తెలుగు జానపద కళారూపాలు

తెలుగు తీయనైనది. సొగసైన నుడికారం కలది. మధురమైన కవితలు కలది. సొగసైన రచనలు, సామెతల, జాతీయాల, సూక్తుల సొబగును కూర్చుకున్న మధుర భాష. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు, అన్నీ ఉన్న ఈ భాషను, సంస్కృతిని పరిరక్షించే తెలుగువారు ఆనాడు, ఈనాడు కూడా కరువయ్యారు. ఇక తెలుగు గ్రామీణుల జీవన విధానం, ఆచార వ్యవహారాలు, పండగలు పబ్బాలు, గ్రామీణ దేవతలు, పూజా విధానాలు, వృత్తులు, వారి మాట చాతుర్యం ఇలా అనేక విశేషాలు కాలక్రమేణా మరుగున పడిపోతున్నాయి. పుష్కరానికొకసారి జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇది మన సంస్కృతి అని చెపితే భావితరాల వారికి అర్ధమవుతుందనడం అర్ధరహితం. నేడు ఎన్నో జానపద కళారూపాలను మనం మర్చిపోతున్నాం. దసరా, సంక్రాంతి పండగలొస్తున్నాయంటే వీధివీధినా కనపడే పగటివేషగాళ్లు, దాసర్లు నేడు మచ్చుకు కూడా కన్పించట్లేదు.

పగటివేషగాళ్లు: వీరినే బహురూపులని కూడా అంటారు. వీరు ఏ జాతి, ప్రాంతంవారి వేషాలను కట్టదల్చారో, వారి రూపురేఖా విశేషాలను, వేషభాషలను పూర్తిగా అభ్యసించి చూపురలకు భ్రమ కల్గిస్తారు. తమంతటతాముగా మేము పగటివేషగాళ్లమని చెపితేగానీ తెలియనంతగా వారు పాత్రలలో ఇమిడిపోతారు. పగటివేషగాళ్లు మనకు నేడు కొత్త కాదు. పురాణేతిహాసాల నుంచే పగటివేషగాళ్లు మన చరిత్రలో దాగి ఉన్నారు. శివుడు, రావణుడు జంగమదేవర వేషాలు వేసుకోవటం మనకు తెలిసిందే. ‘ఉదర నిమిత్తం బహుకృత వేషం’ మన్నట్టు తమ కుటుంబాలను పోషించుకోవడానికి, పగటివేషగాళ్లు, దాసర్లు పుట్టుకొచ్చారు. క్రమేపి ప్రజలకు వినోదమందించడానికి పగటివేషాలు వేయటం ప్రారంభమైంది.

ముఖ్యంగా గడ్డిపాడు, కూచిపూడి బ్రాహ్మణులు బుడబుక్కలవాడు, బైరాగి, జంగం, కోయవాడు, ఎరుకలసాని, పిట్టలదొర, ఫకీరు, సింగీసింగడు, ప్రధానంగా అర్ధనారీశ్వరవేషం వేసి ప్రజలను అలరించారు.

దొమ్మరాట: రష్యా సర్కస్ మన దేశానికి రాకముందు నుంచి గాలిలో డిమికీలు కొట్టడం, నిప్పును నోటి నుంచి వదలటం, కళ్లకు గంతలు కట్టి కత్తులు విసరడంలాంటి అనేక విద్యలను మన దొమ్మరులు ఎంతో నైపుణ్యంతో ప్రదర్శించేవారు.

ఉరుములు: అనంతపురం జిల్లాలో విరివిగా ఈ జానపద నృత్యం మనకు కన్పిస్తుంది. పెద్ద, పెద్ద వీరణాలు మెడలో వేసుకొని లయబద్ధంగా, మేఘ గర్జనలాగా మ్రోగే వీరణాల కనుగుణంగా శివ కథలను పాడుతూ శైవ భక్తులు నృత్యం చేస్తారు. రాయలసీమకే చెందిన గురువయ్యలు కూడా శివ భక్తులే. వీరు ఒక చేత్తో మురళిని వాయిస్తూ, మరొక చేత్తో డమురకం వంటి వాయిద్యాన్ని వాయిస్తూ నృత్యం చేస్తారు.

బుర్రకథలు: తందనాన తానె తందనాన, తందనాన భలే తందనాన అంటూ సాగే బుర్రకథల గురించి వేరే చెప్పనక్కర్లేదు. నాయకుడు తంబూరాను మీటుతు, తాళాలు వాయిస్తూ కథ చెపుతుంటే, ఇద్దరు సహవాసులు ఆయనకు తందనాన చెపుతూ రసవత్తరంగా సాగే జానాపద కథాకాలక్షేపం బుర్రకథ. బాలనాగమ్మ, కాంభోజరాజు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీర చరిత్ర, దేశింగురాజు ఇలా అనేక బుర్రకథలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.

గొబ్బి: ధనుర్మాసం నెలరోజులు ప్రతి గృహిణీ ఇంటిముందు శుభ్రం చేసి, అందంగా రంగవల్లులు దిద్ది, ఆవుపేడతో ముద్దలకు గుమ్మడిపూలు పెట్టి పసుపు, కుంకుమలతో అలకరించి దాని చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ ఆడే ఆట గొబ్బిళ్లు. ఈ పేడ ముద్దలను పిడకలు చేసి భోగిరోజు వీటిని దండలుగా గుచ్చి భోగి మంటలలో వేయటం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇది ఎక్కువగా తూర్పుతీరాన మనకు కన్పిస్తుంది.

బతుకమ్మ: గొబ్బిళ్లకు ఇంచుమించు అటు, ఇటుగా సాగేదే బతుకమ్మ. తెలంగాణాప్రాంతంలో దేవీనవరాత్రులలో ప్రతిరోజు రకరకాల పూవులతో పళ్లెంలో గోపురంగా అమర్చి, స్త్రీలు పాటలు పాడుతూ గౌరిదేవిని పూజిస్తారు.

సప్తతాళభజన: ఇదొక విశిష్టమైన ఆధ్యాత్మిక సంకీర్తన. తూర్పుగోదావరి జిల్లాలో ఇది ప్రసిద్ధం. ఇత్తడి తాళాలతో ఏడు గతులలో వాయిస్తూ, పాడుతూ భజన చేస్తారు. ఏకాహం, సప్తాహాలలో పాల్గొని భజనలు చేస్తారు.

కోలాటం: ఈ జానపాద నృత్యరూపం గూర్చి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! నేటికీ ఈ నృత్యం ఆంధ్రప్రదేశ్ నలుమూలల బహుళ ప్రాచుర్యంలో ఉంది. కోలాటాలు అనేక రకాలు. స్త్రీలు, పురుషులు కూడా పాటలు పాడుతూ లయబద్ధంగా నృత్యం చేస్తారు. శ్రీశైలం, రామప్పగుడి మొదలగు అనేక పుణ్య క్షేత్రాలలో కోలాటం ప్రశస్తిని తెలిపే అనేక శిల్పాలున్నాయి. జడ కోలాటం, వట కోలాటం, లత కోలాటం ఇలా అనేక రకాలు ఇందులో ఉన్నాయి. పురాణగాథలనేకం పాటల రూపంలో పాడుతూ కోలాటం ఆడుతారు.

గుర్రం ఆట: గుంటూరు జిల్లాకు చెందిన విశిష్టమైన కళాఖండం ఇది. గుర్రం కాళ్లకు గజ్జెలు కట్టి, డప్పు వాయిద్యంలోని గతులకనుగుణంగా గుర్రాన్ని ఆడిస్తారు. పెళ్లి ఊరేగింపులలో ఒక నర్తకి కూడా గుర్రం ముందు నిలబడి గుర్రంతో సమానంగా నాట్యాలు చేస్తారు.

కత్తిసాము: మన జానపద చిత్రాల్లో చూసి ఒస్ ఇంతేగా అనుకున్నా, రాజులు, రాజ్యాలు పోయినా, కత్తిసాము మన జనజీవనంలో ఒక భాగమై వినోదరూపాన్ని దాల్చింది. రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతరలో కత్తిసామును ప్రదర్శిస్తుంటారు.

కీలుగుర్రాలు: ఈ మాట అనగానే అక్కినేని, అంజలీదేవి సినిమా గుర్తొచ్చి ఉంటుంది. చెక్కతలో చేసిన గుర్రాల వీపుకు మధ్యన మనిషి దూరేటంత బెజ్జం ఉంటుంది. దానిలోంచి దూరి సాధారణంగా రాజు, రాణి వేషాలు ధరించి చమత్కరా సంభాషణలతో, పాటలతో, పాటలకు అనుగుణంగా అడుగులు వేస్తూ నాట్య ప్రదర్శన చేస్తారు. ఈ ఆట తమిళనాడుకు దగ్గరలో ఉన్న ఆంధ్రా పల్లెలలో ఎక్కువగా చూడవచ్చు.

తప్పెటగుళ్లు: శ్రీకాకుళం జిల్లా పల్లెలలో ఇది ప్రచారంలో ఉంది. మట్టితోగాని, ఇనుపరేకులతోగాని చేసిన తప్పెటలను ఛాతీకి కట్టుకొని, రామాయణ, భాగవత గాథలను గాను చేస్తూ, ప్రతీ చరణం ముగియగానే లయబద్ధంగా అడుగులు వేస్తూ నాట్యం చేస్తారు. ఇది ముఖ్యంగా పురుషులు ప్రదర్శించే కళారూపం. దీనినే పోలి ఉండేది డప్పువాయిద్యం. చిన్న, పెద్ద డప్పుల ఆకారాన్ని బట్టి వీటిని తప్పెటలు, కనక తప్పెటలు అని కూడా అంటారు. ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలలో అమ్మవారి జాతర్లలో ఎక్కువగా డప్పులు, తప్పెట్లు మ్రోగుతుంటాయి.

తోలుబొమ్మలాట: అతిప్రాచీనమైన, శ్రేష్టమైన జానపద కళారూపమిది. మన రాష్ట్రంలో తోలుబొమ్మలను ఎంతో ఆకర్షణీయంగా రంగులతో అలంకరిస్తారు. మన దగ్గరనుంచే ఈ కళారూపం తూర్పువైపుకు వ్యాపించిందని అంటుంటారు. చర్మంతో తయారు చేసిన తోలుబొమ్మలను పాత్రోచితంగా అలంకరిస్తారు. రామయణ, భాగవతాది కథలను పాడుతూ తెరపై తోలుబొమ్మలను కదుపుతూ రసవంతంగా దృశ్యకావ్యాలను ప్రదర్శిస్తారు. ఆంధ్రదేశమంతా ఈ తోలుబొమ్మలాటలున్నా, తూర్పు గోదావరి జిల్లా ఇందుకు ప్రసిద్ధి చెందింది. రాయలసీమ, కోస్తా జిల్లాలలో స్త్రీ, పురుషులిరువురు తోలుబొమ్మలాడిస్తారు. కాగా తెలంగాణాలో కేవలం పురుషులు మాత్రమే తోలుబోమ్మలను ఆడిస్తారు. ఇక రాయలసీమలో ముఖవీణ అనే ప్రత్యేక వాయిద్యాన్ని ఈ ఆటకు ఉపయోగిస్తారు. తోలుబొమ్మలలాగే చెక్కలతో బొమ్మలతో చేసే కథాకాలక్షేపానికి కీలుబొమ్మలాట అని పేరు. ఇది ఆంధ్రదేశాన మరుగనపడిపోయినా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో ఇంకా ప్రచారంలో ఉంది.

వీరభద్రుడి నృత్యం లేక వీరనాట్యం లేక ప్రభలు: దక్షయజ్ఞంలో సతీదేవి ప్రాణత్యాగంతో ఆగ్రహం చెందిన విషయం తెలిసి ఉగ్రుడైన శివుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞాన్ని భంగం చేస్తాడు. ఆ వీరభద్రడు చేసే వీరాంగానికే వీరనాట్యమని పేరు. ప్రభలు కట్టి, వీరణ వాయిద్యాలు వాయిస్తూ శైవభక్తులు పర్వదినాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. వీరరస ప్రాధాన్యంగల ఈ నృత్యం ఉభయగోదావరి జిల్లాలలో విరివిగా ప్రదర్శిస్తుంటారు. శివరాత్రి నాడు గుంటురు జిల్లాలోని కోటప్ప తిరునాళ్లలో ఈ నాట్యం ప్రదర్శిస్తారు.

సింహాద్రి అప్పన్న సేవ: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఈ కళారూపం మనకు ఎక్కువగా కన్పిస్తుంది. ఒక పెద్ద ఇత్తడి దీపపు సమ్మెను ఉంచి, ఇత్తడి తాళాలు వాయిస్తూ, సింహాద్రి అప్పన్నను ఆరాధిస్తూ చేసే నృత్యమిది.

కరీంనగర్ జిల్లాకు చెందిన కడ్డీ వాయిద్యం, తూర్పుతీరానికి చెందిన జముకులవారు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గరిడీ విద్య, దసరాకు తప్పనిసరిగా కన్పించే పులివేషం, నిజామాబాద్ కు చెందిన గుసాడీ నర్తనం, తెలంగాణా ప్రాంతానికే చెందిన చిరుతల రామాయణం, జోగు ఆట, బుట్టబొమ్మలు, కారువా మేళం, బవనీలు, ఉగ్గుగొల్లలు, చెక్క భజన, అలాగే శైవభక్తులు చేసే వీర కోలలు, గరగలు, కర్నూలు జిల్లాకు చెందిన చెంచు నృత్యం, గోండులు, కోయలు, లంబాడీలు, నుగాళీ, బంజారాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక జానపద నృత్యగాన కళారూపాలు మన ఊహకందనన్ని ఉన్నాయి.

హరికథలు, యక్షగానాలు, భామాకలాపాలు ఇలా నేను విస్మరించిన, నాకు తెలియని జానపద కళారూపాలకు లెక్కలేదు. మన స్మృతిపథం నుంచి వైదొలుగుతున్న ఈ జానపద కళారూపాలలో కొన్నింటినైనా మన భావితరాలవారికి అందించగల్గితే, మన బ్రతుకు చరితార్ధమైనట్టే!

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *