రామాయణము(లు) 2 ఆధ్యాత్మ రామాయణం

వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61 అధ్యాయం నుంచి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణంగా ఖ్యాతి చెందింది. వాల్మీకీయములో కథ ప్రథానం కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచనము మిక్కిలి ప్రధానము. నీటి కొలది తామర వలే వాల్మీకీయము తరచి చూచిన కొద్ది అందుగల ఆధ్యాత్మిక విశేషములు వెలికి వచ్చును. వాల్మీకి కథ చెప్పు విధానం, వేగం పాఠకుని కథ నుంచి దృష్టి మరల్చనీయదు. కథాగతమైన ఆధ్యాత్మిక చింతన గురించి అనేకులు కావ్య, నాటక రూపములలో వాల్మీకయమునకు వ్యాఖ్యానాలను చేశారు. అందు తదనుగుణంగా అనేక రామాయణాలు కూడా పుట్టు కొచ్చాయి. ఆధ్యాత్మ రామాయణం కూడా అలాగే వాల్మీకి రామాయణ మూలాన్ని గ్రహించి తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేసిందని విజ్ఞుల అభిప్రాయం.

వాల్మీకి రామాయణం మొత్తం 7 ఖండాలు, 24,000 శ్లోకాలుండగా, ఆధ్యాత్మ రామాయణంలో 6 ఖండాలు, 3653 శ్లోకాలున్నాయి.

వాల్మీకి తన రామయణంలో రాముని భగంవంతునిగా కాక ధర్మానికి కట్టుబడి నడుచుకునే మర్యాదపురుషోత్తమునిగా తీర్చిదిద్దాడని ప్రతీతి. వాల్మీకీయము కావ్య మార్గాన ఈశ్వర లక్షణాన్ని వ్యాకరించింది. కానీ వాల్మీకీయంలో అనేక చోట్ల వాల్మీకి రాముని దైవాంశసంభుతుడిగా పేర్కోన్నాడనటానికి నిదర్శనాలున్నాయి. ఉదాహరణకు, విశ్వామిత్రుడు రాముని మేల్కోలుపుతూ,

కౌసల్యసుప్రజా రామా పూర్వాసంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవ మాహ్నికం

చెప్పిన శ్లోకం రాముడు అవతార పురుషుడని తెలిసి ఉండటం చేతనే అని చెప్పకనే చెపుతుంది. అలాగే పరుశురాముడు శ్రీరామునితో, ‘అక్షయ్యం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం’ అన్న మాటలు, మారీచుడు రావణునితో పలికిన మాటలు ‘రామో విగ్రహవాన్ ధర్మ: సాధు సత్యపరాక్రమ:, రాజా సర్వస్య లోకస్య దేవానా మివవాసవః’, అలాగే రావణుడు శ్రీరాముని గురించి తలపోస్తూ చేసిన వ్యాఖ్యలు, ‘యస్య విక్రమ మాసాద్య రాక్షసా నిధనం గతాః, తమ్మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం’, శ్రీరాముని అవతార పురుషత్వమునకు నిదర్శనాలు.

ఇక రామునితో అడవికి వెళ్లడానికి అనుమతిని కోరుతున్న లక్ష్మణునితో సుమిత్ర అన్న మాటలు రాముడు పరమాత్ముడని తేటతెల్లం చేస్తాయి.

రామం దశరథం విద్ధి, మాం విద్ధి జనకాత్మజా
మయోధ్య మటమీ విద్ధి గచ్ఛ తాత యథా సుఖమ్,

ఇందు దశరథం అనగా పక్షివాహనం గల విష్ణువని, మాం అనగా లక్ష్మి అని, అయోధ్య అనగా స్వర్గమని అర్ధాలు కలవు. ఈ విధంగా వాల్మీకి మహర్షి అనేక చోట్ల శ్రీరాముని భగవత్త్వమును నిగూఢ పరిచాడు.

కాగా వ్యాసుడు మొదటి నుంచి రాముని విష్ణువు అవతారంగా తెలిపాడు. అలాగే పలుచోట్ల రాముడు విష్ణువు అంశ అని భగవత్ స్వరూపమని వివిధ పాత్రల ద్వారా చెప్పించాడు. అద్వైతవేదాంతాన్ని, భక్తి సారాన్ని రామకథ ద్వారా తెలియచేడానికి ఆధ్యాత్మ రామాయణం ప్రయత్నించింది. వీలైన ప్రతిచోట భక్తి,జ్ఞాన, వైరాగ్య ప్రతిపాదకములగు శ్లోకాలను గుప్పించింది. ఆథ్యాత్మ రామాయణంలోని ఉత్తరకాండ 5వ అధ్యాయంలో 62శ్లోకాలతో కూడిన ‘శ్రీరామగీతను’ వ్యాసుడు రచించాడు. దీనినే శ్రుతిసార సంగ్రహమని కూడా తరచుగా పిలుస్తుంటారు.

భగవద్గీతలో శ్రీకృష్ణార్జున సంవాదంగా కర్మ సిద్ధాంతాన్ని బోధించినట్టుగా, ఇందు పార్వతీ, పరమేశ్వరుల సంభాషణగా తాత్విక సత్యాలను వ్యాసుడు ప్రబోధించాడు. ‘రమతే సర్వభూతేషు, స్థావరేషు చరేషుచ’, అంటే చరాచరములన్నిటిలోనూ క్రీడించునది. అదే ఆత్మఅని, రామచంద్రుని పేరు ఈ ‘రమ’ లోంచి గ్రహించబడింది. ఈ విధంగా మొదటి శ్లోకంలోనే రాముడు పరమాత్ముడని వేదవ్యాసుడు తెలిపాడు.

ఈ విధంగా రెండు రామాయణాల్లో అనేక మౌలికమైన వైవిధ్యాలు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. అందు ముఖ్యమైనది, రామాయణగాథను కవి తెలుసుకున్న విధానం. వాల్మీకి నారదని ద్వారా రామగాథను తెలుసుకుని, బ్రహ్మ ప్రోత్సాహంతో రచిస్తాడు. అయితే ఆథ్యాత్మ రామాయణం అందుకు పూర్తి విరుద్ధం. ఆథ్యాత్మ రామయణం శివ,పార్వతుల సంవాదం.

రామజనన ఘట్టం నుంచే ఈ రెండు రామాయణాల్లో మార్పులు గోచరిస్తాయి. వాల్మీకయంలో దశరథుడు పాయసమును అర్ధ బాఘం కౌసల్య కిచ్చును. మిగిలిన దానిలో అర్ధభాగం సుమిత్రకి, ఆ మిగిలిన అర్ధభాగంలో సగం కైకేయకిచ్చి ఆ మిగిలిన సగభాగాన్ని తిరిగి సుమిత్రకిస్తాడు. అదే ఆథ్యాత్మ రామాయణంలో రాజు పాయసం కౌసల్య, కైకేయలకు చెరి సగం పంచి ఇచ్చును. వారిద్దరు తమ, తమ భాగాల్లో సగం సుమిత్రకిస్తారు. లక్ష్మణుడు ఆదిశేషుని అవతారమని, భరత, శత్రుఘ్నులు శంఖ, చక్రాల అవతారాలని ఆథ్యాత్మ రామయణ పేర్కోంది.

అహల్యాశాప విమోచన ఘట్టంలో కూడా వాల్మీక, ఆథ్యాత్మ రామాయణాలు విభేదిస్తున్నాయి. వాల్మీకయంలో

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ
అదృశ్య సర్వభూతానామా శ్రమేస్మిన్నివత్ససి

అనగా, అహల్యను వేయి సంవత్సరములు వాయుభక్షణ చేస్తూ, నిరాహార భస్మశాయియునై, ఎవరికి కన్పించకుండా అదృశ్యమై తపింపుమని గౌతముడు శాపమిస్తాడు. అదే ఆథ్యాత్మ రామాయణం, యోనిలంపట దుష్టాత్మన్ సహస్ర భగవాన్ భవ, అనగా ఇంద్రుడు, అహల్యను ఒక శిలనాశ్రయించమని, వేయి సంవత్సరాల తర్వాత రాముని పాదదూళి సోకి శాపవిమోచనం కాగలదని చెపుతుంది. ఈ గాథే బహుళ ప్రచారంలో ఉంది. దీనికి తోడు గుహుడు రాముని పాదములు కడుగుమని అడిగిన చమత్కార ఘట్టం కూడా ఆథ్యాత్మము చిత్రణమే.

సీతాపహరణకు సంబంధించి కూడా అనేక విభేదాలు వాల్మీక, ఆధ్యాత్మ రామాయణంలో మనకు కన్పిస్తాయి. ఆధ్యాత్మ రామాయణంలో రాముడు సీతకు ముందుగానే రావణుని గురించి, అతను సీతను ఎత్తుకుపోవడం గురించి తెలియచేస్తాడు. అందువల్ల తాను సీతను అగ్నికి అప్పగించి, మాయా సీతను పర్ణశాలలో నిలబెడతాడు. అపహరణ సమయంలో రావణుడు సీత జుట్టును ఎడమ చేతితో పట్టుకుని, కుడిచేతితో నూరువులు పట్టుకొని తీసుకొని పోయినట్టు వాల్మీక రామాయణ కథనం. ఆథ్యాత్మమున సీతను నిలుచుండిన భూమిని పెల్లగించుకొని రథములో తీసుకు వెళ్లినట్టుంది. ఛాయాసీతకు కూడా రావణుని స్పర్శ తాకకుండా జాగ్రత్త పడటంతోపాటు సీతను రావణుడు తల్లిలాగా చూచాడని ఆథ్యాత్మము చెపుతోంది. కథ విషయంలో ఆథ్యాత్మ రామాయణంలో మార్పులే జనబాహుళ్యంలో ప్రచారం కావడం విశేషం.

ఇక రాముడు లంకపై దాడి చేయడానికి సేతుబంధనం చేసే ముందు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టించినట్టుగా ప్రచారంలో ఉన్న కథ కూడా ఆధ్యాత్మ రామాయణం నుంచి వెలువడిందే. వాల్మీకి రామాయణం అటువంటి కథానాలు ఏమీ చేయలేదు. వివాదస్పదమైన నాగాపాశం విషయంలో కూడా ఆధ్మాత్మ, వాల్మీకి రామాయణాలు విభేదిస్తున్నాయి. వాల్మీకి రామయణంలో చివర వరకు రామునికి తన అవతార విశేషం తెలియదు. తుది ఘట్టంలో బ్రహ్మ ఈ విషయాన్ని రామునికి తెలియ చేస్తాడు. అదే ఆధ్యాత్మ రామాయణంలో రామునికి తన జన్మవిశేషాలు తెలియడం చేత నాగబంధం నుంచి విముక్తి కల్గించమని గరుఖ్మతుంని ఆదేశిస్తాడు.

మృత సంజీవిని మూలికి తీసుకురావడానికి హనుమంతుడు వెళ్లినపుడు కామినేని మారుతిని అడ్డగించే కథ కూడా ఆధ్యాత్మ రామాయణందే. కాగా, యుద్ద సమయంలో మాయాసీతను చంపినట్టు ఇంద్రజిత్తు చేసే మాయాజాలం కేవలం వాల్మీకి రామాయణానికి పరిమితం. సీత అగ్నిప్రవేశ ఘట్టం కూడా కేవలం వాల్మీకి రామాయణంలోనే ఉంది. ఇక వాల్మీకి రామాయణంలో కంబంధుడు శ్రీరామునికి సుగ్రీవునితో మైత్రి చేయమని చెప్పగా, ఆధ్యాత్మ రామాయణంలో ఆ పని శబరి చేస్తుంది. ఈ కధే ప్రచారంలో కూడా ఉంది.

రావణ సంహారంపై కూడా వాల్మీకి, ఆధ్యాత్మ కథనాలు విరుద్ధంగా ఉన్నాయి. రావణుని పదితలకాయలు నేలకూల్చినా అతను మృతి చెందకపోవడానికి కారణం రావణుని నాభిలోగల అమృతభాంఢమని దానిని బద్ధలు కొట్టమని విభీషణుడు సలహా ఇచ్చినట్టు ఆధ్యాత్మ రామాయణ చెపుతుండగా, వాల్మీకి రామాయణంలో రావణుని వధించడానికి ఆదిత్యహృదయం పఠించి సూర్యుని సహాయం అర్ధించమని అగస్త్యముని రామునికి చెపుతాడు.

ఇలా చెప్పకుంటూపోతే మౌళిక కథకు చేటు చేయకుండా అనేక చిన్న, పెద్ద మార్పులు ఆథ్యాత్మ రామాయణంలో అనేకం మనకు గోచరిస్తాయి. ఏదఏమైనప్పటికీ, ఆథ్యాత్మ రామాయణం సర్వోపనిషత్తులకు సారభూతమైన తత్త్వ ప్రతిపాదన చేస్తుంది. ఇందు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రతిపాదించే శ్లోకాలు కోకొల్లలు. అలాగే ఉపనిషత్సారాన్ని తెలిపే స్తోత్రాలున్నాయి. అందుచేతనే ఆథ్యాత్మ రామయణం కాంతాసమ్మితమైన కావ్యంగా కాక, మిత్రసమ్మితమైన పురాణంగా భాసిల్లిందని విజ్ఞుల అభిప్రాయం.

తరువాయి భాగం: తెలుగు రామాయణాలు


సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *