రామాయణం కాలంలో విద్య

మన వేదాలను, ఉపనిషత్తులను తరిచి చూస్తే నేటి ఆధునికయుగంలో కన్పించే అనేకానేక శాస్త్రవిజ్ఞాన విశేషాలు మనకు కన్పిస్తాయి. వీటి గురించి నేడు మనకు అంటే సామాన్య ప్రజానీకానికి తెలిసింది అణుమాత్రమే. మన పురాణాలు మనకేమిచ్చాయి అనే చచ్చు ప్రశ్నొకటి అడగటం నేడు మనం అలవాటు చేసుకున్నాం. ఆ విషయాలను గ్రహించడానికి మనకు ఆయా పురాణాలు చదవే నైపుణ్యమేది? అలాని పెద్దలు చెపితే వినే ఓర్పులేదు. నేడు కనుమరుగవుతున్న సంస్కృత భాషలో ఆనాడు పండిత, పామరులు కూడా మాట్లాడేవారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, సుందరకాండలో హనుమంతుడు సీతమ్మవారితో ఏ విధంగా మాట్లాడాలి అన్న సందర్భంలో ఊటంకిస్తాడు. హనుమంతుడు సంస్కృత భాషకు గల మూడు స్వరూపాలను పేర్కోన్నాడు. ‘మానుషీ సంస్కృతం’ – జన సామాన్య వ్యావహారిక భాష, ‘ద్విజాతి సంస్కృతం’ – శిష్ట బ్రాహ్మణుల భాష, ‘వానర సంస్కృతం’ – దక్షిణదేశ అపభ్రంశ రూపం. ఒకనాడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న భాష నేడు నామమత్రంగా మన సమాజంలో మిగిలిపోయింది. అలాగే నాడు చెప్పిన శాస్త్రాలు నేడు వివిధ రూపాల్లో మనముందు ఉన్నా వాటిని గుర్తించే యోగం మనకు లేదు. రామాయణంలో గ్రాంధిక, వ్యావహారిక సంస్కృత రూపాలు రెండూ మనకు గోచరిస్తాయని పండితులనేకులు నిరూపించారు.

రామయణంలోని ప్రారంభ శ్లోకాలలో వాల్మీకి నారదునితో తన కావ్యనాయకుడు శరీరం, మనస్సు, ఆత్మలలో పరిష్కృత గుణాలను కలిగినవాడై ఉండాలని విన్నవించాడు. వాల్మీకి దృష్టిలో ఆదర్శపురుషుడు – గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, పరోపకారి, సత్యభాషి, ద్రుడప్రతిజ్ఞగలవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, క్రోధాన్ని జయించువాడు, భూతదయగాలవాడు, యుద్ధంలో అజేయుడై ఉండాలి.

అందుకేనేమో, రామాయణ కాలంలో విద్య మొదటి ఉద్దేశం శారీరిక శక్తిని పెంపొందించుకోవడం. ప్రాచీనార్యులు ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక విద్య రెండో ఉద్దేశం విద్యార్ధులకు ఒకే విషయాన్ని బోధించటంతోపాటు అనేక శాస్త్రాలలో విపుల జ్ఞానాన్ని కల్గించటం. అందుకే నాటి విద్యా పాఠ్యక్రమాన్ని ముఖ్యంగా నాలుగు విధాలుగా విభంజిచారు. శారీరికం, బౌద్ధికం, వ్యావహారికం మరియు నైతిక పాఠ్యక్రమం.

శారీరిక విద్యలో విద్యార్ధికి వ్యాయామం, వేట, యుద్ధపద్ధతుల ద్వారా బలం, శక్తి కల్గించడం నేర్పేవారు. యుద్ధవిద్యను ‘ధనుర్వేదమ’ని పిల్చేవారు. ఇందు అన్ని శస్త్రాస్త్రాలను విద్యార్ధులకు నేర్పించేవారు. అందుచేత ఈ విద్యను ‘అస్త్ర విద్య’అని కూడా పిల్చేవారు. అలాగే ఏనుగు, గుర్రపు స్వారీలలో కూడా తర్ఫీదునిచ్చేవారు. ఇక బౌద్ధిక విద్యలో భాగంగా వాఙ్మయాన్ని గూర్చిన జ్ఞానాన్ని విద్యార్ధులకు నేర్పేవారు. ఇందు అన్ని విధాలైన శాస్త్రాలు, కళలు , అర్ధశాస్త్రం, రాజనీతి మొదలైనవి పాఠ్యాంశాలు. శాస్త్రీయ విద్యలల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలు, కల్పం, వ్యాకరణం , నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం ప్రముఖంగా చెప్పేవారు.

వాఙ్మయ విద్యలో భాగంగా కావ్యాలు, ఆఖ్యానాలు, పురాణాలు, మిశ్రమ భాషలు , తర్క, న్యాయశాస్త్రాలు పేర్కొనదగినవి. మనదేశంలో ప్రాచీనకాలం నుండి అర్ధశాస్త్రం ప్రముఖంగా చెప్పేవారు. వ్యవసాయం, వ్యాపారం, పశుపాలన అర్ధశాస్త్రంలో భాగాలు. రాజనీతి, అర్ధశాస్త్రాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని పోయి ఉండేవి. చిత్రకూటంలో రాముడు భరతునికి రాజధర్మాలను ఉపదేశిస్తూ చెప్పినదంతా తరిచి చూస్తే రాజనీతి, అర్ధశాస్త్రమే, పాలనాపద్దతులే. నేడు మన పార్లమెంటుల్లో మెజారిటీ సాధించటమనే ప్రక్రియ ఆనాటి ఆనవాయితీ. ‘బాహ్మణాజన ముఖ్యాశ్చ పౌర జానపదైః సహ సమేత్యతే మంత్రయితుం సమతాగత బుద్ధయః’, ఈ శ్లోకంలో రాముని తన వారసునిగా ప్రస్తావిస్తూ దశరధుడు సభలో తీర్మానం ప్రవేశపెట్టగా, సభలోని ప్రముఖులందరూ పరస్పరం చర్చించి రాముని యువరాజ్యాభిషేకానికి ఆమోదముద్ర వేశారు. నేడు మనం ఎంతో గొప్పగా చెప్పుకునే డెమక్రసీ అనాడే ఉండేదనడానికి ఇంతకంటే ప్రామాణం వేరనవసరం. తరిచి చూస్తే, నేడు మనం అవలంబించే, ఆధునిక నాగరికతకు ప్రామాణాలు అని చెప్పదగ్గ అనేకానేక పద్దతులు ప్రాచీన భారతంలో స్వాభావికాలు.

ఇక నైతిక విద్యకు వస్తే, పవిత్రాచరణ, సత్యం, కర్తవ్యపాలనం, ఇంద్రియ నిగ్రహం ఉత్తమ విద్యార్ధులకు లక్షణాలుగా భావించేవారు. నేటి కలికాలంలో వీటికి విలువలేదు కనకనే వీటికి మనం ప్రాముఖ్యతనివ్వట్లేదు. మౌఖికాభ్యాసం ఆనాడు ప్రముఖంగా ఉన్నప్పటికీ లేఖన విద్య కూడా అంతే విలువనిచ్చేవారు.

ప్రాచీనకాలంలో విద్యలను నాలుగు విధాలుగా విభజించినప్పటికీ, అనేక ఇతర విద్యలు కూడా అంతే ప్రాచుర్యంలో ఉన్నాయి. రామాయణకాలంలో జ్యోతిష్యం, సాముద్రిక శాస్త్రాలు బాగా ప్రచారంలో ఉండేవి. అలాగే చికిత్సా శాస్త్రం ఉన్నత ప్రమాణాలతో విస్తరించింది. శల్య చికిత్స కూడా నాటి వైద్యులకు తెలుసు అనడానికి అనేక ప్రమాణాలు మనకు రామాయణంలో కన్పిస్తాయి. అంధులకు ఇతరుల నేత్రాలనిచ్చి దృష్టిని తెప్పించటం ఆనాడే ప్రచారంలో ఉండేది. నేడు మనకు బాగా పరిచితమైన ఇన్క్యుబేటర్లు రామయణకాలంలోనే వాడుకలో ఉండేవి. ‘ఘృత పూర్ణేషు కుంబేషు ధాత్ర్యస్థాన్ సమవర్ధయన్’ అనే శ్లోకం సమాన తాపమానంలో శిశువును పెంచడం గురించి తెలుపుతుంది. ఆనాటి కాలంలో ప్రసూతి విజ్ఞానం ఉన్నత ప్రమాణాల్లో ఉండేదని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. అలాగే నేడు మనకు తెలిసిన మృతదేహాల సంరక్షణ కూడా నాటికాలంలో అలవోకగా చేసేవారు. దశరధుడు మరణించినప్పుడు, కుమారులెవరు దహనసంస్కారాలు నిర్వహించడానికి దగ్గరలో లేనందున భరతుడు వచ్చే వరకు దశరధ మహారాజు శరీరాన్ని తైలాలో భద్రపర్చినట్టు రామాయణ ఉత్తరకాండలోని ‘తైలద్రోణ్యాంతదామాత్యాః సంవేశ్యజగతీపతిం’ అన్న శ్లోకంలో మనకు అవగతమవుతుంది. మానవ శరీర నిర్మాణంగురించిన జ్ఞానం రామాయణ కాలంలో విస్త్రృతంగా ఉంది.

ఇక పశుపక్ష్యాదులకు సంబంధించిన విజ్ఞానం కూడా ఆనాడు ప్రస్ఫుటంగా ఉంది. పక్షులు తమ ఆహారాన్ని వెదుకటంలో ఎటువంటి సూక్ష్మదృష్టిని, స్థూలదృష్టిని కల్గి ఉంటాయో ఆనాడే స్పష్టంగా చెప్పబడింది. రామాయణంలో అనేక రకాల జాతుల  ఏనుగుల, గుర్రాల, జింకల వర్ణనలు కన్పిస్తాయి.

అన్నింటికంటే ముఖ్యంగా, రామాయణ కాలంలో రేఖా గణితం ప్రచారంలో ఉన్నట్టు మనకు కన్పిస్తుంది. ఆనాడు ప్రజల ధార్మిక జీవనంలో యజ్ఞాలకు ప్రాముఖ్యం ఉండేది. యజ్ఞశాలలను నిర్మాణంలో రేఖా గణితం ఎక్కువగా వినియోగించేవారు. అందుకొరకు సమకోణం, వర్గం, వృత్తాల పరిజ్ఞానం అవసరమైయ్యేది. అలాగే భవన, నగర నిర్మాణాలకు కూడా రేఖా గణిత పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించేవారు. గృహ, భవన నిర్మాణాలకు వాస్తు శాస్త్ర వినియోగం కూడా అంతే విశిష్టంగా జరిగేది.

ఇక కళలకు మన దేశం పుట్టినిల్లన్నది తెలిసినదే. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్ప ప్రావీణ్యం ఒక్కటన్నమాటేంటి అరవైనాలుగు కళలు రామాయణకాలంలో భాసిల్లాయి.

సౌమ్యశ్రీ రాళ్లభండి

One thought on “రామాయణం కాలంలో విద్య”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *