మణిద్వీప వర్ణన

సకల చరాచర జగత్తు యొక్క ఆవిర్భావానికి, క్రమబద్ధమైన ఆజగత్ర్పవర్తనకు ఆధారభూతము పరాశక్తే. తృణము నుండి మహాపర్వతము వరకు ప్రతి పరమాణవులో నిక్షిప్తమై ప్రకాశించు మహాశక్తి స్వరూపమా పరదేవత. ఆ శక్తియే పరబ్రహ్మము, సకల ప్రాణికోటిని చైతన్యపర్చే మహా తేజము, తుదకు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు కూడా చైతన్యాన్ని ఒసగే శక్తి రూపమైన ఆ పరమేశ్వరి సగుణసాకార రూపిణి. కాళి, దుర్గ, భ్రామరి, గాయత్రి, సావిత్రి, శ్రీ మహాలక్ష్మి, పార్వతి, సరస్వతి అన్నీ ఆమె నామములే, కళా రూపములే. అట్టి జగద్రక్షకి, జగత్పరిపాలకి లలితాభట్టారుక నివసించే ప్రదేశమే మణిద్వీపమని దేవీ భాగవతం తెలుపుతోంది.

సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీపరివృతే
మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే
శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్

శంకరభగవత్పాదులు విరచించిన సౌందర్యలహరిలో కూడా మనకు అమ్మవారి నివాస విశిష్టత, వివరాలు తెలుస్తాయి. అలాగే, ‘సుమేరు మధ్య శృంగస్థా, సుధాసారగ మధ్యస్థా, కామాక్షీ, కామదాయినీ’ అనే లలితా సహస్రనామాలు అమ్మవారి నివాస విశేషాలను మనకు చెప్పకనే చెపుతున్నాయి. ఈ బ్రహ్మాండంలో అన్ని గ్రహాల చుట్టూ తిరిగే మేరుపర్వత శిఖరాలలో బ్రహ్మ, విష్ణు, శివలోకాలున్నాయి. ఆ శిఖరాలకు మధ్య నిక్షిప్తమైన ఉన్నత శిఖరంపై అమ్మవారు నివసిస్తారని లలితా సహస్రనామాలలోని ‘సుమేరమధ్య శృంగస్థా’ అన్న నామమం మనకు తెలుపుతోంది. ఇక బ్రహ్మాండం వెలుపల సృష్టించబడ్డ అమృత సముద్రంలోనున్న ద్వీపం అమ్మవారి మరో నివాస స్థానంగా ‘సుధాసాగర మధ్యస్థా, కామాక్షి, కామదాయినీ’ అన్న లలితాసహస్ర నామం వివరిస్తోంది. అమ్మవారు నివసించే ఈ నివాసాలని శ్రీపురమనీ, శ్రీ నగరమని పిలుస్తారు.
విశ్వగోళానికి ఆవల భానుతేజంతో వెలుగొందే మణిద్వీపం మణికాంచన సౌధమండితంబై, నవరత్నములతో నిర్మించబడి, మనో దుర్గాలు, జ్ఞాన దుర్గాలు, అహంకార దుర్గాలతో బాసిల్లుతూ, నిత్య వసంత సురభి సందరోద్యానాలతో శోభిల్లుతుంది. కామితార్థములైన కల్పవృక్షములైదు నిత్యము పుష్పఫల భాసురలముతో ప్రకాశిస్తుంటాయి. మణిద్వీపంలో నవనిధులకు కొదవలేదు. ఆ ద్వీపాన్ని సకల ఋతువులు, గంధర్వ, కింపురుషాదులు, దిక్పాలురు, దేవీ రూపములైన సర్వశక్తులు పరిరక్షిస్తుంటారు.

బహువిధ మణిమయములైన దుర్గములు గల ఆ ద్వీపము వర్ణించుట ఆదిశేషునికి కాడూ అలవి సాధ్యం కాదు. బ్రాహ్మి, వారాహి, మహేశ్వరి, నారసింహ, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి, చాముండి మరియు మహాలక్ష్మి అను తొమ్మిది శక్తులు చతురంగ బలములతో దేవిని సేవిస్తూ ఉంటారు. ఆ ద్వీపంలో నున్న ఇంద్రనీలమణి దుర్గమందు షోడశారమను బంగారు పద్మమున్నది. కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీదుర్గ, ఉష, లక్ష్మి, శ్రుతి, స్మృతి, శ్రద్ధ, మేథ, మతి, కాంతి, రామ, ఛాయ అనే పదహారు శక్తులు దేవి యొక్క సైన్యాలను నడిపిస్తారు. ఇక ముత్యాల కోట యందు ఆ పరమేశ్వరి యొక్క సర్వశాస్త్ర విజ్ఞాన విశారదులయిన అనంగమదన, అనంగమదనాతుర, భువనపాలా, గగనవేగా, శశిరేఖా, గగనరేఖా, అనంగకుసుమ, అనంగకుసుమాతురా అనే ఎనిమిదిమంది మంత్రిణులుంటారు. అలాగే పగడపు కోట యందు పంచభూతముల కాధిపత్యము వహించు శక్తులు, రతనాల కోట యందు దేవియవతారములు, మహావిద్యల సప్తకోటి మంత్రములు సంచరించుచుండును.

ఈ దుర్గాల కావల కనక వేయి స్తంభాల మండపాలతో విరాజిల్లే చింతామణి దుర్గము శ్రీ పరమేశ్వరి నెలవు. ఈ దుర్గమందు, శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, ఏకాంత మండపం అని నాలుగు మండపాలుంటాయి. కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఆ దుర్గంలో సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్ద సరోవరం ఉంటుంది. చింతామణి గృహంలో పదిశక్తిరూపాలు పదిమెట్లగా గల ఒక వేదిక ఉంటుంది. దానిపై పరమ శివుడు ఫలకముగాను, హరిహర బ్రహ్మలు, ఈశ్వరుడు నాలుగు కోళ్లగానున్న ఆసనంపై మహాదేవుని వామభాగాన సర్వభూషణ వస్త్రాద్యలంకారములతో లలితాంబ నెలవై ఉంటుంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తుల సమ్మిళితమైన పరమేశ్వరిని జయ, విజయ, అజిత, పరాజిత, నిత్య, విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు నిరంతరం సేవిస్తూ ఉంటారు.

మణిద్వీప వర్ణన

1. మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి
మన మనస్సులలో కొలువైయింది

2.సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు

3.లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణిద్వీపానికి మహానిధులు

4. పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలూ
గంధర్వాదుల గానస్వరాలు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం

5. పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవున గలవు
మధురమధురమగు చందనసుధలు
మణిద్వీపానికి మహానిధులు

6. అరువదినాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు

7. అష్టసిద్ధులు నవనవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు

8. కోటి సూర్యులు ప్రచండ కాంతులు
కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటితారకల వెలుగుజిలుగులు
మణిద్వీపానికి మహానిధులు

9. కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు

10. పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు

11. ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపు కోటలు వైఢూర్యాలు
పుష్యరాగ మణిప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు

12. సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||భువ||

13. మిలమిలలాడే రత్నపురాసులు
తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు

14. కుబేర ఇంద్ర వరుణదేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు

15. భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు
పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు

16. కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు

17. మంత్రిణి దండిణి శక్తిసేనలు
కాళి కరాళి సేనాపతులు
ముప్పదిరెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

18.సువర్ణరజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు

19. సప్తసముద్రములనంత నిధులు
యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు

20.మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలయా కారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు

21.కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

22. దివ్య ఫలముల దివ్యాస్త్రములు
దివ్యపురుషులు ధీరమాతలు
దివ్యజగములు దివ్యశక్తులు
మణిద్వీపానికి మహానిధులు

23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు

24. పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు

25. చింతామణులు నవరాత్నాలు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు

26. దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు
మణిద్వీపానికి మహానిధులు

27. పదునాల్గులోకాలన్నిటిపైనా
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం

28. చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో

29.మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో

30. పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది….2…

31. నూతనగృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్టసంపదల తులతూగేరు ||2||

32. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీపవర్ణన చదివిన చోట
తిష్టవేసుకొని కూర్చొనునంటా
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||భు||


తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *