తెలుగులో జాతీయాలు

ప్రజల సంభాషణల్లో తరచూ చోటు చేసుకుని కాలక్రమేణా భాషలో స్థిరత్వాన్ని పొందే పదాలను, వ్యాఖ్యలను జాతీయాలు లేదా నానుడులు అంటారు. వీటినే ఇంగ్లీషులో “idioms” అంటారు. మనకు తెలియకుండానే అనేక జాతీయాలను మన సంభాషణల్లో ఉపయోగిస్తుంటాం. ఉదాహరణకు అరికాలిమంట నెత్తికి ఎక్కింది, తూచా తప్పకుండా, ఈడు, జోడు, అడుగులకు మడుగులొత్తడం, కట్టె, కొట్టె, తెచ్చె, మొదలగునవి. భావాన్ని వెలిపర్చటంలో ప్రజలు చూపే ఈ విశిష్టతనే పలుకుబళ్లు అని కూడా అంటారు.

జాతీయాలు, సామెతలు ఒకటేనని పొరబడటం కద్దు. కానీ ఈ రెండు వేర్వేరు. జాతీయాలు వాక్యంలో ఇమిడిపోయే పదాలు. అదే సామెతలు వాక్యం రూపంలో ఉంటాయి. మనుష్యుల వ్యక్తిత్వాలు, ప్రజల వాడుక భాషలో ఉండే వివిధ మాండలీకాలు, వృత్తులు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇలా మనిషి ఉనికిని, అస్థిత్వానిని తెలియచేసే ప్రతీ అంశం మన జాతీయాల్లో చోటు చేసుకున్నాయి. అలాగే మన పురాణాలు, కథలు, ఇతిహాసాలు కూడా జాతీయల్లో ఇమిడి పోయాయి. ఉదాహరణకు, , పుక్కిట పురాణాలు పట్టాడు, ఉడతా భక్తి, రామబాణం, కుంభ కర్ణుని నిద్ర, రావణ కాష్టం, శల్య సారధ్యం, అక్షయ పాత్ర, త్రిశంకు స్వర్గం, సుందోపసుందులు, యక్ష ప్రశ్నలు, వాతాపి జీర్ణం, పరుశురామ ప్రీతి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలల్లు.

జాతీయాలు సంభాషణలో ఉపయోగించాలన్నా, కొత్తవి పుట్టించాలన్నా భాష మీద గట్టి పట్టుండాలి. కానీ ఈ ఆధునిక యుగంలో ఇంగ్లీషులో ఆలోచించి, తెలుగులో మాట్లాడటం ఎక్కువైపోయింది. దీంతో జాతీయాల వాడకం కూడా తగ్గిపోతోంది. ఇక ఒక భాషలోంచి జాతీయాలు మరో భాషలోకి అనువాదం చేయడం చాలా కష్టం. ఆయా ప్రాంతపు జీవన విధానాల మధ్య ఉన్న తేడాలు, భాషా సౌలభ్యం అందుకు సాధ్య పడవు. ఉదాహరణకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ. దీనికి సరిసమానమైన ఇంగ్లీషు జాతీయం టిట్ ఫర్ టాట్. తెలుగు జాతీయం యథావిధిగా తర్జుమా చేశామా భావం పూర్తిగా మారిపోతుంది. కానీ వాడుక భాషలో దీనికి గల భావమే వేరు. కానీ కొన్ని ఆంగ్లపదాలు తెలుగులోకి వచ్చి చేరిన సందర్భాలు లేకపోలేదు. ఉదాహరణకు లోడ్ అనే ఆంగ్లపదం. నిండుగా, భారీగా ఉన్న లారీని చూపి లారీ లోడ్ అయింది అంటుంటాం. కానీ ఇలా భారీగా, బరువుగా కదలటం అనే భావాన్ని, మద్యపానం చేసిన వ్యక్తికి అన్వయించి, లోడు మీదున్నాడు అనటం వాడుకలోకి వచ్చింది. ఇలా ఇతర భాషలనుంచి, సామాజిక మార్పులకనుగుణంగా వచ్చి చేరిన పదాలు ఫిరాయింపులు, జెండా మార్చడం, ఆయారామ్ గయారామ్, ఎసిడిసి, జోకర్ గాడు, తురపుముక్క, డబ్బా కొట్టకు (ఇది ముత్యాలముగ్గు సినిమా ప్రభావం). స్పాట్ పెడతాను, రఫ్ ఆడించేస్తాను, నాతో పెట్టుకోకు, టాప్ లేచిపోద్ది, గేమ్స్ లాడకు, ఓ లుక్ ఇచ్చుకో, అంత సీనులేదు బాబు, ఐరెన్ లెగ్ ఇవన్నీ సినిమా ప్రభావంతో వచ్చి చేరిన నానుడులే!

అలాగే ఉచ్ఛరణలోని వైవిధ్యం అంటే మాండలికాలు కూడా జాతీయాల భావాలను మారుస్తుంటాయి. పదాన్ని పలికే తీరులో ఏ భాషలో నేర్పు ఆ భాషదే. ఇక్కడే భాష ప్రత్యేకతను నిలపటంలో జాతీయాలు, నుడికారాలుపయోగపడతాయి. ఉదాహరణకు బాగున్నావా, ఈ పదం ఎన్ని విధాల పలకచ్చో చూడండి. బాగున్నావా, బావున్నావా, బాగుండారా, బాగుండారూ, మంచిగున్నావా, మంచిగున్నావే ఇలా ప్రాంతానికోవిధంగా, జిల్లాకోవిధంగా చిన్న, చిన్న మాటల్లోకూడా ప్రాసలు, యాసలు, నుడికారాలు మన ఊహలకందన్నంతగా నిగూఢమైపోయాయి.

ఇక సమాజంలోనున్న వివిధ మతాలు, కులాలు కూడా జాతీయాల పుట్టుకకు మార్గదర్శకమవుతాయి. ఇదివరలో సంస్కృత భాష బహుళ ప్రచారంలో నున్న రోజుల్లో ఏర్పడ్డ కొన్న జాతీయాలు నేటికి మన సంభాషణల్లో భాగాలైపోయి. ఉదాహరణకు అప్రాచ్యుడా అన్న తిట్టు. సంస్కృతంలో ప్రాచ్యం అంటే తూర్పు ప్రాంతం. ఆ ప్రాంతానికి చెందనివాడు అప్రాచ్యుడు. కానీ నేడు ఈ పదం వాడే సందర్భమే మారిపోయింది. అలాగే మరో జాతీయం: కరతలామలకం. ఇది సంస్కృత పదాలతో ఏర్పడ్డ జాతీయం. మామూలుగా దీని అర్ధం చేతిలో ఉసిరికాయ. కరతలం అంటే చేయి, అమలకం అంటే ఉసిరికాయ. ఈ పదాన్ని స్పష్టంగా అనే అర్ధంలో ఉపయోగిస్తాం, అలాగే తెలుగని భ్రమ కలిగించే మరో సంస్కృత జాతీయం కరదీపిక. కర అంటే చేయి, దీపిక అంటే కాగడా. వెలుగు చూపేది లేక మార్గదర్శకం చూపేది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఇక తూ.చ తప్పకుండా, ఈ జాతీయంలో తూ.చ అనేవి సంస్కృతపదాలు అంటే మీరు ఆశ్చర్యపోతారు. సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు , కొన్ని నియమాలు ఉండేవట. అందులో ఒకటి , “పంక్తి కి 8 అక్షరాలు ఉండాలి.” ఒక్కోసారి 8అక్షరాలు రాయటం కుదరనప్పుడు, కొన్ని అక్షరాలను ఉంచవచ్చు. అవి: తు, చ, స్వ, హి, వై, …. ఉదా : రామాయ లక్ష్మనశ్చతు. సంస్కృత కావ్యాలను తెనుగీకరించేటప్పుడు, కవులు యథావిధిగా అనువాదం చేసేవారు. దాంతో తు.చలు అలాగే వచ్చి చేరేవి. దీంతో తు.చ తప్పకుండా అనువాదం చేసేవారు కనుక కాలక్రమేణా అదే మనకు అలవాటుగా మారింది.అలాగే అగస్త్యభ్రాత, ఆకాశరామన్న, కూపస్థ మండూకం, శఠగోపం, ఆకాశ సంచాంగం, అజాగళస్తనం, హస్తిమశకాంతరం, అస్ఖలిత బ్రహ్మచారి, అందెవేసిన చేయి ఇవన్నీ సంస్కృత నుంచి వచ్చిన జాతీయాలే.

సాహిత్యంలో కన్పించే నాటకాలు, నవలలు, కావ్యాలు వాటిలోని పాత్రలు జాతీయాలుగా వాడటం కద్దు. కన్యాశుల్కం వందసంవత్సరాల పూర్వం నాటకమైనప్పటికీ తెలుగు సాహిత్యంలో దానికున్న స్థానం విశిష్టమైంది. ఈ నాటకంలోని గిరీశంతోపాటు అగ్నిహోత్రావధానులు మన జాతీయాల్లో భాగాలైపోయారు. ఎవరైన మసిపూసి మారేడుకాయ (ఇది జాతీయమే) చేసే వ్యక్తులు తారాసపడ్డప్పుడు వారిని ఉద్దేశించి అతనో గిరీశం అనడం పరిపాటి. అలాగే ఎప్పుడు చిటపటలాడుతూ, చికాకుపడే వారు ఎదురైనపుడు, అగ్నిహోత్రావధాన్లులాగా ఎందకలా కోపంగా మాట్లాడుతారాయన అనటం అలవాటైపోయింది.

ప్రజలలో బాగా నాటుకుపోయిన కొన్ని జాతీయాలు: అచ్చటా ముచ్చట, అచ్చోసిన ఆంబోతు, అన్నమో రామచంద్రా, అతివృష్టి అనావృష్టి, అరవ చాకిరి, ఆటలో అరటిపండు, ఆరు నూరైనా, నూరు ఆరైనా, ఏకు మేకు, అండ దండలు, ఆటుపోటు, పైలా పచ్చీసు, ఈడుజోడు, ఎగదిగ, అందితే జుట్టు, అందకపోతే కాళ్లు, కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి, కలసి మెలసి, కలరగూరగంప, చిటికెలో, నూటికి కోటికి, పరిక్కంప, పండాకాయ, వీరాభిమాని, వేలంవెర్రి, శీతకన్ను, ఆసులో కండె, పొయ్యిలో పిల్లి లేవలేదు, మక్కికి మక్కి, రెంటికి చడ్డ రేవడి, హేమాహేమీలు, గాడిద గుడ్డు (గాడ్ ది గుడ్ అనే ఇంగ్లీషు మాట కాలక్రమేణా రూపాంతరం చెంది ఈ విధంగా మారిందని కూడా కొందరంటారు), రాసుకుంటూ పోతే ఇలా ఎన్నో! మన వాడుకభాషలో సగం భాష జాతీయాలే అనిపించకమానదు. తరువాయి సంచికలో సామెతల గురించి చెప్పుకుందాం!

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *