రామాయణము(లు) 1

వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేద: ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా

పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్ముజుడైన రాముడిగా అవతరించగా పరమాత్మ గుణవర్ణనైక పరాయణమగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్రామయణ రూపంలో వెలువడిందని ఈ శ్లోకం అర్ధం. భారతీయ సంస్కృతి కాధారమై, దానిని సర్వప్రశంసా పాత్రముగా చేసిన కుటుంబ జీవితానికి దర్పణంగా వాల్మీకి రామాయణ మహాకావ్య రచన చేశాడు.

రామాయణానికి ‘సీతాయాశ్చరితం, పౌలస్త్యవధమ్’ అని మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. ‘కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధ మిత్యేవ చకార చరిత వ్రత:’, అనే శ్లోకమే ఇందుకు తార్కాణం. ఏ కావ్యానికైనా కావ్య కథనుగాని, అందుగల నాయికా, నాయికల పేర్లనుగాని కేంద్రంగా చేసుకొని పేరు పెడుతుంటారు. రామాయణం, సీతా చరితం ఈ విధంగా ఏర్పడ్డవే. ఇక పౌలస్త్యవథ రావణ సంహారం ఉద్దేశించి చెప్పపడింది.

వాల్మీకి తన రామాయణాన్ని పాఠ్యే గేయే చ మధరమ్ అని చెప్పుకున్నాడు. ఇది గేయమనడానికి కుశలవులు దీనిని రాముని ఎదుట గానం చేయటమే తార్కాణం.

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్

అన్నాడో మహాకవి. వాల్మీకి అనే కవికోకిల కంఠస్వరం నుండి నాదాత్మకమైన వేదం రసాత్మకమైన రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది.

రామాయణ ప్రాశస్త్యం: మంత్రాలలో కెల్ల శ్రేష్టమైన గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలున్నాయి. వాల్మీకి మహార్షి ఈ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి వేయి శ్లోకముల చొప్పున మొత్తం 24వేల శ్లోకములలో రామాయణాన్ని మహాకావ్యంగా మలిచాడు. ‘ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజ సంయుతం, త్రిసంధ్యం య:పఠే నిత్యం సర్వపాపై: ప్రముచ్యతే’ అనే ఫలస్తుతితో ముగిసే గాయత్రీ రామాయణంలో గాయ్రతీ మంత్రంలో గల 24 అక్షరాల శ్లోకాలు కూర్చారు. శ్రీమద్రామయణము చదివిన గాయత్రీ మంత్రం చదివిన పుణ్య ఫలితం పొందవచ్చని విజ్ఞులు చెపుతారు.

“రామ” నామము లో పంచాక్షరీ మంత్రము “ఓం నమ శివాయ” నుండి ‘మ’ బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము “ఓం నమో నారాయణాయ” నుండి ‘రా’ బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. ఒక్కమారు “రామ” నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.

అలాగే, వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో, యజుర్వేదంలోని 1,29,290 పదాలే కాకుండా, ఋగ్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడి ఉన్నాయని విజ్ఞుల అభిప్రాయం.

భద్రో భద్రయా సచమాన అగాత్
స్వసారం జారో అభ్యేతి పశ్చాత్
సుప్రకేతై ర్య్ధుభీ రగ్ని ర్వితిష్ఠన్
శద్భిర్వర్ణై రభిరామ మస్థాత్

ఋగ్వేదంలోని ఈ మంత్రంలో మొట్టమొదట బీజరూపంలో శ్రీరామకథ మనకు కన్పిస్తుంది. ఈ నాలుగు పంక్తుల్లో రామాయణంకు సంబంధించిన నాలుగు ప్రధాన ఘట్టాలు నిక్షేపించబడ్డాయి. మొదటి పంక్తిలో భద్రుడు అంటే సర్వమంగళ స్వరూపుడైన రాముడు, భద్రతో అనగా సర్వమంగళస్వరూపిణైన సీతతో వనమునకు వచ్చాడు. ఇక రెండవ పంక్తి, జారుడైన రావణుడు సీతను దుష్టబుద్ధితో సమీపించాడని, మూడోపంక్తి, ఆకాశన్నంటే హర్మ్యాలు అగ్నికి ఆహుతయ్యాయని, చివరిపాదం, తన భయంకరమైన వాహినులతో రావణుడు, రాముని ఎదుర్కోన్నాడని తెలుపుతుంది.

రామాయణ రచన పూర్వవృత్తాంతం: వాల్మీకి రామాయణ రచనకు ప్రేరేపించినట్టిది క్రౌంచ ద్వంద్వ వియోగంతో ఏర్పడ్డ శోకము. ఆ శోకమే శ్లోకత్వము చెందింది.

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, అని గుణవీర్యాది సర్వలక్షణ సంపన్నుడైన పురుషుడెవరైనా ఉన్న తనకు తెలుపమని ఒకనాడు వాల్మీకి నారద మహర్షని ప్రార్ధించగా, అటువంటి గుణ,గణములు కలవాడు కేవలం కౌసల్య తనయుడు శ్రీ రాముడేనని, రామవృత్తాంతాన్ని వాల్మీకి నారద మహర్షి తెలియచేస్తాడు.

ఒకనాడు నిషాదుడొకడు క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో పడవేయగా, ఆడపక్షి రోదించేను. ఆ రోదన విన్న వాల్మీకి నోటినుండి,

మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్

అనే శ్లోకం వెలువడింది. “ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి”, అని దానర్ధం. అయితే, మా నిషాద! లక్ష్మికి నివాస స్థానమైన ఓ విష్ణూ! నీవు మండోదరీ, రావణులను దంపతలనుండి కామమోహితుడైన రావణుని చంపితివి గాన నీవు పెక్కు సంవత్సరములు ప్రతిష్ట నొందగలవనునది దీని గూడార్ధం. కథాసంబద్ధమైన కావ్యార్ధము చక్కగా సూచించే పై శ్లోక మహిమను బ్రహ్మ వాల్మీకికి విశిదీకరించి, నారదుని ద్వారా విన్న రామాయణ చరితమును కావ్యముగా రచింపమని ప్రేరేపించాడు. వాల్మీకి చెప్పిన ఆ శ్లోకం సంస్కృతాన చెప్పబడిన మొట్టమొదటి చంధోబద్దమైన శ్లోకం. అట్టి అనేక శ్లోకాలతో వాల్మీకి సంస్కృతాన ఆదికావ్యమైన రామాయణ కావ్యాన్ని సహజ రమణీయమైన దృశ్య కావ్యంగా రచించాడు.

సుందరాకాండంలో చంద్రోదయాన్ని వర్ణిస్తూ, వాల్మీకి చెప్పిన కింది శ్లోకం ఒక్కటే చాలు వాల్మీకి రామాయణ ఘట్టాలను సమగ్ర దృశ్యంగా చిత్రీకరించన విధానం అర్ధమవుతుంది.

హంసో యథా రాజత: పంజరస్థ: సింహో యథా మందరకంధరస్థ:
వీరో యథా గర్వితకుంజరస్థ: చంద్రో విటభ్రాజ తథాంబరస్థ:

రామాయణ వటవృక్షం: వాల్మీకి మహార్షి రామాయణ మహా కావ్యం వ్రాస్తూ బాలకాండ 36వ శ్లోకంలో ఇలా అన్నాడు.

యావత్‌ స్థాస్యంతి గిరయఃసంతశ్చ మహీతవే
తావత్‌ రామాయణ కధా లోకేషు ప్రచరిష్యతి

అంటే ఆ భూతలం మీద కొండలు, నదులు (జీవజాలం) ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణ కధ నిలిచి ఉంటుంది. వాల్మీకి ఉద్ఘటించినట్టే, రామాయణం శాఖోపశాఖలుగా భరతఖండాన విస్తరించింది. అనేకమంది కవులు అనేక మార్లు రామాయణాన్ని విరచించి ఆ మహాకావ్యాన్ని ఒక జీవనదిగా మర్చారు.

అస్సామీ, బాలినీస్, బెంగాలి, కంబోడియన్, చైనీస్, గుజరాతి, జావనీస్, కన్నడ, కాశ్మీరి, ఖోటనీస్, లావోషన్, మలేషియన్, మరాఠీ, ఒరియా, ప్రాకృతం, సంస్కృతం, సంతాలి, సింహళం, తమిళం, తెలుగు, థాయి, టిబెటన్ మొదలైన భాషల్లో వాల్మీకి రామాయణానికి అనేక అనువాదాలు వచ్చాయి. ఉదాహరణకు సంస్కృతంలోనే, ఇతిహాస, కావ్య, పురాణ కాలాదులన్నింటిని కలిపి ఇరవై, ముప్పైదాకా రామాయణాలున్నాయని పరిశోధకుల అభిప్రాయం.

ఇంతమంది ఇన్ని విధాలుగా రామాయణ కావ్యాన్ని మళ్లీ, మళ్లీ చెప్పడం ఎందుకనే ప్రశ్రకు ఆయా కవులే సమాధానాలిచ్చారు. జయదేవుడు ప్రసన్న రాఘవ నాటకమున, ‘స్వసూక్తీనాం పాత్రం రఘుతిలక మేకం కలయతాం కవీనాం కో దోష: సతు గుణగణానా మవగుణ: ’ (శ్రీ రాముని తమ కావ్య నాయకునిగా చేయటంలో కవుల తప్పులేదు అది శ్రీరాముని గుణగణముల దోషమేకానీ అనిఅర్ధం). అలాగే, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తూ, ‘మరల నిదేల రామాయణం బన్నచో నీ ప్రపంచక మెల్ల నెల్ల వేళ తినుచున్న యన్నమే తినుచున్న దెప్పుడు తన రుచి బ్రతుకులు తనవికాన’, అన్నారు.

దర్శనములు వేరు తత్వంబదొక్కటే అన్న వేమన సూక్తిలా రామాయణ గాథను పలువురు పలు, పలు విధాల కథావస్తువుకు మార్పు రాకుండా రచించారు. చాలావరకూ, ఈ రచనలన్నింటికి మూలం వాల్మీకి రామాయణమే అయినా కొన్నిసార్లు వ్యాసవిరచితమని చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం కూడా పలుగురు కవులకు మార్గదర్శకమైంది.

ఇలా అనేక భాషల్లో వెలువడ్డ రామాయణాలలో తమిళంలో కంబ, జెమినీ రామాయణాలు, తెలుగులో రంగనాథ, మొల్ల రామాయణాలు, హిందీలో తులసీదాస్ రచించిన రామచరిత మానస్, సిక్కుల తొమ్మిదో గురువైన శ్రీ గోవిందసింహాజీ రాసిన గోవింద రామాయణాలేకాక జైన, బౌద్ధమతాల్లో కూడా రామాయణ గాథలు బహుళ ప్రాచుర్యం పొందాయి. అయితే కంబ, రామచరితమానస్ లకు ఆధ్యాత్మరామాయణం మూలం.

తరువాయి భాగంలో ఆథ్యాత్మ రామాయణం గురించి, దానికి వాల్మీకి రామయణంతో గల భేదాలను తెలుసుకుందాం.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *