శతక సాహిత్యం - 2

అధిక్షేప శతక కర్తలలో ఆద్యులు కవిచౌడప్ప, వేమన, కూచిమంచి సోదరులు, అడిదము సూరకవి అనువారు ప్రముఖులు. చౌడప్ప ఆనాటి మండలేశ్వరుల, అధికారుల, ధనికుల అభిరుచినే ఆయుధముగా గ్రహించి, వారి పద్ధతి లోనే బూతులలో నీతులు చొప్పించినాడు. బూతులు కేవలం ఆశ్లీలోక్తులు కావు. వ్యంగ్య చమత్క్రుతులతో, కవితా సంపదతో, అధిక్షేపాత్మకమైన నీతిబోధనలతో పూర్ణములయినవి. ఆతని రచనలలో ,భావ వ్యక్తీకరణలో, కొరడావంటి చురకులు కనిపిస్తాయి.

మీసము పౌరుషము, సాహసము, దానధర్మము, ఉదాత్త వ్యక్తిత్వమునకు చిహ్నము. ఈ గుణలేవిలేకుండా నేను మగవానిని కదా,మీసము పెంచుకుంటాను అని విర్రవీగే వారినుద్దేశించి చౌడప్ప చెప్పిన పద్యమిది.

‘ఇయ్యగ నిప్పించ గల
యయ్యలకే గాని మీసమందరి కేలా
రొయ్యకులేదా బారెడు
కయ్యానికి కుందరపుకవి చౌడప్ప’

చౌడప్ప సరసమైన ఉపమాన దృష్ట్యాంతాలతో తన కాలం నాటి పరిస్ఠితులను సమీక్షించి, స్థిర కీర్తినార్జించినాడు.

ఆధునిక అధిక్షేపాత్మక రచనలలో తిరుపతి కవుల శాంకరీ శతకము, ఏటుకూరి సీతారామయ్య రామభద్ర శతకము, శ్రీ శ్రీ సిరిసిరి మువ్వ శతకము,విశ్వనాథ వారి పంచశతీ, నార్లవారి మాట మొదలైనవి అసంఖ్యాకములు.

శతక పద్యరూపమున సుకుమార హాస్యమునందించిన వారిలో వేమన అగ్రగాణ్యుడు. హాస్యము, చమత్కారము గర్భితమైనవి హాస్య శతకములు. తెలుగులో పకోడి, చీపురుపుల్ల, విసన కర్ర శతకములు హాస్య శతకములుగా పరిగణింపబడుచున్నవి.

వివాహా సందర్భములలో తలంబ్రాలు, అక్షతలు ఉపయోగించుట ఆచారము. మంగళకరమైన అక్షతలు వచ్చి వెళ్లెవారి కాళ్ళ క్రింద నలిగి పోతుంటాయి. వాటికి బదులుగా పకోడీలు చల్లితే అతిధులు వానివి త్రొక్కక తీసుకొని తింటూ హాయిగా కూర్చోవచ్చునని, వధూవరులకు పకోడీల దండలు వేస్తే ఒకటి రెండు నమలుకుంటూ కాలక్షేపం చేయవచ్చుననీ కవి ఈ పద్యంలో సూచించటం హృద్యంగా ఉన్నది. వర్ణనలోని వ్యంగ్య చమత్కృతి హాస్య ప్రధానమైనది.

నవయువకుల పెండిండ్లకు
తమనీతో చేయబడ్డ దండలు మేలై
జవరాండ్రు సంతసింతురు
ప్రవిమల సత్కీర్తు లబ్బుర హినిప కోడే.

ఈ శతక కర్త ఎవరో తెలీదు. కాని 1925లో ఆంధ్ర జాతీయ మండలి వారు ఈ శతకమును ప్రకటించినారు.

తత్వశాస్త్రము సముద్రము వలె గంభీరమైంది. అగాధమైన శాస్త్ర విశేషాలను తత్వవేత్తలు గంభీర ధోరణి పెట్టినట్లు తెలిపినారు. సాధారణంగా భక్తి శతకాల్లో తత్వోపదేశము చేసిరి. తత్వ శతకములలో వైరాగ్య శతకములు ఒక ప్రధాన వర్గము. 16వ శతాబ్ధి నుండి తత్వ శతకములు బహుళముగా వెలువడినవి. ఇందు ఆద్యమైనది సదానందయోగి శతకము.

నీట గలిగిన లవణంబు నీట గలియ
నీరుగాకుండదా విధి నిశ్చయముగ
శివుని గలిసిన జీవుండు శివుడుగాడె
నవ్యతర భోగి శ్రీ సదానందయోగి.

అన్వయ కాఠిన్యము లేక జీవన తత్వాన్ని సుపరిచతమైన ఉదాహరణాలతో వ్యక్తీకరించినాడు. వీటితో సిద్ధమైన ఉప్పు నీటిలో కలసి నీరే అగును. శివాంశ సంభూతుడైన జీవుడు శివుడిలో ఐక్యము నొంది శివుడే అవుతాడని సదానందయోగి స్పష్టమొనర్చినాడు. యోగ రహస్యమ లను బహుళ ప్రచారము చేసిన వారిలే వేమన ప్రముఖుడు. సంపంగిమన్న శతకము, శివ ముకుంద, హంస, రాజయోగి వంటి శతకములు శతాధికములుగా వెలువడినవి.

దేశచరిత్రకు కాని, చరిత్రలోని కొన్ని ప్రధాన సంఘటనలాధారంగ రచింపబడినవి చారిత్రక శతకాలు. ఇందు కాసుల పురుషోత్తమ కవి విరచితమైన ఆంధ్ర నాయక శతకము, గోగులపాటి కూర్మనాధుని చేవ్రాయబడ్డ సింహాద్రి నారసింహ శతకము, భల్లా వేరయ కవి భద్రగిరి శతకము రచనావిధానమనుసరించి వ్యాజోక్తి ప్రధానములైనా వస్తువుననుసరించి చారిత్రకములే.

18వ శతాబ్దిలో జీవించిన కాసుల పురుషోత్తమ కవి ఉత్సవ పూజాదులు లేక జీర్ణావస్తనొందిన శ్రీ కాకుళాలయ దుస్థితిని చూసి ఉద్విగ్న మనస్కుడైన శ్రీ హరి ఆశక్తతను వ్యాజోక్తులతో విమర్శించెను. ఈ శతకంలోని ఈ పద్యాన్ని పరిశీలిస్తే నిందాస్తుతి ప్రధానమైన వ్యాజోక్తిలో కవి ఎంతటి సిద్ధహస్తుడో తెలియును.

ఆలు నిర్వాహాకురాలు భూదేవియై
యఖిల భారకుడను వాఖ్యదెచ్చె
నిష్ట సంపన్నురాలిందిర భార్యయై
కామితార్దదుడన్న ఘనత దెచ్చె
గమల గర్భుడు సృష్టికర్త తనూజుడైన
బహు కుటుంబకుడన్న బలమిదెచ్చె
గలుష విధ్యంసిని గంగ కూమారియై< పతిత పావనుడన్న ప్రతిభదెచ్చె నాండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిగాని మొదటి నుండియు నీవు దామోదరుడవె! చిత్ర చిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ హాత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!

పనిపాటలు లేక పాల సముద్రమువై ఆదిశేషువు శయ్యగా శయనించిన విష్ణువు సతీసుతుల కీర్తి సంపదలతో హాయిగా ఉన్నాడని నిజంగా మొదటి నుండి ‘దామోదరుడే’ అని పరిహసించటంలోని రామణీయకము, వ్యంగ్యము వర్ణణాతీతము. పురుషోత్తమకవి నిందాస్తుతి ప్రతి పద్యంలో సరసమైన నుడికారంతో సాగింది.

శతక వస్తువును విస్తృతమొనర్చి శతకమునకు నవ్వత కూర్చుట కొనర్చిన ప్రయత్న ఫలితమే భాషావ్యాకరణ, నిఘంటు ప్రహేళికా శతకములు. భాషావాయకరణాంశములకు సంబంధించ న శతకములలో తాళ్ళపాక తిరుమలాచార్యుల ‘రేఫ ఱకారము’ అనునది సంపూర్ణ శతక లక్షణములు గల కృతి. మకుటాత్మకమగు పద్యము లిందు 108 కలవు. సాధరేఫ (ర) శకట రేఫ (ఱ)ల భేదములు, లక్షణములు ఇందు వివరింపబడినవి.

గిడుడు సీతాపతిగారు భారతీశతకమున ప్రాచీన కవులు ప్రయోగించిన వ్యావహారిక పదములు, వైరి సమాసములు మొదలగు వానిని గూర్చి చర్చించినారు.

సంస్కృతమున ప్రహేళికల వంటివి కట్టు పద్యములు. కట్టు పద్యములు కాలక్షేపమునకు, వినోద విజ్ఞానములకు, ఊహాశక్తిని పెంపొందించుటకు తోడ్పడును. ఇట్టి వాటిలో చావలి పూర్ణదాసు కట్టు పద్యముల శతకము, వికటకవి వెంకటదాసు అమాత్రార్ధ శతకము, బూరెల సత్యనారాయణ మూర్తి తిరుమలేశ శతకము, నాగభూషణ కవి గానలోల శతకములు ప్రధానముగ పేర్కోనదగినవి.

శతకము ముక్తక లక్షణము నుంది కథాత్మక శతకములలో ముక్తమైనది. శతక వాఙ్మయంలో ఇదొక వికాస ఘట్టము. శతకర కర్తలు ఇతిహాస పురాణ గాధలనే గాక జీవిత కథలను కూడా శతక రూపమున గూర్చినారు. వీనిలో విశిష్టమైనది ఆత్మకథాత్మక శతకము. తెలుగులో ఆత్మకథ శతక రూపమున వెలువడుట శతక వాఙ్మయ విశిష్టతను చాటుచున్నది. ఇట్టి శతకమును రచించిన ఘనత మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారిది. వీరు తమ 60వ ఏట హరిహరేశ్వర శతకము రచించి తెలుగు శతకాలకొక అలంకారమును ప్రసాదించిరి.

ప్రతి సంవత్సరమునం దప్పక నేయు చొప్పున
శ్రీరంగరాయ ధాత్రీభవుండు
పచరించు గుర్రపు బందె ముల్గవ బోయి
వచ్చునపుడు రథభ్రంశమొంది
నేలవైదుల, డాకాలు, డాకీలును,
గీలునుండి తొలంగి డీలువడుచు
రా, విరోధి శరచ్ఛరన్నవరాత్రాది
దినమాది మరణవేదనను బొంది

తదము శాంతికై ద్రైపదేంద్ర గురుచరిత
మైదు నూర్ల నల్బది నాలుగడుడులు గల
వృత్తమిరువది నాళ్ళ కల్పింపలేదె
హరి హరేశ్వర దేవ మహానుభావ.

పార్వతీశ్వర శాస్త్రిగారు ఆత్మకథను దినచర్యరూపమున సందర్భానుసారముగా తన జీవితములోని సాహిత్య జీవితాన్ని ఇతర విశేషములను తమ వ్యక్తిత్వమును చిత్రించుట ఈ ఆత్మకథలోని ప్రధాన లక్షణము. సంస్థానాధీశ్వరులతో దేశాటన చేయుట, ప్రభువులతో ఇష్టాగోష్టి సలుపుట, వారితోపాటు గుఱ్ఱపు పందెములను చూచుటకు వెళ్ళిన సందర్భమున జరిగిన సంఘటన ఈ పద్యములో ప్రస్తావించబడింది. కొక్కొండ వెంకటరత్నంగారి బిల్వేశ్వర శతకము కూడా ప్రశస్తమైన ఆత్మకథా శతకము.

వివిధ భాషల నుండి శతకములను అనువదించిన వారిలో శ్రీ నాధుడు ప్రధమగణ్యుడు. హలుని గాధా సప్తశతిని ఈతడు ఆంధ్రీకరించినాడు. కానీ నేడది అలభ్యము. ఆధునికులలో దాని నాంధ్రీకరించిన వారిలో లక్ష్మీనృసింహ శాస్త్రిగారు, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మగారు ప్రముఖులు. ధ్వని, శృంగార ప్రధానములగు అమరుక శ్లోకములను పలువురాంధ్రీకరించిరి. వీరిలో తాళ్ళపాక తిరువేంగళనాధుడు. శిష్ఠు సర్వశాస్ర్తి, మండపాక పార్వతీశాస్త్రి, జయంతి రామయ్య పంతులు మొదలైనవారు పేర్కొనదగినవారు.

భర్తృహరి సుభాషిత త్రిశతిని అనువదించిన వారిలో ఎలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణకవి శతకాలు ప్రశస్తమైనవి.

శంకరాచార్యుల శివానందలహరిని, సౌందర్యలహరిని, శతకరూపంలో అనువదించిన వారిలో సర్వారాయుడు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, శ్రీపాద కృష్ణమూర్తి, సౌందర్యలహరిని అనువదించిన వారిలో సోమంచి వాసుదేవరావు, మద్దూ శంబయ్య, దర్బా సుబ్రమణ్యశర్మ, పురాణం కూమార రాఘవశాస్త్రి, బూర్గల రామకృష్ణారావు మున్నగు వారు పేర్కొనదగినవారు.

ప్రాకృత, సంస్కృత భాషలతోపాటు హిందీ మున్నగు భాషలలో వెలువడిన ప్రశస్త శతకములను అనువదించి శతక వైశిష్ట్యము ఇనుమడింపచేసిరి. బీహారి కవి గాధాసప్తశతిని ఒరవొడిగా గ్రహించి హిందీ భాషలో ‘బీహారీ సత్సయీ’ కావ్యమును రచించెను. ఇది హిందీ శతక సాహిత్యములో మకుటాయమానమైన రచన. చల్లా లక్ష్మీనారాయణ శాస్త్రిగారు ‘విరివాన’గా అనువదించారు. బీహారీ కవి ధ్వని, శృంగార ప్రధానమైన ముక్తక వైశిష్ట్య మెట్టిదో శాస్త్రిగారు తమ అనువాదంలో

వ్యయము తగ్గించుకొన లోభియే మామ
చిట్టిచేతుల బిచ్చము పెట్టుమనుచు
గోడలని నిల్పి బురిలోని కోడేగండ్రు
బిచ్చగాండ్రౌచు మూగిరి బిచ్చమునకు.

మామగారి లోభగుణాన్ని కోడలి సౌందర్యాన్ని రమణీయంగా వ్యంగ్యంగా చిత్రించినారు.

కొందరు తెలుగు శతకములను ఇతర భాషలలోనికి అనువదించి శతక వైశిష్ట్యమును చాటుటకు ప్రయత్నించిరి. ప్రాచీనకాలంలో మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారమును కన్నడంనందు అనువదించినట్టు పండితుల విశ్వాసము. ఆధునికులలో అల్లూరి రామశాస్త్రిగారు సుమతి శతకమును కన్నడభాషలోనూ, వేమన పద్యాలను బ్రౌను పండితుడు ఆంగ్లములోనికి, శ్రీ రామశర్మగారు హిందీలోనికి, శ్రీ రామప్పగారు ఉర్దూభాషలోనికి అనువదించారు. విశ్వనాధవారి మధ్యాక్కరలలో కొన్నింటిని ఖండవల్లి లక్ష్మీరంజనముగారు ఆంగ్లములోనికి అనువదించినారు. సంస్కృతము, కన్నడము, తమిళము, ఆంగ్ల, ఉర్దూ భాషలలోనికి అనువదించబడి తెలుగు శతకములు ప్రశస్తిని చాటుచున్నవి.

వివిధ వస్తు శతకములలో సంకలన, సమస్యాపూరణ, స్మృతి, వర్ణనాత్మక, శాస్త్ర శతకములనునవి ప్రధానముగా గమనించదగినవి. కొందరు పండితులు వివిధ కవులచే రచింపబడిన పద్యములను నొకచో కూర్చి సంకలన గ్రంధముగా ప్రకటించియుండిరి. ఇవి సంకలన శతకములుగా పరిశీలింపబడుచున్నవి. ఇందు పతివ్రత, మల్లికార్జున, చాటు శతకములు ముఖ్యమైనవి. శ్రీ ఆదిభట్ల నారాయణదాసు, మేడేపల్లి వేంకటరమణాచార్యులు, నిడదవోలు సోమసుందరము ప్రభృతులు శతక రూపమున సమస్యాపూరణము గావించిరి. విశ్వనాధవారు సతీవియోగమున వ్రాసిన ‘‘వరలక్ష్మీ త్రిశతి’’ని స్మృతి శతకముగా పరిగణించవచ్చును. వర్ణనాత్మక శతకములలో త్యాగి రచించిన హిమగిరి శతకము, వారకామినీ (మారువాడ కృష్ణమూర్తి) శతకములు పరిగణించదగినవి.

వస్తు వైలక్షణ్యము బట్టి అమృతాంజన శతకము ప్రత్యేకముగ పరిశీలింపదగినది. వివిధ వస్తుక శతకములలో రామలక్ష్మణ ప్రశ్నోత్తర శతకమత్యంత విశిష్టమైనది.

తెలుగు శతకము వలె ఏ భాషలోనే శతకము శాఖోపశాఖలతో వికాసమందలేదు. అతి సామాన్య వస్తువు నుండి ఆత్మ, పరమాత్మల తత్వము వంటి అంశాలు కూడా శతకమందు చోటుచేసుకొంటున్నాయి. అఖిల భారతస్థాయిలో విశ్వనాధ మధ్యాక్కరలకు పట్టము గట్టి తెలుగు శతక వైశిష్ట్యమును లోకమునకు చాటినారు.

దేవులపల్లి శేష భార్గవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *