కథానిక 9
దేవతా వస్త్రాలు

ఉభయ భాషాప్రవీణుడైన అవధాని కథకుడై బ్రహ్మవైవర్తము, దేవీ భాగవతము, మహాభారతము, భాగవతము వంటి పురాణేతిహాస, వేదాంత, ఆథ్యాత్మిక, సాంఘిక, చారిత్రాత్మిక గాథలకు అక్షరరూపాన్నిస్తే, అవి కాలానికతీతంగా జనపథంలో ప్రాచుర్యాన్ని పొంది, తరతరాలుగా నిలిచిపోతాయనడానికి ఉదాహరణే బ్రహ్మశ్రీ మధిర సుబ్బన్న దీక్షితుల వారు రచించిన కాశీ మజలీ కథలు. పండిత, పామరులిరువురిని అలరించే విధంగా 12 భాగాలలో రచించిన ఈ కథలు ఆంధ్రాదేశమంతా బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ కథలు వీరక్తులకు వేదాంత వార్తికములుగా, జ్ఞానులకు ఉపనిషత్తులుగా, కర్మిష్టులకు స్మృతులుగా, వైదికులకు ధర్మశాస్త్రములై లోకోభిన్నరుచన్నట్టు, ఎవరి వ్యక్తిత్వానికనుగుణంగా వారిని అలరిస్తాయి. ఈ కథల రచనకు 1898లో అంకురార్పణ జరిగింది. కాగా మొట్టమొదట 1926లో వెలుగుచూసాయి. ఈ కథలతోపాటుగా దీక్షితులుగారు అనేక వచన, పద్య కావ్యాలను కూడా రచించారు.

పూర్వం కాశీ ప్రయాణమంటే, కాటికి ప్రయాణమనే అభిప్రాయముండేది. వ్యయప్రాయసలకు తట్టుకొని కాలినడకన మోక్షభూమైన కాశీపట్టణాన్ని సందర్శించి తిరిగి రావడమంటే తేలికైన పనికాదు. మణిసిద్ధుడనే యతి, గోపకుమారునితో కూడి, జరిపిన కాశీయాత్రలో వారు చేసిన ప్రతి మజిలీలో మణిసిద్ధుడు, గోపకుమారునికి ఒక కథ విన్పిస్తాడు. వారిరువురి కాశీయాత్ర ప్రధాన కథ కాగా, అనేక ఉపకథలు, గొలుసుకట్టు కథలతో మానవ సంబంధాలు, నైతిక విలువలతో కూడిన ఇతివృత్తాలతో అనేక విజ్ఞాన, వైజ్ఞానిక, రాజనీతి, వివేకంతో కూడిన వ్యవహారాలు మనకు అవగతవమవుతాయి. వీటితోపాటుగా, కృష్ణదేవరాయలు, భోజరాజు, శంకరాచార్యులు, నారదుడు, ప్రహ్లాదుడు వంటి మహాపురుషులు జీవిత విశేషాలు కూడా ఈ కథలలో పొందుపర్చపడ్డాయి. ఇవి కేవలము కథల వంటివేగాక వ్యాకరణాది శాస్త్ర సంప్రదాయములయందేమి యలంకారాదుల యందేమి మన ప్రాచీన కావ్యములకించుక దీసిపోవని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారితో కొనియాడబడిన ఈ కథలు పాఠకుల మనోపథంపై చిరస్థాయిగా నిలిచిపోయాయి. సుబ్బన్న దీక్షితులవారి పేరు తెలవకపోవచ్చుగాని, కాశీ మజలీ కథలు తెలవనివారు మాత్రం ఆంధ్రదేశాన లేరంటే అతిశయోక్తి కాదు.
దాదాపు శతాబ్ధం క్రితం రాసిన ఈ కథలను నేటి వ్యావహారిక శైలికి, భాషకు అనుగుణంగా శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారిచే రచించిబడి ముద్రితమైన కాశీ మజలీ కథల సంపుటాల ఆధారంగా, దేవతావస్త్రాల కథ, మా పాఠకుల కొరకు….

దేవతా వస్త్రాలు

కాశ్మీరు దేశపు శూరసేనుడు, అతని మిత్రులకు శ్రీశైల మల్లికార్జుని వర ప్రభావంతో కుమారులు జన్మిస్తారు. వారిని వరప్రసాదులని పిలిచేవారు. వారు దేశాటన చేస్తూ లాట దేశాన్ని చేరుకుంటారు.

అది లాటదేశం. ఆ రాజ్యాన్నేలేది కానీనుడు. ఆ రాజుకు కుబుద్ధి, సుబుద్ధి అని ఇద్దరు మంత్రులున్నారు. వారి ఆలోచనల ప్రకారం రాజ్యాన్ని ఏలుతూ ఉన్న కానీన మహారాజు, సుమారు పది సంవత్సరాల క్రితం ఒక మహాసభ నిర్వహించాడు.

ఆ సభలో రాజు.. నిద్రాహారాలను బట్టి కదా పగలు, రాత్రిగా ఏర్పడ్డాయి. నిద్రించేది రాత్రి అని, విహరించేది పగలని నిర్ధారించారు. నేనిప్పుడు వాటిని తారు,మారు చేయదలిచాను. కావును పగటి పనులు రాత్రిపూట, రాత్రి సమయంలో చేయాల్సిన పనులను పగటిపూట చేయాలని ఆదేశించాడు.
కుబుద్ధి రాజును సమర్ధించగా, సుబుద్ధి మాత్రం అందుకు అడ్డు చెప్పాడు. ‘‘రాజా అప్రియమైన హితవు అనుకోకుండా నే చెప్పేది వినండి. రాత్రింబవళ్లకు ఆ పేర్లు నిద్రాహారాన్ని బట్టి కాక – చీకటి వెలుగుల్ని బట్టి ఏర్పడ్డాయని ప్రభువు వారు గుర్తించాలి. భగవంతుని చేత చేయబడిన నియమం. దీన్ని మార్చవద్దు. అలా మార్చాలనుకోవడం మన మూర్ఖత్వం. ప్రజావిరోధం సంభవించిందంటే అపఖ్యాతి తథ్యం.’’ అన్నాడు సుబుద్ధి.
రాజుకు ఆగ్రహం కల్గి, అప్పటికప్పుడే, ఆ మంత్రిని ఉద్యోగం నుంచి వైదొలగించాడు. కుబుద్ధిని పొగుడుతు, ఆ మర్నాడే, కొత్త శాసనం ప్రకారం జనులు నడుచుకోవాలని లలాట దేశమంతటా చాటింపిచ్చాడు. రాజాజ్ఞను దిక్కరిస్తే శిక్ష తప్పదని, విధి లేక ప్రజలు నానావస్థలు పడి, చివరకు రాత్రి పనిచేసి, పగలు నిద్రించడానికి అలవాటుపడ్డారు.

వరప్రసాదులు ఐదుగురూ అక్కడి ప్రజల ఇక్కట్లకు జాలిపడి, ఎలాగైనా రాజు తలతిక్కనెలగైనా వదిలించాలని భావించి, అక్కడ ఒక విసాలవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని నివశించసాగారు.

ఒకరోజు పెందలకడ భోజనాలు చేసి, గౌరవనీయుల్లా వేషాలు ధరించి, రాజుగారి ఆస్థానానికి వెళ్లి, రాజుగారికి ద్వారపాలకుల ద్వారా ఒక చీటిని పంపారు. రాజుగారు స్వయంగా వరప్రసాదుల వద్దకు వెళ్లి, ‘‘మీరెవరు, మీరు ఈ చీటిలో రాసిన వింత పనులు చేయగలరా?’’ అని ప్రశ్నించాడు.
అప్పుడు వారిలో ఒకడైన రాముడు, ‘‘రాజా! మాది కాశ్మీరం. మేము పట్టుశాలి వారం. విచిత్రమైన వస్త్రాలు నేయడంలో మాకు గొప్ప ఖ్యాతి ఉంది. మా ప్రావీణ్యం గుర్తించగల వారి కోసం అన్వేషిస్తుండగా, మీ ఖ్యాతి తెలిసింది. కొత్త ఆలోచనలను మీరు ప్రోత్సహిస్తారని తెలుసుకుని, మీ దర్శనార్థం బయలుదేరాం. మీరు మా విద్యను పరీక్షించగలరు,’’ అన్నాడు.

కాశ్మీరు దేశం దాకా, తమ ఖ్యాతి వ్యాపించిందని రాజు పొంగిపొయాడు. మంత్రి కూడా తానా అంటే తందానా అంటూ, రాజుని ప్రశంసించాడు. రాజు వరప్రసాదులతో తమ విద్యా పాటవాన్ని చూపమని అన్నాడు.

‘‘మేము నేటి నుంచి ఆరునెలల కాలంలో ఒక పంచెలచాపు, ఒక చీర, ఒక తలపాగా నేస్తాం! అందుకు యాభైవేల బంగారు కాసులు ఖర్చవుతాయి. ముందుగా అందులో సగ భాగమివ్వాలి. మేము ఎవరి కోసమైతే ఆ వస్త్రాలు నేస్తామో, వారే ఊరేగింపుగా వచ్చి, మా బస దగ్గర మిగితా సొమ్ము ఇస్తే, వస్తాలు అందచేస్తాం.

ఆ వస్త్రాలు ధరించిన దంపతులకు తేజస్వుడైన పుత్రుడు జన్మిస్తాడు. అయితే, మేం నేసే బట్టలు కాని, వాటి దారాలు అయినా గాని, వ్యభిచార దోషం వల్ల జన్మించిన వాళ్లకి మాత్రం కన్పించవు. అవి దేవతా వస్త్రాలు! ఆ వస్త్రాలు ధరించినప్పడు పొందే ఆనందం వర్ణనాతీతం. మీరు ప్రోత్సహిస్తే సరే, లేదా మరో రాజుని ఆశ్రయిస్తామని’’ వారు తెలిపారు.

కానీనుడికి ఉబలాటం ఎక్కువైంది. కొత్తదనాన్ని ప్రోత్సహించే తాము వ్యయానికి జంకమని, తమ విద్వత్తున్ను ప్రదర్శించి, అద్భుతైన వస్త్రాలను నేయమని, తక్షణమే ఖజానా నుంచి వారు కోరినట్టు సగం సొమ్మును అందచేసే ఏర్పాటు చేశాడు రాజు.

వరప్రసాదులు వస్త్రాలు నేయడానికి అవసరమైన సామగ్రినంతా కొని ఇంటి తలుపులు బిడాయించి, లోపలికి ఎవరిని రానీయకుండా విందు, వినోదాలతో కాలక్షేపం చేయసాగారు. రెండు మాసాలు కావస్తుండటంతో వస్త్రాల నేత ఎంతవరకు వచ్చిందో చూసిరమ్మని రాజు గ్రామాధికారుల పంపాడు.

‘‘పని చేయడంలో తీరిక లేకుండా ఉన్నామని, అయినా ప్రభుత్వాధికారులను దిక్కరించలేమని, కాసేపు తర్వాత వారిని లోనికి పంపమని,’’ కావలి వారికి చెప్పి, నూలు వడికే వారిలా, నూలు చుట్టే వారిలా, మగ్గం మీద నేసే వారిలో అభినయిస్తుండగా గ్రామాధికారులు ప్రవేశించారు.

‘‘నూలు ఎంత సన్నగా ఉందో చేశారా? పట్టుకైతే ఈ మెత్తదనం రాదు. పరీక్షించండి. రెండు మాసాల్లో నూలు తయారు చేయడమే కష్టం,’’ అన్నారు. నూలు కన్పించట్లేదంటే, తమ తల్లి వ్యభిచారిణి అనుకునే ప్రమాదం ఉందని, వారు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. కాపు కన్పించి ఉంటుందని, కరణం; కరణానికి కన్పించి ఉంటుందని కాపు తమ గుట్టు బయటపడకుండా మాట్లాడసాగారు.

కానీనుడు గ్రామాధికారుల నోట వస్త్రాల ప్రశంస విన్నప్పటి నుంచి అతనిలో ఆతృత మరింత పెరగసాగింది. దండనాథులు, మంత్రులు ఇలా రాజుగారి ఉన్నతాధికారులందరూ, తమకు కన్పించలేదంటే, తమ తల్లిని వ్యభిచారిణిగా పరిగణిస్తారన్న భయంతో తేలుకుట్టిన దొంగల్లా నిజాన్ని దాచి వరప్రసాదుల పనితనాన్ని ప్రశంసించ సాగారు.

వస్త్రాల ఖ్యాతి క్రమంగా పురమంతా, పట్టణమంతా వ్యాపించింది. వస్త్రాలని చూడాలని ఉబలాటం కల్గినా, అవి కన్పించకపోతే, తమ తల్లిని జారిణిగా అంగీకరించవల్సివస్తుందని కొందరు చూడలేదు. మరికొందరూ కన్పించకపోయినా, కన్పించాయని బైటవారికి తెలియకుండా ప్రశంసల వర్షం కురిపించసాగారు.

ఆరు మాసాలు పూర్తయ్యాయి. దేవతా వస్త్రాలు తయారయ్యాయని, ‘‘ఉత్సవాల్లో భద్రగజం మీద భార్యతో సహా ఎట్లా ఊరేగుతూ వస్తారో, అలా ఊరేగుతూ వచ్చి, బ్రాహ్మణలకు దానాలు చేసి, మా బసకు వచ్చి దేవతా వస్త్రాలు ధరించి, మాకు చెల్లించవల్సిన మిగిలిన సొమ్మును చెల్లించి, ఊరేగింపుగా రాజమహలుకు వెళ్లవల్సిందిగా,’’ రాజుకు కబురు వచ్చింది. ‘‘ఇవి దేవతా వస్త్రాలు కనుక ఆ రోజు అంతఃపుర స్త్రీలకు పురుషదర్శనం తప్పుకాద’’ని కూడా వారు తెలిపారు.

తాను ఊరేగేటప్పుడు అందరూ ఉండాలని రాజుగారు నగరమంతా చాటింపు వేయించి, మంత్రి, సామంత, పురోహితులు, సన్నిహితులు వెంటరాగా, భద్రగజం మీద భార్యతో సహా వరప్రసాదుల బసకు చేరుకున్నాడు. వరప్రసాదులు వారిని ఆహ్వానించి, ఉచితాసనాల మీద కూర్చోబెట్టారు. మిగితా సగం సొమ్ము, మణిమాణిక్యాది కానుకలు బంగారుపళ్లెంతో తెప్పించి, నేతగాళ్లగా చలామణి అవుతున్న వరప్రసాదులకు అందచేశాడు కానీనుడు.
వరప్రసాదులు ఒక్కొక్క పళ్లెం తెచ్చి రాజు ముందుంచారు.

‘‘దేవతా వస్త్రాలు ఏవి?’’ అని అడిగాడు రాజు.

రాజుకా పళ్లెంలో ఏమీ కన్పించలేదు. తనను కన్న రాణి జారిణి కాబోలు. అంతఃపురాల్లో ఉంచినా స్త్రీలు తప్పుదారి పట్టకమానరు కాబోలు. ఇంతమందికి కన్పించిన అద్భుత వస్త్రాలు తనకు కన్పించకపోవడం దురదృష్టకరమని, అవమానంతో విచారిస్తుంటే, వరప్రసాదులు అతన్ని రెచ్చగొడుతూ, ‘‘జరీపూవులు ఎంత చక్కగా అమిరాయో. వీటి మృదుత్వం పుష్పాలకు సాధ్యమా? మీకు కన్పించాయంటేనే తెలుస్తోంది, మీ తల్లిగారు దొడ్డ ఇల్లాలని…’’ పొగడసాగారు.

వస్త్రాలు కన్పించటంలేదంటే పలువురిలో తాను పలుచనవడమే గాక, తన తల్లి జారిణి అని అంగీకరించాల్సి వస్తుందన్న భయంతో, ‘‘అపూర్వం, అద్భుతం’’ అని కానీనుడు అన్నాడు. రాణి కూడా వస్త్రాలు పరిశీలిస్తున్నట్టుగా నటిస్తూ, ‘‘ఇంతమందికి కన్పించిన వస్త్రాలు తనకు కన్పించకపోవడమేమిటి? అని తన తల్లిని అవమానించలేక, ‘‘రాత్రిని పగలుగా, పగల్ని రాత్రిగా మార్చిన మీరు కట్టుకోగల దివ్యవస్త్రాలని’’ అంది.
వరప్రసాదులు నెమ్మదిగా రాజుగారి వేసుకున్న వస్త్రాలను తీసి, దేవతావస్త్రాలు ధరింప చేస్తున్నట్టుగా, నటించసాగారు. రాజు దిగంబరంగా కన్పిస్తున్నా, ఆ మాట అనడానికి ఎవ్వరికి ధైర్యం చాల్లేదు. అలా చెప్పి తమ తల్లిని నవ్వులపాలు చేయలేక ప్రతి ఒక్కరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఊరుకున్నారు. రాణిగారిని కూడా అవతలకు తీసుకు వెళ్లి పరిచారికలు దుస్తులు ధరింపచేస్తున్నట్టుగా కుచ్చిళ్లు, కొంగు సరిచేసి తీసుకువచ్చారు. సభలోని వారందరు తమ తల్లిని వ్యభిచారిణిగా అంగీకరించలేక రాణిగారి నగ్నత్వం గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఊరుకున్నారు. కానీనుడు కూడా కేవలం తన తల్లి దోషం వల్ల రాణి నగ్నంగా కన్పిస్తోందని భావించి, విచారించసాగాడు.

కానీనుడు, రాణితో సహా భద్రగజం ఎక్కి తిరిగి తన భవనానికి ఊరేగింపుగా రాజభవనం వైపు సాగారు. దేవతా వస్త్రాల మహిమ విన్న పుర ప్రజలు వాటి అందాన్ని వీక్షించాలని, రహదారుల్లో, మేడలెక్కి ఉత్సాహంగా చూడసాగారు. దిశమొలలతో రాణి-రాజు కన్పించేసరికి, వాళ్లంతా రాచమిధునాన్ని చూడలేక కళ్లుమూసుకున్నారు. విచారంతో కొంతసేపు ఊరేగి, రాజు, రాణితో సహా అంతఃపురానికి చేరుకున్నాడు.

తన వంటి మీద వస్త్రాలు అసలు బరువు లేకుండా, ఎంతో తేలిగ్గా ఉండటం రాజుకి ఆశ్చర్యాన్ని కల్గించింది. అవి చేసే అదృష్టానికి తాను నోచుకోలేదని, వాపోతు, రాణి వైపు తిరిగి నువ్వు కట్టుకున్న చీర నాకు కన్పించలేదు. పదిమందిలో తన తల్లి పరువు తీయలేక ఊరుకున్నాను. నువ్వైనా కనీసం చీర రంగు, అంచులు వర్ణించమని కోరాడు. అదివిన్న, రాణి తాను కూడా అదే పరిస్థితిలో ఉన్నానని, నా తల్లిని బైటవేయాల్సివస్తుందని, బయటపడలేకపోయాను. ‘‘మీరు నాకు ఒంటిమీద ఒక్క నూలు పోగైనా లేకుండా నగ్నంగా కన్పిస్తున్నారని,’’ దాపరికం లేకుండా తెలిపింది. అంతలో తాను నగ్నంగా ఉన్నానని గుర్తించి, సిగ్గుతో, లజ్జతో చాటుకు పరుగెత్తింది.

కానీనుడికి విపరీతమైన ఆగ్రహం, లజ్జ కలిగాయి. ఆ పట్టుశాలీలు తమని మోసం చేసాడని గ్రహించాడు. తయారీ సమయంలో రెండుసార్లు చూసి వచ్చిన కుబుద్ధిని పిలిచి, నీకు వస్త్రాలు కన్పించాయా? నిజం చెప్పు? భయపడవలదని, మాకు కన్పించట్లేదని’’ అడిగాడు.

మంత్రి తనకు వస్త్రాలు కన్పించలేదని నిజం ఒప్పుకున్నాడు. పదిమంది మధ్య వివస్త్రగా ఊరేగినందుకు సిగ్గుపడుతూ, ‘తానంటే పురుషుడు, కానీ రాణిని కూడా నగ్నంగా ఊరేగించ సాహింసించిన సాలీలను వదలకూడదని,’ ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే వాళ్లని పట్టి తెమ్మని భటులను పంపాడు. కానీ వారు ఊరేగింపు జరుగుతుండగానే జారుకున్నారని, అక్కడ తమకు దొరికిన పత్రాన్ని అందచేసారు.

మంత్రి కుబుద్ధి, అది క్షమాపత్రమేమోనని బిగ్గరగా చదవసాగాడు.

‘‘అపూర్వ దుర్మార్గ చర్యాభిలాషులైన కానీన ప్రభువులకు – కపట పట్టుశాలీలు వ్రాసిన ఆజ్ఞా ఏమనగా…. నీవు లోక విరుద్ధమైన మార్పులు చేసి, ప్రజలను అనే విధాలుగా బాధిస్తున్నావు. కనుక నీకు బుద్ధి చెప్పడానికి ఇంద్రుని దూతలుగా మేము నీకు ఇలాంటి అవమానం కల్గించి అదృశ్యమయ్యాము. ఇకనైనా బుద్ధి కల్గి, సుబుద్ధికి తిరిగి మంత్రి పదవినిచ్చి ప్రజారంజకంగా పరిపాలన సాగించు. లేదా నిన్ను పదవీచ్యుతుణ్ణి చేసి, ఇక్కట్ల పాలు చేయగలమ’’ని హెచ్చరించారు.

అదివిన్న కానీనుడు భయాందోళనకు గురై, ఇంద్రునితో నెయ్యం పనికిరాదని, జరిగిందేదో జరిగింది, ఇక ప్రజలంతా రాత్రిని, రాత్రిగా, పగలుని, పగలుగా పాటించవల్సిందిగా ప్రకటన చేయమని, సుబుద్ధి ఎక్కడ ఉన్న రాజభవనానికి తీసుకురావల్సిందిగా ఆదేశించాడు. సుబుద్ధి సలహాలతో కానీనుడు తదనంతరం ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు.

తేటగీతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *