సరదా, సరదా సామెతలు!

పెద్దవాళ్లు ఏదైనా మాట్లాడే ముందు ‘ఏదో సామ్యం చెప్పినట్టు’ అనడం కద్దు. ఈ సామ్యం లేదా సామ్యత నుంచి వచ్చినదే ‘సామెత.’ సామెతనే లోకోక్తి లేదా నానుడి అని కూడా అంటారు. సామ్యత అంతే పోలిక, ఒక ఉదాహరణ, ఒక దృష్టాంతం. “లోకోక్తిముక్తావళి” అనే సంకలనం ఉపోద్ఘాతంలో సామెతను ఈ విధంగా నిర్వచించారు — సంస్కృతమున “లోకోక్తులు” లేదా “న్యాయములు” అనువానిని తెలుగున “సామెతలు” అందురు. లోకోక్తి అనగా విశేష లోకాభిమానం గల పెద్దల మాట.

ప్రతి సామెత పుట్టుకకూ మూలమై తప్పనిసరిగా చిన్నదో, పెద్దదో ఒక కథ ఉంటుంది. బ్రౌణ్య నిఘంటుకారులు దీనినే తమ నిర్వచనంలో ‘సంగతి’ అన్నారు. ఈ కథకు లేదా సంగతి కి అత్యంత సంక్షిప్త రూపంగా సామెత పుడుతుంది. ప్రజల జీవిత వైవిధ్యానికి ప్రతీకలు సామెతలు. మన జాతీయాలు, పొడుపుకథలు ఏవిధంగానైతే మన సమాజం తీరుతెన్నులపై, ప్రజల జీవిన విధానంపై ఆధారపడి ఏర్పడ్డాయో అదేవిధంగా సామెతలపై కూడా మన ఇతిహాసాలు, పురాణాలు, సమాజం ప్రభావం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంది. ‘రామాయణంలో పిడకల వేట’, ‘రామాయణం అంతా విని రాముడికి సీతేమవుతుదంని అడిగినట్టు’, ‘వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి’, ‘భారతం బొంకు, రామాయణం రంకు’ ఇలా అనేక సామెతలు మన ఇతిహాసాల నుంచి పుట్టుకొచ్చాయి.

కొన్ని సామెతలు సూక్తుల్లాగా నిర్ధిష్టంగా ఉంటాయి. ఉదాహరణకు, పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము, అడగందే అమ్మయినా పెట్టదు, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు, అందని ద్రాక్షపళ్లు పుల్లన, ఉన్న మాటంటే ఉలుకెక్కువ, మౌనం అర్ధాంగీకారం మొదలైనవి. అలాగే సామెతలు హాస్యంతో కూడినవి, ప్రశ్నలుగానూ, సంభాషణాత్మకంగానూ కూడా ఉంటాయి. సామెతల్లో మనకు ప్రాస ఎక్కువగా కన్పిస్తుంది. పద్యాల్లో యతిలాగా మొదటి భాగం మొదటి అక్షరంతో సమానమైన అక్షరం రెండో భాగం మొదట కన్పిస్తుంది. ఇక రెండు, మూడు వాక్యాల్లో కూడా సామెతలుంటాయి. ఇరవై పదాలకంటే ఎక్కువ ఉంటే అంది సామెతకాదని భాషాకోవిదుల అభిప్రాయం. కొన్నిసార్లు అనుభవాత్మకంగా, మరికొన్నిసార్లు అన్యాపదేశంగా, ఇంకొన్నిసార్లు సోదాహరణంగా కటువైన విషయాన్ని సుతిమెత్తగా సామెతలు తెలియచేస్తాయి. పైన ఉదహరించిన లక్షణాలు గల సామెతలను గమనించండి.

  • అందరూ అందలమెక్కితే మోసేవాడెవడు?
  • తాయెత్తుకు పిల్లలు పుడితే తానెందకు?
  • బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ
  • ఎక్కడైనా బావగానీ వంగతోటలో బావ కాదు
  • రోట్లో తలపెట్టి రోకటి పోటికి జడవటం ఎందుకు
  • మొక్కై వంగనిది మానై వంగునా
  • బాల వాక్కు బ్రహ్మ వాక్కు
  • తేలు తేలండీ అని అరస్తే, మొగవాళ్లను పిలవ్వే అన్నాడట. మీరు మొగవారే కదా అని
  • పెళ్లామంటే, సమయానికి జ్ఙాపకం చేశావు కర్ర తెమ్మన్నాడట
  • గొడ్డలి ఎక్కడ పెట్టినావురా అంటే కొట్టే చెట్టు దగ్గిర, కొట్టే చెట్టు ఎక్కడుందిరా అంటే గొడ్డలి దగ్గర అన్నాడట.

అలాగే మన కావ్యాలు, శతకాల్లోని సూక్తులు కూడా సామెతలుగా చెలామణీ అవుతున్నాయి. ఊరక రారు మహాత్ములు, పదుగురాడు మాట పాటియై ధర జెల్లు, తన కోపమే తన శత్రువు మొదలైనవి. సినిమాలు మన జీవితంపై ఎంతాగానో ప్రభావం చూపిస్తాయనడానికి తార్కాణమే, సినిమాల్లో హిట్ అయిన డైలాగులు సామెతలుగా చలామణీ కావడం. ఉదాహరణకు, సాహసము సేయరా డింభకా, అల్లొల్లొల్లొ – జోగినాధం గారా, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, )నీవూరికొచ్చా! నీవీధిలోకొచ్చా! నీ యింటికొచ్చా, అంతొద్దు.., నీ యంకమ్మా!, వెళ్ళవయ్యా వెళ్ళు, సుత్తి కొట్టకు, మడిసన్నాక కుసంత కలాపోసనుండాలి.

బహుళ ప్రాచుర్యంలో ఉన్న కొన్ని సామెతలు:

అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

ఇంట గెలిచి రచ్చ గెలువు

ఇల్లు పీకి పందిరేసినట్టు

కందకు లేని దురద కత్తిపీటకెందుకు

చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

కుక్క కాటుకు చెప్పుదెబ్బ

కోటి విద్యలు కూటి కొరకే

నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

పిట్ట కొంచెము కూత ఘనము

రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

వాన రాకడ ప్రాణపోకడ

కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

ఆది లొనే హంస పాదు

ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు

అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు

అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్లు

అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

బతికుంటే బలుసాకు తినవచ్చు

బెల్లం కొట్టిన రాయిలా

చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు

చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

విద్య లేని వాడు వింత పశువు

డబ్బుకు లోకం దాసోహం

దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

దాసుని తప్పు దండంతో సరి

దెయ్యా గంతకు తగ్గ బొంత

గుడ్డి కన్నా మెల్ల మేలు

గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

గోరు చుట్టు మీద రోకలి పోటు

జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట

ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

కలిమి లేములు కావడి కుండలు

కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

కీడెంచి మేలెంచమన్నారు

కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

మొక్కై వంగనిది మానై వంగునా

మొరిగే కుక్క కరవదు

నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

నవ్వు నాలుగు విధాలా చేటు

ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం

పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

రౌతు కొద్దీ గుర్రము

చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు

శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!

ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు

ఇలా చెప్పకుంటూ పోతే కొన్ని వందల, వేల సామెతలున్నాయి. సామెతలను సందర్భానుసారంగా ఉపయోగించడం ఒక కళ. మన సమాజానికి, నాగరికతకు, సంస్కృతికి అద్దంపట్టే సామెతలు కాలక్రమేణా మన సంభాషణల నుంచి తెరమరుగవుతున్నాయి. నాగరికతలో మార్పులు వచ్చినప్పుడల్లా మన సామెతలు మారుతున్నాయి, వాటి వాడకము తరుగుతోంది.


సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *