సాహిత్యం

సాహిత్యం

భాషా సంపర్కము కీడెంత చేసిందన్న విషయాన్ని పక్కన పెడితే, కవులను, భావుకలను విశేషంగా ప్రభావితం చేసిందనటంలో సందేహంలేదు. ఆంగ్ల సంపర్కంతో ఆంధ్ర సారస్వతం కూడా కొంతపుంతలు తొక్కాలని భావించి రచనలు చేసినవారిలో తాపీ ధర్మారావుగారు ప్రముఖలు. ఇంగ్లీషులో ఉన్న అనేక వాఙ్మయశాఖలు మన భాషలో కనపడవు. కాబట్టి మన రచనలలను కొత్త పుంతలు తిప్పాలని ఆయన అనేక ప్రయోగాలు చేశారు. వాటిలో ‘‘ఎలిజీ’’ రచన ఒకటి. ఇంగ్లీషులో ప్రఖ్యాతిగాంచిన ఎలిజీ రచనలు చేసినవారు గ్రే, మిల్టన్, ఆర్నాల్డ్, డెనిసన్ కవులు. ఎలిజీ ప్రాచీన గ్రీకు భాషనుంచి పుట్టింది. ఇది విషాద పద్యం. ఎవరైనా మరణించినప్పుడు ముఖ్యంగా వారి స్మృత్యార్ధం ఈ పద్యాలను రచిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా మూడు భాగాలుంటాయి. మొదట కవి తన బాధను వెల్లడిస్తాడు. తర్వాత పోయిన వ్యక్తిని కీర్తిస్తాడు. చివరగా దుఃఖాన్ని వీడి తనని తాను సమాధాన పరుచుకుంటాడు. ఇటువంటి రచనలు మన భాషలో అరుదు అనడంకంటే లేవని చెప్పవచ్చు. తాపీ ధర్మారావుగారు ఎలిజీని మన భాషలో ఏమనాలో తెలియక ‘కారుణ్యము’ అని నామకరణం చేసి నల్లిపై కారుణ్యం అనే కారుణ్యాన్ని రచించి అకాలంలో బొంబాయి నుంచి వెలువడుతున్న ఆంధ్రపత్రికలో ప్రకటించారు. ఈ కారుణ్యములోని విషయం ఎంతో సునిశితమైనది, సూక్ష్మమైనది. ధర్మారావుగారు మంచంమీద పడుకొని ఏదో రాయలని ప్రయత్నిస్తుంటే, దానికి విఘ్నం కల్గిస్తున్న నల్లిపై విపరీతమైన కోపంతో దానిని వేటాడిపట్టి, ఎండలో బాగా కాలిన గచ్చుపై వేసి అది మాడి చస్తే వైరాగ్యం కల్గి, గోల్డు స్మిత్ ‘‘పిచ్చి కుక్క చావుమీద’’ కారుణ్యాన్ని ప్రదర్శించిన విధాంగా ఙ్ఞప్తికి వచ్చి. నల్లిమీద కారాణ్యాన్ని రాసి దాని జన్మను కృతార్ధపర్చారు. అది ఏవిధంగానంటే – నల్లిరొ! నిన్ను జేకొని ఘ నంబగు నా తపమందు వైచి, నీ వల్లల నాడుచుండ, దర హాసము చేయుచు జూచుచుండు నీ కల్లరివాని దూఱవు; ము ఖంబున గోపము జూప; వెంతయో చల్లగ నోర్చి; తౌర! ఘన సౌఖ్యము నాకమునందు గాంచవే ? ఎండ కన్నెఱుగక యేవేళ బ్రాసాద వీధుల జరియించు విధము యిద్ది ? మెత్తని పాన్పుల మెలగుచుండెడు నట్టి దేహమా యిటులయ్యె తీవ్రవదన ? పలు భోజ్యముల సోలు వారియందలి మేలు నారగించెడి జీవమా సువర్ణ ? నానాటికిని లలనామణు లెల్లెడ నుష్ణోదకంబుల నోలలాడ జేయుచుండుదురా నిన్ని చిన్ని జీవ అనుచు గన్నులు గ్రమ్మెడి యశ్రు లిన్ని కుఱియనీకుండ బోయెడి క్రూరు డెవడు ? మాన్యసుఖవాసి, పోతివా మమ్ముబాసి! నీకతంబున గదా లోకాన బాలురు నిశలందు జదువుచు నిద్రబోరు; నీ కతంబునకదా నిండు జవ్వనులెప్డు జెలువులతో గూడి మెలగుచుంద్రు; నీ కతంబున గదా నిరతమ్ము వృద్ధులు హరినామ సంస్మృతి నలియుంద్రు; నీ కతంబున గతా నిలయాల కపుడప్డు సంస్కార ధూపముల్ జరుగుచుండు; తగ ‘‘బరోకపకార్ధ మిదం శరీర’’ మనుట నీ కతంబునగదా మానుట ధాత్రి; అట్టి నిన్నెంచ జాలక, యల్పబుద్ధి బాప మొడిగట్టుకొని చంప బాడి యగుదె ? చంపినవాని కేమి ఘన సంపద కల్గెనో, కీర్తి హెచ్చెనో; సొంపగు భక్ష్యముల్ రుచుల జూడ విచిత్రములైన పాకముల్ పెంపును బొందెనో; యకట! పెల్లగు నా నరకంపు కంపుగా కింపులు గల్గునా ? మతి వి హీనున కెందును మేలు కూడునా ? ఎంత విషాద మందితివో; యెవ్వరి నేమని చీరితో కదే! వంతను మాను; మీ పగ న వారిత రీతిని దీర్ప నీదు సత్, సంతతి లేదె ? నన్ను రభ సంబున బట్టదె ? నిద్ర దోలదే ? చెంతను జేరి జీవన మి సీ యన గుట్టదె ? నెత్రు ద్రావదే ? తేటగీతి
జీవితం - పాటంత సరళంగా, పరిమళమంత స్వచ్ఛంగా, జనపదమంత నిరాడంబరంగా, యౌవనోత్సాహమంత కాంతితో – సాగాలని ఆశించేవారు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు. పచ్చని చేలమీద పైడగాలిలా ఊగిసలాడే ఆయన మనస్సు అందుకే నిత్యనూతనత్వాన్ని కోరుకునేది. జీవన వాస్తవాలను, కులమతాలకు అతీతంగా, మానవ హృదయ స్పందనకు దగ్గరగా ఆయన రూపుదిద్దే కథలు అందుకే దృశ్యకావ్యాలుగా నిలిచాయి. అందుకే ఆయనది వ్రాసే శైలి కాదు. చెప్పేశైలి. మల్లాది వారి కథల్లో కులానికి కాక, గుణానికి ప్రాథాన్యత కన్పిస్తుంది. ఆయన కథలో మనకు రామాంజయ్య, కోమటి సుబ్బయ్య, దూదేకుల సాయిబు ఇస్మాయిల్, దేవదాసి రత్తమ్మ, గొల్ల సింగన్న, వేశ్య కృష్ణాజీ ఇలా అనేక సామాజిక స్పృహ కలిగిన పాత్రలు దర్శనమిస్తాయి. కొంటెతనం, రసికత, పారవశ్యం అనే జీవలక్షణాల కూడికల, తీసివేతల, వెలుగునీడలే ఆయన కథలకు ఇతివృత్తాలని ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు అంటారు. మల్లాదివారి కలం నుండి వెలువడ్డ వందలాది కథలు అల్లోనేరుడు, రంగవల్లి, మునిగోరింట, రసమంజరి, మత్తకోకిల, కాముని పున్నమి, చెంగల్వ, చిత్రశాల మరియు సర్వమేళ ఇలా 12 సంపుటాలుగా వెలువడ్డాయి. శృంగారం, వెటకారం, ఆవేదన, భక్తి, చారిత్రాత్మక సత్యాలు, ఊహాగానాల అభూతకల్పనలు ఆయన కథల్లో దోబూచులాడుతాయి. దాదాపు 50 భాషల్లో ప్రావీణ్యం గల మల్లాది వారు రాసిన డుమువులు అనే కథ 14 భారతీయ భాషల్లోకి అనువదించబడింది. వచన రచనకు మేస్త్రీ అయిన రామకృష్ణశాస్త్రి గారు రాసిన ‘‘అల్లో నేరేడు’’ కథ 1953లో తెలుగు స్వతంత్ర పత్రికలో వెలువడింది. ఈ కథను చదివి శాస్త్రిగారు అచ్చ తెలుగు నుడికారానికి, అసలైన ఆంధ్ర పదానికి జీవం పోసిన తీరును ఆశ్వాదించండి. ఎబ్బే! ఇప్పటి పట్నం మునుపటి పల్లెకాదు. మునుపటి పల్లె ఆనవాలే ఇప్పుడు లేదు. పాడూరు లేదు – కూలిపోయి పునాదులు మిగిలిని గుళ్లు లేవు, గోపురాలు లేవు! ఎంతలోతు తవ్వినా నిధులు లేవు, నిక్షేపాలు లేవు! ఆ పరగాణా హాల్ మొత్తంమీద, అప్పుడు రాలిన గింజన్నా మొక్కమొలవలేదు. అప్పటికి మొలిచిన మొక్కన్నా మానుకట్టలేదు. ఆనాటికి నిలచిన మానన్నా, ఒక బోదన్నా, సత్యానికి నిలువలేదు. సంజెదీపం వేళకు కళగావున్న పల్లె, మళ్లీ చుక్కపొడిచే వేళకల్లా, ఒక్క మొయిని సురేసుకుని పోయినట్టుపోయింది. ఏమైపోయిందటారు? ఎన్నకన్నెరుగని ఆడకూతురు అయినవారింట పుట్టి అబ్బనాకారంగా పెరిగి, ఆ ఇంట అడుగు పసుపు పారాణితో, పాపిటబొట్టుతో, చెంపన చుక్కతో, సిరులబ్బే చూపుతో ఈ ఇంట పెట్టిన ఆడకూతురు చేయరాని పాపం చేయకపోయినా, మోయరాని నింద మోసింది. అయ్యో పాపం! అన్నవారు లేకపోయిరి. కుయ్యో అన్నా గోడు ఆలకించేవారు కరువైపోయిరి. ఆ బిడ్డ ఎంత హడలిందని! ఆ తల్లి బ్రతుకు ఒక్క చిటికెలో చీకటిగుయ్యారమై పోగా ఎంత కుమిలిందని? ఒక్క కన్ను మూసింది. ఒక్క కన్ను తెరచింది. ఎందుకు యిచ్చావమ్మా ఈ పుట్టుక? అంటూ కన్నతల్లిమీద గావురుమంది. కానరాని తల్లికి మొక్కుతూ గావురుమంది. తెరిచిన కన్ను నిప్పులు చెరిగింది. మూసినకన్ను ఒక్క ముత్తెం విడిచింది. ఆ రవంత ముత్తెం సముద్రమంతయింది. సముద్రం – సముద్రం ఏడు సముద్రాలంత అయింది. ఏడు సముద్రాలు ఏక ఉప్పెనైంది. ఉప్పెనొచ్చి ఊరు ముంచెత్తింది; పోటొచ్చి పల్లెపల్లే నేలమట్ట చేసింది. ఆటొచ్చి, ఆ చీపరపాపర అంతా తుడిచి పెట్టింది. తుడిచిపెట్టినంత మేరా – వానదేవుడొచ్చి, కల్లాపి జల్లాడు. గాలిదేవుడొచ్చి తడి ఆరబెట్టాడు. సూర్యభగవాన్లు అప్పుడు తెరపిచూసుకుని వచ్చి, భూమ్మీద ముగ్గులల్లే నెరియవిచ్చాడు. అంతే, ఆ పొద్దు మొదలాయె ఆ గడ్డ ప్రాణాడదు, ఆ నింగి మీద పిట్టాడదు. సరేనయ్యా – మరి ఆ ఆడకూతురు కొచ్చిన నిందేమిటంటారు! ఆడకూతురికి రారాని నింద! అయిన యిల్లాలికి కలలో అన్నా రాకూడని నింద! కట్టుకున్న మారాజే తప్పు బట్టేనే – ఆ తల్లిని అంతమాటంటే పాపమన్నా తలచకపోయెనే – ఒట్టూ సత్యాలు నమ్మక పోయెనే – ఇంకేంజెయ్య నా తల్లి? ఇంకెవరితో మొరబెట్టుకోను ఆ అమ్మ! సీతమ్మకంటే సీతమ్మవారేనయ్యా! ఆ అయ్య రాముడంటివాడేనయ్యా! అయితేనేం, మూడు పువ్వులూ ఆరుకాయలూ కావల్సిన బతుకు మూణ్ణాళ్ళ ముచ్చట అయింది; ఆ కాపురం ఆరిపోయే దీపమల్లే ఒక్కసారి భగ్గమంది. సీతమ్మ సిరిగల యింటపుట్టింది. సంపదున్న యింటి నుంచి వచ్చింది! ఆ బిడ్డ తెచ్చిన సారె పల్లెఅంతా ముమ్మారు పంచిపెట్టినా, ఎక్కీదక్కీ మిగిలింది. రామయ్య కుటుంబం అంటారా, పరగణాకంతా మోతుబరీ అనుకోండి; వారికి ఏంతక్కువ? గీతొక్కటే తక్కువ; బ్రహ్మరాసిన రాతొక్కటే తక్కువ! సీతమ్మ అల్లా వైభోగంగా సార్లెతో – చీర్లతో తర్లివచ్చింది; వెంటను, పట్టెమంచం వచ్చింది, పానుపొచ్చింది; రంగరంగ వైభోగాలొచ్చినాయి. తూర్పు వైపు గదిలో పానుపేశారు; పడమటింట బంతులు బరి, విందులు చేసుకుంటున్నారు. వచ్చిన చుట్టాలందరూ, జాజబంతులు ఆడుకుంటున్నారు. మేజువాణీలు చేయించుకున్నారు. తెల్లవారుజాముకి ఎక్కడవారక్కడ అలసిపోయినారు; చోటుచూసుకు సొమ్మసిల్లి పోయినారు. సీతమ్మ అంతదాకా మేలుకుండలా! ఆ విద్దేలు ఆ చోద్దాలూ ఆ తల్లికి నచ్చలా! వచ్చే ఆవులింతను చిటికేసి ఆవులించింది. అక్కడ నుంచి బద్ధకంగా లేచిపోయింది. బద్ధకంగా పోయిపోయి ఆ నిద్దుమత్తులో, అల్లాగే పక్కమీద చోటుచూసుకుని వాలిపోయింది. వాలి పళాన నిద్దురపోయింది. ఏ మూలనో కునుకుతీసిన రామయ్యకు కోడికూత వేళకు ఎవరో వెన్ను చరిచినట్టు మెళుకువ వచ్చింది. తానున్న వెంపు చూసుకున్నాడు, తన వెంపు చూసుకున్నాడు. ఒక్క ఒళ్లు విరుపులో, పట్టిమంచం యాదకొచ్చింది. పండంటిపిల్లది యాదకొచ్చింది. లేచి నడింవాకలికొచ్చాడు. చుక్కల మీదకి చూశాడు. ఇంకా జాముప్రొద్దుందిగదా అనుకున్నాడు. ఉసూరుమన్న ప్రాణికి ఉత్సాహం వచ్చింది. ఒంటికి వేడొచ్చింది, చెంపకు ఒరచూపొచ్చింది. చివాలన్నపోయినాడయ్యా, పానుపు వేసిన గదిలోకి. సీతమ్మ పొస్తకమల్లే ఒత్తిలి పడుకుంది, మాంచి నిద్దర్లోవుంది. అట్టె పరకాయించాడు. అడుగులో అడుగువేసుకుంటూ చెంపమీద చిటికెశాడు. చిటికేసినంత చిరునవ్వు నవ్వాడు. అంతే ప్రాపతం ఆ యింటికి. చిటికెలోనే మేలుకొంది సీతమ్మ తల్లి. చిరునవ్వుకు నాగసొరంవిన్న ఆడత్రాచైంది. పంచప్రాణాల్తోనూ మిడిసిపడి ఆ మెడ కావిటేసుకుంది. ఏమో కులికింది. ఏమో గునిగింది. ముచ్చటాడేపాణెం నేరని చిన్నది మూగపోయింది. అయితేనేం గడియలతరబడి వేగిన వేగూ – సోగిన సోగూ, కనుపాప విప్పిచెప్పింది. చెప్పిందయ్యా చిన్నదాని కనుపాప. ఆకళింపయిందయ్యా చినవాడికి చిలకముక్కుకు దొండపండందినట్టు, జీరుగోరికి చివురాకు అందినట్టు సుఖపడేవాడే! సుఖపెట్టేవాడే – కాని, చిన్నది ఆ నోము నోచలేదు. చినవాడికి ఆ అదృష్టం పట్టలేదు. తొలిముచ్చటకు కలకట్టుగా, సొక్కి సోలుతూన్న చిన్నది – అటువాలేదల్లా చటుక్కుమని ఇటుకేసి బెదరి, త్రుళ్ళిపడి కెవ్వున కేకవేసింది. ఆ వేసిన కేకకు ముసుగుదన్ని ఒళ్ళు తెలియని నిద్దర్లో ఉన్న ప్రాణి చింబోతల్లే ఎగిరి గెంతేసింది. ఆ చింబోతు, చింబోతంటారా కాదుకాదు, రామయ్యతమ్ముడు కామయ్య. బంగారువంటి మనిషి, బంగావంటి మనసు – భయమూభక్తీ ఉన్న పడుచువాడు. కెవ్వుమన్న కేకకు మెళుకవచ్చింది. అన్నను చూశాడు వదిన్ని చూశాడు. తానున్న పానుపు చూచాడు. అయ్యో రామా అని అంగలార్చి అన్న పాదాలమీద పడిపోయినాడు. ఆవురుమన్నాడు. ఎంత తప్పు-తప్పని వాపోయి, తల నేలనేసి కొట్టుకున్నాడు. ఆఖరికి...అన్నా! అన్నాడు: ‘‘వదినె మనింటికొచ్చిన పండగలో ఒళ్లుమరిచిపోయినా, అటునుంచి వస్తున్నా, అగరొత్తుగుప్ మన్నాయి. ఆగిపోయినా, గుమ్మం వారకొచ్చి తొంగిచూసినా, గుమాగుమా అత్తరు దీపం వెలుగుతూంది. కన్నెదర పాలమీగడల్లే పానుపు అగుపించింది. తడిమి చూసినా – తబ్బిబ్బెపోయినా, నడుం అదేవాలింది. ఒళ్లు ఆదమరిచింది, మగత మగతగానేపట్టు కుచ్చులాంటి శాలవా పైకి లాక్కున్నా, ఒక్క కునుకు తీసి వేద్దమనుకున్నా – మరి ఒళ్ళు తెలియలా! నా మనవి. ఇంతేనన్నా!’’ కామయ్యతల చెళ్ళున తన్నాడు రామయ్య తండ్రి ఒళ్ళు తెలియని ఉగ్రంతో! మెడనరాలు ఫెటఫెట మెటికలు విరిగినాయ్! అంత తాపుతిని, కామయ్య గుక్కతిప్పుకొన్నాడు. ‘‘పర్వతంలాగా పడుంటివే. కానరాలేదా తల్లీ!’’ అన్నాడు. వెక్కి వెక్కి వచ్చే దుఃఖం ఆపుకుంటూ, ‘‘నాదైవం అనుకుంటినయ్యా! అలికిడైతే మెలుకవ వచ్చునని పట్టినిల కరుచుకుని పండుకున్నానయ్యా!’’ అన్నది సీతమ్మ. ‘‘విన్నావుగందా అన్నా’’ అన్నాడు లేనిసత్తువ తెచ్చుకుంటూ కామయ్య. అనడమేమిటి, మళ్లీ అన్న రామయ్య మరో తన్నుతన్నడమేమిటి! తన్నిన తన్నుకు, మెడనరాలు మరిన్ని మెటికలు విరిగినయ్ గుండెలు, నాభిదగ్గరకి నుంగిపోయినాయి. పడగ విప్పిన తాచైనాడు కామయ్య. నిదురలేచిన సింహమైనాడు కామయ్య. ఏనుగంత సత్తువచ్చింది. పట్టిన గుప్పిటిపట్టు విదిలించుకున్నాడు. తూలే కాలు దుయ్యపట్టుకున్నాడు. చీమైపోయి, దోమైపోయి, అంటున్నాడు గందా! ‘‘అన్నా! నామనవి ఆలకించవయ్యా!’’ అన్న – రామయ్య ఏమాటా చెప్పడే – కాళ్ళ వేళ్ళా బడి బతిమాలుకుంటొన్న తమ్ముణ్ణి కన్నెత్తి చూడడే! పోయిపోయి ఏటి ఒడ్డున కూచున్నాడు. పైన గొడుగల్లే మబ్బుంది. సిగలో పువ్వల్లే సూర్యుడున్నాడు. వింజామరల్లె గరుడపక్షి ఆడుతూంది. అడుగులో అడుగేసుకుంటూ కామయ్యొచ్చాడు; అల్లంతదూరాన సీతమ్మొచ్చింది. వచ్చి వచ్చి – మానేసుకుపోయినారు. నోటమాటరాక – పలుకరించలేక – జామైంది, గడియైంది రామయ్య కదిలాడు. ఒక్క ఉరు కురికాడు. తమ్ముణ్ణి పట్టుకుని గాను గాడేశాడు. జామపండల్లే విచ్చిన గడ్డంచేత బుచ్చుకుని, కామయ్య నొష్టతో అన్నకు మొక్కాడు. ‘‘ఒంటి ఊపిరినవుంది ఈ పుటుక! – ఒక్క ప్రాణమూ పుచ్చుకో అన్నా! ఉడుకుమీదున్నావ్! ఉగ్రాలమీదున్నావ్ – ఈ పళాన నన్ను తెగెయ్యకపోతే నువ్వు బతికేట్టులేవు’’ అని బతిమాలాడాడయ్యా!- ‘‘ఒంటి పాన్పుమీదుంటిరే – పిల్ల మనసేయలా’’ ‘‘రామరామ!’’ ‘‘చెయి మీదికిపోలా?’’ ‘‘చెయలేని పున్నెం తవ్వి తల కెత్తుకున్నాడు బిడ్డ-తర్లొచ్చి – పక్కను పండుకుంది. అది అన్నెం అంటావా?’’ ‘‘వదిన్ను కంట జూడ లలా!’’ ‘‘ఒక్కరెప్ప –’’ ‘‘వల్లమాలిన చక్కంది; ఒక్క రెప్పలోనే మనసు గుంజుకు నుంటుంది! నీవు ఓ రెప్పను చూశావు! నేను వెయి పుటకలకని మనసిచ్చాను – నిన్ను చీల్చినా మచ్చపోతుందా?’’ పసిపిల్లడల్లె బావురుమన్నాడు రామయ్య! అంతతో తమ్ముడు ఉగ్రుడైనాడు. ‘‘తల్లివయ్యేభాగ్యం తాళికట్టి తెచ్చుకున్నవాడు దక్కనీయలా! పోనీలే అమ్మ. కన్నవారు పేరుపెట్టుకున్నందుకు, ఆ తల్లి కష్టాలే నీకు వచ్చినాయా! మల్లెపూవల్లె మా యింటి కొచ్చావ్. సిగలో ముడుచుకోడం నేరకపాయె. కళ్ళనద్దుకుంటున్నా తల్లీ. మా తప్పులు కాయద్దు – మా వంగసం నిలపద్దు. శిక్షించక జాలిదలిచావో వేయిపుటకలు పుట్టి వెంటాడుతా – ఒక్క బిగివిని యీమాటలనేసి సూరడికి మొక్కి కామయ్య తూరీగల్లెపోయి ఏటిలో కలిసిపోయినాడు.’’ ‘‘వాడురాకుండా వాడేపోయినాడు. యింటికి వస్తే ఏలుకుంటా’’ నన్నడయ్యా! సీతమ్మ ఉలకలా. ‘‘పల్లెకుపోతే తలెత్తుకు తిరగలేను – ఏం గందరగోళంలా ఉందో – ఎన్ని కమామేషులు పుట్టినాయో – అన్నీ నరంలేని నాలుకలు,’’ సీతమ్మ పలకలా! ‘‘కాపురం పాడుచేసుకుంటావా?’’ సీతమ్మ మరింత ఉగ్రంగా నవ్వింది. రామయ్య పొటేలల్లే రొప్పుకుంటూ పారిపోయినాడు. పల్లెలో కనబడ్డవాడల్లా పలుకరించాడు. కంటబడిన ఆడకూతురల్లా నిలవేసింది! ఏమైంది సీతమ్మ? ఏటోడ్డునుంది. తాను తెగించిందా నువ్వు విడిచావా? దైవానికి తెలియాలి. ఊరుకు వంక తెచ్చింది! కత్తులు లేచినాయ్. కటార్లు దూసినాయ్. పల్లెపల్లె ఏటివారకు దండుకట్టింది. అక్కడ సీతమ్మ తపసులో ఉంది. ధ్యానంలో ఉంది. దిగువ నేకాడనో సందడాయె. రానురాను, మందొస్తున్న అలికిడాయె. ఓరచూపు చూసింది. ఒక్క కన్ను విచ్చుకుంది. పుట్టబోయే బిడ్డలు కేరుమన్నారు, తరించబోయేటి వాళ్లు తల్లీ అన్నారు, ఏదీ వినలా, ఆడపుటకైతే యింత అలుసా అనుకుంది. కామయ్యను తలుచుకుని, నాతండ్రే అనుకుంది. ఒక్కపుటక పుట్టావ్ నన్ను ఉద్ధరించావ్. మళ్లీ జన్మలెత్తే పనిలేదు. పగదీరుస్తున్నా బయల్లో కలిసి .... అంది. తెరచిన కన్ను నిప్పులు చెరిగింది. అందుకు ఇదీ కథ!
గోదావరి, గోరింటాకు, గోంగూరా, గిరీశం, కచటతపలూ, గసడదవలూ, బారిష్టర్ పార్వతీశం, పదహారణాలూ, ఇవి అసలు, సిసలు తెలుగుదినుసులు, తెలుగుదనపు జెండాలు అన్నారు కీ.శే. ముళ్లపూడి వెంకటరమణగారు ఒకానొక సందర్భంలో! తెలుగుగడ్డ గురించి తలుచుకున్నప్పుడల్లా, తెలుగువారి గురించి ఎవరికైనా చెప్పాలన్నా, తెలుగు సాహిత్యంలో కొన్ని మరుపురాని పాత్రలు మన ముందు సాక్షాత్కరిస్తాయి. అలాంటి కొన్ని అపురూప పాత్రలను మీకు పరిచయం చేయలని నా తాపత్రయం. కాని చరిత్రకందని అటువంటి పాత్రలను పరిచయం చేయటం అంటే సముద్రాన్ని దోసిటపట్టడం, ఆకాశాన్ని అద్దంలో బంధించడం వంటిది. అయినా తెలుగతనానికి ప్రతిరూపాలైన ఆ పాత్రలను తలుచుకోవాలని మీఅందరికి తలపకు తేవాలని తహ,తహలాడుతోంది నా మనసు. అందుకే మొట్టమొదట అమాయకత్వం పొంగిపొరలే గడుసుతనం, గడుస్తనం తొంగిచూసే అమాయకత్వం కలబోసి పోతపోసిన బంగారుతండ్రి పార్వతీశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రప్రథమ ప్రవాసాంధ్రుడు బారిష్టర్ పార్వతీశం అంటే తెలుగువారందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారనుకుంటాను. ఈ పార్వతీశం ఎవరూ అన్న అనుమానం మీకు కలుగుతోందని నాకు తెలుసు. బారిష్టర్ పార్వతీశం అయోనిజుడు, స్వయంభువు, బ్రహ్మమానసపుత్రుల జాతిలోనివాడు. ఆయనది నర్సాపురం దగ్గరి మొగలితుర్రు. ఇంటిపేరు వేమూరివారు. ఈయన జన్మదాత మహానుభావుడు కీ.శే. మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు. బారశాలనాడు పార్వతీశానికి ఆ నామధేయాన్ని పెట్టినవారు మొక్కపాటివారి స్నేహితులు శివశంకర శాస్త్రిగారు. ఇంతకీ పార్వతీశం పుట్టినది ఎప్పుడు అని అడుగుతున్నారా, తొందరపడకండి. ఆయన జన్మదినోత్సవం 1924 డిసెంబర్ 24న తెనాలి సాహితీ సమతి ప్రథమ సమావేశంలో. అక్కడకి విచ్చేసిన సహృదయులు, సాహితీ వేత్తలు ఏకగ్రీవంగా ఈ బాలుడు దిన, దిన ప్రవర్ధమానుడై తెలుగుజాతి గర్వించదగ్గ పాత్రరత్నం కాగలడని ఆనాడే జోస్యం చెప్పారు. అయితే ముందే చెప్పుకున్నట్టు మన పార్వతీశం బడాయిగా తన అమాయకత్వాన్నిగడుసుతనంతో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించి పదిమందికి వినోదాన్ని పంచే అనాగరికుడు. కాకపోతే ఏమిటండి, ఇంగ్లాండుకు వెడుతూ, కచికా, తాటాకులూ, మర చెంబు, బొంత, ఎర్రశాలువా, గులాబిరంగు సిల్కు కండువా, ఆరు యజ్ఞోపవీతాల జతలూ, మూడు పట్టు మొలత్రాళ్లు, బంతిపువ్వు రంగు పెట్టె వగైరా, వగైరా సామానుతో బయలుదేరుతారుటండీ! చోద్యంకాకపోతే! వట్టి అనాగరికుడు కాకపోతే. అలాని ఏ ప్రవాసాంధ్రుడైనా అనగలాడాండి. దాన్ని ముందచూపుంటారని కూడా చాలామందికి తెలవకపోవడం విచారకం. విదేశాలకు ప్రయాణమవుతూ అమ్మపెట్టిన గోంగూర పచ్చడి, ఆవకాయ, కందిపొడి, కజ్జికాయలు మూటగట్టని ప్రవాసాంధ్రుడిని చూపండి చూస్తాను. ఆకాలంలోనే తెలివైనవాడు కనుక నాలుక గీసుకోవడానికి తాటాకులు, తలకు రాసుకోవడానికి కొబ్బరినూనె పార్వతీశం మూటగట్టి మనందరికి మార్గదర్శకుడయ్యాడు. మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు, అందుచేత అజ్ఞానజనితమైన అపచారాలు చాలా ఉంటాయి. ఈ అజ్ఞాన కృతాపరాథములకు తోడు, తన తప్పు ఒప్పుకోకుండా అదేదో తను తెలిసే చేసినట్టు నటించడం మనలో చాలామందికి అలావాటు. కాదంటారా? పార్వతీశం ఆడటోపి తెలియక కొని అందరూ తనని చూసి నవ్వగానే తన స్నేహితురాలి కోసం కొన్నానని డబాయిస్తే అతను అమాయకుడు, తెలివితక్కువవాడు. నిజం చెప్పండి అలా సమయస్ఫూర్తితో మనలో ఎంతమంది వ్యవహరించలేదంటారు! పార్వతీశం గురించి అతని జన్మదాత అదే మొక్కపాటివారి మాటల్లో చెప్పాలంటే ఆలంకారికులు చెప్పిన ధీరోదాత్తాది లక్షణాలు ఏవీ అతనిలో లేవు. పార్వతీశం మనలాంటి సామాన్య మానవుడు. మనంలో అతనే మనం. ఎవడు ఎంతనవ్వినా, పార్వతీశం ఏమీ అనుకోడు, వాళ్లకు సామాన్య ధర్మాలైన సాహసం, ఉద్రేకం, దురాలోచన, అజ్ఞానం, అహంకారం, కార్యవసరమైన సాధన సంపత్తి చేకూర్చుకునే ఓపికలేకపోవడం ఇలాంటివన్నీ మూర్తీభవించిన మూర్తి బారిష్టర్ పార్వతీశం. అయినా చాలా పట్టుదలగలవాడు మన పార్వతీశం. మొగలితుర్రు దాటి మూడు ఊళ్ళు కూడా ఎప్పుడు వెళ్లని, చూడని వాడు ఇంగ్లాండు వెళ్లి బారిష్టర్ పట్టా పుచ్చుకుని చక్కావచ్చాడు అంటే మాటలా. కుళాయి కింద చేయిపెడితే ఆటోమెటిక్ గా నీళ్లుపడ్డపుడు మనలో ఎంతమంది సంభ్రమాశ్చర్యాలు చెందలేదు. గుమ్మడి పండ్ల దొంగంటే భుజాలు తట్టుకోవటం అంటే అదే. మన పార్వతీశం ఇలాంటి ఎన్నో విషయాలను స్వీయానుభావంతో తెలుసుకుని, కార్యదక్షుడు, కర్మవీరడూ, యోచనాపరుడూ, విద్యావేత్త, విజ్ఞానవేత్త అయి, మానసికంగా, నైతికంగా ఎవరూ అందుకోలేని ఎత్తుకు ఎదిగాడు. నవ్విన నాపచేనే పండునులే అన్నట్టు, నర్సాపురం నుంచి పడవలో బయలుదేరి లండను చేరే వరకు అనాగరికతో అజ్ఞానంతో నవ్వులపాలైన పార్వతీశం, తన తప్పులు దిద్దుకుంటూ ఎదుటివాళ్లను చూసి నవ్వ నేర్చాడు. నేనైతే అటువంటి తెలివితక్కువ పనులు చేస్తానా అని అనుకునే ప్రతీ ఒక్కరూ బారిష్టర్ పార్వతీశం జీవితం గురించి ఒక్కసారి తెలుసుకుంటే బావుంటుంది. పార్వతీశం కేవలం మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు సృష్టించిన హాస్యపాత్రకాదు. అలా అనుకుంటే పొరపాటే. మనలోని వికారాలు, వికృతి చేష్టలు ఎదుటివారిలో కన్పిస్తే మనకు నవ్వువస్తుంది అనడానికి పార్వతీశం లండన్ ప్రయాణమే అందుకు ఉదాహరణ. మనిషి ఎదుగుతున్న కొద్ది, యోచనాపరుడై, అంతర్ముఖుడైననాడు ఆ నవ్వే తగ్గుతుంది అనడానికి బారిష్టర్ అయి తిరిగి వచ్చిన పార్వతీశమే చక్కని తార్కాణం. సౌమ్యశ్రీ రాళ్ళభండి
పదం కాదది, ప్రపంచానికి మేలు కొలుపు. పాట కాదది, ప్రజ్వరిల్లే జీవక వేదం. లోకం బాధంతా తన బాధనుకుని, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని మరో ప్రపంచానికి స్వాగతం పలికిన శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం, సాహితీ జగత్తుకే మణిహారం. తన అభ్యుదయ కవిత్వాల ద్వారా సమాజంలో కుళ్లుని తూర్పార బట్టిన శ్రీశ్రీ, ఎన్నో కమనీయమైన చిత్ర గీతాలను కూడా సినీ అభిమానులకు అందించారు. కత్తిలాంటి పదునైన మాటనైనా, కోమలమైన పదాన్నయినా శాసించి జనారంజకంగా మలచగలిగే శక్తి ఒక్క శ్రీశ్రీక ఉందంటే అతిశయోక్తి కాదేమో. `తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు..` అని ప్రశ్నించే, గర్జించే శ్రీశ్రీ, `నా హదయంలో నిదురించే చెలి, కలలోనే కవ్వించే సఖీ...` అనే ప్రణయ గీతం రాయగలగడం ఆయనకే చెల్లింది. అటు విప్లవ కవిగా, ఇటు సినీకవిగా జోడు గుర్రాల స్వారి నల్లేరు మీద బండి నడకలా ఆయన సాగించగలిగారు. ఆహుతి సినిమాలోని `ప్రేమయే జనన మరణ లీల...` గీతం ద్వారా తన సినీ జీవితానికి అంకురార్పణ చేసిన శ్రీశ్రీ సరళమైన పదాలతో ఎంతో లోతైన అర్ధాన్ని తన గీతాల ద్వారా ప్రజలకు అందించారు. `వెలుగు-నీడలు` సినిమాలోని `కలకానిది, నిజమైనది, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు...` అనే పాట అందుకు నిదర్శనం. అక్కా-చెల్లెళ్లు చిత్రంలోని `వినరాని మాటలే..` అనే పాటలే `జీవితమే ఒక చదరంగం పావులే కదా జీవులందరూ, తెలియనిది ఆట, కనబడదొక బాట...` అని జీవిత సారానంతా ఒక్క వాక్యయంలో వివరించాడు. `ఆకాశవీధిలో, అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనె, సయ్యాటలాడెనే..`, `తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో హ్రదయ రాగం`, `మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడకరుండిన అదే భాగ్యమో` వంటి సుమధుర గీతాలను శ్రీశ్రీ కలం నుంచి వెలువడ్డాయంటే ఎందరో నమ్మకపోవచ్చు. అయితే, శ్రీశ్రీ అభ్యుదయ భావాలను సినీ గీతాల్లో కూడా ప్రదర్శించారు. యమగోల చిత్రంలోని `సమరానికి నేగే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం..`, భూమికోసం లోని `ఎవరో వస్తారని, ఎదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా..` మరో ప్రపంచంలోని `ఆకాశమంటే మేడలతో, ఆకలిమంటల పీడలతో ధనికుల కోసం పేదలు కట్టిన మహా మంచి ప్రపంచం.. ఓహోహో మరో ప్రపంచం..`లు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. అలాగే, `పాదవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయగీతికా..` అనే వెలుగు-నీడలులోని దేశభక్తి గీతంలో కూడా `ఆకాశం అందుకునే ధరలోకవైపు, అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకున్న నీదేశం ఎటు దిగజారు..` అని ప్రశ్నించడంలో `ప్రతి మనిషి, మరో మనిషిని దోచుకునేవాడే..` అనడంలోనూ, `ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వ`మని వాపోయినట్టే అన్పిస్తుంది. జానపదం ధ్వనించే `ఓ రంగయో పూలరంగయో..`పాటను చాలామంది కొసరాజు రచనగా భ్రమిస్తారు. ఈ గీతం రాసిన శ్రీశ్రీ, వాగ్ధానం సినిమాలో బహుళ ప్రాచుర్యం పొందిన రేలంగిపైన చిత్రీకరించిన హరికథను, సంగీత లక్ష్మి చిత్రంలోని క్రష్ణార్జున సంవాదాన్ని కూడా రాసి సకల కళాప్రావీణ్యుడననిపించుకున్నాడు. కురుక్షేత్రంలోని పతాక సన్నివేశానికి రాసిన `ధర్మక్షేత్రం, ఇది కురుక్షేత్రం..` అనే పాటలో కఠినమైన పదాలను కూర్చిన శ్రీశ్రీ దేవతలో `బొమ్మని చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుకా...` అని సరళమైన పదాలనుపయోగించి మెప్పించాడు. ఇలా మాటలను, అక్షరాలను శాసించగలడు కనకే తెలుగు సినీ రచయితలలో శ్రీశ్రీకి మాత్రమే జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. అల్లూరి సీతారామరాజు చిత్రానికే హైలెట్ అనిపించుకున్న `తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా` పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. మళ్లీ పాతిక వసంతాలు గడిస్తేగాని మరో తెలుగు సినీరచయితకు ఈ అవార్డు లభించలేదన్నది గమనార్హం. చిలకా-గోరింక సినిమాలో హాస్యజంట పద్మనాభం, రమాప్రభలపై చిత్రీకరించిన `చెమ్చాతో సముద్రాన్ని తోడశక్యమా` అనే పాటను రాసిన శ్రీశ్రీ పంతులమ్మ, భార్యాభర్తలు సినిమా కోసం పద్యాయలను సైతం రాసి అందరిని మెప్పించారు. మొదట్లో డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు రాసి తిరుగులేనివాడిగా పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ క్రమేపి తెలుగు ప్రేక్షకుల హ్రదయ పీఠాన్ని అలంకరించారు. దేవుడు చేసిన మనుష్యుల్లారా లో టైటిల్ సాంగ్, గాంధారి గర్వభంగంలో మానవుని శక్తి, యుక్తులను తెలిపే `పదునాలుగు లోకముల దురేలేదే .. చూడగా మనుష్యుడిల మహానుభావుడే (ఈ పాటను అనుకరిస్తూ తర్వాత బాలభారతంలో `మానవుడే, మహనీయుడు, శక్తిపరుడు యుక్తిపరుడు..` అనే పాటను మరో సినీకవి రాశాడు), తోడికోడళ్లులో `కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదానా..` గుండమ్మ కథలో `లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..` శభాష్ రాముడులోని `జయంబు నిశ్చయంబురా భయండు లేదురా..` పాడిపంటలు, మనుష్యులు మారాలి, కులగోత్రాలు, విప్లవశంఖం, పునర్జన్మ, శ్రీక్రష్ణతులాభారం, పంతాలు-పట్టింపులు, పెళ్లీడు పిల్లలు, దానవీరశురకర్ణ, ఆరాధన ఇలా ఎన్నో చిత్రాల్లో మరిపించే, మనసుల కదిలించే, ప్రేరణ కలిగించే పాటలను ప్రేక్షకులకు అందించిన శ్రీశ్రీ చెప్పదల్చుకుంటే, అర్ధం చేసుకోగలిగే శక్తి ఉంటే ప్రతిపదం, కోటితంత్రులై జనజీవనహేళను తెలుపుతాయని నిరూపించాడు. జీవితంలోని ఎన్నోచేదు నిజాలను `తలచేది జరగదు, జరిగేది తెలియద`ని చెపుతూ, `శోధించి, సాధించాలి అదే ధీరగుణమని` తన గీతాల ద్వారా ఆంధ్రులకు సందేశాన్నిచ్చి చిత్ర జగత్తులో ధ్రవతారగా నిలిచిపోయాడు. సౌమ్యశ్రీ రాళ్ళభండి
ఆమె నవ్విస్తుంది. కవ్విస్తుంది. చక్కిలిగింతలు పెడుతుంది.ఆలోచింపచేస్తుంది. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తుంది కూడా. అది ఆమెకు మాత్రమే సొంతమైన జీవనసరళి. కాంతం అచ్చమైన తెలుగింటి ఇల్లాలు. భర్త అంటే బోలెడు ఇష్టం. అదే సమయంలో పాపం ఆయన కేమీ తెలీదని, ఆయన అమాయకత్వంపై బోలెడు సానుభూతి. ఆంధ్ర దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు కాంతం కన్పిస్తుంది. కాంతం అంత పొడగరీకాదు, పొట్టికాదు. ఛామన ఛాయ, నవ్వు మొగము, చక్కని నేత్రాలు బాపు బొమ్మకాదు కానీ అందగత్తే. కాంతానికి ఇంగ్లీషు రాదు. కానీ భర్త మాట్లాడుతుంటే నాకేదో అర్ధమయినట్లే ఉందని అనుకునే అమాయక స్త్రీమూర్తి. వారప్రతికలను చదవాలనే ఆసక్తి లేకపోయినా, కుమారీ శతకం, నృసింహ శతకం, ప్రహ్లాద చరిత్ర మున్నగు పుస్తకాలు మాత్రం చదవి అర్ధం చేసుకోగలదు. సగటు తెలుగు మహిళ కాంతం అని చెప్పవచ్చు. ఆమెకు మల్లెపూలు, తెల్ల చీర అంటే మహా ఇష్టం. మంచి పొదుపరి. ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మంచి మాటకారి. మాటకుమాట ఎదుటవారు నొచ్చకోకుండా బదులు చెప్పగల నేర్పరి. ఒకరోజు భర్త, మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొకకోతి, తోకలు మాత్రం లేవు అని ఆటపట్టిస్తే, ఆమె తడుముకోకుండా మీ చెల్లెళ్లకు ఆ కొరతలేదని బదులు చెప్పింది. ఆమె హాస్యచతురతకు మరో ఉదాహరణ. ఎంతోసేపు కాలేదే, నాలుగైదు నిమిషాల సంభాషణలో నన్నాయన ఫూల్ అన్నాడు అని భర్త చెప్పగానే, అంత ఆలస్యం ఎందుకైందండీ అని అమాయకంగా చురక వేయటం కాంతానికే చెల్లు. దాంపత్యంలో ఉండే విలువలకు కాంతం జీవితం ఒక మంచి నిదర్శనం. అసంతృప్తికి ఆమె జీవితంలో చోటులేదు. ఆదర్శ గృహిణియైన మునిమాణిక్యం వారి కాంతం తెలుగు నాయికలలో మాణిక్యం వంటింది. ఒకసారి భర్త పిలిచి ‘నా కలం కనపట్లేదు,వెతికి పెట్ట’మంటే ఆవిడ వంటింట్లోనుంచి ‘నాకు అట్లకాడ కనపడడం లేదు కాస్త వెతికిపెట్టండి’ అందిట. ఇలా నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు, కాంతం నిత్య నూతనమనిపిస్తాయి. ఒకసారి విశ్వనాథవారు మునిమాణిక్యంగారిని ముట్నూరి కృష్ణారావుగారి దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేస్తుంటే ఆయన వెంటనే ‘కాంతం భర్త కాదూ’ అన్నారట. ఈ ఒక్క ఉదాహరణే చాలు తెలుగునాట కాంతం ఎంత ప్రసిద్ధి చెందిందో చెప్పడానికి. నాయకుల్లో ‘గిరీశం’, ‘పార్వతీశం’ ఎలా అయితే తెలుగు సాహిత్యాకాశంలో చిరస్థాయిగా నిల్చారో, అలాగే ‘కాంతం’ ధృవతారగా వెలుగొందుతోంది. సౌమ్యశ్రీ రాళ్లభండి
తెలుగులో తొలి ఆధునిక కథ లేదా వ్యవహారిక భాషలో తొలి తెలుగు కథానిక 'దిద్దుబాటు.' ఇది 'ఆంధ్ర భారతి' పత్రిక 1910, ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. గురజాడ కంటే ముందే కథలు రాసినవారు మనకు లేకపోలేదు. ఆచంట సాంఖ్యాయన శర్మ రాసిన 'లలిత' (1902), 'విశాఖ' (1904), బండారు అచ్చమాంబ రాసిన 'స్త్రీ విద్య', 'ధన త్రయోదశి' (1902) కథలను తొలి తెలుగు కథలని వాదించిన వారు లేకపోలేరు. అయితే ఆ కథలలో గ్రాంధిక భాష ఎక్కువగా కనపడుతుంది. ఈ కథల కథా శిల్పం, రచనాతీరు ఆధునికతకు బహుదూరం అన్న విమర్శకులున్నారు. సలక్షణమైన ఆధునిక వ్యవహారిక భాషను కథానికలో ప్రవేశపెట్టినవాడు గురజాడ అప్పారావే. ఏదిఏమైనప్పటికీ 100 సంవత్సరాల తర్వాత కూడా నేటి సమాజతీరుతెన్నులకు దగ్గరగా ఉన్న దిద్దుబాటు నేటికి కనువిప్పు కలిగించే కథే. ఇక చదవండి! ‘‘తలుపు!తలుపు!’’ తలుపు తెరవబడలేదు. ఒక నిమిషమతడూరుకొనెను. గదిలోని గడియారము టింగుమని ఒంటిగంట కొట్టినది. ‘‘ఎంత ఆలస్యము చేస్తిని! బుద్ధి గడ్డితిన్నది. రేపటినుంచి జాగ్రత్తగా ఉంటాను. యాంటి నాచ్‌లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమైపోయినది. ఒక్క పాట సరదాతో కుదరలేదు, మనిషి మీద కూడా సరదా పరిగెత్తుతూంది. లేకుంటే, పోకిరి మనిషివలె పాట ముగిసిన దాకా కూర్చోవడమేమిటి? ఏదో ఒక అవకాశము కలుగజేసికొని దానితో నాలుగుమాటలు ఆడడవు ఆసక్తి ఏమి? ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను. రేపటి నుంచి మరి పాటకు వెళ్లను. నిశ్చయం. నిశ్చయం... గట్టిగా పిలిచితే కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముడిని లేపగల్గితినా చడి లేకుండా పక్క చేరి పెద్దమనిషి వేషము వెయ్యవచ్చును.’’ గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్క విడబారెను. ‘అరె యిదేమి!’ అనుకొని, రెక్క మెల్లన తెరవ, నడవలో దీపము లేదు. అంగణము దాటి తన పడక గది తలుపు తీయ, నందును దీపము లేకుండెను. చడిలేక అడుగు వేయుచు మంచము దరికి పోయి కమలిని నిద్రించుచుండెనా, మేల్కొనియుండెనాయని కనుగొన యత్నించెను గాని, యేర్పరింపలేడయ్యె. అంత జేబు నుంచి అగ్గిపెట్టి తీసి పుల్ల వెలిగించెను. మంచముపైని కమలిని కానరాలేదు. నిశ్చేష్టుడై చేతి నుండి అగ్గిపుల్ల నేలరాల్చెను. గదినీ, అతని మనస్సును కూడ చీకటి క్రమ్మెను. వె ఱ్ఱి శంకలును అంతకు వెఱ్ఱి సమాధానములును మనసున పుట్టుచు గిట్టుచు వ్యాకులత కలుగచేసెను. బుద్ధి తక్కువకు తనయందో, కానరామికి కమలిని యందో యేర్పరింపరాని కోపావేశమును, చీకాకును గలిగెను. నట్టి వాకిటికి వచ్చి నిలువ చుక్కలకాంతిని దాసి గాని దాసుడు గాని కనపడలేదు. వారికి తగిన శిక్ష వురియేనని గోపాలరావు నిశ్చయించెను. తిరిగి గదిలోనికి పోయి దీపము వెలిగించి గది నలుదెసల పరికించెను. కమలిని కానరాలేదు. వీధి గుమ్మము చేరి తలుపు తెరచి చూడ చుట్ట కాల్చుచు తల యెత్తి చుక్కల పరీక్షించుచున్న రాముడు వీధి నడుమ కానవచ్చెను. పట్టరాని కోపముతో వానిని జూచి గోపాలరావు ‘‘రామా!రా!’’యని పిలిచెను. రాముడు గతుక్కుమని చుట్ట పారవైచి ‘బాబు’ అని డగ్గరెను. ‘‘మీ అమ్మేదిరా?’’ ‘‘మా యమ్మా? యింటున్నది బాబూ. ‘మీ అమ్మ కాదురా! బుద్ధిహీనుడా! నా భార్య.’’ ‘‘అమ్మగారా? ఎక్కడుంటారు బాబూ? పడుకున్నారు?’’ ‘‘యింట్లోనే లేదు.’’ రాముడి గుండెలో దిగులు ప్రవేశించెను. గుమ్మములో అడుగు పెట్టగానే రాముని వీపుపై వీశ గుద్దులు రెండు పడెను. ‘చంపేస్తిరి బాబూ’ అని రాముడు నేల కూలబడెను. గోపాలుడు సదయ హృదయుడు. అక్రమమాచరించితినను జ్ఞానము వెంటనే పొడమి ఆగ్రహావేశము దిగజారి పశ్చాత్తాపము కలిగెను. రాముని చేత లేవనెత్తి, వీపు నిమిరి పశువు వలె నాచరించితినని యనుకొనుచు గదిలోనికి తీసుకొనిపోయెను. కుర్చీపయి కూర్చుని ‘‘రామా, ఏమాయెరా?’’ యని దైన్యముతో ననెను. ‘‘యేటో మాయలా ఉంది బాబూ.’’ ‘‘పుట్టింటికి వెళ్లియుండునా?’’ ‘‘అంతవారు కారనా? బాబూ, కోపగించితే చెప్పలేను గాని ఆడారు చదువు నేరిస్తే ఏటౌతది?’’ ‘‘విద్య విలువ నీకేం తెలుసురా, రామా!’’ అని గోపాలరావు మోచేతులు బల్లపయినాని వాని నడుమ తలయుంచి యోచించుచుండ కమలిని చేవ్రాత నొక యుత్తరము కానవచ్చెను. దానిని చదువసాగెను. ‘‘అయ్యా!’’ ‘‘ ‘ప్రియ’ పోయి ‘అయ్యా’ కాడికి వచ్చెనా?’’ ‘‘పెయ్య పోయిందా బాబూ!’’ ‘‘మూర్ఖుడా! వూరుకో!’’ ‘‘అయ్యా! పది దినములాయె. రాత్రులు నింటికి మీ రాకయే నేనెరెగను. మీటింగులకు బోవుచుంటిమంటిరి. లోకోపకారములగు నుద్యమముల నిదుర మాని చేయుచుంటిమంటిరి. మా చెలుల వలన నిజము నేర్చితిని. నేనింటనుండుటను గదా మీరు కల్లలు పలుకవలసివచ్చె. నేను పుట్టింటనున్న మీ స్వేచ్ఛకు నిర్బంధమును, అసత్యమునకు అవకాశము కలుగకుండును. మీచే దినదినమును అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుండుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నేనీ రేయి కన్నవారింటికి జనియెద సంతసింపుడు. వెచ్చముగాక ఏ పాటి మిగిలియున్నను దయ నుంచుడు.’’ ఉత్తరము ముగించి ‘‘నేను పశువును’’ అని గోపాలరావు అనెను. ‘‘అదేమిటి బాబూ అలా శలవిస్తారు?’’ ‘‘శుద్ధ పశువును!’’ రాముడు అతి ప్రయత్నముచే నవ్వు ఆపుకొనెను.. ‘‘గుణవతి, విద్యానిధి, వినయ సంపన్నురాలు నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసినది.’’ ‘‘ఏటి చేసినారు బాబూ?’’ ‘‘పుట్టింటికి వెళ్లిపోయినది - గాని నీకు తెలియకుండా ఎలా వెళ్లిందిరా?’’ రాముడు రెండడుగులు వెనుకకు నడిచి ‘‘నాను తొంగున్నాను కావాల బాబూ. అలక చేస్తే చెప్పచాల్నుగాని బాబూ ఆడదయి చెప్పకుండా పుట్టినారింటికి ఎల్తానంటే చెంపలాయించి కూకోబెట్టాలి గాని మొగోరిలాగ రాతలూ కోతలూ మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ?’’ ‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుడి సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్ర్తీ రత్నమే. శివుడు పార్వతికి సగము దేహము పంచి యిచ్చాడు. ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. అనగా పెళ్లాము మొగుని కన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?’’ ‘‘నాకేం బోద కాదు బాబూ!’’ రామునికి నవ్వు ఆచుకొనుట అసాధ్యమగుచుండెను. ‘‘నీ కూతురు బడికి వెళ్లుతున్నది గదా! విద్య విలవ నీకే బోధపడుతుంది. ఆ మాట అలా వుండనియ్యి. కాని, నువ్వో నేనో వెంటనే బయలుదేరి చంద్రవరం వెళ్లాలి. నేను నాలుగు రోజుల దాకా వూరి నుంచి కదలడముకు వీలుపడదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. వెళ్లి కమలినిని తీసుకురా. కమలినితో ఏమి జెప్పవలెనో తెలిసిందా?’’ ‘‘యేటా? బాబూ! బాబు, నా యీపు పగలేసినారు, రండమ్మా అంతాను?’’ ‘‘దెబ్బల మాట మరిచిపో. కొట్టినందుకు రెండు రూపాయలిస్తాను. తీసుకో మరియెన్నడూ ఆ వూసెత్తకు. కమలినితో గాని తప్పి జారి అనబోయేవు సుమా.’’ ‘‘అనను బాబూ!’’ ‘‘నువ్వు చెప్పవలసిన మాటలు చెబుతాను. బాగా విను. ‘పంతులికి బుద్ధి వచ్చింది. ఇక ఎన్నడూ సానుల పాట వినరు. రాత్రులు యిల్లు కదలరు, ఇది ఖరారు. తెలిసిందా? మిమ్ములను గెడ్డము పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు, దయదలచి ఆయన లోపములు బయలుపెట్టక రెండు మూడు రోజులలో వెళ్లిపోయి రమ్మన్నారు. మీరు లేనిరోజో యుగముగా గడుపుతున్నారు’ అని నిపుణతగా చెప్పు తెలిసిందా?’’ ‘‘తెలిసింది బాబూ!’’ ‘‘ఏమని చెబుతావో నాతో వొక మాటు చెప్పు.’’ రాముడు తల గోకుకొనుచు ‘‘యేటా - యేటా - అదంతా నాకేం తెలదు బాబూ - నానంతాను అమ్మా! నా మాటినుకొండి - కాలం గడిపినోణ్ని - ఆడోరు యెజిమాని చెప్పినట్టల్లా యిని వల్లకుండాలి. లేకుంటే మా పెద్ద పంతులార్లాగ అయ్యగారు కూడా సానమ్మ నుంచుగుంతారు. మీ శెవులో మాట. పట్టంలోకి బంగార బొమ్మలాంటి సానమ్మ వొచ్చింది. మరి పంతులు మనసు మనసులో లేదు. ఆ పైన మీ సిత్తం! అంతాను.’’ ‘‘ఓరి వెధవా!’’ అని గోపాలరావు కోపముతో కుర్చీ నుండి లేచి నిలిచెను. ఊసవలె రాముడు వెలికెగెసెను. అంతట మంచము క్రింద నుండి అమృత నిష్యందిని యగు కలకల నగవును కరకంకణముల హృద్యారావమును విననయ్యెను. ‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుడి సృష్టిలోకెల్లా ఉత్కృష్టమైన వస్తువు విద్య నేర్చిన స్ర్తీ రత్నమే. శివుడు పార్వతికి సగము దేహము పంచి యిచ్చాడు. ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. అనగా పెళ్లాము మొగుని కన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?’’
విదేహ దేశాన్ని పాలించే జనక మహారాజు ఆస్థానంలో వంది అనే మహావిద్వాంసుడుడేవాడు. ఎందరో మహావిద్వాంసులు అతనితో వాదించి ఓడిపోయారు. దానితో అహంకారభూషితుడైన ఆ విద్వాంసుడు తనని ఓడించలేనివారిని ప్రవహించే నదిలో ముంచుతానని ప్రకటించి అనేకులను నదీమతల్లి ఒడిలోకి చేర్చాడు. ఆ కాలంలో ఉద్దాలకుని శిష్యుడైన కహోడుడు విదేహ చేరి వంది చేతలలో ఓడి ప్రాణాలు కోల్పాయాడు. అప్పటికే అతని భార్య గర్భవతి. అనతికాలంలోనే ఆమెకు తండ్రి శాపం వల్ల అష్టావక్రుడు అనే కుమారుడు జన్మించాడు. పన్నెండుఏళ్ల ప్రాయంలో అష్టావక్రునికి తన తండ్రి మరణ కారణం తెలిసి, వందితో వాదించడానికి విదేహ రాజ్యాన్ని చేరాడు. నిండా పన్నెండేళ్ల ప్రాయంలేని ఆ బాలుని చూచి, ద్వారపాలకులు అడ్డగించి వంది వంటి మహావిద్వాంసునితో వాదనకు దిగవద్దని ఉద్భోద చేశారు. అయితే విద్యకు వయసుతో నిమిత్తంలేదని, జుట్టు నెరసినవాడు, ముదుసలే విద్యావంతుడని అనుకోరాదని ప్రత్యుత్తర మిచ్చి లోనికి వెళ్లడానికి అనుమతిని కోరాడు. వీరి వాగ్వివాదాన్ని గమనిస్తున్న జనకమహారాజు, ‘‘ఆర్యా, మా ఆస్థాన విద్వాంసుడు వంది ప్రచండ సూర్యసముడు. ఆయన ముందు మహావిద్వాంసులందరూ చిన్న, చిన్న నక్షత్రాల వలె వెల, వెల బోయినారు’’ అనగా అష్టావక్రుడు – ‘‘మహారాజా, నా వంటి వారెవరూ మీ సభా భవనానికి ఇంతవరకు వచ్చి ఉండరని’’ సమాధానమిచ్చాడు. ‘‘అయితే ముప్పది అవయవాలతో, పన్నెండు అంశలతో ఇరువది నాలుగు పర్వాలతో మూడు వందల అరువది రేకులతో ఉండే దానిని ఎరిగిన జ్ఞానివి నువ్వా’’ అని జనకుడు ప్రశ్నించాడు. ‘‘మహారాజా, ముప్పది దినాలు అవయవాలు, అమావాస్య, పూర్ణిమలు చెరో పన్నెండు, ఈ ఇరువది నాలుగు పర్వాలు, పన్నెండు నెలల అంశలు, మూడువందల అరువది రోజులు రేకులు, అటువంటి సంవత్సర రూపమున కాలచక్రం మీకు సమస్త కళ్యాణాలు కలిగించుగాక’’ అన్నాడు. జన: వాడు గుర్రాల జంటలవలె కనిపిస్తూ, హఠాత్తుగా డేగలా మీదపడే ఆ రెండింటినీ ధరించెదెవరు? అష్టా: మహారాజా, అవి మీ శత్రువుల గృహాల మీద పడకూడదని కోరుతున్నాను. ప్రాణ నామాలతో ఉండే ఆ రెండు తత్త్వాల వల్ల విద్యుత్తు పుడుతుంది. వీటిని మేఘం ధరిస్తుంది. జన: కన్ను మూయకుండా నిద్రించేది ఏది? అష్టా: నిరంతరం నీటిలో ఉండే చేప. జన: జన్మించినా చైతన్యం లేనిది ఏది? అష్టా: పక్షలు పెట్టె గ్రుడ్డు. జన: హృదయం లేనిది? అష్టా: బండరాయి. జన: ఓ వేదవేత్తా, ఇప్పుడు మీరు మా మండపానికి వచ్చి వాదన సాగించవచ్చు అని సాదరంగా ఆహ్వానించాడు. తన వద్దకు వచ్చిన అష్టావక్రుని చూసి మహావిద్వాంసుడు వంది ఇలా అన్నాడు. ‘‘బాలకా, నిద్రపోయే సింహాన్ని లేపకు. కాలకూడ విషభరితమయిన పాము పడగ మీద కాలు పెట్టకు.’’ అదివిని, అష్టా: మహారాజా, పర్వతాలన్నీ మైనం కంటే చిన్నవి. లేగదూడలు ఆంబోతుల కంటే చిన్నవి. రాజులందరూ జనకుని కంటే అల్పులు. దేవతలలో ఇంద్రుని వలె, నరులలో ఉత్తముడుగా ఉన్న మహారాజువు నువ్వు. మీ విద్వాంసుడైన వందిని వాదానికి రమ్మనండి. ప్రారంభిస్తున్నాను నా వాదం. అగ్ని ఒకటే అయినా అనేక రూపాలలో ప్రకాశిస్తుంది. సూర్యుడోక్కడే సర్వలోకాలకు వెలుగు. దేవేంద్రుడొక్కడే ఏకైక వీరుడు. పితృ దేవతాపతి, యముడొక్కడే అని ప్రారంభించాడు వంది. అష్టా: నందీ, ఇంద్రుడు-అగ్ని నిరంతర స్నేహబంధంతో ఉండే దేవతలు. అలానే పర్వత నారదులు, అశ్వినీ దేవతలిద్దరు. రథానికి రెండు చక్రాలు. సతీపతులిద్దరు. వంది: ప్రాణికోటంతా దేవమానవ తిర్యరూపాలు మూడు ధరిస్తుంది. ఋగ్యజుస్సామాలు మూడే వేదాలు. ప్రాతర్మాధ్యాహ్నిక సాయం సవనాలు మూడు. స్వర్గమర్త్య నరకాలు మూడే లోకాలు. అగ్ని, సూర్యచంద్రులు ముగ్గురే జ్యోతి స్వరూపులు. అష్టా: బ్రహ్మ చర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాశ్రమాలు నాలుగు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు నాలుగు. దిక్కులూ నాలుగే. హ్రస్వ, దీర్ఘ, ప్లుత, హల్లు భేదాలతో శబ్దం నాలుగు రకాలు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ అని వాక్కు నాలుగు రకాలు. వంది: గార్హవత్య, దక్షిణాగ్ని, ఆహవనీయ, నభ్యం, అనభ్యం అనే అవస్థా భేదంతో యజ్ఞాగ్ని అయిదు విధాలు. పంక్తి చంధస్సుకి పాదాలయిదు. దేవ, పితృ, ఋషి, మనుష్య, భూత, యజ్ఞాలు అయిదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని జ్ఞానేంద్రియాలయిదు. విపాశ, ఇరావతి, వితస్త, చంద్రభా, శతుద్రు నామాలతో ప్రఖ్యాతమైనది పంచనాదం. అష్టా: బాలకా, అగ్ని స్థాపనవేళ ఆరు ఆవులను దక్షిణ ఇవ్వాలి. ఆరుఋతువులే సంవత్సర కాల చక్రాన్ని నడుపుతాయి. మనస్సుతో కలిసి జ్ఞానేంద్రియాలు ఆరు. కృత్తికలు ఆరు. యజ్ఞాలు ఆరు. వంది: విద్వాంసుడా, ఆవు, దున్న, మేక, గుర్రం, కుక్క, పిల్లి, గాడిద – ఏడు గ్రామాలలో ఉండే జంతువులు. సింహం, శార్దూలం, లేడి, తోడేలు, ఏనుగు, వానరం, భల్లూకం – ఇవి ఏడు వన్య మృగాలు. గాయత్రి, బృహతి, జగతి, అతిజగతి, పంక్తి, త్రిష్టుప్, అనుష్టువ్, భేదాలతో ఛందస్సు ఏడురకాలు. అత్రి, పుల్యస్త, క్రతు, మరీచి, అంగరీస, వసిష్టులు సప్త మహార్షులు, ధూప, దీప, నైవేద్య, ఆచమానం, గంధ, పుష్ప తాంబులాదులు కూడా ఏడే. అష్టా: తులాదండాన్ని బంధించే సూత్రాలే ఎనిమిది. సింహాన్ని సంహరించే శరభ మృగానికి ఎనిమిది పాదాలు. యజ్ఞశాల సమీపంలో యూపస్థంభానికి కోణాలు ఎనిమిది. వసువులు ఎనమండుగురు. వంది: పితృయజ్ఞవేళ అగ్నిని ఉపాసించే సామిధేను మంత్రాలు తొమ్మది. ప్రకృతి, పురుష, అహంకార, మహాత్తత్త్వ, పంచతన్మాత్రలు తొమ్మిది. వీటి సంయోగం వల్లనే సృష్టి సాగుతున్నది. బృహతీ ఛందుస్సుకు ప్రతిపాదంలోనూ తొమ్మదే అక్షరాలు. గణితశాస్త్రం యావత్తూ తొమ్మది అంకెమీద ఆధారపడి ఉంది. అష్టా: దిక్కులు పది. గర్భంలో జీవుడు పదిమాసాలుంటాడు. రోగి, దరిద్రుడు, శోకార్తుడు, రాజదండితుడు, వృత్తిలో మోసపోయినవాడు, పిచ్చివాడు, కాముకుడు, అసూయాపరుడు, మూర్ఖుడు, మొండివాడు ఈ పదిమందీ నిందార్హులు. గురువు, తండ్రి, పెద్దన్నగారు, ప్రభువు మాతామహి, పితామహులు, మేనమామ, మామగారు, తండ్రిసోదరులు, కుటుంబంలో వృద్ధులు ఈ పదిమంది పూజింపదగినవారు. ప్రాణికి పది దశలు - గర్భవాసం, జననం, బాల్యం, కౌమారం, పౌగండం, కైశోరం, యౌవనం, ప్రౌఢత్వం, వార్ధక్యం, మృత్యువు. వంది: ప్రాణికోటికి ఇంద్రియాలు పదకొండు, విషయాలు పదకొండే, జ్ఞాన, కర్మేంద్రియాలతో మనస్సు కలిసి పదకొండు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు జ్ఞానేంద్రియ విషయాలు. మాట, పని, నడక, మలాదుల విసర్జన, భార్యా సంయోగం ఇవి కర్మేంద్రియాలు చేసే పనులు, వీటి మననం మనస్సు చేసే పని. ఇవి పదకొండు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, హర్ష, శోక, అహంకారాది వికారాలు పదకొండు. మృగ, వ్యాధ, సర్ప, అజైకపాద, అహిర్బుధ్న్య, కపాలి, పినాకి, నిర్భితి, దహిన, స్థాణు, ఈశ్వర – వీరు ఏకాదశ రుద్రులు. అష్టా: పసివాడా, మాసాలు పన్నెండు. జగతీ ఛందస్సుకు అక్షరాలు పన్నెండు. ప్రాకృతయజ్ఞం పన్నెండు రోజులు సాగుతుంది. ఆదిత్యులు పన్నెండుగురు. వంది: తిథులలో త్రయోదశి మంచిది. భూమిమీద పదమూడు ద్వీపాలు ఉన్నాయి అని ఆగిపోయి ఆలోచన ప్రారంభించగా, అష్టా: మహారాజా, మీ విద్వంసుడు శ్లోకం సగం చదవి విరమించాడు. మిగిలినది నేను చెబుతా. కేశిదానవునితో మహావిష్ణువు పదమూడు రోజులు యుద్ధం చేశాడు. వేదంలోని అతిజగతి ఛందస్సు పదమూడక్షరాల పరిమితితో నడుస్తుంది. అనగా, వంది తల వంచేశాడు. నియమానుసారం వంది తనకు తానే నదిలో మునిగిపోయాడు. మనకు ఎంత విద్య ఉన్నా, వయస్సు మీరినా, వివేకాన్ని దిగమ్రింగే అహంకారంతో నడుచుకునే వారు వంది వలనే పసివారి ప్రజ్ఞముందు పతనమయిపోతారు. విద్య వినయాన్ని కలిగించాలికాని గర్వహేతువు కారాదు. (సేకరణ: భారతంలో నీతికథలు, రచన: ఉషశ్రీ; ఈ కథ అరణ్య పర్వంలోనిది)
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. పద్దెనిమిది అక్షోణులసేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. పాండవులయిదుగురు, ఇటు కృష్ణుడు, సాత్యకి మిగిలిలారు. ధర్మరాజుకి పట్టాభిషిక్తుడయ్యాడు. ధర్మజునికి సర్వధర్మ విషయాలు బోధించి, ఉత్తరాయణ పుణ్యకాలంలో అంపశయ్యను వీడి యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు భీష్మపితామహ. ఆత్మయులను కోల్పోయి కలత చెందుతున్న ధర్మరాజుని అశ్వమేథయాగం చేసి ప్రాయశ్చితం చేసుకోమని పండితులు సలహాయిచ్చారు. వారి ఆదేశానుసారం ప్రారంభించిన యాగానికి దేశ,దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు విచ్చేసి యాగాన్ని తిలకించారు. యాగానికి వచ్చిన వారిలో యోగ్యులకు సువర్ణ, రత్న, మణిదానాలతోపాటుగా అందరికి వస్త్రదానంతోపాటు అన్నదానం కూడా జరిగింది. అలా సర్వజనులను సంతృప్తి పర్చిన ధర్మరాజుని చేసి దేవతలు పూలవానలు కురిపించి ఆశీర్వదించారు. అదే సమయంలో యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది. అందరూ యాగశాలలోకి ముంగిస ఎలా వచ్చిందని ఆశ్చర్యపడి చూస్తుండగా, ఆ ముంగిస నవ్వుతూ, ‘దేవతలు ఆనందించే యాగమా ఇది’ అంది. ఆ పలుగులకు అందరూ తెల్లబోయారు. దాని శరీరం ఒక భాగం బంగారు కాంతులీనుతుండగా, మరోవైపు మామూలు చర్మం ఉంది. ‘సక్తుప్రస్థుడి ధర్మ బుద్ధితో పోలిస్తే యీ యాగశాలలో జరిగిన దానం ఏ మాత్రం,’ అంది. అందరూ తెల్లబోయి, ఎవరా మహనీయుడు, ఏమా కథ అన్నారు. అతురతగా ప్రశ్రించిన వారిని చూసి ముంగిస ఇలా చెప్పింది. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాక్రితం సక్తుప్రస్థుడనే పేరు గల గృహస్థు ఉండేవాడు. ఆయనకు ఒకేఒక్క కుమారుడు. ఆయన భార్య, కొడుకు, కోడలుతో కలిసి సర్వభూతకోటిని దయచూస్తూ, కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకొంటుడేవాడు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ, ఎవరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినదాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మమీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వరునికే అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు: వారు తమ పరిసరప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడా రాలిన ధాన్యపుగింజలు ఏరి తెచ్చుకుని, దంచి, పిండిచేసి, వండుకుని నలుగురూ సమంగా పంచుకుని, తినడానికి సిద్ధమవుతుండగా, ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్లులోతుకు పోయాయి. ఎముకలు బయటపడుతున్నాయి. డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి, ఆకలి అని నీరసంగా అడిగాడు. ఆయనను ఆదరంగా తీసుకువచ్చి, ఆర్యా, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి, అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా, మేం తెచ్చుకున్న ధాన్యపుగింజల పిండితో వండిన ఆహారమిది. దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి, అని ఆ గృహస్థు తన భాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి తనకు ఇంకా ఆకలిగా ఉందన్నాడు. ఆ మాట వింటూనే భార్య తన భాగం కూడా ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలి తీరలేదని తెలిసి, కొడుకు, కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయనా మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతోపాటే నీ కుటుంబమంతా తో ఆకలితో ఉన్నా, మీరు తినపోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దానబుద్దిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్ని దారుణాలైనే చేస్తాడు. అటువంటి దశలో మీదానబుద్ది ఎంత గొప్పదో దేవతలు గ్రహిస్తారు. దయగలవారే ఆశలకు దూరం కాగలరు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి యింత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పదికాదు. అటువంటి అన్న దానం చేసిన పుణ్యాత్ములు మీరు అని చెబుతుండగా దేవవిమానం వచ్చి వారందరిని తీసుకుని వెళ్లింది. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్లిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ఆ ప్రక్క పాదతీర్ధం తగిలి నా శరీరంలోని ఆ భాగం బంగారు మయమయింది. దానం అంటే అదే. అనంతరం ఎన్నో, ఎన్నో దాన, ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండి పోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది ముంగిస. (సేకరణ: భారతంలో నీతికథలు, రచన: ఉషశ్రీ; ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.)
‘నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అని ఏనాడో శ్రీశ్రీగారు అన్నారు. ఆ నరజాతి ఘోషను, మహాప్రస్థానాన్ని వెయ్యి పద్యాలలో ఇనుమిండించుకున్న దృశ్య,శ్రవణ కావ్యం శ్రీ గరికపాటి నరసింహరావుగారు రచించిన ‘సాగరఘోష’ పద్యకావ్యం. ఆది శంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో ప్రపంచ దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన దర్శనకావ్యమిది. మొత్తం 1116 పద్యాలతో నిండిన ఈ కావ్యంలో అవతారికలో 36పద్యాలు, ఒక అశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడిని పారవేస్తామా? లేదే? దాచుకుని, దాచుకుని తింటాము. అలాగే వృత్తాలు పాతవే అయినా కొత్త ఇతివృతంతో కొత్త ఆవకాయలా నోరూరిస్తుంది ఈ కావ్యం. ఉ|| వేదము కన్న ముందుగ వివేకము నేర్పును కన్నతల్లి, ఆ పాదము నాకు సర్వ సమభావము. భావము నందు నిల్పె, ఓం నాద శిఖాగ్ర సీమయగు నా జనయిత్రిని గొల్చినంత ఏ భేదము లేమి నిల్చునిక! వేదములౌను సమస్త వేదముల్ అంటూ మాతృదేవతకు అంజలిఘటించి, భారతీయ తత్త్వానికి, ఆథ్యాత్మికతకు మూలస్తంభమైన, ఆ ఆదిశంకరునికే కన్యాదానము జేసెడి ధన్యత చేకూరలేదు, తప్పదు కవితా కన్యాదానము చేసెద, సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే అంటూ తన కావ్యపుత్రికను అంకితమిచ్చే సాహసం చేశాడు కవి. పాఠకుని ఊహలకతీతంగా ఈ కావ్యానికి కవి నాంది పలికాడు. ప్రౌఢవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చుని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉండగా, ఆవును చేరిన లేగదూడ వలే ఒక సుడికూన, ఆ కవి ఒళ్ళో చేరుతుంది. ఆ కూనను చూసి ఒడిలో చేరిన పసిపాపగా భావించి, కవి ప్రేమగా చేరదీసి, లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా తగులుతుంది. ‘పాల మీగడ వలె, దూదిపింజె వలె, స్వచ్ఛంగా ఉండవలసిన నీటి కెరటానివి, ఇలా ఉన్నావేమిటి?’ అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుండి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఈ విధంగా ఉందని ఆ సుడికూన వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే సేదతీరి పయనమవుతానని అర్ధిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే స్వాగత సత్కార్యాలు చేసి, కం: జోజో తరంగ బాలా! జోజో! డిండీర చేల! జో! ఘననీలా! జోజో! మౌక్తిక డోలా! జోజో! మృదుభావలీల! జో! జలకీలా! అంటూ జోలపాడి సేదతీరుస్తాడు. తరంగం మేల్కొన్న తర్వాత అది తాకి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని కవి అర్ధిస్తాడు. కవి హృదయాన్ని ఎరిగిన ఆ తరంగబాల చెప్పిన మానవుని జీవితగాథే సాగర ఘోషై మానవాళిని ఉప్పెనలా ముంచెత్తింది. ఇందులో ప్రతి పద్యము నేటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలకు నిదర్శనము. ప్రత్యక్ష సాక్ష్యము! చూచెడి దెల్లమిథ్య, కనుచూపును మిథ్యయె, నిన్నునీవుగా చూచెడి దాక ఈ జగతి జూచెడి దెల్ల వృథా వృథా వృథా! చూచెడి చూపువెన్కగల చూపును శోధన చేయుమయ్యదే చూచిన నింక లోకమును చూచెడిదేమి? సమస్తమయ్యదే! మానవ జీవన స్రవంతిలో కొట్టుకొనిపోయిన వైశిష్ట్యాలకు, మరుగునపడిన మానవతకు మూగసాక్షి సాగరఘోష. ఆదిశంకరాచర్య, రామానుజాచార్య, మహ్మద్ ప్రవక్త, ఏసుక్రీస్తు, రామకృష్ణ, వివేకానందుడు, రమణ మహర్షి వంటి ప్రవక్తలు, నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య, షేక్స్పయిర్, టాల్ స్టాయి, విశ్వకవి రవీంద్రుడు సాక్ష్యాలుగా నిలువగా నీటి పుట్టుకతో ప్రారంభమై, దశావతారాలు, ప్రాచీన నాగరికత, జైన-బుద్ద మార్గాలు, శైవ-వైష్ణవ తత్త్వాలు, గ్రీకుల నుంచి మొదలై గజనీ-ఘోరీ దండయాత్రలతోపాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, ఫ్రెంచి, రష్యా విప్లవాలు, కమ్యూనిజం, మార్క్సిజం, వైజ్ఞానికావిష్కరణలు, మందుపాతరలు, అణుబాంబులు, అందాలపోటీలు, కాలుష్యాలు, వసుధైక కుటుంబంలో మమేకమై సాగర గర్భంలో మౌనంగా మిళితమైపోయాయి. మానవ పరిణామ క్రమానికేకాదు, కవి హృదయ ఘోష కూడా నిలువుటద్దం ఈ పద్యకావ్యం. పరిణామాలు కాలానుగుణమైనా మితిమీరిన మానవ దృక్ఫథాలను కవి అడుగడునా దుయ్యపట్టి, తనదైన రీతిలో వ్యంగ్య బాణాలు సంధించారు. సాగర ఘోషలోని కవి దార్శించిన జీవన పరిణామాలలో కొన్ని మచ్చుతునకలు. ఆ.వె||వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొంద వచ్చు, సుఖము పొందవచ్చు కాని భూతదయయె లేని భోగమ్ము లందటే కలియుగాంత మనుచు తెలియరేల? తే.గీ|| గుండెలో దూరినట్టి గుండుకాదు పుణ్యభూమికి ఒక రాచపుండుగాని నేలకూలిన వాడొక్క నేతగాడు జాతి కేతనమును నేయు నేతగాడు|| (గాంధీజీ గురించి) చ||మగడు గతించినాడనిన మానిని దుఃఖము పట్టలేము, మీ తెగువ విచిత్రమౌను, వెతతీర్చుటకై పతిపీఠమిచ్చి ఆ మగువను మంత్రి చేయుదురు మానవతా గుణమన్న మీయదే! తగదని పల్కువారెవరు తప్పును నొప్పగు సానుభూతిలో|| (భారతీయ రాజకీయాలపై చురక) కం|| ధరలాకాశము నంటెను సరకులు పాతాళమందు చక్కగ దా ధరకింక భగీరథుడో నరుడో దిగిరావలెగద! న్యాయము చేయన్ సీ|| పూటపూటకు పెక్కుపోటీల పరీక్షల తలనొప్పిచే మను తల్లడిల్ల బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమైదీవ క్రుంగిపోవ కాపీలు సాగించు కన్నబిడ్డలగాంచి కాటుక మొగమొల్ల క్రమ్ముకొనగ పాండిత్యమేలేని పంతులయ్యల చూచి నెరివేణి సవరంపు నీడనిలువ. (విద్యారంగ దుస్థితి) ఉ|| నాటికి నిప్పు విప్లవమె, నాటికి నాటికి వృద్ధిజెంద పై నాటికి చక్రవిప్లవము, నవ్యయుగమ్మున దివ్యమైన కం ప్యూటరు పూర్ణవిప్లవము, మూడును ముఖ్యములైన, వేల వే మాటలు? మానవ ప్రగతి మార్గము నందున మైలురాళ్లివే! (శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి) శా|| మూఢాగ్రేసర చక్రవర్తు లిటలీ ముస్సోలినీ హిట్లరుల్ గాఢద్వేషము చూపగా అమెరికా గత్యంతరాపేక్షతో గూఢత్వంబున మిత్రరాజ్యములతో కూటమ్ముగావించి శం భో! ఢాంఢాం ఢఢఢాం ఢఢాంఢ మణుబాంబుల్ పేల్చె పృథ్వీస్థలిన్|| ఉ|| గుండెకుగుండె చూపగల గుండెలులేక పరోక్షమందు బ్ర హ్మాండము బుగ్గిచేయుటె మహాహవ ధర్మమటన్నచో జగ ద్భాండము వీరిహస్తముల భద్రముగా నెటులుండు? ఇంకనె ట్లుండును చిత్తశాంతి? ఎటులండును గుండెలపైన చేతులున్. (అణుబాంబులపై వ్యథ) ఇలా మొత్తం వెయ్యి పద్యాలు దేనికదే ధీటుగా ఉండిగా, ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నముద్ద ఇస్తే, ఎలా గబుక్కున అంతా నోటిలో పెట్టుకుని తబ్బిబ్బవుతాడో అలాగే సాగరఘోష పద్యాలన్నీ మనని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరగా, కొనమెరుపులా, పాల కొసరులా తెలుగు సంస్కృతిని గురించిన పద్యాలు- చ|| కనగ విచిత్రమయ్యె! వడగట్టిన గంగను బోలు పంచెయున్ కనబడబోదు, పద్యములకట్టలు దాచిన రెండుజేబులన్ ఘనమగు లాల్చిలేదు, కనగా భరతావని కేతనమ్ము పో లిన పొడవైన కండు వరింపదు కంఠము, వాణికన్నులం దున తెలిమోదబిందువలు దూసినహారము కానరాదు, నే ననుటయుకాదు కాని తగునా! కవిగారికి మ్లేచ్ఛవేషముల్. ఉ|| భాషయు దూరమయ్యె, పరభాషయె మీప్రియభామయయ్యె, ఇం గ్లీషును మాధ్యమంబుగ వరించిరి, అద్దియటుండనిండు, సం భాషణకైన చెల్లదొకొ! పద్య మనోహరమైన భాష, స్వ ర్భాషకు తుల్యభాష, పదబంధ సుగంధమయాంధ్ర భాషయే. సీ|| భాషయా తెలుగన్న! భావనాంభోధిలో బంగారు నోడలో పయనమౌను భావమా తెలుగన్న! భాషావధూటికి పాదార్చనము చేయు పద్మమగును పద్యమా తెలుగన్న! పట్టాభిషిక్తులౌ తెలుగు మారాజుల తేజమగును వచనమా తెలుగున్న! బండరాళ్లనునైన చెమ్మ పుట్టించెడి సేద్యమగును. గీ|| అట్టిమీభాష హృదయమ్ము పట్టుకొనుడు వట్టి పరభాషపై మోజు వదలుకొనుడు మమ్మిడాడీల మాటలు మానుడింక అమ్మనాన్నల అనురాగమందు డింక|| సౌమ్యశ్రీ రాళ్లభండి
చాలా రోజుల క్రితం, అగస్తుడ్యనే పేరుగల బ్రహ్మచారి ఉండేవారు. ఆయన త్రీవ నిష్థతో తపస్సు చేస్తూ, సర్వ ప్రాణి కోటినీ దయా హృదయంతో చేసే వాడు. ఆయన తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుచుండగా వాని పితృ పితామహులు కన్పించి, ‘నాయనా, యోగ్యురాలైన కన్యను వివాహం చేసుకొని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు’ అన్నారు. కులవృద్ధుల మాట శిరసావహించి అగస్త్యుడు తనకు తగిన భార్యను అన్వేషిస్తూ విదర్భదేశానికి చేరుకుని, నిర్మల సరోవరంలోని నల్లకలువ వలె పెరుగుతున్న రాజుగారి కుమార్తె, లావణ్యవతైన లోపాముద్రను చూశాడు. అందచందాలలోనే కాక, వినయగుణ శీలాలో కూడా ఆమె యోగ్యురాలని గ్రహించాడు. ఆ మహారాజు అగస్త్య మహర్షి రాగానే ఆయనకు స్వాగతం పలికి, అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. వారి పరిచర్యలకు సంతసించి ఆ మునివరుడు ‘మహారాజా మా వంశాన్ని ఉద్దరించే ఉత్తమ సంతానం కోసం నీ కుమార్తెను భార్యగా కోరుతున్నాను’ అన్నాడు. ఆ మాటవినగానే, చీని చీనాంబరాలతో మణిరత్న భూషణాలతో, హంసతూలికా తల్పాల మీద రాజభవనంలో వందలాది దాసీజనాల సేవలందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవించవల్సిన కూతురు నారచీరలు కట్టి, వనవాసం చేస్తూ, కందమూలలా భక్షిస్తూ, పర్ణకుటీరాలలో జీవించగలదా అని ఆ మహారాజు, మహారాణి ఆందోళనతో విచార సాగరంలో మునిగారు. అంత లోపాముద్ర చిరునవ్వుతో తండ్రిని సమీపించి, నేను సంతోషంగా ఆ మునీశ్వరుని భార్యగా, ఆయనకు సేవలు చేసి అనుగ్రహం పొందగలనని, విచారించవలదని చెప్పింది. పిదప ఆ మునిచంద్రుని పరిణయమాడి, ఆయన వెంట అరణ్యానికి వచ్చి నిరంతరం పతిసేవలో ఆయన హృదయాన్ని చూరగొంది. అయినా ఆయన తన ఋషిధర్మాన్ని విడువకుండా వేదవిహిత కర్మలే కొనసాగిస్తుండగా కొంతకాలం గడిచింది. ఒకనాడు లోపాముద్ర ఋతుస్నానం చేసి సర్వాంగ శోభతో ఆశ్రమ ప్రాంగణంలో నడయాడుచుండ చూసి, దగ్గరకు చేరబోయిన మహర్షిని చూసి, స్వామి ఆశ్రమ ధర్మానుసారం మనం ఈ పటకుటీరంలో దర్భ శయ్యలపై జీవితం గడుపుతున్నాం. సంసార జీవితంలోకి అడుగుపెట్టాలంటే మా తండ్రిగారింట ఉన్న భోగభాగ్యాలు సమకూర్చండని కోరింది. సంసార సుఖం కొరకు తన తపశ్శక్తిని వినియోగించటం ఇష్టంలేక రాజాశ్రయం కోరటం ఉత్తమమని ముగ్గురు రాజులను దర్శించాడు. వారందరు ఇల్వలుడనే రాజు సిరిసంపదలు కలవాడని ఆయనను కోరవల్సిందిగా సూచించారు. ఈ ఇల్వలుడు వాతాపి సోదరుడు. వారిద్దరు అరణ్య దారిని వచ్చేవారిని భోజనానికి పిలుస్తూ, వారు రాగానే వాతాపి మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ మేకను చంపి వారికి వండి పెట్టేవాడు. వారు హాయిగా భుజించాక సోదరా వాతాపి అని పిలిచేవాడు. వెంటనే వాతాపి పొట్టను చీల్చుకుని బయటపడగానే అన్నదమ్ములిద్దరు ఆ అతిధిని వండుకుని తినటం వారి నిత్యకృత్యం. అగస్త్యుడు రాజులు వెంటరాగా ఇల్యలుని వద్దకు వెళ్లాడు. అంత యాధావిధిగా మేకను వండి పెట్టబోగా రాజులు భయంతో వెనక్కి తగ్గారు. అగస్త్యుడు వారికి అభయమిచ్చి వండినదంతా తనకు పెట్టమని తృప్తిగా భుజించాడు. సరిగ్గా అదే సమయంలో ఇల్వలుడు సోదరా వాతాపి అని పిలిచాడు. ఇంకెక్కడ వాతాపి, ఇక రాడని మహర్షి బదులివ్వటంతో భయపడి, తన సర్వసంపదలు తమకు ఇస్తానని, మణిరత్న సువర్ణరాసులను ఆయనకు సమర్పించి, అదును చూసుకొని సంహరించపోగా, మహర్షి ఒక్కసారిగా హూకరించటంతో ఇల్వలుని శరీరం గుప్పెడు బూడిదయ్యింది. పిదప సంపదతో ఆశ్రమానికి తిరిగి వచ్చి, ధర్మాచారిణీ, లోకంలో అందరిలా ఉండే పుత్రులు అసంఖ్యాకులు కావాలా? గుణశీలవంతుడయిన ఒక్క కుమారుడు కావాలా? అని ప్రశ్నించాడు. అంత ఆమె గుణవంతుడైన ఒక్క కుమారుడు చాలని సమాధానమిచ్చింది. అనంతరం వారికి దృఢదన్యుడనే మహాతపస్వి ప్రభవించాడు. వాతాపి జీర్ణం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే నానుడి ఈ కథ వల్లే పుట్టింది. ఇది భోజనానంతరం ఉచ్ఛరిస్తే తిన్నది బాగా జీర్ణిస్తుందని ఒక నమ్మకం. (సేకరణ: భారతంలో నీతికథలు, రచన: ఉషశ్రీ; ఈ కథ అరణ్య పర్వంలోనిది)
మూలకథ రచన: ఓ. హెన్రీ దృఢంగా ఉన్న ఒక పోలీసు అధికారి వీధుల్లో గస్తీకాస్తూ తిరుగుతున్నాడు. జనసంచారం పలచగా ఉన్న ఆ వీధిలో పోలీసుని గమనించేవారిని వేళ్ల మీద లెక్కపెట్టుకొవచ్చు. రాత్రి పది కావస్తోంది. సన్నని జల్లు, గాలితో వాతావరణం చలి పుట్టిస్తోంది. ప్రశాంతంగా ఉన్న ఆ వీధిలో నెమ్మదిగా నడస్తూ దుకాణాల తలుపులన్ని మూసున్నాయో లేదో గమనిస్తూ ఆ అధికారి కదలుతున్నాడు. మధ్య, మధ్యలో వీధిని ఆ చివరనుంచి ఈ చివరి వరకు పరికిస్తూ అంతా సజావుగా ఉందో లేదో క్రీగంట గమనిస్తున్నాడు. ఈ ప్రాంతంలో జనాలు పెందరాళే ఇళ్లకు వెళ్లతారు. ఎక్కడో ఒకటో, రెండో దుకాణాల్లో, చిన్న హోటలులో దీపాలు వెలుగుటం తప్పితే అంతా నిర్మనుస్యంగా ఉంటుంది. అకస్మాత్తుగా పోలీసు దృష్టి ఒక దుకాణం దగ్గర నిల్చున్న వ్యక్తిపై పడింది. నెమ్మదిగా అతని వైపు అడుగులు వేశాడు. పోలీసు తన వైపు రావటం చూసి ఆ అజ్ఞాత వ్యక్తి, ‘ఇక్కడంతా సజావుగానే ఉంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు ఆఫీసర్. నేను నా చిరకాల మిత్రుని కొరకు వేచిచూస్తున్నాను. ఇరవైఏళ్ల తర్వాత ఇక్కడ, ఈ రాత్రి కల్సుకోవాలని మేము అనుకున్నాం. వినడానికి ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా. ఇది నిజం’ అని చెప్పాడు. అంతేకాక, ఇరవై సంవత్సరాల క్రితం ఈ దుకాణం స్థానే బిగ్ జో బ్రాడీ అనే రెస్టారెంట్ ఉండేది అన్నాడు. ‘అవును ఐదు సంవత్సారల క్రితం వరకు కూడా ఆ రెస్టారెంట్ ఉండేద’ని పోలీసు అధికారి బదులిచ్చాడు. బల్లపరుపు ముఖము, కుడికంటి దగ్గర చిన్న తెల్లని మచ్చతో ఆ అజ్ఞాత వ్యక్తి కళ్లలో ఏదో తెలియని మెరుపు. ఇరవై సంవత్సరాల క్రితం ఇదే రెస్టారెంట్ లో జిమ్మి విల్స్ తో కలసి భోజనం చేశాను. నాకు అతను ప్రాణస్నేహితుడు, ప్రపంచంలోనే అతి మంచివ్యక్తి అని అడగకుండానే వివరించాడు. మేమిద్దరం ఈ న్యూయార్క్ మహానగరంలో అన్నదమ్ముల్లా కలిసి, మెలిసి పెరిగాము. అప్పుడు నాకు 18, విల్స్ కి 20 సంవత్సారాలుంటాయి. నేను జీవితంలో ఏదో సాధించాలని, గొప్పవాణ్ణికావాలన్న ఆకాంక్షతో ఉద్యోగ వెతుకులాటలో ఈ నగరం విడ్చి వెళ్లాను. కాని విల్స్ కు మాత్రం న్యూయార్కే సర్వస్వం, దాంతో ఇక్కడే ఉండి పోయాడు అని తన కథంతా చెప్పుకొచ్చాడు ఆ అజ్ఞాత వ్యక్తి. ‘ఇరవై సంవత్సరాల సుదీర్ఘప్రయాణం తర్వాత మేము, మా జీవితాల్లో సాధించాలనుకున్నది సాధించగలమని, మాకంటూ ఒక ఉనికి, వ్యక్తిత్వం అప్పటికి ఏర్పడగలవని భావించాము. అందుకే ఇక్కడే, ఇదే ప్రదేశంలో ఇరవై ఏళ్ల తర్వాత కల్సుకోవాలని నిర్ణయించుకున్నాం.’ అన్నాడా ఆజ్ఞాత వ్యక్తి. ‘వినడానికి ఏదో కాశీమజలీ కథలా ఉంది. ఈ ఇరవైఏళ్లలో నీ స్నేహితుని కలవడంగాని, మాట్లాడటం గాని చేయలేదా’ సంభమాశ్చర్యంతో ప్రశ్నించాడు పోలీసు అధికారి. ‘ఒకటి, రెండు సంవత్సరాలు ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. కాని క్రమంగా అవి తగ్గిపోయాయి. నా జీవిత గమనంలో ఎక్కడెక్కడో ప్రయాణించాను. కాని ఏ మాత్రం వీలున్నా, నా స్నేహితుడు జీవించి ఉంటే తప్పకుండా తన మాట నిలబెట్టుకుంటాడు.ఈ రోజు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. చాలా దూరం నుంచి నేను వ్యయప్రయాసలకు ఓడ్చి ఇక్కడికి వచ్చాడను. నా స్నేహితుడు నన్ను నిరాశపర్చడని’ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ అజ్ఞాత వ్యక్తి సమాధానమిచ్చాడు. ఇంతలో తన జేబులోంచి వజ్రాలు పొదిగిన గడియారం బయటకు తీసి పదికావడానికి ఇంకా మూడు నిమిషాలు ఉందని తనలో తాను అనుకుని బయటకి మాత్రం మేము విడిపోయినప్పుడు సమయం సరిగ్గా రాత్రి పది గంటలు అన్నాడు. ఆ వ్యక్తి వేషధారణ, ఖరీదైన గడియారం గమనించిన పోలీసు అధికారి, నీవు జీవితంలో అనుకున్నది సాధించినట్టున్నావన్నాడు. ‘అందులో అనుమానమేలేదు. జిమ్మి కూడా తన ప్రయత్నాల్లో విజయం సాధించుంటాడని నా ఆశ. న్యూయార్క్ అప్పటికి, ఇప్పటికి ఏమీ మారలేదు. కానీ నేను మాత్రం బయట ప్రపంచంలోకి వెళ్లి ఎంతో కష్టపడ్డాను, నేర్చుకున్నాని’ గర్వంతో కూడిన ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చాడు. ఆ అజ్ఞాత వ్యక్తి మాటలు వింటూ వెళ్లిపోవడానికి రెండడుగులు ముందుకు వేసిన పోలీసు అధికారి ఆగి వెనక్కి చూసి ‘నీ విశ్వాసం నిజంకావాలని, నీ స్నేహితుడు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక వేళ అతను రాకపోతే ఏం చేస్తావు, వెళ్లిపోతావా’ అని ప్రశ్నించాడు. ‘లేదు. తప్పకుండా వస్తాడు. కనీసం ఒక గంటైన ఎదురుచూస్తాను. గుడ్ నైట్ ఆఫీసర్’ అన్నాడు. అతనికి వీడ్కోలు చెప్పి తన దారిన తాను వెళ్లిపోయాడు పోలీసు అధికారి. చల్లని జడివాన వేగాన్ని పుంజుకుంటోంది. వాన పెరగకముందే ఇళ్లకి చేరుకోవాలని ఆ వీధిలో మిగిలిన ఒకరో, ఇద్దరూ పరుగులుపెడుతున్నా. స్నేహితుడొస్తాడన్న ఆశతో ఆ అజ్ఞాత వ్యక్తి మాత్రం ఎదురు చూపులు చూస్తూ ఆ వానలో ఆ దుకాణం ముందు అలానే నిల్చుని ఉన్నాడు. సమయం భారంగా గడుస్తోంది. ఇరవై నిమిషాల తర్వాత పైనుంచి కిందవరకున్న కోట్ ధరించి ఒక పొడవాటి వ్యక్తి, ఆ అజ్ఞాతవ్యక్తి వైపు వేగంగా వచ్చాడు. వస్తూనే ‘అది నువ్వేనా, బాబ్’ అని ఆత్రుతగా ప్రశ్నించాడు. ‘నువ్వు జిమ్మి విల్స్’ ఆజ్ఞాత వ్యక్తి ఒక్కసారిగా అరిచాడు. ఆ పొడవాటి వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి చేయిపట్టకుని కుదుపుతూ, ‘నాకు తెలుసు. నువ్వు బాబ్ వేనని, నువ్వు తప్పక వస్తావని. సుదీర్ఘమైన ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ పాత రెస్టారెంట్ లేదు. ఉంటే ఇక్కడ తప్పకుండా మరోసారి నీతో కల్సి విందు చేసేవాడిని. నీవు అనుకున్నది సాధించావా అంటూ,’ ఊపిరి సలపకుండా ప్రశ్నల వర్షం కురిపించటం మొదలుబెట్టాడు. నేనెలా ఉన్నా, నువ్వుమాత్రం చాలా మారిపోయావు. నీవు ఇంత పొడుగున్నట్టు లేదు. నువ్వెలా ఉన్నావు జిమ్మి అని ఆప్యాయంగా పలకరించాడు అజ్ఞాత వ్యక్తి. నేను బావున్నాను. మనం చాలా మాట్లాడుకోవాలి. పద ఇక్కడి నుంచి ముందర అని అతని చేయిపట్టుకుని జిమ్మి ముందుకు కదిలాడు. పాతిక సంవత్సరాలలో తాను సాధించిన విజయాలను అజ్ఞాతవ్యక్తి ఏకరువు పెడుతుంటే, నెమ్మదిగా చీకటిలోంచి వీధిదీపం వెలుగులోకి వచ్చిన స్నేహితులిద్దరు ఒకరినొకరు ఏరిపార చూసుకున్నారు. అకస్మాత్తుగా ఆ అజ్ఞాత వ్యక్తి నువ్వు జిమ్మి విల్స్ కాదు. ఇరవై సంవత్సరాలు చాలా కాలమే కావచ్చు, నిన్ను పోల్చుకోలేనంత సమయం కాదని నిలదీశాడు. ‘కాలం మనిషిని మంచివాడి నుంచి చెడ్డవాడిగా మర్చేస్తుంది. నీవు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నావు బాబ్. చికాగో పోలీసులు నువ్వు న్యూయార్క్ రావచ్చని హెచ్చరించారు. నువ్వు మారుమాట్లాడకుండా, నాతో వస్తే నీకే మంచిద’ని బదులిచ్చాడు ఆ పొడవాటి వ్యక్తి. అలా అంటూనే జేబులోంచి ఒక కాగితం తీసి ముందు ఇది చదువు. ఇది పోలీసు ఆఫీసర్ జిమ్మి విల్స్ నీకిమన్నాడని, మడచిన కాగితాన్ని అజ్ఞాతవ్యక్తి చేతిలో ఉంచాడు. అంతా అయోమయంగా ఉండటంతో, నెమ్మదిగా, వణుకుతున్న చేతులతో కాగితాన్ని విప్పి చదవటం ప్రారంభించాడు బాబ్. ‘బాబ్. మనమనుకున్న స్థలానికి నేను వచ్చాను. నీలో చికాగో పోలీసులు వెతుకున్న వ్యక్తి పోలికలు గమనించాను. నా చేతులతో నేను నిన్ను అరెస్టు చేయలేక, ఆ పని చేయడానికి మరో అధికారిని పంపించాను.’ జిమ్మి. మూలకథ: ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అనువాదం: సౌమ్యశ్రీ రాళ్లభండి
నాతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ అని బడాయికోరు కబుర్లు చెపుతూ, అందరినీ బురిడి కొట్టించి, చివరకు డామిట్‌! కథ అడ్డంగా తిరిగిందని మొహం చాటేసే దొంగ పెద్దమనుష్యులకు నిలువుటద్దం గిరీశం. మన వాళ్లుత్త వెధవాయిలోయ్ అంటూ స్వప్రయాజనాల కోసం ఇతరులను మోసపుచ్చి పబ్బంగడుపుకునే ఘరానా మనుష్యులకు ప్రతీక గిరీశం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్టు, వేడకునో, బ్రతిమాలో, నవ్వించో, ఏడ్పించో సామ, దాన, భేద, దండోపాయాలుపయోగించి ఇతరులను లొంగపర్చుకునే లౌక్యుడు గిరీశం. గురజాడ అప్పారావు ఏ ప్రయోజనాన్ని ఆశించి కన్యాశుల్కం నాటకంలో ఈ పాత్రకు రూపకల్పన చేశాడో కానీ, ఇలాంటి మనష్యులు నేటి సమాజంలో కన్పిస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు. గిరీశం గురజాడ సృష్టించిన హాస్య పాత్ర అంటే అందరూ ఒప్పుకోక పోవచ్చు. ప్రముఖ విమర్శకుడు ఆర్.ఎస్. సుదర్శనం మాటల్లో చెప్పాలంటే, “గిరీశం పాత్రలో హాస్య రసానుభూతి పొందాలంటే నీతి అనే కొలబద్దను తాత్కాలికం గా నైనా పక్కకు పెట్టాల్సిందే. అప్పుడే గిరీశం మాటలు, సమయస్ఫూర్తి, మనకు ఆహ్లాదం కలిగిస్తాయి.” పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకోవాలన్ని ఉబలాటపడే నాటి, నేటి యువకులకు అతను ప్రతీక. అతనికి ఆర్ధిక స్తోమత లేదు. ఏది సంపాదిన్చాలన్నా అడ్డదారే గతి అనుకొన్నాడు. జీవనాధారంలేని గిరీశం మాటలతో మనుష్యులను మోసం చేయటం బాగా నేర్చుకున్నాడు. ఎదుటి వాడిని మాటలతో బురిడీ కొట్టించే వాక్చాతుర్యం వుంది. అందుకే “నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్” అన్నాడు అంత ధైర్యంగా. అనుకూల, ప్రతికూల పరిస్థితులను తనకు అనువుగా మలుచుకోగల నేర్పరి గిరీశం. ఇక గిరీశం పుట్టుపూర్వోత్తరాలకు వస్తే, ఈయన స్వగ్రామం కాకినాడ. ఈయన ఎక్కడ పుట్టినా, రామచంద్రాపురం అగ్రహారంలో పింతల్లిగారి వద్ద పెరిగాడు. గిరీశం ఆంగ్లభాషను ఔపోశన పట్టినట్టు బడాయిలు పలికినా, చిన్నతనంలో మాత్రం వేదాలు, ఉపనిషత్తులు పుక్కిటపట్టారు. ఇక ఈయన వేషభాషలంటారా, తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి పంచెకట్టు. అంతే తెల్లదనంతో మెరిసిపోయే పొడుగుచేతల షర్టు. విలాసంగా నిలబడుతూ చుట్ట కాల్చడం అతగాడి మార్కు. ఇక భాష విషయాని కొస్తే, ఆయన వాడిన కొన్ని మాటలు నేటికి ఆంధ్రుల నోటిలో నానుతైనే ఉన్నాయి. ఉదాహరణకు, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఈయనగారు ధూమపానము గురించి చెప్పిన పద్యమైతే, పొగరాయుళ్లందరికీ ఆదర్శం... కం. ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగచెట్టై జన్మించెను పొగత్రాగని వాడు దున్నపోతై బుట్టున్. లోకంలోని ఉత్తముల పేర్లూ, చిక్కు లెక్కలు, చిక్కని కవిత్వం, కొంచెం హిస్టరీ, కాస్త జాగర్ఫీ- ఇవన్నీ తన అవకాశవాద ప్రయాసలో వాడుకుంటాడు గిరీశం. క్లుప్తంగా చెప్పాలంటే .. కొంచెం శకారుడు, కొంచెం ఫాల్‌స్టాఫ్‌, కొంత ఉత్తర కుమార ప్రగల్భాలు అన్నీ కలగలిస్తే ఒక గిరీశం. సౌమ్యశ్రీ రాళ్లభండి