రామాయణము(లు) 4 జానపద రామాయణాలు

రామాయణ, భారత, భాగవతాలు మన జనజీవన స్రవంతిలో మిళితమై, మన కళలను కూడా ప్రభావితం చేశాయి. శిష్టులకు పురాణేతిహాసాలు కావ్యాల రూపంలో అందుబాటులో ఉంటే, పామరులకు ఆ లోటును మన జానపద కళలు తీర్చాయి. రామాయణం ఈ విషయంలో ముందుందని చెప్పవచ్చు. రసమయ రామాయణం ఒక తరం నుంచి మరో తరానికి అందచేయటంలో జానపద గేయాలు ఎంతగానో ఉపకరించాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా అనేక అవాల్మీకాలు కూడా ఇందులో చోటుచేసుకున్నాయన్నది యదార్ధం.

తెలుగునాట సీతారాములకున్న ప్రాధాన్యాత కావచ్చు, గోదావరి తటాన సీతారాములు నివసించడం వల్ల కావచ్చు జానపదులకు సీతారాముల కథ అంటే మక్కువ ఎక్కువ. అందుచేతనే తెలుగులో మనకు అనేక జానపద రామాయణాలు కన్పిస్తాయి. కూడకొండ రామాయణం, శారద రామాయణం, ధర్మపురి రామాయణం, రామకథాసుధార్ణవము, మోక్షగుండ రామాయణం, చిట్టి రామాయణం, గుత్తెనదీవి రామాయణం, సూక్ష్మరామాయణం, సంక్షేపరామాయణం, శ్రీరామదండములు, లంకాసారధి, రామాయణ గొబ్బిపాట, శ్రీరామ జావిలి, అడవి గోవిందనామాలు, శాంత గోవిందనామాలు, పెండ్లి గోవిందనామాలు, సేతు గోవిందనామాలు ఇలా అనేక జానపద గేయాలు రామాయణ కథను ఆధారంగా చేసుకున్నవే. రామాయణ మహాకావ్యంలోని ప్రతి ఘట్టం జానపదులకు ఆలంబనయే.

శాంతకల్యాణము, పుత్రకామేష్టి, కౌసల్యబైకలు, కౌసల్య వేవిళ్లు, శ్రీరామ జననము, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కల్యాణము, రాములవారి అలుక, సుందరకాండ పదము, ఋషుల ఆశ్రమము, సుగ్రీవ విజయము, కోవెల రాయభారము, అంగద రాయభారము, లక్ష్మణ మూర్ఛ, లంకాయాగము, గుహభరతుల అగ్నిప్రవేశము, శ్రీరామ పట్టాభిషేకము, లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, కుశలాయకము, కుశలవ చ్చల చరిత్ర, కుశలవకుచ్చెల కథ, కుశలవ యుద్ధము, పాతాళహోమము, శతకంఠ రామాయణము, సీతా విజయము ఇవన్నీ కూడా రామయణగాథలోని ఏక దేశములు.

ఇక సీతమ్మ నాధారంగా చేసుకొని వెలువడిన పాటలు సీత పుట్టుక, సీత కళ్యాణం, సీత నత్తవారింటికి పంపుట, సీత సమర్త, సీతశుగోష్టి, సీత గడియ, సీత వామనగుంటలు, సీతమ్మవారి అలకలు, సీత వసంతము, సీత దాగిలిమూతలు, సీత సురటి, సీత మేలుకొలుపు, సీత ముద్రికలు, సీత చెర, సీత ఆనవాలు, సీత అగ్నిప్రవేశము, సీత వేవిళ్లు ఇలా చెప్పుకుంటుపోతే కొకొల్లలు. ఇందు ముద్రితాలు కొన్నికాగా, అముద్రితాలు అనేకం. ఈ పాటలు వాల్మీకి, అధ్యాత్మ, జౌన, బుద్ధ రామాయణాల ప్రభావిత కల్పితాలు. సీతమ్మవారి ప్రతి కదలిక జానపద స్ర్తీల హృదయాలను ఆకొట్టుకొని చిలువలుచ పలువలుగా చిత్ర,విచిత్ర కల్పనలతో సుందర,సుకుమార లతికలుగా మనమందు సాక్షాత్కరిస్తాయి.

సీత గడియ, సీత వసంతము, సీతమ్మవారి అలుక వంటి పాటలు సీతారాముల శృంగార జీవితానికి దర్పణాలు. జానపదుల పాటలలో సీతమ్మ బరువు, బాధ్యతలెరిగిన సమిష్టి కుటుంబపు పెద్దకోడలు. పెద్దల, పిన్నల యెడల వాత్సల్యం కురిపించే ముగ్ధ. అంతదకుమించి చతురోక్తుల పుట్ట. సీత గడియ పాటలో తలుపుకు గడియ పెట్టి అలకపాన్పు ఎక్కిన రాములవారిని మందలించి కౌసల్య తలుపు తెరిపించిన సందర్భంలో, అత్తగారిని త్వరగా సాగనంపడానికి, ‘‘మా మామ దశరథలు ఒక్కరున్నారు. అత్త మీరు పొండి మామ కడకు’’ అని చమత్కారంగా అత్తగారిని సాగనంపుతుంది. సీత వసంతములోని ఈ మనోహర ఘట్టం చూడండి.

‘‘మున్నూరు చిమ్మగోవుల వసంతములు పట్టుకొని పరమాత్ముడేతెంచె నప్పుడు! ఓయమ్మ మా మీద వసంతములు జల్లి, ముచ్చవలెనె వచ్చి దాగియున్నది! అంపుమని శ్రీరాముడటు పలుకగాను. అంపనని కౌసల్య యిటు బలుకగాను, అక్కడకు వచ్చె అత్త సుమిత్ర! శ్రీరాము లుండేటి చందంబు జూచి, ఈ వేడుక మనము కనుల జూతుము! ఆ కోడలు నెత్తుకొని అంతఃపురమునకు అరుగ బోగా నిలువు నిలువు మనుచును నీలవర్ణుడు సీత కడ్డముగ వచ్చె! అరుగు నపిరీలు పెంపు దీపింప, తమ కొల్వు చాలించి దశరధేశ్వర్లు అంతఃపురంబులకు అటు వేగవచ్చె! తలవంచు కోడలును జూచి ఆరాజు ఇదియేమి చోద్యమోచూండంగ తిలకింపక నేనేల కొలువలో నుంటి! ఈ వేడుకలు కనుల చూడంగనైతి నా పాపమునగాని నాకెట్లు కలుగు. ఓయమ్మ నీకు సిగ్గు బిడియములు లేవె! నీమీద చల్లిన నీలవర్ణుణ్ణి నెలతరో రఘురాము తోడుకొని వచ్చి నీ చేత వసంతంములు చల్లింతు నేను!’’ దశరధ మహారాజు సీతారాములచేత మరల వసంతము లాడించి తాను కౌసల్యాది కాంతలతో స్తంభముల చాటున నుండి చూచెడు ఘట్టము మధురాతిమధురము.

సీతారాముల సరస సల్లాపాలు జానపదుల నోటినుండి అతిమధురముగా విన్పిస్తాయి. ఉదాహరణకు సరయూనదిని దాటి వనములలో ప్రవేశించు సందర్భంలో సీతాదేవి కొలను వద్దగల కొమ్మలకు మొక్కు సమయాన సీతారాముల సరసొక్తిచూడండి. ‘కొమ్మకు మ్రొక్కితివా, కొలనికి మ్రొక్కితివా, కొలనులో నున్న హంసలకు మ్రొక్కితివా’ యని శ్రీ రాముడు ఎగతాళి చేయును. అలాగే సీత స్నానము చేయడానికి వెళ్లిన సీత, చేయకుండానే తిరిగి వచ్చి, ‘ఇది యేమి చోద్యమో యినవంశజుండా, మింట చంద్రుడు వచ్చి ధరణి నున్నాడు, తుమ్మెదలు వచ్చాయి చూడ రమ్మని,’ కొలను దగ్గరకు తీసుకు వెళ్లగా, వెళ్లి చూసిన శ్రీరాముడు నవ్వుతూ, ‘మింట చంద్రుడుగాడు అతివ నీ మోము, తుమ్మెద లవిగావు సఖియా నీ కురులు’ అని చెప్పిన సమాధానం అతి రమణీయం. ఈ విషయాన్నే తర్వాత శ్రీరాముడు హనుమంతుడు లంకాయాన సందర్భంలో ఆనవాలుగా చెపుతాడు.

అశోకవనంలో సీతమ్మ తన విషాద గాథను వినుపించుచు త్రిజటను ‘వేగుచుక్క వినుము వెడలు శృంగారు బొంగారు బొమ్మ వినుమా, తీగెమెరుపా వినుమబు చీకటింటద్దమా విభీషణుని పుత్రి వినుమా’ అని సంబోధించిన తీరు, లక్ష్మణుడు ముర్ఛిల్లిన సమయాన, ‘పదునాలుగేండ్లు నిద్రాహారము లేదు పడియుండడెన్నడూను వెనుక నుండుటె కాని యెదటికెన్నడు రాడు, తొడలమీదికి వచ్చెనూ, కైకెమ్మ వరములు దశరథుడు మమ్మడుగ కార్యములు నేరాయెనూ అడవులకు పొమ్మనీ అన్యాయమే చేసె అన్న నీ ప్రాణములకూ ఇంకెన్ని జన్మాల తపసునా నీ వంటి ఆత్మబంధుడు గలుగునూ, వినవోయి లక్ష్మణా సీతవంటి స్త్రీని బడయంగవచ్చుగాని, నీ వంటి సోదరుడు తన కెట్లు కలుగునో ఎన్ని జన్మములకూనా భరతు పట్టము గట్టి పారిపో దలచితివి పగవాణ్ణిగాను నీకు, ఉప్పుకోసము వచ్చి సుగ్రీవుడా నేను కప్పురము గోలుపోతి, ఆకలి కోసము వచ్చి జాంబవా నేనిపుడు అనుజుణ్ణి గోలుపోతి, ధరణిసుతకై వచ్చి నీలుడా నేనిపుడు తమ్ముణ్ణి గోలుపోతి, యేలోకానికి పోతివో తమ్ముడా ఆలోకమునకు నన్ను కొంపొమ్ము లక్ష్మణా కూడి వస్తిమి మనము కూడి యుండుట ధర్మమ’ని రాముడు పడే ఆవేదన జానపదుల కథనాలల్లోని భావుకతకు కొన్ని మచ్చుతునకలు మాత్రమే.

వదిన, ఆడపడుచుల మధ్య, తోడికోడళ్ల మధ్య సాగే ప్రతి ఇంటా సాగే ఇచ్చకాలు, ఎత్తిపొడుపులు, పరాచకాలు, పరిహాసాలు జానపదుల నోళ్లలో కొత్త అందాన్నే సంతరించుకున్నాయి. ఊర్మిళ నిద్రలోని ఈ ఘట్టం అందుకు ఉదాహరణ.

వనవసానంతరం తిరిగి వచ్చిన లక్ష్మణుని చూచి ఆనందంతో ఉన్న ఊర్మిళను చూసి, శాంత –‘‘కుందనపు ప్రతిమ కళలూ యీ కళలు యెందుండి దాగున్నావో, దృష్టి తగులాకుండునూ నీలాల నివ్వాళు లివ్వరమ్మా’’ అని పరిహాసమాడగా, ఊర్మిళ పక్షాన సీతమ్మవారు, ‘‘ఇంద్రాది చంద్రులాను మరపించు చంద్రులూ మీ తమ్ములూ, దృష్టి తగులాకుండునూ నీలాల నివ్వాళు లివ్వరమ్మా’’ అని చమత్కార బాణం వదులుతుంది. అందకు సమాధానంగా శాంత, ‘‘అక్క చెల్లెండ్రు మీరు మిక్కిలీ సౌందర్యశాలులమ్మా, మా తమ్ములూ నలుగురినీ వలపించు జాణలకు దృష్టి తగులు, దృష్టి తగులాకుండునూ నీలాల నివ్వాళు లివ్వరమ్మా’’ అని తప్పికొడుతుంది. సీతమ్మ వారు మరింత గడుసుగా, ‘‘మా యన్న ఋశ్య శృంగూ వనములో కూడి యెడబాయకున్నా, ఏమి యెరుగని తపసినీ వో వదినె, కేళించి విడిచినావూ దృష్టి తగులాకుండునూ నీలాల నివ్వాళు లివ్వరమ్మా’’ మళ్లీ నోరెత్తకుడా సమాధానమిచ్చును.

చెప్పుకుంటూ పోతే, జానపదులు చూసినంత లోతుగా పండితులు కూడా రామాయణగాథను చూసి ఉండరన్పిస్తుంది. తేటతెలుగు పదాలతో రామాయణానికి అందమైన భాష్యాన్ని చెప్పారు. లక్ష్మణదేవర నవ్వులో, ‘‘కలకల నవ్వే లక్ష్మణదేవరపుడు – కలతలు పుట్టెను కపులందరికినీ, కిలకిల నవ్వే లక్ష్మణదేవరపుడూ – కిలకిల నవ్వగా ఖిన్నుడయె రాజూ’’, సరళమైన భాషలో ఎంత భావాన్ని గుప్పించడం వల్లనే జానపదుల పాటలు నేటికి జనపధంలో మిగిలిపోయాయి.

లక్ష్మణదేవర నవ్వులోనే మరో ఘట్టం: లక్ష్మణుని త్యాగనిరతికి నీరైన శ్రీరాముడు లక్ష్మణస్వామి నిదురపోతుండగా, కాళ్లుపట్టు సందర్భంలో – లక్ష్మణుడెంత నిద్దురలో నున్న నేమి ‘‘ఒక మారు ఒత్తితే ఊరుకొని యుండే – రెండవ మాటికీ కలగంటి ననెను – మూడవ మాటికీ కనువిప్పి చూచి – కలగాదు నిజమని కడు భీతినొంది – ధరణీశు తాజూచి ధరణిపై వాలె – మీ యడుగు లొత్తెటి ప్రాయమ్ము వాణ్ణి – అహల్య పావనమైన అడుగు మీ యడుగు – బలి శిరస్సున నున్న అడుగు మీ యడుగు – మీ యడుగు లొత్తుదురు సకల దేవతలు – నా యడుగులొత్త శ్రీమన్నాథ తగదు’’ అని అన్నగారి పాదాలపై పడును. ఇలా చెప్పుకుంటూ పోతే జానపదులు రామయణ గాథలో జొప్పించిన మథుర సన్నివేశాలు అనేకం.

చివరగా, సీతమ్మ వాకిట అనే ఈ చిన్నిపాటను ఆస్వాదించడండి.

సీతమ్మ వాకిటా సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ చితక పూసింది
చెట్టు కదలాకుండ కొమ్మ వంచండి
కొమ్మ విరగాకూండా పూలు కొయ్యండి
కోసినా పూలన్ని సీత కివ్వండి
తీసుకో సీతమ్మా రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకుంటేను దోచుకుంటారు.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *