అనువాద కథలు 5
కురిసేను వాన

మూలకథ రచన: రే బ్రాడ్ బెరి

లోపల గదిలో గోడ గడియారం టిక్.. టాక్.. అంటూ నెమ్మదిగా కదులుతోంది. అంతలోనే గడియారం నుంచి మంద్రస్థాయిలో సమయం ఏడయింది… లేవండి.. ఏడయింది లేవండి… అని ఒక గొంతు ఆత్రుతగా విన్పించింది. ఆ సూర్యోదయం వేళ ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది. గడియారం ముల్లు చప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తుంటే, సమయం ఏడు తొమ్మిది.. 7.09, అల్పాహార సమయం అనే చిలుక పలుకులు గడియారం పదే, పదే పలుకసాగింది.

వంటగదిలో స్టవ్ మీద సన్నగా సెగల చప్పుడు, కాలిన, వెచ్చని ఎనిమిది బ్రెడ్ ముక్కలు టోస్టర్ లోంచి బయటకు వచ్చాయి. అలాగే ఎనిమిది ఆమ్లెట్లు, 16 మాంసపు ముక్కలు, రెండు కాఫీలు, రెండు చల్లని పాల గ్లాసులు సిద్ధమయ్యాయి.

ఇంతలో వంటగది పైకప్పు నుంచి ‘‘ఇవాళ, అలెన్డెల్, కాలిఫోర్నియాలో ఆగష్టు 4, 2026’’ అని ఒక గొంతు విన్పించింది. అలా తారీఖును గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మూడుసార్లు విన్పించింది. ‘ఇవాళ ఫెదర్ స్టోన్ పుట్టినరోజు, టిల్టియా పెళ్లిరోజు, జీవిత భీమా, వాటర్, గ్యాస్ మరియు కరెంట్ బిల్లులు కట్టాల్పిన రోజు’ అంటూ ఒక కృత్రిమ గొంతు పలికింది.

ఎక్కడో గోడల మధ్య ఆ తర్వాత ప్రకటనలను సిద్ధం చేస్తూ, టేపులు ముందుకు కదిలాయి.

ఇంతలో గడియారం మళ్లీ టిక్.. టాక్.. సమయం ఎనిమిదైంది. 8.01 అయింది. స్కూళ్లకి, ఆఫీసులకి వెళ్లె సమయం అని పాటపాడింది. కానీ తలుపులు తెరుచుకోలేదు. మెత్తని తివాచీలపై పాదరక్షలు పరుగులెట్టలేదు. బయట వర్షం కురుస్తోంది. ప్రధాన ద్వారానికున్న వాతావరణ సూచిక, ‘వర్షం, వర్షం.. పారిపో… గొడుగులు, రైన్ కోట్లు ఇవాళ….’ అంటూ చేస్తున్న కూనిరాగం వాన చప్పుడులో కల్సిపోయి, ఆ ఖాళీ ఇంటిలో ప్రతిధ్వనించసాగింది.

బయట గ్యారేజీ తలుపు తెరుచుకుని, కారు వెళ్లడానికి దారినిచ్చింది. అలా చాలాసేపు ఎదురుచూసి కారు కదలకపోయేసరికి మళ్లీ తలుపులు మూసుకున్నాయి.

ఎనిమిదిన్నర అయ్యేసరికి బ్రెడ్ ముక్కలు రాళ్లల్లా తయారయ్యాయి. ఆమ్లెట్లు ముడుచుకుపోయాయి. ఇంతలో ఒక అల్యూమినియం గరిటె వాటిని తూములోకి నెట్టేసింది. వేడి నీళ్లలో అవి సుడులు తిరుగుతూ, ఇనుప గొంతులోకి వెళ్లి జీర్ణమవగా, చివరికి మిగిలిన వ్యర్ధాలని సముద్ర జలాల్లో కలిసిపోయాయి. ఎంగిలి గిన్నెలని వేడినీళ్లలో ముంచి శుభ్రం చేసి, ఎడపెట్టింది.

సమయం తొమ్మిది గంటల 15 నిమిషాలు. ఇల్లు శుభ్రం చేసే సమయం గడియారం మళ్లీ గొంతెత్తి పలికింది.

ఇంతలో గోడలోని ఒక చిన్న బొరియలోంచి మరఎలుకలు బయటకు వచ్చి, ఇల్లంతా కలియ తిరగసాగాయి. కుర్చీల, టేబుళ్ల కింది, తలుపుల వెనకాల, తివాచీల కింద అలా ఇల్లంతా పరుగులుపెట్టి మూల,మూలలనున్న దుమ్ము,ధూళీ అంతా శుభ్రపర్చి, ఎలా వచ్చాయో అలాగే అదృశ్యమయ్యాయి. ఇల్లాంతా తళ,తళ మెరిసింది.

సమయం 10 గంటలు. వర్షం చాటు నుంచి సూర్యుడు తొంగి చూశాడు. ఆ నగరంలో కాలి బూడిదైన శిథిలాల మధ్య ఆ ఇల్లు ఒక్కటే ఠీవిగా నిలబడి ఉంది. రాత్రి సమయంలో ఆ శిధలమైన నగరం నుంచి అణుధార్మిక వెలుగు సుదూరాలకు వ్యాపిస్తుంది.

సమయం 10.15. ఇంటి బయట పచ్చిక మీద నీటి గొట్టాల్లోంచి నుంచి నీరు జల్లుగా పడుతూ ఉదయకాంతులను విరజిమ్మసాగింది. ఇంటి అద్దాల మీద నీటి చుక్కలు పడుతూ సన్నని శబ్దం చేయసాగాయి. పశ్చిమం వైపు కాలిన ఇంటి నల్లబారిన తెల్లని గోడలపైన నీరు పడి తడపసాగింది. ఆ నల్లబారిన ఇంటిలో అక్కడే కొన్ని నీలినీడలు మనకు తారాసపడతాయి. ఒక వ్యక్తి ఇంటి ముందర గడ్డి కోస్తూ గోచరిస్తాడు. అక్కడే, ఒక మహిళ వంగి ఒద్దికగా పూలు కోస్తున్న దృశ్యం. మరికొంత దూరంలో, చిన్న పిల్లవాడు గాలిలోకి చేతులు లేపి బంతిని విసురుతున్న అపురూప దృశ్యం, ఆ పిల్లవాడికి ఎదురుగా చిన్నపాప కిందకి ఇంక, ఎప్పటికి జారిపడని బంతిని పట్టుకోవడానికి చేతులు పైకెత్తిన దృశ్యం ఒక్క క్షణంలో ఆవిరైపోయాయి.

ఆ ఐదు దృశ్యాలు – ఆ వ్యక్తి, ఆ మహిళ, ఇద్దరు పిల్లు, బంతి – ఆ స్థానంలో నిలిచిపోయాయి. మిగిలిన ప్రదేశమంతా ఒక నల్లని బొగ్గు తెర కమ్ముకుంది.

ఉదయ సూరీడు తగ్గుముఖం పడుతుంటే, నీళ్ల గొట్టాల్లోంచి సన్నని నీటి జల్లు ఆ పచ్చికను తడపసాగింది.

ఈ రోజు వరకు ఆ ఇల్లు తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అప్పుడపుడు వచ్చిపోయే నక్కలు, పిల్లుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోయినా, ఎవరక్కడా అని ప్రశ్నిస్తూ, రాత్రింబవళ్లు ఆ ఇంటిని మరో ధ్యాస లేకుండా తనని తాను కాపాడుకుంటోంది. ఆఖరికి చిన్న పిచుక వచ్చి అద్దాలపై గీసినా చాలు వణికిపోతుంది. ఆ శబ్ధానికి పక్షులు కూడా తుర్రుమంటాయి. ఏ పక్షి కూడా ఆ ఇంటిని తాకడానికి వీలులేదు.

సమయం మధ్యాహ్నం 12గంటలు.

ఒక కుక్క వణుకుంటూ వచ్చి ఆ ఇంటి వరండాలో నుంచుంది.

ఆ కుక్క గొంతు గుర్తుపట్టి, తలుపులు తెరుచుకున్నాయి. ఒకప్పుడు రాజసంతో, ఠీవిగా, నిగ,నిగలాడుతుండే ఆ కుక్క నేడు బక్కచిక్కి, వంటినిండా గాయాలతో, దాని వెనకాలే నేల మీద బురదను జారుస్తూ, ఇంట్లోకి చేరింది. దాని వెనకాలే కోపంతో రగలిపోతూ, ఇప్పుడే శుభ్రపర్చిన, ఇంటిని మళ్లీ శుభ్రం చేయాల్సి రావటంతో చికాకు పడుతూ మర ఎలుక బురదను శుభ్రం చేసింది.

గాలికి చిన్న ఆకు, కాగితం, దుమ్ము ఏది ఇంటిలోపలకి వచ్చిన, గోడ తలుపులు తెరుచుకుని మర ఎలుకలు బయటకి రావటం, తమ స్టీలు పళ్లతో కురుచుకొని బయట మూలన బేతాళుడిలా నక్కి కూర్చున్న చెత్తబుట్టలో పారవేస్తాయి.

ఇంతలో ఆ కుక్క ఇల్లాంతా ఆత్రుతతో కలియ తిరిగింది. చివరికి నిశ్శబ్దం తప్ప ఆ ఇంట మరేమీ లేదని గ్రహించింది.

వంటగది తలుపులను రక్కి తన నిస్సహాయతను చూపింది. ఇంతలో వంటగదిలో స్టౌవ్ ఘుమ,ఘుమలాడుతున్న పాన్ కేక్ లను తయారు చేసింది. ఇల్లంతా దాని సువాసనలతో నిండిపోయింది.

సమయం రెండు గంటలు, సన్నని గొంతు మధురంగా విన్పించింది.

ఎలుకలదండు నెమ్మదిగా ఎండి పడిన ఆకులను సున్నితంగా బయటకు ఊది పారేశాయి.

సమయం 2.15.

కుక్క నెమ్మదిగా నిష్క్రమించింది.

అంతలోనే భూగర్భ గదిలో కొలిమి రాజుకుని నిప్పురవ్వల వలయం, పొగ చిమ్నీ గుండా బయటకు వచ్చాయి.

సమయం 2.30.

ఇంటి వసరా గోడల నుంచి టేబుల్స్ జారి కిందకు చేరుకొన్నాయి. వాటి మీద గింజలు రాలినట్టుగా పేకముక్కలు రాలి పడ్డాయి. ఆ బెంచీ మీద గ్లాసులలో మార్టీనీ, కోడిగుడ్డు సలాడ్, సాండివిచ్లు వచ్చి చేరాయి. సంగీతం ప్రారంభమైంది.

కానీ, ఆ టేబుల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. పేకముక్కలు ఎవరూ ముట్టలేదు.

నాలుగు గంటలు కాగానే తూనీగలు ఎగరిపోయినట్టుగా గోడలలోకి టేబుల్స్ ముడుచుకుపోయాయి.

సమయం 4.30.

పిల్లల గది గోడలు వెలిగిపోయాయి. రకరకాల జంతువుల ఆకారాలు రూపుదిద్దుకున్నాయి. జిరాఫీలు, సింహాలు, జింకలు, పులుల ప్రతిబింబాలు, గోడలకి జీవం వచ్చినట్టు, ఆ గాజు గోడల మీద అద్భుతమైన దృశ్యమాలికగా సాక్షాత్కరించాయి. గదిలో నేలంతా పచ్చికపర్చినట్టుగా మారి, వాటి మీద లోహంతో చేసిన కీచురాళ్లు, కీటకాదులు పరుగులెట్టసాగాయి. వేడి గాలిలో సీతాకోకచిలుకలు ఎగురుతుంటే, తుమ్మెదల ఝుంకారాలు, బద్దకంగా జూలు వదిలిస్తున్న సింహాల గర్జింపులు ఆ గోడల మధ్య ప్రతిధ్వనించాయి. వేసవి సెగల వల్ల ఎండిన పచ్చికపై నీటి చుక్కలు పడుతుంటే, జంతువుల డెక్కల గుర్తులు కనిపించసాగాయి. నెమ్మదిగా గోడలపై రంగులు మారి, జంతువులు తమ,తమ గుహలలోకి జారుతుండగా, సుదూరతీరాల వరకు నీలి ఆకాశం వ్యాపించింది. అది పిల్లల సమయం.

సమయం ఐదు గంటలు. వెచ్చటి నీటితో బాత్ టబ్ నిండింది.

సమయం సాయంత్రం ఆరు… ఏడు… ఎనిమిది గంటలు. వంటగదిలో పాత్రలన్ని ఇంద్రజాలం చేసినట్టు మాయమయ్యాయి. ముందు గదిలో నిప్పుగూడు నుంచి వెచ్చదనం గదంతా పరుచుకుంది. సగం కాల్చిన సిగరెట్టు ఎవరి రాకకో ఎదురు చూస్తోంది.

సమయం 9గంటలు. వసంతరాత్రుల చల్లదనానికి తగ్గట్టుగా పరుపుల లోపలి ఎలక్ట్రిక్ తీగలు నులి వెచ్చదనాన్నికలిగిస్తున్నాయి.

సమయం 9.05. ‘‘ మిసస్. మెక్క్లీన్ ఇవాళ ఏ పద్యం వింటరా’ని గది పైకప్పు నుంచి ఒక సన్నని గొంతు ప్రశ్నించింది. ఆ ఇంటి నిండా నిశ్శబ్దం ఆవరించింది.

కొంతసేపు ఎదురు చూసి, ‘మీరు ఎటువంటి సమాధానం చెప్పలేదు కనుక నేనే నాకు తోచింది విన్పిస్తాను,’ అంది ఆ గొంతు. సారా టిస్డెల్ మీ అభిమాన గాయని ఆ గొంతు తిరిగి పలికింది. అంతలో సున్నితంగా పాట వినిపించసాగింది.

కురిసేను వాన, మురిసేను నేల
మెరిసేటి జ్వాల మింగేను వలయమై

కొలనులోని కప్ప పాడేను నిశిరాత్రి
పూచిన రేగుకొమ్మ వణికేను గాలికి

పాట కొనసాగుతుంటే, నిశ్శబ్ద గీతికలో ఎదురెదురుగా రెండు ఖాళీ కుర్చీలు. సిగిరెట్ కాలి బూడిదై నేలరాలింది.

రాత్రి పదిగంటలు కావస్తుంటే, ఆ ఇల్లు నెమ్మదిగా మరణశయ్యను చేరుకుంది.

సుడిగాలి వీచింది. వంటగది కిటికీ మీద చెట్టుకూలి ఆ ప్రదేశాన్నంతా అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా మంటలు చుట్టుముట్టాయి.

‘మంటలు’, ఒక గొంతు బిగ్గరగా కేకలు వేయసాగింది. ఇల్లంతా దీపాలు వెలిగాయి. పైకప్పుల బిరడాలు తెరుచుకొని నీరు నలుదిశలా చిమ్మడం మొదలుపెట్టింది. నాలుకలు జాచుకుని భడభాగ్ని ఇల్లంతా పాకుతుంటే, అనేక గొంతులు ఒక్కసారి మంటలు, మంటలని అరవసాగాయి.

ఆ ఇల్లు తనని, తాను కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నించ సాగింది. ఇంటి తలుపులన్ని మూసుకుపోయియి. కానీ కిటికీ అద్దాలు పగలిపోవటంతో గాలి దూసుకువచ్చి అగ్గికి ఆజ్యంపోసాయి.

మంటలు నాలుకలు చాచి ఒక్కొక్క గదిని కబళిస్తుంటే, గోడల నుంచి మర ఎలుకలు నీరు తెచ్చి ఆ కోపాగ్నిని ఆర్పడానికి వృధా ప్రయాసలు చేస్తున్నాయి. గోడల నుంచి కృత్రిమ వర్షం నిరంతరంగా జాలువారుతోంది.

అప్పటికే ఆలస్యమయింది. ఇన్నాళ్లు గోడల నుంచి వస్తున్న నీటి ధారలు ఆగిపోయాయి. వర్షం నిలిచిపోయింది. ఆ ఇల్లు నిల్వ చేసుకున్న నీటి వనరులన్ని ఆవిరైపోయాయి.

పై అంతస్తులలో ఉన్న పికాసో, మాటిస్సెస్ వంటి సున్నిత, అపురూప కళారూపాలు నల్లబొగ్గులయ్యాయి.

మంటలు గోడల, మంచాల, కిటికీల పరదాల రంగులను మార్చివేసాయి.

అంతలో ఇంటి ద్వారాలు తెరుచుకుని కొన్ని మరమనుష్యుల మొఖాలు తొంగి చూశాయి. వాటి నోటి నుంచి పచ్చటి ద్రవపదార్థం కిందకి కారసాగింది. ఆ ద్రవాన్ని చూస్తూనే చచ్చిపడున్న పాముని చూసి వెనుకంజ వేసే ఏనుగులా అగ్నిజ్వాలలు వెనక్కి మరలసాగాయి.

దాదాపు 20 పాముల నోటి నుంచి వెలువడుతున్నట్టుగా పచ్చటి విషాగ్ని అగ్నిజ్వాలలను తుదముట్టించాయి.

అయితే, దావాగ్ని కూడా తెలివిగా ఇంటి బయట అటకపైకి వెళ్లె పైపుల గుండా జ్వాలలను పంపంటంతో అటకపై పెద్ద విస్ఫోటమేర్పడి అది తునాతుకలైంది. దాంతో మళ్లీ మంటలు ఇల్లంతా చుట్టుముట్టాయి.

ఇల్లంతా ఒక్కసారిగా కంపించింది. వైద్యుడు శస్త్రచికిత్స చేయడానికి చర్మాన్ని తొలగిస్తే, ఎలా అయితే నరాలు, రక్తనాళాలు బయటకు చొచ్చుకు వచ్చినట్టు, ఎలక్ట్రిక్ వైర్లు గాల్లో వేలాడసాగాయి. చలికాలంలో మంచు కమ్మినట్టుగా మంటలు ఇంటిలోని అద్దాలను కరిగించేస్తుంటే, రక్షించండి! రక్షించండి! మంటలు! పరిగెత్తండి! పరిగెత్తండి! అని అనేక చిన్న, పెద్ద గొంతుల అరుపులు ఒక్కొక్కటిగా ఆ మంటల్లో ఆవిరైపోయాయి.

పిల్లల గదిలో, సింహాలు గర్జించాయి. జిరాఫీలు పరుగులెట్టాయి. పులులు వలయాకారంలో తిరుగుతుంటే, ఆ గది రంగులు మారసాగింది. లక్షల కొద్ది జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. మరో పది గొంతుకలు మూగబోయాయి.

ఒక గడియారం గంట కొడితో లోపల ఎన్ని యంత్రాలతై కదులుతాయో, అదే విధంగా, దావాగ్ని ఆ ఇంటిని చుట్టుముట్టగానే, గడియారం సమయం చెప్పింది, బయట గడ్డికోసే మిషన్ తనపని తాను చేసుకుపోసాగింది. గోడల నుంచి, పై కప్పుల నుంచి నీటి ధారలను అడ్డుకుంటూ గొడుగులు విచ్చుకున్నాయి. ఇంటి తలుపులు తెరుచుకుని, మూసుకుంటూ, అయోమయ, గందరగోళ వాతావరణం అక్కడ నెలకొంది. ఈ గందరగోళం మధ్య కొన్ని మర ఎలుకలు మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి బూడిద ఎత్తివేసి, ఇల్లును శుభ్రపరుస్తున్నాయి. ఇదంతా తనకేమి పట్టనట్టు, వైర్లు, సర్క్యూట్లన్ని దగ్ధమయ్యే వరకు ముందు గదిలో ఒక గొంతు పాటలను విన్పిస్తూనే ఉంది.

చివరికి ఆ బడబాగ్నికి ఇల్లు నేలమట్టమై అక్కడ, అక్కడ చిరు మంటలు చిట,పటలాడసాగాయి.

మంటల జల్లులు కురవడానికి క్షణ ముందు వంటగదిలో, రెండు డజన్ల కోడిగ్రుడ్లు, బ్రెడ్, 20 డజన్ల మాంసపు ముక్కలను పిచ్చిపట్టినట్టుగా తయారు చేసిన అల్పాహారాన్ని ఆ అగ్ని దహించివేసింది.

ఆ ఇల్లు నెమ్మదిగా కూలి వంటగది మీద, అతిథి గది మీద పడింది. అతిథి గది కింద సెల్లార్ మీదకు ఒరిగింది. కుర్చీలు, మంచాలు, ఫిల్మం టేపులు ఇలా ఆ ఇంట్లోని వస్తువులన్ని నేలమట్టమయ్యాయి.

పొగ మరియు నిశ్శబ్దం. దట్టమైన పొగ.

దూరాన తూర్పు సూర్యుడుదయిస్తున్నాడు. ఆ శిథిలాల మధ్య ఒక గొడ ఒంటిరిగా నిలబడుంది. ఉదయిస్తున్న సూర్యునితో సమానంగా ఒక గొంతు మళ్లీ, మళ్లీ పలకసాగింది –

‘‘ఇవాళ ఆగష్టు 5, 2026, ఇవాళ ఆగష్టు 5, 2026, ఇవాళ …….’’

మూలకథ: దేర్ విల్ కమ్ సాఫ్ట్ రైన్స్

అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *