పురాణ పరిచయం 8

12. వరాహ పురాణం

శ్రీమహావిష్ణువు ఎడమచీలమండలంగా అభివర్ణించే ఈ పురాణం అష్టాదశ పురాణాలలో పన్నెండవది. ‘విష్ణునా భిహితం క్షోణ్యై తద్వారాహముచ్యతే’ అన్న శ్లోకాన్ని బట్టి ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని ధరించినప్పుడు భూదేవికి వినిపించాడని తెలుస్తోంది. కాగా మనుకల్పంలో విష్ణువు పృథ్వికి మొట్టమొదటసారిగా బోధించిన ఈ వరాహ పురాణంలో మొత్తం 215 అధ్యాయాలలో 24,000 శ్లోకాలున్నాయి.

ఈ పురాణంలో నారదముని పూర్వజన్మ వృత్తాంతం, అశ్వనీదేవతల పుట్టుక, పార్వతీదేవి, వినాయకుల జన్మ వృత్తాంతాలు, ద్వాదశీ, ఏకాదశి వ్రతాల మాహాత్మ్యము, వరాహస్వామి భూదేవిని ఉద్దరించే ఘట్టాలు, శ్రాద్ధ విధానం, గోకర్ణ క్షేత్ర విశేషాలు మొదలగు అంశాలు వర్ణించబడ్డాయి. అలాగే, శ్రీ మహావిష్ణువు అష్టమూర్తిగా – 1. పృథ్వీ, 2. జలము, 3. అగ్ని, 4. వాయువు, 5. ఆకాశం, 6. సూర్యడు, 7. చంద్రుడు, మరియు 8. ఆత్మగా ఈ పురాణమందు వర్ణించబడ్డాడు. అంతేకాక, వేదవ్యాస వెరచిన అష్టాదశ పురాణాల వివరాలు కూడా ఈ పురాణమందు చూడవచ్చు.

శ్రీ మహావిష్ణువు ద్వాదశ రూపాలతో భక్తుల వివిధ అంగాలను రక్షంచే అంగరక్షకుడని ఇందు తెలపబడింది. ఆ రూపాలు – 1. కేశవుడు -పాదాలు, 2. నారాయణుడు – పిక్కలు, 3. మాధవుడు – నడుము, 4. గోవింద – రహస్యాంగం, 5. విష్ణువు – నాభి, 6. మధుసూదనుడు – ఉదరం, 7. త్రివిక్రముడు – తొడలు, 8. వామనుడు – హృదయం, 9. శ్రీధరుడు – కంఠం, 10. హృషీకేశుడు – ముఖం, 11. పద్మనాభుడు – కళ్లు, చివరగా 12. దామోదరుడు – శిరస్సు.

ద్వాదశీ ద్వాదశం:

సంవత్సరంలో పన్నెండు మాసాలలో వచ్చే పన్నెండు ద్వాదశుల విశిష్టత ఈ పురాణమందు మనకు లభిస్తుంది.

1. చైత్ర శుద్ధద్వాదశినాడు వామనమూర్తి ధరుడైన నారాయణున్ని పూజించాలి, 2. వైశాఖ మాసం వచ్చే శుద్దద్వాదశిని పరశురామ ద్వాదశని కూడా అంటారు. పరశురామావతారుడైన విష్ణువుని ఆరాధించాలి, 3. జ్యేష్ఠ శుద్ధద్వాదశికి శ్రీరామ ద్వాదశి అని పేరు. శ్రీరాముని ఈ మాసంలో పూజిస్తారు, 4. అషాడ శుద్దద్వాదశి కృష్ణ ద్వాదశి, 5. శ్రావణ శుద్దద్వాదశి బుద్దద్వాదశి, 6. భాద్రపద మాసంలో వచ్చే ద్వాదశిని కల్కి ద్వాదశి, వామన ద్వాదశని అంటారు. ఈ మాసంలో కల్కి అవతారాన్ని పూజిస్తారు, 7. ఆశ్వయుజ ద్వాదశినాడు పద్మనాభస్వామిని కొలుస్తారు, 8. కార్తీక ద్వాదశి నాడు విష్ణువు హిరణ్యాక్షుని నుంచి భూదేవిని రక్షించినందు వల్ల దీనిని ధరణీ ద్వాదశని కూడా అంటారు, 9. మార్గశిర ద్వాదశి నాడు మత్స్యావతారము దాల్చిన తిధి కావున దీనికి మత్స్య ద్వాదశని పేరు, 10. కూర్మావతారాన్ని కొలిచే పుష్యశుద్ద ద్వాదశిని కూర్మద్వాదశి, 11. ఇక మాఘశుద్ధ ద్వాదశి వరాహద్వాదశి కాగా, 12. ఫాల్గుణ శుద్దద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రసిద్ధి కకక్కింది.

13. స్కాంద పురాణం

శివుడు కుమారస్వామికి ఉపదేశించిన పురాణం కావున దీనికి స్కాందపురాణమని పేరు. తత్పురుషకల్పంలో దీనిని స్కందుడు మొట్టమొదటిసారిగా భూమికి బోధించాడు. మొత్తం 1471 అధ్యాయాలలో 81 వేల శ్లోకాలున్న స్కాంద పురాణం అష్టాదశ పురాణాలన్నింటిలోకి పెద్దది. శ్రీ మహావిష్ణువు రోమాలతో పోల్చబడే ఈ పురాణం ఏడు ఖండాలుగా విభజింపబడింది. ఇవి వరుసగా మహేశ్వర ఖండం, వైష్టవ ఖండం, బ్రహ్మ ఖండం, కాశీ ఖండం, అవంతీ ఖండం, నాగర ఖండం, మరియు ప్రభాస ఖండం. ఈ ఖండాలుగానే కాక స్కాందపురాణం సనత్కుమార సంహితం, సూత సంహితం, శంకర సంహితం, వైష్ణవ సంహిత, బ్రహ్మ సంహిత మరియు సౌర సంహిత అనే ఆరు సంహితాలుగా కూడా విభజింపబడింది.

ఈ ఏడు ఖండాలలో ముఖ్యంగా అరుణాచల మహాత్మ్యం, వేంకటాచల మహాత్మ్యం, కార్తీక, మార్గశిర మాసాల మహాత్మ్యం, సేతు మహాత్మ్యం, కాశీ క్షేత్ర విశేషాలు, విశ్వకర్మోపాఖ్యానం, మార్కకండేయోపాఖ్యానం, ద్వారక నగరం దాని పరిసర ప్రాంతాల వర్ణన, కుమార సంభవం, శివరాత్రి మహాత్మ్యం, సప్తదీప వర్ణన, సోమవార వ్రత మహాత్మ్యం, రుద్రాక్ష మహాత్మ్యం వంటి వృత్తాంతలు చోటు చేసుకున్నాయి. అంతేకాక శ్రీ సత్యనారాయణ వ్రతవిధానం, కథ కూడా మనకు స్కాందపురాణంలో దర్శనమిస్తుంది.

కార్తీకమాస విశిష్టత:

ఆహార శుద్ధి, సత్త్వ శుద్ధి, పరిశుద్ధహారం స్వీకరిస్తే మనిషిలో సత్త్వ గుణం పెంపొందుతుంది. అందుకే ఆహారం తీసుకునే ముందు ‘బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణా హుతమ్, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా’ అంటూ ఆహారాన్ని పూజిస్తారని, మరియు

ధాత్రీవనే హరేఃపూజాః ధాత్రీచాయా సుభోజనమ్
కార్తీకమాసిః యకుర్యాత్త స్వపాపం వినశ్యతి

కార్తీక మాసంలో ఉసరిక చెట్టు పూజ, ఉసరి చెట్టు నీడలో వన భోజన చేస్తే పాపాలు నశిస్తాయని స్కంద పురాణం మనకు తెలుపుతోంది. అంతేకాక కార్తీక మాసంలో శివాలయ గోపురంలో, ద్వారం దగ్గర, శిఖరం మీద, శివలింగ సన్నిధిలో ఆవునేతితోగాని, నువ్వుల నూనెతో గాని, విప్పనూనె లేదా నారింజ నూనెతో దీపారాధన చేస్తే సకల పాపాలు నశించి, శివ సాన్నిధ్యాన్ని పొందవచ్చని ఈ పురాణం తెలుపుతోంది. కార్తీక మాసంలో తులసీదళాలతో, తెల్లని, ఎర్ర గన్నేరు పూలతో నారాయణుణ్ణి పూజించి, భగవద్గీతలోని విభూతి యోగం, విశ్వరూపయోగాలను పారాయణ చేస్తే శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది.

కార్తీక మాసంలో సోమవారం, శని త్రయోదశి, కార్తీక పౌర్ణమి, ఏకాదశి, శుక్లపక్ష పాడ్యమి, కార్తీక బహుళ ద్వాదశి విశిష్టమైన దినాలు. కార్తీక మాసంలో ఉపవాసం, ఏకభుక్తం, రాత్రిభోజనం, అయాచిత భోజనం, స్నానం, తిలదానం, ఈ ఆరు క్రియలు ఉపవాసంతో సమానమైనవి. కార్తీక సోమవారం చేసిన స్నానం, జపం, ధ్యానం, హోమం, దానం వెయ్యి అశ్వమేథయాగాలు చేసిన ఫలితాలను ఇస్తాయని స్కంద పురాణం తెలుపుతోంది.

మార్గశిరమాస విశిష్టత:

‘మాసానాం మార్గశిర్షోహం’ అని మహావిష్ణువు స్వయంగా చెప్పిన మాట. శ్రీహరికి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణుసహస్రనామ పారాయణం, గంగాస్నానం శ్రేయోదాయకం. ఈ మాసంలో శ్రీహరిని తులసీదళాలతో గాని, ఉసరిక దళాలతో గాని పూజించటం, తులసీ చందనాన్ని, దశాంగధూపాన్ని సమర్పించటం వల్ల శ్రీహరి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నల్లని అగరుతో గాని, గుగ్గిలం, గేదె నెయ్యి, చక్కర కలిపి ధూపం వేయటం ద్వారా నరకబాధలని తప్పించుకోవటంతోపాటు, కోరిన కోరికలు తీరగలవని స్కాంద పురాణం తెలుపుతోంది. అలాగే ముద్ద కర్పూరంతో హారతి ఇస్తే అశ్వమేథయాగ ఫలితాన్ని పొందవచ్చు.

కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యోమాం స్మరతి నిత్యశః
జలం భిత్యా యథాపద్మం నరకాదుర్ధరామ్యహం

అంటూ ఎవరైతే మార్గశిర మాసంతో కృష్ణనామాన్ని స్మరిస్తారో వారికి నరక బాధల నుంచి విముక్తి కల్గి ఆరోగ్యం పెంపొందుతుందని కూడా ఈ పురాణం చెపుతోంది.

కాశీక్షేత్రా మహిమ:

కాశీక్షేత్రానికి అవిముక్తం, ఆనందవనం అని రెండు పేర్లున్నాయి. పవిత్రమైన కాశీక్షేత్రాన్ని ప్రళయకాలంలో కూడా పార్వతీ, పరమేశ్వరులు విడిచిపెట్టరు. అందుకే దీనిని అవిముక్త క్షేత్రమని పిలుస్తారు. ఈ దివ్యక్షేత్రం మోక్షస్వరూపమైన ఆనందానికి హేతువు అవటం వల్ల మహేశ్వరుడు దీనికి ఆనందవనం అనే పేరు పెట్టాడు. కాశీక్షేత్రానికి సంబంధించిన దివ్యకథ కూడా ఈ పురాణంలో చెప్పబడింది. పూర్వం సృష్టిపోషణ భారమంతా మరొక వ్యక్తిపై నుంచి తాను ఆనందవనంలో కాలం గడపాలనే కొరిక పరమేశ్వరునికి కల్గి, తన శరీరంలోని వామభాగాన్ని చూడగా, ఒక దివ్య పురుషుడు అందుండి ఉద్భవించాడు. విష్ణువు అనే పేరుతో విరాజిల్లే ఆ మహాపురుషునికి బాధ్యతలప్పగించి పార్వతీ, పరమేశ్వరులు ఆనందవనంలోకి ప్రవేశిస్తారు. శివుని గురించి తపస్సు చేయడానికి విష్ణువు తన సుదర్శనంతో ఒక పుష్కరిణిని నిర్మించి, తన స్వేదజలంతో నింపి శివస్తుతి చేశాడు. ఆ స్తుతికి మెచ్చి తల ఊపుతుండగా శివుని మణికర్ణిక జారి పుష్కరిణిలో పడింది. అందుకే ఈ తీర్థరాజానకి చక్రతీర్థం, మణి కర్ణిగా తీర్థమని పేర్లు వచ్చాయి.

కాశతే త్రయతోజ్యోతిః తదానాఖ్యేయమీశ్వరః
అతో నామాక్షరం చాస్తు కాశీతి ప్రథితంవిభో

ఈ దివ్యక్షేత్రం మాటలకందని అగోచరమైన జ్యోతిప్రకాశంతో నిండి ఉండటంతో ఈ ప్రాంతానికి కాశీ అని పేరు వచ్చింది. ఈ కాశీ క్షేత్రంలో ఓంకారేశ్వరాది 14 లింగాలు, అమృతేశ్వరాది 14 లింగాలు, శైలేశ్వరాది 14 లింగాలు, దక్షేశ్వరాది 8 లింగాలున్నాయి. ఈ సిద్ధలింగాల వల్లే కాశీక్షేత్రం ముక్తిక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిందని ఈ పురాణం మనకు తెలియ చేస్తుంది.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *