వాగ్గేయకారులు 3 అన్నమయ్య (1408-1503)

మన తెలుగులో తొలి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెందిన అన్నమయ్య నందవరవైదిక బ్రాహ్మణ వంశమున నేటి కడప జిల్లా రాజంపేట తాలుకాలోని తాళ్లపాక గ్రామమంలో వైశాఖశుద్ధ పౌర్ణమినాడు (మే 9, 1408) జన్మించాడు. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. భారద్వజ గోత్రుడైన అన్నమయ్య తండ్రి పేరు నారాయణసూరి మహాపండితుడు, తల్లి లక్కమాంబ, సంగీత కళానిధి. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి. అయితే, “అన్నం బ్రహ్మేతి వ్యజనాత్” అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది.

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన ‘నందకం’ అంశతో అన్నమయ్య జన్మించాడని ప్రతీతి. కర్ణాటక సంగీత పితామహుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడు. తెలుగునాట పదకవితకు, భజన సాంప్రదాయానికి ఆద్యుడైన అన్నమయ్య దాదాపు 32వేల సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యంతోపాటుగా తెలుగు సంస్కృతికి ఆలవాలమైన తుమ్మెద, గొబ్బిపాటలు, ఉగ్గుపాటలు, సువ్విపాటలు, జోలపాటు మిళితమై ఉంటాయి.

తిరుమల పయనం: తన ఎనిమిదవ ఏట గడ్డికోస్తుండగా దూరంగా గోవిందనామం చేస్తూ యాత్రికుల బృందం వెడుతూ కన్పించింది. వెంటనే ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచి కాలినడకన తిరుపతికి బయలుదేరి వెళ్లాడు. చిన్నతనం వల్ల అజ్ఞానంతో పాదరక్షలతో కొండ ఎక్క ప్రయత్నించిన అన్నమయ్య కొండ ఎక్కలేక ఆకలితో అలసిసొలసి పడిపోయాడు. అంత అలివేలుమంగ అన్నమయ్య వద్దకు వచ్చి కర్తవ్యభోద చేసి స్వామివారి ప్రసాదాన్ని అందించింది. వెంటనే అన్నమయ్య అమ్మవారిని కీర్తిస్తూ,

ఉ|| చొచ్చితి దల్లి నీ మఱుగు సొంపుగ నీ కరుణాకటాక్ష మె
ట్లిచ్చెదొ నాకు నేడు పరమేశ్వరి యో యలవేలుమంగ నీ
మచ్చిక నంచు నీ తరుణిమన్నన నే నినుగంటి నీకు నా
బచ్చెనమాట లేమిటికి బ్రాతివి చూడగ వేంకటేశ్వరా!

ఉ|| అమ్మకు దాళ్లపాకఘను డన్నడు పద్యశతంబు జెప్పె గో
కొమ్మని వాక్ర్ఫసూనముల గూరిమితో నలవేలుమంగకు
నెమ్మది నీవు చేకొని యనేక యుగంబులు బ్రహ్మకల్పముల్
సమ్మద మంది వర్ధిలుము జవ్వనలీలలు వేంకటేశ్వరా!

అలివేలుమంగ శతకాన్ని ఆలపించాడు. పద్యాంతంలో వేంకటశ్వరా అని సంబోధించినప్పటికీ, ప్రతి పద్యము అలవేలుమంగను ప్రస్తుతించినదే. అమ్మకు అలమేల్మంగకు పద్యశతకము చెప్పానని తెలిపినందున ఇది అలవేల్మంగాంబికాస్తుతి శతకంగా భావిస్తారు.

తిరుమల దర్శనం: కొండనెక్కిన అన్నమయ్య ‘దేవునికి దేనికిని తెప్పల కోనేటమ్మ, వేవేలు మొక్కులు లోకపావని నీ కమ్మా’ అంటూ, స్వామి పుష్కరిణిని దర్శించి అందు స్నానమాచరించాడు. అటుపై పెద్ద గోపురమును, నీడతిరుగనిచింతచెట్టును, గరుడగంభమును, చంపక ప్రదక్షిణమును, దివ్యప్రసాదములొసగు ప్రదేశములను, అక్కడి ప్రసాదములను, నడగోపురమున శ్రీనివాసుని భాష్యకారులను, నరసింహుని, జనార్ధనుని, అలమేలుమంగను, యాగశాలను, ఆనందనిలయమును, కళ్యాణమంటపమును, బంగారుగరుడుని, శేషుని, పునుగుచుట్టలను కాచి తైలము వడియగార్చు ప్రదేశమును, స్వామిని స్తుతించు చిలుకల పంజరములను, శ్రీ భాండారాములను, బంగారు గాదెలను, బంగారు వాకిటిని దర్శించి, స్తుతించి, ‘‘కంటి నఖిలాండకర్త నధికునిగంటి’’ అంటూ, ‘పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము నెడయకవయ్య కోనేటిరాయడా‘ అని వేంకటేశ్వరుని దర్శించుకున్నాడు.

తిరుమలగిరివాసుని దర్శించడానికి వెళ్లేముందు అన్నమయ్య పైన ఉదహరించిన స్థలాలను దర్శించాడనడానికి నిదర్శనమైన స్వామిదర్శన వర్ణన….

‘‘ఆవరణంబుల కాదియై మిగుల
గొమరారు వైకుంఠగోపురంబునకు
బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంత
జనుదెంచి గారుడ స్తంభంబు చక్కి
వినుతుడై చెంత గ్రొవ్విరిసాల కేగి
వలనోప్పు చంపకావరణంబు వేగ
వలచుట్టి వచ్చి యా స్వామిపుష్కరిణి
తోయంబు లాని యుత్తుంగభాగమున
నా యహికులపతి యవతారమగుచు
దిరుగని చింతలం దెఱలించు నీడ
దిరుగని చింత కెంతే భక్తి మ్రొక్కి
రమణ రెండవ గోపురము దాటి లోని
కమల మహాసాగార సేవించి
నెలకొని యానందనిలయాఖ్య మగుచు
నలువొందు మణివిమానంబు సేవించి
పటుమహామణిమంటపంబు సేవించి
యట వచ్చి తురగతార్ క్ష్యాహినాయకుల
సేవించి దనుజేరి సేనానాథు
సేవించి నిత్యుల సేవించి కూర్మి
నావేళ లోనికి నరుదెంచి యచటి….’’

ఇలా వేంకటేశ్వరుని దర్శించడానికి వెళ్లేదారిలో ఎదురయ్యే ప్రతీదానిని వర్ణిస్తూ మణిమయంబగు కిరీటంబు గలుగు శ్రీవేంకటగ్రావాధినాథుని దర్శించినట్టు చెప్పబడి ఉంది.

ఈ సందర్భంలో అన్నమయ్య పాడిన సంకీర్తనలు —-

‘సేవించి చేకొన్న వారి చేతిభాగ్యము, వేవేగ రారో రక్షించీ విష్ణుడీడను’

‘నీవేకా చెప్పజూప నీవే నీవేకా, శ్రీవిభుప్రతినిధివి సేవమొదలారి’

‘మొక్కరో మొక్కరో వాడె ముందర నిలుచున్నాడు, యెక్కువ రామునిబంటు యేకాంగవీరుడు’

‘ఏ పొద్దు చూచిన దేవుడిట్లానే యారగించు, రూపులతో బదివేలు రుచురై నట్లుండెను’

‘కంటిగంటి నిలువుచుక్కనిమేను దండలును, నంటుజూపులను జూచే నవ్వుమోముదేవుని’

అన్నమయ్యకు 16వ ఏట స్వామి ప్రత్యక్షమైనట్టు రాగిరేకులలో పొందుపర్చబడి ఉంది. స్వామి తనకు బాల్యంలో దర్శనమిచ్చినట్టు అన్నమయ్య ‘ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు, నప్పుడగు తిరువేంకటాద్రీశుగంటి’ అనే సంకీర్తనలో చెప్పుకున్నాడు. నాటినుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తనలు రచించాలని అన్నమయ్య వత్రంపూని చివరి వరకు కొనసాగించాడు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

గృహస్థాశ్రమం: తిరుమలలో అన్నమయ్య ఉన్నాడని తెలుసుకొని అతని తల్లితండ్రులు వచ్చి అన్నమయ్యను స్వామి పూజకు లోటురాదని తమతో స్వగ్రామానికి రమ్మని కోరారు. అయితే అందుకు మొదట అంగీకరించనకసోయినా, గురువాజ్ఞ మేరకు స్వగ్రామం చేరుకుంటాడు. ఈ సందర్భంగా అన్నమయ్య ఆలపించిన సంకీర్తనలు అన్నమాచార్య చరిత్రలో చిన్నన్న పేర్కొన్నాడు.

‘సర్వోపాయముల జగతి నాకితడే, పుర్వీధరుడు పురుషోత్తముండితడే’

‘పాడేము నేము పరమాత్మ నిన్నును, వేడుక ముప్పదిరెండువేళల రాగాలను’

‘దాచుకో నీ పాదాలకు దగనే జేసిన పూజలివి, పూచి నీ కీరితి రూపపుష్పము లివియయ్యా’

‘ఏలికవు నీవట యింకా దైన్యమేల, తాలిమి నీచేతలకు దగవు గాదనరా’.

తదనతరం అన్నమయ్య తిరుమలమ్మ, అక్కలమ్మలను వివాహమాడాడు. అన్నమయ్య భార్య తిరుమలమ్మే తిమ్మక్క. ఈమె ‘సుభద్రా కళ్యాణా’న్ని రచించింది. తాళ్లపాకలో, తిరుమలమీద, అహోబిలమున, ఇంకా అనేక పుణ్యస్థలముల వర్తించుచు, గార్హస్థ్య మనుభవించుచు నవయవ్వనంలోనున్న అన్నమయ్య అనేక శృంగారసంకీర్తనలను ఈ కాలంలో రచించాడు.

అన్నమయ్య ప్రథమ భార్యయగు తిరుమలమ్మకు నరసింగన్న, నరసయ్య, నరసింహాచార్యుడు అని పిలవబడిన గొప్పకవీశ్వరుడైన కొడుకుగలడు. ఇక అన్నమయ్య రెండవ భార్యయగు అక్కమ్మ కుమారుడు పెదతిరుమలయ్య. ఇతని కుమారుడే చినతిరువేంగళనాథ లేక చిన్నన్న. చిన్నన్న ‘అన్నమాచార్యచరిత్రము’ అను ద్విపదను రచించాడు. దీని ఆధారంగానే మనకు అన్నమయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.

అన్నమయ్య తన భార్యలతో కలిసి తీర్ధయాత్రలు చేశాడు. ఈ సందర్భంగా అనేక పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ అహోబిలం చేరుకున్నాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతుల వద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు.

తర్వాత కొద్దికాలం సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీ కృష్ణదేవరాయలుకు తాత) ఆస్థానం చేరుకున్నాడు. అయితే సాళ్వరాయునిపై సంకీర్తన చేయడానికి నిరాకరించటంతో రాజప్రాపకం కోల్పోయాడు. ఈ సందర్భంలోనే అన్నమయ్యను సంకెళ్లతో బంధించగా ‘సంకెల లిడువేళ జంపెడు వేళ, నంకిలి రుణదాత లాగెడువేళ’ అనే సంకీర్తన ఆలపించి సంకెల వదిలించుకున్నాడని ప్రతీతి. ఈ సందర్భంలోనే ‘ఆకటివేళల నలపైన వేళలను, వేకువ హరినామమే దిక్కు మఱిలేదు’, ‘నీ దాసుల భంగములు నీవు చూతురా’, ‘దాసవర్గముల కెల్ల దరిదాపు మీరె కాన’ వంటి సంకీర్తనలు అన్నమయ్య రచించాడు.

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న “మరులుంకు” అనే అగ్రహారంలో నివసించాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

“పదకవితా పితామహుడు”, “సంకీరత్నాచార్యుడు”, “పంచమాగమ సార్వభౌముడు”, “ద్రవిడాగమ సార్వభౌముడు” అని బిరుదాంకితుడైన అన్నమయ్యకు 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తోంది.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *