తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్రలు 1 బారిష్టర్ పార్వతీశం

గోదావరి, గోరింటాకు, గోంగూరా, గిరీశం, కచటతపలూ, గసడదవలూ, బారిష్టర్ పార్వతీశం, పదహారణాలూ, ఇవి అసలు, సిసలు తెలుగుదినుసులు, తెలుగుదనపు జెండాలు అన్నారు కీ.శే. ముళ్లపూడి వెంకటరమణగారు ఒకానొక సందర్భంలో! తెలుగుగడ్డ గురించి తలుచుకున్నప్పుడల్లా, తెలుగువారి గురించి ఎవరికైనా చెప్పాలన్నా, తెలుగు సాహిత్యంలో కొన్ని మరుపురాని పాత్రలు మన ముందు సాక్షాత్కరిస్తాయి. అలాంటి కొన్ని అపురూప పాత్రలను మీకు పరిచయం చేయలని నా తాపత్రయం. కాని చరిత్రకందని అటువంటి పాత్రలను పరిచయం చేయటం అంటే సముద్రాన్ని దోసిటపట్టడం, ఆకాశాన్ని అద్దంలో బంధించడం వంటిది. అయినా తెలుగతనానికి ప్రతిరూపాలైన ఆ పాత్రలను తలుచుకోవాలని మీఅందరికి తలపకు తేవాలని తహ,తహలాడుతోంది నా మనసు. అందుకే మొట్టమొదట అమాయకత్వం పొంగిపొరలే గడుసుతనం, గడుస్తనం తొంగిచూసే అమాయకత్వం కలబోసి పోతపోసిన బంగారుతండ్రి పార్వతీశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను.

ప్రప్రథమ ప్రవాసాంధ్రుడు బారిష్టర్ పార్వతీశం అంటే తెలుగువారందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారనుకుంటాను. ఈ పార్వతీశం ఎవరూ అన్న అనుమానం మీకు కలుగుతోందని నాకు తెలుసు. బారిష్టర్ పార్వతీశం అయోనిజుడు, స్వయంభువు, బ్రహ్మమానసపుత్రుల జాతిలోనివాడు. ఆయనది నర్సాపురం దగ్గరి మొగలితుర్రు. ఇంటిపేరు వేమూరివారు. ఈయన జన్మదాత మహానుభావుడు కీ.శే. మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు. బారశాలనాడు పార్వతీశానికి ఆ నామధేయాన్ని పెట్టినవారు మొక్కపాటివారి స్నేహితులు శివశంకర శాస్త్రిగారు. ఇంతకీ పార్వతీశం పుట్టినది ఎప్పుడు అని అడుగుతున్నారా, తొందరపడకండి. ఆయన జన్మదినోత్సవం 1924 డిసెంబర్ 24న తెనాలి సాహితీ సమతి ప్రథమ సమావేశంలో. అక్కడకి విచ్చేసిన సహృదయులు, సాహితీ వేత్తలు ఏకగ్రీవంగా ఈ బాలుడు దిన, దిన ప్రవర్ధమానుడై తెలుగుజాతి గర్వించదగ్గ పాత్రరత్నం కాగలడని ఆనాడే జోస్యం చెప్పారు.

అయితే ముందే చెప్పుకున్నట్టు మన పార్వతీశం బడాయిగా తన అమాయకత్వాన్నిగడుసుతనంతో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించి పదిమందికి వినోదాన్ని పంచే అనాగరికుడు. కాకపోతే ఏమిటండి, ఇంగ్లాండుకు వెడుతూ, కచికా, తాటాకులూ, మర చెంబు, బొంత, ఎర్రశాలువా, గులాబిరంగు సిల్కు కండువా, ఆరు యజ్ఞోపవీతాల జతలూ, మూడు పట్టు మొలత్రాళ్లు, బంతిపువ్వు రంగు పెట్టె వగైరా, వగైరా సామానుతో బయలుదేరుతారుటండీ! చోద్యంకాకపోతే! వట్టి అనాగరికుడు కాకపోతే. అలాని ఏ ప్రవాసాంధ్రుడైనా అనగలాడాండి. దాన్ని ముందచూపుంటారని కూడా చాలామందికి తెలవకపోవడం విచారకం. విదేశాలకు ప్రయాణమవుతూ అమ్మపెట్టిన గోంగూర పచ్చడి, ఆవకాయ, కందిపొడి, కజ్జికాయలు మూటగట్టని ప్రవాసాంధ్రుడిని చూపండి చూస్తాను. ఆకాలంలోనే తెలివైనవాడు కనుక నాలుక గీసుకోవడానికి తాటాకులు, తలకు రాసుకోవడానికి కొబ్బరినూనె పార్వతీశం మూటగట్టి మనందరికి మార్గదర్శకుడయ్యాడు.

మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు, అందుచేత అజ్ఞానజనితమైన అపచారాలు చాలా ఉంటాయి. ఈ అజ్ఞాన కృతాపరాథములకు తోడు, తన తప్పు ఒప్పుకోకుండా అదేదో తను తెలిసే చేసినట్టు నటించడం మనలో చాలామందికి అలావాటు. కాదంటారా? పార్వతీశం ఆడటోపి తెలియక కొని అందరూ తనని చూసి నవ్వగానే తన స్నేహితురాలి కోసం కొన్నానని డబాయిస్తే అతను అమాయకుడు, తెలివితక్కువవాడు. నిజం చెప్పండి అలా సమయస్ఫూర్తితో మనలో ఎంతమంది వ్యవహరించలేదంటారు!

పార్వతీశం గురించి అతని జన్మదాత అదే మొక్కపాటివారి మాటల్లో చెప్పాలంటే ఆలంకారికులు చెప్పిన ధీరోదాత్తాది లక్షణాలు ఏవీ అతనిలో లేవు. పార్వతీశం మనలాంటి సామాన్య మానవుడు. మనంలో అతనే మనం. ఎవడు ఎంతనవ్వినా, పార్వతీశం ఏమీ అనుకోడు, వాళ్లకు సామాన్య ధర్మాలైన సాహసం, ఉద్రేకం, దురాలోచన, అజ్ఞానం, అహంకారం, కార్యవసరమైన సాధన సంపత్తి చేకూర్చుకునే ఓపికలేకపోవడం ఇలాంటివన్నీ మూర్తీభవించిన మూర్తి బారిష్టర్ పార్వతీశం.

అయినా చాలా పట్టుదలగలవాడు మన పార్వతీశం. మొగలితుర్రు దాటి మూడు ఊళ్ళు కూడా ఎప్పుడు వెళ్లని, చూడని వాడు ఇంగ్లాండు వెళ్లి బారిష్టర్ పట్టా పుచ్చుకుని చక్కావచ్చాడు అంటే మాటలా. కుళాయి కింద చేయిపెడితే ఆటోమెటిక్ గా నీళ్లుపడ్డపుడు మనలో ఎంతమంది సంభ్రమాశ్చర్యాలు చెందలేదు. గుమ్మడి పండ్ల దొంగంటే భుజాలు తట్టుకోవటం అంటే అదే. మన పార్వతీశం ఇలాంటి ఎన్నో విషయాలను స్వీయానుభావంతో తెలుసుకుని, కార్యదక్షుడు, కర్మవీరడూ, యోచనాపరుడూ, విద్యావేత్త, విజ్ఞానవేత్త అయి, మానసికంగా, నైతికంగా ఎవరూ అందుకోలేని ఎత్తుకు ఎదిగాడు. నవ్విన నాపచేనే పండునులే అన్నట్టు, నర్సాపురం నుంచి పడవలో బయలుదేరి లండను చేరే వరకు అనాగరికతో అజ్ఞానంతో నవ్వులపాలైన పార్వతీశం, తన తప్పులు దిద్దుకుంటూ ఎదుటివాళ్లను చూసి నవ్వ నేర్చాడు. నేనైతే అటువంటి తెలివితక్కువ పనులు చేస్తానా అని అనుకునే ప్రతీ ఒక్కరూ బారిష్టర్ పార్వతీశం జీవితం గురించి ఒక్కసారి తెలుసుకుంటే బావుంటుంది.
పార్వతీశం కేవలం మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు సృష్టించిన హాస్యపాత్రకాదు. అలా అనుకుంటే పొరపాటే. మనలోని వికారాలు, వికృతి చేష్టలు ఎదుటివారిలో కన్పిస్తే మనకు నవ్వువస్తుంది అనడానికి పార్వతీశం లండన్ ప్రయాణమే అందుకు ఉదాహరణ. మనిషి ఎదుగుతున్న కొద్ది, యోచనాపరుడై, అంతర్ముఖుడైననాడు ఆ నవ్వే తగ్గుతుంది అనడానికి బారిష్టర్ అయి తిరిగి వచ్చిన పార్వతీశమే చక్కని తార్కాణం.

సౌమ్యశ్రీ రాళ్ళభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *