
‘‘పరిత్రాణాయ సాధూనా, వినాశాయచ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ, సంభవామి యుగే, యుగే’’
సాధు పరిత్రాణం, దుష్కృత వినాశం, ధర్మ సంస్థాపన – ఈ మూడు పరయోజనాల సిద్ధికి తాను మళ్లీ, మళ్లీ అవతరిస్తానని భగవంతుడు గీతలో తెలిపాడు. ఎవరీ సాధువులన్నదానికి కూడా భగవంతుడు గీతలో సమాధానమిచ్చాడు. ఆర్త భక్తులు, జిజ్ఞిసువులు, అర్థకాములు మరియు తత్త్వజ్ఞానులు. వీరిని ఉద్ధరించడానికే పరమాత్ముని అవతరాలన్నీ.
మ. సరసిం బాసిన వేయు కాలువల యోజన్ విష్ణునం దైన శ్రీ
కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశజుల్
హరి కృష్ణుండు బలానుజన్ముఁ డెడ లే; దా విష్ణుఁడౌ నేర్పడన్.
సరస్సు నుంచి అనేక కాలువలు ప్రవహించినట్టు శ్రీమన్నారయణుని నుంచి విశ్వశ్రేయస్సుకై అనేకానేక అవతారాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. భూపతలూ, దేవతలూ, బ్రహ్మర్షులూ, మహావిష్ణువు అంశతో పుట్టినవారే అని భాగవతం మనకు చెపుతోంది. భాగవతం తెలిపిన శ్రీమహావిష్ణువు ఏకవింశత్యవతారాలు:
1. యజ్ఞ వరాహావతారం: పూర్వ హిరణ్యాక్షుడనే రాక్షస రాజు తన బలంతో భూమిని చాపవలె చుట్టి, సముద్ర గర్భంలోకి తీసుకు పోయాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు యజ్ఞవరాహ రూపాన్ని దాల్చి, సముద్రగర్భాన ప్రవేశించి, హిరణ్యాక్షుని సంహరించి, భూమిని ఉద్ధరించాడు.
2. సుయజ్ఞావతారం: పూర్వం సుచి అనే ప్రజాపతికి, మనువు కూతురైన ఆకూతికీ ‘సుయజ్ఞుడు’ అనే కొడుకు పుట్టాడు. అతడు దక్షిణ అనే స్త్రీని వివాహమాడగా, వారికి ‘సుయములు’ అనే పేరు గల దేవతలు జన్మించారు. అతడే తదనంతరం సురాధిపతి ఇంద్రుడైనాడు. స్వాయంభువు మనువు తన మనుమడిని శ్రీ హరిగా గ్రహించి, ఆ విధంగానే ప్రకటించాడు.
3. కపిల మహర్షి అవతారం: కర్దమ ప్రజాపతికి, మనువు కుమార్తె అయిన దేవహుతికి పదవ సంతానంగా జన్మించిన కపిలుడు సాంఖ్యయోగాన్ని తన తల్లికి బోధించి, ఆమెకు మోక్షాన్ని ఒసగాడు.
4. దత్తాత్రేయ అవతారం: అత్రిమహాముని తనకు సంతానం భాగ్యం కలిగించమని శ్రీహరిని ప్రార్థించగా, ‘‘పాపరిహితుడైన మునీంద్ర, నేను నీకు దత్తుడనయ్యానని’’ తెలిపి, ఆ మహామునికి పుత్రుడిగా దత్తాత్రేయుడిగా జన్మించాడు. ఆయన పాదపద్మపరాగం వల్ల హైహయ, యదు వంశీకులు జ్ఞాన ఫలాన్ని యోగ బలాన్ని పొంది, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని పొందారు.
5. సనకసనందాదులు: కల్పారంభంలో విశ్వసృష్టికై తపస్సు చేస్తుండగా, బ్రహ్మ నోటి నుండి ‘సన’ అన్న శబ్ధం వెలువడింది. ఆ శబ్ధం నుంచి సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు పుట్టారు. వీరు బ్రహ్మమానసపుత్రులుగా ప్రసిద్ధికెక్కారు. విష్ణుదేవుని కళతో ఉద్భవించిన వీరు నలుగురైనా నిజానికి వారి అవతారం ఒక్కటే. వీరు అంతరించిపోయిన ఆత్మతత్త్వాన్ని మళ్లీ లోకంలో ప్రవేశింపచేశారు.
6. నరనారాయణ అవతారం: ధర్మానికి ప్రతీక అయిన ధర్ముడికి, దక్షుని కుమార్తె ‘మూర్తి’కి జన్మించారు. పవిత్ర మనష్కులైన వీరు పరమపానమైన బదరిగా వనంలో తపస్సు చేసుకుంటుండగా, వారికి తపోభంగం కల్గించడానికి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. ఆ అపర్సాంగనల సౌందర్యానికి చలించకుండా, నరుడు, నారాయణుడు నిశ్చలంగా, నిర్మల మనస్సుతో తపస్సును కొనసాగించారు. వారిపై కోపాన్ని ప్రదర్శిస్తే, తమ తపస్సుకు విఘ్నం కలిగిస్తుందని గ్రహించిన వారు దేవకాంతలపై కోపం ప్రదర్శించలేదు. నారాయణుడు తన ఊరు భాగాన్ని గోటితో చీరగా, ఆ ప్రదేశం నుంచి దేదీప్యమానంగా వెలుగిపోతూ, ఒక కాంత జన్మించింది. నారాయణుని ఊరువు నుంచి వెలువడుట చేత ఆమె ‘ఊర్వశి’ అని పిలవబడింది. దేవకాంతలు ఊర్వశి సౌందర్యాన్ని చూసి సిగ్గుపడి అక్కడ నుంచి వైదొలిగారు. క్రోధాన్ని జయించడం ద్వారా సౌఖ్యాన్ని పొందవచ్చని నిరూపించాడు శ్రీహరి.
7. ధ్రువావతారం: ఉత్తమచరిత్రుడైన ‘ఉత్తానపాదు’డనే రాజుకు ధ్రువుడు జన్మించాడు. సవతి తల్లి సురుచి ఆదరణ కరువై, భగవంతుని కొరకు తపస్సు చేసి, సశరీరంతో ఆకాశంలో మహోన్నతమైన ధ్రువస్థానాన్ని పొందాడు. ఆ స్థానానికి పైన భృగువు మొదలగు ఋషుల, కింద సప్తర్షుల ప్రశంసంలు పొంది ‘ధ్రువుడ’నే పేరుతో విష్ణు సమానుడైనాడు.
8. పృథు చక్రవర్తి అవతారం: వేనుడనే రాజు శాపవశాత్తు సర్వం కోల్పోయి నరాకన్ని పొందాడు. అతని కుమారుడు పృథు. శ్రీహరి కళాంశభవుడు. తండ్రిని పున్నమా నరకం నుండి కాపాడి, భూమిని ధేనువుగా చేసుకుని అమూల్యమైన వస్తువులను పిదికాడు. పృథు కుమార్తె భూమి పృథ్వి అయింది.
9. వృషభావతారం: అగ్నీధ్రువుని కుమారుడు నాభికి సుదేవి లేదా మేరుదేవికి హరి వృషభావతారుడై జన్మించాడు. జడశీలమైన యోగాభ్యాసంతో, ప్రశాంత చిత్తుడై పరమహంసలు పొందదగిన స్థితిని పొంది మహర్షుల ప్రశంసలకు పాత్రుడైనాడు.
10. హయగ్రీవావతారం: మేలిమి బంగారు కాంతితో, వేదస్వరూపుడూ, సర్వాంతర్యామీ, సాటిలేని యజ్ఞపురుషుడు అయిన దేవదేవుడు హయగ్రీవుడు అన్న పేరుతో బ్రహ్మ గావించిన యజ్ఞం నుండి ఉద్భవించాడు. సర్వాన్ని పవిత్రం చేసే హయగ్రీవుని ముకుపుటల నుంచి వెలువడిన శ్వాసవాయువుల నుండి వేదాలు ప్రాదుర్భవించాయి.
11. మత్స్యావతారం: ప్రళయకాలంలో సమస్తం జలమయమయి పోయింది. అది గ్రహించి వైవస్వతమనువు ముందే ఒక పడవలో కూర్చొన్నాడు. అప్పుడు భగవంతుడు మత్స్యావతారాన్ని ధరించి, పడవ సముద్రాన మునగకుండా సంరక్షించి, ఎల్లప్రాణులకు నివాసభూతుడైనాడు. బ్రహ్మ వదనం నుంచి జారిపడిన వేదాలను పునరుద్ధరించి ఆయనకు తిరిగి అందించాడు.
12. కూర్మావతారం: పూర్వం దేవతలు, రాక్షసులూ అమృతం కొరకు మందరగిరిని కవ్వంగా చేసుకుని క్షీరసాగర మథనం చేశారు. ఆ పర్వతం సముద్రాన మునిగిపోయింది. అంత విష్ణువు కుర్మావతారుడై మందరగిని తన వీపుపై నిలబెట్టి సాగరమథనానికి తోడ్పడ్డాడు.
13. నృసింహావతారం: దానవరాజు హిరణ్యకశుపుని సంహరించి, భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి భీతి కొలిపే రూపంతో భగవంతుడు ధరించిన అవతారమిది.
14. ఆదిమూలావతారం: గజేంద్రుడు మొసలి నోట చిక్కి వేయి సంవత్సరాలు దానితో పోరాడి అలసి, సొలసి శ్రీహరి నీవే దిక్కని వేడుకున్నాడు. ఆర్తపరాయణుడైన శ్రీహరి ఆదిమూల స్వరూపుడై మొసలిని చంపి గజేంద్రుని రక్షించాడు.
15. వామనావతారం: యజ్ఞాదిపుడైన విష్ణువు అదితి బిడ్డలలో కనిష్టుడిగా జన్మించాడు. వామనాకారంలో బలిచక్రవర్తిని మూడడుగలు నేల యాచించి, మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించాడు. గురువు మాటలను కూడా లక్ష్యపెట్టక, పరమదాతైన బలి వామనుని పాదపద్మాలు కడిగి, తన సమస్తాన్ని అర్పించి, యశస్సును పొందాడు.
16. హంసావతారం: నారదుని భక్తికి మెచ్చి, అతని కోరిక మేరకు హంసరూపాం దాల్చి, ఆత్మతత్త్వాన్ని తెలిపే భాగవత మహాపురాణాన్ని ఉపదేశించాడు. తదనంతరం మనువుగా అవతారమెత్తి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావించాడు. అలాగే, తన నామస్మరణతోనే భూమి మీద జనులందరి రోగాలను రూపుమాపే ఆయుర్వేద విద్యను ధన్వంతరిగా అందించాడు.
17. పరుశురామావతారం: లోకవిరోధులుగా మారిని హైహయ రాజులను హతమార్చడానికి జమదగ్ని సుతుడు భార్గవరామునిగా అవతారమెత్తి 21మార్లు రణరంగంలో తన గండ్రగొడ్డలితో వారిని తుదముట్టించి, భూమండలాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చాడు.
18. రామావతారం: చక్రధరుడైన శ్రీ మహావిష్ణువు జగదభిరాముడైన శ్రీరామునిగా రఘువంశాన దశరథ మహారాజుకు జన్మించాడు. జనకమహారాజు పుత్రిక సీతను పెండ్లాడి, తండ్రి ఆన మీర అడవులకు వెళ్లాడు. సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడైన రామభద్రుడు ఖరుడు, వాలి వంటి యోధులను సంహరించాడు. సీతను చెర పట్టిన రావణుని అంతమొందించడానికి సముద్రంపై వారధి కట్టి, రాక్షస గణాలతో నిండివున్న లంకను భస్మీపటలం గావించి, రావణుని హతమార్చాడు. ధర్మాన్ని రక్షించి, జన రక్షణకుడైన సుగుణాభిరాముడు లోకప్రియుడైనాడు.
19. కృష్ణావతారం: రాక్షసాంశతో పుట్టిన అనేక రాజుల అధర్మాలని భరించలేక విముక్తిని ప్రసాదించమని భూమాత శ్రీమన్నారాయణుని వేడుకుంది. అంత పరమాత్ముడు యదువంశ శిరోమణి వాసుదేవునకు రోహిణి, దేవకి అనే భార్యల యందు తన తెల్లని వెంట్రుకతో బలరామునిగా, నల్లని వెంట్రుకతో కృష్ణునిగా అవతరించాడు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సాక్షాద్విష్ణు స్వరూపుడైన శ్రీ కృష్ణుడు మానవాతీత కార్యాలెన్నో ఒనరించి పరమాత్ముడయ్యాడు. పొత్తుల బిడ్డగా పూతనని, మూడునెలల పిల్లవాడిగా శకటాసురుని, తదుపరి జంట మద్దులను నేలగూల్చి అందరి చేత కీర్తింపబడ్డాడు. తల్లి యశోద అజ్ఞానాన్ని రూపుమాప, సకలచరాచర ప్రాణులను, అరణ్యాలు, నదీనదాలు, పర్వతాలు, సముద్రాలతో కూడిన జగజ్జాలాన్ని తల్లికి తన నోటిలో చూపి సంభ్రమాశ్చర్యాన్ని కల్గించాడు. కాళీయ మర్ధనం, వ్యోమాసుర సంహారం, గోవర్ధన గిరినెత్తడం, బృందావనంలో రాసలీలలు, గోపికా సంరక్షణ పరమాత్ముని లీలావిశేషాలలో మచ్చుతునకలు. ఆ పరమాత్ముడు, నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడమనే ఏనుగు, ముష్టికుడు, చాణురుడు మొదలైన మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్త్రుడు, ద్వివిదుడు అనే వానరుడు, గర్దభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, కేశి, దర్దురుడు, వృషభాకారాలు గల ఏడుగురు దనుజులు, ధేనుకుడు ఇలా అనేకమంది రాక్షసులను రూపుమాపి భూభారాన్ని తగ్గాంచాడు.
20. వ్యాసావతారం: ప్రతీ యుగంలోనూ అజ్ఞానంతో అధోగతి పాలయ్యే మనుష్యులనేకులుంటారు. వారిని ఉద్ధరించడానికి సజ్జనస్తుతి పాత్రుడైన పరాశర మహర్షి పుత్రుడైన వ్యాసునిగా జన్మించి వేదవృక్షాన్ని శాఖోపశాఖాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు.
21. బుద్ధావతారం: చపల స్వభావులూ, అసత్యవాదులూ, భేదాచారపరాయణులూ, అధర్మనిరతలూ, శుద్ధ పాషాండులూ అయిన దైత్యులను బుద్ధుడిగా అవతరించి అంతమొందించాడు.
22. కల్క్యావతారం: కలియుగంలో వేదవిహితమైన యజ్ఞయాగాది కర్మలు నశించి, నాస్తికత్వం ప్రబలుతుంది. అలాంటి పరిస్థితులలో అధర్మాన్ని తొలగించి, ధర్మస్థాపన చేయడానికి పరమాత్మ కల్కిగా అవతరిస్తాడు.
ఇవి క్లుప్తంగా శ్రీమన్నారయణుని లీలావిశేషాలు.
తేటగీతి