సంగీతం

సంగీతం

మన తెలుగులో తొలి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెందిన అన్నమయ్య నందవరవైదిక బ్రాహ్మణ వంశమున నేటి కడప జిల్లా రాజంపేట తాలుకాలోని తాళ్లపాక గ్రామమంలో వైశాఖశుద్ధ పౌర్ణమినాడు (మే 9, 1408) జన్మించాడు. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. భారద్వజ గోత్రుడైన అన్నమయ్య తండ్రి పేరు నారాయణసూరి మహాపండితుడు, తల్లి లక్కమాంబ, సంగీత కళానిధి. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి. అయితే, "అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన ‘నందకం’ అంశతో అన్నమయ్య జన్మించాడని ప్రతీతి. కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడు. తెలుగునాట పదకవితకు, భజన సాంప్రదాయానికి ఆద్యుడైన అన్నమయ్య దాదాపు 32వేల సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యంతోపాటుగా తెలుగు సంస్కృతికి ఆలవాలమైన తుమ్మెద, గొబ్బిపాటలు, ఉగ్గుపాటలు, సువ్విపాటలు, జోలపాటు మిళితమై ఉంటాయి. తిరుమల పయనం: తన ఎనిమిదవ ఏట గడ్డికోస్తుండగా దూరంగా గోవిందనామం చేస్తూ యాత్రికుల బృందం వెడుతూ కన్పించింది. వెంటనే ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి కాలినడకన తిరుపతికి బయలుదేరి వెళ్లాడు. చిన్నతనం వల్ల అజ్ఞానంతో పాదరక్షలతో కొండ ఎక్క ప్రయత్నించిన అన్నమయ్య కొండ ఎక్కలేక ఆకలితో అలసిసొలసి పడిపోయాడు. అంత అలివేలుమంగ అన్నమయ్య వద్దకు వచ్చి కర్తవ్యభోద చేసి స్వామివారి ప్రసాదాన్ని అందించింది. వెంటనే అన్నమయ్య అమ్మవారిని కీర్తిస్తూ, ఉ|| చొచ్చితి దల్లి నీ మఱుగు సొంపుగ నీ కరుణాకటాక్ష మె ట్లిచ్చెదొ నాకు నేడు పరమేశ్వరి యో యలవేలుమంగ నీ మచ్చిక నంచు నీ తరుణిమన్నన నే నినుగంటి నీకు నా బచ్చెనమాట లేమిటికి బ్రాతివి చూడగ వేంకటేశ్వరా! ఉ|| అమ్మకు దాళ్లపాకఘను డన్నడు పద్యశతంబు జెప్పె గో కొమ్మని వాక్ర్ఫసూనముల గూరిమితో నలవేలుమంగకు నెమ్మది నీవు చేకొని యనేక యుగంబులు బ్రహ్మకల్పముల్ సమ్మద మంది వర్ధిలుము జవ్వనలీలలు వేంకటేశ్వరా! అలివేలుమంగ శతకాన్ని ఆలపించాడు. పద్యాంతంలో వేంకటశ్వరా అని సంబోధించినప్పటికీ, ప్రతి పద్యము అలవేలుమంగను ప్రస్తుతించినదే. అమ్మకు అలమేల్మంగకు పద్యశతకము చెప్పానని తెలిపినందున ఇది అలవేల్మంగాంబికాస్తుతి శతకంగా భావిస్తారు. తిరుమల దర్శనం: కొండనెక్కిన అన్నమయ్య ‘దేవునికి దేనికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు మొక్కులు లోకపావని నీ కమ్మా’ అంటూ, స్వామి పుష్కరిణిని దర్శించి అందు స్నానమాచరించాడు. అటుపై పెద్ద గోపురమును, నీడతిరుగనిచింతచెట్టును, గరుడగంభమును, చంపక ప్రదక్షిణమును, దివ్యప్రసాదములొసగు ప్రదేశములను, అక్కడి ప్రసాదములను, నడగోపురమున శ్రీనివాసుని భాష్యకారులను, నరసింహుని, జనార్ధనుని, అలమేలుమంగను, యాగశాలను, ఆనందనిలయమును, కళ్యాణమంటపమును, బంగారుగరుడుని, శేషుని, పునుగుచుట్టలను కాచి తైలము వడియగార్చు ప్రదేశమును, స్వామిని స్తుతించు చిలుకల పంజరములను, శ్రీ భాండారాములను, బంగారు గాదెలను, బంగారు వాకిటిని దర్శించి, స్తుతించి, ‘‘కంటి నఖిలాండకర్త నధికునిగంటి’’ అంటూ, ‘పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్య కోనేటిరాయడా‘ అని వేంకటేశ్వరుని దర్శించుకున్నాడు. తిరుమలగిరివాసుని దర్శించడానికి వెళ్లేముందు అన్నమయ్య పైన ఉదహరించిన స్థలాలను దర్శించాడనడానికి నిదర్శనమైన స్వామిదర్శన వర్ణన.... ‘‘ఆవరణంబుల కాదియై మిగుల గొమరారు వైకుంఠగోపురంబునకు బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంత జనుదెంచి గారుడ స్తంభంబు చక్కి వినుతుడై చెంత గ్రొవ్విరిసాల కేగి వలనోప్పు చంపకావరణంబు వేగ వలచుట్టి వచ్చి యా స్వామిపుష్కరిణి తోయంబు లాని యుత్తుంగభాగమున నా యహికులపతి యవతారమగుచు దిరుగని చింతలం దెఱలించు నీడ దిరుగని చింత కెంతే భక్తి మ్రొక్కి రమణ రెండవ గోపురము దాటి లోని కమల మహాసాగార సేవించి నెలకొని యానందనిలయాఖ్య మగుచు నలువొందు మణివిమానంబు సేవించి పటుమహామణిమంటపంబు సేవించి యట వచ్చి తురగతార్ క్ష్యాహినాయకుల సేవించి దనుజేరి సేనానాథు సేవించి నిత్యుల సేవించి కూర్మి నావేళ లోనికి నరుదెంచి యచటి....’’ ఇలా వేంకటేశ్వరుని దర్శించడానికి వెళ్లేదారిలో ఎదురయ్యే ప్రతీదానిని వర్ణిస్తూ మణిమయంబగు కిరీటంబు గలుగు శ్రీవేంకటగ్రావాధినాథుని దర్శించినట్టు చెప్పబడి ఉంది. ఈ సందర్భంలో అన్నమయ్య పాడిన సంకీర్తనలు ---- ‘సేవించి చేకొన్న వారి చేతిభాగ్యము, వేవేగ రారో రక్షించీ విష్ణుడీడను’ ‘నీవేకా చెప్పజూప నీవే నీవేకా, శ్రీవిభుప్రతినిధివి సేవమొదలారి’ ‘మొక్కరో మొక్కరో వాడె ముందర నిలుచున్నాడు, యెక్కువ రామునిబంటు యేకాంగవీరుడు’ ‘ఏ పొద్దు చూచిన దేవుడిట్లానే యారగించు, రూపులతో బదివేలు రుచురై నట్లుండెను’ ‘కంటిగంటి నిలువుచుక్కనిమేను దండలును, నంటుజూపులను జూచే నవ్వుమోముదేవుని’ అన్నమయ్యకు 16వ ఏట స్వామి ప్రత్యక్షమైనట్టు రాగిరేకులలో పొందుపర్చబడి ఉంది. స్వామి తనకు బాల్యంలో దర్శనమిచ్చినట్టు అన్నమయ్య ‘ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు, నప్పుడగు తిరువేంకటాద్రీశుగంటి’ అనే సంకీర్తనలో చెప్పుకున్నాడు. నాటినుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తనలు రచించాలని అన్నమయ్య వత్రంపూని చివరి వరకు కొనసాగించాడు. తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు. గృహస్థాశ్రమం: తిరుమలలో అన్నమయ్య ఉన్నాడని తెలుసుకొని అతని తల్లితండ్రులు వచ్చి అన్నమయ్యను స్వామి పూజకు లోటురాదని తమతో స్వగ్రామానికి రమ్మని కోరారు. అయితే అందుకు మొదట అంగీకరించనకసోయినా, గురువాజ్ఞ మేరకు స్వగ్రామం చేరుకుంటాడు. ఈ సందర్భంగా అన్నమయ్య ఆలపించిన సంకీర్తనలు అన్నమాచార్య చరిత్రలో చిన్నన్న పేర్కొన్నాడు. ‘సర్వోపాయముల జగతి నాకితడే, పుర్వీధరుడు పురుషోత్తముండితడే’ ‘పాడేము నేము పరమాత్మ నిన్నును, వేడుక ముప్పదిరెండువేళల రాగాలను’ ‘దాచుకో నీ పాదాలకు దగనే జేసిన పూజలివి, పూచి నీ కీరితి రూపపుష్పము లివియయ్యా’ ‘ఏలికవు నీవట యింకా దైన్యమేల, తాలిమి నీచేతలకు దగవు గాదనరా’. తదనతరం అన్నమయ్య తిరుమలమ్మ, అక్కలమ్మలను వివాహమాడాడు. అన్నమయ్య భార్య తిరుమలమ్మే తిమ్మక్క. ఈమె ‘సుభద్రా కళ్యాణా’న్ని రచించింది. తాళ్లపాకలో, తిరుమలమీద, అహోబిలమున, ఇంకా అనేక పుణ్యస్థలముల వర్తించుచు, గార్హస్థ్య మనుభవించుచు నవయవ్వనంలోనున్న అన్నమయ్య అనేక శృంగారసంకీర్తనలను ఈ కాలంలో రచించాడు. అన్నమయ్య ప్రథమ భార్యయగు తిరుమలమ్మకు నరసింగన్న, నరసయ్య, నరసింహాచార్యుడు అని పిలవబడిన గొప్పకవీశ్వరుడైన కొడుకుగలడు. ఇక అన్నమయ్య రెండవ భార్యయగు అక్కమ్మ కుమారుడు పెదతిరుమలయ్య. ఇతని కుమారుడే చినతిరువేంగళనాథ లేక చిన్నన్న. చిన్నన్న ‘అన్నమాచార్యచరిత్రము’ అను ద్విపదను రచించాడు. దీని ఆధారంగానే మనకు అన్నమయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి. అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్ధయాత్రలు చేశాడు. ఈ సందర్భంగా అనేక పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ అహోబిలం చేరుకున్నాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. తర్వాత కొద్దికాలం సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీ కృష్ణదేవరాయలుకు తాత) ఆస్థానం చేరుకున్నాడు. అయితే సాళ్వరాయునిపై సంకీర్తన చేయడానికి నిరాకరించటంతో రాజప్రాపకం కోల్పోయాడు. ఈ సందర్భంలోనే అన్నమయ్యను సంకెళ్లతో బంధించగా ‘సంకెల లిడువేళ జంపెడు వేళ, నంకిలి రుణదాత లాగెడువేళ’ అనే సంకీర్తన ఆలపించి సంకెల వదిలించుకున్నాడని ప్రతీతి. ఈ సందర్భంలోనే ‘ఆకటివేళల నలపైన వేళలను, వేకువ హరినామమే దిక్కు మఱిలేదు’, ‘నీ దాసుల భంగములు నీవు చూతురా’, ‘దాసవర్గముల కెల్ల దరిదాపు మీరె కాన’ వంటి సంకీర్తనలు అన్నమయ్య రచించాడు. రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" అని బిరుదాంకితుడైన అన్నమయ్యకు 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తోంది. సౌమ్యశ్రీ రాళ్లభండి
మాయామాళవగౌళ రాగం 3వ అగ్నిచక్రంలో 3వ రాగం. ఫూర్వం దీనిని మాళవగౌళ రాగం అని పిలిచేవారు. కటపయాది సంఖ్య విధానానికి అనువయించడం కోసం ఈ రాగానికి మాయా అనే పదాన్ని చేర్చారు. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం (స,రి,గ.మ,ప,ద,ని,స / S R1 G3 M1 P D1 N3 S). ఇది నిర్ధుష్ట రూపం కలిగిన సంపూర్ణ రాగం. అచల స్వరములు, కంపిత స్వరములు కల్గిన రాగం. శాంతి, భక్తి, కరుణ రసాలను పలికించడానికి ఈ రాగం ఉపయుక్తం. అన్నివేళలా పాడుకోవడానికి అనువైనది. ఈ రాగానికి హిందుస్థానీ సంగీతంలో సమానమైన రాగం భైరవ్. ఈ రాగంలో స్వరములు వరస క్రమంలో అనగా సరి, గమ, పద, నిస, కలిగి పూర్వాంగ, ఉత్తరాంగములకు సరియైనసంపూర్ణమైన జవాబు (symmetry) గలదు. అందువల్ల ఈ రాగంలో పాడడం సులభంగా ఉంటుంది. కర్ణాటక పితామహుడు పురుందరదాసు ఈ రాగంలో సరళీవరుసలు, జంట వరుసలు, అలంకారాలను రచించటంతోపాటు, ఈ రాగం జన్య రాగమైన మలహరిలో పిళ్ళారి గీతాలను రచించి తమ శిష్యులకు శిక్షణనిచ్చి బహుళ ప్రచారం చేశారు. ఈ రాగానికి సంవాదాలు, జన్యరాగాలు ఎక్కువ. ఇది మూర్ఛన కారక మేళం. అందవల్ల గ్రహ భేదానికి అనువైనది. మాయామాళవగౌళ రాగంలో రిషభాన్ని గ్రహంచేస్తే 72వ మేళకర్త రసికప్రియ, మధ్యమం గ్రహంచేస్తే 57వ మేళకర్త సింహేంద్రమధ్యమం వస్తాయి. ఈ రాగం నుంచి వెలువడ్డ జన్యరాగాలు అనేకం. అందులో ప్రసిద్ధి చెందింది సావేరి. ఇతర జన్య రాగాలు: రాగ ప్రవాహం దాదాపు 223 జన్య రాగాలు మాయామాళవగౌళ రాగానికి ఉన్నట్టు తెలుపుతోంది. అయితే వీటిలో కేవలం 41 మాత్రమే పూర్తి రాగాలుగా అభివృద్ధి చెంది ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు, గౌళ, భౌళి, మలహరి, సారంగనాట, నాదనామక్రియ, మేచభౌళి, గుమ్మకాంభోజి, లలిత పంచమం, మారువ, శుద్ధ క్రియ, మేఘరంజి, పాడి, గౌళిపంతు, ఘనసింధు, మూర్జరి, గుండక్రియ, సౌరాష్ట్రము, కమలామనోహరి, జగన్మోహిని, రేగుప్తి, మంగళకైశిక, సాళంగనాట, పూర్ణపంచమం, సురసింధు, దేశ్యగౌళ, సింధురామక్రియ, ఆర్ధ్రదేశిక, ఫరజు మరియు గౌరి. ఈ రాగమందు పేరెన్నికగన్న రచనలు: 1. మాయాతీత స్వరూపిణీ –– తంజావూరు పొన్నయ్య 2. మేరు సమాన ధీర, విదులకు మ్రొక్కెద, తులసీ దళములచే, ముదమున శంకరకృత –– త్యాగరాజు 3. శ్రీనాథ గురుగుహోజయతి –– ముత్తుస్వామి దీక్షితార్ (ఇది ముత్తుస్వామి మొదటి కృతి) 4. నీలాయతాక్షీ నీవే జగత్సాక్షి –– శ్యామశాస్త్రి 5. లక్షణగీతం, రవికోటితేజ –– వెంకటమఖి 6. సరసిజనాభా మురారే (వర్ణం), దేవ దేవ కళాయామి –– స్వాతి తిరునాళ్ 7. దేవాదిదేవ నను –– మైసూర్ సదాశివం సినిమా సంగీతంలో కూడా ఈ రాగంలో అనేక ప్రయోగాలు, పాటలున్నాయి. ఉదాహరణకు రుద్రవీణ సినిమాలో కెవి మహదేవన్ ఏసుదాసు చేత త్యాగరాజు రచన తులసీ దళములచే సంతోషముగా పూజింతు పాడించారు. ఇక కీలుగుర్రంలో ఎవరు చేసిన కర్మవారనుభవింపక ఎవరికైనను తప్పదన్నా, లవకుశలో ఏనిమిషానికి ఏమిజరుగునో, బాలరాజులో గూటిలో చిలకేదిరా, ఓరన్న గూడు చినబోయెరా, సిరిసిరిమువ్వలో ఎవరికెవరు ఈ లోకంలో, చంటి సినిమాలో పావురానికి పంజరానికి పెళ్ళిచేసేలోకం, లైలా మజ్నులో రావో, ననుమరిచితివో, ఆలాపనలో కలిసే ప్రతి, చెట్టు కింద ప్లీడర్ లో జిగి, జిగి, జగదేకవీరుడు అతిలోక సుందరిలో యమహా నీ యమ ఇలా అనేక పాటలను సంగీత దర్శకులు స్వరపరిచారు. హిందీ సినిమాల్లో కూడా ఈ రాగం సమానమైన భైరవ్ రాగాన్ని విరివిగా ఉపయోగించారు. రంగీలాలోని హైరామా యే క్యా హువా, జాగతే రహోలో జాగో మోహన్ ప్యారే జాగో, ఏక్ దూజే కేలియేలో సోలా బర్సకీ బాలీ ఉమర్ కో సలాం, రాం తేరీ గంగా మైలీ లో టైటిల్ పాట రాం తేరీ గంగా మైలీ హోగయీ, హమ్ దిల్ దేచుకే సనం లో అల్ బేలా సాజన్ ఆయోరే, బిజు బావరాలో మెహే భూల్ గయే సావరియా మరియు ఆష్కీలో అబ్ తేరే బినా జీ లేంగే హమ్ ఇలా అనేకం. సౌమ్యశ్రీ రాళ్లభండి
సంగీతము యొక్క ఔనత్యమును గ్రహించి, పదుగురు సుళువుగా అభ్యసించడానికి మాయామాళవగౌళ రాగంలో స్వరావళులు మొదలు కీర్తనల వరకు రచనలు చేసిన సంగీతనిధి, కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు. కన్నడ భాషలో విరివిగా రచనలు చేసిన పురందరదాసు నారదాంశమని ప్రతీతి. పురందరదాసు 1484వ సంవత్సరంలో బళ్లారి జిల్లాలోని హంపి దగ్గర గల పురందరగడ్ లో కమలాంబ, వరదప్పనాయక్ దంపతులకు జన్మించాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించిన కారణాన ఆయనకు శ్రీనివాసుడని తల్లితండ్రులు నామకరణం చేశారు. అయితే ముద్దుగా శీను, శీనప్ప, తిమ్మప్ప, తిరుమలయ్య అని కూడా పిలిచేవారు. ఆయనకు 16వ ఏట సరస్వతీబాయితో వివాహం జరిగింది. తండ్రి వజ్రాల వ్యాపారి కావటంతో సహజంగానే ఆ వ్యాపారం పట్ల పురందరదాసుకు ఆసక్తి ఏర్పడింది. అయితే పిన్న వయస్సులోనే పురందరదాసు సంస్కృత, కన్నడ భాషలలో మేటి అన్పించుకోవడమేకాక సంగీతాన్ని కూడా ఔపోసన పట్టాడు. చిన్నతనంలోనే తల్లితండ్రులు మరణించటంతో వ్యాపారంలో రాటుదేలిన పురందరదాసుని సహ వ్యాపారులు నవకోటి నారాయణ అని పిలిచేవారు. ఈ నవకోటి నారాయణ, పురందరదాసుగా పరివర్తన చెందడానికి సంబంధించి చరిత్రకారులు ఒక కథని ఊటంకిస్తారు. ఒకనాడు శీనివాసనాయక్ వద్దకు ఆ వేంకటేశ్వరుడు ఒక పేద బ్రాహ్మణుని రూపంలో వచ్చి తన కుమారుని ఉపనయనం చేయడానికి సహాయాన్ని అర్ధించాడు. ఏ సహాయమూ చేయడానికి యిష్టపడని శ్రీనివాస నాయకడు స్వామిని రేపు, మాపు రమ్మని తిప్పించుకుని ఒక చెల్లని కాసును యిచ్చి వెళ్లమన్నాడు. శ్రీహరి చిద్విలాసంగా నవ్వుకుని శ్రీనివాస నాయకుని భార్య సరస్వతీబాయి దగ్గరికి వెళ్లి తన గోడు చెప్పుకున్నాడు. సహజంగానే జాలి గుండె గల ఆ యిల్లాలు తన ముక్కెర తీసి ఆ బ్రాహ్మణుడికి దానం చేసింది. అదే మహద్భాగ్యమని ఆ బ్రాహ్మణుడు ఆమె ముక్కెరను అమ్మి సోమ్ము చేసుకోవడానికి సరాసరి శ్రీనివాస నాయకుని దగ్గరికే వెళ్ళతాడు. శ్రీనివాస నాయకడు ఆ ముక్కెర తన భార్యదేనని గ్రహించి బ్రాహ్మణుడిని కాస్త ఆగమని చెప్పి యింటికి వెళ్ళి ముక్కెర ఎక్కడని భార్యను నిలదీసి అడిగాడు. సరస్వతీబాయికి ఏమి చేయాలో తోచలేదు. దేవుడి గదిలో పెట్టానని, తీసుకు వస్తానని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళి, చండశాసనుడైన భర్తను ఒప్పించడం, నమ్మించడం సాధ్యం కాదని గ్రహించి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకుని విషం త్రాగబోయింది. ఆశ్చర్యకరంగా విషపు గిన్నెలో ఆమెకు ముక్కెర కనపడింది. ఆమె పరమానందంతో ఆ గిన్నెలోని ముక్కెరను తీసి శుభ్రం చేసి తన భర్తకు అందించింది. ఆ ముక్కెరను చూచి శ్రీనివాస నాయకడు ఆశ్చర్యపోయి, భార్యను నిజం చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఆమె చెప్పిన కథ విని నిర్ఘాంతపోయాడు. ఆ ఏడుకొండల వాడే తనకు కనువిప్పు కలిగించడానికి మారు వేషంలో వచ్చాడని గ్ర హించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోసం వెతకగా అతను కన్పించలేదు. జరిగినది గ్రహించిన నవ కోటి నారాయణుడు తన సర్వస్వం దానం చేసి భక్తిమార్గంలో పడ్డాడు. తనకు జ్ఙానోదయమైన ఆక్షణాన్నే శ్రీనివాసుడు అఠాణ రాగంలో “మోసహోదేనల్లో “అని మొదటి కీర్తన రచించారు. 1525లో వ్యాసరాయులవారు వీరిని హరిదాసులుగా ఆశీర్వదించి పురందరదాసు అనే పేరునిచ్చారు. నాటినుండి ఆయన భక్తిమార్గాన్ని అనుసరిస్తూ దాదాపు 4లక్షల 75వేల కీర్తనలను సంస్కృత, కన్నడ భాషలలో రచించారు. వీటిలో నేడు మనకు కేవలం వెయ్యి మాత్రమే లభ్యమయ్యాయి. కస్తూరి వాసనలతో ఘుమ, ఘుమలాడే కన్నడ భాషలో ఆయన చేసిన రచనలకు“దాసర పదగళు” లేక “దేవర నామగళు” అని పేరు. వీరి ముద్ర “పురందర విఠల”. వీరు సంగీత శిక్షణకు ఆరంభ రాగమైన మాయామాళవగౌళ రాగాన్ని అందించటంతో పాటు, స్వరావళులు, అలంకారాలు, పిళ్ళారి గీతాలు, ఘనరాగ గీతాలు రచించిన ఆది గురువు. పురందరదాసు రచనలలో చక్కని ఉపమానాలు, సామెతలు కల్గి, పురాణ, ఉపనిషత్తులలోని సారమంత నిగూఢమై ఉంటుంది. ఆయన దాదాపు 84 రాగాలను గుర్తించి రచనలు చేశారు. ద్విజావంతి, శ్యామకల్యాణి, మారవి, మధుమాధవి వంటి అపూర్వ రాగాలతో పాటు నేడు బహుళ ప్రాచుర్యంలో ఉన్న కళ్యాణి, వరాళి, తోడి, భైరవి, మరియు సావేరి వంటి రాగాల్లో కూడా ఆయన అనేక కీర్తనలు రచించారు. ఆయన రచనలలో శంకరాభరణ రాగంలో రాసిన జోజో శ్రీ కృష్ణ, తిరుపతి వేంకటేశ్వరునిపై రచించిన సింధుభైరవి రాగంలో వెంకటాచల నిలయం, ముఖారి రాగంలో శారదా స్తోత్రం,, మధ్యమావతి రాగంలో లక్ష్మీ స్తోత్రం, కాపీ రాగంలో జగదోద్ధారణ ఆడిసిదళె యశోద, నాటలో జయ, జయ, కళ్యాణ వసంతంలో ఇనుదయ బారడే, మధ్యమావతి, శ్రీ రాగంలో భాగ్యాదా లక్ష్మి బారమ్మా చాలా ప్రసిద్ధి చెందాయి. వీరికి వరదప్ప, గురురాయ, అభినవ, మధ్యపతి అను నలుగురు కుమారులు, రుక్మిణీబాయి అని ఒక కూతురు. వీరు తమ అవసాన దశలో సన్యసించి, హింపి సమీపంలో ఒక మంటపంలో నివసించారు. ఈ మంటపానికి పురందరదాసు మంటపం అని పేరు. పురందరదాసు తమ 80వ ఏట రక్తాక్షి సంవత్సరం పుష్య అమావాస్యనాడు (1564) పరమపదించారు. తేటగీతి
రాగ స్వరశ్చ, తాళశ్చ త్రిభిస్సంగీత ముచ్చతే .... రాగం, తాళం, స్వరం కలిస్తే సంగీతమవుతుంది. వీటిలో ప్రతీ దానికి ఒక విశిష్టత ఉంది. అలాగే ప్రతీదీ మరో దానిపై ఆధారపడి ఉంటాయి. మనకు గల షోడశ స్వరస్థానాల సమ్మేళనమే రాగం. కొన్ని పాటలు వినగానే ఎక్కడో విన్నట్టుగా ఉందని అన్పిస్తుంది. అందుకు కారణం ఆయా పాటలన్నీ ఒకే రాగంలో ఉండటం కావచ్చు. ఏ భాషలో నైనా సరే మనం ఇట్టే ఆ పాటని గుర్తుపట్టేస్తాం. కొన్ని గీతాల వల్ల కొన్ని రాగాలకు విశిష్టత చేకూరుతుంది. కొందరు వాగ్గేయకారుల రచనలు రాగాలకు పేరు తెచ్చి పట్టాయి. ఇలా ప్రజారంజకం పొందిన పాటలను, రాగాలను వాటి లక్షణాలను మా ఈ ‘రాగగీతిక’ శీర్షకలో పాఠకులకు అందిస్తున్నాం. కర్ణాటక సంగీతంలో ఉన్న రాగాలను వాటికి సమాంతరమైన హిందుస్తానీ రాగాలను వాటిలో వాగ్గేయకారులు చేసిన అద్భుత రచనలతో పాటు, బహుళ ప్రాచుర్యం పొందిన చలనచిత్రాల గీతాలను కూడా పొందుపర్చటానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రయత్నంలో మా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగితే సహృదయంతో అర్ధంచేసుకొని క్షమించగలరని ఆశిస్తున్నాం. ముందుగా రాగం అంటే ఏమిటి? వాటి లక్షణాలు, రాగ వర్గీకరణ మొదలైన అంశాలను పరిశీలిద్దాం. రాగం అంటే ఏమిటి? శ్లో: యోయంధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః | రంజకోజన చిత్తానాం సరాగః కధితోబుధైః|| రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని. రాగము మన భారతీయ సంగీతంలో తప్ప మరే సంగీతంలోనూ లేదు. పాశ్చ్యాత సంగీతకారులకు రాగము అను పేరు తెలియదు. రాగము స్థాయి, ఆరోహి, అవరోహి, సంచారి అని నాలుగు విధాలు. ఒక్కోక్క స్వరాన్ని నిలిపి ఉంచడాన్ని స్థాయని, స్వరాలు హెచ్చు క్రమాన్ని ఆరోహణ, అలాగే తగ్గుక్రమాన్ని అవరోహణ అంటారు. ఇక ఈ మూడింటి కలయికే సంచారి. రాగములు ముఖ్యంగా మూడు రకాలు. షాడవము, ఔడవము, సంపూర్ణము. అందు ఔడవము ఐదు స్వరములను, షాడవము ఆరు స్వరములను, సంపూర్ణము సప్త స్వరములను కలిగి ఉంటాయి. ప్రతీ పాటకీ స్వరమున్నట్టే, స్వరస్థానాలను బట్టి రాగాలుంటాయి. కనీసం ఐదు స్వరాలైనా లేకపోతే అది రాగం కాదని ప్రాచీన సంగీతకారుల అభిప్రాయం. ఈ స్వరాల ఆరోహణ, అవరోహణల నుబట్టి రాగాలను రెండు రకాలుగా విభజించారు. జనక రాగాలు, జన్య రాగాలు. మేళకర్త రాగాలు: జనక రాగాలనే ‘మేళకర్త ‘రాగాలని కూడా అంటారు. వీటికే మాతృక (parental), ఆధార (fundamental), మూల (root), ప్రాతిపదిక (primary) రాగములని కూడా పేర్లు. మేళకర్త రాగాలకి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. మొదటిది ఈ రాగ ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలుండాలి. అంటే అది సంపూర్ణరాగమైయుండాలి. ఇక రెండవ ముఖ్య లక్షణం, ఆరోహణ, అవరోహణలో సప్తస్వరాలు వరుసక్రమంలో ఉండాలి. జనక రాగాల మరో లక్షణం ఆరోహణావరోహణము లందు ఒకే జాతి స్వరములుండుట. అలాంటి మేళకర్తరాగాలు 72 ఉన్నాయి. ఈ 72 మేళకర్త రాగాల్లో, ఆరేసి రాగాలను కలిపి ‘చక్రం’ అంటారు. అలా ఒక్కొక్కదానిలో ఆరేసి రాగాల చోప్పున మొత్తం 12 చక్రాలు ఏర్పడ్డాయి. ఈ 12 చక్రాల పట్టిక:
చక్రం మేళకర్త రాగాల సంఖ్య
ఇందు 1వ మేళకర్త నుంచి 6వ మేళకర్త వరకు
నేత్ర 7వ మేళకర్త నుంచి 12వ మేళకర్త వరకు
అగ్ని 13వ మేళకర్త నుంచి 18వ మేళకర్త వరకు
వేద 19వ మేళకర్త నుంచి 24వ మేళకర్త వరకు
బాణ 25వ మేళకర్త నుంచి 30వ మేళకర్త వరకు
ఋతు 31వ మేళకర్త నుంచి 36వ మేళకర్త వరకు
ఋషి 37వ మేళకర్త నుంచి 42వ మేళకర్త వరకు
వసు 43వ మేళకర్త నుంచి 48వ మేళకర్త వరకు
బ్రహ్మ 49వ మేళకర్త నుంచి 54వ మేళకర్త వరకు
దిశి 55వ మేళకర్త నుంచి 60వ మేళకర్త వరకు
రుద్ర 61వ మేళకర్త నుంచి 66వ మేళకర్త వరకు
ఆదిత్య 67వ మేళకర్త నుంచి 72వ మేళకర్త వరకు
  1 నుంచి 36 వరకు వచ్చే అన్ని మేళకర్త రాగాలలోనూ శుద్ధమధ్యమం ఉంటుంది. అదే 37 నుంచి 72 వరకు గల రాగాలలో ప్రతి మధ్యమం ఉంటుంది. ఈ లక్షణ ఆధారంగా జనక రాగాలను శుద్ధమధ్యమ రాగాలు లేక పూర్వమేళములు, ఉత్తర మేళములు లేక ప్రతి మధ్యమ రాగాలని రెండు రకాలుగా విభజించారు. జన్యరాగాలు: ఇక ఈ మేళకర్త రాగాల్లోని స్వరాలలో మార్పులు చేయగా అనేక రాగాలు పుట్టకొచ్చాయి. వీటిని జన్యరాగాలంటారు. ఉదాహరణకు ‘మాయామాళవగౌళ రాగం ‘15వ మేళకర్త రాగం. ఈ రాగంలోని ఆరోహణలో గాంధారాన్ని (గస్వరాన్ని), నిషాదాన్ని (ని స్వరాన్ని), అవరోహణలో నిషాదాన్ని వదిలేస్తే, ఒక కొత్త రాగం పుడుతుంది. అదే ‘మలహరి రాగం’. ఈ విధంగా మేళకర్త రాగాల్లోన్ని కొన్ని రాగాలను వదిలివేయడాన్ని వర్జించడమని అంటారు. ఇలా స్వరాలను వర్జించడం వల్ల పుట్టిన జన్యరాగాలను వర్జ్య రాగాలని అంటారు. ఈ వర్జరాగాల్లో ఉన్న స్వరాల సంఖ్యని బట్టి షాడవ సంపూర్ణరాగం, సంపూర్ణ షాడవ రాగం, ఔడవ సంపూర్ణరాగం, సంపూర్ణ ఔడవ రాగం, షాడవ షాడవ, షాడవ ఔడవ లేక ఔడవ షాడవ ఇలా అనేక రకాలు వర్జ్యరాగాల్లో ఉన్నాయి. అలాగే మేళకర్తరాగంలోని స్వరాలను వక్రగతి పట్టిస్తే, అంటే స్వర క్రమాలన్ని మారిస్తే కూడా కొత్త రాగాలు పుడతాయి. అలా పుట్టిన రాగాలను వక్ర రాగాలంటారు. ఉదాహభరణకు 28వ మేళకర్త రాగం హరికాంభోజి. ఇందులో ఆరోహణ: సరిచగఅంమశుపదచనికైనిస, అవరోహణ: సనీదపమగరిస. ఈ రాగాలను ఆరో: సరిగమపమదానిస, అవ: సనీదపమగమరీగరి అని వక్రం చేయగా పుట్టిన రాగాన్ని‘శహన ‘ అంటారు. వర్జ్య రాగాల్లో ఉన్నట్టే, వక్రరాగాల్లో కూడా స్వరాల వక్రగతిని బట్టి అంటే ఆరోహణలో స్వరాలు వక్రగతిలో ఉన్నాయా లేక అవరోహణలోనా అన్నదాని బట్టి అనేక రాగాలున్నాయి. ఆరోహణ, అవరోహణలో స్వరాలు వక్రగతిలో ఉంటే వాటిని ఉభయ వక్రరాగాలంటారు. ఉపాంగ రాగాలు, భాషాంగ రాగాలు: సాధారణంగా మేళకర్త రాగ స్వరస్థానాలే, జన్యరాగంలో కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రాగ లక్షణానికి విరుద్ధంగా రాగాలుంటాయి. ఉదాహరణకు బిలహరి రాగం ధీరశంకరాభరణమనే మేళకర్త రాగం నుంచి పుట్టుంది. అయితే మేళకర్త రాగ స్వరాలకు విరుద్ధంగా అన్యస్వరమైన కైశికి నిషాదం వస్తుంది. ఇలా అన్య స్వరరాగాలు కనుక జన్యరాగంలో వస్తే ఆ రాగాలను భాషాంగ రాగాలంటారు. కాంభోజి, ఖమాస్, భైరవి, ముఖారి, ఆనందభైరవి మొదలైన రాగాలన్ని భాషాంగరాగాలే. అన్యస్వరం రాకుండా, కేవలం జన్యరాగ స్వరస్థానాలే వస్తే అలాంటి రాగాలను ఉపాంగరాగాలంటారు. ఇలాంటి రాగాలే ఎక్కువ. ఉదాహరణకు మోహన, హిందోళ, హంసధ్వని, శుద్ధ సావేరి, ఆరభి, దర్పారు మొదలైనవి ఉపాంగరాగాలు. నిషాదాంత్య, దైవతాంత్య , పంచమాత్య రాగాలు: కర్ణాటక సంగీతంలో కొన్ని రాగాలు నిషాదముతో ముగుస్తాయి. అంటే ఈ రాగాల యొక్క సంచారము కేవలం మంద్రస్థాయి నిషాదము నుండి మధ్యస్థాయి నిషాదము వరకే. నిషాదముతో అంతమవునుగనుక వీటినకి “నిషాదాంత్యములని” పేరు. ఉదాహరణ నాదనామక్రియ. అదే విధంగా దైవతముతో అంతమయ్యే రాగాలను “దైవతాంత్యము”లంటారు. ఉదాహరణ కురంజి. ఇక రాగములు మధ్యస్థాయి పంచమముతో అంత్యమయిన వాటిని “పంచమాంత్య” రాగాలంటారు. ఉదాహరణ నవరోజు.   ఎన్ని రాగాలున్నాయి? ఒక జనకరాగం నుంచి పైన చెప్పిన లక్షణాలను పాటిస్తూ దాదాపుగా 483 జన్య రాగాలు పుట్టవచ్చు. ఇలా 72 మేళకర్తల నుంచి 34, 847 వర్జ్యరాగాలు పుట్టే అవకాశం ఉంది. ఇక వక్రరాగాలు, భాషాంగరాగాలు లెక్కించుకుంటూ పోతే వాటికి అంతే ఉండదేమో! అందుకే రాగాలు అనంతాలంటారు. రాగం అంటే కేవలం ఆరోహణ, అవరోహణలు కాదు. అవి కేవలం ఆధారం మాత్రమే. రాగంలో ఉపయోగించవల్సిన గమకాలు, ఒక రాగంలో తరచూ ఉపయోగించవల్సిన స్వరాలు ఇలా వివిధ లక్షణాలను రాగాలకు ఆపాదించినప్పుడే రాగానికి ఒక స్వరూపం ఏర్పడి అది ప్రజాదరణ పొందుతుంది. ఇది క్లుప్తంగా రాగం గురించిన విషయాలు. ఇక మీదట ఒక్కొక్క రాగాన్ని తీసుకుని దాని లక్షణాలు వాటిలో ప్రముఖ వాగ్గేయకారులు స్వరపర్చిన కీర్తనలు, ప్రజాదరణ పొందిన సినీ గీతాలను విశ్లేషిద్దాం. రాగ గీతిక రెండవ భాగంలో ఆది రాగమైన మాయామాళవగౌళ రాగం గురించి తెలుసుకుందాం. సౌమ్యశ్రీ రాళ్లభండి