
బుఱ్ఱలే రెండైదులున్నా
బుద్ధిమాత్రం నీకు సున్నా
అరే అంటా వెవడురా నువ్వు?
శ్రీరామబంటును
ఒరే అంటా వెవడురా నువ్వు?
కోతియంటూ ప్రేలితివి నీ
మూతిపై తన్నెదను కానీ
రాముడికి నిన్నట్టే పెట్టాను
నేపోయి వెంటనె
రాము నిపుడే పట్టుకొస్తాను
ఈ రావణ, హనుమంతుని సంవాదం నదీరా రచించిన సంపూర్ణ రామయణం అనే బుఱ్ధకథలోనిది. తెలుగునాట వెలుగొందిన అనేకానేక జానపద కళలలో బుఱ్ఱకథ ఒకటి. పుర్రెకో బుద్ధి అన్న నానుడి మన తెలుగునాట ప్రచారంలో ఉంది. అలాంటి పుర్రెలను ఊగించేదే బుఱ్ఱకథ. మనిషికో బుఱ్ఱ ఉంటే దానికో కథ కూడా తప్పనిసరిగా ఉంటుంది. రాగ,తాళ,నృత్యాలతో పండితపామరులను రంజింపచేసే జానపద కళ బుర్రకథ. మూడు బుర్రలను పలికిస్తూ, ముగ్గురు ముచ్చటగా అభినయిస్తూ, ఆలపించేదే బుర్రకథ. బుర్రకథకు గల ఈ స్వరూప స్వభావాలను బట్టి జానపద ప్రక్రియలలో ప్రాచీనమైనట్టి జంగం కథలే మూలము. కథకుడు కాలికి గజ్జెలు కట్టి లయబద్ధంగా చేసే పదవిన్యాసం బుర్రకథ, జంగం కథలు, పదములని, తందనానా కథలని ప్రచారంలో ఉన్నాయి. కథకుడు చేతిలో సొరబుర్ర లేదా గుమ్మడి బుర్రతోనో చేసిన తంబూరా, శారద వంటి వాయిద్యాలను పలికిస్తూ కథాగానం చేయటం వల్లనే వీటికి బుర్రకథలని పేరు వచ్చింది.
సాంకేతిక పరిజ్ఞానం పెరగకముందు జనాలను ఆకర్షించి, ప్రచారాలను చేయటానికి పల్లెలలో ఈ బుర్రకథలను విరివిగా వినియోగించేవారు. లలితమైన కథా, కథనాలతో, సున్నితమైన హాస్యంతో, గంభీరమైన గాత్రంతో ప్రజలను కట్టిపడేసే ఈ కళా ప్రక్రియకు పెద్ద హంగులేమి అక్కర్లేదు, అనుకుంటే పొరపాటే. శృతిలేని పాట మతిలేని మాట, తాళంలేని గీతం శీలం లేని నాతి వంటిందని ఆంధ్రబుర్రకథ పితామహ నాజర్ అభిప్రాయం. తంబూరా, జోడు గుమ్మెటలు, అందెలు, గజ్జెలు, కథకు తగ్గ వేషాధారణ బుర్రకథకు ముఖ్యం.
జోడు గుమ్మెటలు తాధిమి యనగ
తోడుగ వంతలు ఆడిపాడగా
రాగతాళగీతాది నృత్యముల తంబుర కథ వినుడీ అని నాజర్ అంటే,
రవ్వల వెల్గుల జీవకళల నవ
రసముల కురిపించి
రాగతాళ గీతాదుల నృత్యపు
రవళి రంగరించి
అందెలు గజ్జెలు జోడు గుమ్మెటలు
హంగులీను చుండ
ఆడిపాడెదము తంబురగాథను
అన్నలార వినుడు
అని నదీరా అనే మరో రచయిత బుఱ్ఱకథ ప్రాముఖ్యాన్ని, విశేషాన్ని తెలిపాడు.
ప్రజారంజకంగా, శ్రావ్యంగా ఆలపిస్తూ కథను నడిపే కథకుడు బుఱ్ఱకథకు ఎంతముఖ్యమో, అతని ప్రక్కల చేరి వంతపాడే వంతలిద్దరూ కూడా అంతే ముఖ్యం. ఎవరైనా చెప్పిన ప్రతీదానికి అవునని తలవూపితే వంతపాడతున్నారనడం బుర్రకథలోని ఈ వంతపాడటం నుంచే ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. ఈ వంత పాటలు కథానుగుణంగా ఉండి కథను రక్తి కట్టిస్తాయి. భళానంటి భాయి తమ్ముడా – సై భాయి భళానోయి దాదానా, తందన భాయీ దేవనందనానా వంటి వంత పాటలు బహుళ ప్రాచుర్యం పొందాయి. వంతలు ఉపయోగించిన ఈ వంతలు, అన్నమాచార్య పదాలలో చక్కని తల్లికి ఛాంగుభళా, తందనానా ఆహి తందనానా వంటి ప్రయోగాలలో మనకు కన్పిస్తాయి. దీనిని బట్టి ఈ బుర్రకథా రూపం ప్రాచీనమైనదని, తెలుగునాట అనాదిగా ప్రచారంలో ఉందని తెలుస్తోంది. వంతలు పలికే చిన్న,చిన్న మాటలే కథనానికి కొన్నిసార్లు ఊపునిస్తాయనడానికి లక్ష్మీబాయి లోని ఈ ఘట్టంమే నిదర్శనం.
అప్పుడు తాంతియా యెలా వున్నాడు?
కరకర జాబుల చదివెరా సై
కనుగుడ్లెర్రన జేసెరా సై
గిర్రున మీసం దువ్వెరా సై
చర్రున ఖడ్గం దూసెరా సై
కుంఫిణి గుంపుల కిప్పుడే సై
కాలం తీరిన దంటాడు సై
ముందూ గుర్రాల్ దండురా సై
మధ్యన కాల్బాలమ్మురా సై
వెనుకను యేనుగ గుంపుతో సై
వీర మరాఠా తాంతియా సై
వైరి బలగముల పైననూ సై
వెనుక తట్టువచ్చు చున్నాడూ సై
ఒక మంచి కథను చెప్పె కథకుడు ఎంత అవసరమో, కథను రచించే కవి అంతకంటే ముఖ్యం. వీరిరువురు బుర్రకథ అనే బండికి జోడెద్దుల వంటి వారు. ఏ ఒక్కరు లేకపోయినా బుర్రకథ రాణించదు. ప్రజాకవి నాజర్, సుంకర సత్యనారాయణ, కొసరాజు రాఘవయ్య చౌదరి, అభినవ పోతన వానమామలై వరదాచార్యులు, వారణాశి వేంకట నారాయణశాస్త్రి, ఎనమండ్ర సుబ్బారావు, నదీరా ఇలా అనేకమంది కవులు బుర్రకథలను రచించారు. కవులు రాసిన కథాఘట్టాలకనుగుణంగా కథకులు రాగ,తాళాలను ఎన్నుకొని కథను రక్తికట్టిస్తాడు. ఉదాహరణకు యుద్ధఘట్టాలను శివరంజని రాగంలో, విచార ఘట్టాలను శ్రీరాగంలో, కథ ఎత్తుగడను దేవగాంధారి రాగంలో పాడితే కథ ఎంతో రక్తికడుతుంది.
బుర్రకథలలో రుద్రమదేవీ, అల్లూరి సీతారామరాజు, మహారధికర్ణ, ఖడ్గతిక్కన, ఝాన్సీరాణి, ఆంధ్రకేసరి వంటి కథలు ప్రజలలోకి చొచ్చుకొని వెళ్లాయి. రుద్రమదేవి కథలో గన్నారెడ్డి గుర్రపుస్వారీని సుంకర సత్యనారాయణ వర్ణించిన తీరు ఆ దృశ్యాన్ని కళ్లముందు సాక్షాత్కరింప చేస్తుంది.
అప్పుడు గన్నారెడ్డి సాహిణి
ఆజ్ఞలందుకుని అంబకు మ్రొక్కి
బిరానదట్టీ బిగించిగట్టి
జరీ అంచు తలపాగా చుట్టి
కుప్పించి పైకి లేచాడా
గుర్రంమీదే వాలాడా
కాళ్ళంకెమున పెట్టనేలేదు
కళ్ళెమైన చేపట్టనేలేదు
అరరే చూడుము దాని తామసం
అదురుపాటుగా లేచిన గుర్రం
మూడే చక్రాల్ గొట్టిందా
ముందుకు చెంగున దూకిందా
దూకిన గుర్రం మింటలేచెరా
ధూళి ఆకసం కాపులేచెరా
కన్నుమూసి కన్దెరువలేదురా
కంటికి గుర్రం కానరాదురా
గుట్టలు మిట్టలు దాటిందా
పిట్టవోలే అది పోతుందా
ఇక నాజర్ కలం నుంచి జలపాతంలా జాలువారిన పల్నాటి యుద్ధం, బొబ్బొలి యుద్ధం కథనాలు మానవతా విలువలను శ్రోతల గుండెల్లోకి తీసుకు వెళ్లాయి. ‘ధన నష్టం, జన నష్టం, రణమంటే ముదనష్టం’ అంటూ చక్కని కవిత ధోరణితో రాసిన కథనాలు బుర్ర కథకు వన్నెతెచ్చాయి. చంధోభూయిష్టమైన కవిత్వ కాదు బుర్రకథకు కావల్సింది, అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టుగా ఉండి, కథ తేలికగా అర్ధమయ్యేటట్టుగా ఉంటే గ్రామీణులను కట్టిపడేస్తాయి. నాజర్ రాసిన పల్నాటి యుద్ధంలోని ఈ కథనాన్ని చూడండి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
పట పటపట పండ్లుగొరుకుచు – పటుతర గతివేగ
కటకట కటకట కోరలొరిపిరిడికి – చిటపటయనెనిప్పుల్
రెట్టలు దట్టుచు అరేరేరేయని – మిట్టపడుచువేగ
పొట్టిమీసములు పట్టిదువ్వి – కనుబొమలు మడియబట్టి
పఠాకత్తులూ కఠారుబాకులు – తటాలునందుకొని
పెఠిల్లుమని కక్కటిల్లుచును – దిక్తటంబుల దరగను
గండ్రగొడ్డండ్లు కత్తులుబాణా – కర్రలు చేబూని
వేండ్రమైన రోకండ్లు గుదపలును – బిండివాలములును
తళతళ నాకసమందు మెరియగా – తలపడె నిరువాగు
కరులు సేనలను నురుమాడుచు – మున్ముందు కేగుచుండు
రణభేరి ధణధణలకు ధరణి – దద్దరిల్లుచుండ
శరవేగంబున శత్రుసేనలో – చొరబడి బాలుండు
ధరణిమీద నరివీరులతలలు – తరుగుచు బాలుండు
విచ్చుకత్తి నరి వీరులరొమ్ముల – కుమ్మిచిమ్ముచుండ
గుండెలు ప్రేవులు వొక్కుమ్మడిగా – తుండెములైజార
కొండలరీతిగ శవములన్నియు – గుట్టలుబడుచుండ
నెత్తురుచిమ్ముచు తలలు మొండెములు – దొర్లాడుచునుండ
శత్రుసేనలు చెదరి జెదరెను – చెట్లకు గుట్టలను
ప్రభోదాత్మక, చారిత్రాత్మిక, సాంఘిక ఇటివృత్తాలేకాకా పురాణగాథలు కూడా బుర్రకథలకు కథా వస్తువులే. రామాయణ, మహాభారత, భాగవత కథలు, పార్వతీ కల్యాణం, జిల్లేళ్లమూడి అమ్మ వంటి కథలు నదీరా ప్రజానురంజకంగా రాశారు. పార్వతీ కల్యాణంలో శివుడు మారువేషంలో వచ్చి, పార్వతీదేవీతో చేసే సంభాషణ ఎంతో ఆహ్లాదకరంగా ఉండి మనసులను రజింప చేస్తుంది.
వరునిగ నే తగనా ఆ
హరుని కోర తగునా
స్థిరుడుగాని శివుడు సదా తిరిపె మెత్తుకొనును కదా
ఇల్లు వల్లకాడు కదా పెళ్ళితడికి వృధా వృధా
జడలు పరమరోతకదా వొడలు బూదిపూత కదా
జటధారిని జత కోరెడి జడురాలొక ఆడుదా
తాళికట్టి వెంట పెట్టి జోలెను నీకంట కట్టిసౌమ్య
ఇంటింటా నిన్ను ద్రిప్పుటెంత తప్పు నీవెచెప్పు
అతడి మెడను కనుకొగొన్న అగపడును నాగన్న
ఆ వెర్రి నాగన్న అధికుడౌనె నాకన్న
అంటూ సాగే కవితా చతురతలతో బుర్రకథలు నాడు మన జనజీవన స్రవంతిలో కలిసిపోయాయి, నేడు కనుమరుగైపోతున్నాయి.
సౌమ్యశ్రీ రాళ్లభండి