సంగీతం

సంగీతం

త్యాగరాజు రచించిన మూడు నృత్యనాటికల్లో ప్రసిద్ధమైనది ప్రహ్లాద భక్తి విజయం. మొదలు నుంచి తుది వరకు త్యాగరాజస్వామి తనను తాను ప్రహ్లాదునిగా ఊహించుకుంటూ, తన ఇష్టదైవమైన శ్రీరాముని ఇందులో కొలిచారు. పూర్ణ చంద్రిక రాగంలో రచించిన ‘తెలిసి రామా చింతనతో’ కీర్తనలో రాముని పరబ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరించి, భక్తే మోక్షమార్గమని తెలిపారు. అలాగే రెండవ అంకంలో సహన రాగంలో కూర్చిన ‘వందనము శ్రీ రఘునందన’, కీర్తనలో విష్ణమూర్తి, శ్రీరామచంద్రులను ఒక్కరిగా సాక్షాత్కరింప చేశారు. ప్రహ్లాదుని రక్షించిన నరసింహుని ప్రస్తావన, నామోచ్ఛారణ ఎక్కడా ఈ గేయ నాటికలో కన్పించకపోవడం విశేషం. యక్షగానాలతో ప్రేరణ పొందిడం వల్ల కర్ణాటక సంగీతాన్ని అందులో మిళితం చేసి త్యాగరాజు తమ నృత్య నాటికలను రచించారు. అందుకు నిదర్శనమే ఆది, అంత్య కృతులైన ‘శ్రీ గణపతిని’, ‘నీ నామ రూపములకు’. అయితే ఈ విషయంలో త్యాగరాజస్వామి కొత్త ప్రయోగం చేశారని చెప్పవచ్చు. అప్పట్లో నృత్యనాటికల్లో మంగళం ఘంట, సురటి లేదా పంతువరాళి రాగాల్లో ఉండేవి. అయితే త్యాగరాజు ప్రహ్లాద భక్తివిజయంలో అందుకు విరుద్ధంగా సౌరాష్ట్రం రాగంలో రచించారు. ఐదు అంకాలు గల ఈ నాటికలో 45 కృతులను 28 రాగాలలో త్యాగరాజు రచించారు. దివ్యనామ కీర్తనలను తలపించే ఈ కృతులతోపాటు కంద, సీస, ఉత్పలమాల, చంపకమాల పద్యాలు, ద్విపదలు ఈ నృత్యనాటికలో ఉన్నాయి. అలాగే కులశేఖర ఆళ్వారు రచించిన ‘ముకుందమాల’ వాల్మీకి రామాయణంలోని అనేక శ్లోకాలు ప్రహ్లాద భక్తి విజయంలో త్యాగరాజు విరివిగా ఉపయోగించారు. వైకుంఠవాసుని లీలా విశేషాలను అమోఘంగా వ్యక్తపర్చే ‘జయతు, జయతు సకల నిగమానిగమ’ ఈ నాటికలోనిదే. ఇక పంతువరాళి రాగంలో ‘వసందేవయతిం’ మరియు ‘నారదముని వేదలిన’, నీలాంబరి రాగంలో ‘ఎన్నగ మనసుకురాని’, మోహన రాగంలో ‘దయరాని, దయరాని’, ‘జయమంగళం, నిత్య శుభమంగళం’, అసావేరి రాగంలో ‘రారా మాయింటిదాకా’ ఇలా ఈ నాటకంలోని అనేక కీర్తనలు ప్రజాదరణ పొందాయి.   ప్రహ్లాద భక్తి విజయంలోని కీర్తనలు వరసగా: 1. శ్రీ గణపతిని సేవింపరారే (సౌరాష్ట్ర) 2. వాసు దేవయని వెడలిన (కళ్యాణి) 3. సాగరుండు వెడలెనిదో (యమునా కళ్యాణి) 4. వినతాసుత రారా నా (హుసేని) 5. విష్ణువాహనుడిదిగో (శంకరాభరణం) 6. వారిధి నీకు వందన (తోడి) 7. వచ్చును హరి నిన్నుజూడ (కళ్యాణి) 8. వందనము రఘునందనా (సహన) 9. ఇందుకా ఈ తనువును (పున్నాగవరాళి) 10. ఎట్లా కనుగొందునో (ఘంట) 11. నిజమైతే ముందర (భైరవి) 12. నారదముని వెడలిన (కామవర్ధని) 13. ఇపుడైన నను (ఆరభి) 14. ఎన్నగ మనసుకు (నీలాంబరి) 15. ఏటి జన్మమిది (వరాళి) 16. ఎంతనుచు వర్ణింతునే (సౌరాష్ట్ర) 17. ఏనాటి నోము ఫలమో (భైరవి) 18. నన్ను బ్రోవకను (శంకరాభరణం) 19. అడుగు వరముల (ఆరభి) 20. వారిజ నయన (కేదార గౌళ) 21. తనలోనే ధ్యానించి (దేవ గాంధారి) 22. ఓ రామ రామ సర్వోన్నత (నాగ గాంధారి) 23. శ్రీ రామ జయరామ (మధ్యమావతి) 24. సరసీరుహ నయన (బిలహరి) 25. వద్దనుండేదే బహుమేలు (వరాళి) 26. తీరునా నాలోని (సావేరి) 27. రామాభిరామ రఘురామ (సావేరి) 28. దయరాని (మోహన) 29. దయ సేయవయ్య (యదుకుల కాంభోజి) 30. ఆనందమానందమాయెను (భైరవి) 31. జయమంగళం నిత్య (ఘంట) 32. నన్ను విడిచి (రితిగౌళ) 33. అందుండకనే (కామవర్ధని) 34. ఏమని వేగింతునే (హుసేని) 35. ఎంత పాపినైతినేమి (గౌళిపంతు) 36. ఓ జగన్నాథ (కేదార గౌళ) 37. చెలిమిని జలజాక్షు (యదుకుల కాంభోజి) 38. పాహి కళ్యాణ రామ (కాపీ) 39. రారా మాఇంటిదాకా (అసావేరి) 40. కమలభవుడు (కళ్యాణి) 41. దొరకునాయని (తోడి) 42. చల్లారే శ్రీరామచంద్రునిపైన (ఆహిరి) 43. వరమైన నేత్రోత్సవమును (ఫరజు) 44. జయమంగళం (మోహన) 45. నీ నామరూపములకు (సౌరాష్ట్ర) తేటగీతి
సంగీతం పాడటమే ఒక కళ అంటే, పాటలను రాసి వాటికి స్వరాలను కూర్చటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. నేడు పాటలు రాసే కవులు, ఆ పాటలకు బాణీలు అంటే స్వరాలని కూర్చే సంగీత విద్వాంసులు వేరు, వేరుగా ఉన్నారు. కానీ సంగీతం ప్రాణం పోసుకున్ననాటి నుండి ఈ రెండు ప్రక్రియలను చేయలగలిగే వారే సంగీతకారులుగా ప్రసిద్ధి కెక్కారు. ఇలా సంగీతం, కవిత్వం రెండింటిపై పట్టుగలిగి ఆశువుగా గానం చేసే కళాకారులని వాగ్గేయకారులు అంటారు. జయదేవుడు, అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్ర్తివంటి మహానుభావులు ఈ కోవకు చెందినవారే. సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న అలాంటి మహానుభావుల జీవిత విశేషాలను తెలుసుకుందాం. జయదేవుడు జయదేవుడు క్రీ.శ. 1098లో రమాదేవి, భోజదేవుల దంపతులకు జన్మించాడు. ఒరిస్సాలోని పూరీకి దగ్గరలోని ‘కిందుబిల్వం’ ఈయన స్వగ్రామం. జయదేవుడు గోవర్ధనాచార్యుల వద్ద శిష్యరికం చేసి సంస్కృతం, సంగీతం అభ్యసించాడు. జయదేవుడు క్రీ.శ. 1116లో బెంగాల్ లో నవద్వీపం రాజు లక్ష్మణసేనుడి ఆస్థానంలో ఆస్ధానకవిగా ఉండేవాడని చరిత్రకారులు భావిస్తున్నారు. జయదేవుడు కృష్ణ భక్తుడు. భార్య పద్మావతి నృత్యం, కృష్ణభక్తి ప్రేరణలతో జయదేవుడు రాధా, కృష్ణుల ప్రణయగాథను, భక్తితత్వ్తాన్ని సంస్కృతంలో అష్టపదుల రూపంలో రచించాడు. సంస్కృతంలో అష్ట అంటే ఎనిమిది. ఎనిమిది చరణాలు గల పాటలు, శ్లోకాలు రచించటం వల్ల వీటికి అష్టపదులు అని పేరు. ఈ అష్టపదుల సంకలనమే ‘శ్రీ గీతగోవిందం’. జయదేవుడు రాధాకృత, గోపికా కృత, గీత గోవిందం అని అర్ధం వచ్చేవిధంగా, శ్రీ గీతగోవిందం అని పేరుపట్టాడు. కానీ కాల క్రమేణా ఇది గీతగోవిందంగా ప్రసిద్ధి కెక్కింది. శ్రీ గీతగోవిందం గీతగోవిందంగా మారినట్టే శ్రీ జయదేవ నామం కూడా జయదేవగా రూపాంతరం చెందినట్టు విమర్శకులు భావిస్తున్నారు. జయదేవుడు తన పేరునే ముద్రగా అష్టపదులలో పొందుపర్చాడు. అనేక అష్టపదులలో చివరి చరణంలో శ్రీ జయదేవ శబ్దమే ప్రయోగితమవడమే ఇందుకు తర్కాణం. సరళమైన పదాలతో, పాటలతో రాసిన గీతగోవిందం భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానమని చెప్పవచ్చు. శృంగార వర్ణనలతో కూడిన శ్రీ గీతగోవిందంలో మొత్తం 12 సర్గాలు, 95 వివిధ వృత్త రచనలు, 78 శ్లోకాలు, 24 పాటలున్నాయి. గీత గోవిందంలోని 12 సర్గాలు భాగవతోంని 12 స్కంధాలకు మారురూపమని ఒక నమ్మకం. సకల వేదసారం గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలలో నిక్షిప్తమయినట్టు, గీత గోవిందలో కూడా 24 ప్రంబంధాలుండటం కాకతాళీయం కాదని గీతగోవిందం భాగవత స్వరూపమని మరో నమ్మిక. అందుకు తగినట్టుగానే అష్టపదులలో మొదటిది దశావతార అష్టపది కావటం విశేషం. 11 చరణాలు గల ఈ అష్టపదిలో జయదేవుడు విష్ణుమూర్తి దశావతారాలను వర్ణించాడు. జయదేవుని గీతగోవిందం గురించిన ఒక కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు జయదేవుడు 19వ అష్టపది రాస్తుండగా ఒక పంక్తి సరిగ్గా కుదరక రాసినదానిని కొట్టివేసి, స్నానానికి వెళ్లాడట. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే అదే పంక్తి తిరిగి రాసి ఉన్నదట. ఆశ్చర్యంతో భార్య పద్మావతిని పిలిచి ప్రశ్నించగా మీరే వచ్చి రాశారని ఆమె బదులిచ్చిందట. సాక్షాత్తు కృష్ణభగవానుడే వచ్చి పంక్తిని పూర్తిచేశాడని జయదేవుడు గ్రహించాడు. పద్మావతికి కృష్ణదర్శనం లభించినందున ఈ అష్టపదిని దర్శన అష్టపది అని అంటారు. అంతేకాకా పద్మావతికి లభించిన భాగ్యానికి గుర్తింపు అన్నట్టు జయదేవుడు ఈ అష్టపది చివరి పంక్తిని ‘జయతు పద్మావతీ రమణ జయదేవకవి’ అని పూర్తిచేశాడు. జయదేవుని అష్టపదులలో బహుళ ప్రాచుర్యం పొందినవి ... ‘హరిరిహముగ్ధవధూనికరే’, ‘చందన చర్చిత నీల కళేబర’ మరియు ‘సావిరహేతవదీనా రాధా’ మొదలగునవి. జయదేవునికి ముందు రాగ, తాళాలతో పాటలు పాడినవారుకానీ, పాటలు రచించినవారుకానీ ఉన్నట్టు దాఖలాలు లేవు. కావున జయదేవుడే మొదటి వాగ్గేయకారుడని చరిత్రకారులు అభిప్రాయం. జయదేవుని గీతగోవిందం సంగీతరత్నాకరం రాయటానికి దాదాపు రెండు, మూడు శతాబ్దాల ముందు పుట్టింది. గీతగోవిందాన్ని ఏఏ రాగాలలో పాడాలి అన్న మార్గదర్శకత్వం లేనందున సంగీతకారులు తమకు తోచిన రాగ, తాళాలలో అష్టపదులను ఆలపించారు, ఆలపిస్తున్నారు. సంగీతజ్ఙులు శ్రీ మంచాల జగన్నాథరావుగారు జయదేవుని అష్టపదులకు రాగతాళస్వరకల్పన చేస్తూ, తాళములకు సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. సాహిత్యము నందలి పదపొందిక గమనించినచో వాని ఛందస్సు స్పష్టంగా తెలుసుకోవచ్చని, దాని ఆధారంగా తాళములు కట్టవచ్చని వివరించారు. ఉదాహరణకు ఆరు మాత్రలు గల ’శ్రితకమలా కుచమండల’ అనే అష్టపదిని రూపక తాళంలోనూ, ‘రదసి యది కించిదపి’ అనే అష్టపదిని ఐదు మాత్రలు గల జంపెతాళంలోనూ, ‘మామియంచలితా విలోక్యా వృతం’అనే అష్టపదిని యేడు మాత్రలు గల త్రిపుట లేదా సాకు తాళంలోనూ, ‘లలిత లవంగ లతాపరిశీలన’ అనే అష్టపదిని ఆది తాళంలోనూ పాడుకోవలెనని తెలిపారు. ఖశ్చితంగా ఈఈ రాగాలలో పాడాలన్న నిబంధన లేకపోయినా, జయదేవుడు మంగళ గుర్జరి, బారడి, దేశీ బారడి, గుజ్జరి, భారబి, వసంత, రామఖేరి, గుండఖేరి, దేశాఖ్య వంటి రాగాలలో గీతగోవిందాని గానం చేశాడని అంటారు. ఎప్పుడో 12వ శతాబ్ధ కాలంలో పుట్టిన అష్టపదులు నేటికి ప్రచారంలో ఉన్నాయి. భజనల్లో, నాట్య ప్రదర్శనల్లో మనకు ఈ అష్టపదులు విన్పిస్తుంటియి. ఒడిస్సి, భరతనాట్యం, మణిపూరి, కూచిపూడి, కథక్ వంటి భారతీయ నృత్య రీతుల్లో అష్టపదులను ప్రదర్శింస్తుంటారు. నేటికి పూరిలో జగన్నాథస్వామికి పూజలు నిర్వహించేటప్పుడు, తిరుపతిలో అన్నమయ్య కీర్తనలు పాడినట్టు, జయదేవుని అష్టపదులు ఆలపిస్తుంటారు. పూరీ జగన్నాథ రథోత్సవ సందర్భంలో 19వ అష్టపదిని ఆలపిస్తారు. కేవలం పూరీలోనే కాకా కేరళలోని గురువాయూరు దేవాలయంలో కూడా అష్టపదులను సోపాన పద్దతిలో గానంచేస్తారు. జయదేవుడు గీతగోవిందమేకాక, యీసత్కవిచంద్రాలోకం, రతిమంజరి, కారకవాదం, తత్త్వచింతామణి అనే గ్రంధాలను విరచించాడు. కృష్ణ భక్తితత్త్వాన్ని కళ్లకు కట్టినట్టుగా విరచించిన జయదేవుడు క్రీ.శ. 1153లో పరమపదించాడు. సౌమ్యశ్రీ రాళ్లభండి
జగదానందకారక, కనకన రుచిరా కృతుల్లో ప్రత్యక్షం చేసుకున్న పరమాత్మ తనను రక్షించి దయతో బ్రోచునా అనే సందేహాన్ని, గౌళరాగంలో ‘‘దుడుకు గల’’ అనే కృతిలో ప్రస్తావిస్తారు త్యాగరాజస్వామి. ‘కనకనరుచిరా’ అన్నపాటలో చివర ఉదహరించుకున్న ధ్రువుడు సజ్జనుడు, సాపత్నిమాతయైన సురుచి కర్ణశూలములైన మాటలు, వీనులచురుక్కుమనిపించినా, పల్లెత్తుమాటైనా తిరిగి అనకుండా కార్యశూరుడైన, వినయకవచుడై కృతకృత్యుడైన ప్రయోజకుడు ఆ ధ్రువుడు! అలా ధ్రువోపాఖ్యానం జ్ఞాపకం తెచ్చుకున్నా ప్రస్తుతః తాను ఆ ధ్రువునికి సమానుడను కానన్న కించవల్ల తన కాతని మల్లె సమానఫలసిద్ధి అబ్బదేమో అనే సందేహం కలిగింది. తనకు దుడుకు ఉన్నదని ఆలోచించుకుంటారు. తన స్థితిని పూర్తిగా వివరించుకునే ప్రయత్నంచేసి, ఆ ప్రయత్నంలో పదేపదే తన్ను కించపరచుకుంటారు ఈ గౌళకృతిలో. సౌఖ్యపుజీవనం కోసమే కాలం గడుపుతూ, దుర్విషయములను దురాశలను విసర్జించలేక, పరధనముల నాశించి, వానికొరకు ఇతరులను పొగడి, మది కరుగ యాచించి పలికి, కుతర్కుడై, రసవిహీనుడై, కులభ్రష్టుడై కాలము గడిపే దుడుకు మానవతను సాధింపక, చపలచిత్తుడై, మదమత్సర కామలోభమోహములకు దాసుడై, చిరుతప్రాయమునాడే భజనామృతసారవిహీనుడై, సతతమపరాధియైనట్టి వాని దుడుకు సతులకై కొన్నాళ్లు, ఆస్తికై కొన్నాళ్లు, ధనతతులకై కొన్నాళ్లు, తిరిగి శ్రమిస్తూ, పరస్త్రీలను, నీచ స్త్రీలను కామించి అనుభవించి, శ్రీహరిపదాబ్జభజన మరచి, సకలభూతలములయందూ తానైయున్న ఆ దేవుని తన మదిలో మాత్రమే లేకుండ చేసుకున్న దుడుకు ఈ రీతిగ అనేక రకముల దుడుకులు గల ‘తన్ను’ నికృష్ణుని, ‘బ్రోచే దొరకాడు’ వారసత్వపు ప్రభుత్వంగల వాడెవ్వడూ అని ప్పచ్ఛ చేస్తారు. ఈ ప్రశ్నకు జవాబు ఈ పాటలో లేదు. కాని నాలుగువ పంచరత్న కీర్తన, ఆరభిరాగంలో ‘‘సాధించెనే మనసా’’ అనే కృతిలో సంతరించారు త్యాగరాజస్వామి. ఈ గౌళ కీర్తన యొక్క ప్రయోజనం అంతముఖ్యమైన ప్రశ్నను రేకెత్తించడమే. త్యాగరాజు స్వకీయనిందమాత్రం కాదు. ఆ పరమ భాగవతుడు తన్నంతగా కించపరచుకుని తిట్టుకోవడం సమంజసమూ కాదు. అటువంటి దుడుకాయనకున్నదనడం సత్యమూ కాదు. స్వామివారి సత్ప్రవర్తనా, పవిత్ర జీవినమూ అందరూ ఎరిగినవే. వేరొకచోట స్వామివారు త్యాగరాజప్తునిగా శ్రీరాముణ్ణి పొగడడం నారదమౌని తపస్సుకే ఫలపరమావధి అన్నట్టు చెప్పారు. త్యాగరాజు శబ్దం శివునికి కూడా వర్తించినా కృతులలో అది తన సంతకమే, తను రచించిన విషయాన్ని సూచించే సంకేతమే అవుతుంది. ‘‘త్యాగరాజాప్తయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో’’ అని యదుకులకాంభోజిలో అనేసి తనపై తనకున్న ఆత్మ విశ్వాసాన్ని ప్రకటితం చేశారు. కనుక ఈ గౌళరాగకృతిలోని ‘‘దుడుకు మానిసి’’ త్యాగరాజస్వామి మాత్రం కాకూడదు. ఆ పాట నేను పాడుకుంటే ఆ ‘నన్ను’ నాకే చెంది ఆ దుడుకుగల మనిషిని, కొన్ని దుడకులేనా ఉన్న మనిషిని నేనే అవుతాను. అంచేత ఆ పాట పాడుకునే జిజ్ఞాసువులకు ఆ మాట చెందుతుంది. ఇక పాటలోని ప్రతిపాదనా, ప్రశ్నా జనసామాన్యానికి అన్వయించుకుంటే, అంత హైన్యస్థితికి దిగజారిన వారికి మోక్షం ఎలాగా అనే సామాన్య ప్రశ్నా, దానికి జవాబూ దొరుకుతాయి. తానెంత దైన్యస్థితికి దిగజారినా, ఎంతు బరువు బ్రతుకు గడుపుతున్నా, ఎంత నికృష్టుడైనా ఏ మానవుడు నైరాశ్యత చెందరవసరంలేదనీ, బ్రోచి రక్షించే దొరకొడుకు ఎవరు అని వెతుక్కుంటే దొరకుతాడనీ వ్యంగ్యంగా సూచించారు గురూత్తములైన త్యాగరాజస్వామి. ‘జగదానందకారక’ లోని శరణాగత జనపాలకుడూ, ‘కనకన రుచిరా’ లోని పరమదయాకర, కరుణాకరసవరుణాలయుడూ అయిన జానకీ ప్రాణనాయకుడే ఆ దొరకొడుకు! దశరధ దొరకొడుకు – దాశరధి! ‘‘సాధించెనే మనసా’’లో ఆ దొరకొడుకైన దాశరధి, త్యాగరాజనుతుడు. తన భక్తుని చెంతరాకనే, అమరికగా నాతని పూజగొని, సమయానికి తగు మాటలాడి, సౌఖ్యపు బ్రతుకు గడపడానికి ప్రయోజనకారకములయ్యే వ్వహార సూత్రాలు నిర్ధేశిస్తాడు. ఆ భగవంతుడు ముచ్చటగా మూడే సూత్రాలు చెప్పాడు: అలుగవద్దు, అన్నాడు విముఖులతో చేరబోకు, అన్నాడు వెతగలిగితే తాళుకొమ్ము, అన్నాడు రఘుకులేశుడైన రామచంద్రుడు, స్వప్రకాశుడైన శ్రీవేంకటేశుడు వేడుకున్నా తన్నుబ్రోవక, ఈ మూడు సూత్రాలు పలికి తిరిగిపోయినాడన్నారు. పరమభక్తవత్సలుడని, కలబాధల దీర్చువాడని, ఒక అభయహస్తముద్రతో తన్ను తిన్నగా మోక్ష స్థితికే చేర్చివేస్తాడనుకొని వేడుకుంటే, దగ్గరకైన రాకుండానే, దూరాన్నే నిలిచి, ఈ ప్రకారంగా నడచుకొమ్మని ఉపదేశించి చక్కా పోయినట్లు చెప్పి, చమత్కారంతో విశేష ప్రయోజనం సాధించారు. దేశికోత్తములైన త్యాగరాజస్వామి! ఏ ఆచార్యుడైనా జీవిత క్రమానికి సంబంధించిన నిబంధనలు వక్కాణించి చెప్పితే, అవి సామాన్యంగా శిష్యుల మనస్సులకెక్కవు. కాని త్యాగరాజస్వామి వంటి సద్భక్తుడు, తనకు, ఆ పరబ్రహ్మమైన శ్రీవేంకటేశుడే అయీ నిబంధనలని సూచించాడని చెప్పుతూ ఉంటే, ఆ పరదైవాన్ని ప్రత్యక్షదైవంగా ఎంచుకునే కలియుగ మానవులు ఆ మాటలపై నమ్మకమూ, స్వామివారిలో గురుత్వమూ కుదుర్చుకొనకుండా ఎలా ఉండగలరూ? తాను చెప్పదల్చుకున్న పాఠాన్ని పరోక్షంగా, అందులోనూ ఆ పరమాత్మ నోటితోనే చెపన్పించడం త్యాగరాజస్వామి వారి నేర్పరితనం. ‘‘శాంతము లేక సౌఖ్యము లేదు’’ అని వేరొకచోట తానై వితర్కించుకొన్న త్యాగరాజస్వామి ఈ పంచరత్న కృతిలో, ‘అలుగవద్దు’ అని దేవదేవుని చేతనే (మళ్లీ) చెప్పించారు. ఈ పాటలో ఇంకొక చమత్కారం ఏమిటంటే, ఆ చెప్పిన పరమాత్ముడు, సమయానికి తగరుమాటలాడినవాడూ, మామూలుగా తాను పూజించి, మనస్సులో దర్శించి పరవశం చెందే జానకీ ప్రాణనాయకుడుకాదు –రుక్మిణీ ప్రాణేశుడు! రంగేశుడూ, సద్గంగా జనేకుడూ, సంగీత సాంప్రదాయకుడూ అయిన శ్రీ కృష్ణుడు ఆ శ్రీకృష్ణుడైనా, తానూ ఇంకా మిగిలిన భక్తులై ఈ వరలో సందర్శించిన మూర్తి. ‘‘అలివేణువెల్ల దృష్టిచుట్టి వేయుడు, మ్రొక్కే వేణుగానలోలుడు కాడు – రాసక్రీడలాడే యువకుడుకాడు – పెంకెగోపాలుడు. గోపీజన మనోరధ మొసంగలేకనే గేలియజేసెడివాడు, పుట్టిన మరుగడియనుండీ వారికి గాక పరులవాడై దేవకీ వసుదేవుల ‘‘నేచిన’’ వాడు, నిజతనయుడను భ్రాంతితో యశోద ముదంబునను ముద్దుబెట్ట (ఆవిడ మాయామోహత్వానికి) నవ్వుచుండు హరి, వనితల సదా సొక్క చేయుడు, అందులకై తనకు మ్రొక్కించుకునే గడుసిరి, ‘అలుగవద్దు’ అని తనకు బోధించిన సన్మార్గ వచనములను (తానే) బొంకుజేసి తాపట్టిన పట్టు (దూరాన్నుంచి కబుర్లు చెప్పడమేగాని, దగ్గరకొచ్చి, లాలించి ప్రేమించి మోక్షమీయని పెంకెపట్టు – తానే కోపించినాడా అన్నట్టు) అలాంటి పట్టును ‘‘సాధించెనే’’ అంటారు త్యాగరాజస్వామి! ఆ మాటను పల్లవిలోనే అని మళ్లీమళ్లీ అనుకుంటారు! ఇటువంటి విరుద్ధ ప్రవృత్తితో పరమాత్ముడు తనకు ప్రత్యక్షమయ్యాడన్నారు. తాను కోని పూచించుకునే ఇష్టదైవం వేరు – ఉరమున ముత్యపుసరులచయముతో, కరమున శరకోదండకాంతితో, రుక్కలరాయని గేరుమోముగల సుదతి సీతమ్మ, సౌమిత్రి ఇరుప్రక్కల నిలబడి సేవించే ఆ వనజనయనుడు కాడు! ఆ స్థానంలో ఈ గోపాలుని నిలుపుకొనడంలో త్యాగరాజస్వామి వారందించే పాఠం ఏమిటో మనం ఊహించుకోవాలి. ఆశించిన ఫలం అదే రూపంలో అందకపోతే క్రుంగిపోకూడదు అనే పాఠాన్ని అందించారా? కావాలన్నప్పుడూ, అనుకొన్న రూపంలో దేవుడు దొరకకపోవచ్చుననీ, ఇంకో రూపంలో ప్రత్యక్షం కావచ్చుననీ, స్వర్గానికి నిచ్చెనగా దేవతామూర్తి నుపయోగించుకోబోతే, పెంకె గోపాలునిమూర్తిలో ప్రధానోపాధ్యాయుని లాగా, జాగ్రత్తగా మసలుకొమ్మని పాఠాలు చెప్పవచ్చుననీ, అయినా ఆ బోధనే మహా ప్రసాదమని స్వీకరించానీ, అలాంటి సత్ప్రవర్తన వల్లనే విముక్తి దొరుకుతుందనీ చెప్పడమే త్యాగరాజుల వారి తాత్పర్యమేమోననిపిస్తుంది. ఇంకొక ఆలోచన అతుల శౌర్య విభాసియైన పార్ధుని కనిమొనలో సారధ్యమొనరించి, అతడు విషాదయోగగ్రస్తుడై యుండగా, కర్తవ్యము నుపదేశించిన దేశికమూరి, జగత్తుకు గీతామృతమును ప్రసాదించిన జగద్గురువు, ఆ శ్రీకృష్ణుడు గనుక, గీతాబోధను గుర్తులో నుంచుకొని, తన రామునిచే పాఠాలు చెప్పించక, ఆచార్య స్థానంలో ఆ కృష్ణుని నిలబెట్టడం సమంజసమే అనిపిస్తుంది. ఏదిఏమైనా, సుశీలమే ఆవశ్య కర్తవ్యమని, త్రిసూత్రాత్మకమైన గురు బోధను అందించింది ఈ ఆరభి రాగపుటమోఘ కీర్తన! (సేకరణ: యువభారతివారి త్యాగరాజస్వామి కవితా వైభవము నుంచి) తేటగీతి
ఆధునికాంధ్ర కవిత్వంలో 1920 సంవత్సరంలో వచ్చిన సరిక్రొత్త మలుపు భావ కవిత్వ రంగప్రవేశం. 1910-20 మధ్య భావ కవిత్వ ఉద్యమానికి రాయప్రోలు, అబ్బూరి ప్రారంభకులు అయితే అఖిలాంధ్ర ప్రాచుర్యం తెచ్చినవారు కృష్ణశాస్త్రి. ఆనాటి యువతరాన్ని తన కవితాగానంతో ఆకట్టుకున్నారు. బి.ఎన్. రెడ్డిగారి ప్రోత్సాహంతో 1942లో కవిగా చలనచిత్రరంగంలో ప్రవేశించి మళ్లీ ఇల్లాంటి సాహిత్యం పుట్టదన్నట్టుగా మల్లీశ్వరి పాటలు వ్రాశారు. ఆనాటి నుండి తుదిఘడియ వరకు కొన్ని వందల పాటలను వందకుపై చిలుకు చిత్రాలకు అందించి, సినీ సాహిత్యానికి సాహిత్య జగత్తులో ఉన్నతస్థానాన్ని కల్పించారు. సినీ గీతాలలో కూడా ఉదాత్త కవిత్వ పరిమళాలను వెదజల్లిన, కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మన హృదయాలు దేనికోరకో వెదుకుతాయి. ఏఏకాంత సీమలోనో మేలుకొంటాయి. కొసరి కొసరి వీచే చిరుగాలి వీచికల్లా మేలుకొంటాయి. ప్రకృతిలో ఎంత సౌందర్య సంపద ఉన్నా తనంత తానుగా సుకృతి కాలేదు. రససిద్దిని ఆయత్తం చేసుకున్న కవి వాక్కు అందుకు సంసిద్ధంగా ఉండాలి. అక్షర సౌందర్యం గుభాళించాలి. ‘‘చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురియదు, వేలి కొసలు తాకనిదే వీణపాట పాడదు’’ (మంచిరోజులొచ్చాయి) అంటూ చల్లని వానజల్లులా యెద లోతుల్లో పాటలు జాలువారితే కవికి మంచిరోజు. మందారినికి, మధుపానానికి ఉన్న సంబంధం ఎట్లాంటిదో కవికి, ప్రకృతికి గల సంబంధము కూడా అట్లాంటిదే. కవిత్వంలోని విలక్షణతను సినీగీతాలలో స్పష్టంగా భాసిస్తూ కృష్ణశాస్త్రిగారి ప్రత్యేక వాణీని, బాణీనీ ప్రస్ఫుటం చేస్తుంది. నాగరికతని, సభ్యతా సంస్కారాన్ని హార్ధక సౌకుమార్యాన్ని విశృంఖల శృంగారం కోసం ఆయన ఎప్పుడూ బలిపెట్టలేదు. ‘‘పెరటిలోని పూలపాన్పు త్వరగా రమ్మంది, పొగడనీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది’’ (బలిపీఠం) అన్న పంక్తులలోని ఆర్ధ్ర శృంగారం భావుక హృదయాలకు తెలుస్తుంది. అందుకే ఆయన రచించిన ప్రతిగీతం శ్రోతల హృదయాలలోనికి చొచ్చుకు పోయి నాలుకలపై నర్తిస్తుంటాయి. వాటికి పాటబడడమంటూ ఉండదు. మల్లీశ్వరి గీతాలే ఇందుకు నిదర్శనం. ఆయన పాటలన్నీ రసగుళికలే. ‘‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే, అందాల చందాల, నీలాల రాగాల, మమత లెరిగిన – మనసు తెలిసిన జాలిగుండెల మేఘమాల’’గా మేఘమాలను వర్ణించిన తీరు అత్యున్నత భావాంబర వీధుల్లో విహరించే కవి భావుకతకి సంకేతంగా నిలుస్తుంది. ఈ మేఘమాల మాటతో మరో మేఘసందేశాన్ని సృష్టించిన అపర కాళిదాసుగా కృష్ణశాస్త్రిగారు పలువురి ప్రశంసలందుకున్నారు. వీరి సినీగేయాల్లో ప్రకృతి సౌందర్యం వర్ణనాత్మకమైనవి. లలిత పరిహాసాత్మకమైనవి. భక్తి, మధుర భక్తి భావనా విలసితమైనవి. సంయోగ, శృంగార మాధర్యోపేతమైనవి. వియోగ వేదనాభరితమైనవి, విషాదాత్మకమైనవి, మానవత, సామాజిక స్పృహలతో కూడు కున్నవి. జాతీయ భావనిర్భరమైనవిగా గోచరిస్తాయి. కృష్ణశాస్త్రి పాటలు అనంత తరంగాలుగా అనంతరం మన హృదయాల్ని తట్టితట్టి పిలుస్తాయి. తెలుగు నుడి బ్రతికినంత కాలం మనలను సాదరంగా పలకరిస్తాయి. ‘కుశలమా, నీకు కుశలమేనా’ (బలిపీఠం) అని అంటూ ప్రతి మనిషిని అడుగు తూనే ఉంటాయి. ‘మనసు నిలుపుకోలేక మరీమరీ అడిగే’, కరుణార్ధ్ర కంఠస్వరంలో తెలుగు జాతికి వెలుతురు వలయాలందిస్తాయి. ‘ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనీ నీ పాదపీఠం కర్పూర దీపం’ అంటూ తెలుగు చెవినిల్లుకట్టకొని హెచ్చరిస్తూనే ఉంటాయి. కృష్ణశాస్త్రి పుట్టి పెరిగిన కాలం యుగసంధి. పెనుచీకటిలో లోకం కునారిల్లిపోవడం తాను కన్నులారా చూశారు. చీకటిని కొండలు దాటివెళ్లి పోమ్మని శాసించారు. వెలుగు వెండిరేకులను ఆహ్వానించారు. ఐనా చీకటి పూర్తిగా వైదొలగలేదు. వెలుతురు పూర్తిగా పునరాక్రమించనూలేదు. ఉన్న యదార్ధాన్ని ఆర్త హృదయంతో ఆక్రోశిస్తూ కూర్చోక సౌందర్య ప్రతీకగా మలచుకొని, ‘చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకు వన్నెల’ను (చీకటి వెలుగులు) ఆహ్లాదించారు. లోకపు మెడచుట్టూ గులాబీలు నవసౌకుమార్యాలను భావించారు. ఐనా చీకటి సిగపాయల ఎర్రని మందారాల కాంతి గుచ్ఛాల నవలోకించారు. సౌందర్యం ఏకాకి కాదు, దాని కాంతులు దూరదూరాల వ్యాపిస్తుంది. శివసుందరమయంగా సత్యమయ ధ్యానంగా, ఆనందధామంగా సాగుతుంది. అలాంటపుడు, ‘‘గల గల మనకూడదు ఆకులలో గారీ జలజల మనరాదు అలలో కొండవాగూ, నిదురోయే కొలను నీరు కదపగూడదు ఒదిగుండె పూలతీగ ఊపరాదు’’ (చీకటి వెలుగులు) నిజమే మరి, ఊరకనే తీగను కదిలించడమెందుకు? తీగకదిలితే స్వరమా ఊడిపోతుంది. తొడిమలపై కులికే పూలబాలలు కూలిపోతాయి. అది కృష్ణశాస్త్రి భావుకత, ఆర్ధ్ర మనస్కత. అలవోకగా కనులార మోడ్చిన కవికి ప్రతి పులుగు ఎందుకో ఏదో చెప్పబోతుంది. రామచంద్రోదయ సమయంలో చెట్టుచెట్టూ కనులు విప్పి చూస్తుంది. తెలియని ఆర్తిలోనూ, ఆశల పెను కడలిలోనూ అర్రట్లాడిపోతున్న సమయంలో ఆ రాముని దివ్యసుందర రూపం చూసేసరికి తోచి తోచని సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన శబరిని మనముందు సాక్షాత్కరింప చేసిన దృశ్యము అపూర్వము. ‘‘అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ? నీలమేఘ మోహనము నీ మంగళరూపము’’ (సంపూర్ణ రామాయణం) స్వీయానుభవాన్ని అనుభూతిగా మార్చుకొని పాత్రలపరం చేయగల నేర్పు ఉంటే శబరినే కాదు, మందర అయినా కనులముందు నిలబడుతుంది. కృష్ణశాస్త్రి పాటలు మన సంఘాన్ని పునఃనిర్మించే బాధ్యతలతో స్పర్శంచని తావులేదు. మన హృదయాలలో సకల మాలిన్యాన్ని క్షాళనం చేస్తూ చీకటి కోణాలన్నింటిపైనా సూర్యరశ్మి ప్రసరింప చేస్తాయి. ఎవరూ అంటుకోని పనిని మాతృహృదయంతో నెరవేర్చే సంఘసేవకులు ఈ దేశానికి అంటరానివారు. దూరదూరంగా తరమబడుతున్నారు. భారంగా బ్రతుకులీడుస్తూ, బ్రతకడానికేనా వారు జన్మించారు అని కృష్ణశాస్త్రి గారిని కలవరపర్చింది. అందుకే ఆయన, ‘‘కలువపాపాయికి కొలను ఒడి ఉంది చిలుక పాపాయికి చిగురు ఒడి ఉంది ప్రాణములేని ఒక శిలకు గుడి ఉంది’’ (కాలం మారింది) ఆదయనీయులకు మాత్రం ఏమీలేదు. వారి బ్రతుకలపై ఎవ్వరికి జాలిలేదు. అంటరానితనాన్ని, ఒంటరితనాన్ని అనాదిగా పదిలపర్చుకొన్న జాతి తన హృదయాలను మడిగా జాడీలలో దాచుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్పృత్యతపై ధ్వజమెత్తారు. ‘‘అందాల మనదేశము, అందచందాల మన దేశము పెంపొందాలి కలకాలం’ అంటూ జాతీయాభిమానాన్ని వ్యక్తం చేశారు. మాతృభాషా మాధుర్యానికి పరవశించిన కవి ‘పాడనా తెలుగు పాట, మంచి ముత్యాలపేట, మధురామృతాల తేట’ (అమెరికా అమ్మాయి) అంటూ తెలుగు వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘ఒళ్లంతా ఒయ్యారి కోక, కళ్లకి కాటుక రేఖ, మెళ్లోతాళీ, కాళ్లకు పారాణి, మెరిసే కుంకుమబొట్టు’ అంటూ తెలుగు ఆడపడుచుని మనోహరంగా వర్ణించారు. కృష్ణశాస్త్రి ప్రకృతి కవి. అందుకే ఆకులో ఆకు, పూవులో పూవు, రెమ్మలో రెమ్మైనారు. ‘పచ్చని తోటల విచ్చిన పూవులు, ఊగేగాలుల తూగే తీగలు, కొమ్మల మోగే కోయిల జంట’లను స్తుతించారు. ‘మనసున మల్లెలూగించారు. కన్నుల వెన్నెల డోలలూగించారు.’ ‘సడిసేయకే గాలి, సడిసేయ బోకే, బడలి ఒడిలో రాజు పవ్వళించేనే’ (రాజమకుటం) అంటూ తన రాజుకు నిద్రాభంగం కలగరాదని వేడుకుంటున్న ప్రియురాలి ముగ్ధప్రణమాన్ని రూపకల్పన చేశారు. పురులు విప్పిన నెమళ్లు నాట్యమాడినట్లు, కృష్ణశాస్త్రిగారి పాటలలో మృదువైన తెలుగు పదాలు దొర్లాయి. ఆయన పాటలు నవీన రసహృదయాలకు ఒయాసిస్సులై దప్పికతీరుస్తూనే తీరని పిపాసను కలిగించాయి. శేషభార్గవి దేవులపల్లి
భూదేవి, శ్రీదేవీలతో కల్సి స్వామి జలకాలాడే పరమపావన తీర్థం స్వామి పుష్కరిణి. శ్రీ మహావిష్ణువు ఆదేశం మేరకు క్రీడాద్రిని భువికి తరలించినపుడు పుష్కరిణిని కూడా గరుత్మంతుడు తెచ్చి ఈ క్షేత్రమందు స్థాపించాడని స్థలపురాణం చెపుతోంది. సర్వ తీర్థాలకు నిలయమైన ఈ స్వామి పుష్కరిణిలో మునక వేస్తే సర్వ పాపాలు హరిస్తాయని ప్రతీతి. స్వామి పుష్కరిణి గురించిన ప్రస్తావన వరాహ, పద్మ, మార్కండేయ, స్కంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలలో మనకు గోచరమవుతుంది. స్వామి పుష్కరిణిని తెలిపే అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శంకణ మహరాజు స్వామివారి దర్శనం ఇక్కడే లభ్యమయిందని, సర్వతీర్ధ ఫలసిద్ధిని ప్రసాదించే ఈ పుష్కరిణి ప్రదేశంలోనే కుమారస్వామి తపస్సు చేశాడాని అందుకే ఈ తీర్ధరాజానికి ‘స్వామి పుష్కరిణ’నని పేరు వచ్చిందని కథనం. ఇదే విషయాన్ని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ శ్రీ వేంకటాచల మాహాత్మ్యము లో మనోహరంగా తెలిపింది. సీ. మును తారకాసురుఁడను వాని సేనాని యదిమి చంపిన బ్రహ్మహత్య చేతఁ బీడితుఁడై, నిజపితృవాక్యమంగీక రించి గ్రక్కున నిర్గమించి, మొనసి యా వేంకటాద్రికై యభిముఖుఁడై వచ్చు నప్పుడాతని బ్రహ్మహత్య జడిసి యా కుమారుని వీడి యార్చి చెచ్చెర డిగ్గి పోయె, నంతట శివపుత్రుఁడలరి తే. వేంకటాద్రికి వచ్చి, వేవేగ స్వామి పుష్కరిణిలోనఁ గ్రుంకి, తెప్పున వరాహ దేవు వీక్షించి చాలఁ బ్రార్ధించి మ్రొక్కి యపుడు కృతకృత్యుఁడయ్యె షడాననుండు. పుష్కరిణి స్నానం, ఏకాదశి వ్రతం, సద్గురుపాద సేవనం దొరకటం దుర్లభం. అయితే ‘కొండపై శ్రీవేంకటాద్రి కోనేటిరాయుడై, కొండవంటి దేవుడైనకోవిదుడా ఇతడ’న్నట్టు, అఖిల జనాల పాపాలను హరించే స్వామి పుష్కరిణి దర్శన, స్నాన భాగ్యాన్ని ఈ కలియుగంలో భక్తులకు కల్గించాడు. గరుడగంభముకాడ కడుబ్రాణాచారులకు వరము లొసగీని శ్రీ వల్లభుడు తిరమై కోనేటిచెంత దీర్ధఫలములెల్ల పరుషల కొసగీని పరమాత్ముడు అంటూ, ‘సకల గంగాదితీర్ధ స్నానఫలములివి స్వామి పుష్కరిణి జలమే నాకు’ అని అన్నమయ్య కోనేరు తీర్థాన్ని సేవించి, సొబగులతో వెలుగొందుతున్న స్వామిపుష్కరిణి సొగసులను చూసి విస్మయం చెంది, మనోహరంగా స్వామి పుష్కరిణిని ఈ కింది విధంగా వర్ణించాడు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా ధర్మార్ధ కామమోక్ష తతులు నీ సోపానాలు అర్మిలి నాలుగు వేదాలదె నీదరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు కూర్మము నీలోతు వో కోనేరమ్మ తగిన గంగాదితీర్ధములు నీ కడళ్లు జగతి దేవతలు నీ జలజంతులు గగనపు బుణ్యలోకాలు నీదరి మేడలు మొగి నీ చుట్టు మాకులు మునులోయమ్మ వైకుంఠనగరము వాకిలే నీ యాకారము చేకొను పుణ్యములే నీ జీవభావము యే కడను శ్రీ వేంకటేశుడే నీవునికి దీకొని నీ తీర్థ మాడితిమి కావమ్మ || ఇప్పుడు మనం చూస్తున్నా పుష్కరిణిగాక, పాత పుష్కరిణి ఒకటి ఉండేదని తిరుపతి చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. 16వ శతాబ్ధంలో 2.5 ఎకరాలలో అచ్యుతరాయడు దీనిని నిర్మించాడు. కాని 19వ శతాబ్ధంలో మహంతులు దీనిని పూడ్పించారు. నేటి శ్రీ స్వామివారి పుష్కరిని 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. స్వామి పుష్కరిణిలో మహా శక్తి ప్రభావాలున్న తొమ్మిది తీర్థరాజాలు - తూర్పు భాగంలో ఆయుష్షుని కల్గించే మార్కండేయ తీర్థం, అగ్నేయంలో పాపాల్ని పారద్రోలే అగ్నేయ తీర్థం, దక్షిణంలో నరక కలుగకుండా యామ్య తీర్థం, నైఋతిలో ఋణ విముక్తి నిచ్చే వశిష్ఠతీర్థం, పశ్చిమంలో పుణ్యాన్ని అనుగ్రహించే వారుణ తీర్థం, వాయవ్యంలో కైవల్యాన్ని ప్రసాదించే వాయు తీర్థం, ఉత్తరంలో సంపదనలిచ్చే ధనద తీర్థం, ఈశాన్యంలో భుక్తి-ముక్తి ప్రదాత గాలవ తీర్థం, చివరగా, మధ్య భాగంలో మహాపాతక నాశిని సరస్వతీ తీర్థం నిత్యమూ కలుస్తాయని బ్రహ్మ పురాణం తెలుపుతోంది. ముక్కోటిద్వాదశీ పవిత్ర దినమున ముప్పడిమూడు కోట్ల పవిత్రతీర్ధాలు ఈ పుష్కరిణిలో కలుస్తాయని కూడా పురాణాలు తెలుపుతున్నాయి. ‘తీర్ధముక్కోటి’ ఖ్యాతినొందిన స్వామి పుష్కరిణి వైభవాన్ని అన్నమయ్య నోరారా కొనియాడి తరించాడు. వీడివో లక్ష్మీపతి వీడివో సర్వేశ్వరుడు వీడివో కోనేటి దండవిహరించే దేవుఁడు కొండ గొడుగుగ నెత్తి గోవులఁ గాచెనాఁడు కొండవంటిదానవుని గోరిచించెను కొండ శ్రీ వేంకట మెక్కి కొలువున్నాడప్పటిని కొండవంటి దేవుడిదే కోనేటికరుతును మాకుల మద్దులు దొబ్బి మరి కల్పభూజమనే మాకు వెరికి తెచ్చెను మహిమీదికి మాకుమీద నెక్కి గొల్లమగువలచీర లిచ్చి మాకులకోనేటిదండ మరిగినాడిదివో శేషునిపడగెనీడ జేర యశోదయింటికి శేషజాతి కాళింగు జిక్కించి కాచె శేషాచలమనేటి శ్రీ వేంకటాద్రిపై శేషమై కోనేటిదండ జెలగీని దేవుడు|| వరాహస్వామి ఆలయం ఎదురుగా ఉండటం చేత దీనిని వరాహ పుష్కరిణి అని కూడా పిలుస్తారు. ఈ పుష్కరిణిలో బ్రహ్మోత్సవంలో చివరిరోజున, రథసప్తమి రోజున స్వామివారికి పవిత్ర స్నానాలు జరుపుతారు. అలాగే ప్రతి సంవత్సరం ఈ స్వామి పుష్కరిణిలోనే సీతారామలక్ష్మణులకు, రుక్మినీ కృష్ణులకు, శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరునకు తెప్పోత్సవాలు జరుగుతాయి. తీర్ధాలలోకెల్ల పావనమైన స్వామి పుష్కరిణిని, కోనేటిలో జలకాలాడే స్వామిని కనులారా మనోనేత్రంతో వీక్షించి మొక్కడోయని అన్నమయ్య ఆర్తితో కోరాడు. అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొనె బ్రహ్మము కోనేటిదరిని రవిమండలమున రంజిల్లు తేజము దివిజంద్రునిలో తేజము భువి సనలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వ తేజము క్షీరాంబుధిలో జెలగు సాకారము సారె వైకుంఠపుసాకారము యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము పొలసిన యాగంబులలో ఫలమును పలుతపములలో ఫలమును తలచినతలపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము||

శాస్త్రాణాం పరమో వేదః, దేవానా పరమో హరిః తీర్ధానాం పరమం తీర్థం, స్వామి పుష్కరిణీ నృప

సౌమ్యశ్రీ రాళ్లభండి
నిర్ధిష్టమైన రూపం, రసం, భావం కల్గిన అద్భుతమైన, సమ్మోహనమైన, అందమైన, మోహనకరమైన రాగం ‘మోహన’. ప్రపంచంలోని అన్ని సంగీతరీతుల్లోనూ ఈ రాగం బహుళ ప్రసిద్ధిచెందింది. ఇది ఉపాంగ, వర్జ్య, ఔడవరాగం మరియు 28వ మేళకర్త హరికాంభోజి జన్యరాగం. అయితే మధ్యమం, నిషాదాలను గ్రహంచేస్తే మేచకళ్యాణి, ధీరశంకరాభరణ రాగాలు కూడా మోహనకు జన్యరాగాలుగా పేర్కోనవచ్చు. ముత్తుస్వామి దీక్షితార్ మనవడు బ్రహ్మశ్రీ సుబ్బరామ దీక్షితార్ రచించిన ‘సంగీత సాంప్రదాయ ప్రదర్శిని’లో మోహన మేచకళ్యాణి జన్యరాగంగా పేర్కొన్నారు. ఈ రాగం స్వరస్థానాలు: షడ్జమం, చతుశృతి రిషభం, పంచమం, అంతరగాంధారం, చతుశృతి దైవతం (స,రి,గ,ప,నద,స / S R2 G3 P D2 S). ఇందు రిషభాన్ని గ్రహం చేస్తే మధ్యమావతి, గాంధారాన్ని గ్రహం చేస్తే హిందోళ, పంచమాన్ని గ్రహంచేస్తే శుద్ధసావేరి, చివరగా ధైవతాన్ని గ్రహం చేస్తే ఉదయరవిచంద్రిక రాగాలు వస్తాయి. ఇది చాలా అవకాశంము కల్గిన రాగం. రాగాలాపన, నెరవు, స్వరకల్పన, తానం, పల్లవి పాడుటకు అనువైన రాగం. త్రిస్థాయి రాగం. విళంబ, మధ్య, ధృతలయలుగా గల రాగం. అన్నివేళలందు పాడుకొను రాగం. శృంగార, భక్తి, శాంత, వీరరస ప్రధానమైన రాగం. శ్రోతలకు సులభంగా అర్ధమగుటయేకాక, పాడుటకు, ఆస్వాధించుటకు సులభమైన రాగం. తక్కువ స్వరాలతో ఎక్కువ రక్తి కల్గించే రాగం. స్వరకల్పనకు కష్టమైన రాగమైనా పద్యాలు, శ్లోకాలు, వర్ణనలు అద్భుతంగా పలికించే రాగం. జానపద, భజన కీర్తనలు ఈ రాగంలో విరివిగా కలవు. హిందుస్థానీ సంగీతంలో మోహనకు దగ్గరగా గల రాగాలు భూప్, భూపాల్, దేశికార్. జయదేవుని అష్టపది ధీరసమీరే, మామియం చలితావిలోక్యవృతం భూప్ రాగంలో ఎంతో ప్రసిద్ధికెక్కింది. అలాగే హరేరామ, హరే కృష్ణలోని కాంఛీ రే కాంఛీరే, ఆరాధనలో చందాహై తు, సూరజ్హై తు, సిల్ సిలాలో దేఖ ఏక్ క్వాబ్ తో యే సిల్ సిలేహువే, రుడాలీలోని దిల్ హూ హూ కరే, లవ్ ఇన్ టోక్యోలోని సాయనారా, సాయనారాలు ఈ రాగంలో స్వరపర్చిన పాటలే. ఇక ఉమరో జావ్ లోని ఇన్ ఆంఖోంకి మస్తీమే, భాభీ కీ ఛూడియా సినిమాలోని జ్యోతికలశ్ ఛలకేలు ఎంత ప్రజాదరణ పొందాయో చెప్పనక్కర్లేదు. ఈ రాగంలో అనేక పద్యాలు, లలిత సంగీత పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. వీటిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పాపాయి పద్యాలు, అద్వైతమూర్తి, కుంతీకుమారిలోని కన్నియలాగ వాలకము, ఆటపాటలలో మరచినావా రాజా, యెంకి ఊగెను కొమ్మ ఊయ్యాల, నీతోటే ఉంటాను నాయుడుబావ వంటి ఎంకిపాటలతోపాటు, భామాకలాపమనే యక్షగానంలోని శకునాలు మంచివాయే అనే గీతం , భారతీయుల కళాప్రభవమ్ము, ఆ మొఘల్ రణధీరులు వంటి పద్యాలు, చల్లగాలిలో యమునాతటిపై, మనసాయెరా మదనా, నినుజూడ వంటి లలితగీతాలున్నాయి. ఈ రాగంలో ప్రఖ్యాతి చెందిన రచనలు : 1. వరవీణ మృదుపాణి (గీతం) 2. నిన్నకోరి (తాన వర్ణం) 3. ఎవరురా, ననుపాలింప, రామా నిన్నే నమ్మి, మోహనరామ, భవనుత నా హృదయము, రారా రాజీవ లోచన, వేద వాక్యమని -- త్యాగరాజ స్వామి 4. నాగలింగం – దీక్షితార్ 5. నారాయణ దివ్యనామం – పాపనాశం శివన్ 6. చేరియశోదకు శిశువితడు – అన్నమాచార్య 7. బాలగోపాల – నారాయణతీర్ధుల తరంగం మోహన రాగం లో ప్రసిద్ధ సినీ పాటలు: 1. లాహిరి లాహిరి లాహిరిలో --మాయాబజార్‌ 2. చందనచర్చిత నీలకళేభర --తెనాలి రామకృష్ణ 3. మాణిక్యవీణాం(శ్యామల దండకం) – మహాకవి కాళిదాసు 4. లేరు కుశలవులకు సాటి – లవకుశ 5. నెమలికి నేర్పిన నడకలివే – సప్తపది 6. ఆకాశంలో ఆశలహరివిల్లు – స్వర్ణ కమలం 7. మధురమే సుధాగానం -- బృందావనం 8. చెంగు చెంగునా గంతులు వేయండి --నమ్మిన బంటు 9. ఎచటనుండి వీచెనో --అప్పుచేసి పప్పుకూడు 10. మనసు పరిమళించెను --శ్రీ కృష్ణార్జున యుద్ధం 11. అయినదేమో అయినది ప్రియ --జగదేకవీరుని కధ 12. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే --సాగర సంగమం 13. పాడవేల రాధికా --ఇద్దరు మిత్రులు 14. ఘనా ఘన సుందరా –చక్రధారి 15. సిరిమల్లే నీవె విరిజల్లు కావే – పంతులమ్మ 16. మదిలో వీణలు మ్రోగె –ఆత్మీయులు 17. నిన్ను కోరి వర్ణం – ఘర్షణ 18. మధుర మధురమీ చల్లని రేయ – విప్రనారాయణ 19. తెల్ల వార వచ్చె తెలియక నా స్వామి – చిరంజీవులు 20. మౌనముగా నీ మనసు పాడినా --గుండమ్మ కధ 21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె – మిస్సమ్మ 22. శివ శివ శంకరా --భక్త కన్నప్ప 23. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో --అమరశిల్పి జక్కన్న 24. పులకించని మది పులకించు – పెళ్ళికానుక 25. ఈనాటి ఈ హాయి, కలకాదోయి నిజమోయీ – జయసింహ 26. తూనీగ, తూనీగా – మనసంతా నువ్వే 27. మాటేరాని చిన్నదాని – ఓ పాపాలాలీ 28. ఆదిభిక్షువు వాడినేది కోరేది – సిరివెన్నల సౌమ్యశ్రీ రాళ్లభండి
మునుపు వరాహ సమూహము లనిశము వర్తించుచోట నా హరి కిటియై నెనవుగ నిల్చిన కతమున ననఘ! వరాహాద్రిపేర నా నగమొప్పన్. (శ్రీ వేంకటాచల మహాత్మ్యము) శ్వేతవరాహావతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించిన పిదప భూలోకంలో ఈ తిరుమల కొండనే నివాసంగా నేర్పర్చుకుని శ్రీహరి నివసించాడని బ్రహ్మాండపురాణం మనకు తెలుపుతోంది. అందువల్లే ఈ క్షేత్రం ‘ఆదివరాహ క్షేత్రం’ అనీ, ‘శ్వేతవరాహ క్షేత్ర’ మని, భూదేవితో కల్సి ఇక్కడ విహరిస్తున్నందున్న ‘భూవరాహ క్షేత్ర’ మని ప్రసిద్ధికెక్కింది. ఇప్పటికీ స్వామిపుష్కరిణికి వాయువ్యదిశలో లక్ష్మీసమేతుడై శ్వేతవరాహుడు విరాజిల్లుతున్నాడు. వరాహ దర్శనా త్పూర్యం శ్రీనివాసం నమేన్న చ దర్శనా త్ప్రా గ్వరాహస్య శ్రీనివాసూ న తృప్యతి. క్షేత్రసాంప్రదాయం ప్రకారం శ్వేతవరాహస్వామిని దర్శించకుండా వేంకటేశ్వరుని దర్శించరు. కాలక్రమేణా ఈ సాంప్రదాయాన్ని భక్తుల పూర్తిగా విస్మరిస్తున్నారు. శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో నివసించగోరి, ఆలయ నిర్మాణానికి 100 అడుగులచోటును వరాహస్వామి వద్ద నుంచి యాచించి పుచ్చుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతిఫలంగా, ప్రథమ పూజ, ప్రథమ దర్శనం, ప్రథమ నైవేద్యం వరాహస్వామికే దక్కేటట్టు శ్రీనివాసుడు వరాలచ్చినట్టు ప్రతీతి. నేటికి ఈ సాంప్రదాయం ప్రకారమే తొలిపూజ, తొలి నైవేద్యం శ్వేతవరాహస్వామికే జరుపబడతాయి. అంతేకాక, బ్రహ్మోత్సవ చివరిరోజు స్వామివారు భూదేవి, శ్రీదేవిలతో కలసి ఇక్కడకి విచ్చేసి పూజలందుకుంటాడు. ‘మహావరాహో గోవిందః’ అనే విష్ణు సహస్రనామం ఈ పురాణగాథను తెలుపుతుంది. గో అనగా భూమి, వింద అనగా పొందినవాడు. వరాహస్వామి నుండి భూమిని పొందినవాడు వేంకటేశ్వరుడే! అన్న స్మృతి మనకు గోవిందా అన్న నామం స్మరించిన ప్రతిసారీ కలగకమానదు. ఆ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా కోనేటికి ఆవలివైపు నమస్కార భంగిమలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. దీనిని వ్యాసరాయలవారు ప్రతిష్టించారని ప్రతీతి. తిరుమల కొండకు నడిచే వెళ్లే మార్గంలో దాదాపు 30 అడుగులు గల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం భక్తులకు అల్లంత దూరం నుంచే చేరుకున్నారు వేంకటగిరని చాటి చెపుతుంది. అన్నమయ్య మాటలలో చెప్పాలంటే, ఆకాసమంతయ నిండి యవలికిఁదోఁక చాఁచి పైకొని పాతాళానఁ బాదాలు మోపి కైకొని దశదిక్కులు కరములఁ గబళించి సాకారము చూపినాడిచ్చడ హనుమంతుడు గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా ధరణి మేరు కటితటము గాఁగా ఇరవుగా శ్రీవేంకటేశుని సేవకుఁడై బెరసె నిచ్చట నిదె పెద్ద హనుమంతుడు. ఆంజనేయునికి తిరుమల కొండకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా తోస్తుంది. బ్రహ్మాండ పురాణంలో ఇందుకు తగిన దివ్యగాథ కూడా ఉంది. మతంగముని ఆదేశంతో వేంకటాచలంపై ఆకాశగంగ తీర్ధావరణలో తపస్సుచేసి అంజనాదేవి వాయుపుత్రునికి జన్మనిచ్చింది. అందుకే ఈ గిరి అంజనాద్రిగా పేరొందింది. మాతృశ్రీ తరిగిండ వేంగమాంబ తన వేంకటేశ్వర మాహాత్మ్యంలో ఇదే గాథను అద్భుతంగా వర్ణించింది. అంజనాదేవి తపము మున్నచట జేసి పొసగ హనుమంతుడను వరపుత్రుంగాంచె నపుడు దేవతలెల్ల సహాయు లగుచు నా గిరికి నంజనాద్రి పే రమర నిడిరి. ఈ క్షేత్ర మహిమను అన్నమయ్య తన కీర్తనలో ఈ కిందివిధంగా కొనియాడాడు. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్వి దపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపు టంజనాద్రి యీ పొడవాడి కొండ. ప్రసన్నాంజనేయుడు, కోనేటి ఆంజనేయునితోపాటు శ్రీవారి ఆలయానికి ఎదురుగా సన్నిధి వీధిలో బేడి ఆంజనేయస్వామి కోవెల ఉంది. చేతికి, కాళ్లకు బేడీలతో స్వామివారికి అంజలి ఘటిస్తుండే ఈ మూర్తి వెనకాల కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. పొదలు సొంపగు నింపుల పూబొదలు వాసన నదులూ మొదలూగల తామర కొలంకులపై మెదలు తుమ్మెదలూ కదలి మలయానిలు వలపుల పస కదళీ వనములనూ మొదలుగా నెల్లప్పుడు నీ సంపదలు గల మా కొండా|| ఎల్లప్పుడు పచ్చని చెట్లతో, పరిమళ ఝరులతో, పూదోటలతో, తుమ్మెదల ఝూంకారాలతో, అరటి తోటలతో శోభిల్లే అంజనాద్రిపై ఆ అంజనాసుతుడు ఊరక ఉండమంటే ఉంటాడా? అల్లరి, చిల్లరగా చిలిపి పనులతో విసిగిస్తున్న హనుమంతుని కాళ్లకు చేతులకు బేడీలు తగిలించి ఆ వేంకటేశ్వరుని ముందు కదలకుండా అంజనాదేవి నిలబెట్టిందట. సార్ధక నామధేయుడై అప్పటినుండి వేంకటేశ్వరుని చేరువలో కొలువై ప్రతి ఆదివారం పంచామృతాభిషేకాలను, పూజా నివేదనాదులను పొందుతూ స్వామివారి కనుసన్నలలో మెదులుతూ భక్తులకు తృప్తిని కల్గిస్తున్నాడు. అందిరిలోనా నెక్కుడు హనుమంతుడు కందువ మతంగగిరికాడి హనుమంతుడు కనకకుండలాలతో కౌపీనముతోడ జనియించినాడు యీ హనుమంతుడు ఘన ప్రతాపముతోడ కఠినహస్తాలతోడ పెనుతోక యెత్తినాడు పెద్దహనుమంతుడు తివిరి జలధిదాటి దీపించి లంకయెల్లా అవలయివల నేసె హనుమంతుడు వివరించి సీతకు విశ్వరూపము చూపుతూ ధ్రువమండలము మోచె దొడ్డ హనుమంతుడు తిరమైన మహిమతో దివ్యతేజముతోడ అరసి దాసులగాచీ హనుమంతుడు పరగ శ్రీ వేంకటేశుబంటై సేవింపుచు వరములిచ్చీ బొడవాటి హనుమంతుడు. అంజనాచలమే నివాసమైన ఏలిక ఒకరు కాగా, అంజలి ఘటిస్తూ మక్కువతో బంటువైన ఘనుండు మరొకడు. ఇదే అభిప్రాయాన్ని అన్నమయ్య మరొక కీర్తనలో వెలిబుచ్చాడు. అంజనాచలము మీద నతండు శ్రీ వేంకటేశుఁ డంజనీ తనయుఁడాయ ననిలజుఁడు కంజాప్తకుల రామఘనుడు దానును దయా పుంజమాయ మంగాంబుధి హనుమంతుఁడు. అందుకేనేమో అన్నమయ్య కూడా ఆ పెద్దహనుమంతునికి తన సంకీర్తనలలో పెద్దపీటవేశారు. మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడా యీతడా రాముని బంటు యీతడా వాయు సుతుడు ఆతతబలాడ్యూడందు రాతడితడా సీతను వెదకి వచ్చి చెప్పిన యాతడితడా ఘాతల లంకలోని రాక్షస వైరి యితడా ఆంజనాసుతడితడా అక్షమర్ధనుడితడా సంజీవిని కొండ దెచ్చే సారె నితడా భంజిన్‌చె గాలనేమిని పంతమున నితడా రంజితప్రతాప కపిరాజ సఖుడితడా చిరంజీవి యీతడా జితేంద్రియుడితడా సురల కుపకారపుచుట్ట మీతడా నిరతి శ్రీ వేంకటాద్రీని విజనగరములో నరిది వరములిచ్చీ నందరికి నితడా అని ఒక కీర్తనలో కీర్తిస్తే, మరో చోట... పంతగాడు మిక్కిలి నీ పవనజుడు రంతుకెక్కె మతంగ పర్వత పవనజుడు వాలాయమై ఎంత భాగ్యవంతుడో దేవతలచే బాలుడై వరములందె పవనజుడు పాలజలనిధి దాటి పరగ సంజీవి దెచ్చి ఏలిక ముందర బెట్టే ఈ పవనజుడు అట్టి పవనుజుడుని, అదె చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచె అదివో ధృవమండల మందె శిరసు చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు ఎదుట యీతని మహిమ యేమని చెప్పేమయ్య, అంటూ, అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము, పదియారు వన్నెల బంగారు కాంతులతోడ పొదిలిన కలశాపుర హనుమంతుడు, త్రివిక్రమమూర్తియైన దేవునివలెనున్నాడు భువిసేవించే వారి పాలి పుణ్యఫల మీతడు తేరి మీద నీ రూపు తెచ్చి పెట్టి అర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని అని వేర్వేరు కీర్తనలలో కొనియాడాటంతోపాటు, ఆ శ్రీఆంజనేయుని, ప్రసన్నాంజనేయుని పవిత్ర ద్వాదశనామాలను ఈ కింది కీర్తనలో గానం చేసి భక్తులందరిని తరిపంచేశాడు. తలచరో జనులు యీతని పుణ్యనామములు సులభమునే సర్వశుభములు గలుగు హనుమంతుఁడు వాయుజుఁ డంజనాతనయుండు వనధిలంఘనశీలవై భవుఁడు దనుజాంతకుఁడు సంజీవనీశైల సాధకుఁడే ఘనుఁడగు కలశాపురహనుమంతుఁడు లంకాసాధకుఁడు లక్ష్మణప్రబోధకుఁడు శంకలేని సుగ్రీవసచివుఁడు పొంకపు రామునిబంటు భూమిజసంతోషదూత తెంకినేకలశాపురదేవహనుమంతుడు చటులార్జునసఖుఁడు జాతరూపవర్ణుఁడు ఇటమీఁద బ్రహ్మపట్టమేలేటివాఁడు నటన శ్రీ వేంకటేశునమ్మిన సేవకుఁడు పటు కలశాపురప్రాంత హనుమంతుడు. సౌమ్యశ్రీ రాళ్లభండి
శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ అచలం లేక అద్రి అంటే కొండ. శేషాచలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనే ఏడు పర్వతశ్రేణుల మధ్య, దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులు విహరించే బంగారు పుడమిపై, ‘గతులన్ని ఖిలమైన కలియుగమందును, గతి యీతడే చూపె ఘనగురుదైవము’ గా ఆ అఖిలాండనాయకుడు సప్తగిరీశుడై వెలుగొందుతున్నాడు. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిపొందిన ఈ తిరుమలగిరి ఒక్కొక్కయుగంలో ఒక్కొక్కపేరుతో ప్రభవించింది కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలమ్ ద్వాపరే శేషశైలతే కలౌ శ్రీ వేంకటాచలమ్ నామాని యుగభేదేన శైలస్యాస్య భవంతి హి. కృతయుగంలో వృషాద్రని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపరయుగంలో శేషాద్రని, కలియుగంలో వేంకటాద్రని ఈ దివ్య క్షేత్రం బాసిల్లుతోంది. ఇక్కడి ప్రతి పర్వతానికి ఒక విశిష్టత, ఒక పురాణగాథ ఉన్నాయి. ‘వేం’ అంటే పాపాలు ‘కటః’ అంటే దహించేది. చూచిన తోడనే మనలోని పాపాలను నశింపచేసే క్షేత్రమే వేంకటాద్రి. ఆదిశేషుడే తన పదివేలతలలపై మోస్తున్న క్రీడాద్రే ఈ శేషాచలము. అటువంటి భూలోక వైకుంఠాన్ని అన్నమయ్య తనివితీరా కీర్తించి గానం చేశాడు. కట్టెదురు వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయె మహిమలే తిరుమల కొండ || వేదములే శిలలై వెలసినదీ కొండ ఏదెస పుణ్యరాశులే ఏరులైనదీ కొండ గాదలి బ్రహ్మాదిలో కములకొనల కొండ శ్రీదేవుడుంటేటి శేషాద్రి ఈ కొండ || సర్వ దేవతలు మృగ జాతులై సంచరించే కొండ నిర్వహించే జలధులే నిట్టచఱులైన కొండ ఉర్వితపసులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ || వరములు కొటారులై వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు సో బనపుకొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ సిరులైన దిదివో శ్రీ వేంకటపు కొండ || అంజనాదేవి తపఫలము వల్ల హనుమంతుడు పుట్టిన ఈ గిరి అంజనాద్రి అయితే, జ్ఞాన సంపదలను పెంపొందించే జ్ఞానాద్రై, వరాహమూర్తి ఆజ్ఞానుసారం గరుడు తీసుకొచ్చిన వేంకటాద్రి కావున గరుడాద్రి అయింది. ఇలా స్వామివారి లీలావిలాసాలకు నెలవై కోరిన కోరికలు తీర్చే చింతామణై వెలుగొందుతున్న హరినివాసాన్ని చూచి తరించమని అన్నమయ్య ఈ దిగువ కీర్తనందించాడు. అదివో అల్లదిగో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము || అదె వెంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు అదె చూడు డదెమ్రొక్కు డానందమయము || చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము || కైవల్య పదము వేం కటనగమదివో శ్రీవేంకటపతికి సిరలైనది భావింప సకల సంపదరూపమదివో పావనముల కెల్ల పావనమయము || మాతృశ్రీ తరిగొండ వేంకమాంబ ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము’లో ఈ శ్రీనివాస పర్వతనామ ఔనిత్యాన్ని చాటుతూ, శ్రీని నురంబున నిడికొని శ్రీనారాయణుడు ప్రజకు సిరులిచ్చుచు నం దానందింపుచు నుండగ నానందాచల మనంగ నగ్గిరి యొప్పెన్ || అని ఈ పర్వతశ్రేణి ఆనందనియలంగా మారిన వృత్తాంతాన్ని వివరించింది. ‘వేం’ అనగా అమృతం, ‘కట’ అంటే ఐశ్వర్యం అని మరో అర్ధాన్ని కూడా తెలిపే వేంకటాచలం చూచినతోడనే ఇహపర సుఖాలతోపాటు ముక్తిని ప్రసాదిస్తుంది. సర్పాకారంలో అగుపించే ఈ శేషాద్రి శిఖర భాగాన (తల) శ్రీ వేంకటేశ్వరుడు (తిరుమల), మధ్యభాగాన (నడుము) శ్రీ నృసింహుడు (అహోబిలం), చివర భాగాన (తోక) శ్రీమల్లికార్జునుడు (శ్రీశైలం) వెలసి ఉన్నారని పురాణ గాథలు తెలుపుతున్నాయి. అనేక దివ్య తీర్థాలతో వెలుగొందుతున్న ఈ తీర్ధాచలంపై వక్షస్థలంలో వ్యూహాలక్ష్మిగా సాక్షాత్తు మహాలక్ష్మినే నిలుపుకున్న ‘కలౌః వేంకటనాయకుడు’ శరణన్నవారికి శరణిచ్చి రక్షిస్తూ ఆపదమొక్కులవాడని, గోవిందుడని సార్ధకనామధేయుడైయ్యాడు. ఇదే భావనను అన్నమయ్య తన కీర్తనలలో పదే, పదే పేర్కొని మనను చరితార్ధులను చేశాడు. మతంగపర్వతము మాలవంతము నడుమ సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాడు || కొలచినవారికెల్లా కోరినవరములిచ్చి తలచినవారినెల్లా ధన్యులజేసి పొలుపుమిగుల మంచిపువ్వలతోటనీడ విలసిల్లీనదివో శ్రీవేంకటేశ్వరుడు || శరణన్నవారికి చనవిచ్చి రక్షించి గరిమ బూచించువారి గరుణజూచి పరిపూర్ణమగు తుంగభద్రాతటమునందు విరివిగొన్నాడు శ్రీ వేంకటేశ్వరుడు || తను నమ్మినవారికి తగిన సంపదలిచ్చి కని నుతించేవిరికి కామధేనువై కనకమయములైన ఘనమైనమేడలలో వినుతికెక్కెను శ్రీ వేంకటేశ్వరుడు|| సౌమ్యశ్రీ రాళ్లభండి
మలహరి అనగా మలినం పోగొట్టునది అని అర్ధం. శుభప్రదమైన రాగం. ఇది ఔడవ,షాడవ ఉపాంగరాగం. ఈ రాగం స్వర స్థానాలు షడ్జమం, పంచమం కాక శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, (స,రి,గ.మ,ప,ద,స / S R1 G3 M1 P D1 S). ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సదపమగరిస. దీనిని భక్తిరస ప్రధాన రాగంగా పేర్కొనవచ్చు. ఇది ప్రభాత రాగం. ఇందు మ,ప,దలు జీవ స్వరాలు. ఈ రాగం గురించిన ప్రస్తావన సంగీతరత్నాకర, సంగీతమార్తాండ, రాగతాళ చింతామణి మొదలైన ప్రాచీన సంగీత పుస్తకాలందు మనకు కన్పిస్తుంది. ఇది పూర్వం వాడుకలో ఉన్నా ఇప్పుడు మరుగున పడిపోయింది. అయితే, ఈ రాగమందు కర్ణాటక సంగీతపితామహుడు పురందరదాసు అభ్యాసగానానికి అనువుగా నాలుగు పిళ్ళారి గీతాలు – శ్రీ గణనాథ, కుందగౌర, కెరయనీరను మరియు పదుమనాభా – రచించారు. మలహరి రాగంలో ప్రసిద్ధ రచనలు: 1. పంచమాతాంగముఖ – ముత్తుస్వామి దీక్షితార్ 2. అనంతపద్మనాభం – ముత్తయ్య భాగవతార్ 3. ఇన్నిటిమూలంబీశ్వరుడాతని – అన్నమయ్య మలహరి స్థానే నేడు సావేరి రాగం ప్రసిద్ధి చెందింది. ఈ రెండు రాగములకు అవరోహణ యందు నిషాదము మాత్రమే భేదము. ఈ రాగ ఆరోహణ, అవరోహణలు: సరిమపదస, సనిదపమగరిస. ఇది ఔడవ, సంపూర్ణరాగం. ఇందు రి,మ,దలు రాగా ఛాయా స్వరాలు. ఈ స్వరాలు సావేరి రాగ లక్షణాన్ని వెలికి తీస్తాయి. ఈ స్వరంలో మధ్యమానికున్న ప్రత్యేకత దృష్ఠ్యా దీనిని ‘సావేరి మధ్యమం’ అని కూడా పిలుస్తారు. ఇది కరుణ, శోకరసాలు పలికించే రాగం. సూర్యోదయ, సూర్యాస్తమయాలలో పాడుకోడానికి అనువైన రాగం. సంగీత త్రిమూర్తులు ముగ్గురూ మొత్తం 28 రాగాలలో కనీసం ఒక కృతైనా రచించారు. ఆ రాగాలలో ఒకటి సావేరి రాగం. ఈ రాగంలో త్రిమూర్తులు ముగ్గురూ కలిసి 26 రచనలు చేశారు. అందు 19 కేవలం త్యాగరాజే చేశాడు. ఈ రాగాన్ని భాషాంగ రాగంగా సంగీత రత్నాకర పేర్కొంది. ‘‘కావేరి స్నానం, సావేరి రాగం’’గా బహుళ ప్రచారం చెందిన ఈ రాగం కర్ణాటక సంగీతంలోనే ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకుంది. ఎంతో ప్రాచీనమైన ఈ రాగ ప్రస్తావన సంగీత రత్నాకర, సంగీత సమయసారగౌడ మేళానికి జన్యరాగమని బృహధర్మ పురాణం పేర్కొంది. ఈ రాగం సాలంగనాథ మేళ జన్యమని, గౌళ మేళజన్యమని, మల్లారి జన్యమని కూడా ప్రచారంలో ఉంది. సావేరి రాగంలో ప్రసిద్ధ రచనలు: 1. సరసుడా (వర్ణం) – వెంకటరామ అయ్యర్ 2. శంకరి శంకురు, దురుసుగా కృప జూచి, జనని నతజనపరిపాలిని – శ్యామశాస్త్రి 3. ఆంజనేయ, పరిపాహి గణాధిప (నవరాత్రి కృతి) – స్వాతి తిరునాళ్ 4. శ్రీ రాజగోపాల, కరికళభ ముఖం – ముత్తుస్వామి దీక్షితార్ 5. పరాశక్తి మను, రామబాణ త్రాణ, తులసీ జగజ్జననీ – త్యాగరాజస్వామి 6. ఎంతనేర్చినా – పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ 7. శ్రీ కామకోఠి పీఠ – మైసూర్ సదాశివ బ్రహ్మం 8. మురుగా, మురుగా – పెరియస్వామి తూరన్ 9. మెచ్చోనక రాగంబు – అన్నమయ్య 10. మాధవా మధుసూదన, హరియే సర్వోత్తమ – పురందరదాసు 11. సీతారామస్వామి, దినమే సుదినము - రామదాసు సౌమ్యశ్రీ రాళ్లభండి
దాచుకో నీపాదాలకు - దగ నే జేసినపూజ లివి పూచి నీకీరీతిరూప - పుష్పము లివి యయ్యా || వొక్కసంకీర్తనే చాలు - వొద్దికైమమ్ము రక్షించగ తక్కినవి భాండారాన - దాచి వుండనీ వెక్కసమగునీ నామము - వెలసులభము ఫల మధికము దిక్కై నన్నేలితి విక నవి తీరనినాధనమయ్యా || నానాలికపైనుండి - నానాసంకీర్తనలు పూని నాచే నిన్ను -బొగడించితివి వేనామాలవెన్నుడా -వినుతించ నెంతవాడ కానిమ్మని నా కీపుణ్యము -గట్టితి వింతేయయ్యా || యీమాట గర్వము గాదు - నీ మహిమే కొనియాడితిగాని చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడగాను నేమాన బాడేవాడను - నేరము లెంచకుమీ శ్రీమధవ నే నీదాసుడ - శ్రీవేంకటేశుడవయ్యా ||దాచు|| అని సవినయంగా కోరుతూ, హరి అవతారమైన అన్నమయ్య దాదాపు 32వేల సంకీర్తనలతో ఆ వేంకటేశ్వరుని అర్చించి ఆ వేంకటాచల వైభవాన్ని, మహాత్మ్యాన్ని సాక్షాత్కరింప చేశాడు. తరచి చూస్తే, ఆయన ఆధ్యాత్మ, శృంగార కీర్తనలలో ఏడుకొండలవాని తత్త్వము, తిరుమల వైశిష్ట్యం, వేంకటాచల వాసుని శోభ మనకు అవగతమవుతాయి. వేదములే శిలలై వెలసిన దీ కొండ యే దెస బుణ్యరాసులే యేరులైన దీ కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి యీ కొండ అంటూ, అన్నమయ్య ఆ శేషాద్రి యొక్క ప్రశస్తిని స్వామివారికి జరిగే సేవలు, అర్చనలు, ఉత్సవాలు, తిరుమల వైభవాన్ని తన సంకీర్తనలలో కీర్తించాడు. ఎన్నెన్నో ఉద్యానవనాలతో, పుణ్య తీర్థాలతో, మణిమయ గోపురాలతో, వెలుగొందే ఆనందనిలయం శోభ వర్ణనాతీతం. సీ. ఘన గోపురములు, ప్రాకార మంటపములు, తేరులు, సత్పుణ్య తీర్ధములును, కమలాప్త కిరణ సంకలితంబులై ప్రకా శించుచుండెడి హేమ శిఖరములును, పావన పరివార దేవతాలయములు, మహిమ నొప్పు విరక్తమఠవరములు, రంగ దుత్తుంగ మాతంగ తురంగముల్, కొమ్మరొప్పు బహుసాధు గోగణములు, తే. ముద్దుగా బల్కు శుకపికములును, నీల కంఠములును, మరాళసంఘములు మఱియు ఫల చయుంలు, తులసికాదళ, సుమములు క్రిక్కిఱిసియుండు వేంకటగిరి పురమున (శ్రీ వేంకటాచల మహాత్మ్యములో తరిగొండ వేంగమాంబ) ఉగ్రవరాహ రూపం దాల్చి ఇలచేరిన విష్ణువు ఇక్కడే నివాసమేర్పర్చుకోవాలని సంకల్పిస్తే, తానిచటికి రాకుండిన, నేచటికినైనను వచ్చి, మహాత్ముని వక్షమున వసముండెదనని, పతిని చేరిన శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంలో నిలుపుకొని స్వయంభువుగా, ‘అరుదైన శంఖచక్రాదులతో, సరిలేని అభయ హస్తంతో’, శతకోటి సూర్యతేజములతో, అనుపమ మణిమయమగు కిరీటముతో వెలసిన శ్రీపతిని కన్నులారా దర్శించి, అతిశయంబైన ఆ శేషాద్రిని అన్నమయ్య నోరారా కీర్తించాడు. ప|| అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము లందు వెలుగొందీ ప్రభ మీరంగాను తగ నూటయివువైయెయిమిది తిరుపతుల గల స్థానికులును చక్రవర్తి పీఠకములును అగణితంబైన దేశాంత్రుల మఠంబులును నధికమై చెలువొందగాను మిగులనున్నతములగు మేగలును మాడుగులు మితిలేనిది దివ్యతపసులున్న గృహములును వొగి నొంగుబెరుమాళవునికి పట్టయి వెలయు దిగువతిరుపతి గడవగాను ||అదె|| పొదలి యరయోజనముపొదవునను బొలుపొంది పదినొండు యోజనంబులపరపునను బరగి చెదర కేవంకచూచిన మహాభూజములు సింహశార్దూలములును కదిసి సువరులు కిన్నరులు కింపురుషులును గరుడగంధర్వ యక్షులును విద్యాధరులు విదితమై విహరించు విశ్రాంత దేశముల వేడుకలు దైవారంగాను ||అదె|| యెక్కువలకెక్కువై యెసగి వెలసిన పెద్ద యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద అక్కజంబైన పల్లవరాయమనిమటము చక్కనేగుచు నవ్వచరి గడచి హరిదలచి మ్రొక్కుచును మోకాళ్లముడుగు గడచినమీద నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు అంతంతగానరాగాను ||అదె|| బుగులుకొనపరిమళంబులపూవుదోటలును పొందై ననానావిధంబుల వనంబులును నిగిడి కిక్కిరిసి పండిన మహావృక్షముల నీడలను నిలిచి నిలిచి గగనంబు దాకి శృంగారరసభూరితమై కనకమయమైనగోపురములను జెలువొంది జగతీధరునిదివ్యసంపదలు గలనగరు సరుగనను గానరాగాను ||అదె|| ప్రాకటంబైన పాపవినాశనములోని భరితమగుదురితములు పగిలి పారుచునుండ ఆకాశగంగతోయములు సోకిన భవము లంతంత వీడి పారంగను యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో యేకమై తిరువేంకటాద్రీశుడా దరిని యేప్రొద్దు విహరించగాను ||అదె|| ఈ బ్రహ్మాండంలోనే సాటిలేని, మేటైన దివ్య క్షేత్రం శ్రీనివాసుడుండేటి తిరుమలకొండ. శేషాద్రి, క్రీడాద్రి, వేంకటగిరి అని ప్రసిద్ధి చెందిన ఈ శిఖరానికి చింతామణి, జ్ఞానాద్రి, తీర్ధాచలము, పుష్కరశైలము, వృషభాద్రి, కనకాచలము, నారాయణాద్రి, శ్రీవైకుంఠాద్రి, నరసింహ గిరీంద్రము, అంజనాద్రి, వరహాద్రి, నీలగిరీంద్రము, శ్రీనివాస పర్వతము, ఆనందాచలము, శ్రీసద్గిరి, క్రీడాచలము, గరుడాద్రి, శేషాచలము, వృషాద్రి, మరియు వేంకటాద్రి అని కూడా పేర్లు కలవు. శ్రీమన్నారయణుడున్న ఈ పర్వత మహాత్మ్యాన్ని వర్ణించటం మానవమాత్రులకు సాధ్యంకాదు. మనోనేత్రంతో దర్శించి కళ్లముందు సాక్షాత్కరింపచేయటం అన్నమయ్య వంటి వాగ్గేయకారులకి మాత్రమే సాధ్యం.

‘‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి’’

సౌమ్యశ్రీ రాళ్లభండి
నాలుగైదు సంవత్సరాల క్రితం అన్నమయ్య సంకీర్తనార్చన అని ఒక కార్యక్రమం చేసి, ఆ వాగ్గేయకారుని కీర్తనలు ఆలపించాం. అప్పుడు ఆరేళ్ల మా అమ్మాయి కూడా నాలుగైదు కీర్తనలు పాడి మా బంధువర్గానికి ముఖ్యంగా మా అత్తమామాలకి కొంచెం ఆశ్చర్యం, కొంచెం సంతోషం, కూసింత గర్వ కల్గించింది. ఆ కార్యక్రమం వీడియో మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాదనకుండా, వద్దననీయకుండా మా మామ గారు సుత్తివీరభద్రరావు మాదిరి వీడియో అరిగిపోయేదాకా తాము చూసి, ఇతరులకి చూపి ఆనందపడిపోయారు. అక్కడితో ఆగితే ఏమో, ఆ ఊపులో ఇక తాళ్లపాకవారి పలుకులన్ని మా ఇంటనే అంటే మా అమ్మాయి నోటనే పలకాలన్న తాపత్రయంతో బజారులో ఉన్న అన్నమయ్య కీర్తనల క్యాసెట్లన్ని విరివిగా కొని ఆస్ట్రేలియాలో ఉన్న మాకు పంపారు. నేను కూడా శాయశక్తులా మా అమ్మాయి లేచినప్పటినుంచి నిదురపోయేదాక కీర్తనలు విన్పించి, విన్పించి పైసా వసూలు చేసాను. ఇంతలో మా మామగారు తిరుపతి వెళ్లటం తటస్థించింది. అక్కడ దేవస్థానం వారి పుస్తకాల షాపులో అన్నమయ్య కీర్తనల పుస్తకం దొరికింది. షరామామూలే! అది మా ఇంటికి వచ్చి చేరింది. కోతికి కొబ్బరికాయ దొరికనట్టు, నేనైనా నోరుమూసుకోవచ్చా, లేదు. తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య కీర్తనలన్నింటిని సుమారు 40 పుస్తకాల్లో ప్రచురించారని నోరుజారాను. అంతే ఉత్తర క్షణం మా మామగారు తిరుపతికి డిడి పంపి ఆ పుస్తకాలన్ని ఆర్డరిచ్చారు. ఏమాట కా మాటే చెప్పుకోవాలి, దేవస్థానం వారు కూడా ఎంతో శ్రద్ధగా, ఓపికగా ఆ పుస్తకాలన్నింటిని రెండు గోనె సంచీలకెత్తించి (ఇది హాస్యానికి అంటున్నమాటలు కాదండి! వాస్తవం) హైద్రాబాదులో మా మామగారికి పంపారు. అవి తపాల సర్వీసువారి ఆధ్వర్యంలో ఎండకి ఎండి, వానకు తడిసి, ముద్దై, నీరై, కొన్ని పుస్తకాలకు అట్టలు ఊడి, కొన్నింటి పేజీ చిరిగి, మరికొన్నింటి పేజీలు అతుకుల తడకై, బురుద మరకలతో, ముట్టుకుంటే ఊడిపోయేటట్టు తాళ్లపాకవారి కవిత వైభవాన్ని మోసుకుంటూ హైద్రాబాద్ చేరుకున్నాయి. బస్తాల్లో ఎవరు ఏ బాంబు పంపారో అని బెంబేలుపడి, అయినా ధైర్యం తెచ్చుకొని మూటవిప్పి, తమ ఇంటికి నడచి వచ్చిన అన్నమయ్యవారి కవితలను చూసి, ఆ భగవంతుడే, ఆ తిరుమలవాసుడే తమ ఇంటికి నడచి వచ్చాడని సంబరపడి, మళ్లీ ఆ బస్తాని యథాతధంగా మూటగట్టి, నాకో మెయిల్ పెట్టారు. అమ్మాయి, ఇక అన్నమయ్యవారు నీ సొత్తు ఎప్పుడు తీసుకువెడతావు అని. ఆ బస్తా చూసిన మా ఆడపడుచు వదిన పుస్తకాలు తీసుకు వెళ్లదేమో ఎందుకైనా మంచిది వీలునామాలో కూడా రాయి నాన్నా, అవి నా సొత్తని గట్టిగా చెప్పింది. మా అత్తగారు కూడా నాకు ఫోన్ చేసి, ఎలుకలు కొరికి, చెదలు పట్టిన పుస్తకాలు ఇంకా చెడిపోక ముందే సంరక్షించుకో అని హెచ్చరించారు. అది విని మా వారు కారాలు, మిరియాలు మిక్సీ అవసరం లేకుండానే మెత్తగా నూరారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం! నోరుజారిన పాపానికి మావారని బ్రతిమాలి, బామాలి, కాళ్ల,వేళ్లపడి ఆ పుస్తకాల బస్తాలను హనుమంతుడు సంజీవినీ పర్వతాన్ని మోసుకొచ్చినట్టు భద్రంగా, భక్తితో ఆస్ట్రేలియాకు చేర్చాం. బస్తాలు విప్పి ఆ పుస్తకాలు చూస్తుంటే, చెప్పొద్దు, ఎన్నో గంటలు పురిటినొప్పులు అనుభవించి, ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటే ఒక తల్లికి ఎంత ఆనందం కల్గుతుందో అంత ఆనందం కల్గింది. ఓర్పుగా ఒక్కొక్క పుస్తకం ఎండలో వేసి బాగా ఎండాయన్న నిర్ధారణకి వచ్చాక, చక్కగా పుస్తకాల బీరువాలో వాటిని అలంకరించి మురిసిపోయాను. ఇంతవరకు బాగానే ఉంది, తెలుగు చదవడం, రాయడం కూడా రాని మా అమ్మాయి అన్ని పుస్తకాలు చూసి మూర్చిల్లి, ఇక రేపటి నుంచి నన్ను తెలుగులో ముంచి, కీర్తనల్లో తేల్చి ఆరేస్తారేమోనని బెంబేలు పడితే దాన్ని ఊరుకోపెట్టి, అధైర్యపడద్దని ధైర్యం చెప్పి, ఏమి చేతురా లింగా అని పాడుకోవడం నా వంతైంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా ఏం సాధించారో నాకైతే తెలియదు గాని, పుస్తకాలని, వాటిలో విలువ కట్టలేని కవితా వైభవాన్ని కనీసం గుర్తించలేని వారు, గౌరవించలేని వారు అక్కడ పనిచేస్తున్నారని మాత్రం తెలుస్తోంది. పుస్తకాలు కొని మీరేం సాధించారని అడుగుతారేమో, అక్కడకే వస్తున్నా. అక్షర, లక్షలు చేసే ఆ పుస్తకాలు నాలుగేళ్లుగా మా బీరువాల్లో మగ్గుతుంటే ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం కల్గింది. మనకి తెలియని ఆ వేంకటేశ్వరుని వైభవం, తిరుమల ప్రాశస్త్యం అనేక అన్నమయ్య కీర్తలల్లో అడుగడునా మనకి గోచరిస్తాయి. అలాంటి కీర్తనలని వెదికి, తిరుమలరాయునికి అన్వయించి పాఠకులకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కల్గింది. కొన్ని వేల కీర్తనల్లోంచి ఏ కొన్నింటిని ఎంపిక చేయాలి. చాలా పెద్ద ప్రయత్నమే. అలాగైనా అన్నమయ్య కీర్తనలను కనీసం ఒక్కసారైనా చదవచ్చన్న ఉద్దేశంతో ఈ పంచవర్ష పథకానికి పూనుకున్నాను. ఒక్కరోజులో ఈ ప్రాజెక్టు పూర్తికాదు. తెలుసు. ఎప్పటికైతే అప్పటికే! రామకోటి ఒక జీవిత కాలంలో పూర్తిచేయగలమా? ఏమో భగవదానుగ్రహం, ఎన్ని కీర్తనలు పాఠకులకి పరిచయం చేయగలిగితే అన్నే! సౌమ్యశ్రీ రాళ్లభండి
‘కావ్యేషు నాటకం రమ్యమ్, నాటకేషు శకుంతలమ్ – అందులో చతుర్ధాంకం అందులో శ్లోకచతుష్టయమ్’, అన్న పంథాలో కావ్యరమ్యత్వాన్ని వెతుకుతున్నారు. అలాగే సంస్కృతీ మహద్భాగ్యాలు వెతుక్కుంటూ పోతే, సందేహంలేని జవాబు త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు సౌభాగ్య నిధులు! అని త్యాగరాజ సంగీతజ్ఞులు ఒకానొక సందర్భంలో శ్రీ టి.వి. సుబ్బారావుగారు పేర్కోన్నారు. త్యాగరాజస్వామివారు రచించిన కీర్తనలన్నీ భక్తి ప్రపూరితాలైన రసగుళికలు; తెలుగు నుడికారంలోని సొంపుల, తీపి తమలో అంతటా నిండేటట్లు సంతరించుకుని భావార్ధ సుశోభితాలైన మధుగుళికలు! వందలకొద్దీ ఉన్న కీర్తనలలో దేనికదే ప్రత్యేక శోభతో రాణించే మణివలె వెలిగిపోయినా, పంచరత్న కీర్తనలని ప్రఖ్యాతి చెందిన ఐదుకీర్తనలు, ప్రత్యేక ప్రతిష్టతో, ఉత్తమోత్తమ స్థానార్హాలుగా ప్రసిద్ధికెక్కాయి. స్వరాలు బిగిలో, కూర్పులో, సంగీతపుటుదాత్తతలో వాటి మహత్త్వత బహుధా ఉగ్గడింపబడింది. కర్ణాటక సంగీత ప్పంచంలో హేమాహేమీలందరూ, త్యాగరాజస్వామి వారి ఆరాధనా క్రమంలో ఈ పంచరత్న కీర్తనలను, మేనులు మరచి, మనసులు లగ్నం చేసుకొని, ముక్త కంఠంతో భక్తిభావం వెల్లివిరిసేటట్లు గానం చేయ్యడమే సద్విధిగా ఎంచుకుంటారు! సంగీతపు విలువలలో ఈ కీర్తనల నాణ్యత సంగీతజ్ఞులకూ, తద్వారా శ్రోతలకు సుపరిచతమే. మిగిలిన కీర్తనలకన్న వీనిలో చరణాల సంఖ్య పెద్దది. ఒక్కొక్క పాటలో పల్లవి, అనుపల్లవిగాక ఎనిమిదిగాని పదిగాని చరణాలుంటాయి. ఒక్కొక్క చరణంలో కూడా సుదీర్ఘమైన కూర్పు; శబ్ధాల సంతరింపులోని విశిష్టత; భావప్రసారంలో నైపుణ్యం; మొదలైన నైజాలు కూడా శ్రోతలకూ, పాఠకులకూ చాలావరకు అవగతం అవుతాయి. ఇంకా విమర్శనా దృష్టితో పఠిస్తే, త్యాగరాజులవారు తన భక్తిబోధనామృతాన్నంతా యీ కీర్తనలలో ఇమిడ్చివైచినట్టు తెలుస్తుంది. అంతేకాదు, ఈ ఐదు రత్నాలనీ ఒక ప్రయోజన సూత్రంతో బంధించి రత్నాలమాలగా సంతరించి సంఘతించినట్లనిపిస్తుంది. వీటిల్లో ఒక క్రమం, ఒక పద్దతి, ఒక సంపుటీకరణం స్పష్టం అవుతుంది. నాట, వరాళి, గౌళ, ఆరభి, శ్రీరాగాలలో యీ కీర్తనలు నిబంధింపబడినాయి. ఈ ఐదింటినీ ఘనరాగాలంటారు. వాటి సర్వసాహిత్య ప్రక్రియ అత్యుత్తమ స్థాయినందుకోవడం వీటిని ఘనరాగాలంటారుట. (ఇరువదిరెండు శ్రుతుల కలయికకు ఆస్కారములు కావడం చేతనూ, వీణలో యీ రాగాలని గానంచేసేటప్పుడు తానవిస్తరణకి ఎంతో అవకాశం ఉండడంచేతనూ వీటిని ఘనరాగాలంటారు.) సంగీతకచేరీల్లో ఆది నాట, అంత్య సురటి అనే సంప్రదాయం కూడా చెప్పుకుంటాం! అటువంటి ఈ ఘనరాగ పంచకంలో త్యాగరాజస్వామి ఐదు సర్వోత్కృష్ట వాక్ర్పబంధాలనదగ్గ పంచరత్న కృతులని రచించారు. ఈ ఐదు పంచరత్న కీర్తనలు:
  • నాటరాగంలో: జగదానంద కారక
  • వరాళి రాగంలో: కనకన రుచిరా
  • గౌళ రాగంలో: దుడుకుగల నన్ను
  • ఆరభి రాగంలో: సాధించెనే, మనసా
  • శ్రీరాగంలో: ఎందరో మహానుభావులు
  వీనిలో మొదటి రెండు పాటలూ వర్ణనాత్మకాలు – సంబోధనాత్మకాలూను. త్యాగరాజస్వామి, ఆ శ్రీరామచంద్రుని అనేక విధాల వర్ణించి ప్రత్యక్షం చేసుకుంటారీ పాటల్లో! ‘జగదానంద కారక’ సంస్కృత సమాసాలతో నిండిపోయింది. పూర్వగాథలనీ, రామాయణంలో అనేక సన్నివేశాల్నీ స్ఫురింప చేసే బహువ్రీహి సమాసాలలో, ఆ జానకీ ప్రాణ నాయకుని జగదానందకారకునిగా ప్రత్యక్షం చేస్తుంది. రాజరాజేశ్వరునిగా, పురాణ పురుషునిగా, నిర్వికారునిగా, అగణిత గుణునిగా సృష్టి స్థిత్యంత కారకునిగా, ఆ దేవదేవుని నిరూపించి, త్యాగరాజస్వామి వారు తన్ను తరింపచేసుకున్నారు. పది చరణాల్లోనూ పదజాలం గుప్పించి, బహువిధాల వర్ణించి, కృతకృత్యులైనారు. చివర మూడు చరణాల్లోనూ శ్రీరామచంద్రుని, త్యాగరాజనుతుని ముమ్మారు స్మరించి (సాధారణంగా మకుటం ప్రతిపాటలో ఒకేసారి ఉంటుంది) తన్ను తాను పునీతుని చేసుకున్నారు. పదప్రయోగంలో త్యాగరాజస్వామివారికున్న ప్రతిభ ఈ కృతిలో బహుళంగా కన్పిస్తుంది. ‘కనకన రుచిరా’ అని మొదలుపెట్టే వరాళి రాగకృతిలో అలా నాటరాగ కృతిలో ప్రత్యక్షమైన దేవదేవుని త్యాగరాజస్వామి సానురాగంగా చూసిచూసి మురిసిపోతారు. ఆ పరమభక్తుడైన, ఆ వనజనయనుని మోము చూచుటే జీవనమని నెనరు గలవాడిని తానని ‘ననుపాలింప’ అనే మోహన రాగకీర్తనలో చెప్పుకున్నారు. అట్టి పరమభక్తుడీ కృతిలో, దినదినమును. చనువుతో, తన మనములో ఆ శ్రీరాముని చూచిన కొద్దీ రుచి హెచ్చుతుందనే సిద్ధాంతాన్ని, ప్రస్తావించారు; ప్రతిపాదించి స్థిరీకరించారు. తాను చూచే రాముడు కనకవసనుడు; పాలుగారు మోమున శ్రీ అపార మహిమతో తనరువాడు; మణిమయ మాలాలంకృతకంధరుడు; సురుచిర కిరీటధరుడు. కాని ఆ సిద్ధాంతానికి బలంగా తానిచ్చిన సాక్ష్యం ఒక్కటే చాలదనుకుంటారేమోనని, రామనామ రసికుడైన కైలాస సదనుడు (శివుడు), పవమాన సుతుడు (ఆంజనేయుడు), నారద, పరాశర, ళుక, శౌనక పురందరులను నగజను (పార్వతి), ధరజను (సీత) సాక్షులుగా పేర్కొంటారు. అటువంటి చూచినకొద్దీ రుచి హెచ్చే శ్రీహరిని ధ్యానించి, మనస్సులో చూసుకుంటూ మురిసిపోయే ధ్యానమనన సౌహార్ధ్రతా ప్రక్రియకి ఫలసిద్ధి, ధ్రువుడు అందుకొన్న సుగతినీ, సుస్థితినీ, సుసౌఖ్యాన్ని జ్ఞాపకం వలచి, సొక్కిన సీతాంజనేయులు సలిపిన సంవాదాన్ని, చర్చనీ పేర్కొని, తెలిసి, ఆ రాముని తాను గూడా అదేపనిగా చూచిచూచి తరించారు. ఈ కృతిలో తెలుగు పదాలే ఎక్కువగా ఉన్నాయి. రెండు చరణాల్లో సంస్కృత సమాసాలు బహుళమైనా మిగిలిన పాటలో సామాన్య పరిభాష అనిపించే తెలుగు పదాలే ఎక్కువగా ఉన్నాయి. (సేకరణ: యువభారతివారి త్యాగరాజస్వామి కవితా వైభవము నుంచి) తేటగీతి