ఉత్తర రామాయణము – కుశలాయకము 2

జానపదుల రామాయణ గాథలో అనేక అవాల్మీకాలు వచ్చి చేరాయి. అయితే ఈ గాథలన్ని జైన, కంబ మొదలగు అనేక రామాయణాల ప్రేరణతో వచ్చి ఉండవచ్చు. కుశ, లవుల జన్మవృత్తాంతంలో కూడా ఇలాగే అనేక కథలు జానపద గాథలలో ప్రచారం పొందాయి.

జానపదుల కుశాలయకము:

రాముని అవతార ఉద్దేశం తీరినది కావును తిరిగి భగవంతుని వైకుంఠానికి రప్పించమని దేవతలు బ్రహ్మను ప్రార్థిస్తారు. అందుకు బ్రహ్మ సీతను ఎడబాసితేనే, రాముడు తిరిగి వైకుంఠానికి చేరుతాడని బ్రహ్మ తెలుపుతాడు. అందుకని బ్రహ్మ తన సతీమణి సరస్వతిని పిలిచి, భారతీ నీవు భూలోకానికి వెళ్లి, సీతపై శ్రీరామునికి కోపంబు వచ్చి యడబాసే విధంగా చేయమని అర్ధిస్తాడు. సరస్వతి కొంచెం ఆశ్చర్యపోయినా, కార్యము సాధించి వస్తానని అయోధ్యా నగరవాసులలోకి ప్రవేశిస్తుంది. రాముడు మారువేషంలో తన నగరమందు తిరుగుతుండగా, ఒక చోట కులపెద్దలందరూ గుమిగూడి ఉంటారు. పుట్టింటికి పోయి ఆరునెలలు ఉండి వచ్చిన తన సతిని చూపి, ఒక చాకలివాడు, చాకలివాడినైతేనేమి, జాతి, నీతి లేదా నాకు, పరాయివాళ్ల ఇంట్లో ఉండి వచ్చిన సతిని యేలుకోవడం తప్పు. రావణ చెరలో ఉన్న సీతను తెచ్చుకుని మహరాజు కనుక ఏలుకుంటున్నాడు. పెదచెరువు నీళ్లును, పెద్దింటి నడవడి తప్పులేదన్నమాట ధరణిలో గలదు. వెర్రిరాముడను కాదు అపకీర్తిని పొందటానికని అతను రోషంగా పలకటంతో శ్రీ రాముడు కలత చెందుతాడు. రఘువంశాన జన్మించి, చాకలి వానికి ఉన్న నీతి తనకు లేదని వాపోతాడు. శ్రీరాముడంతటివాడు అగ్నిపునీత అయిన సీతను అనుమానించటం తగదనుకున్నారో ఏమో, అందుకే లీలామానుష్య గాథలను చేర్చి, ఇందులో తమ తప్పు లేదన్నట్టు జానపదులు తమని,తాము సమర్ధించుకున్నారు.

రాముడు సీతను అడవులలో విడిచి రమ్మని లక్ష్మణుని పంపిచినపుడు, లక్ష్మణదేవరుడు సీతమ్మను ఎంతో జాగ్రత్తగా అడవి అందాలను, సొగసులను ఆమెకు చూపిస్తూ తీసుకువెళ్లినట్టు రమ్యంగా వర్ణించారు. మచ్చుకకు – ‘మెల్లమెల్లగా రమ్ము మేదివీసుతనీవు, నేనుండగా నీకు భయమేమి, వనము చూచుచు నీవు మనసు సంతోషించి, తిన్న,తిన్నగారమ్ము తల్లి సీతమ్మా. దారివెంబడి రమ్ము తరణీలలామ భయము జెందనీవి బాగుగానావెంట, దారి వెంబడి రమ్ము ధారుణీపుత్రి పొన్నమానులు జూడు పొలతినీవిచ్చోట, పోకమానులుజూడు ప్రాకటంబుగనుపాల వృక్షముజూడు సఖయనీవిచ్చోట, తాళవృక్షము జూడు తరుణేందువదనా, హింగాల వృక్షఁబు నిందునున్నవి జూడు, సంపెంగ వృక్షముల్ చాలుగాగలవు. మారేడు వృక్షములు మగువ ఇచ్చటజూడు, నేరేడు వృక్షములు నెలతిజూచితివా, నారికేళము జూడు నాతినీవిచ్చోట. తియ్యమామిడి చెట్లు తెలియనివిజూడు, ఖర్జూరములు జూడు కాంతనీవిచటను. కాదంబ వృక్షములు కలికి జూచితివా, తింత్రిణి వృక్షంబు దేవదారులు జూడ, వర్వులిడపులి పారిజాతములు జూడు, అశోకవృక్షంబులతివ ఇక్కడచూడు, పొగడుమానులు జూడు మగువనీవిపుడు.’ అంటూ వనాన ఉన్న ప్రతి వృక్షాన్ని పేరు, పేరునా సీతాదేవికి చూపిస్తూ, ఆమెకు అలసట రాకుండా జాగ్రత్తగా లక్ష్మణుడు జానకిని వాల్మీకి ఆశ్రమ పరిసారాలకు తీసుకువెళ్లడాన్ని జానపదులు హృద్యంగా చిత్రీకంరించారు.

వాల్మీకి రామాయణానికి విరుద్ధంగా, జనపదులు రాముడు సీతను విడిచిన విషయం లక్ష్మణుడితో నేరుగా సీతమ్మవారికి చెప్పించే సాహసం చేయలేకపోయారు. అందుకే, అర్థరాత్రి లక్ష్మణుడు నిదుర లేచి, రావణుడు నిన్ను లంకలో ఉంచడాన్ని పట్టణవాసులు శంకిస్తూ తప్పుబట్టారని, రజకుడి మాట విని రాముడు నిన్ను అడవిలో విడిచి రమ్మన్నాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. అందుకని పడతి నన్ను కోపించవద్దు, నీవు అయోధ్యకు రాకుమీ, అని ఒక తాళపత్రం మీద రాసి వారు నిదురించి ఉన్న వృక్షానికి కట్టి వెళ్లిపోతాడు. నిదుర లేచి లక్ష్మణుడు గానక విచారిస్తున్న సీతాదేవి కంటికి చెట్టుకి వేళ్లాడుతున్నా పత్రం కన్పిస్తుంది. అది చూసి దుఃఖితురాలైన సీత వద్దకు సకల జంతువులు వచ్చి సాష్టాంగములు చేసి సీతాదేవికి అండగా నిలుస్తాయి. ఇక్కడ మరోసారి జానపదులు తమ కరుణార్ధ్ర హృదయమును, విజ్ఞతను చాటుకున్నారు. ‘సాష్టాంగములు జేసి సకలజంతువులెల్ల యంతినీరగెల్ల నెరగింపవమ్మా. మాయమ్మ నినుచూడ మాటలొచ్చెను మాకు యింగితజ్ఞానంబు లెల్లబుట్టెనుగా, సామాన్యురాలయిన నదివిగాదోయమ్మా, ఆదిలక్ష్మికాంత వౌదువోయమ్మ, బ్రహ్మపట్టపురాణి భారతీదేవివో, చంద్రకాంతవో నీవు చానరో జెపుము,’ లోకమాత నీ బాధ ఏమిటో చప్పుమని వేడాయి. సీత జరిగినదంతా చెప్పి, తనను భక్షించి విముక్తి నివ్వమని ఆ మృగాలను వేడుకుంది. దానికి వారు, ‘ఎంత పుణ్యంబుమాకు యిప్పుడిచ్చోటభూపుత్రినినుజూడ. పుణ్యంబుమాకయ్యె, ఏ పుణ్యంబుముందునెంచి జేసితిమో, పదునాల్గు లోకాలు చూసినా నీవంటి సతిఏది? నీ పాదపద్మములను ఎల్లప్పుడు సేవిస్తాము. మేముండగా, నీకు లోటుండదన్నాయి. అంతటితో ఆగక ఆ మృగాలు సీతమ్మను వాల్మీకి ఆశ్రమానికి చేరుస్తాయి.

సీతమ్మకు అపవాదు, వనంలో ఉండటం జానపదులకు అంతగా నప్పినట్టులేదు. అందునా గర్భవతి అరణ్యాలలో అగచాట్లు పడటం వారు భరించలేకపోయారు. అందుకే తొలిచూలు పుట్టింట జరపాలన్న జనాచారాన్ని వాల్మీకి ద్వారా సీతకు తెలియచెప్పి, సీతమ్మను జనకునకి అప్పగించే బాధ్యత వాల్మీకి కిచ్చారు. పుట్టింటికి చేరాలన్న తపనతో పట్టణాలు, పల్లెలలు, కొండలన్నింటిని ఆయశమనకుండా అతివ బ్రహ్మపుత్రునివెంట పదిహేనురోజులు నడచినా కష్టమన్న మాట నోటరాలేదన్నారు జానపదులు. కానీ పుట్టినిల్లు ఇంకా మూడు క్రోసల దూరముండగా సీతమ్మకు ప్రసవ వేదన కల్గుతుంది. కట,కటా ఇటువంటి కష్టం దాపురించిందని జనపదలు వాపోతూ – ‘ఆడ సాయము లేదు అడవిలోపలను. యిట్టిచందముబట్టి ఇకనేమి జేతునో. బ్రహ్మవ్రాసినవ్రాత బాయదే తల్లి, పూర్వపుణ్యంబెవరు భువిలోన తప్పింప, కానున్నపనియోమో కాకపోదమ్మా, అయితేనేమి నాతల్లి అడవిలోనిటుమీద, ఈశ్వరుండెకాని యెవరులేరమ్మా, ఈ చెట్లనీడనే ఇంతినీవుండుమా …. పుత్రసంతానంబు పొలతిరోనీకౌను … గరుడగంధర్వాది ఘనులెల్ల యీవేళ, నిన్ను రక్షింతురే నిక్కముగ తల్లి, పంచభూతములెల్ల బాగుగా నిచ్చోట నిన్న రక్షించునేడు మా తల్లి,’ అంటూ దీవించారు. ఆ నట్టడవిలో పూర్వదిక్కులో పొద్దుపొడిచినట్లుగా పూర్వలగ్నములో భూపుత్రి తనయుని కన్నది. అయినా ఇంకా ప్రసవ వేదనను అనుభవిస్తుండటంతో, కుశ దర్భను నీటిలో వేసి మంత్రించి, ఆ నీటని వాల్మీకి సీతకు అందచేస్తాడు. కుశదర్భ ఉన్న ఉదకాన్ని తాగి సీత మరొక పుత్రునికి జన్మనిచ్చింది. సూర్యచంద్రులలా ప్రకాశిస్తున్నా ఆ ఇరువురు శిశువులను తామరాకులలో ఉంచి, సీతకు అందచేస్తాడు వాల్మీకి. ఈ సమయంలో ఎవరి సాయమూలేదని వాల్మీకి విచారిస్తుండగా, శరభుడనేవాడు ఫలపుష్పాదులను సేకరిస్తూ అటుగా వస్తాడు. వాల్మీకీ అతని వివరాలు అడగగా, తాను జనకరాజు కొలువులో పనిచేస్తానని, అడవిలో పనియుండి వచ్చానని చెపుతాడు. అతని ద్వారా జనకునికి వాల్మీకి వర్తమానం పంపగా, జనకుడు పద్నాలుగు వేల సైన్యంతో వాల్మీకి దర్శనార్థం విచ్చేస్తాడు. వాల్మీకి జరిగిన వృత్తాంతమంతా జనకునికి తెలియపరుస్తాడు. అంత జనకుడు తన కూతురికి వచ్చిన కష్టానికి విచారించి, సీతను ఆమె పుత్రులిరువురిని రథమెక్కించుకొని మిథిలా నగరానికి తీసుకువెడతాడు. పురిటి పదిదినాలు అయిన పిమ్మట రంగ,రంగ వైభవంగా శిశువులిద్దరికి బారసాల చేసి, వాల్మీకిని నామకరణం చేయమని కోరతాడు. సీతమ్మ ప్రసవ వేదనతో నెట్టు తిప్పలు కొన్ని చేతబట్టుకొని తొలుత కాంచిన పుత్రుడు లవకుమారుడని, తాను కుశదర్భలు మంత్రించి ఇచ్చిన నీరు తాగిన పిదప జన్మించిన వాడు కనుక రెండవ వాడు కుశుడని వాల్మీకి తెల్పెను. శ్రీరామపుత్రాలను చూసి దేవతలు పుష్ప వర్షాలు కురిపించారని, చల్లని వాయువులు వీచాయని, పుడమి సంతోషంతో ఉప్పొంగిందని జానపదులు వర్ణించారు.

మగడు విడిచిన కూతురిని ఇంట పెట్టుకుంటే లోకులు వేలెత్తి చూపరా? తన కూతురు ఎటువంటి తప్పు చేసి ఉండదు కదాన్న అనుమానం జానపదులు జనకునిలో కల్గించారు. బుద్ధిమంతుడైన రాముడు, గర్భవతి అయిన సతిని కారడవులలో విడిచి రమ్మనగలడా అని కుమార్తెతో అన్నాడని, తండ్రి భావన గ్రహించిన సీత అగ్నిప్రవేశం చేసెనని జానపదులు కథలు అల్లారు. అగ్నిలో సీత ప్రవేశించగానే, అతిపతివ్రతైన ఆదిలక్ష్మి సీత నాయందు ప్రవేశించట వల్ల తాను పునీతుడనయ్యానని, నేను ధన్యుడనయ్యానని అగ్నిదేవుడు పలుకగా, సీత నెమ్మదిగా పడిసిబొమ్మ వలె బయటకు వచ్చి తండ్రికి నమస్కారం చేసిందని జానపదులు ఎంతో మనోహరంగా తెలిపారు. అగ్ని పునీత అయిన సీతను చూపి పట్టణవాసులు, ‘రఘురాముడెంత సాహసుడమ్మా, తప్పుచేసినలాగు తరుణి నెడబాసె, బాలరఘురాముడు పాపాత్ముడేసుమీ, నేరముండినలాడునెంత నెడబాసె, శాంత శ్రీరాముడు కడుదురాత్ముండమ్మ, యేమినేరము లేక నింతి నెడబాసె, కనికరము లేక కౌసల్య తనయుండు, కఠినాంతరంగుడయి కాంతనెడబాసె, పురుషులెంతటివారు పొలతిరోచూడు,’ అంటూ శ్రీరామచంద్రుని అమాయకంగా ప్రశ్నిస్తూనే దుయ్యబట్టారు. తాతగారింట గారాబంగా దినదినప్రవర్థమానులై పెరుగుతున్న లవకుశులకు ఆరు సంవత్సరాలు రాగానే వాల్మీకి అక్షరాభ్యాసం చేశాడు. బాలురిరువురికి సకల శాస్త్రాలతోపాటు రామాయణ గాథను కూడా వాల్మీకి నేర్పించాడు.

ఇలాంటిదే, కుశలవుల జన్మవృత్తాంతానికి సంబంధించి మరోకథ జానపద వాఙ్మయంలో ప్రచారంలో ఉంది. ఆ కథననుసరించి, లక్ష్మణుడు తాను సీతను చంపివస్తినియడవులోను, ఉంచివస్తిని వనములలోన అని చెపుతాడు. శోకతప్తుడైన రాముడు సీత దినములు చేయుటకు శాంతను పిలిపించమంటాడు. సన్నబియ్యం, చాయపప్పు, కూరకాయగలు, చాయపసుపు కుంకుమ, మంచిగంథము, కుసుమ చీరలు, మల్లెపూవుదండలు, జాజిపూవులు, పట్టు చీరెలు, చిలకరవికలు, రత్నపుసరులు, సొంపుమీర బంగారం తెప్పించిరి. ముప్పదిపుస్తెలు, మున్నూరు చేటలు చేయించి, మునికాంతలను తోడ్కొని రమ్మని లక్ష్మణుడునికి చెప్పిరి. అంత లక్ష్మణుడు ఋషిపల్లెకు వెళ్లగా, అక్కడ సీతమ్మ మరిదిని చూసి ఎదురు వచ్చింది. వదినగారి కాళ్లకు నమస్కరించిన లక్ష్మణుడు దీర్ఘాయువు కమ్మని ఆశీర్వదించింది. విషయం గ్రహించింది సీతమ్మ. మునికాంతలకు రాముడు పట్టుచీరలు ఇచ్చెను. సరిగరవికలు పణతులకిచ్చెను. మంచిగంథము, మల్లెపూవులు మగువలకిచ్చెను. ముప్పదిపుస్తెమున్నూరు చేటలు, మూసివాయనమ్ముల నిచ్చెను రాముడు. కైసల్య, కైకేయలు, ఋష్యశృంగుడు, శాంత, భరతశతృఘ్నులు, లక్ష్మణుడు, మాళవిశ్రుతకీర్తివారలిరువురూ, రాఘవుడు తిలోదకమ్ములు సీతకు విడిచే. అంతఃపురం చేరిన లక్ష్మణుడుని అక్కను చంపిన ఆయుధముతోనే నన్ను చంపుమని భార్య నిలదీయగా, సీతను చంపలేదని చెప్పెను. అయితే దినవారమ్ములు ఎవరికని ఊర్మిళ ప్రశ్నించగా, ఇవి పీడపరిహారములని లక్ష్మణుడు పలికెను. వాల్మీకుని ఆశ్రమమున ఉన్నది వనజాక్షినీతోడని పలికాడు లక్ష్మణుడు. ఆ పలుకులు ఊర్మిళ సంతసిల్లింది. అదేవిధంగా అక్కగారైన శాంత కూడా విషయాన్ని విశదీకరిస్తాడు లక్ష్మణుడు. సీతాదేవికి నెలలు నిండి ఘనముగ కార్తీక మాసమందున, ఘనమైన పున్నమదినముననూ, అందమయిన సప్తమి ఆదివారమునాడూ, ఆరుఘడియలారాత్రివేళ, కన్యతులారాశీలగ్నమందున, కలిగెను బాలుడు వేడుకతోను అని సీత కొడుకు పుట్టిని దినవార లగ్నాలతో సహా జానపదులు తెలిపిరి. అదే సమయంలో లవణాసురుడిని చంపడానికి వచ్చిన భరతునికి జానకి పుత్రుని కన్న విషయం తెలిసి ఆనందపడటంతోపాటు భూదానం, గోదానం, సాలిగ్రామదానం, కన్యాదానం, గజదానం, అశ్వ, స్వర్ణ, అన్న దానాలను ఇచ్చెను. లక్ష్మణ, భరతులిద్దరు వచ్చి పిల్లవాడిని చూసి ‘రూపురేఖలు మనరామునిబోలు, మృదు వేషములు జానకిబోలు, చక్కదనమున చంద్రునిబోలు, సన్నపుమాటలు శాంతను బోలు, వయ్యారమునకు దశరథునిబోలు, శౌర్యానకి శత్రుఘ్నునిబోలవచ్చు అంటూ బాలునికి చేయవల్సిన వేడకలన్నీ జరిపించిరి. వాల్మీకిని నామకరణము చేయమని అడగగా కుశుడని నామము తెలిపిరి.
జానపదులు అల్లిన కుశలవయుల కథలో సీతమ్మ కేవలం కుశుడికి మాత్రమే జన్మనిచ్చింది. ఈ విషయం లక్ష్మణ, భరత, శాంత, కౌసల్యలకు తెలిసినట్టుగా కూడా వారు కథనాలు అల్లారు. జానకీ సుతుడు పెరుగుతుండగా ఒకనాడు పుత్రుని తొట్టెకు పూబంతులు తేవడానికి జానకి చెలికత్తెలతో వెడుతుంది. అంతలో పుత్రుడు ఆకలితో ఏడవటంతో జానకికి పాలుబ్బరించి, వేగంగా సుతుడు వద్దకు వచ్చి బాలుని కూడా తనతో తీసుకువెడుతుంది. అంతలో జపాలు ముగించుకుని వచ్చిన మునులకు తొట్టెలో జానికీసుతుడు కన్పించకపోవటంతో వారు కంగారు పడిరి. ‘జేరి జాణశపించిపోవనుచు, భయమతోచెను మునులందరికి. కుశదర్భకు జీవములు పోసిరి. కుకుడని బాలుని నామమునుంచిరి. పవళించ బెట్టిరిబాలుని. జానకి వచ్చెను చెలికత్తెలతో, తోడనసుపుత్రుడు, తొట్టిన పుత్రుడు. ఇదియేమి అనేను జానకి. వెలది యిద్దరు పుత్రులే నీకు అనిరి.’

ఇలా లవకుశుల జననం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరి భావుకతకు, భావజాలానికనుగుణంగా వారు అనువాద రామాయణాలలోని కథలను మలుచుకొని మూలకథతో విబేధించకుండా, కొత్త కథలను సృషించారు. నిజం గడపదాటేలోపల, అబద్ధం ఊరు చుట్టివస్తుందన్నట్టు వాల్మీకి రామాయణ కంటే అవాల్మీకాలే జనాలను విశిష్టంగా ఆకర్షించి ప్రచారం పొందాయి. ఇంకా లోతుగా విశ్లేషిస్తే, మరిన్ని కథనాలు వెలుగులోకి రావచ్చు.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *