పురాణ పరిచయం – 6

8.అగ్ని పురాణం

ఈ అగ్ని పురాణము గురించి, దీని విశిష్టత గురించి ఇదే పురాణములో 271వ అధ్యాయములో ఈ విధంగా వివరింపబడి వుంది.

అగ్నిరూపేణ దేవాదే ర్మఖం విష్ణు: పరాగతి:
ఆగ్నేయ పురాణస్య వక్తా శ్రోతా జనార్ధన:
తస్మాత్పురాణ మాగ్నేయం సర్వవేదమయం జగత్
సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞానమయం పరం
సర్వాత్మహరిరూపం హి పఠతాం శృణ్వతాం నృణాం
విద్యార్థినాం చ విద్యాదం అర్థినాం శ్రీధనప్రదం
సర్వేప్సూనాం సర్వదం తు ముక్తిదం ముక్తికామినాం
పాపఘ్నం పాపకర్తౄణా మాగ్నేయం హి పురాణకమ్.

శ్రీ మహావిష్ణువు అగ్ని రూపంలో సర్వజనులను కాపాడుతున్నాడు. కావున అగ్ని ద్వారా చెప్పబడిన ఈ పురాణం చెప్పినవాడు, విన్నవాడు కూడా జనార్ధనుడే. సర్వవిద్యలు, సర్వవిషయ విజ్ఞానము, సర్వాత్ముడైన శ్రీహరి విశ్వరూపదర్శనము ఇందు నిక్షిప్తమై ఉన్నాయి. అగ్నిపురాణాన్ని ఈశాన కల్పంలో మొట్టమొదటిసారిగా అగ్నిదేవుడు వశిష్ఠునికి బోధించాడు.

శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమపాదంగా వర్ణించే అగ్ని పురాణంలో 383 అధ్యాయాలు ఉన్నాయి. అందులో నారద పురాణానుసారం 25,000 శ్లోకాలు, మత్స్య పురాణాను సారం 13,000 శ్లోకాలు ఉండాలి. కానీ వాస్తవంలో నేడు లభ్యం అవుతున్న అగ్నిపురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. దశావతార వర్ణన, రామాయణ, భారత ఘట్టాలు, సృష్టి వర్ణన, వాస్తుపూజా విధానం, ఆయుర్వేద శాస్త్రం, కావ్యనాటకాలంకార లక్షణాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ధర్మాలు, స్వప్న ఫలితాలు, అద్వైత బ్రహ్మతత్త్వం, కూర్మావతార వర్ణన మొదలగు అంశాలు ఈ పురాణ మందు పొందుపర్చబడ్డాయి.

ఉత్పత్తి ప్రళయం చైన, భూతనామాగతింగతిమ్
వేత్తి వాద్యామవిద్యాంచ, సవాచ్యోభగవానితి

సృష్టి, స్థితి, నాశనం, ప్రాణుల జీవన్మరణాలు, విద్య, అవిద్యలు తెలిసినవాడే భగవంతుడని అగ్నిపురాణం తెలుపుతోంది. లోకంలో కన్పించే అగ్ని ఐదు రకాలు: సముద్రంలో నున్నది బడబాగ్ని లేదా బ్రహ్మయగ్ని, జంతుజీవజాలాల గర్భంలో ఉండి జీవులు తినే పదార్ధాన్ని జీర్ణించే అగ్ని జరరాగ్ని, కర్ర, కర్ర రాచుకున్న పుట్టిన అగ్ని కాష్టాగ్ని లేదా దావానలము, వజ్రాల రాపిడితో వచ్చే అగ్ని వజ్రాగ్ని, చివరగా మహాగ్ని గోళము సూర్యతేజము.

అగ్నిపురాణంలో 336-346 అధ్యాయాలలలో అలంకార శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలు ప్రతిపాదించబడ్డాయి. కావ్యలక్షణాలు, నాయికా బేధాలు, నాయకులకు గల ఎనిమిది లక్షణాలు, అలాగే నాయికల పన్నెండు విభవాలు ఇందు తెలపబడ్డాయి. నృత్యానికి సంబంధించిన శిరస్సు, హస్తాలు, పాదాలు అనే ప్రధానాంకాల కదలికలు, సాత్త్వికం, వాచికం, అంగికం, ఆహార్యం అనే చతుర్విధాభినయాల స్వరూపం, యమక, అనుప్రాసాదులైన పది శబ్దాలంకారాలు, ఉపమా, రూపక, సహోక్త్యాదులైన అర్థాలంకారాలు ఇలా అనేక అంశాలు అగ్నిపురాణంలో వివరించబడ్డాయి.

బ్రహ్మజ్ఞానం తతఃపశ్చాత్ పురాణ శ్రవణే ఫలమ్
ఏతదాగ్నేయకం విప్ర పురాణం ప్రకీర్తితమ్

అగ్ని పురాణ శ్రవణం చేయటం వలన బ్రహ్మజ్ఞానం లభిస్తుందని పెద్దలు తెలిపారు.

9. భవిష్య పురాణం

శ్రీ మహావిష్ణువు యొక్క కుడి మోకాలితో పొల్చబడే భవిష్య పురాణంలో మొత్తం 14, 500 శ్లోకాలున్నాయి. ఇవి 585 అధ్యాయాలలో చెప్పబడ్డాయి. అఘోర కల్పంలో మొట్టమొదటిసారిగా బ్రహ్మ మనువుకు బోధించిన ఈ భవిష్య పురాణం రాబోవు కాలము యొక్క చరిత్ర వర్ణించబడింది. దీనినే కల్కిపురాణమని కూడా పిలుస్తుంటారు. ఇందు బ్రహ్మ పర్వము, మధ్యపర్వము, ప్రతిస్వర్గ పర్వము మరియు ఉత్తర పర్వము అను నాలుగు పర్వాములున్నాయి. నారద పురాణాన్ని అనుసరించి బ్రహ్మ, వైష్టవ, శైవ, సౌర, ప్రతిసర్గ అను ఐదు పర్వాలు కలవు.

సృష్టికెల్ల కారణము సూర్యభగవానుడని, అదియే బ్రహ్మపదవాచ్యమగు తత్త్వమని నిరూపించబడింది కావున ఈ పర్వానికి బ్రహ్మపర్వమని పేరు. సూర్వనమస్కార మంత్రాలక వ్యాఖ్యానము, సూర్వకిరణాలలో బేధాలు వాటి ప్రభావం, నవీన ఖగోళ విజ్ఞానంతో సూర్యకిరణ శాస్త్రంతో సమన్వయించి సూర్యోపాసన ఇందు విస్త్రతంగా వర్ణించబడింది. ఇతిహాసపురాణాల విశేషాలు, ఈ పురాణాలు రాయడానికి వినియోగించిన తాళపత్రాలు, సిరాలు, అక్షరాల సంఖ్య మధ్యమ పర్వంలో విపులీకరించబడింది. అంతకాక సంఖ్యాశాస్త్రం, తూకాలు, కొలతలు, వృక్షశాస్త్రం, ఔషద విజ్ఞానం వంటి విషయాలు కూడా ఈ పర్వమందు పొందుపర్చబడ్డాయి.

అలాగే మనువు నుండి ఆరంభమైన సృష్టిక్రమము ప్రతిసర్గపర్వంలో తెలుపబడింది. బ్రహ్మ దగ్గర నుండి గాక బ్రహ్మమానసపుత్రుడగు మనువు దగ్గర నుంచి జరిగిన సర్గము (సృష్టి) ప్రతిసర్గము అని పిలవబడును. ఇందు వైవస్వతమన్వంతరంలోని 28 మహాయుగములో కృతయుగము నుండి మొదలు ఆయా రాజుల చరిత్ర, రాజ్యకాలాలు ఇందు తెలపబడ్డాయి. శకకర్తలైన విక్రమాదిత్య, శాలివాహనుల చరిత్ర ఇందు సంపూర్ణంగా వర్ణించబడ్డాయి.

ఇవే కాక అన్నదాన మహిమ, విక్రమ, బేతాళ కథలు, శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము, జీమూతవాహుని కథ, కల్క్యవతార వర్ణన, స్త్రీ లక్షణాలు, ధర్మాలు మొదలైన అంశాలు కూడా భవిష్య పూరాణంలో పొందపర్చబడ్డాయి.

వివాహాలెన్ని విధాలు?

బ్రాహ్మము – విద్యావంతుడైన బ్రహ్మచారికి సాంప్రదాయబద్ధంగా కన్యాదానం చేయటం, దైవము – యాగశాలలో ఋత్విజుడుగా నున్న వటునికి కన్యాదానం చేయటం, ఆర్షము – ఒకటి లేదా రెండు ఆవులను వరుని వద్ద నుంచి పుచ్చుకొని కన్యాదానం జరపటం, ప్రాజావత్యము – ‘అర్థేచ, ధర్మేచ, కామేచ నాతిచరామి’ అని వధూవరులిద్దరు ప్రమాణానికి కట్టుబడటం, అసురము – కన్న తల్లి,తండ్రులకు గాని, పోషకులకు గాని కన్యాశుల్కమిచ్చి చేసే వివాహం, గాంధర్వం – వధూవరులు పరస్పర ఇష్టంతో తల్లితండ్రుల అనుమతిపొందక స్వయంగా చేసుకునే వివాహం, రాక్షసం – ఇష్టంలేని కన్యను ఎత్తుకు వచ్చి చేసుకునే వివాహం, పైశాచిక – నిద్రావస్థలో, మైకంలో నున్న కన్యను రహస్యంగా ఎత్తుకొచ్చి జరిపే వివాహం. ఈ అష్ట వివాహ విధానాలను భవిష్య పురాణం ప్రతిపాదించింది. అయితే, ఇందు కొంతవరకు అసురము, పూర్తిగా రాక్షస, పైశాచిక వివాహాలు ధర్మవిరుద్ధం.

యచ్చ్రుత్వాసర్వ పాప భ్యో, ముచేతే మానవోనృప
అశ్వమేధ ఫల ప్రాప్య, గచ్చేద్బానౌన సంశయః

భవిష్య పురాణం విన్నవారు సకలపాప విముక్తులై, అశ్వమేథయాగం చేసిన సత్ఫలితాలను పొంది, సూర్యనారాయణ సాయుధ్యం పొందుతారు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *