కొన్ని నెలల విరామం తర్వాత స్నేహితుల ప్రోద్భలంతో తిరిగి నాకు తోచిన విషయాలపై వ్యాసాలు రాద్దామని కూర్చున్నా, ఏ విషయంపై రాయాలి అన్న మీమాంస బయలుదేరింది. ఎక్కడో అక్కడ మొదలు పెట్టకపోతే అసలు రాయడం కుదరదని కూడా అన్పించింది. అదే సమయంలో ఒక బ్లాగ్ లో సినిమా సాహిత్యం, సాహిత్యమేనా అన్న ప్రశ్న కన్పించింది. నిజమే! సినీ సాహిత్యం అంటే ఎందుకు అంత చులకన? పానుగంటివారి ‘కంఠాభరణం’ నాటకంలోని జంట కవులలో ఒకడు, ‘‘ఆశుకవిత యొకటి, ఆవు పేడ యొకటి స్వయముగానే శుద్ధ చయము భువిని’’ అంటాడు. సినిమా పాటను కూడా ఈ శుద్ధచయములో చేర్చుకో వచ్చని అభిప్రాయపడ్డారు శ్రీశ్రీగారు. అయితే, శ్రీశ్రీగారి కాలానికి, నేటికి సినీ సాహిత్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయినా, ఇక్కడ ప్రధాన ప్రశ్న అసలు సినీ గీతాలు సాహిత్యంలో భాగమా, కాదా?
అంతకంటే ముందు సాహిత్యం అనే పదానికి అర్థం ఏమిటి? అని ఆలోచించాలి. కేవలం అక్షరాలతో సాన్నిహిత్యం కలిగి ఉండటమేనా సాహిత్యం అంటే? ‘‘హితేన సహితం సాహిత్యం’’, అన్నది నానుడి. అంటే మేలు చేసేది సాహిత్యం. ఆ మేలు ఒక వ్యక్తికి కావచ్చు, సమాజానికి, జాతికి కావచ్చు. అయితే ఆ సాహిత్యం అందంగా, ఆనందాన్ని కల్గించేదిగా ఉండాలి. సినీ సాహిత్యంలో తెలుగు భాషలోని తియ్యదనం, అందాలు, సొగసులు, సోయగాలు ఉంటాయా? ఉన్నాయా?
శ్రీశ్రీగారికి జాతీయస్థాయిలో ఉత్తమ గీతరచయితగా బహుమతిని తెచ్చిపెట్టని ‘తెలుగవీర లేవరా’ పాటలో ఒకచోట ‘ప్రతి మనిషి …. సింహాలై గర్జించాలి’ అని రాశారు. ఇందులో వ్యాకరణ దోషం ఉంది. ప్రతిమనిషి ఏక వచనం, సింహాలు బహువచనం. సింహంలా గర్జించాలి అనాలి. సంగీత, సాహిత్యాలపరంగా చూసినా ఇదే సరిపోతుందని, తన ద్వారా తప్పు దొర్లిందని శ్రీశ్రీగారే ఒప్పుకున్నారు. అది ఆయన సంస్కారం. కానీ పరిశీలిస్తే, నేటి సినీగీతాల్లో ఇలాంటివి కొకొల్లలుగా కన్పిస్తాయి. అసలు నేడు తెలుగు పాటలో తెలుగు నేతిబీరకారయలో నెయ్యంత! ఇక వాటిలో సాహిత్యం విలువలను వెదకటం అనవసరమని నా అభిప్రాయం. సాహిత్యం అంటే ప్రబంధాలు, కావ్యాలు, యక్షగానాలు, శతకాలు, చాటువులు, కవితలు, జానపద గేయాలు, పద్యనాటకాలు, అవధానాలు ఇలా ఎన్నోరకాలున్నాయి. సినీ సాహిత్యాన్ని వీటితో పోల్చటం అవివేకం. ఇందులో చేర్చటం అంతకంటే తెలివితక్కువపని. కాకపోతే పైన చెప్పిన విధంగా సమాజ శ్రేయస్సును కల్గి, తెలుగుతనం గల పాటలను అత్యుత్తమ సాహితీ విలువలు గల పాటలని అనవచ్చేమో!
మూలకథను ముందుకు నడిపేవిధంగా, పాత్రల, కథా ఔచిత్యం ఉట్టిపడేటట్టుగా, సంగీత ప్రాధాన్యంగా సినీ గీతాలుండాలి. సందర్భానుసారంగా సాగే ఈ పాటల్లో, భాష, సాహిత్యం మనోరంజకంగా నాటి సినీ గీతాలుండేవి. కవులు కూడా అలాంటి పాటలు రాయాలని ఉవ్విళ్ళూరుతుండేవారు. కానీ నేటి పాటలు, పాశ్చాత్య పోకడలతో అన్యదేశ్యాలతో (అంటే ఇతర భాషాపదాలు) అన్యభాషా గాయకుల స్వరాలతో నిండిపోతున్నాయి. సీను, సీనుకి సీటీలు కొట్టించాలన్న తాపత్రయమే కాని మన భాష, సంస్కృతి ఎటుపోతున్నాయన్న ఆలోచనే లేదు. ఎందుకు బాపు, విశ్వనాథ్ లాంటి కొద్దిమంది దర్శకుల సినిమాలలో మాత్రమే సాహిత్యం ఉట్టిపడే పాటలు పదే, పదే వస్తున్నాయి?
‘మనసు మాటకందని నాడు మథురమైన పాటవుతుంది, మథురమైన వేదనలోనే పాటకి పల్లవి పుడుతుంది’ అని వేటూరిగారన్నట్టు, ఒక మంచి పాటనందించాలని కవి పురిటినొప్పులు పడ్డప్పుడే భావుకత నిండిన సాహిత్యం పుడుతుంది. ‘కుమ్మరి మొల్ల’ సినిమాలో మొల్ల ప్రతిభను పరిశీలించడానికి తెనాలి రామలింగడు సమస్యను ఇచ్చే సందర్భంలో ఒక పద్యం రాయవల్సి వచ్చి శ్రీశ్రీగారు, అవధాన ప్రక్రియలో అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు అనే దత్తపదాలను తీసుకొని పద్యంలో అప్పు అంటే ఋణం, నిప్పు అంటె అగ్ని, మెప్పు అంటే ప్రశంస, చెప్పు అంటే పాదరక్ష అనే అర్ధాలు రాకుండా ఈ కింది కంద పద్యం రాశారు.
అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్!
అగాథమవు జలనిధిలోనా అణిముత్యమున్నటులే, శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అని వేదాంత సారాన్ని హృద్యంగా చెప్పగలిగే అభ్యుదయ కవి నుంచి ఇలాంటి పద్యాన్ని ఎవరూ ఊహించరు. అలాగే ఆ మహాకవి కులగోత్రాలు సినిమా కోసం మీసం మీద రాసిన సీసం ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుకు చేసుకుందాం.
కారుమబ్బుల బారు సేరునేలెడి తీరు
కోరమీసము పొందు కొరుకొందు
మృగరాజు జాలునే తెగనొడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భారము
ఆదిశేషుడా, కూర్మమా, కాదు కాదు
అష్టదిగ్గజ కూటమా? అదియు కాదు
ఆరేసుకోబోయి, పారేసుకున్నానని ద్వంద్వార్ధాలు పలికే పాటలు రాసిన వేటూరిగారి పాటల నిండా శబ్ద, అర్ధాంలకారాలు మనని ఆశ్చర్య పరచక మానవు.
కుశుమించు అందాలు కుశలమా? వికసించే పరువాలు పదిలమా?
గజ్జె ఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది, గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది
మా ఱేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ
ఓ చుక్కా నవ్వే నావకు చుక్కానవ్వే
ఏకులమూ నీదంటే గోకులమూ నవ్విందీ
పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా?
కైలాసాన కార్తీకాన శివరూపం,ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం
నెమలికి నేర్పిన నడకలివీ, మురళికి అందని పలుకులివీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొకొల్లలు.
సరళమైన పదాలతో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయెలే అంటూ ఆర్ద్రతతో రచనలు చేసిన వేటూరిగారు ఒకనానొక సందర్భంలో, ‘తెలుగులో రాయడానికి తగిన అమరిక ఈనాటి యుగళ గీతాలలో లేదు. సందెగాలి, చందమామ, మల్లెపూలు, మంచిగంధం, ఏటివొడ్డు, పడవ ప్రయాణం, గుడి గంటలూ, ఆకుపచ్చ చేలూ, చిలకపచ్చ చీరలూ, కట్టూ బొట్టూ, గుట్టూ మట్టూ లేని శృంగారానికి సరిపోవని తెలుగు భాష ఏనాడో సవినయంగా ఒప్పుకుంది. ‘‘సీతారామయ్య గారి మనవరాలు” తరువాత నేను రాసిన తెలుగు పాటల్లో నేనే తెలుగుతనాన్ని వెతుక్కోవాల్సిన స్థితిలో పడ్డానని వాపోయారు. వినోదమే ప్రధానమై సినిమా పాటల్లో, తెలుగు మాట, తెలుగు పదం, తెలుగు నుడికారం ఏరువాకై సాగాలనుకోవడం అత్యాశే!
సౌమ్యశ్రీ రాళ్లభండి