనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఈ తత్త్వాన్నే అతి సూక్ష్మంగా ‘వెంబడించే కోపాన్ని విడిచిపెడితే మేలు,’ అని కోప స్వభావం నరసింహ అవతార లక్షణమని, అది వీడి వేంకటేశ్వరుని సేవించి చింత లేకుండా జీవించవచ్చని, ‘శరణని బ్రతుకరో జనులారా, గరిమ మెరిసె నిదె కనకసింహము’ అంటూ, దైత్యులను త్రుంచిన ప్రళయ నరసింహునికి, పరాక్రమ నరసింహునికి, శాంత నరసింహునికి, సుజన రక్షక నరసింహునికి, నిశ్చల నరసింహునికి, వీర, శృంగార నరసింహునికి, చతుర నరసింహునికి, యోగానంద నరసింహునికి, ప్రతాప నరసింహునికి, విక్రమ నరసింహునికి, దివ్య నరసింహునికి, గుణగణాకర నరసింహునికి, మొక్కరే మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి దక్కి శ్రీ వేంకటేశుఁడే తానైన దేవునికి కరములు వే యవే కరములును భయం కరనఖాయుధములు కడలే నవే సిరి దొడపై నదె సింహపునెమ్మో మదే నరరూపు సగమదె నరసింహునికి వంకరకోల లవె వజ్రపుదంతము లవె సంకుమఁ జక్రము నిరువంకలా నవె జంకెల నేత్రము లవె జడలు మూఁపున నవె అంకె నభయహస్తము అదె నరహరికి నిక్కినకర్ణము లవె నీలిమచ్చవుర మదె చుక్కల మొలపూసల నొక్కరూ పదె తొక్కినపాపము లవె తోడనే శ్రీ వేంకటాద్రి పక్కెరనరసింహపు ప్రళయసింహునికి అని ప్రబోధించాడు. చెంచులక్ష్మి జానపద కథారూపకమే గాక, ధర్మపురి నరసింహశతకం, సింహాద్రి నారసింహ శతకాలతోపాటు, అహోబిలం, యాదగిరి, సింహాచలం, మంగళగిరి, కదిరి, కంభం వేదాద్రి, తరిగొండ మున్నగు లక్ష్మీనృసింహ క్షేత్రాలు హరిహరులతోపాటుగా, నరసింహునికి గూడా ఆంధ్రనాట పెద్దపీట వేశాయి. కృష్ణానదీతీరానున్న పంచ నారసింహ క్షేత్రాలలో వెలసిన స్వామిని – మంగళగిరిలో పానకాలయ్య, వేదాద్రిలో స్నానాలయ్య, మట్టపల్లిలో అన్నాలయ్య, వాడపల్లిలో దీపాలయ్య, మరియు కేతవరములో వజ్రాలయ్య పేర్లతో భక్తులు కొలుస్తారు. ఇక హిరణ్యకశుపుని చంపిన నేరుగా స్వామి అనంతపురం జిల్లాలోని కదరి చేరుకున్నాడని ప్రతీతి. ఇక్కడ స్వామిని వేటరాయుడని, బేట్రాయుడని పిలుస్తారు. ఇక వశిష్ట మహాముని కోరిక మేరకు స్వామి అంతర్వేదిలో వెలిశాడు. అలాగే శ్రీ మహాలక్ష్మి తపస్సు చేయట వల్ల మంగళగరిగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో మూడు నరసింహ క్షేత్రాలున్నాయి. వీటిలో కొండపైన పానకాల స్వామి, గిరి శిఖరం మీద గండాల నరసింహుడు, కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహుడు నెలకున్నారు. ఉగ్రనరసింహుని శాంతపర్చడానికి అమ్మవారు అమృతాన్ని సమర్పించినట్టు స్థల పురాణం తెలుపుతోంది. ఆ నేపథ్యంలోనే కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను భక్తులు స్వామి వారికి సమర్పించగా, నేడు కలియుగంలో భక్తులు బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు. యాదర్షి తపస్సుకు మెచ్చి నరసింహుడు జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనే ఐదు రూపాలలో నల్గొండ జిల్లాలో పంచ నరసింహ క్షేత్రంగా బాసిల్లుతున్న యాదగిరిగుట్టపై వెలిశాడు. అలాగే, జ్వాలాహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవాః యోగానంద చ్చత్రవట పావనా నవమూర్తయః జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ, కారంజ (కానుగమాని), భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అనునవి తొమ్మిది నరసింహుని రూపాలు. మహానంది నుంచి సుమారు 70కిలో మీటర్ల దూరంలో ఉన్న అహోబిల క్షేత్రంలో ఈ తొమ్మిది రూపాలతో నవనరసింహుడు కొండపైన, కింద కొలువు తీరి ఉన్నాడు. అన్నమయ్య 12 సంవత్సరాలపాటు ఈ క్షేత్రంలో నివాసమై ఉండటం వల్ల కావచ్చు దాదాపు 40 సంకీర్తనలలో నరసింహుని వర్ణించటంతో పాటు అనేక సంకీర్తనలలో స్వామి వివిధ క్షేత్ర మహిమలను, రూప, లీలా విశేషాలను కొనియాడాడు. వేదములు నుతింపఁగ వేడుకలు దైవారఁగ ఆదరించీ దాసుల మోహననారసింహుఁడు నెఱులజడలతోడ నిక్కుఁగర్ణములతోడ కుఱుచ కొమ్ములతోడ కోఱలతోడ వుఱక సిరిఁ దొడపై నుంచుక సింహాసనాన మెఱసీఁ బ్రతాపముల మేటినారసింహుఁడు నిడుపమీసాలతోడ నిట్టూరుపులతోడ మిడిగుడ్లతోఁ దెల్లనిమేనితోడ వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి కడు మంచివరాలిచ్చీ ఘననారసింహుఁడు చిలుకుగోళ్లతోడ సెలవినవ్వులతోడ బలు జిహ్వతోడ యోగపట్టెముతోడ అలరి శ్రీవేంకటాద్రి నహోబలగిరిని అల ప్రహ్లాదునిఁ గాచె నాదినారసింహుఁడు సౌమ్యశ్రీ రాళ్లభండి
కథ మన జీవన శైలిలో ఒక భాగం. అమ్మమ్మ, తాతయ్యలు కథలు చెపుతుంటే, వారి చుట్టూ చేరి ‘ఊ’ కొడుతూ నిద్రలోకి జారుకునే బాల్యం నేడు దాదాపు అంతరించిపోతేందనే చెప్పాలి. అయినా, ఎక్కడోక్కడ ఒక బామ్మ, తన మనవళ్లని, మనవారళ్లని వెన్నల్లో పక్కన కూర్చోపెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తోనో, జో కొడుతూనే వారు తమ బాల్యంలో విన్న కథలను ఇంకా కథలుగా చెపుతూనే ఉన్నారు. ఈ కథలు మనకు ఏ పుస్తకాలలోనూ కన్పించవు. కథ ఒక వినోదం, కథ ఒక అనుభవసారం. కథ ఒక విజ్ఞాన దీపిక. కథ ఒక జీవితం. కథ అనే పదానికి నిఘంటువు చెప్పే అర్థమేదైనా, జనపథంలో జానపదులు సృష్టించిన అసాధారాణ, కల్పిత గాథలే నిజమైన కథలు. తాము విన్నవి, కన్నవి చదువురాని జానపదుల మస్తిష్కంలో రూపుదిద్దుకున్న చిత్రరూపాలకు ధ్వనిస్వరూపమే జానపథ కథలు. వీటిలో పురాణాలు, ఇతిహాసాలు, నీతి కథలు ఏవైనా ఉండవచ్చు. అవి జానపదుల నోటిలో నాని, మట్టివాసనతో, మనసులకు హత్తుకునే విధంగా వారి మాటగా వెలుపలకి వస్తాయి. వీటి స్వరూప, సారుప్యాలను విశ్లేషించడం కంటే, వారి మనోభావాలను, ఆర్తిని అర్థం చేసుకుంటే, కథల ప్రయోజనం మనకు విగతమవుతుంది. జంతువులు, పక్షలు, మనష్యులు అన్నీ, అందరూ వారి కథలలో పాత్రలే. హాస్యం, అద్భుతాలు, అభూత కల్పనలతో జనరంజకంగా సాగుతాయి జానపద కథలు. ఈ జానపద కథలను సేకరించి, పుస్తకరూపంలో తీసుకురాకపోవడం వల్ల అనేక కథలు కాలగర్భంలో కలిసి పోయాయి. తద్వారా భాష, పదాలు, పలుకుబళ్లు, సామాజిక పద్దతలు కనుమరుగవుతున్నాయి. జానపద కథలకు అక్షరరూపం ఇచ్చి ముందుతరాల వారికి అందించాలన్న సదుద్దేశంతో రాయలసీమ, సర్కారు ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఆంధ్రారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోని కథలను పలువురి సహకారంతో సేకరించి డాక్టర్ జి.ఎన్. మోహన్ గారు యువభారతి వారి సహకారంతో అచ్చువేయించారు. ఆ తెలుగు జానపద కథల సంకలనం నుంచి మీ కోసం ‘అక్షయ పాత్ర’ కథ. ఈ కథను పశ్చిమ గోదావరి జిల్లకు చెందిన పోలవరం తాలుకా కన్నాపురం వాసస్థురాలైన వరాలమ్మ గారి ద్వారా విని సంకలనం చేశారు.
అక్షయ పాత్ర:
అనగనగా ఒక ఊళ్లో, ఒక పేదోడున్నాడు. ఆళ్ల సంసారం గడవటం చాలా ఇబ్బందిగా ఉంటే అతని పెళ్లాం ఒక రోజున మినపరొట్లు చేసి మొగుడికిచ్చి దార్లో ఆకలేసినప్పుడు తింటూ పొరుగూరు కెళ్లి పని సంపాదించి డబ్బు పొగుచేసుకొని రమ్మని పంపింది. ఆ పేదోడు రొట్టల్నిమూటగట్టుకొని అడువులెమ్మట పడి పోతున్నాడు. దార్లో నిదరొచ్చి ఒక చెట్టు కింద పడుకున్నాడు. రాత్రి దేవ కన్యకలు సరదాగా షికారుకు వచ్చారు. ఆళ్లకి పేదొడి మినపరొట్లు గుమ,గుమ వాసనొచ్చాయి. ఆళ్లు వాసన వచ్చిన దారంట వచ్చి పేదోడి పక్కలో ఉన్న రొట్టెల్ని పూర్తిగా తినేశారు. ఆడికి మెలకువ వచ్చి చూస్తే రొట్టెల్లేవు. ఆడు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు దేవకన్నికలు నాయనా ఏడవకు నీకేం కావాలో కొరుకో ఇత్తాం అన్నారు. ఆడు తిండికి లేక బాధపడుతూ పనికోసం ఎడుతున్నానని చెప్పాడు. దేవకన్నెకలు జాలిపడి ఆడికి ఒక అక్షయ పాత్ర ఇచ్చారు. ఆకలేసినప్పుడు కావాల్సిన పిండి వంటలు తలుచుకుని, బోర్లిస్తే అవన్నీ వత్తాయని చెప్పారు. ఆ పేదోడు బోర్లించి చూశాడు. పంచభక్ష్య పరమాన్నాలు వచ్చాయి. పేదోడు ఆనందంగా ఆగిన్ని ఇంటికి పట్టుకెల్లి పెళ్లానికి చూపించాడు. ఆళ్లకి తిండికి లోటులేదుకదాని ఊళ్లో వాళ్లకి విందుచేద్దాం అనిపించి ఊరందర్ని బోయినాలకి పిలిచారు. అందరూ ఎల్లాగూ పెడతాడో చూద్దామని వచ్చారు. అందరికీ ఇస్తళ్లు ఏసి గిన్ని బోర్లించుకుంటూ ఎల్లుతుంటే పంచభక్ష్య పరమాన్నాలతో అన్నం పడింది. అందరూ ఆనందంగా తిన్నారు. చివర్న అది ఎల్లాగొచ్చింది అడిగారు. అప్పుడు పేదోడు జరిగినదంతా చెప్పాడు.
ఆళ్ల పక్కింటి రాజమ్మకి ఆశ పుట్టింది. మొగుణ్ణి పిల్చి రొట్టెలు మూటకట్టి పంపింది. ఆడుకూడ పేదోడు పడుకున్న చెట్టుకింద నిద్దర రాకపోయినా పడుకున్నాడు. మామూలుగా దేవకన్నెకలు షికారుకు వచ్చారు. ఆళ్లకి రొట్టిలు గుమాయించలేదు. అంచేత ఆళ్లు తీసుకోలేదు. కాసేపు చూసి దేవకన్నెకల్లారా రొట్లు తెచ్చాను తినండి అని పెట్టాడు. ఆళ్లు తినేశారు బాగోపోయినా. ఆళ్లు తినేయ్యగానే నారొట్లు నాకివ్వండని ఏడుపు లంకించుకున్నాడు. ఆళ్లకి కోపం వచ్చింది. తినమన్నది నువ్వేకదా అన్నారు. అయితే నాకొక అక్షయపాత్ర ఇవ్వండి పోతానన్నాడు. దేవకన్నెకలిచ్చారు. ఈడు కంగారుగా బోర్లించి చూసాడు. ఇద్దర మంగలోళ్లు పుట్టారు. ఒకడు మెడవంచి పట్టుకున్నాడు. రెండోవోడు నున్నగా గుండుగీసాడు. ఈడు ఏడ్చుకుంటూ ఇంటికిపోయాడు. పెళ్లాం కూడా ఏడ్చింది. ఆళ్లకి జరిగిన పరాబవం అందరికి జరగాలని ఊళ్లోవాళ్లని బోయినాలకు పిల్చారు. అందర్నీ కూచోపెట్టి ఇస్తళ్లు ఏసి గిన్ని బోర్లించుకుంటూ పోయారు. అందరి ముందలా ఇద్దరేసి మంగలోళ్లు పుట్టి మెడవంచి అందరికీ గుండుగీసి మాయం అయిపోయారు. ఈడు చేసిన పనికి అందరూ తిట్టుకుంటూ పోయారు. కత కంచికి మనం ఇంటికి.
తేటగీతి
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందక ముందు అందరికి ఉన్న ఏకైక వినోద, విజ్ఞాన కాలక్షేపం కథలు. పేదరాశి పెద్దమ్మ కథలు, బేతాళ కథలు, పంచతంత్ర కథలు, తెనాలి రామలింగ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, మర్యాద రామన్న కథలు ఇలా అనేక కథలు భోజనానంతరం ఆరు బయట వెన్నల కింద పక్కలు పర్చుకుని పడుకునే పిల్లలకు, పెద్దలకు ఇంట్లోని తాతయ్యలో, బామ్మలో చెప్పటం కద్దు. అనగనగా ఒక రాజు తో మొదలై కథ కంచికి మనం ఇంటితో ముగించే కథ అంటే అర్థం నివేదించు, ప్రకటించు, ప్రదర్శించు మొదలగునవి. క్లుప్తంగా కథ అంటే కాల్పనిక గాథ.
ఇతర భాషల నుంచి అనువదించబడిన కథలను, అలాగే ఇతర కథలను అనుకరించి రాసిన కథలను పక్కన పెడితే, జనపదులలో నిక్షిప్తమై, ఆ నోట, ఈ నోట తమ భాషలో, తమదైన రీతిలో పాటను, వచనాన్ని ఏర్చి, కూర్చి అందించేవే జానపద కథలు. పురాణేతిహాసాలు కూడా జానపదుల నోటిలో నాని కొత్త హంగులను దిద్దుకున్నా, వీటిని పూర్తిగా జానపద కథలు అని చెప్పలేం. జానపద కథా లక్షణాలని చెప్పాల్సి వస్తే, వీటిలో కథావస్తువు, పాత్ర చిత్రీకరణ చాలా సరళంగా ఉంటుంది. కథ యందు అతి తక్కువ పాత్రలండి, తమ సమకాలీన సంఘటనలు, వ్యక్తులు. జీవన పోకడ ప్రధాన ఇతివృత్తాలయి ఉంటాయి. జానపద కథల్లో యక్షలు, గంధర్వ, కిన్నెరలు, రాక్షసులు, మాంత్రికులు, భూతప్రేతాలు ఎక్కువగా మనకు తారసపడుతుంటారు. ఇంద్రజాల, మహేంద్రజాలాలు, పశుపక్ష్యాదులు మాట్లాడటం వంటి అవాస్తకత గోచరించినా, మానవులే సాహసాలు చేసి సమస్యలను తెలివిగా పరిష్కరించటంతోపాటు, ఆయా కాలానికి అనుగుణమైన ఆచారవ్యవహారాలు కథల్లో చోటుచేసుకుని వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. అలాంటి ఒక జానపద కథ మీ కోసం...
పేదరాశి పెద్దమ్మ
అనగనగా ఒక పేదరాసి పెద్దమ్మ ఉందంట. ఆ పెద్దమ్మక్కి నలుగురు కూతుళ్లున్నారంట. పెద్దమ్మ నలుగురు దగ్గరా తలొక మూడు నెలలు ఉంటా కాలం గడుపుతా ఉంటదంట. ఒకసారి మొదటి కూతురింటి నుండి రెండో కూతురి ఇంటికి పోతావుందంట. దారిలో పెద్ద అడవి. అడవిలో ఎల్తావుంటే ఒక పులి నరవాసన కనిపెట్టి వచ్చి పేదరాశి పెద్దమ్మని తినేత్తానందంట. పెద్దమ్మకి బయం వేసింది. బాగా ఆలోసించి, పెద్దపులితో ఇలా అన్నదంట. పెద్దపులీ, పెద్దపులీ నేను ముసలిదాన్ని, వళ్లు అంత చిక్కిపోయి ఉన్నాను. నేను ఇపుడు నా రెండో కూతురింటికి ఎల్తన్నాను. ఆళ్లు బాగా ఉన్నోళ్లు. అక్కడ పదిరోజులుండి, గార్లెలు, మినప సున్ని ఉండలు, అరిసెలు తిని బలిసి వత్తాను. అప్పుడు తిందువుగాని. కమ్మగా ఉంటది నా నెత్తురు అని చెప్పిందంట. దాని మాటలు పులి నమ్మి వదలి పెట్టిందంట. పదిరోజులు అయినా పెద్దమ్మ తిరిగి రాలేదు. పులికి చాలా కోపం వచ్చింది. ఈదారి తప్పితే మరోదారి లేదుగదా రాకపోద్దా సూద్దాం అనుకుందంట.
పెద్దమ్మ తన కూతురికి పులితో జరిగిన గొడవ చెప్పిందంట. మూడునెలలు వంతు అయిపోయా పెద్దమ్మ బయల్దేరవలసి వచ్చింది. కూతురు బాగా ఆలోచించి, ఒక పెద్ద బానతెచ్చి అందులో పెద్దమ్మని కూకోపెట్టి మూతపెట్టి ఒక గుడ్డ గట్టిగా కట్టి దొర్లించి ఒదలిపెట్టింది. బాన దొర్లుకుంటూ అడవిలోంచి పోతాఉంది. లోపల ఉన్న పెద్దమ్మకు హుషారు వచ్చింది. ఇక పులి తనను ఏమీ చేయలేదనుకుంది. సంతోషంతో ‘బానా బానా బాగా దొర్లు టమకాటు’ అంటా పాడుకుంటా పోతావుంది. పెద్దపులి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా పాడుతూనే ఉంది. పులి బానని ఆపి పంజాతో ఒక పెద్ద దెబ్బకొట్టింది. బాన భడేల్ మని పగలిపోయింది. ఇంక పేదరాశి పెద్దమ్మకు బయం ఏసింది. మళ్లీ ఆలోచించి, పెద్దపులీ, పెద్దపులీ ప్రయాణంలో నా ఒళ్లంతా చెమట పట్టింది గదా. ఆ చెరువులోకి వెళ్లి తానం చేసి వత్తాను హాయిగా తిందువుగాని అంది. అప్పుడు పెద్దపులి సరే అని ఒప్పుకుంది. ముసలమ్మ ఎన్ని గంటలయినా చెరువులోంచి బయటకు రాలేదు. పెద్దపులికి కోపం వచ్చి ఎన్నోసార్లు పిలిచింది. ఒత్తనా, ఒత్తనా అంటదిగాని ముసలమ్మ వత్తల్లేదు. పులికికోపం వచ్చి చెరువులోకి దిగి మీదకి దూకబోయింది. ముసలమ్మ నోట్లో ఇసుక పెట్టుకొని ఉంది. ఒక్కసారి పులి కళ్లల్లోకి ఊసింది. పులి కళ్లల్లో ఇసుకపడి మంటెక్కి బాదపడుతా వుంటే ముసలమ్మ సంతోసంతో పారిపోయింది.
కథ కంచికి ముసలమ్మ ఇంటికి...
తేటగీతి
ఆమె నవ్విస్తుంది. కవ్విస్తుంది. చక్కిలిగింతలు పెడుతుంది.ఆలోచింపచేస్తుంది. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తుంది కూడా. అది ఆమెకు మాత్రమే సొంతమైన జీవనసరళి. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి. ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు కాంతం కన్పిస్తుంది.
కాంతం అంత పొడగరీకాదు, పొట్టికాదు. ఛామన ఛాయ, నవ్వు మొగము, చక్కని నేత్రాలు బాపు బొమ్మకాదు కానీ అందగత్తే. కాంతానికి ఇంగ్లీషు రాదు. కానీ భర్త మాట్లాడుతుంటే నాకేదో అర్ధమయినట్లే ఉందని అనుకునే అమాయక స్త్రీమూర్తి. వారప్రతికలను చదవాలనే ఆసక్తి లేకపోయినా, కుమారీ శతకం, నృసింహ శతకం, ప్రహ్లాద చరిత్ర మున్నగు పుస్తకాలు మాత్రం చదవి అర్ధం చేసుకోగలదు.
సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. ఆమెకు మల్లెపూలు, తెల్ల చీర అంటే మహా ఇష్టం. మంచి పొదుపరి. ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బదులు చెప్పింది. ఆమె హాస్యచతురతకు మరో ఉదాహరణ. ఎంతోసేపు కాలేదే, నాలుగైదు నిమిషాల సంభాషణలో నన్నాయన ఫూల్ అన్నాడు అని భర్త చెప్పగానే, అంత ఆలస్యం ఎందుకైందండీ అని అమాయకంగా చురక వేయటం కాంతానికే చెల్లు.
దాంపత్యంలో ఉండే విలువలకు కాంతం జీవితం ఒక మంచి నిదర్శనం. అసంతృప్తికి ఆమె జీవితంలో చోటులేదు. ఆదర్శ గృహిణియైన మునిమాణిక్యం వారి కాంతం తెలుగు నాయికలలో మాణిక్యం వంటింది. ఒకసారి భర్త పిలిచి ‘నా కలం కనపట్లేదు,వెతికి పెట్ట’మంటే ఆవిడ వంటింట్లోనుంచి ‘నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి’ అందిట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు, కాంతం నిత్య నూతనమనిపిస్తాయి.
ఒకసారి విశ్వనాథవారు మునిమాణిక్యంగారిని ముట్నూరి కృష్ణారావుగారి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే ‘కాంతం భర్త కాదూ’ అన్నారట. ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పడానికి. నాయకుల్లో ‘గిరీశం’, ‘పార్వతీశం’ ఎలా అయితే తెలుగు సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిల్చారో, అలాగే ‘కాంతం’ ధృవతారగా వెలుగొందుతోంది.
సౌమ్యశ్రీ రాళ్లభండి
సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. ఆమెకు మల్లెపూలు, తెల్ల చీర అంటే మహా ఇష్టం. మంచి పొదుపరి. ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బదులు చెప్పింది. ఆమె హాస్యచతురతకు మరో ఉదాహరణ. ఎంతోసేపు కాలేదే, నాలుగైదు నిమిషాల సంభాషణలో నన్నాయన ఫూల్ అన్నాడు అని భర్త చెప్పగానే, అంత ఆలస్యం ఎందుకైందండీ అని అమాయకంగా చురక వేయటం కాంతానికే చెల్లు.
దాంపత్యంలో ఉండే విలువలకు కాంతం జీవితం ఒక మంచి నిదర్శనం. అసంతృప్తికి ఆమె జీవితంలో చోటులేదు. ఆదర్శ గృహిణియైన మునిమాణిక్యం వారి కాంతం తెలుగు నాయికలలో మాణిక్యం వంటింది. ఒకసారి భర్త పిలిచి ‘నా కలం కనపట్లేదు,వెతికి పెట్ట’మంటే ఆవిడ వంటింట్లోనుంచి ‘నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి’ అందిట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు, కాంతం నిత్య నూతనమనిపిస్తాయి.
ఒకసారి విశ్వనాథవారు మునిమాణిక్యంగారిని ముట్నూరి కృష్ణారావుగారి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే ‘కాంతం భర్త కాదూ’ అన్నారట. ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పడానికి. నాయకుల్లో ‘గిరీశం’, ‘పార్వతీశం’ ఎలా అయితే తెలుగు సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిల్చారో, అలాగే ‘కాంతం’ ధృవతారగా వెలుగొందుతోంది.
సౌమ్యశ్రీ రాళ్లభండిగురజాడ వారి కలం నుండి నేలరాలిన చుక్కే మధురవాణి. వృత్తిపరంగా వేశ్య అయినప్పటికి ఉన్నతమైన వ్యక్తిత్వంతో, కొంటెతనంతో, మాటకారితనంతో, జాణతనంతో నాటి, నేటి సమాజంలో మంచికి, చెడుకి మధ్య ఆనకట్టుగా నిలిచే అందాల భరిణే. కాదు, కాదు విచక్షణతో వ్యవహరించే ధీర వనిత. మంచివాళ్ల పట్ల మంచిగానూ, చెడ్డవాళ్లపట్ల చెడ్డగానూ ఉండమన్న తల్లి బోధనను అక్షరాలా అమలు పరస్తూ, ఎదుటి మనిషిని అంచనా వేసి లోకజ్ఞానంతో వ్యవహరించే కొంటె కొణంగి. ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుష్యులోయ్’ అన్న గురజాడ వారి దృక్ఫదానికి నిలువుటద్దం మధురవాణి. ‘వేశ్యజాతి చెడ్డది కావచ్చు గాని ... చెడ్డలో మంచి ఉండకూడదా’ అని సమాజంలోని ద్వంద్వనీతిని ఎత్తిచూపిన ధీశాలి. నిడివి మీద బంగారాన్ని, యిత్తడినీ లోకం యేర్చేస్తుందని చెపుతూనే, ‘మంచి ఎక్కడున్నా, గ్రాహ్యం కాదా’ మంచి చెడ్డలు యెంచే వారెవరని నిగ్గతీసీన వనిత.
నాటి సనాతన స్త్రీ నుంచి నేటి ఆధునిక మహిళ వరకు ప్రతి ఒక్కరు అలవర్చుకోవల్సిన ఆత్మవిశ్వాసానికి, స్వావలంబనకు ప్రతీకగా నిల్చే మృదుస్వభావి మధురవాణి. పేరుకు తగ్గట్టుగానే మృదువైన సంభాషణలతో, నిశ్చలమైన ఆలోచనలతో సమాజాన్ని నిశితంగా పరిశీలించి బేరీజు వేయడమే కాదు, అవసరమైతే ‘యిటుపైన ఊర కుక్కలను, సీమ కుక్కలను దూరంగా ఉంచడానికి ఆలోచిస్తున్నా’ని స్వప్రయోజనాపరులనుద్దేశించి ఘాటుగా కుండబద్దలు కొట్టినట్టు జవాబునూ ఇవ్వగలదు. మధురవాణి మాట కటువుగా అన్పించినా, తరచి చూస్తే ఒక స్త్రీలో ఉండే సౌకుమార్యం ఆమెలోనూ మనకు కన్పిస్తుంది. వృత్తి వల్ల వేశ్య గనుక చేయాల్సిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందేమో కానీ, ఆమెలో దయాదాక్షిణ్యాలు సున్నా అనుకుంటే పొరపాటే. స్త్రీ జనోద్దరణను గురజాడ వారు ఆమెతో ఆరంభించలేదు, ఆమెతో మొదలు పెట్టించారంటే సబబుగా ఉంటుంది .
ఆమెలోని సమయస్ఫూర్తి, వాక్ చాతుర్యం మనకు అడుగడుగునా ముచ్చట కల్గిస్తూనే చురకలు అంటిస్తాయి. ‘తాను చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం అనరాదా ? అబద్దానికి అర్ధం ఏమిటి ? తనకి రొట్టా, ఒహడికి ముక్కా అని మనుష్యులోని సంకుచితత్వాన్ని ఎత్తి చూపిస్తూనే, పరువైన మగవాళ్లున్నప్పుడు పరువైన ఆడవారెందుకుండరని మగవారి మనోభావాలను తూర్పారబట్టడం ఆమెకే సాధ్యం. సంబాషణాలో హాస్యాన్ని రంగరించి చురకత్తుల్లా ఉపయోగించటం ఆమెకే చెల్లింది. ‘ఈ కన్నె పిల్ల నోరు కొంచెం చుట్టవాసన కొడుతూ ఉంది,’అనడంలోనే చూపితే చాలు అల్లుకు పోయే చురుకుదనం మధురవాణి సొంతమని అర్థమవుతుంది.
విద్వాంసుల ఇచ్చకాలకు మైమరచి, మెరమెచ్చు మాటలకి పొంగిపోకుండా, ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని కార్యాన్ని సాధించగల వ్యూహాపరురాలు. వెరసి నాటకరచయితనే సమ్మోహితుణ్ణి చేసే అమాయకత్వం, చమత్కారం, అజ్ఞానం, మొరటుతనం, పెంకెతనం, సౌజన్యం, పరోపకారబుద్ధి మెండుగా గల వేకువజామున మెరిసే వేగుచుక్క మధురవాణి.
సౌమ్యశ్రీ రాళ్లభండి