సాహిత్యం

సాహిత్యం

ఆమె నవ్విస్తుంది. కవ్విస్తుంది. చక్కిలిగింతలు పెడుతుంది.ఆలోచింపచేస్తుంది. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తుంది కూడా. అది ఆమెకు మాత్రమే సొంతమైన జీవనసరళి. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి. ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు కాంతం కన్పిస్తుంది. కాంతం అంత పొడగరీకాదు, పొట్టికాదు. ఛామన ఛాయ, నవ్వు మొగము, చక్కని నేత్రాలు బాపు బొమ్మకాదు కానీ అందగత్తే. కాంతానికి ఇంగ్లీషు రాదు. కానీ భర్త మాట్లాడుతుంటే నాకేదో అర్ధమయినట్లే ఉందని అనుకునే అమాయక స్త్రీమూర్తి. వారప్రతికలను చదవాలనే ఆసక్తి లేకపోయినా, కుమారీ శతకం, నృసింహ శతకం, ప్రహ్లాద చరిత్ర మున్నగు పుస్తకాలు మాత్రం చదవి అర్ధం చేసుకోగలదు. సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. ఆమెకు మల్లెపూలు, తెల్ల చీర అంటే మహా ఇష్టం. మంచి పొదుపరి. ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బదులు చెప్పింది. ఆమె హాస్యచతురతకు మరో ఉదాహరణ. ఎంతోసేపు కాలేదే, నాలుగైదు నిమిషాల సంభాషణలో నన్నాయన ఫూల్ అన్నాడు అని భర్త చెప్పగానే, అంత ఆలస్యం ఎందుకైందండీ అని అమాయకంగా చురక వేయటం కాంతానికే చెల్లు. దాంపత్యంలో ఉండే విలువలకు కాంతం జీవితం ఒక మంచి నిదర్శనం. అసంతృప్తికి ఆమె జీవితంలో చోటులేదు. ఆదర్శ గృహిణియైన మునిమాణిక్యం వారి కాంతం తెలుగు నాయికలలో మాణిక్యం వంటింది. ఒకసారి భర్త పిలిచి ‘నా కలం కనపట్లేదు,వెతికి పెట్ట’మంటే ఆవిడ వంటింట్లోనుంచి ‘నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి’ అందిట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు, కాంతం నిత్య నూతనమనిపిస్తాయి. ఒకసారి విశ్వనాథవారు మునిమాణిక్యంగారిని ముట్నూరి కృష్ణారావుగారి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే ‘కాంతం భర్త కాదూ’ అన్నారట. ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పడానికి. నాయకుల్లో ‘గిరీశం’, ‘పార్వతీశం’ ఎలా అయితే తెలుగు సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిల్చారో, అలాగే ‘కాంతం’ ధృవతారగా వెలుగొందుతోంది. సౌమ్యశ్రీ రాళ్లభండి
పదం కాదది, ప్రపంచానికి మేలు కొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, సాహితీ జగత్తుకే మణిహారం. తన అభ్యుదయ కవిత్వాల ద్వారా సమాజంలో కుళ్లుని తూర్పార బట్టిన శ్రీశ్రీ, ఎన్నో కమనీయమైన చిత్ర గీతాలను కూడా సినీ అభిమానులకు అందించారు. కత్తిలాంటి పదునైన మాటనైనా, కోమలమైన పదాన్నయినా శాసించి జనారంజకంగా మలచగలిగే శక్తి ఒక్క శ్రీశ్రీక ఉందంటే అతిశయోక్తి కాదేమో. `తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు..` అని ప్రశ్నించే, గర్జించే శ్రీశ్రీ, `నా హదయంలో నిదురించే చెలి, కలలోనే కవ్వించే సఖీ...` అనే ప్రణయ గీతం రాయగలగడం ఆయనకే చెల్లింది. అటు విప్లవ కవిగా, ఇటు సినీకవిగా జోడు గుర్రాల స్వారి నల్లేరు మీద బండి నడకలా ఆయన సాగించగలిగారు. ఆహుతి సినిమాలోని `ప్రేమయే జనన మరణ లీల...` గీతం ద్వారా తన సినీ జీవితానికి అంకురార్పణ చేసిన శ్రీశ్రీ సరళమైన పదాలతో ఎంతో లోతైన అర్ధాన్ని తన గీతాల ద్వారా ప్రజలకు అందించారు. `వెలుగు-నీడలు` సినిమాలోని `కలకానిది, నిజమైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు...` అనే పాట అందుకు నిదర్శనం. అక్కా-చెల్లెళ్లు చిత్రంలోని `వినరాని మాటలే..` అనే పాటలే `జీవితమే ఒక చదరంగం పావులే కదా జీవులందరూ, తెలియనిది ఆట, కనబడదొక బాట...` అని జీవిత సారానంతా ఒక్క వాక్యయంలో వివరించాడు. `ఆకాశవీధిలో, అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనె, సయ్యాటలాడెనే..`, `తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో హ్రదయ రాగం`, `మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడకరుండిన అదే భాగ్యమో` వంటి సుమధుర గీతాలను శ్రీశ్రీ కలం నుంచి వెలువడ్డాయంటే ఎందరో నమ్మకపోవచ్చు. అయితే, శ్రీశ్రీ అభ్యుదయ భావాలను సినీ గీతాల్లో కూడా ప్రదర్శించారు. యమగోల చిత్రంలోని `సమరానికి నేగే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం..`, భూమికోసం లోని `ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా..` మరో ప్రపంచంలోని `ఆకాశమంటే మేడలతో, ఆకలిమంటల పీడలతో ధనికుల కోసం పేదలు కట్టిన మహా మంచి ప్రపంచం.. ఓహోహో మరో ప్రపంచం..`లు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. అలాగే, `పాదవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయగీతికా..` అనే వెలుగు-నీడలులోని దేశభక్తి గీతంలో కూడా `ఆకాశం అందుకునే ధరలోకవైపు, అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకున్న నీదేశం ఎటు దిగజారు..` అని ప్రశ్నించడంలో `ప్రతి మనిషి, మరో మనిషిని దోచుకునేవాడే..` అనడంలోనూ, `ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వ`మని వాపోయినట్టే అన్పిస్తుంది. జానపదం ధ్వనించే `ఓ రంగయో పూలరంగయో..`పాటను చాలామంది కొసరాజు రచనగా భ్రమిస్తారు. ఈ గీతం రాసిన శ్రీశ్రీ, వాగ్ధానం సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన రేలంగిపైన చిత్రీకరించిన హరికథను, సంగీత లక్ష్మి చిత్రంలోని క్రష్ణార్జున సంవాదాన్ని కూడా రాసి సకల కళాప్రావీణ్యుడననిపించుకున్నాడు. కురుక్షేత్రంలోని పతాక సన్నివేశానికి రాసిన `ధర్మక్షేత్రం, ఇది కురుక్షేత్రం..` అనే పాటలో కఠినమైన పదాలను కూర్చిన శ్రీశ్రీ దేవతలో `బొమ్మని చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుకా...` అని సరళమైన పదాలనుపయోగించి మెప్పించాడు. ఇలా మాటలను, అక్షరాలను శాసించగలడు కనకే తెలుగు సినీ రచయితలలో శ్రీశ్రీకి మాత్రమే జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. అల్లూరి సీతారామరాజు చిత్రానికే హైలెట్ అనిపించుకున్న `తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా` పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. మళ్లీ పాతిక వసంతాలు గడిస్తేగాని మరో తెలుగు సినీరచయితకు ఈ అవార్డు లభించలేదన్నది గమనార్హం. చిలకా-గోరింక సినిమాలో హాస్యజంట పద్మనాభం, రమాప్రభలపై చిత్రీకరించిన `చెమ్చాతో సముద్రాన్ని తోడశక్యమా` అనే పాటను రాసిన శ్రీశ్రీ పంతులమ్మ, భార్యాభర్తలు సినిమా కోసం పద్యాయలను సైతం రాసి అందరిని మెప్పించారు. మొదట్లో డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు రాసి తిరుగులేనివాడిగా పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ క్రమేపి తెలుగు ప్రేక్షకుల హ్రదయ పీఠాన్ని అలంకరించారు. దేవుడు చేసిన మనుష్యుల్లారా లో టైటిల్ సాంగ్, గాంధారి గర్వభంగంలో మానవుని శక్తి, యుక్తులను తెలిపే `పదునాలుగు లోకముల దురేలేదే .. చూడగా మనుష్యుడిల మహానుభావుడే (ఈ పాటను అనుకరిస్తూ తర్వాత బాలభారతంలో `మానవుడే, మహనీయుడు, శక్తిపరుడు యుక్తిపరుడు..` అనే పాటను మరో సినీకవి రాశాడు), తోడికోడళ్లులో `కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదానా..` గుండమ్మ కథలో `లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..` శభాష్ రాముడులోని `జయంబు నిశ్చయంబురా భయండు లేదురా..` పాడిపంటలు, మనుష్యులు మారాలి, కులగోత్రాలు, విప్లవశంఖం, పునర్జన్మ, శ్రీక్రష్ణతులాభారం, పంతాలు-పట్టింపులు, పెళ్లీడు పిల్లలు, దానవీరశురకర్ణ, ఆరాధన ఇలా ఎన్నో చిత్రాల్లో మరిపించే, మనసుల కదిలించే, ప్రేరణ కలిగించే పాటలను ప్రేక్షకులకు అందించిన శ్రీశ్రీ చెప్పదల్చుకుంటే, అర్ధం చేసుకోగలిగే శక్తి ఉంటే ప్రతిపదం, కోటితంత్రులై జనజీవనహేళను తెలుపుతాయని నిరూపించాడు. జీవితంలోని ఎన్నోచేదు నిజాలను `తలచేది జరగదు, జరిగేది తెలియద`ని చెపుతూ, `శోధించి, సాధించాలి అదే ధీరగుణమని` తన గీతాల ద్వారా ఆంధ్రులకు సందేశాన్నిచ్చి చిత్ర జగత్తులో ధ్రవతారగా నిలిచిపోయాడు. సౌమ్యశ్రీ రాళ్ళభండి
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా? ఓ నరహరి చిగురుకోయగలవా? ఇది ఒక జానపద గీతం కాదు, పల్లెవాసుల నోటి నుంచి వెలువడిన హాస్య రసానుభూతి. ఉగ్రరూపుడైన నరసింహుడు, దుర్వాసముని శాప కారణాన భిల్ల కన్యగా పుట్టిన సముద్ర తనయ చెంచులక్ష్మిని చూసి తన ఉగ్రాన్ని ఉపసంహరించుకుని మానవ రూపం దాల్చి, ఆమెను పెండ్లాడిన వృత్తాంతం జానపద సాహిత్యంలో చెంచులక్ష్మి యక్షగానంగా, చెంచు భాగవతంగా ప్రసిద్ధిగాంచింది. లక్ష్మీనరసింహుల ఈ సరససల్లాపాలను ఎంతో భావకతతో తన పదాలలో బంధించాడు అన్నమయ్య. ఇంతులాల చూడరమ్మ ఇద్దరు జాణలే వీరు చెంత రమాదేవిఁ గూడె శ్రీ నరసింహుఁడు సరిఁగొండ లెక్కుకొని సరసములాడుకొంటూ సొరిది మోములు తొంగి చూచుకొంటాను విరులచెండులఁగొని వేటలాడుకొంటాను సిరితోడ విహరించీ శ్రీ నరసింహుడు భవనాశిలోని నీరు పైఁ జల్లులాడుకొంటాను నవకపు సిరులను నవ్వుకొంటాను జవళిఁ గెమ్మోవులు సన్నలఁజూపుకొంటాను చివన నిందిరినంటె శ్రీ నరసింహుడు వేమరుఁ దొడలెక్కువ వీడుదోడులాడుకొంటా ప్రేమమునఁ గాఁగిళ్ళఁ బెనఁగుకొంటా ఆముక శ్రీ వేంకటాద్రి నౌభళాన నిలిచిరి శ్రీ మహాలక్ష్మితోడ శ్రీ నరసింహుఁడు తరిగిండ వెంగమాంబ అయితే ఏకంగా చెంచులక్ష్మితో సరసాలలో మునిగిన దేవదేవుడు తన పలుకులను ఆలకించక ఉదాసీనతతో వ్యవహరిస్తున్నాడని తాను రచించిన నృసింహశతకములో ఆ వేంకటనాథునిపై కినుకు వహించింది.
మానక నేను పిల్చినను
	మక్కువ లేక పరాకుసేసితో?
వీనుల సోఁక లేక తగ
	విశ్వము పాలనసేయఁబోతివో?
పూని మహావినోదమున
	భోగము మీఱఁగఁ జెంచుభామతోఁ
గోనలనుండి రావో? తరి
	గొండ నృసింహ! దయాపయోనిథీ!
  పద్మ, కూర్మ, అగ్ని, విష్ణు పురాణాలు పేర్కొన్న శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో నాలుగవ అవతారమైన నరసింహస్వామిని అన్నమయ్య భక్తిశ్రద్ధలతో, పారవశ్యంతో ‘అనిశము దలఁచరో అహోబిలం, అనంత ఫలదం బహోబిలం’ అంటూ తన పదకవితలతో అలకరించాడు. అన్నమయ్య జీవితాన్ని అహిబిల క్షేత్రం ఎంతగానూ ప్రభావితం చేసింది. అహోబిలం పీఠాధిపతి అయిన శ్రీమాన్ అడివన్ శఠగోపయతి అన్నమయ్యకు వైష్ణవ ధర్మాన్ని, వేదాంతాన్ని ప్రభోదించాడు. అంతేకాక 32 అక్షరాల మహానారసింహమంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీ వేంకటేశ్వరుని తర్వాత పెక్కు కీర్తనలలో నృసింహస్వామిని అన్నమయ్య కొలవటంతోపాటు నారసింహావతార గాథను 11 చరణాలలో ‘నరసింహ విజయము’గా కీర్తించి మనందరిని మోక్షపథం వైపు నడిపించాడు. వినరయ్య నరసింహవిజయము జనులాల అనిశము సంపదలు నాయువు నొసఁగును మొదలఁ గొలువుకూటమున నుండి కశిపుఁడు చదివించెఁ బ్రహ్లాదుని శాస్త్రములు అదన నాతఁడు నారాయణుఁడే దైవమనె అదరిపడి దైత్యుఁడు ఆతనిఁ జూపుమనె అంతటఁ బ్రహ్లాదుఁడు ‘అన్నిటానున్నాఁ’డనియె పంతమున దానవుఁడు బాలునిఁ జూచి యెంతయుఁ గడఁకతోడ ‘ఇందులోఁ జూపు’మని చెంతనున్న కంబము చేతఁగొని వేసె అటమీఁదట బ్రహ్మాండం బదరుచు కుటిల భయంకర ఘోషముతో చిట చిట చిటమని పెట పెట పెటమని పటపట మనుచును బగిలెఁ గంబము కులగిరు లదరెను కుంభిని వడఁకెను తలఁకిరి దైత్యులు తల్లడిలి కలఁగెను జగములు కంపించె జగములు ప్రళయ కాలగతిఁ బాటిల్లె నపుడు ఘననారసింహుఁ డదె కంబము నందు వెడలె కనుపట్టె నదిగొ చక్ర జ్వాలలు మునుకొని వెడలెఁ గార్ముకముక్త శరములు కనకకశివునకుఁ గలఁగె గుండియలు అడరె నద్దేవుని కోపాగ్నులు బెడిదపు - మిడుఁగురుల తోడుత మిన్నులుముట్టి పిడుగులురాలేటి భీకర నఖరములు గడుసు రక్కసునికి గాలములై తగిలె తొడికి పట్టి విష్ణుఁడు తొడమీఁద నిడుకొని కడుపు చించెను వాని గర్వమడఁగ వెడలెఁ జిల్లున వాని వేఁడి నెత్తురు నింగికి పొడి వొడియాయ శత్రు భూషణము లెల్లను నెళ నెళన విరిచె నిక్క వాని యెముకలు పెళ పెళ నారిచి పెచ్చు వెరిగె హరి జళిపించి పేగులు జంద్యాలుగా వేసుకొనె తళుకుఁ గోరలు తళ తళమని మెరిచె పెటలించి నరములు పెరికి కుప్పలువేసి గుటగుటమని రొప్పె గోవిందుఁడు చిటిలించి కండలు చెక్కలు వారఁజెండి కుటిల దానవుఁ జూచి ‘ఖో’ యని యార్చెను తెంచి శిరోజములు దిక్కులకు వాని - పంచ ప్రాణములు గొనెఁ బరమాత్ముఁడు అంచెల నీ రీతిని ప్రహ్లాదుని పగ నీఁగె మించి దేవతలు మితిమీఱి జయవెట్టిరి అప్పు డిందిరాదేవి యంకమునఁ గూచుండె వొప్పుగ శాంతమందె నహోబలేశుఁడు తప్పక కోనేటిదండఁ దానై యిందును నందు చిప్పిల వరములిచ్చీ శ్రీ వేంకటేశుఁడు జీవరాశులన్నిటిలో తానే వ్యక్తంగాను, అవ్యక్తంగాను పరమాత్మ భాసిల్లి, సర్వాత్మలలోనూ తన తేజస్సును ప్రజ్వలింపచేసే స్వామి తత్త్వాన్ని ఈ నృసింహ మంత్రం తెలుపుతోంది. అదేవిధంగా, నివురు గప్పిన నిప్పులా పరాక్రమాన్ని తనలో దాచుకోవడేం శ్రేష్టమని నరసింహావతారం మనకు చెప్పకనే చెపుతోంది. ఉగ్రమూర్తి అయిన నరసింహుని హూంకారాన్ని విన్నంతనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఈ తత్త్వాన్నే అతి సూక్ష్మంగా ‘వెంబడించే కోపాన్ని విడిచిపెడితే మేలు,’ అని కోప స్వభావం నరసింహ అవతార లక్షణమని, అది వీడి వేంకటేశ్వరుని సేవించి చింత లేకుండా జీవించవచ్చని, ‘శరణని బ్రతుకరో జనులారా, గరిమ మెరిసె నిదె కనకసింహము’ అంటూ, దైత్యులను త్రుంచిన ప్రళయ నరసింహునికి, పరాక్రమ నరసింహునికి, శాంత నరసింహునికి, సుజన రక్షక నరసింహునికి, నిశ్చల నరసింహునికి, వీర, శృంగార నరసింహునికి, చతుర నరసింహునికి, యోగానంద నరసింహునికి, ప్రతాప నరసింహునికి, విక్రమ నరసింహునికి, దివ్య నరసింహునికి, గుణగణాకర నరసింహునికి, మొక్కరే మొక్కరే మీరు ముందు ముందే జయ లిడి దక్కి శ్రీ వేంకటేశుఁడే తానైన దేవునికి కరములు వే యవే కరములును భయం కరనఖాయుధములు కడలే నవే సిరి దొడపై నదె సింహపునెమ్మో మదే నరరూపు సగమదె నరసింహునికి వంకరకోల లవె వజ్రపుదంతము లవె సంకుమఁ జక్రము నిరువంకలా నవె జంకెల నేత్రము లవె జడలు మూఁపున నవె అంకె నభయహస్తము అదె నరహరికి నిక్కినకర్ణము లవె నీలిమచ్చవుర మదె చుక్కల మొలపూసల నొక్కరూ పదె తొక్కినపాపము లవె తోడనే శ్రీ వేంకటాద్రి పక్కెరనరసింహపు ప్రళయసింహునికి అని ప్రబోధించాడు. చెంచులక్ష్మి జానపద కథారూపకమే గాక, ధర్మపురి నరసింహశతకం, సింహాద్రి నారసింహ శతకాలతోపాటు, అహోబిలం, యాదగిరి, సింహాచలం, మంగళగిరి, కదిరి, కంభం వేదాద్రి, తరిగొండ మున్నగు లక్ష్మీనృసింహ క్షేత్రాలు హరిహరులతోపాటుగా, నరసింహునికి గూడా ఆంధ్రనాట పెద్దపీట వేశాయి. కృష్ణానదీతీరానున్న పంచ నారసింహ క్షేత్రాలలో వెలసిన స్వామిని – మంగళగిరిలో పానకాలయ్య, వేదాద్రిలో స్నానాలయ్య, మట్టపల్లిలో అన్నాలయ్య, వాడపల్లిలో దీపాలయ్య, మరియు కేతవరములో వజ్రాలయ్య పేర్లతో భక్తులు కొలుస్తారు. ఇక హిరణ్యకశుపుని చంపిన నేరుగా స్వామి అనంతపురం జిల్లాలోని కదరి చేరుకున్నాడని ప్రతీతి. ఇక్కడ స్వామిని వేటరాయుడని, బేట్రాయుడని పిలుస్తారు. ఇక వశిష్ట మహాముని కోరిక మేరకు స్వామి అంతర్వేదిలో వెలిశాడు. అలాగే శ్రీ మహాలక్ష్మి తపస్సు చేయట వల్ల మంగళగరిగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో మూడు నరసింహ క్షేత్రాలున్నాయి. వీటిలో కొండపైన పానకాల స్వామి, గిరి శిఖరం మీద గండాల నరసింహుడు, కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహుడు నెలకున్నారు. ఉగ్రనరసింహుని శాంతపర్చడానికి అమ్మవారు అమృతాన్ని సమర్పించినట్టు స్థల పురాణం తెలుపుతోంది. ఆ నేపథ్యంలోనే కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను భక్తులు స్వామి వారికి సమర్పించగా, నేడు కలియుగంలో భక్తులు బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు. యాదర్షి తపస్సుకు మెచ్చి నరసింహుడు జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనే ఐదు రూపాలలో నల్గొండ జిల్లాలో పంచ నరసింహ క్షేత్రంగా బాసిల్లుతున్న యాదగిరిగుట్టపై వెలిశాడు. అలాగే, జ్వాలాహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవాః యోగానంద చ్చత్రవట పావనా నవమూర్తయః జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ, కారంజ (కానుగమాని), భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అనునవి తొమ్మిది నరసింహుని రూపాలు. మహానంది నుంచి సుమారు 70కిలో మీటర్ల దూరంలో ఉన్న అహోబిల క్షేత్రంలో ఈ తొమ్మిది రూపాలతో నవనరసింహుడు కొండపైన, కింద కొలువు తీరి ఉన్నాడు. అన్నమయ్య 12 సంవత్సరాలపాటు ఈ క్షేత్రంలో నివాసమై ఉండటం వల్ల కావచ్చు దాదాపు 40 సంకీర్తనలలో నరసింహుని వర్ణించటంతో పాటు అనేక సంకీర్తనలలో స్వామి వివిధ క్షేత్ర మహిమలను, రూప, లీలా విశేషాలను కొనియాడాడు. వేదములు నుతింపఁగ వేడుకలు దైవారఁగ ఆదరించీ దాసుల మోహననారసింహుఁడు నెఱులజడలతోడ నిక్కుఁగర్ణములతోడ కుఱుచ కొమ్ములతోడ కోఱలతోడ వుఱక సిరిఁ దొడపై నుంచుక సింహాసనాన మెఱసీఁ బ్రతాపముల మేటినారసింహుఁడు నిడుపమీసాలతోడ నిట్టూరుపులతోడ మిడిగుడ్లతోఁ దెల్లనిమేనితోడ వొడలసొమ్ములు వెట్టి వొడ్డోలగమై వుండి కడు మంచివరాలిచ్చీ ఘననారసింహుఁడు చిలుకుగోళ్లతోడ సెలవినవ్వులతోడ బలు జిహ్వతోడ యోగపట్టెముతోడ అలరి శ్రీవేంకటాద్రి నహోబలగిరిని అల ప్రహ్లాదునిఁ గాచె నాదినారసింహుఁడు సౌమ్యశ్రీ రాళ్లభండి
గురజాడ వారి కలం నుండి నేలరాలిన చుక్కే మధురవాణి. వృత్తిపరంగా వేశ్య అయినప్పటికి ఉన్నతమైన వ్యక్తిత్వంతో, కొంటెతనంతో, మాటకారితనంతో, జాణతనంతో నాటి, నేటి సమాజంలో మంచికి, చెడుకి మధ్య ఆనకట్టుగా నిలిచే అందాల భరిణే. కాదు, కాదు విచక్షణతో వ్యవహరించే ధీర వనిత. మంచివాళ్ల పట్ల మంచిగానూ, చెడ్డవాళ్లపట్ల చెడ్డగానూ ఉండమన్న తల్లి బోధనను అక్షరాలా అమలు పరస్తూ, ఎదుటి మనిషిని అంచనా వేసి లోకజ్ఞానంతో వ్యవహరించే కొంటె కొణంగి. ‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుష్యులోయ్’ అన్న గురజాడ వారి దృక్ఫదానికి నిలువుటద్దం మధురవాణి. ‘వేశ్యజాతి చెడ్డది కావచ్చు గాని ... చెడ్డలో మంచి ఉండకూడదా’ అని సమాజంలోని ద్వంద్వనీతిని ఎత్తిచూపిన ధీశాలి. నిడివి మీద బంగారాన్ని, యిత్తడినీ లోకం యేర్చేస్తుందని చెపుతూనే, ‘మంచి ఎక్కడున్నా, గ్రాహ్యం కాదా’ మంచి చెడ్డలు యెంచే వారెవరని నిగ్గతీసీన వనిత. నాటి సనాతన స్త్రీ నుంచి నేటి ఆధునిక మహిళ వరకు ప్రతి ఒక్కరు అలవర్చుకోవల్సిన ఆత్మవిశ్వాసానికి, స్వావలంబనకు ప్రతీకగా నిల్చే మృదుస్వభావి మధురవాణి. పేరుకు తగ్గట్టుగానే మృదువైన సంభాషణలతో, నిశ్చలమైన ఆలోచనలతో సమాజాన్ని నిశితంగా పరిశీలించి బేరీజు వేయడమే కాదు, అవసరమైతే ‘యిటుపైన ఊర కుక్కలను, సీమ కుక్కలను దూరంగా ఉంచడానికి ఆలోచిస్తున్నా’ని స్వప్రయోజనాపరులనుద్దేశించి ఘాటుగా కుండబద్దలు కొట్టినట్టు జవాబునూ ఇవ్వగలదు. మధురవాణి మాట కటువుగా అన్పించినా, తరచి చూస్తే ఒక స్త్రీలో ఉండే సౌకుమార్యం ఆమెలోనూ మనకు కన్పిస్తుంది. వృత్తి వల్ల వేశ్య గనుక చేయాల్సిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందేమో కానీ, ఆమెలో దయాదాక్షిణ్యాలు సున్నా అనుకుంటే పొరపాటే. స్త్రీ జనోద్దరణను గురజాడ వారు ఆమెతో ఆరంభించలేదు, ఆమెతో మొదలు పెట్టించారంటే సబబుగా ఉంటుంది . ఆమెలోని సమయస్ఫూర్తి, వాక్ చాతుర్యం మనకు అడుగడుగునా ముచ్చట కల్గిస్తూనే చురకలు అంటిస్తాయి. ‘తాను చేస్తే లౌక్యం, మరొకరు చేస్తే మోసం అనరాదా ? అబద్దానికి అర్ధం ఏమిటి ? తనకి రొట్టా, ఒహడికి ముక్కా అని మనుష్యులోని సంకుచితత్వాన్ని ఎత్తి చూపిస్తూనే, పరువైన మగవాళ్లున్నప్పుడు పరువైన ఆడవారెందుకుండరని మగవారి మనోభావాలను తూర్పారబట్టడం ఆమెకే సాధ్యం. సంబాషణాలో హాస్యాన్ని రంగరించి చురకత్తుల్లా ఉపయోగించటం ఆమెకే చెల్లింది. ‘ఈ కన్నె పిల్ల నోరు కొంచెం చుట్టవాసన కొడుతూ ఉంది,’అనడంలోనే చూపితే చాలు అల్లుకు పోయే చురుకుదనం మధురవాణి సొంతమని అర్థమవుతుంది. విద్వాంసుల ఇచ్చకాలకు మైమరచి, మెరమెచ్చు మాటలకి పొంగిపోకుండా, ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని కార్యాన్ని సాధించగల వ్యూహాపరురాలు. వెరసి నాటకరచయితనే సమ్మోహితుణ్ణి చేసే అమాయకత్వం, చమత్కారం, అజ్ఞానం, మొరటుతనం, పెంకెతనం, సౌజన్యం, పరోపకారబుద్ధి మెండుగా గల వేకువజామున మెరిసే వేగుచుక్క మధురవాణి. సౌమ్యశ్రీ రాళ్లభండి
అష్టాదశపురాణాలను జాతికి అందించిన వ్యాసభగవానుడు దాదాపు లక్ష శ్లోకాలలో రచించిన భారతం – సీ. ‘‘ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని యధ్యాత్మవిదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని, కవి వృషభులు మహా కావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని యైతిహాసికులితిహాసమనియు బరమ పౌరాణీకుల్ బహు పురాణముచ్చ యంబని మహిగొనియాడుచుండ’’ ఆయుష్షు కోరుకునేవారికి ఆయుష్షుని, అర్ధార్ధులకు విపులార్ధాన్ని, ధర్మార్ధులకు నిత్యధర్మ సంప్రాప్తిని, వినయార్ధులకు మహావినయ సంపత్తిని, పుత్రార్ధులకు పుత్ర సమృద్ధిని, సంపదార్ధులకు సంపదలను భారత పఠనం కల్గిస్తుందని భారత గొప్పదనాన్ని చెపుతూ నన్నయ్య చెప్పాడు. భారత, రామాయణాలు మన జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయన్నది నిర్వివాదాంశం. అయితే, రామాయణ గాథలు చొప్పించుకు పోయినంతగా భారతం వ్యాపించలేదు. జానపద గేయ సాహిత్యంలో రామాయణం పెద్దపీట వేసుకుని కూర్చునప్పటికీ, భారతం కూడా ఏమీ తీసిపోలేదు. జానపద కళారూపాలలో భారతమే అగ్రగామిగా నిలిచింది భారత, రామాయణాలు మన జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. అయితే, రామాయణ గాథలు చొప్పించుకు పోయినంతగా భారతం వ్యాపించలేదు. జానపద గేయ సాహిత్యంలో రామాయణం పెద్దపీట వేసుకుని కూర్చునప్పటికీ, భారతం కూడా ఏమీ తీసిపోలేదు. జానపద కళారూపాలలో భారతమే అగ్రగామిగా నిలిచిందిఅటువంటి భారతం మన జానపద కళారూపాలైన చెక్కభజన, కోలాటం వంటి కళలలో భారత ఘట్టాలను విరివిగా చిత్రీకరించారు. ఉదాహరణకు ధర్మరాజు జూదంలో సర్వం కోల్పోయి, అన్నదమ్ములతో, ద్రౌపదితో అరణ్యాల పాలవటం, ద్రౌపదీ వస్త్రాపహరణం, వంటి ఘట్టాలు రాయలసీమ ప్రాంతంలో చెక్కభజన గేయాలుగా బహుళ ప్రచారంలో ఉన్నాయి. జానపదులు పాండవుల కష్టాలు తమ కష్టాలుగా భావించారు. ధర్మజుడైన యుధిష్టురుని వారు సర్వజ్ఞుడిగానే తలిచారు. ‘‘తమ్ముడా ఒరె భీమసేనా ఎంతమోసము జరిగెర’’, అంటూ రాయలసీమలో చేసే పాండవవనవాసం చెక్కభజన ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఇక భారతంలో ఎంతో ఉదాత్తపాత్రైన ద్రౌపదిని గూర్చిన అనేక పాటలను జానపదులు కూర్చారు. కోరి పాండురాజు యింటికి కోడాలునై నందుకు వార కాంతల దీటు సేయగ సభలో బ్రతుకెందుకు,’ ‘పతుల ఎదుట కట్టుచీరలు విడుచుట నీకు ధర్మమా, వాసుదేవ వరకుమార వలువలు దయచేయరా’ అంటూ ఆర్తితో ద్రౌపది తరపున అచ్యుతునికి మొరబెట్టుకున్నారు. ఆమె అవమనాలు తమ అవమానాలుగా, ఆమె కష్టాలు తమ కష్టాలుగా భావించి ఎంతో సానుభూతితో గేయాలు పాడారు. వీటిలో ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టం అతి ముఖ్యమైనది. ‘‘నీలవరన పాలశమన నిన్ను నమ్మినానురా నన్ను సభకు తీసి అవమానింప బోతున్నారురా అచ్చుతా నను బ్రోవరా యిక దిక్కు ఎవ్వరున్నారురా దిక్కు నీవే దీన బాంధవ గ్రక్కుననన్ను బ్రోవరా కంస మర్ధన వంశపాలన కలిగి కృష్ణా బ్రోవరా’’ అంటూ ద్రౌపది ఆక్రందన జానపదుల గుండులోతుల్లోంచి వచ్చింది. జానపదుల దృష్టిలో ధర్మరాజు ధర్మపరాయణుడే, శ్రీకృష్ణుని మాయవలనే పాండవులు అరణ్యవాసం చేయవచ్చిందని జానపదుల నమ్మిక. అందుకే ద్రౌపది కష్టాల్ని తెల్సుకొని కృష్ణుడి మాయల్ని మర్మంగానే భీముడికి చెప్పినట్టగా పాండవుల అరణ్యవాస ఘట్టంలో వారు ఈ క్రిందివిధంగా చిత్రీకరించారు. ‘‘...... పులులు మేకలు కొన్ని దినములు జూదమాడెను తమ్ముడా ఆకుపూతలేని అడవిలో ఆ ఆరు మేకలు మేశర అడ్డమొచ్చు పెద్దపులులను సంహరింపుము అర్జున ఎవరు చేసిన మాయకాదు బావ చేసిన మాయర బాకు పదహారువేల భార్యలు కలవాడురా... వద్దు పగవానికైన వాసుదేవుని సాక్షిగా ఆడజన్మము కంటె అడవిలో వృక్షజన్మము మేలురా చేత చెక్కలు కాలి గజ్జెలు ఘల్లుఘల్లున మ్రోయగ జల్లుజల్లున మ్రోయగ యిక గల్లుగల్లున మ్రోయగ పరగకంభము పాటి కోదండరామ నిన్ను కొలిచెదము మేము సకలము రామా’’ ఈ పాట వీథి నాటకాలలో, చెక్కభజనల్లో పాడుకుంటారు. ఆధ్యాత్మిక చింతన, తత్త్వజ్ఞానాన్ని, సామాజిక స్థితిగతులని వీధినాటకాల్లో భాగంగా చేసి జానపదులు ముందుతరాల వారికి అందించారు. ‘ఆకుపూతలేని అడవి’ అంటే మానవ శరీరం. ఆరుమేకలు ఆరిషడ్వర్గాలు. ఇవి క్రూరమృగాలు సాధుజంతువులను చంపినట్టుగా, మనిషిలోని మంచి గుణాలను చంపి, మోహం, లోభం, స్వార్ధం వంటి మృగతత్వాలను ప్రజ్వరిల్లచేస్తాయి. వాటిని తుదముట్టించమని అర్జునికి తత్త్వబోధన చేయటమే ఈ గేయోద్దేశము. భారతంలో నాటకీయతను తెలిపే అనేక ఘట్టాలను జానపద కళారూపాల్లో మనం చూడవచ్చు. సుదేష్ణ కొలువులో సైరంధ్రిగా ద్రౌపది దుస్థితి, కీచక వధ, అరణ్యవాసానంతరం ధృతరాష్ట, ధుర్యోధనల సంవాదం, అభిమన్యు,శశిరేఖల పరిణయ విషయంలో సుభద్రా,బలరాముల సంవాదం, ఇలా రోజూవారీ జీవితంలో ప్రతి యింటిలోనూ ఎదురయ్యే సంబంధ, బాంధవ్యాలకు సంబంధించిన అనేక వృత్తాంతాలను జానపదులు పాటలు కట్టి పాడారు, కోలాటాలు, చెక్కభజనలో రసవత్తరంగా ఆడారు. అందులో ప్రజాదరణ పొందిన ఘట్టం, సుభద్రా, బలరాముల సంవాదం. సుభద్ర: సిన్నాది శశిరేఖ చిన్నవాడు అభిమన్యు యిద్దరికీ డేరన్నా ఓ బలరామన్నా యిద్దరికీడేరన్నా పుట్టింది శ్రీ పుత్రి పుట్టినప్పుడు వాశ పుట్టినే నోస్తీరన్నా ఓ బలరామన్నా కన్నెనడగవస్తిరన్నా బలరామ: ఉయ్యాల తోట్లల్లో ఊగేటి నాపుత్రి అడవులకెటుపంపుదూ ఓ సుభద్రమ్మా అడవులకెటులంపుదూ పాలుహన్నము పెరుగు భుజియించే నాపుత్రి ఏ పాకు తిన పెడుదునా ఓ సుభద్రమ్మ ఏ పాకు తినబెడుదునా సుభద్ర: మేనత్త కొడుకని మెచ్చిననిచ్చినారూ హెచ్చు తక్కువ లెంచితిరా ఓ బలరామన్నా హెచ్చు తక్కువలెంచిరా... తేటగీతి
తెలుగునాట పదకవితలు గేయ వాఙ్మయంగా ప్రసిద్ధి చెందాయి. త్యాగయ్య కృతులు సంగీతానికి పెద్దపీటవేసి, సంగీతభావమే సాహిత్యానికి జీవం పోసాయి. ‘రామ ఇక నన్ను బ్రోవ రాదా దయలేదా’ అన్నప్పుడు ఇందు సాహిత్యం ఎటువంటి రసోత్సత్తిని కల్గించదు. అదే ఈ సాహిత్యానికి సంగీతం జోడైతే పదాలు జీవం పోసుకొని శ్రోతల హృదయాన్ని తాకుతాయి. అదేవిధంగా రామదాసు కీర్తనలను పరిశీలించినపుడు, ‘ఏ తీరుగ నను దయజూచెదవో – ఇనవంశోత్తమ రామా, నా తరమా భవసాగరమీదను – నళినదళేక్షణ రామా, కారుణ్యాలయ భక్త వరద నను – కన్నది కానుపు రామా’ అనే కీర్తనలో సాహిత్యం రసానుభూతిని కల్గిస్తుంది, సంగీతం కాదు. అదే పదరచన సంగీత, సాహిత్యాలను సమన్వయపర్చి ప్రత్యేక స్వరూపంతో భాసిల్లుతుంది. ఇందుకు క్షేత్రయ్య పదాలే ఉదాహరణ. ఆంధ్రభాషలో పదరచనకు ఆద్యుడు అన్నమాచార్యుడు. క్షేత్రయ్య నాటికి పదం శృంగారంతో మిళితమైన మధురభక్తికి తార్కాణాలుగా రూపుదిద్దుకుంది. అన్నమయ్య పదాలలో శృంగారంతోపాటు ఆథ్యాత్మికత ఉట్టిపడుతుంది. అన్నమయ్య తదనంతరం వచ్చిన తాళ్ళపాక కవుల పదాలలో సాంప్రదాయకంగా వచ్చే అష్టవిధ నాయికలేగాక, చెంచెతలు, బోయ స్త్రీలు, భోగకాంతలు వేంకటేశ్వరుని నాయికలై తమ మనోభావాలను వెలిబుచ్చుతారు. మన దేశంలో చిరకాలంగా మధురభక్తితో ఈశ్వరుని ఆరాధించటం తెలిసిందే. నారద భక్తి సూత్రాలలో ‘యథావ్రజ గోపికా నాం’ అనే సూత్రంలో గోపికా భక్తి మధురభక్తికి తార్కాణంగా ఉదహరించబడింది. జయదేవుని అష్టపదులు రాధాకృష్ణుని ప్రణయ భావాన్ని మధురభక్తితో రంగరించి తెలిపినవే. మీరాబాయి, కబీరు వంటి భక్తులు కూడా ఈ మార్గాన్నే అనుసరించారు. ఇక క్షేత్రయ్య పదాలకు వస్తే, ఇవి సంగీతం సాహిత్యాన్నిగాని, సాహిత్యం సంగీతాన్నిగాని అధిగమించకుండా, పరస్పరం తోడ్పడుతూ పదరచన గానాభినయన రూపమై శ్రోతలను ఆకర్షిస్థాయి. అన్నమయ్యతో ప్రారంభమైన పదరచన సంగీత,సాహిత్య సమ్మేళనంలో, పదరచనాశిల్పంలో పరిణితి పొంది క్షేత్రయ్య పదాలతో ఉచ్ఛస్థాయికి చేరుకున్నాయి. తెలుగుతనాన్ని సంగీతంతో మేళవించి పదాలనందించిన క్షేత్రయ్య పదసంగీత పితామహుడు. పల్లవి: ఎంత చక్కని వాడే నా సామి వీడెంత చక్కని వాడే అనుపల్లవి: ఇంతి మువ్వ గోపాలుడు సంతతము నా మదికి సంతోషము చేసునే మొలక నవ్వుల వాడె ముద్దు మాటలవాడె తళుకారు చెక్కుటద్దముల వాడె తలిరాకు జిగి దెగడదగు మోవి గలవాడె తెలిదమ్మి రేకు కన్నుల నమరు వాడె చిరుత ప్రాయము వాడే చెలువొందు విదియ చం దురు గేరు నొసలచే మెరయు వాడే చెఱకు విల్తుని గన్న దొరవలె నున్నాడే మెరుగు చామన చాయ మే నమరు వాడే పొదలు కెందామరల పెంపొదవు పదముల వాడే కొదమ సింగపు నడుము కొమ రమరు వాడే మదకరి కరముల మరువు చేతుల వాడే సుదతి| మువ్వగోపాలుడెంత సొగసు గలవాడే శృంగార రస ప్రాధాన్యంగా రచించిన సుమారు 4,500 క్షేత్రయ్య పదాలలో చమత్కారం, వ్యంగ్యం, శబ్ధ సముచ్ఛయం ప్రత్యేకత. భావుకతతో నిండిన భావ చిత్రాలను క్షేత్రయ్య తన పదాలలో పలికించడానికి కారణం క్షేత్రయ్య తానే నాయికగా ఆ మువ్వగోపాలుని మధుర భక్తితో ఆరాధించటమే కావచ్చు. తెలుగు భాషలోని పలుకుబళ్లు, నుడికారాలు, సామెతలు క్షేత్రయ్య పదాలలో మనకు ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. ‘అరటాకు ముల్లు సామ్యమైనందుకు’, ‘తోటకూర దొంగవలె తొలగిపోయే వాడవు’, ‘బావిలోని నీరు వెల్లువపోయీనటవె’, ‘చేత కాసులేదుకాని చేసైగలె చిందిమీనైమిట్టిపడెను’ వంటి జాతీయాలు, ఈనిన పులివంటి కోపమెందుపోయేనో, కలిమిలేములనగా కావెడికుండలు, తలవ్రాలెవరికి తప్పించ వశమే, మేకవన్నె పులులంటి చెలులు వంటి సామెతలనేకం అతని రచనలలో మనకు విరివిగా కన్పిస్తాయి. చదువుకున్నప్పటి కంటే పాడునప్పుడును, పాడునప్పటి కంటే అభినయించినప్పుడు క్షేత్రయ్య పదముల సౌందర్యమధికమగును. ‘సాహిత్య సంగీతాభినయ సర్యస్వములనదగిన యట్టి పదములను సహస్రములుగా సృజించి క్షేత్రయ్య పద వాఙ్మయ లక్ష్మికి చేకూర్చిన ప్రత్యగ్రశోభయింతింతనరానిదని’, డా. దివాకర్ల వేంకటావధానిగారు పేర్కోన్నారు. పల్లవి:   చాలు చాలు ఈ చిన్నెలతో నాదు సరసకు జేరకుర అను:    ఈ చిన్నెలు సాగవు నా వద్ద మువ్వగోపాల కన్నుల వీడెముతో కాటుక మోవితో వెన్నున కీల్జడ వేటుతోను కన్నియకెంపుల గాజుల నొక్కులతోను వన్నెకాడ నుదుటను నున్నలత్తుతోను నిదుర మబ్బుతోను నిండు బడలిక తోను ముద్దియ కలసిన ముదముతోను నిద్దంపు చెక్కిళ్ల నెలవంకలతోను వద్దురా పద్దులు వగకాడ నాతోను అలదాని కుచములు నలదిన జవ్వాది కల యురస్థలమును నంటి నన్నంటరాకు బలిమిచేసేదేల బాల మువ్వగోపాల అలనాడె గూడిన చెలిమి పదివేలు ఈ పదంలోని భావాన్ని ఏ చిత్రకారుడు చిత్రీకరించలేడు, ఏ శిల్పాచార్యుడు చెక్కలేడు. మనోహరమైన, మంజులమైన భావం నాయికా, నాయకుల శృంగార భావోద్వేగాలను ప్రకటిస్తాయి. సునిశితమైన బావ ప్రకటన క్షేత్రయ్య పదాల ప్రత్యేకత. ‘తలపువాని మీద నాయె, తల వాకిలి ఇల్లాయె,’ ‘ఇంతలో నీవీడకు రాకుంటే కన్నీరు కావేరికాలువ సుమీ,’ అంటే అల్పాక్షరాలతో అనంతార్ధాలను ప్రకటించటంలో క్షేత్రయ్య సాటి. పల్లవి:   ఏమి సేతునే? కొమ్మా ఓ యమ్మా అను:    ఏమి సేతునే? వెన్నెలకాకలకు ఎట్లోర్తునమ్మా నే కల కల రవముల చిలకల పలుగులు సొలపులు నామీద ఝలు ఝల్లుమనే అళులచే నళుకుచు సొలపుల వలచితి తెల తెల్లవారదే చిలుకలకొలికి నే మింట చందురు నన్నంటి గాయుగాక యొంటి నుంటే రాదు కంటికి నిదుర తుంట విల్తుడు నన్ను కంటగించి నాడు వింటివటే కలకంఠిరో నేడు అందమైన మా మువ్వగోపాలు డైన రంగేశు మందలించి వాని యిందు తోడితెచ్చి పొందుసేయగదవే చందన గంధి నే జయదేవుని మొదలు పెద్దన వరకు అనేక మంది కవులు స్త్రీ ప్రణయం, విరహం, వియోగం, కన్నీరు వర్ణించారు. కానీ పురుషుని విరహాన్ని, ప్రణయావేశాన్ని వర్ణించిన ఘనత మాత్రం క్షేత్రయ్యకే దక్కింది. ఏమి సేయుదు మోహ మెటువలెదీరును భామిని మణినియెవ్వరు తోడితెచ్చేరు వెలయనీరు ముఖార విదంబు లిఖియించి యలరు వాసనలు వ్రాయగ నేరనైతి కళలొల్కు నీమోవి గదసివ్రాసితిగాని నెలత తేనియలుంచ నేనేరనైతి కలికి సొగసైన నీ కనులు వ్రాసితిగాని బెళకు చూపులు వ్రాయు విత మెరుగనైతి గళమురేఖల తెలియగాను వ్రాసితిగాని చెలగుకోకిల వంటి పలుకు వ్రాయగనైతి తరుణిరో నాగ బంధమురీతి గలయుటలు గరిమవ్రాసితి గాని పరవశము చేత పరగమా మువ్వగోపాల రాయని తిరుగ రతులకు బిలుచు తెలివి వ్రాయగనైతి. తెలుగులో లోతైన భావలను పలికించే పదకేళికకు నిర్వచనాలు క్షేత్రయ్య పదాలు. రాగంతోపాటు సాహిత్య భావనలను వ్యక్తపర్చే క్షేత్రయ్య పదాల సోయగం, మాధుర్యం, మృదుత్వం, లాలిత్యం, గాంభీర్యం అటు సాహిత్యకారులను, నాట్యకోవిదులను, ఇటు సంగీతజ్ఞులను అలరించే దృశ్య కావ్యాలు. సౌమ్యశ్రీ రాళ్లభండి
పాల్కురికి సోమనాథుడు తెలుగులో మొట్టమొదట రచించిన బసవ పురాణం మొదలుకుని, తర్వాత వెలువడిన మార్కండేయ పురాణం, వెన్నలకంటి సూరన విష్ణు పురాణం, నందిమల్లయ్య, ఘంట పింగనల వరాహ పురాణం, ఎర్రన రాసిన నరసింహ పురాణం, శ్రీనాథుని భీమేశ్వర పురాణాలతోపాటు అనేక క్షేత్ర పురాణాలను అనేక మంది కవులు తెలుగువారి ముంగిళ్లలోకి తీసుకువచ్చారు. ఈ పురాణాలు మన జానపదులను, వారి సాహిత్యాన్ని కూడా ప్రభావితపర్చాయి. శ్రీకృష్ణలీలలు, శ్రీరామ పట్టాభిషేకం, శశిరేఖా పరిణయం, రుక్మిణీ కళ్యాణం, భక్త ప్రహ్లాద, మహిషాసుర వధ ఇలా అనేక పురాణ ఘట్టాలు జానపద కళారూపాలకు ఇతివృత్తాలై, జనబాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లాయి. జానపద కళారూపాల్లో రామాయణ, భారత గాథలు ప్రస్ఫుటంగా కన్పించినా, భాగవత ఇతివృత్తాలకు కూడా తగిన ఆదరణ లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా, కృష్ణలీలలు, రేపల్లెలో చిన్నికృష్ణుని చిలిపి చేష్టలు, గోపికా గీతాలు వంటివి జానాదరణ పొందాయి. యశోద లాలి -- ‘‘లాలి కృష్ణయ్య నీలమేఘ శ్యామన్న పాలా గోపాలన్న పవ్వళించగ రావయ్య శృంగారించీన మంచి బంగారు ఉయ్యాలలో ఆదిశేషుని పాన్పుమీద పవ్వళించగ రావయ్య ఇంద్రలోకాన నీకెవ్వరు కావలనయ్యా లలితాంగ శ్రీ సత్య భామాదేవి కావలనా... రుక్మిణీయు కావలెనా రాధాదేవి కావలనా...’’ బృందావన కృష్ణుని రాసలీలలు, రాధాకృష్ణుని ప్రణయ గాథలు, గోపికలు కృష్ణుని చిలిపి చేష్టల గురించి ఫిర్యాదు చేసిన సందర్భంలో యశోద-గోపిక-కృష్ణుల సంవాదాలు, హృదయరంజకంగా జానపదులు మలిచారు. గోపిక: పెరుగు చిలుకుచుండగా నా మరుగున నిలుచున్న కృష్ణుడు పెరుగు చారెడు నించుకొని జుర్రి పరుగిడి పోయినాడు అడుగవే తల్లి అడుగావే యశోద: అడిగినంత వెన్న నీకు పెడుదునే మన యింట్లో లేదా దుడుకుతునమున పొరుగిండ్లకు దొంగిలి తిన బోవనేల కృష్ణా పడుచులపై నీకు చలమేలనురా. కృష్ణుడు: దేవరాకు పెట్ట వలెనని యీవరా కనుకొంటుయంటిరి ఆ దేవుడేమొ జుర్రిపోతే తెలియకానా మీద పెట్టిరి గోపికలు: గొల్ల భామలంతా గూడి చల్లలమ్మను బోవుచుండగ చల్లబానకు సుంకమిమ్మని చిల్లులూ పడగొట్టినాడు అడుగావే తల్లీ యశోద: యేమిరామృష్ణయ్య గొల్లభామలు చల్లనమ్మబోతె చల్లబానకు సుంకమిమ్మని చిల్లులూ పడగొట్టినావట కృష్ణా కృష్ణుడు: చిల్లులూగ సమయమున, వడగండ్ల వర్షమొచ్చి బానలు చిల్లులూ పడగొట్టనేమొ, చిల్లరాపనులెగుర తల్లి తెలియాచెతల్లి గోపిక: గొల్లభామలంతా గూడి, స్నానమాచరించేటప్పుడు చీరల్నియు తీసుకొని చెట్టుపై గూర్చిండినాడు. తల్లీ తనయుని తప్పులు దెల్పెదమె యశోద: యేలరా కృష్ణయ్య గొల్లభామలు స్నానము జేయగ చీరెలన్నియు తీసుకొని చెట్టుపై కూర్చిండి నావట కృష్ణా కృష్ణుడు: చెట్టుపై కూర్చిండి నేను పండుతినే సమయమందు సుడిగాలి వచ్చి చీరల్నియు చెట్టుపైబడ నేసెతల్లి తెలియదె తల్లితెలియదె. ఇలా కృష్ణుని తుంటరి పనులను గోపికలు ఏకరువు పెట్టగా యశోద, కృష్ణుని నిలదీసిన తీరు, కాళీయ మర్ధనం, గోవర్ధన గిరి నెత్తడం వంటి అనేక దివ్యగాథలను మనోజ్ఞంగా జానపదులు తమ పదాలలో రక్తి కట్టించారు. ఇక మధురానగరికి చల్లనమ్మబ్రోవ దారివిడవమని గోపికలు కృష్ణుని వేడు కోలాట పాటలు – కృష్ణుడు: మత్తగజగమనరో మీ అత్త ఆజ్ఞ మీరనుచు తత్తరీనని బొంకెదవు నీటక్కరి తనమెల్ల మానుము గోపిక: బల్లు బల్లున తెల్లవారెను పల్లెలకు చల్లలమ్మ పోవల మల్ల వచ్చిన వెనకనీతో మాటలుంటె నిలుతుగానీ కొత్త కోడళ్లతో కృష్ణస్వామి చేసే పరాచికాలు – గోపిక: రేపెల్ల వాడలాకు కృష్ణమూరితీ నీవు ఏమి పని కొచ్చినావు చిన్ని మాధవా కృష్ణుడు: రేపల్లె వాడలకు గొల్లభామా నేను పాలు పెరుగు వెన్న కొస్తి పల్ల వాధరీ గోపిక: కొత్త కొడలినయ్య క్రిష్ణమూరితీ మా అత్తానన్న అడగవయ్యా చిన్ని మాధవా కృష్ణుడు: కొత్తా కోడలివైతే గొల్లభామా నీకు రొక్క మిస్తా పుచ్చుకొయె పల్లవాధరీ గోపిక: నీ రొక్కములు నా కొద్దు కృష్ణమూరితీ నీకు కోటప్ప కన్న కట్టవయ్యా చిన్ని మాధవా కృష్ణుడు: కోటప్ప కన్న కడతానే గొల్లభామా నా కల్లలాడు కోర్కెదీర్చు పల్ల వాధరీ గోపిక: అట్లా మాట్లాడబోక కృష్ణమూరితీ నీవు రోత పట్టి పోతువు చిన్నిమాధవా కృష్ణుడు: ఉల్లి మల్లి చీర దెస్తి గొల్లభామా నా కల్ల చూడు కోర్కె దీరు గొల్లభామా గోపిక: మంచిపని చేస్తివయ్యా కృష్ణమూరితీ మా యింటి వాడు గోపగాడు చిన్ని మాధవా కృష్ణుడు: మంచిపని చేయకుంటే గొల్లభామా నన్ను మాధవుడందురంటే పల్లవాధరీ. ఇలా అనేక విధాలుగా రేపల్లెలో చిన్నికృష్ణుని చిలిపి చేష్టలలో జానపదులు ఓలలాడారు. తేటగీతి
ఆ మాట అనగానే మనముందు గయ్యాళి సూర్యాకాంతం రూపం దర్శనమిస్తుంది. అది మన తప్పుకాదు. పరిస్థితుల ప్రభావం. అత్తగారనగానే కోడళ్లని వేపుకు తినే పాత్రలే మన మనసులో మెదలుతాయి గాని, “దొంగలెవరో, దొర్లెవరో మనకెట్లా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే, నల్లగా నాపరాళ్లలాగ, పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటినిండా నూనెరాసుకుని, దొంగతనాలకూ, దోపిళ్లకూ వస్తూండేవాళ్లు...,” అని అమాయకత్వం వెలిబుచ్చే ‘అత్తగారు’ కేవలం భానుమతి రామకృష్ణగారి ఊహల్లోనే ఉదయిస్తారు. కల్తీలేని భాష, భావాలు, భావనలతో తెలుగింటి అత్తగారు ఇలాగే ఉండాలని అందరూ ఆశించి, ఆకాంక్షించే అపురూప సృష్టి భానుమతి అత్తగారు. ఈ అత్తగారిలో కనబడే వ్యక్తిత్వమల్లా కాలదోషం పట్టని ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు, కట్టుబాట్లు వీటన్నింటిని పేనివుంచే చాదస్తము. ఇది వాస్తవికతకు ఎంతో దగ్గరైన ప్రాత. ప్రతి వీథిలోనూ రామాలయం ఉన్నట్లే, ప్రతీ ఇంట్లోనూ ఒక అత్తగారు తప్పనిసరి. తాపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే ఆవిడ మనస్తత్వం, కోడలిని, ఇంటిని కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగే నేర్పరితనం, నిమ్మకాయెంతో, ఆవకాయా అంతే, ఆవెంతో గేదంతే అనుకునే అజ్ఞానం, అమాయకత్వం వెరసి ‘అత్తగారు.’ బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని మల్లు పంచ, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం, కొత్తని చూసి వింత పడడం, పాత సంగతులని ఆప్యాయంగా తలుచుకోవడం, అవకాశం దొరికితే పెత్తనం చేయాలన్న ఉబలాటం, ఒకమాట అని పది మాటలు పడ్డా అవి ఎవరికీ తెలియకూడదన్న లౌక్యం. వీటికి మారురూపే ‘అత్తగారు.’ అన్ని నాకే తెలుసనే ధీమా, తాను చేసే ప్రతి పని (నిర్వాకం) పై గట్టి నమ్మకం. అవి బెడిసి కొడితే తన తప్పును తాను ఒప్పుకోవటమేమిటి? విడ్డూరం. అసలు తాను తప్పు చేస్తే కాదా, తన చుట్టూ ఉన్న వాళ్లు చేతకాక తప్పులు చేస్తారు. తనదే తప్పని రుజువైతే, మొహం దాటేయడం తనకేం కొత్తకాదు. ఇహ ఆవిడ వంట చేస్తే వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం ఆ బ్రహ్మతరంకాదు. అయితే, ఆవిడకు పాయసం, వడలు, చేగోడీలు, మురుకులు, అప్పడాలు, వడియాలు అంటే మహా ఇష్టం. అవి వండి, ప్రియమైన వారికి వడ్డించి వారిని దడిపించటం అంటే మరీ ఇష్టం. ఆవిడలో చాదస్తం, ఆచారలపట్ల మక్కువ కాస్త ఎక్కువైనా, ప్రేమకు ఆచారంలేదనే సహృదయం గల నిండు మనిషి. ఇక ఆవిడ కాస్త మెల్లగా మాట్లాడితే, తంజావూరు తంబూరా మంద్రస్థాయి అనవచ్చు, అదే గొంతు పెంచారో కలకత్తా మెయిలే, కంఠం ఎత్తి మాట్లాడినపుడు మాత్రం కందిరీగలు ఘోష పెడుతున్నట్టుంది అంతే! అవడానికి పాతకాలం మనిషైనా, జాలీ మూడ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఇంటిలో కాఫీ నిల్, రేపు మీకు నో కాఫీ అంటు పొడిమాటలు ఇంగ్లీషులో అలవోకగా దొర్లించేయగలరు. అన్నట్టు మన అత్తగారు అవడానికి ఆంధ్రా గడుసుపిండమేగాని మధురాంతకంలో పుట్టి, చెంగల్పట్టులో పెరిగారు. అందుకే ఆవిడకు అరవ సాంప్రదాయం కూడా కరతళామలకం. అంతెందుకూ ఆలయాలు, ఆచారాలు అరవ దేశంలో ఉన్నట్టు ఆంధ్రాదేశంలో ఉండవంటారు ఆవిడ. అందుకే అరవ సంవత్సరాది కూడా ఆంధ్రా స్టైల్లో ఘనంగా జరుపుకుంటారు. ఇంతెందుకు షడ్రసోపేతమైన భోజనం చేసి తాంబూలం వేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో, భానుమతి అత్తగారిని తలుచుకుంటే అటువంటి అనుభూతే కలుగుతుందని చెప్పొచ్చు. ఉగాది పచ్చడిలో రుచుల్లా అత్తగారిలో కూడా అన్ని భావోద్రేకాలు పరిపూర్ణంగా మనకు గోచరిస్తాయి. తెలుగు సాహిత్య రంగంలో అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే సజీవమూర్తి అత్తగారి పాత్ర. సౌమ్యశ్రీ రాళ్లభండి
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందక ముందు అందరికి ఉన్న ఏకైక వినోద, విజ్ఞాన కాలక్షేపం కథలు. పేదరాశి పెద్దమ్మ కథలు, బేతాళ కథలు, పంచతంత్ర కథలు, తెనాలి రామలింగ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, మర్యాద రామన్న కథలు ఇలా అనేక కథలు భోజనానంతరం ఆరు బయట వెన్నల కింద పక్కలు పర్చుకుని పడుకునే పిల్లలకు, పెద్దలకు ఇంట్లోని తాతయ్యలో, బామ్మలో చెప్పటం కద్దు. అనగనగా ఒక రాజు తో మొదలై కథ కంచికి మనం ఇంటితో ముగించే కథ అంటే అర్థం నివేదించు, ప్రకటించు, ప్రదర్శించు మొదలగునవి. క్లుప్తంగా కథ అంటే కాల్పనిక గాథ. ఇతర భాషల నుంచి అనువదించబడిన కథలను, అలాగే ఇతర కథలను అనుకరించి రాసిన కథలను పక్కన పెడితే, జనపదులలో నిక్షిప్తమై, ఆ నోట, ఈ నోట తమ భాషలో, తమదైన రీతిలో పాటను, వచనాన్ని ఏర్చి, కూర్చి అందించేవే జానపద కథలు. పురాణేతిహాసాలు కూడా జానపదుల నోటిలో నాని కొత్త హంగులను దిద్దుకున్నా, వీటిని పూర్తిగా జానపద కథలు అని చెప్పలేం. జానపద కథా లక్షణాలని చెప్పాల్సి వస్తే, వీటిలో కథావస్తువు, పాత్ర చిత్రీకరణ చాలా సరళంగా ఉంటుంది. కథ యందు అతి తక్కువ పాత్రలండి, తమ సమకాలీన సంఘటనలు, వ్యక్తులు. జీవన పోకడ ప్రధాన ఇతివృత్తాలయి ఉంటాయి. జానపద కథల్లో యక్షలు, గంధర్వ, కిన్నెరలు, రాక్షసులు, మాంత్రికులు, భూతప్రేతాలు ఎక్కువగా మనకు తారసపడుతుంటారు. ఇంద్రజాల, మహేంద్రజాలాలు, పశుపక్ష్యాదులు మాట్లాడటం వంటి అవాస్తకత గోచరించినా, మానవులే సాహసాలు చేసి సమస్యలను తెలివిగా పరిష్కరించటంతోపాటు, ఆయా కాలానికి అనుగుణమైన ఆచారవ్యవహారాలు కథల్లో చోటుచేసుకుని వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. అలాంటి ఒక జానపద కథ మీ కోసం... పేదరాశి పెద్దమ్మ అనగనగా ఒక పేదరాసి పెద్దమ్మ ఉందంట. ఆ పెద్దమ్మక్కి నలుగురు కూతుళ్లున్నారంట. పెద్దమ్మ నలుగురు దగ్గరా తలొక మూడు నెలలు ఉంటా కాలం గడుపుతా ఉంటదంట. ఒకసారి మొదటి కూతురింటి నుండి రెండో కూతురి ఇంటికి పోతావుందంట. దారిలో పెద్ద అడవి. అడవిలో ఎల్తావుంటే ఒక పులి నరవాసన కనిపెట్టి వచ్చి పేదరాశి పెద్దమ్మని తినేత్తానందంట. పెద్దమ్మకి బయం వేసింది. బాగా ఆలోసించి, పెద్దపులితో ఇలా అన్నదంట. పెద్దపులీ, పెద్దపులీ నేను ముసలిదాన్ని, వళ్లు అంత చిక్కిపోయి ఉన్నాను. నేను ఇపుడు నా రెండో కూతురింటికి ఎల్తన్నాను. ఆళ్లు బాగా ఉన్నోళ్లు. అక్కడ పదిరోజులుండి, గార్లెలు, మినప సున్ని ఉండలు, అరిసెలు తిని బలిసి వత్తాను. అప్పుడు తిందువుగాని. కమ్మగా ఉంటది నా నెత్తురు అని చెప్పిందంట. దాని మాటలు పులి నమ్మి వదలి పెట్టిందంట. పదిరోజులు అయినా పెద్దమ్మ తిరిగి రాలేదు. పులికి చాలా కోపం వచ్చింది. ఈదారి తప్పితే మరోదారి లేదుగదా రాకపోద్దా సూద్దాం అనుకుందంట. పెద్దమ్మ తన కూతురికి పులితో జరిగిన గొడవ చెప్పిందంట. మూడునెలలు వంతు అయిపోయా పెద్దమ్మ బయల్దేరవలసి వచ్చింది. కూతురు బాగా ఆలోచించి, ఒక పెద్ద బానతెచ్చి అందులో పెద్దమ్మని కూకోపెట్టి మూతపెట్టి ఒక గుడ్డ గట్టిగా కట్టి దొర్లించి ఒదలిపెట్టింది. బాన దొర్లుకుంటూ అడవిలోంచి పోతాఉంది. లోపల ఉన్న పెద్దమ్మకు హుషారు వచ్చింది. ఇక పులి తనను ఏమీ చేయలేదనుకుంది. సంతోషంతో ‘బానా బానా బాగా దొర్లు టమకాటు’ అంటా పాడుకుంటా పోతావుంది. పెద్దపులి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా పాడుతూనే ఉంది. పులి బానని ఆపి పంజాతో ఒక పెద్ద దెబ్బకొట్టింది. బాన భడేల్ మని పగలిపోయింది. ఇంక పేదరాశి పెద్దమ్మకు బయం ఏసింది. మళ్లీ ఆలోచించి, పెద్దపులీ, పెద్దపులీ ప్రయాణంలో నా ఒళ్లంతా చెమట పట్టింది గదా. ఆ చెరువులోకి వెళ్లి తానం చేసి వత్తాను హాయిగా తిందువుగాని అంది. అప్పుడు పెద్దపులి సరే అని ఒప్పుకుంది. ముసలమ్మ ఎన్ని గంటలయినా చెరువులోంచి బయటకు రాలేదు. పెద్దపులికి కోపం వచ్చి ఎన్నోసార్లు పిలిచింది. ఒత్తనా, ఒత్తనా అంటదిగాని ముసలమ్మ వత్తల్లేదు. పులికికోపం వచ్చి చెరువులోకి దిగి మీదకి దూకబోయింది. ముసలమ్మ నోట్లో ఇసుక పెట్టుకొని ఉంది. ఒక్కసారి పులి కళ్లల్లోకి ఊసింది. పులి కళ్లల్లో ఇసుకపడి మంటెక్కి బాదపడుతా వుంటే ముసలమ్మ సంతోసంతో పారిపోయింది. కథ కంచికి ముసలమ్మ ఇంటికి... తేటగీతి
‘కోకు’ గా ప్రసిద్ధికెక్కిన కొడవటిగంటి కుటుంబరావుగారు తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకున్న రచయిత. ఆయన రచించిన కథలు, నవలలు మధ్య తరగతి జీవితానికి దర్పణలు వంటివి. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన కుటుంబరావుగారు బాల్యం నుంచే రచనా వ్యాసంగంపై మక్కువ చూపారు. గురజాడ తర్వాత వ్యావహారిక భాషలో రచనలను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లిన రచయితలల్లో కుటుంబరావుగారు ప్రముఖులు. ఆయన రచనలలో మధ్యతరగతి జీవితాలు ప్రతిబింబిచడతంతోపాటు, సామాజిక స్పృహ, దృక్పధం కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఆయర రాసిన నవల ‘తారా'కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆధునిక సాహిత్యం, మార్క్సిజంలతో ప్రేరణ చెందిన కుటుంబరావుగారు నవ్య సాహిత్య పరిషత్తు, అభ్యుదయ రచయితల సంఘం, విప్లవ రచయితల సంఘం ఇలా పలు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమేగా కోకు భావించేవారు. యువతరాన్ని ఆకర్షించే సాహిత్యం ప్రాముఖ్యాన్ని అర్ధం చేసుకున్న కోకు ‘యువ‘ అనే మాసపత్రికను చక్రపాణిగారితో కలిసి ప్రారంభించారు. ఆయన ఆంధ్రపత్రిక, ఆంధ్రవారపత్రిక, భారతి మున్నగు పత్రికలలో పనిచేసి వాటి అభివృద్ధికి కృషి చేశారు. నేటి పత్రికలలో కన్పిస్తున్న అనేక శీర్షకలు ఉదాహరణకు, రాజకీయ వ్యంగ్య వ్యాసాలు, కార్టున్లు, సినిమా స్టిల్స్, పిల్లలకు ప్రత్యేక శీర్షికలు, అనువాద నవలలు మొదలు పెట్టినది కుటుంబరావుగారే. భౌతిక శాస్త్రంలో పట్టభధ్రులైన కుటుంబరావుగారు ఏ రచన చేసినా అందులో శాస్త్రీయ దృక్పధం, హేతువాదం కన్పిస్తాయి. ఆయన 1952లో బాలల పత్రిక ‘చందమామ’లో చేరారు. చనిపోయేవరకు ఆయన చందమామకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యరంగానికి ఎనలేని కృషి చేసిన కొడవటిగంటి కుటుంబరావు గారు దాదాపు 18 నవలలు, 159 కథలు, 75 గల్పికలు, 12 నాటికలు అనేక వ్యాసాలు రాశారు. ఆయన రాసిన అనేక కథలలో ప్రజల మూర్కత్వానికి అద్దం పట్టే కథ అసలు మాది కిష్కింధ ఇక్కడ మీ కోసం... మా వూరికో కోతి వచ్చింది. ఓ రోజు పొద్దున్నే మావూరి పిల్లకాయలు దాన్ని ఆంజనేయస్వామి ఆలయం గోడ మీద చూశారు. అది పేలకోసం వెతుక్కుంటుంటే నవ్వారు. కాని అది కనిబొమలు పైకెత్తి నుదురు ముడతలు పది దీర్ఘాలోచనల ఉన్నప్పుడు పిల్లకాయలకి ఆశ్చర్యం వేసింది. పెద్దవాళ్ల జోక్యం కలిగించుకోకబోతే కోతి ఏమయి ఉండేదో మరి. పిల్లకాయలు కోతిని చూసి గంటసేపైనా ఆనందించారో లేదో ఈలోపుగా ఆ దారినే పోతూ, పురాణం చెప్పే శాస్తుల్లుగారు గుదిముందాగి, మనోజంమారుత తుల్యవేగం... “ శ్రీరామ దూతం శిరసా నమామి ” అంటూ దో గొణగొసాగాడు. కోతి కాస్తా ఆయన కెదుగుగా వచ్చి నుంచుని కిచకిచలాడింది. సాయంకాలానికల్లా కోతి మావూరికి అతిధి అయిపోయింది. రామకోటి రెండోసారి రాస్తున్న రామదాసుగారూ, ఆ మధ్యనే చచ్చి బతికిన గుప్తగారూ, పురాణం చెప్పే శాస్త్రులుగారు, హనుమదుపాసి గౌరిశంకర పార్వతీ పరమేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర్లుగారూ వగైరాలంతా కోతికి భక్తులయినారు. పిల్లలు పుట్టనివాళ్లు, పిల్లలు దక్కనివాళ్ళూ పొద్దుపోని వితంతువులూ వగైరాలు ఆరోకాలం కింద తయారయింది. కోతి కలిసొచ్చిందని పుకారు పుట్టింది. కోతి వచ్చిన తరవాత మా వూరికి కలరా రాలేదు. మా వూళ్లో ఇల్లేనకాలలేదు, మా వూరికి ఉప్పెన కూడా రాలేదు. (మావూరికి సముద్రం పాతికమైళ్ల దూరము ఉంటే ఏం. మా తాత అయిదేళ్ల వాడై ఉండగా వచ్చిన బందరు గాలివానకి వరదవచ్చి మావూరి బయటవున్న తాళ్లెక్కితే అంత దూరాన స్పష్టంగా కనిపించిందిట. ఇది మా తాత స్వయంగా చూసిన విషయం) కోతి బలిసింది మరి. అది ఏ ఇంటో జొరబడి అందిన ఆహారం పుచ్చుకోవటానికైనా హక్కుంది. మా వూరికి పురపాలక సంఘంలేదు గాని ఉంటే ఈ హక్కు తీర్మాన రూపంలో ఇవ్వబడి ఉండేదే. బీదలూ, సాదలూ, అలగా జనమూ చాటుబాటున కోతిని కొడుతున్నట్లు ఊళ్లో తెలియగానే ఊరంతా అట్టుడికిపోవటమేగాక ఊళ్లో పౌరసభ కూడా ఒకటి జరిపి అందులో కోతిని కొట్టిన వాళ్ల మీద భయంకర నిరసన తీర్మానం కూడా చెయ్య బడింది. క్రమంగా కోతి తనబలం తెలుసుకోసాగింది. అది మొదట్లో చిన్న పిల్లల్ని మాత్రమే భయపెట్టుతూ ఉండేది. రానురాను అది పెద్దవాళ్లను కూడా భయపెట్టసాగింది. ఎటువంటి విచక్షణా లేకుండా అందర్నీ అటకాయించి పిలకలూ వగైరా పీకసాగింది. కోతిక్కోపం వచ్చింది. ఉపశాంతికోసం ఓ యజ్ఞమో సప్తాహమో చేతామనుకున్నారు. మావూరి కోటయ్య శ్రేష్టి, యగానికి కావలసిని వస్తువులన్ని తను సరఫరా చేసే షరతుమీద ఓ వంద చందాకూడా వేస్తానన్నాడు. కాని అదిపడలేదు. చందాలు బాగా పోగుకాలేదు. ఆఖరుకు ఊరిబయట మరో పౌరసభ జరిగింది. అందులో కోతి ఊరికి హానికరమని దాన్ని వదిలించేటందుకు సాంఘిక సేవకులంతా నడుములు కట్టుకోవలసిందని తీర్మానం జరిగింది. ఈ సభకు వెనుక కమ్యూనిస్టులున్నట్టు వదంతి పుట్టింది. వెంటనే ఊళ్లో మరోసభ చేసి పెద్దలు, కోతిమీద కుట్ర చేస్తున్నందుకు కమూనిస్టుల మీద ఒక నిరసన తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి వోటు చెయ్యటానికి కిసాను పార్టీని, కాంగ్రెసు పార్టీని, హిందు మహాసభనూ, జస్టిసు పార్టీని ఇంకా తదితర హంగులను సభకాహ్వానించారు. కోతి యథాప్రకారం స్వైరవిహారం చేస్తున్నది. ఓనాడు షేక్ మస్తాన్ గుడిపక్కగా ఖాళీ ఒంటెద్దు బండి తోలుతూపోతూ పురాణం చెప్పే శాస్తుల్లుగార్ని చూసి, కోతి మాచెడ్డా గడ్బచ్ గాహుంది, చాస్తుల్లుగారు! అన్నాడు. “ఆ కమ్యూనిస్టులు నీకేమన్నా గడ్డి పెడుతున్నారా ఏం? వాళ్లమాటవిని మాదేముణ్ణి తిడితే నీకు పాకిస్తానిస్తామనుకున్నావుగామాలు?” అన్నాడు శాస్తుల్లుగారు నిప్పులు కక్కుతూ. “ఈ కాబోతే ముడ్డికింద యేసుక్కూకొంది మారాజ్!” అంటూ మస్తాన్ ఎద్దునదిలించాడు. ఇంతట అకస్మాత్తుగా కోతి మాయమైంది. మళ్లీ పౌరసభ జరిగింది. కోతిని మాయం చేసిన వాళ్లమీద నిరసన తీర్మానం చేయబడింది. కోతిని మాయం చేసింది కమ్యూనిస్టులే అనే తీర్మానం ప్రతిపాదించి, బలపరిచి క్షణంలో నెగ్గించారు. మావూరి పంతులు మాట్టాడుతూ కమ్యూనిస్టుల వల్ల మావూరికి జరుగుతున్న అపచారాలను గురించి ఉపన్యసించి నిర్మాణ కార్యక్రమం గురించి అరగంటసేపు చెప్పి కూచున్నాడు. కోతి మాలపల్లి చేరగా అక్కడ పోలిగాడు వగైరాలు దాన్ని పట్టుకొని బస్తీకి తీసుకుపోయి అక్కడక్కడ నడుస్తున్న సర్కసువాళ్ల కమ్మినట్టు వదంతిగా ఉన్నదని ఎవరో లేచి అన్నారు. వెంటనే సభాధ్యక్షుడు లేచి ఇటువంటి దుర్వార్తలు పుట్టిస్తున్నది కమ్యూనిస్టులేనని, మావూరి పౌరులు హరిజనులమీద ఇటువంటి నిందలు ప్రచారం చేయ్యటం ద్రోహమనీ అన్నాడు. మావూరి పంతులు మళ్లాలేచి హరిజనోద్ధరణ మీద మరో అరగంట మాట్లాడాడు. హరిజనుల్లో కూడా ఇప్పుడిప్పడే కొందరు కమ్యూనిస్టుల మాటలు విని చెడిపోతూ ఉన్నట్టు తెలిసి తన హృదయం దహించుకుపోతున్నదన్నాడు. అప్పటికే కాలాతీతమైనప్పటికీ, హరిజనులను చెడగొట్టుతున్నందుకు కమ్యూనిస్టుల్ని నిరసించుతూ ఒక పెద్ద తీర్మానం చెయ్యబడింది. “నేను రహస్యంగా అధ్యక్షుడితో, కోతిని వెతికి పట్టుకొచ్చేటందుకొక తీర్మానం చేసి దానికిగాను చందాలు వసూలు చేస్తే ఏం ?” అన్నాను. “కాలాతీతమైపోయింది,” అన్నాడధ్యక్షుడు. (ప్రథమ ముద్రణ: మార్చి 1945, పెంకిపిల్ల మాసపత్రిక)
తెలుగు నాటక సాహిత్యంలో సింగరాజు లింగరాజు ఒక విలక్షణమైన పాత్ర. భారతీయ సాహిత్యంలోనే ఒక అపూర్వ సృష్టి. స్వార్ధం, లౌక్యం, పిసినిగొట్టుతనం కలబోసుకుని పుట్టిన పాత్ర. ‘ధనం మూలం మిదమ్ జగత్తు’ అనే సూత్రానికి భాష్యకారుడు అతనే! లింగరాజుకు డబ్బే సర్వస్వం! ఈ చరాచర ప్రపంచంలో ప్రతి వస్తువునూ డబ్బు అనే కళ్లద్దాల ద్వారానే చూస్తాడు ఆ మహానుభావుడు. అతడు దేవుణ్ని ప్రార్ధించేది తనకు సుఖశాంతులు ప్రసాదించమని కాదు, తన ఇంట్లో ధనరాసులు కుమ్మరించమని. కట్నంతో మూటలు కట్టుకోవచ్చని అతడు మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. కుర్నవాణ్ణి కాలేజీకి పంపిస్తున్నాడే డబ్బు ఖర్చుపెట్టి అనుకుంటే పప్పులో కాలేసినట్టే! కాలేజీ విజ్ఞాభివృధ్ధికోసం కాదు, కట్నం ‘రేటు’ పెరగటం కోసం. లింగరాజు చేసే ప్రతీ పనికీ, వెనుక పద్మవ్యూహంలాంటి తిరకాసు ‘కాసే’. అందుకే ప్రొద్దునే నిద్రలేచి లింగరాజు, ‘‘భగవతీ! భాగ్యలక్ష్మీ, ప్రణామంబు, నీదాసానుదాసుండ, నీ పాదముక్తుండ, నీ దివ్యరూపంబె నిత్యంబు భావింతు నీ దివ్యనామెంబే నిక్కంబుగా నిద్రలో గూడా జపింతు, నాదిక్కు, నా మొక్కు, నాయండ, నా దండ నీవే సూమా! భార్యయుం, గీర్యయుం, బిడ్డలుం, గిడ్డలు, దేవుడుం, గీవుడున్, మోక్షముం, గీక్షమున్, సర్వమున్నీవే! సత్యంబు, నీకై నిరాహారినై యుందు, నీకై నిశలు నిద్రమాన్కోందు, నీకై శరీరాభిమానంబు వర్జింతు, నీకై యతస్య ప్రమాణంబు లెన్నేనియు గావింతు నీ యాన! ఈ పెట్టెయే నీ పవిత్రాలయం, నేనే నీయర్చకుండన్, యదార్ధంబుగా నాదు ప్రాణంబులె నీదు పూజాసుమంబుల్ శరీరంబే నైవేద్య కుంభంబు, నా ఇంటనే యుండి, నీ పూజం గొంచునే ఇంటికి నంపింనం బోయి, యా ఇల్లుమట్టంబు గావించి, నా ఇంటికిందెచ్చి నాకిచ్చు దుండంగదే కన్నతల్లీ! నమస్తే, నమస్తే నమః’’ అంటూ లక్ష్మీదండకం ముమ్మారు పఠించి, సర్వే జనః దుఃఖినోభవంతు అని శాంతి వచనాలు పలుకుతాడు. లింగరాజు జననం 1922లో జరిగినప్పటికీ, నేటికీ మన సమాజంలో లింగరాజులకు కొదవలేదు. ధన రాకాసి, కట్న పిశాచి నేటి సమాజంలో కూడా ప్రబలంగానే ఉంది. కాళ్ళకూరి నారాయణరావు గారు సృష్టించిన లింగరాజు మీద ఈ భూమండంలో ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. మనిషన్నవాడెవడూ లింగరాజును గౌరవించిన ఆనవాళ్ళు లేవు. ఎవరేమనుకున్నా లింగరాజుకి కలిగే నష్టంలేదు. అతనికి సంఘంతో పనిలేదు. పరువు, మర్యాద, ఆత్మాభిమానం వంటి భేషజాలకు అతను బహుదూరం. లోభత్వానికి లింగరాజు నిలువుటద్దమే కాదు. పొదుపును గురించి అనర్ఘళంగా ఉపన్యసించ గలిగే ఘనాపాఠి. వంటమనిషికి ప్రతిపూట వంట సామాను వంట కట్టెలు, పిడకలు, ఉప్పు, చింతపండు, మిరపకాయలు, చివరికి నిప్పు పుల్ల కూడా గీచి, గీచి లెక్కలడిగి మరీ యిస్తాడు. పొయ్యిలో కట్టెలు కావల్సివస్తే, కరివేపాకు చెట్టుమీది కాకి గూడు పడద్రోసి ఆ పూట వంట చేయ్యమని సలహా యివ్వటం అతనిలోని పినాసితనానికి పరాకాష్ట. ‘‘పక్షిగూడు పడగొట్టడం పాపం కదండీ’ అని అంటే, ‘పాపమేమిటి నీ బొంద! ఖర సంవత్సరంలో మా యింటి వంటంతా కాకి గూళ్లతోనే వెళ్ళిపోయిందని గత చరిత్రను చెప్పుకొని మురిసిపోతాడు. అంతేకాక, లోకం పోకడ గురించి లింగరాజు అభిప్రాయం, అవగాహన నేటి సమాజ తీరుతెన్నులు చూస్తే తప్పుకాదేమో అన్నట్టుగా ఉంటాయి. ఈ కింది గేయంలో పరికించండి: ప్రాయికంబు జెట్టు పాతువాడొకండు వరుస బండ్ల మొక్కు వాడొకండు కష్టపడి గృహంబు గట్టువాడొకండు వసతిగ నివసించు వాడొకండు ఆస్తికై వ్యాజ్యంబు లాడువాడొకండు వచ్చినది మృంగు వాడొకండు కోరి ముండను బెట్టు కొనెడివాడొకండు వలపు కాండై పొందు వాడొకండు అట్లే, ధనము కూర్చునట్టి వాడొక్కండు పడిగం దగులబెట్టు వాడొకండు ఇది ప్రపంచధర్మ మీ నాడు పుట్టిన లీలగాదు దీని కేల గోల? ధనమునే ప్రధానంగా కొలిచే ప్రబుధ్దులకు తలమాణికం లింగరాజు సింగరాజు అనడానికి ఈ కింది పద్యమే మచ్చుతునక. సంపద మహత్వమెరుగని చవట బ్రహ్మ చావు లేకుండగా నేని సలుపండైయ్యె చచ్చునప్పుడు వెనువెంట సకలధనము తీసికొనిపోవు విధమేని తెలుపండైయ్యో లింగరాజు ఎంతటి పినాసీ అయినా అతనిలో ప్రత్యేకత అతని చమత్కార ధోరణి. నిత్య సంభాషణల్లో కురిసే హాస్యరసం నయగారా జలపాతాన్ని గుర్తుకి తెస్తుంది. లింగరాజులాంటి స్వార్ధచింతుడిలో హాస్యమేమిటా అని మీకు అనుమానం రావచ్చు. నిజానికి లింగరాజు హాస్యచతురుడు కాడు. అతని లోభితనం నుంచి, పేరాశ నుంచి, సంకుచిత మనస్తత్వం నుంచి, డబ్బుకోసం ఏ గడ్డయినా కరిచే అతని నైచ్య ప్రవృత్తి నుంచి స్వభావసిద్ధంగా హాస్యం పెల్లుబుకుతుంది. ఎదుటి మనిషిని నవ్వించాలనే ధృక్ఫథం అతనిలో ఏ కోశానా లేని హాస్యపాత్ర. నాటక కర్త కాళ్ళకూరి గారి కలం కన్ను గప్పి ఎదిగిన సింగరాజు లింగరాజు పాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగువారి లోగిళ్ళలో నవ్వుల చిరుజల్లులు వెదజల్లూతూ నిత్యనూతనంగా భాసిస్తూనే ఉంటుంది. సౌమ్యశ్రీ రాళ్లభండి
పిల్లలకు పేరుపెట్టడం అంటే, అదో మహాయుద్ధం. ఫ్యాషన్ గా పేర్లుపెట్టడం, బారసాలనాడు ఒక పేరు రాసి, తర్వాత వాడకానికి మరో పేరు పెట్టుకోవడం, ఇంట్లో ఒకటి, వీధిలో ఒకటి, సర్టిఫికెట్టుల్లో ఒకటి, పెళ్ళికార్డులో మరోకటి, ఇంక ముద్దుపేర్లు, అమ్మమ్మ, తాతయ్య పేర్లు, ఇలవేల్పుల పేర్లు, జ్యోతిష్యానికి అనువైన పేర్లు, పలకలేక కుదించేసుకున్న పేర్లు ఇలా బారసాలనాటి పేరుకి తర్వాత పేరుకి పొంతన లేకుండా అర్ధరహిత పేర్లు అనేకం. అలాంటి ఒకానొక ప్రహసనమే మునిమాణిక్యం నరసింహరావుగారి ‘నామకరణం’ కథ. సాంతం చదివి ఆనందించండి. పసిపిల్లలను పక్కలో పడుకో పెట్టుకొని పురిటిగదిలో నులకమంచంలో పడుకుంది కాంతం. పండబారిన తమలపాకులాంటి చెక్కిళ్లపై లేత గులాబి రేకుల పసిచేతులు నిమురుకుంటుంటే కెంపులతో కాంతం తన మాతృత్వాన్ని పూజించుకుంటున్నట్టున్నది. పురిటిగది ప్రక్కన నేను మంచంపైన పడుకొన్నాను. కొంతదూరాన మా బావమరిది పడుకొని ఏదో చదువుకొంటున్నాడు. కాంతం విప్పారిన నేత్రాంచలములనంటి కనీనికలదాకా ప్రవహించే తన చూపును సవరించుకొంటూ ‘‘మరి – పేరేమి పెడతాము’’ అన్నది. ‘‘ఏమండోయి మిమ్మలనే.’’ ‘‘ఏమిటి?’’ ‘‘ఈ చిట్టితల్లికి పేరేం పెడదాము?’’ ‘‘ఏదో ఒకటి పెడద్దాంలేద్దూ.’’ ‘‘అదిగాదండీ, రేపేగదా బారసాల. అప్పకప్పటికి ఏమి తోచకపోవటం ఏదో ఒకటి హడావుడిగా వ్రాయటం’’ అన్నది కాంతం గుంటలు పడ్డ చెక్కిళ్ళలో వెలుగులు చక్కలిగిలి పెట్టుకున్నవి. ‘‘సరే, అయితే ఏమి పేరుపెడదాం.’’ ‘‘అదే మిమ్ములను అడగటం.’’ ‘‘నాకేం తోటచంలేదు. ఇదివరలో అంటే పేర్లు సిద్ధంగా ఉండేవి, మొదటిపిల్లకు మా అమ్మపేరూ, రెండోదానికి మీ అమ్మపేరూ, మూడో బిడ్డకు మా తాతపేరు పెట్టాము. తరువాత పుట్టినవాడికి నీ ఇష్టదైవం యొక్క పేరు పెట్టుకున్నావు. ఇక దీనికి పేరు కుదరటం కష్టమే’’ అన్నాను నేను. ‘‘ఈ దఫా మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి’’ అన్నది కాంతం నా వంకనైన చూడదు. పుట్టుగుడ్డ తెలిమొగములో పుణ్యలోకాలు వెదుకుతుందా! ‘‘పూర్తిగా నా యిష్టమేనా? అంత దయా!’’ బాగుందండోయి! మీ కుతురుకు మీ కిష్టమైన పేరు పెట్టుకుంటానుకి ఒకరి ఆజ్ఞ ఏమిటి?’’ ‘‘కూతురైతే నీకు కూతురేగా?’’ ‘‘అయితేనేం మీ కిష్టమైన పేరు చెప్పండి.’’ ‘‘సరే అయితే, జానకి పెడదాం.’’ ‘‘జానకా?’’ ‘‘అవును.’’ ‘‘బాగానే ఉంది కాని.....’’ ‘‘ఆ కానీ ఏమిటో చెప్పు? ఏదో ఉంది.’’ ‘‘అది కాదండీ, ఏదైనా పేరు పెడితే ముద్దుగా ఉండాలె, మంచి సంగతులు జ్ఞాపకానికి రావలె.’’ ‘‘ఇపుడుమటుకేం జానకి జగత్ మాత మహాసాధ్వి, అంతకంటె మంచి పేరేముంది.’’ ‘‘మంచిపేరే కాని, సీత కష్టాలు జ్ఞాపకానికి వస్తవి. అదీగాక నీళ్లాడక మునుపు మీరు నాకు ఉత్తర రామాయణం నాటకము చదవి విన్పించారు జ్ఞాపకం ఉందా ? సీత కష్టాలు చూచి ఏడ్చాను, అప్పటి నుంచి ఆమెపేరు తల్చుకుంటే భయం వేస్తుందండీ?’’ ‘‘సరే పోనీ మానేద్దాం. ఇంకేదైనా పేరు పెడదాం.’’ ‘‘సుగుణ అని పెడదాం.’’ ‘‘సుగుణా? ఆ సుగుణ, ఎందుకండీ? సుగుణ వివేకం అవన్నీ కిరస్తాని పేర్లు.’’ ‘‘ఓహో ఆ మాటా నిజమే, అదీగాక నీ మోస్తరుగా పెంకెతనం, మొగుడ్ని లక్ష్యం చేయకపోవటం మొదలుగా గల సుగుణాలు గలదైతే నేతిబీరకాయవంటి వ్యర్ధమైన పేరు అవుతుంది, మరేమంటావు?’’ ‘‘శేషగిరి అని పెడితే? ఆ పేరు మా నాన్నకెంతో ఇష్టం’’ ‘‘మీ నాన్నకు ఇష్టమైతే నీకు పెట్టాలిసింది. కొండలపేర్లు, నదుల పేర్లునా, పిల్లలకు పెట్టుకోటం. మా మాష్టరుగారు ఒకాయన ఉండేవాడులే. ఆయన శేషాచలం, వింధ్యాచలం, హిమాచలం అని పేర్లు మొగపిల్లలకూ, గంగ, యమునా, కృష్ణా, గోదావరీ అని ఆడపిల్లలకు పేర్లు పెట్టాడు. అట్లా చేయమంటావా? ఉండు, ఉండు నాకో పేరు తోచింది. మనకు ఇక పిల్లలు వద్దే. ఇదే ఆఖరు కాన్పు అనుకో, అంటే కోరుకో ఆ అర్ధాన్ని సూచించేటట్లు, ఆ సంగతి ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చేటట్లు, సంపూర్ణం అని పేరు పెడదాం. నీవు అడ్డు చెప్పక. అంతే అదే నిశ్చయం.’’ ‘‘అయితే బావా, ఒకవేళ ఇంకోపిల్ల పుడితే ఏం చేస్తావు’’ అన్నాడు మా బావమరిది. ‘‘అయ్యో, మన నిశ్చయాలు, మనం ..... అన్నది’’ కాంతం, ఎత్తిపొడుస్తూ. ‘‘పుడితే ఎట్లా చెపుదూ’’ అన్నాడు మా బావమరిది. ‘‘ అంతగా పుడితే మంగళహారతి అని పెడదాం. మంగళహారతితో ప్రతిపనీ పూర్తిచేస్తారు. భజనలు, పురాణ కాలక్షేపాలు, పూర్తి అయిన తరువాత మంగళహారతి ఇస్తారు.’’ ‘‘ముందు సంపూర్ణం అయిన తరువాతగా మంగళహారతి కాబట్టి దీనికి సంపూర్ణం’’ అని పేరు పెడదాం. ‘‘అమ్మ! ఏదో ఒకటి తేలింది’’ అన్నాను నేను. ‘‘బాగానే ఉంది?’’ ‘‘ముక్కు విరిస్తేగాదు. ఆ పేరు పెడితేనేం?’’ ‘‘చాల్లేండి, పాండిత్యము మా బంగారుతల్లికి మంచి పేరు పెట్టరూ?’’ అని పిల్లను తన మృదుహస్తాలతో నిమిరింది కాంతం. ‘‘సరే పోనిలేవే నీకంత కష్టమెందుకూ, ఊర్వశి అని పెడదాం పోనీ, ఊర్వశి చక్కనిదని ప్రసిద్ధం.’’ ‘‘చాల్లెండి వేళాకోళం. రంభ, ఊర్వశీ, తిలోత్తమా ఇవా మనం పెట్టుకునే పేర్లు ? అయినా ఆ భోగంముండల పేర్లేమిటి?’’ ‘‘మరి ఎట్లాగే, ఒకాయన ఇట్లాగే పేరు దొరకొక పేరు పెట్టన్ అని నామకరణం చేశాడట. ఇక నాకు తోచడంలేదు నీ ఇష్టం.’’ ‘‘నా ఇష్టమెందుకు? మీ చిత్త మొచ్చిన పేరు పెట్టుకోండి. నేనొద్దంటే అప్పుడనండి. ఏదో ఆడదాన్ని కాబట్టి చెప్పవలసినది చెపుతున్నా, శుక్రవారం పుట్టింది, కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకుంటే ముచ్చటగా ఉంటుంది.’’ ‘‘లక్ష్మి? లక్ష్మి – బావుంది. లక్ష్మి, నీ నామమెంత లలిత మహహ – అని ఒక కవి వ్రాశాడు. బాగుంది. సరే ఇంకేం! అదే పేరు’’ అన్నాను. ‘‘బావా! ఏమైనా కొత్తపేరు పెట్టరాదూ? ఉత్తర హిందుస్థానంలో వాళ్ల పేర్లు చూడూ, ఎంత చక్కగా ఉంటవో! కమలాబాయి నెహ్రూ, ఇందుబాల, జటాజూట శిరోమణి, శిరీషకుసుమకోమలి, ఇట్లాంటి పేరు పెడితే ముందు పేరు వినటానికి ఎంతో poetic గాను శ్రావ్యంగా ఉంటుంది! పేరు మనోహరంగా వుండాలి. ఒక పేరు ఒక భావగర్భితమైన ఖండకావ్యంగా ఉంటుంది. The name itself is a beautiful Poem అన్నాడు మా బావమరిది. ‘‘నాకూ మంచి పేరంటే సరదా. వాడు చెప్పిన పేర్లలో జటాజూట శిరోమణి అంటే చంద్రునికి చెందుతుంది. చంద్రుడు చల్లనివాడు. బాగుంది ఆ పేరు చదువుకోనివాళ్లు చంద్రమ్మ అని పెట్టుకుంటారు. జటాజూట శిరోమణి అని పేరు పెడితే పండిత కుటుంబములోనిదని ముందు తెలుస్తుంది, రెండోది చంద్రుడు కావ్యానికి వస్తువ. వెన్నలనూ చంద్రుడ్నీ కవులు ఊ, మెచ్చుకొంటారు కాబట్టి ఆ పేరు పెడదాం’’ అన్నాను కాంతంతో సరదాపడుతూ. ‘‘ఆ పేరు పెడితే అందరూ తిట్టరూ?’’ ‘‘ఏమి’’ ‘‘చంద్రదూషణ అన్ని కావ్యాలలో ఉండదూ?’’ ‘‘అదీగాక అమ్మాయి పెద్దదైన తర్వాత దాన్ని అంత పెద్దపేరుతో ఎవరు పిలుస్తారు అయినా మన పేర్లు కావు అవి ఎవరో బెంగాలీవాళ్లు పెట్టుకునే పేర్లు మనకెందుకు. మనకు తగిన పేరు మనం పెట్టుకుందాం’’ అన్నది కాంతం. సరే, పోనీ లక్ష్మి అని పెడదాం అన్నాను. లక్ష్మి నిశ్చయమైపోయింది. మర్నాడు ఇల్లంతా అలంకరించారు. నలుగురు బంధువులూ వచ్చారు. ఇల్లు కళకళలాడుతున్నది. పీటలమీద కూర్చున్నాం పేరు వ్రాయటానికి. పళ్ళెంలో ముత్యాలలాంటి సన్నబియ్యంపోసి నా ముందు పెట్టారు. కళ్లుమూసుకుని నిద్రపోతున్న బిడ్డకేసి గర్వంగాను సంతోషంగాను చూస్తున్నది కాంతం. ‘‘సరే ఏం పేరు వ్రాయమంటారు?’’ అన్నాను. ‘‘సుబ్బలక్ష్మి’’ అన్నది కాంతం. ఈ ‘‘సుబ్బేమిటి’’ అన్నాను. ‘‘మా నాయనమ్మ వచ్చి తన పేరుకూడా కలపమని అడిగింది పాపం. ముసలమ్మగారి మాట తీసివేయటం ఎందుకు? ఆమె మనస్సు సంతోషిస్తేనే మనకు క్షేమం’’ అన్నది కాంతం. ‘‘వ్రాయమంటావా?’’ ‘‘మీ ఇష్టం’’ ‘‘ఇంకా నా యిష్టమేమిటి? వ్రాస్తున్నానని బంగారపు ఉంగరం తీసుకొన్నాను. ఇంతలో మా నాన్న వచ్చి అబ్బాయీ, మనకు వేంకటేశ్వర్లు ఇంటి ఇలవేల్పు ప్రతి పేరు ముందరా ‘వెంకట’ చేరుస్తున్నాము. నీ పేరు అందుకనే వెంకట్రావు అని పెట్టాము. కాబట్టి వెంకట సుబ్బలక్ష్మి అని వ్రాయమన్నాడు. కాంతం నా వంక ఓరకంటితో చూసి నవ్వుకొని మామిడి చిగుళ్లలాగున్న పిల్లదాని చేతులు చెక్కిళ్లకేసి అదుముకొంటున్నది.’’ ‘‘సరే, వ్రాసేదీ కాంతం?’’ ‘‘నా దేముంది మీ ఇష్టం’’ ‘‘అంతా నా యిష్టమే?’’ అని ఇంకా ఆలస్యం చేస్తే పేరుకు ఆద్యాంతాలలో ఏం జేరుతువో అని వెంటే వ్రాశాను. మా చిట్టితల్లికి నామకరణం అయింది. వెంకటసుబ్బలక్ష్మి అని పేరు వ్రాస్తేనేం? లక్ష్మి అని పిలుచుకుంటాను. లక్ష్మి అన్న పేరు బాగానే ఉంది అనుకున్నాను. పిల్లకు ఎనిమిదో నెలలో మా బావమరిది చూడటానికి వచ్చి అవీఇవీ మాట్లాడుతూ ‘‘వెంకటసుబ్బలక్ష్మి ఏమంటున్నది?’’ అన్నాడు. ‘‘ఎవరు?’’ అన్నది కాంతం ఆ పేరు ఎప్పుడు విననట్లు. ‘‘ఎవరేమిటి? మొన్న పుట్టినదాని పేరు వెంకట సుబ్బలక్ష్మి కాదుటే?’’ అన్నాడు మా బావమరిది వాళ్ల అక్కయ్యతో. అదా! మా ‘‘పద్మ’’ సంగతా? అదుగో ‘‘పద్మతల్లి తప్పటడుగులు వేస్తున్నది’’ అన్నది కాంతం. ‘‘పద్మావతి అని మార్చామురా చిట్టితల్లి పేరు ‘‘పద్మావతి’’ బాగందా?’’ ‘‘బాగుండ కేం! బాగుంది బావేడి?’’ ‘‘వసారగదిలో వ్రాసుకుంటున్నారు.’’ అన్నది కాంతం. మా బావమరిది నా గదిలోకి వచ్చాడు నవ్వుతూ, నేనూ సంతోషించి, ఏవో అవీ ఇవీ మాట్లాడుకొన్న తరువాత ‘‘బావా’’ పద్మావతి చేతులకు బంగారపు వత్తులు తెచ్చాను ఇవిగో’’ అన్నాడు. ‘‘పద్మావతి ఎవరు?’’ అన్నాను నేను. మా బావమరిది తెల్లపోయి ‘కలలో ఉన్నానా, లేక పోతే మీ అందిరికి పిచ్చిఎత్తిందా?’’ అన్నాడు. ‘‘ఏమిటి’’ అన్నాను నేను. ‘‘మొన్న పుట్టిన దానికి పేరుమార్చి పద్మావతి అని పెట్టారని అక్కయ్య చెప్పిందే, నీవు పద్మావతి ఎవరు అంటావేం?’’ అన్నాడు. ‘‘ఓహో మా ‘సరోజని’ సంగతా, దాన్ని నేను సరోజని అని పిలుస్తాలే’’ అన్నాను. ‘‘మా అక్కయ్య?’’ ‘‘ఆవిడ ఇష్టం ఆవిడిది, ఆ విషయంలో మేము ఇద్దరం పోట్లాడుకొన్నాము.’’ అల్లాగా, అయితే పోనిలే. నీవు పెద్దవాడివి నీ ఇష్ట ప్రకారం సరోజని అని పిలుద్దాము. ఈ భాగ్యానికి పోట్లాట ఎందుకూ అన్నాడు. నేను సంతోషించాను, మా పోట్లాటను మా బావమరిది సద్దేసినందులకు కాసేపుండి నేను లోపలికి పోయినాను. పసిబిడ్డ చేతులకు బంగారపు వత్తులు తొడిగినారు. పాలమిసమిసలతో మెరుస్తున్న ఆ ముద్దొచ్చే చేతులకు ఆ పచ్చని బంగారపు వత్తులెంతో అందంగా ఉన్నవి. ‘‘మా తల్లి – మా పద్మకు, ఈ వత్తులు ఎంత అందంగా ఉన్నవిరా, నాన్నా’’ అంటూ కాంతం పిల్లను ఎత్తుకొని ఆడిస్తున్నది. పద్మావతి, పద్మతల్లీ అని అంటూ పిల్లను తన చేతులలోకి తీసుకొని గులాబీరేకుల వంటి దాని బుగ్గలు ఎరుపెక్కిన కొద్దీ ముద్దాడుతున్నాడు మా బామవరిది. నేను తెల్లపోయినాను. అక్కా తమ్ముడూ మహా సంతోషంతో ఉన్నారు. వాళ్ల కళ్లల్లో ఆనందం పొంగిపొరలిపోతూ ఉన్నది. నన్ను జూచిన వాళ్లులేరు. నేను బయటికి వచ్చాను. అప్పుడే అస్తమయం అవుతున్నది. రంగు రంగుల చీరలు కట్టుకొన్నవాళ్లు ఎవరో పశ్చిమదిక్పతి ఒళ్లో ఉన్న సూర్యుని ముద్దాడుతున్నారు. ఆ దిక్కు మహా ఆనందంలో పొంగిపోతున్నది. ఇటు ప్రక్కను ఉన్న శుద్ధాష్టమి చంద్రుడు తెల్లపోయి ఆ ఆనందాన్ని చూస్తూ, నిలబడి ఉన్నాడు.