ఉగాది విశిష్టత

చిగురింతతో మొదలై, ఆకురాలటంతో పూర్తయ్యే సంవత్సరచక్రం జీవగమన వైఖరి తెలియచేస్తుంది. చిగురింతలూ, శిశిరాలు జరిగినా వృక్షంలో మార్పుండదు. సంవత్సరాలు గడుస్తున్నా జగతిలోనూ మార్పుండదు. సృష్టి, స్థితిలయలకు సంవత్సరం ఒక ప్రతీక.

ఉగం, యుగం ఈ రెండు ఒకే అర్ధంతో ప్రయోగించిన శబ్ధాలు. యుగానికి ఆది… యుగాది. కల్పాది కూడా ఇదే. ఈ శ్వేతవరహకల్పం, చైత్రశుద్ధ పాడ్యమినాడు ప్రారంభమైనదని వరహమిహూరుని వచనం. సృష్టికర్తను ఆరాధించడం ఈ రోజున ప్రధానాంశం. కాలస్వరూపుడైన పరమాత్ముని అనుగ్రహాన్ని కాంక్షించే పర్వదినమిది.

‘చైత్రమానే జగద్భ్రహ్మా ససర్జ ప్రధమేహని’ అని శాస్త్ర ప్రమాణం.

ఉగం అనే మాటకు జంటని అర్ధం. రెండు ఆయనాల జంట అయిన సంవత్సరానికి ఆది … ఉగాది.

యుగాదికృత్, యుగావర్తో.. అని విష్ణుసహస్రనామాలు. యుగాన్ని ఆరంభించినవాడు, యుగ చక్రాన్ని నడిపించేవాడు భగవానుడేనని భారతీయ భావన. సర్వ ప్రపంచం కాలంపై ఆధారపడి ఉంది. ఆ కాలం భగవదాధీనం. కాలానికి ప్రధాన స్వరూపం సంవత్సరం. ఈ సంవత్సరమే మళ్లీ, మళ్లీ ఆవృతమై యుగ, కల్పాది కాలచక్రంగా పరిభ్రమిస్తుంది.

ఋతూనాం ముఖూ వసంతః అని వేద వాక్యం. ఋతువులకు వసంతమే ముఖం వంటిది. కనుక ఋతుచక్రానికి మొదటిదైన వసంతానికి ఆది ఉగాది కావటం కాలపరమైన, ప్రకృతిపరమైన ఔచిత్యం. శీతోష్ణ వర్షాల తీవ్రతలేని వసంతమాసం సుఖప్రదం కనుకనే వసతి సుఖమస్మిన్నితి వసంతః అని పేరు నిర్వచించారు. సుఖంగా ఉండే కాలం వసంతం.

చిత్త, చిత్ర అనే పేర్లు కలిగిన నక్షత్రాన పూర్ణిమ వచ్చే మాసం చైత్రమాసం. దీనికి శాస్త్రరీత్యా మధుమాసమని పేరు. వసంత ఋతువుకు తొలి మాసమిది. మలిమాసమైన వైశాఖానికి మాధవ మాసమని పేరు. నక్షత్రరీత్యా చైత్రమాసం, స్వభావరీత్యా మధుమాసం.

సృష్టి చిత్ర నిర్మాణం చేసిన సమయంగల నక్షత్రమిది కనుక చిత్ర అనే పేరు వచ్చిందని కొందరు శాస్త్రకారుల మాట. రాక్షసవధతో ఈ నక్షత్ర శక్తికి సంబంధమున్న గాథ వేదం (తైత్తిరీయ బ్రాహ్మణం)లో కన్పిస్తుంది. చిత్తా నక్షత్ర సమయంలో చేసే ఈశ్వరాధాన దేవతాశక్తులకు బలానిస్తుంది. లోకకంటకులైన అసురుల శక్తిని పరిమార్చుతుంది. ఈ నక్షత్రానికి దేవపతి అయిన ఇంద్రుడు అధిపతి అని శాస్త్రవచనం. ఇంద్ర శబ్ధానికి ప్రకాశస్వరూపుడు, ఐశ్వర్యమయుడు అని అర్ధాలు. ఇది పరమాత్మ నామమే.
అగ్నిశ్చమ ఇంద్రశ్చమే, సోమశ్చమ ఇంద్రశ్చమే… అంటూ ఇంద్రసహితులైన దేవతలు శుభాలను కలిగిస్తారని వేదమంత్రం.

ఈ చైత్రమాసం తొమ్మిదరోజులను వసంత నవరాత్రులుగా వ్యవహరిస్తారు. జగన్మాతను ఉగాది నుంచి తొమ్మిదిరోజులు ఉపాసించటం కాలమంతా కాత్యాయని కృప లభించాలని అంతర్యం. పరాశక్తి ఉమాదేవిగా హిమవత్పర్వత రాజపుత్రిగా చైత్రశుద్ధనవమినాడు మృగశిర నక్షత్రంలో ఉద్భవించిందని శివపురాణం, దేవీ భాగవతం తెలుపుతున్నాయి.

ఈ తిధినాడే శ్రీరామచంద్రుని ఆవిర్భావం. గౌరీ, రాములను సోదరీ సోదరులుగా చెబుతారు. విష్ణుసోదరియైన పార్వతిని రాజరాజేశ్వరి రామ సహోదరి అని త్యాగయ్య కీర్తించారు. ఇరువురూ ఒకే తత్త్వానికి చెందిన స్వరూపాలు. లోకరక్షణకై ఆవిర్భవించిన రాక్షసాంతకులు, సుజన రక్షకులు.

ఈ చైత్రమాసమంతా సర్వదేవతా ప్రీతికరం. ఒక విధంగా సంవత్సరం సూక్ష్మస్వరూపం. ఈ తొలిమాసం తిధులన్నింటా గోచరిస్తుంది. అందుకే చైత్రశుద్ధ చవితి గణపతికి, చైత్ర శుద్ధ షష్టి స్కంధునికి, ఏకాదశి విష్ణువునికి ప్రీతి. ఆయా దేవతకు సంబంధించిన తిథులు ఈ మాసంలో శక్తిమంతంగా ఉంటాయి. ఆ తిధులలో ఆ దేవతల్ని ఆరాధిస్తే, సంవత్సరమంతా పూజించిన ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెపుతున్నాయి.

చైత్రశుద్ధ తదియనాడు మత్స్యావతారం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్న సంవత్సరానికి తొలినాడు, ఆరు ఋతువుల తత్త్వాన్ని, ఆరు రుచుల పదార్ధంగా మలిచి, కాలస్వరూపుడైన పరమేశ్వరునికి నివేదించి, ఆ ప్రసాదాన్ని ఆరగించడం మన సాంప్రదాయం.

ఋతుః సుదర్శనః కాలః అహః సంవత్సరోవాల్యః అంటూ భగవానుని సంవత్సర స్వరూపునిగా ఆరాధించే సంస్కృతిలో సూర్యదేవునికి సంవత్సరుడనే పేరు కన్పిస్తుంది. అరవై సంవత్సరాల పేర్లు సౌరశక్తికి ప్రత్యేకతలే.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *