సాహిత్యం

సాహిత్యం

నా పేరు బుడుగు. మరో పేరు పిడుగు. మా బామ్మ నన్ను హారి పిడుగు అంటుంది. అమ్మ పోకిరి వెధవ, ఒక్కొక్కసారి వెధవకానా అంటుంది. నాన్న దొంగ రాస్కల్ అంటాడు. ఇలా ఎవరి ఇష్టానుసారం వాళ్లు ఆయా సందర్భాలకనుగుణంగా నా పేరు మార్చేస్తుంటారు. నేనే మంచి వాణ్ణి కదా పాపం అందుకని ఎవరు ఎలా పిలిచినా పలికేస్తుంటాను. నా గురుంచి ఎవరో చెపితే నాకు నచ్చదు. అందుకే నా గురించి నేనే చెపుతాను. వినండి. నేను ముళ్లపూడి వారి మానస పుత్రుడను చిచ్చుల పిడుగును. నాకో అమ్మ పేరు రాధ, నాన్న పేరేమో గోపాలం, బామ్మ, పెళ్లికాని బాబాయి (వీడు రెండుజెళ్ల సీత వస్తుంటే విజిల్ వేయమంటాడు. వీడి దగ్గర బోళ్లని లవ్ లెట్రలుకూడా ఉన్నాయి). నాకో స్నేహితురాలు కూడా ఉంది తెలుసా. దాని పేరు సీ గాన పెసూనాంబ (శ్రీ జ్ఙాన ప్రసూన్నాంబ). వీరుకాక బోళ్లంతమంది ప్రవేట్ మాస్టార్లు, లావుపాటి పక్కింటి పిన్నిగారు, పిన్నిగారి మొగుడు వీళ్లందరితో వేగలేక నేను. ఏంచెప్పమంటారు నా కష్టాలు. చిన్నపిల్లాణ్ణి నాకు కష్టాంలేంటి అనుకుంటున్నారా. చిన్న పిలల్లకే అని కష్టాలునూ. అమ్మ తిట్లు, నాన్న చీవాట్లు, మాస్టారు మొట్టికాయలు! మాస్టార్లకసలు తెలివుండదు. ఒక మేష్టారేమో చెవి కుడివైపుకు మెలిపెడతాడు. ఇంకో కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాడు కదా? వాడేమో ఎడమవైపుకి మెలిపెడతాడు. ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకని ఎటేపు మెలెట్టాలో కొత్తమేష్టరు ముందుగా పాతమేష్టరును కనుక్కుని రావాలి. లేదా మనలాంటి పెద్దమనిషినడగాలి. నేనే చిన్నపిల్లాణ్ణి కాదు అంటే అమ్మ వినదు. కుర్రకుంకా అంటుంది. “బుడుగు బొబ్బ పోసుకుందుగాని లాఅమ్మ” అనీ “బువ్వపెత్తనా బులుగూ” అని అంతే నాకు ఎంత అనుమానం. చెపితే వినరూ! నేను పెద్దయ్యాక జెటకా బండియేనా, రైలింజనేనా తోలుతాను. నాకు 1956లో ఏడేళ్లు. ఇప్పటికి, ఎప్పటికి అంతే. ఏంటో నాకేమీ అర్ధంకావట్లేదు. నాకు చాలా మాటలకు అర్ధాలు తెలియదు. లోకువ కట్టడం, కృతగ్నత అంటే, ఫలితం అంటే, ముఖ్యంగా నిజం అనేది ఎప్పుడు చెప్పాలో నిఝంగా తెలియదు. కానీ అబద్ధం చెపితే, ఈల వేస్తే అప్పుడప్పుడు కాణీ, అర్ధణా వస్తాయి. మీకీ విషయం తెలుసా టోకరా అంటే కూడా అబద్ధమే. నన్ను టోకరా చేసి ఎదురంటి కుర్రాడు నా దగ్గర, గోళీలు, బొమ్మలు, జంతికలు, నా వుండీలో ఉండే డబ్బుల కొట్టేసాడు. అయినా నేనంటే చాలామందికి భయమే. ముఖ్యంగా పిన్నిగారు, పిన్నిగారు ముగుడు (ఆయనగారిని అలానే పిలవాలి), మా నాన్న ఆఫీసులో పనిచేసే వాళ్లకి. ఇలా అందరిని భయపెడుతన్నానని నాకు అక్షరాభ్యాసం చేసి బళ్లో వేసేశారు. కానీ నేనంటే స్కూల్లో మాస్టారికి, పిల్లలికి కూడా భయమే, నేను స్కూలు మానేస్తేగాని వాళ్లు రామన్నరో ఏమో మా నాన్న నన్ను స్కూలు మాన్పించేశాడు. స్కూలు మానేయాలంటే నా దగ్గర చాలా చిట్కాలున్నాయి. బళ్ళోకెళ్ళకుండా ఉండాలంటే చొక్కా ఇప్పేసి ముందుగా ఎండలో నించోవాలి. అప్పుడు వీపుమీద పొట్టమీద జొరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేఠుకుని అమ్మదగ్గిరికెళ్ళి గబగబా చూడూ బళ్ళోకెళ్ళద్దని చెప్పూ అనాలి. లాపోతే జెరం చల్లారిపోతుంది. బామ్మకి చెప్పేస్తే చాలు. .. కడుపునెప్పి మంచిది కాదు ఎందుకంటే పకోడీలు చేసుకొని మనకు పెట్టకుండా తినేస్తారు. అందుకని తలనొప్పి అన్నిటికన్నా మంచిది. ఇది కూడా బామ్మకే చెప్పాలి. అన్నట్టు చెప్పటం మరిచాను. నాకేమో ఉంగాబాషా, పిచిక బాష, చికబాష, క బాష, బాష, ష అవన్నీ తెలుసు. నాకు కబాష సీగానపెసూనాంబ నేర్పింది. కానీ దానికి తెలుగు కూడా బాగా రాదు. నన్ను బురుగు, బులుగూ అని అంతుంది. దానికి అసలు మాతలాద్దమే చేతకాదు. నాకిన్ని మాటలు ఎవరు నేర్పారు అనుకుంటున్నారా. రమణ. వాడి ఫ్రెండ్ ఉన్నాడే బాపు వాడు నాకు ఆకారం ఇచ్చి, నా చేత చాలా వేషాలు వేయించాడులే. బుడుగు పాత్ర ఇలా సజీవంగా నిలిచిపోవడానికి తానేమి కుట్రచేసి, తపస్సు చేసి రాయలేదు. కేవలం తన చిన్నతనం అనుభవాలకు అక్షరరూపం ఇవ్వాలని డెనిస్ ది మేనేస్ కామిక్స్ స్ఫూర్తితో ముళ్లపూడి బుడుగుని సృష్టించారంటారు. ముళ్లపూడి వెంకటరమణగారిని చిన్నప్పుడు బుడుగు అని పిలిచేవారట. తెలుగు సాహిత్యంలో బుడుగులాంటి రచన, పాత్ర మరోకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. బుడుగు పరివారం, ఆలోచనలు, భాష అన్నీ పక్కా తెలుగు వాతావరణమే. పిల్లల్లో పెద్దగా, పెద్దల్లో పిల్లగా వుంటూ, నా అంతవాడను నేను అని చెప్పుకుని తిరిగే బుడుగు గురించి, వాడి సృష్టికర్త ముళ్లపూడిని ప్రశంసిస్తూ ఆరుద్ర చక్కని కూనలమ్మ పద్యాన్ని చెప్పారు: హాస్యమందున అఋణ అందె వేసిన కరుణ బుడుగు వెంకటరమణ ఓ కూనలమ్మా! సౌమ్యశ్రీ రాళ్లభండి