అనువాద కథలు – 8
జీవన్మరణం

మూలకథ రచన: అంటోన్ చెకోవ్

ఒకానొక శరత్కాలపు నిశిరాత్రి వేళ, తన గదిలో అటూ, ఇటూ పచార్లు చేస్తూ, పదిహేనేళ్ల కిత్రం ఇదే శరత్ ఋతువు సాయంత్రం తాను ఇచ్చిన ఒక విందును గురించి ఒక బ్యాంక్ ఉద్యోగి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఆ విందులో ఎంతోమంది వివేకవంతులు, విద్యావంతులు అతిథులుగా పాల్గొని, అనేక విషాయలపై సంభాషణలు సాగించారు. అందులో ముఖ్యమైనది మృత్యు దండన. వచ్చిన అతిథుల్లో చాలామంది ముఖ్యంగా పత్రికా విలేకరులు, మేథావులు ఈ మరణ శిక్ష పట్ల విముఖత ప్రదర్శించారు. ఈ తరహా శిక్ష పురాతనమైనదరి, క్రైస్తవ మతసిద్ధాంతాలకు, నైతిక విలువలకు వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఈ మరణ శిక్ష స్థానే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని ప్రతిపాదించారు. కానీ, వీరందరి మధ్య ఒక అతిధి మాత్రం అందుకు అంగీకరించలేదు. ‘‘నాకు మరణ శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, ఈ రెండింటిలోనూ అనుభవం లేదు. అయినా, యావజ్జీవ శిక్షతో పోలిస్తే, మరణ శిక్ష నైతికమైనది, మానవీయము. మరణ శిక్ష మనిషిని ఒక్కసారి మృత్యువు కౌగిలోకి తీసుకుంటుంది. కానీ, యావజ్జీవ కారాగార శిక్ష వారిని కొద్ది, కొద్దిగా మరణ శయ్యపైకి చేరుస్తుంది. మీ దృష్టిలో దీర్ఘకాలం ఎదురుచూస్తూ చావడం మేలా, లేక క్షణకాలంలో మృతి చెందటమా?’’ అని సూటిగా ప్రశ్నించాడు.

‘‘రెండూ అనైతికమే. ఎందుకంటే రెండు శిక్షల ఉద్దేశం ఒక్కటే ప్రాణాలు తీయటం. ప్రభుత్వం భగవంతునికి ప్రతిరూపం కాదు. తాము తీసుకున్న ప్రాణాన్ని, పునరుద్దించే శక్తిలేని వారికి దానిని తీసుకునే నైతిక హక్కులేదని,’’ మరో అతిథి అభిప్రాయపడ్డాడు.

ఆ అతిథుల మధ్యలో ఇరవై ఐదేళ్ల యువ న్యాయవాది కూడా ఉన్నాడు. అందరూ అతని అభిప్రాయాన్ని అడిగారు. ‘‘పెద్దలు చెప్పినట్టుగా, మరణ దండన, యావజ్జీవ కారాగార శిక్ష రెండూ అనైతికమైనవే. అయినా వాటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవల్సి వస్తే తాను యావజ్జీవ కారాగారాన్నే కోరుకుంటాను. ఏ విధంగా జీవించినా ఊపిరితో ఉండటం మరణం కంటే ఉత్తమం,’’ అన్నాడు.

దాంతో అతిథుల మధ్య చర్చ మరింత రసవంతంగా సాగింది. అప్పడు యువకుడైన ఆ బ్యాంకు ఉద్యోగి, ఉడుకు రక్తంతో, అతిథుల వాగ్వివాదాలతో రెచ్చిపోయి, ‘‘మీరన్నది నిజం కాదు. ఏకాంతంగా, జీవితాంతం ఖైదుననుభవించటం ఉండటం దుర్భరం, దుర్లభం. అలా ఏకాంత వాసాన్ని ఐదు సంవత్సరాలు కూడా ఎవరూ గడపలేరని కావాలంటే 20 లక్షలు పందెం,’’ అని గట్టిగా బల్ల చరిచి యువ న్యాయవాదిని పందానికి ఆహ్వానించాడు. దాంతో ఆ యువ న్యాయవాది, ‘‘నువ్వన్న మాటకు కట్టుబడి ఉంటే, నేను ఐదు సంవత్సరాలు కాదు, పదిహేను సంవత్సరాలు, ఏకాంతంవాసాన్ని గడుపుతానని,’’ అంతే ఉత్సాహంగా బదులిచ్చాడు.

‘‘అలాగే కాని. పదిహేను సంవత్సరాలు. పెద్దలారా నేను ఇరవై లక్షలు పందెం కాస్తున్నాను,’’ అని బ్యాంకు ఉద్యోగి హుషారుగా పలికాడు.

‘‘నీ ఇరవై లక్షలకు బదులుగా నేను నా పదిహేను సంవత్సరాలు పణంగా పెడుతున్నానని,’’ రెట్టించిన ఉత్సాహంతో ఆ యువ న్యాయవాది సై అంటే సై అన్నాడు.
విక్షణారహితంగా, ఉద్రేకంతో వారివురు కోడిపుంజుల్లా పందెం బరిలోకి దిగారు. తుచ్ఛమైన ధనం కోసం కళ్లు మూసుకుపోయి ఆ బ్యాంకు ఉద్యోగి తానే పందెం గెలుస్తానన్న ధీమాతో ఆ యువ న్యాయవాది నుద్దేశించి ఇలా అన్నాడు.

‘‘ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించుకో. నాకు ఇరవై లక్షలు ఏమీ పెద్ద లెక్కకాదు. యవ్వన దశలో రెండు, మూడేళ్ల జీవితం అంటే మాటలు కాదు. నేను రెండు, మూడేళ్లని ఎందుకంటున్నానంటే, అంతకు మించి నువ్వు ఒంటరిగా జీవించలేవు. శిక్షగా ఏకాంతవాసాన్ని భరించటం తప్పని పరిస్థితి. కానీ స్వచ్ఛందంగా యావజ్జీవ శిక్షని అనుభవించట అంత తేలికైన వ్యవహారం కాదు. నువ్వు ఎప్పుడైనా సరే ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకుని స్వేచ్ఛావాయువులని పీల్చవచ్చని నీకు జ్ఞాపకం వచ్చిన ప్రతి క్షణం అది నీ సంతోషాన్ని హరించి వేస్తుంది. నిన్ను చూస్తే నాకు జాలి వేస్తోంది.’’

ఇప్పుడు పదిహేనేళ్ల తర్వాత తన గదిలో అటు, ఇటు పచారీ చేస్తుంటే, నాటి సంఘటన తలంపుకు వచ్చి కలచి వేస్తోంది. ‘‘ఈ పందెం వల్ల ఏమి ఒరిగింది? ఆ యువకుని అందమైన పదిహేనేళ్ల జీవితం, నా ఇరవై లక్షలు పణంగా పెట్టి ఏమి సాధించాం? మరణ శిక్ష లేక యావజ్జీవ కారాగార శిక్ష ఏది దర్భరమైనదో ఈ పందెం నిరూపించగలిగిందా? లేదు. లేనేలేదు. ఈ పందెం నిరుపయోగం. నిరర్థకం. నాది చపలత్వం. అతనిది ధన వ్యామోహం…’’

అలా తనలో తాను మధనపడుతుంటే, ఆ నాటి సాయంత్రం జరిగిన మరికొన్ని సంఘటనలు అతని మదిలో మెదిలాయి. పందానికి సిద్ధపడ్డ తర్వాత, ఆ యువకుడు బ్యాంకు ఉద్యోగి పర్యవేక్షణలో అతని పెరట్లో ఉన్న ఒక గదిలో తన పదిహేను సంవత్సరాల జీవితాన్ని ఒంటరిగా గడపాలని నిర్ణయించారు. ఈ నిర్భందన సమయంలో అతను గది దాటి బయటకు రావడానికి వీలు లేదు. మానవమాత్రుని చూడటం కాని, మాట్లాడటం కాని, ఉత్తరప్రత్యుత్తరాలు జరపటం కాని, పత్రికలు చదవడం చేయరాదు. అతనికి వాద్య పరికరాలు, పుస్తకాలు ఇవ్వబడతాయి. కావాలంటే తాను ఉత్తరాలు రాసుకోవచ్చు. ఆహ్లాదం కొరకు మందు, పొగ త్రాగ వచ్చు. ఈ షరతులతోపాటుగా, బయట ప్రపంచాన్ని చూడటానికి వీలుగా అతని గదిలో చిన్ని కిటికీని ఏర్పాటు చేశారు. అతనికి కావల్సిన ఏ వస్తువైనా, పుస్తకాలు, సంగీతం, మందు యదేచ్ఛగా ఎంతకావాలన్నా లిఖిత పూర్వకంగా అడగవచ్చు. బాహ్య ప్రపంచానికి అతనికి గల ఏకైక వారథి ఆ చిన్ని కిటికి. అన్ని షరతులను విధించి పదిహేను సంవత్సరాలపాటు ఆ యువకుడు యావజ్జీవ కారాగారాన్ని అనుభవించేటట్టుగా ఒప్పందాన్ని పకడ్బందిగా కుదుర్చుకున్నారు. ఈ పందెం నవంబరు 14, 1870 మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై, నవంబరు 14 1885 మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముగుస్తుంది. అతని వైపు నుంచి షరతులను విచ్ఛినం చేయడానికి ఎటువంటి ప్రయత్నం జరిగినా, బ్యాంకు ఉద్యోగి ఇరవై లక్షలు ఇవ్వనవసరం లేదు.

పందెం మొదటి సంవత్సరం ఆ యువ ఖైది వ్రాసిన ఉత్తరాలను బట్టి అతను తీవ్రమైన నిరాశా, నిస్పృహలకు లోనై, ఒంటరితనాన్ని అనుభవించినట్టు అర్థమవుతుంది. అతని గది నుంచి నిరంతం పియోనా శబ్ధ విన్పిస్తుండేది. అతను మద్యానికి, పొగకు దూరంగా ఉన్నాడు. మద్యం తాగితే మనిషిలోని కోరికలు గుర్రాలయి పరుగులడతాయని, కోరిక ఖైదీల ముఖ్య బలహీనతని రాశాడు. పైపెచ్చు మద్యం సేవించి, మనిషి సాంగత్యం కరువైతే, ఆ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఇక పొగాకు కంపు ఆ చిన్ని గదిలో శ్వాస ఆడకుండా చేస్తుందని చెప్పాడు. మొదటి సంవత్సరం అతను ప్రేమ, అద్భుత రసాలు కలిగిన సంచలనత్మక ఇతివృత్తాలు గల వినోదాత్మక నవలలు కోరాడు.

రెండవ సంవత్సరం అతని గదిలో సంగీతం ధ్వనించలేదు. కేవలం కళాత్మకమైన నవలలను మాత్రమే ఖైదీ అడిగాడు. ఇక ఐదవ సంవత్సరం మళ్లీ అతని గది నుంచి సంగీత తరంగాలు వినిపించాయి. ఈసారి కొంత మదిరను ఖైదీ కోరాడు. ఆ సంవత్సరమంతా కేవలం తిని, తాగి బద్దకంగా మంచంపై పడుకోవడం లేదా కోపంగా తనలోతాను మాట్లాడుకోవడమో చేసే వాడని, అతనిని కిటికి ద్వారా గమనించినవారు వారు చెప్పారు. ఎటువంటి పుస్తకాల జోలికి అతను పోలేదు. కొన్నిసార్లు మాత్రం మధ్య రాత్రి నిద్ర లేచి గంటల తరబడి ఏదో రాసుకోవడం, తెల్లారగానే వాటిని చింపి పోగులు పెట్టడం చేసేవాడు. కొన్నిసార్లు అతని గది నుంచి ఏడుస్తున్న శబ్ధం కూడా వినిపించేది.

ఆరో సంవత్సరం ద్వితియార్ధంలో అతను వివిధ భాషలను అధ్యయనం చేయటంతోపాటు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలను, వేదాంత గ్రంధాలను పఠించాడు. అతను ఎంతలా అధ్యయనం చేసాడంటే, ఒకానొక సమయంలో ఆ బ్యాంకు ఉద్యోగికి పుస్తకాలు తెప్పించటమంటే చికాకు పుట్టింది. నాలుగు సంవత్సరాలలో 600 పుస్తకాలు ఆ యువకుడు అధ్యయనం చేశాడు. ఈ సమయంలోనే బ్యాంకు ఉద్యోగికి ఖైదీ నుంచి ఒక ఉత్తరం అందింది.

‘‘ నా ప్రియమైన జైలర్ కు,

నేను ఈ పంక్తులను ఆరు భాషలలో రాశాను. వీటిని ఆయా భాషల్లో నిష్ణాతులైన వారికిచ్చి చదవమనండి. అందులో ఒక్క తప్పు కూడా దొర్లకపోతే, మీ పెరట్లో నిలబడి గాల్లోకి ఒక తుపాకి గుండు పేల్చండి. దాని వల్ల నా ప్రయత్నం వృధా కాలేదని నాకర్థమవుతుంది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో, వయోబేధం లేకుండా మేధావులందరూ ఒకే రకమైన జిజ్ఞాస కలిగి ఉంటారు. నాలో చిగురించిన ఈ జ్ఞానజ్యోతి వల్ల నా హృదయంతరాళాలలో పెల్లుబుకుతున్న సంతోషం నీకు కూడా అనుభవంలోకి వస్తే గాని నీకర్థం కాదు.’’ ఆ ఖైదీ కోరికలన్ని నేటితో ఫలించాయి. బ్యాంకు ఉద్యోగి రెండు బుల్లెట్లను గాలిలోకి పేల్చాడు.

పదో సంవత్సరం, ఆ ఏకాంతవాసి తన బల్ల దగ్గర కూర్చుని తదేకంగా బైబిల్ బోధనలను పఠించసాగాడు. నాలుగు సంవత్సరాలలో ఆరు వందల పుస్తకాలను ఔపోసన పట్టిన వ్యక్తి, సంవత్సరమంతా కేవలం ఒక్క గ్రంధాలోని కొన్ని సూక్తిముక్తావళిలను చదువుతూ, తన సమయాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నాడో ఆ బ్యాంకు ఉద్యోగికి అర్థం కాలేదు. ఏసుక్రీస్తు బోధనలనంతరం మత శాస్త్రాలకు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలను పఠించాడు.

చివరి రెండు సంవత్సరాల నిర్బంధంలో లెక్కకు మిక్కటంగా వివిధ అంశాలకు చెందిన అనేక పుస్తకాలను ఆ కారాగారవాసి చదివాడు. ఒకసారి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు చదివితే, మరోసారి షేక్స్పియర్, బైరాన్ అతని చేతుల్లో మెదిలారు. ఒకే సమయంలో రసాయన, వైద్య శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు, మత సంబంధిత, వేదాంత గ్రంధాలను అతను కోరాడు. నడి సముద్రంలో గాలివానుకు చెల్లాచెదురైన నౌక నుంచి ఒడ్డుకు చేరుకోవడానికి ఒక మనిషి తపనతో, ఆరాటంతో చేతికందిన దుంగనో, వస్తువునో పట్టుకుని ఈదినట్టుగా అతను తీరుతెన్నులేకుండా పుస్తకాలను చదివాడు.

ఇవన్నీ తలుచుకుంటు ఆ బ్యాంకు ఉద్యోగి: ‘‘రేపు పన్నెండు గంటలకు అతను స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటాడు. ఒప్పందం ప్రకారం తాను ఇరవైలక్షల రూపాయాలు ఇవ్వాలి. ఆ ధనాన్ని ఇవ్వటంతో, ఇన్నాళ్లుగా అతనితో ఉన్న సంబంధం తీరిపోతుంది. కానీ, నేను పూర్తిగా నాశనమైపోతాను,’’ అని ఆలోచించసాగాడు.

పదిహేనేళ్లక్రితం ఇరవై లక్షలంటే తనకు లెక్కలేదు. కాని నేడు తన వద్ద ఆస్తులా, అప్పులా ఏవీ ఎక్కువగా ఉన్నాయని ఆలోచించడానికే భయమేస్తోంది. అహంకారంతో, అతి ఉత్సాహంతో అడ్డు అదుపు లేకుండా స్టాంక్ ఎక్స్చేంజ్ లలో చేసిన పెట్టుబడల వల్ల నేడు తాను సర్వం కోల్పోయాడు. గర్వం, నిర్భయత, ఆత్మ విశ్వాసంతో విర్రవీగిన లక్షాధికారి, పెత్తందారి, నేడు ఎందుకు కొరగాని చిన్ని బ్యాంక్ ఉద్యోగిగా మిగిలిపోయాడు. ఈ పందెం తనకోక శాపంగా మారిందని తలపట్టుకుని నిస్సహాయంగా కూలబడ్డాడు. ‘‘కారాగారంలోని ఆ వ్యక్తి ఎందుకు చనిపోలేదు. అతని వయసు నలభైలోపలే. నా నుంచి ఈ సొమ్ము తీసుకుని, చక్కగా పెళ్లిచేసుకుని పిల్లాపాపలతో సుఖంగా ఉంటాడు. తానిచ్చిన డబ్బుని పెట్టుబడులుగా పెట్టి లక్షలు ఆర్జిస్తాడు. నేను మాత్రం సర్వం కోల్పోయి అతని పట్ల అసూయతో బికారిగా మిగిలిపోతాను. అతను ప్రతిరోజు నా వల్లనే జీవితంలో భోగభాగ్యాలని అనుభవిస్తున్నాను, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను, అందుకే నాకు చేతనైనంత సహాయాన్ని చేయనీయండని అడుగుతుంటే భరించలేను. ఈ అవమానకరమైన జీవితం నుంచి విముక్తి పొందాలంటే, అతని చావు ఒక్కటే పరిష్కారం.’’
గడియారం 3 గంటలు కొట్టింది. బయట నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ, గాలికి కంపిస్తున్న చిగురుటాకుల శబ్ధం విన్పిస్తోంది. శబ్ధం చేయకుండా అడుగులో, అడుగు వేసుకుంటూ నెమ్మదిగా బీరువాలోంచి పదిహేనేళ్లపాటు తెరుచుకోని గది తలుపుల తాళం తీసుకుని బయటకు దారితీసాడు.

చీకటి, చల్లదనం పెరటిని కప్పేసాయి. చిన్నగా వర్షం కురుస్తోంది. హోరుగాలితో చెట్లు నిరంతరంగా ఊగుతున్నాయి. చిమ్మ చీకట్లో నింగి,నేల, చెట్టు పుట్టా, పెరట్లో గది ఏదీ ఆ బ్యాంకు ఉద్యోగి కంటికి కానరావట్లేదు. రెండుసార్లు ఎలుగెత్తి కాపలాదారుడ్ని పిలిచి, ప్రయోజనం లేకపోయింది. ఎవ్వరూ సమాధానమివ్వలేదు. ఈ భయకరమైన వాతావరణానికి అతను కూడా లోపల వంటగదిలోనో, మరెక్కడో నిదురపోతున్నట్టున్నాడు.

‘‘నేను అనుకున్నది సాధిస్తే, మొదటి అనుమానం కాపలాదారుడి మీదే పడుతుంది,’’ అనుకున్నాడు ఆ బ్యాంకు ఉద్యోగి. నెమ్మదిగా తచ్చాడుతూ చీకటిలో ఆ గది వైపుకు వెళ్లాడు. తడబడుతూ అగ్గిపుల్ల వెలిగించాడు. అక్కడి మనిషిన్నవాడి ఛాయలు కూడా లేవు. ఒక మూలన చిన్న స్టౌ, పరుపులేకుండా మంచం ఉన్నాయి. ఖైదీ ఉన్న గది తలుపులు మూసినవి మూసినట్టే ఉన్నాయి.

చేతిలోని అగ్గిపుల్ల ఆరిపోయింది. తన ఉద్వేగాన్ని అణుచుకుంటూ, ఆ వృద్ధుడు చిన్ని కిటికి గుండా లోనికి తొంగి చూశాడు. ఖైదీ గదిలో ఒక కొవ్వత్తి మిణుకు, మిణుకుమంటూ వెలుగుతోంది. అతను బల్ల వద్ద కూర్చుని ఉన్నాడు. అతని వీపు భాగం, తైల సంస్కారంలేని తలపై జుట్టు, అతని చేతుల తప్ప మరేమీ కన్పించలేదు. టేబుల్ మీద దగ్గర కూర్చీలో, నేలపై తివాచీ మీద ఎక్కడపడితే అక్కడ తెరిచిన పుస్తకాలు పరిచి ఉన్నాయి.

ఐదు నిమిషాలు గడిచినా ఆ ఖైది వెనక్కి తిరిగి చూడలేదు. పదిహేనేళ్ల కారాగార జీవితం అతనికి నిఠారుగా గంటలు తరబడి కూర్చోవడం నేర్పింది. బ్యాంకు ఉద్యోగి, కిటికి మీద తన చేతి వేళ్లతో నెమ్మది తట్టాడు. అయినా, ఖైదీ ఎటువంటి కదలిక లేదు. బ్యాంకు ఉద్యోగి జాగ్రత్తగా తలుపుకున్నా తాళం కప్పలో చెవిని దూర్చాడు. తప్పుపట్టి ఉండటంతో కీచుమంటూ తలుపులు తెరుచుకున్నాయి. ఆనందభాష్పాలు రాలుస్తూ, తనవైను వేగంగా అడుగులు వస్తాయని ఎదురు చూసిన అతనికి నిరాశే కలిగింది. మూడు నిమిషాలు గడిచిన నిశ్శబ్ధం తాండవించటంతో తానే లోపలికి వెళ్లాడు.

టేబుల్ వద్ద ఆ వ్యక్తి చలనం లేకుండా కూర్చుని ఉన్నాడు. మాసిన గెడ్డంతో, వలయాకారంలో ముడతలుపడిని చర్మంతో ఒక అస్తిపంజరం తన ఎదుట సాక్షాత్కరించింది. బుగ్గలు చొట్టలు పడి, లోపలికిపోయి, పసుపు రంగులో పాలిపోయిన ముఖం, బరువుతో ఒక పక్కకు వాలిపోయిన తల బక్కచిక్కి శల్యమై, చూస్తే వెన్నులో ఒణుకు పుట్టించేటట్టుగా ఉన్నాడతను. తల నెరసి, ముదురు చర్మంతో ఒడలిన ముసలి ముఖం అతను నలభై ఏళ్లవాడంటే నమ్మశక్యం కాదు. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. టేబుల్ మీద చక్కని చేతివ్రాతతో రాసిన ఒక కాగితం అతని తలకింద రెప,రెపలాడుతోంది.

అతని చూస్తే బ్యాంకు ఉద్యోగి ఆ వ్యక్తిని జాలిగా చూస్తూ, ‘‘పాపం. తనకు రాబోయే లక్షలను తలుచుకుంటూ ఆదమర్చి నిదరపోతున్నట్టున్నాడు. ఈ సగం చచ్చిన వ్యక్తిని మంచెం మీదకు చేర్చి, దిండు మొఖం మీద పెట్టి గట్టిగా అదిమితే చాలు. ఎలాంటి నేర పరిశోధకులైనా, హత్య జరిగిందని గుర్తించలేరు. కానీ ముందు ఆ ఉత్తరంలో ఏమీ రాశాడో చదువుదాం….’’ అనుకున్నాడు.

టేబుల్ పైన కాగితాన్ని తీసుకుని ఆ బ్యాంకు ఉద్యోగి చదవసాగాడు.

‘‘రేపు పన్నెండు గంటలకు నాకు మళ్లీ స్వాతంత్ర్యం వస్తుంది. ఈ గదిని వీడి వెలుతురులోకి, జన స్రవంతి లోకి వెళ్లవెచ్చు. మనుషులతో సాంగిత్యం పొందే ముందు, నీకు కొన్ని మాటలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. నన్ను పుట్టించిన ఆ దేవుని సాక్షిగా, ఆ దేవుని చేతిలో ఊపిరిపోసుకున్నాయని ఈ పుస్తకాల్లో రాసిన, చెపుతున్న జీవకోటిని, నా ఆరోగ్యాన్ని, జీవితాన్ని, స్వేచ్ఛను సంపూర్ణ స్పృహతో తృణీకరిస్తున్నాను.’’

‘‘పదిహేనేళ్లుగా ఈ జీవిత పరమార్థాన్ని అధ్యయనం చేశాను. ఇన్నేళ్లుగా నేను భూమ్యాకాశాలను, జనాలను చూడలేదు, ఇది నిజం. కానీ, నీ పుస్తకాలతో నేను సాంగత్యం చేశాను. ఆ పుస్తకాలలో నేను మత్తుగా మునిగి తేలాను. వాటితో కలిసి పాటలు పాడాను; స్త్రీలను ప్రేమించాను; అరణ్యాలలో అడవి పందులను, దుప్పిలను వేటాడాను; కవుల, పండితుల కవిత్వ సౌరభాలలో ఊయలలూగాను; రాత్రిళ్లు ఆ సౌరభాలు నన్ను తట్టిలేపుతుంటే, వాటి గుస,గుసలు నా మస్తికంలో సుడిగుండాల్లా తిరిగాయి. నీ పుస్తకాలలో నేను ఎల్బర్జ్, బ్లాన్క్ పర్వత శ్రేణులనధిరోహించాను. అక్కడ నుంచి తెల్లవారుజామున తూర్పున ఉదయించి, సాయంత్రవేళ పడమర తీరాన ఆకాశపు అంచులను తాకుతున్న, సముద్రంలోకి చేరుతున, పర్వత శిఖరాగ్రాన్ని చుంబిస్తున్న, ఎర్రటి రంగును అదుముకున్న బంగారు రవికిరణాలను వీక్షించాను. నా నడినెత్తిన వెలుతురు చిమ్మి, మబ్బులను తాకి తుఫాను పుట్టిన వైనాన్ని పరికించాను. దట్టమైన అరణ్యాలు, పచ్చటి పైరులు, వాగులు, వంకలు, నదులు, పట్టణాలు తిలకించాను. పశువుల కాపర్ల మురళీ ధ్వనులు, భయాందోళనలతో చేసిన ప్రతిధ్వనులు విన్నాను. భగవంతుని గురించి నాతో సంభాషించడానికి వచ్చి దూతల రెక్కలు నిమిరాను …. నీ పుస్తకాలలో నేను ఎంత లోతుకు వెళ్లానంటే, ఎన్నో ఇంద్రజాలాలు చేశాను; రాజ్యాలను జయించాను; పట్టణాలను ధ్వంసం చేసాను; కొత్త మతాలను, భావాలను ఉద్భోదించాను….’’

‘‘నీ పుస్తకాలు నాకు జ్ఞానాన్ని ఒసగాయి. ఇన్నేళ్లుగా నా మెదుడులో గూడుకుట్టున్న అనిశ్చిత నేడు మార్గదర్శికగా మారింది. మీ అందరితో పోలిస్తే, నేడు నేను జ్ఞానవంతుడిని, మేధావిని.’’

‘‘కానీ, నీ పుస్తకాలన్నా, ఈ జ్ఞానమన్నా, ఈ ప్రపంచమన్నా నాకు ఏహ్యం కలుగుతోంది. ఇదంతా వృధా, ఒక మాయ, ఎండమావిలాగా అభూత కల్పన. నేను తెలివైనవాడిని, సుఖంగా ఉన్నానని ఒక చిట్టెలుక బొరియ తవ్వుకుని అందులో ఉన్నట్టుగా గర్వపడవచ్చు, కానీ నీవు అణురేణువు మాత్రమే మృత్యవు నిన్ను కబళించక మానదు. నీ తెలివితేటలు, నీ ఐశ్వర్యం, నీ వంశ చరిత్ర కాలగర్భంలో కలిసి పోతాయి.’’

‘‘నువ్వు నీ జీవిత పరమావథిని కోల్పోయి, ఎండమావుల వెంట పరిగెడుతున్నావు. సత్యాన్ని వదలి అసత్యాన్ని, మంచిని వీడి చెడును ఆహ్వానించావు. రేపటినాడు గులాబీలు దుర్గంధాన్ని వెదజల్లినా, ఫల వృక్షాలకు కప్పలో, బల్లులో పుట్టుకొచ్చినా నీవు ఆశ్చర్యపడవు కదా ఆస్వాదిస్తావు. నీవు స్వర్గాన్ని జారవిడిచి, నరకతుల్యమైన భోగాలను ఆశించటం నాకు ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. నిన్ను అర్థం చేసుకోవాలని కూడా నా కన్పించట్లేదు.’’

‘‘నీవు ఎలాంటి హీనమైన జీవితాన్ని ఆకాంక్షిస్తున్నావో నిరూపించడానికి, ఒకప్పుడు భోగాలనే స్వర్గమనే భ్రమలో బతికిన నేను, పందెంలో గెలుచుకున్న ఇరవై లక్షల రూపాయలను త్యజిస్తున్నాను. ఆ ధనంపై నా హక్కును వదులు కోవడానికే, ఇక్కడి నుంచి నేను ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, సమయాని కంటే ఐదుగంటల ముందు ఇక్కడ నుంచి నిష్క్రమిస్తున్నాను…’’

ఆ ఉత్తరాన్ని టేబుల్ పై జారవిడిచి, ఆ ఒంటరి మానవుని తల ముద్దాడి, భారమైన గుండెలతో, అశ్రునయనాలతో బ్యాంకు ఉద్యోగి గది నుంచి వెలుపలికి వెళ్లాడు. స్టాక్ ఎక్స్చేంజ్ లో భారీగా నష్టాలు వచ్చినప్పుడు కూడా ఇంతలా ఆ ఉద్యోగి భావోద్వేగానికి గురవ్వలేదు. ఇంటికి తిరిగి వచ్చి తన మంచంపై వాలినా, కన్నీటి ధారాలు ఆగలేదు. కంటి మీదకు కునుకు రాలేదు.

మర్నాడు పొద్దున ఆ ఏకాంతవాసి కిటికి నుంచి బయటకు దూకి, వెళ్లిపోతుండగా చూశానని పాలిపోయిన మొహంతో వచ్చి కాపలాదారుడు చెప్పాడు. బ్యాంకు ఉద్యోగి ఉన్నపళంగా పనివారిని వెంట పెట్టుకొని పెరటిలోని గదికి వెళ్లి ఆ వ్యక్తి వెళ్లిపోయాడని నిర్ధారించుకుని, వివాదాలకు తావు లేకుండా, టేబుల్ పైన ఉన్న ఉత్తరాన్ని తెచ్చి, తన బీరువా వేసి తాళం వేశాడు.

అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *