కథానిక 6
అల్లో నేరేడు

జీవితం – పాటంత సరళంగా, పరిమళమంత స్వచ్ఛంగా, జనపదమంత నిరాడంబరంగా, యౌవనోత్సాహమంత కాంతితో – సాగాలని ఆశించేవారు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. పచ్చని చేలమీద పైడగాలిలా ఊగిసలాడే ఆయన మనస్సు అందుకే నిత్యనూతనత్వాన్ని కోరుకునేది. జీవన వాస్తవాలను, కులమతాలకు అతీతంగా, మానవ హృదయ స్పందనకు దగ్గరగా ఆయన రూపుదిద్దే కథలు అందుకే దృశ్యకావ్యాలుగా నిలిచాయి. అందుకే ఆయనది వ్రాసే శైలి కాదు. చెప్పేశైలి. మల్లాది వారి కథల్లో కులానికి కాక, గుణానికి ప్రాథాన్యత కన్పిస్తుంది. ఆయన కథలో మనకు రామాంజయ్య, కోమటి సుబ్బయ్య, దూదేకుల సాయిబు ఇస్మాయిల్, దేవదాసి రత్తమ్మ, గొల్ల సింగన్న, వేశ్య కృష్ణాజీ ఇలా అనేక సామాజిక స్పృహ కలిగిన పాత్రలు దర్శనమిస్తాయి. కొంటెతనం, రసికత, పారవశ్యం అనే జీవలక్షణాల కూడికల, తీసివేతల, వెలుగునీడలే ఆయన కథలకు ఇతివృత్తాలని ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు అంటారు. మల్లాదివారి కలం నుండి వెలువడ్డ వందలాది కథలు అల్లోనేరుడు, రంగవల్లి, మునిగోరింట, రసమంజరి, మత్తకోకిల, కాముని పున్నమి, చెంగల్వ, చిత్రశాల మరియు సర్వమేళ ఇలా 12 సంపుటాలుగా వెలువడ్డాయి. శృంగారం, వెటకారం, ఆవేదన, భక్తి, చారిత్రాత్మక సత్యాలు, ఊహాగానాల అభూతకల్పనలు ఆయన కథల్లో దోబూచులాడుతాయి. దాదాపు 50 భాషల్లో ప్రావీణ్యం గల మల్లాది వారు రాసిన డుమువులు అనే కథ 14 భారతీయ భాషల్లోకి అనువదించబడింది. వచన రచనకు మేస్త్రీ అయిన రామకృష్ణశాస్త్రి గారు రాసిన ‘‘అల్లో నేరేడు’’ కథ 1953లో తెలుగు స్వతంత్ర పత్రికలో వెలువడింది. ఈ కథను చదివి శాస్త్రిగారు అచ్చ తెలుగు నుడికారానికి, అసలైన ఆంధ్ర పదానికి జీవం పోసిన తీరును ఆశ్వాదించండి.

ఎబ్బే! ఇప్పటి పట్నం మునుపటి పల్లెకాదు.

మునుపటి పల్లె ఆనవాలే ఇప్పుడు లేదు.

పాడూరు లేదు – కూలిపోయి పునాదులు మిగిలిని గుళ్లు లేవు, గోపురాలు లేవు! ఎంతలోతు తవ్వినా నిధులు లేవు, నిక్షేపాలు లేవు! ఆ పరగాణా హాల్ మొత్తంమీద, అప్పుడు రాలిన గింజన్నా మొక్కమొలవలేదు. అప్పటికి మొలిచిన మొక్కన్నా మానుకట్టలేదు. ఆనాటికి నిలచిన మానన్నా, ఒక బోదన్నా, సత్యానికి నిలువలేదు. సంజెదీపం వేళకు కళగావున్న పల్లె, మళ్లీ చుక్కపొడిచే వేళకల్లా, ఒక్క మొయిని సురేసుకుని పోయినట్టుపోయింది.

ఏమైపోయిందటారు?

ఎన్నకన్నెరుగని ఆడకూతురు అయినవారింట పుట్టి అబ్బనాకారంగా పెరిగి, ఆ ఇంట అడుగు పసుపు పారాణితో, పాపిటబొట్టుతో, చెంపన చుక్కతో, సిరులబ్బే చూపుతో ఈ ఇంట పెట్టిన ఆడకూతురు చేయరాని పాపం చేయకపోయినా, మోయరాని నింద మోసింది. అయ్యో పాపం! అన్నవారు లేకపోయిరి. కుయ్యో అన్నా గోడు ఆలకించేవారు కరువైపోయిరి. ఆ బిడ్డ ఎంత హడలిందని! ఆ తల్లి బ్రతుకు ఒక్క చిటికెలో చీకటిగుయ్యారమై పోగా ఎంత కుమిలిందని?

ఒక్క కన్ను మూసింది. ఒక్క కన్ను తెరచింది. ఎందుకు యిచ్చావమ్మా ఈ పుట్టుక? అంటూ కన్నతల్లిమీద గావురుమంది. కానరాని తల్లికి మొక్కుతూ గావురుమంది. తెరిచిన కన్ను నిప్పులు చెరిగింది. మూసినకన్ను ఒక్క ముత్తెం విడిచింది.

ఆ రవంత ముత్తెం సముద్రమంతయింది. సముద్రం – సముద్రం ఏడు సముద్రాలంత అయింది. ఏడు సముద్రాలు ఏక ఉప్పెనైంది.

ఉప్పెనొచ్చి ఊరు ముంచెత్తింది; పోటొచ్చి పల్లెపల్లే నేలమట్ట చేసింది. ఆటొచ్చి, ఆ చీపరపాపర అంతా తుడిచి పెట్టింది.

తుడిచిపెట్టినంత మేరా – వానదేవుడొచ్చి, కల్లాపి జల్లాడు. గాలిదేవుడొచ్చి తడి ఆరబెట్టాడు. సూర్యభగవాన్లు అప్పుడు తెరపిచూసుకుని వచ్చి, భూమ్మీద ముగ్గులల్లే నెరియవిచ్చాడు. అంతే, ఆ పొద్దు మొదలాయె ఆ గడ్డ ప్రాణాడదు, ఆ నింగి మీద పిట్టాడదు.

సరేనయ్యా – మరి ఆ ఆడకూతురు కొచ్చిన నిందేమిటంటారు!

ఆడకూతురికి రారాని నింద!

అయిన యిల్లాలికి కలలో అన్నా రాకూడని నింద! కట్టుకున్న మారాజే తప్పు బట్టేనే – ఆ తల్లిని అంతమాటంటే పాపమన్నా తలచకపోయెనే – ఒట్టూ సత్యాలు నమ్మక పోయెనే – ఇంకేంజెయ్య నా తల్లి? ఇంకెవరితో మొరబెట్టుకోను ఆ అమ్మ!

సీతమ్మకంటే సీతమ్మవారేనయ్యా! ఆ అయ్య రాముడంటివాడేనయ్యా! అయితేనేం, మూడు పువ్వులూ ఆరుకాయలూ కావల్సిన బతుకు మూణ్ణాళ్ళ ముచ్చట అయింది; ఆ కాపురం ఆరిపోయే దీపమల్లే ఒక్కసారి భగ్గమంది.

సీతమ్మ సిరిగల యింటపుట్టింది. సంపదున్న యింటి నుంచి వచ్చింది! ఆ బిడ్డ తెచ్చిన సారె పల్లెఅంతా ముమ్మారు పంచిపెట్టినా, ఎక్కీదక్కీ మిగిలింది. రామయ్య కుటుంబం అంటారా, పరగణాకంతా మోతుబరీ అనుకోండి; వారికి ఏంతక్కువ? గీతొక్కటే తక్కువ; బ్రహ్మరాసిన రాతొక్కటే తక్కువ!

సీతమ్మ అల్లా వైభోగంగా సార్లెతో – చీర్లతో తర్లివచ్చింది; వెంటను, పట్టెమంచం వచ్చింది, పానుపొచ్చింది; రంగరంగ వైభోగాలొచ్చినాయి.

తూర్పు వైపు గదిలో పానుపేశారు; పడమటింట బంతులు బరి, విందులు చేసుకుంటున్నారు.

వచ్చిన చుట్టాలందరూ, జాజబంతులు ఆడుకుంటున్నారు.

మేజువాణీలు చేయించుకున్నారు.

తెల్లవారుజాముకి ఎక్కడవారక్కడ అలసిపోయినారు; చోటుచూసుకు సొమ్మసిల్లి పోయినారు.

సీతమ్మ అంతదాకా మేలుకుండలా! ఆ విద్దేలు ఆ చోద్దాలూ ఆ తల్లికి నచ్చలా!

వచ్చే ఆవులింతను చిటికేసి ఆవులించింది. అక్కడ నుంచి బద్ధకంగా లేచిపోయింది. బద్ధకంగా పోయిపోయి ఆ నిద్దుమత్తులో, అల్లాగే పక్కమీద చోటుచూసుకుని వాలిపోయింది. వాలి పళాన నిద్దురపోయింది.

ఏ మూలనో కునుకుతీసిన రామయ్యకు కోడికూత వేళకు ఎవరో వెన్ను చరిచినట్టు మెళుకువ వచ్చింది. తానున్న వెంపు చూసుకున్నాడు, తన వెంపు చూసుకున్నాడు. ఒక్క ఒళ్లు విరుపులో, పట్టిమంచం యాదకొచ్చింది. పండంటిపిల్లది యాదకొచ్చింది. లేచి నడింవాకలికొచ్చాడు. చుక్కల మీదకి చూశాడు. ఇంకా జాముప్రొద్దుందిగదా అనుకున్నాడు. ఉసూరుమన్న ప్రాణికి ఉత్సాహం వచ్చింది. ఒంటికి వేడొచ్చింది, చెంపకు ఒరచూపొచ్చింది. చివాలన్నపోయినాడయ్యా, పానుపు వేసిన గదిలోకి.

సీతమ్మ పొస్తకమల్లే ఒత్తిలి పడుకుంది, మాంచి నిద్దర్లోవుంది. అట్టె పరకాయించాడు. అడుగులో అడుగువేసుకుంటూ చెంపమీద చిటికెశాడు. చిటికేసినంత చిరునవ్వు నవ్వాడు. అంతే ప్రాపతం ఆ యింటికి.

చిటికెలోనే మేలుకొంది సీతమ్మ తల్లి. చిరునవ్వుకు నాగసొరంవిన్న ఆడత్రాచైంది. పంచప్రాణాల్తోనూ మిడిసిపడి ఆ మెడ కావిటేసుకుంది. ఏమో కులికింది. ఏమో గునిగింది. ముచ్చటాడేపాణెం నేరని చిన్నది మూగపోయింది. అయితేనేం గడియలతరబడి వేగిన వేగూ – సోగిన సోగూ, కనుపాప విప్పిచెప్పింది.

చెప్పిందయ్యా చిన్నదాని కనుపాప. ఆకళింపయిందయ్యా చినవాడికి చిలకముక్కుకు దొండపండందినట్టు, జీరుగోరికి చివురాకు అందినట్టు సుఖపడేవాడే! సుఖపెట్టేవాడే – కాని, చిన్నది ఆ నోము నోచలేదు. చినవాడికి ఆ అదృష్టం పట్టలేదు. తొలిముచ్చటకు కలకట్టుగా, సొక్కి సోలుతూన్న చిన్నది – అటువాలేదల్లా చటుక్కుమని ఇటుకేసి బెదరి, త్రుళ్ళిపడి కెవ్వున కేకవేసింది.

ఆ వేసిన కేకకు ముసుగుదన్ని ఒళ్ళు తెలియని నిద్దర్లో ఉన్న ప్రాణి చింబోతల్లే ఎగిరి గెంతేసింది. ఆ చింబోతు, చింబోతంటారా కాదుకాదు, రామయ్యతమ్ముడు కామయ్య. బంగారువంటి మనిషి, బంగావంటి మనసు – భయమూభక్తీ ఉన్న పడుచువాడు.

కెవ్వుమన్న కేకకు మెళుకవచ్చింది. అన్నను చూశాడు వదిన్ని చూశాడు. తానున్న పానుపు చూచాడు. అయ్యో రామా అని అంగలార్చి అన్న పాదాలమీద పడిపోయినాడు. ఆవురుమన్నాడు. ఎంత తప్పు-తప్పని వాపోయి, తల నేలనేసి కొట్టుకున్నాడు. ఆఖరికి…అన్నా! అన్నాడు: ‘‘వదినె మనింటికొచ్చిన పండగలో ఒళ్లుమరిచిపోయినా, అటునుంచి వస్తున్నా, అగరొత్తుగుప్ మన్నాయి. ఆగిపోయినా, గుమ్మం వారకొచ్చి తొంగిచూసినా, గుమాగుమా అత్తరు దీపం వెలుగుతూంది. కన్నెదర పాలమీగడల్లే పానుపు అగుపించింది. తడిమి చూసినా – తబ్బిబ్బెపోయినా, నడుం అదేవాలింది. ఒళ్లు ఆదమరిచింది, మగత మగతగానేపట్టు కుచ్చులాంటి శాలవా పైకి లాక్కున్నా, ఒక్క కునుకు తీసి వేద్దమనుకున్నా – మరి ఒళ్ళు తెలియలా! నా మనవి. ఇంతేనన్నా!’’

కామయ్యతల చెళ్ళున తన్నాడు రామయ్య తండ్రి ఒళ్ళు తెలియని ఉగ్రంతో! మెడనరాలు ఫెటఫెట మెటికలు విరిగినాయ్! అంత తాపుతిని, కామయ్య గుక్కతిప్పుకొన్నాడు.
‘‘పర్వతంలాగా పడుంటివే. కానరాలేదా తల్లీ!’’ అన్నాడు.

వెక్కి వెక్కి వచ్చే దుఃఖం ఆపుకుంటూ, ‘‘నాదైవం అనుకుంటినయ్యా! అలికిడైతే మెలుకవ వచ్చునని పట్టినిల కరుచుకుని పండుకున్నానయ్యా!’’ అన్నది సీతమ్మ.

‘‘విన్నావుగందా అన్నా’’ అన్నాడు లేనిసత్తువ తెచ్చుకుంటూ కామయ్య. అనడమేమిటి, మళ్లీ అన్న రామయ్య మరో తన్నుతన్నడమేమిటి! తన్నిన తన్నుకు, మెడనరాలు మరిన్ని మెటికలు విరిగినయ్ గుండెలు, నాభిదగ్గరకి నుంగిపోయినాయి. పడగ విప్పిన తాచైనాడు కామయ్య. నిదురలేచిన సింహమైనాడు కామయ్య. ఏనుగంత సత్తువచ్చింది. పట్టిన గుప్పిటిపట్టు విదిలించుకున్నాడు. తూలే కాలు దుయ్యపట్టుకున్నాడు. చీమైపోయి, దోమైపోయి, అంటున్నాడు గందా! ‘‘అన్నా! నామనవి ఆలకించవయ్యా!’’

అన్న – రామయ్య ఏమాటా చెప్పడే – కాళ్ళ వేళ్ళా బడి బతిమాలుకుంటొన్న తమ్ముణ్ణి కన్నెత్తి చూడడే!

పోయిపోయి ఏటి ఒడ్డున కూచున్నాడు. పైన గొడుగల్లే మబ్బుంది. సిగలో పువ్వల్లే సూర్యుడున్నాడు. వింజామరల్లె గరుడపక్షి ఆడుతూంది.

అడుగులో అడుగేసుకుంటూ కామయ్యొచ్చాడు; అల్లంతదూరాన సీతమ్మొచ్చింది. వచ్చి వచ్చి – మానేసుకుపోయినారు. నోటమాటరాక – పలుకరించలేక – జామైంది, గడియైంది రామయ్య కదిలాడు. ఒక్క ఉరు కురికాడు. తమ్ముణ్ణి పట్టుకుని గాను గాడేశాడు.

జామపండల్లే విచ్చిన గడ్డంచేత బుచ్చుకుని, కామయ్య నొష్టతో అన్నకు మొక్కాడు.

‘‘ఒంటి ఊపిరినవుంది ఈ పుటుక! – ఒక్క ప్రాణమూ పుచ్చుకో అన్నా! ఉడుకుమీదున్నావ్! ఉగ్రాలమీదున్నావ్ – ఈ పళాన నన్ను తెగెయ్యకపోతే నువ్వు బతికేట్టులేవు’’ అని బతిమాలాడాడయ్యా!-

‘‘ఒంటి పాన్పుమీదుంటిరే – పిల్ల మనసేయలా’’

‘‘రామరామ!’’

‘‘చెయి మీదికిపోలా?’’

‘‘చెయలేని పున్నెం తవ్వి తల కెత్తుకున్నాడు బిడ్డ-తర్లొచ్చి – పక్కను పండుకుంది. అది అన్నెం అంటావా?’’

‘‘వదిన్ను కంట జూడ లలా!’’

‘‘ఒక్కరెప్ప –’’

‘‘వల్లమాలిన చక్కంది; ఒక్క రెప్పలోనే మనసు గుంజుకు నుంటుంది! నీవు ఓ రెప్పను చూశావు! నేను వెయి పుటకలకని మనసిచ్చాను – నిన్ను చీల్చినా మచ్చపోతుందా?’’ పసిపిల్లడల్లె బావురుమన్నాడు రామయ్య! అంతతో తమ్ముడు ఉగ్రుడైనాడు.

‘‘తల్లివయ్యేభాగ్యం తాళికట్టి తెచ్చుకున్నవాడు దక్కనీయలా! పోనీలే అమ్మ. కన్నవారు పేరుపెట్టుకున్నందుకు, ఆ తల్లి కష్టాలే నీకు వచ్చినాయా! మల్లెపూవల్లె మా యింటి కొచ్చావ్. సిగలో ముడుచుకోడం నేరకపాయె. కళ్ళనద్దుకుంటున్నా తల్లీ. మా తప్పులు కాయద్దు – మా వంగసం నిలపద్దు. శిక్షించక జాలిదలిచావో వేయిపుటకలు పుట్టి వెంటాడుతా – ఒక్క బిగివిని యీమాటలనేసి సూరడికి మొక్కి కామయ్య తూరీగల్లెపోయి ఏటిలో కలిసిపోయినాడు.’’

‘‘వాడురాకుండా వాడేపోయినాడు. యింటికి వస్తే ఏలుకుంటా’’ నన్నడయ్యా! సీతమ్మ ఉలకలా. ‘‘పల్లెకుపోతే తలెత్తుకు తిరగలేను – ఏం గందరగోళంలా ఉందో – ఎన్ని కమామేషులు పుట్టినాయో – అన్నీ నరంలేని నాలుకలు,’’ సీతమ్మ పలకలా!

‘‘కాపురం పాడుచేసుకుంటావా?’’ సీతమ్మ మరింత ఉగ్రంగా నవ్వింది. రామయ్య పొటేలల్లే రొప్పుకుంటూ పారిపోయినాడు. పల్లెలో కనబడ్డవాడల్లా పలుకరించాడు. కంటబడిన ఆడకూతురల్లా నిలవేసింది! ఏమైంది సీతమ్మ? ఏటోడ్డునుంది. తాను తెగించిందా నువ్వు విడిచావా? దైవానికి తెలియాలి. ఊరుకు వంక తెచ్చింది! కత్తులు లేచినాయ్. కటార్లు దూసినాయ్. పల్లెపల్లె ఏటివారకు దండుకట్టింది.

అక్కడ సీతమ్మ తపసులో ఉంది. ధ్యానంలో ఉంది. దిగువ నేకాడనో సందడాయె. రానురాను, మందొస్తున్న అలికిడాయె. ఓరచూపు చూసింది. ఒక్క కన్ను విచ్చుకుంది. పుట్టబోయే బిడ్డలు కేరుమన్నారు, తరించబోయేటి వాళ్లు తల్లీ అన్నారు, ఏదీ వినలా, ఆడపుటకైతే యింత అలుసా అనుకుంది. కామయ్యను తలుచుకుని, నాతండ్రే అనుకుంది. ఒక్కపుటక పుట్టావ్ నన్ను ఉద్ధరించావ్. మళ్లీ జన్మలెత్తే పనిలేదు. పగదీరుస్తున్నా బయల్లో కలిసి …. అంది.

తెరచిన కన్ను నిప్పులు చెరిగింది.

అందుకు ఇదీ కథ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *