వాగ్గేయకారులు 5 క్షేత్రయ్య

ఎవ్వడే ఎవ్వడే ఓ భామ వీడెవ్వడే
ఎవ్వడే నేను పవ్వళించిన వేళ
పువ్వుబాణము వేసి రవ్వ చేసిపోయె ||

మొలక నవ్వుల వాడే-ముద్దు మాటల వాడే
తళుకారు చెక్కు-టద్దముల వాడే
తలిరాకు జిగి దెగడ-దగు జిగి మోవి వాడే
తలిదమ్మి రేకు క-న్నుల నమరు వాడే ||

ఎలమావి తోటలో – నింపొంద నొకనాడు
యెలమి గౌరిపూజ – సలుపుచుండగా
అల మువ్వగోపాలుడగు వేంకటేశుడు
కలువల శయ్యపై – గలసే మన్నది నిజమై ||

అంటూ సరళమైన అచ్చతెనుగు పదాలతో పండితపామరులను రజింపచేసిన పదాలను రచించిన వాగ్గేయకారుడు క్షేత్రయ్య. క్షేత్రయ్యగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు వరదయ్య. కృష్ణాజిల్లాకు చెందిన మొవ్వ గ్రామానికి చెందినవాడు. ఈ మొవ్వని మువ్వ, మూవ, మవ్వ అని కూడా అంటారు. క్షేత్రయ్య జీవితానికి సంబంధించి స్ఫష్టమైన వివరాలు తెలియదు. అయితే ఈయన పదిహేడవ శతాబ్ధకాలంలో జీవించి ఉండి ఉంటాడని చారిత్రకారుల అభిప్రాయం. కాగా, వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించి, ఆయా దైవాలపేర మువ్వగోపాల పదాలను రచించటం ద్వారా ఆయనకు క్షేత్రయ్య అన్నపేరు వచ్చిందని కథనం.

క్షేత్రయ్య వరహూరు (వరయూర్ వరాహస్వామి), చిదంబరం (తిల్లై గోవిందుడు), కడప (వెంకటేశుడు), కంచి (వరదరాజస్వామి), వేదపురి (వేదనారాయణుడు), హేమాద్రి (సామి), యదుగిరి (చెలువరాయుడు), ఇనపురి (సామి), పాలగిరి (చెన్నడు), తిరుమల (వేంకటేశుడు), తిరవళ్ళూరు (వీరరాఘవుడు), శ్రీరంగం (రంగేశుడు), మధుర (మధురాపురీశుడు), సత్యపురి (వాసుదేవుడు), శ్రీనాగశైలము (మల్లికార్జునుడు), చలువ చక్కెరపురి, కోవళ్ళూరు మున్నగు క్షేత్రాలను దర్శించి ఆయా దేవుళ్లపేర్ల పదాలను రచించాడు. సుమారు నాలుగువేలకు పైగా క్షేత్రయ్య పదాలను రచించగా అందు నేడు మనకు లభ్యమవుతున్న పదాలు, మువ్వగోపాల ముద్రతో ఉన్నవి 372, రాజాంకితాలు, ముద్ర లేనివి 25 మాత్రమే.

అలాగే, క్షేత్రయ్య మధుర తిరుమలనాయకుని (1623-59), తంజావూరు విజయరాఘవుని (1633-73), గోలకొండ పాదుషా (1622-72) ఆస్థానాలలో అగ్రకవిగా విరాజిల్లాడని ఆయన పదాల ద్వారా వెల్లడవుతోంది. భాగవతా భక్తినిరూపకమైన క్షేత్రయ్య పదాలలో అష్టవిధనాయికా శృంగారంతోపాటు మధురభక్తి కూడా నిక్షిప్తమైవుంది. ముఖ్యంగా క్షేత్రయ్య తానే నాయిక అయి మువ్వగోపాలుని ప్రియునిగా భావించి వర్ణించిన మధురభక్తి అనన్యసామాన్యం. ”చూడరె అది నడిచే హోయలు సుదతి చేయు జాడలు; ఆడది కులకాంత అత్తింటి కోడలు, అలగోపాలునిని ఉదికి వెడలెను” అనే పదంలో భాగవతులని గోపికా మధురభక్తిని స్పష్టం చేశాడు క్షేత్రయ్య.

క్షేత్రయ్య ఒకనాడు ‘సావిరహే తవ దీన కృష్ణా’ అనే జయదేవుని సంస్కృత అష్టపదికి నర్తకీమణులు చేసిన నృత్యాన్ని చూసి ప్రభావితమై తేనెలొలికే తెలుగులో అటువంటి పాటలు ఉంటే అందరికీ అర్ధమై మరింత రక్తికడతాయన్న భావన ఏర్పడింది. అచ్చ తెలుగులో అందరికి అర్ధమయ్యే పదాలు రాయాలన్న తపన పెరిగింది, అలాగే తెలుగు భాష ఉన్నంతకాలం తన పదాలు, పాటలు జీవించి ఉండాలని మువ్వగోపాలుని పేరు ప్రతినోట విన్పించాలన్న సంకల్పం ప్రభలమైంది. అందుకు అనుగుణంగా క్షేత్రయ్య సంగీత, సాహిత్యాలను, అభినయరీతులను ఆకళింపు చేసుకున్నాడు. ఆయన సంగీత, రాగ,తాళ విన్యాసాలలో, ఛందస్సు, వ్యాకరణాలలో పటిమ ఉన్నదనడానికి ఆయన పదాలే తర్కాణాలు. తంజావూరు రఘునాథరాయలను చూడటానికి వెళ్లినపుడు ఆయన చెప్పిన ఈ కందపద్యం అందుకు నిదర్శనం –

తము దామె వత్తురర్ధులు
క్రమ మెరిగిన దాతకడకు రమ్మన్నారా
కమలంబులున్న చోటికి
భ్రమరంబుల యచ్యుతేంద్ర రఘనాథనృపా

క్షేత్రయ్య మొట్టమొదట రాసిన పదం ఆనందభైరవిరాగం, ఆదితాళంలో ‘శ్రీపతి సుతుబారికి నేనోపలేక నిను వేడితే కోపాలా? మువ్వగోపాలా.’ క్షేత్రయ్య రచనలు పదాలుగా ప్రసిద్ధి చెందాయి. పదం కూడా కీర్తనవంటిందే. అయితే ఇందు కవి తన భావాలను నాయికా-నాయకుల మధుర, శృంగార భావాలుగా వర్ణించి దేవునికి అంకితం చేస్తాడు. సంగీత, సాహిత్యాలు సమపాళ్లలో కల్గి, పల్లవి, అనుపల్లవి, చరణాలతో ఇది కూడి ఉంటుంది. క్షేత్రయ్య రాసిన ఈ మొదటి పదంలో మాత్రం మనకు పల్లవి, అనుపల్లవులు కన్పించవు.

క్షేత్రయ్య పదములలో ముఖ్యమైన రసము రసరాజమైన శృంగారము. సంభోగ, విప్రలంభాదులను గురించి అష్టవిధ నాయికలు పడే అనుభావలు ఇందు కథా వస్తువు. ఉదాహరణకు కంచి వరదరాజస్వామి వారి కేళమందిరంనుంచి మీనాక్షీ అమ్మవారు తెలతెలవారే వేళలో శృంగారాంచిత చిహ్నాలతో సుప్రభాత సేవకంటే ముందుగా చెలులతో కలిసి చెలువం మీరేలా వచ్చే సొగసులన్నీ కళ్ళారా దర్శించి క్షేత్రయ్య రాసిన అద్భుత పదమిది –

ప: మగువ తనకేళికా మందిరము వెడలెన్
అను: వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు

చ1: విడజారు గొజ్జంగి విరిదండ జడతోను
కడు చిక్కపడి పెనగు కంట సరితోను
నిడుద కన్నుల దేరు నిదుర మబ్బుతోను
తొదరి పదయుగమున దడబడెదు నడతోను

చ2: సొగసి సొగయని వలపు సొలపు జూపు తోను
నగవగల ఘనసార వాసనలతోను
జిగమించి కెమ్మోవి చిగురు కెంపులతోను
సగము కూచముల విదియ చందురుల తోను

చ3: తరిదీపు సీయు సమసురతి బడలికతోను
యిరుగడల కైదండలిచ్చు తరుణులతోను
పరమాత్మ మువ్వగోపాల తెల్లవారెనునుచు
మగువ తనకేళికా మందిరము వెడలెన్. (మోహన – ఝంప)

పై పదము అన్నమాచార్యులవారి ‘పలుకు దేనెల తల్లి పవళించెను కలికి తనమున విభుని గలసినది గాన’ అన కీర్తనను పోలి ఉండడం కాకతాళీయమే.

జయదేవుని అష్టపదులు సంస్కృతాన ఎంత అందంగా పొదగాయో, క్షేత్రయ్య పదాలు తెలుగు సొగసులను, సొబగులను అదేవిధంగా పొదవుకున్నాయని అనేకమంది పరిశోధకులు కొనియాడారు. ప్రాసలు, అనుప్రాసలు, ఎంచుకున్న అచ్చ తెనుగు పదాలు క్షేత్రయ్య కవితా సౌందర్యానికి ప్రతీకలు. మచ్చుకు కొన్ని —

మోనిపానక మిచ్చునా?
కొసరి కొసరి ముద్దులాడ నిచ్చునా”
తావి పువ్వులు దెచ్చునా? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా? మన సిచ్చునా?
దేవరే మొగడు గావలెనని భావజుని పూజలొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా, సిగ్గేలరా?

పడతి నే నొకచోట ప్రాణేశుడొకచోట
నెడబాసి మరునిచే నిడుములకు లోనై
కడలేని విరహాగ్ని గ్రాగి వేగితి చాల
పుడమిలో వేరె జన్మము లేదె సుదతి

నల్లని మేని వాడట ఓయమ్మ! వాడు –
నయము లెన్నో చేసునట!
చల్లగా మాటాడు నట! – సరసము వాని సొమ్మట!
కల్లగాదట వాడు – కళలంట నేర్చునట!

తెలుగు భాషలో పదకేళిక చేయడం సాధ్యం కాదనే అభిప్రాయమానాడు ఉండేది. సంస్కృత ప్రభావం అటువంటిది. ఆ దశలో అభినయానికి అనుగుణమైన పదాలను తెలుగలో రచించి పండితులు ముక్కుమీద వేలేసుకొనేటట్టు చేశాడు క్షేత్రయ్య. అయితే రావే, పోవే, ఒసే, ఏమే వంటి పదాలు కవిత్వమేమిటని విమర్శించిన వారూ లేకపోలేదు.

తంజావూరు విజయరాఘవ నాయకుల అస్థానంలో ఇటువంటి విమర్శలే ఎదురైనపుడు, కాంభోజి రాగం, త్రిపుట తాళంలో ఈ కింది పదం పల్లవి, అనుపల్లవి, రెండు చరణాలు రాసి వారి ఆస్థాన కవులను పూర్తిచేయమని అభ్యర్ధించగా, వారి వల్ల సాధ్యం కాలేదు.

‘‘వదరక పోపోవే వాడేల వచ్చీని వద్దూ రావద్దనవే
అది యొక్క యుగము, వేరే జన్మమిపుడు
అతడెవ్వరో, నేనెవ్వరో ఓ చెలియా
నిచ్చ నిచ్చలు, నేదో వచ్చీని రేపైన
వచ్చిననచు మదిలో
నిచ్చగా బరు వేడి, నిట్పూర్పుల చేత
నింతిరో పెదవులెండి
హెచ్చైన, వెన్నల చిచ్చుల రాత్రులు
యెన్నెన్నో గడిపితిని నేటి మాటలే’’,
అంటూ ఈ పదం సాగుతుంది.

తన పదాలలో స్త్రీ అనే పదాన్ని తరుణీ, ముదిత, కొమ్మ, అక్కరో, సుదతి, పడుపగత్తి, మానిని, జవ్వని, ఎలనాగ, ఉవిద, ముచ్చు, మొలక, కంజాక్షి అంటూ దాదాపు 100 పర్యాయ పదాల్లో సంబోధించాడు. అలాగే నాయకులను అన్నెకాడు, చిన్నెలవాడు, నళినాక్ష, ఎమ్మెకాడు అంటూ అనేక పర్యాయ పదాలతో సంబోధించి తెలుగు భాషా విస్తృతను చాటిచెప్పాడు.

క్షేత్రయ్య పదాలలో దృశ్యాలను సాహితీవేత్తలొక మాదిరిగా, చిత్రకళాకారులోక మాదిరిగా, సంగీతజ్ఞులొక మాదిరిగా, నృత్యకళాకారులు మరోకమాదిరిగా, సంగీతాన్ని, సాహిత్యాన్ని, భాష అలంకార, ఛందస్సులను అధ్యయనం చేస్తారు. సంగీత, రాగతాళాలతోపాటు సాహిత్య భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తేనే క్షేత్రయ్య పదాల సోయగం, మాధుర్యం, మృదుత్వం, లాలిత్యం, గాంభీర్యం, క్షేత్రయ్య నాయికా, నాయకులను మలిచిన తీరును, వారి భావాలను అర్ధం చేసుకోగలరని పద్మశ్రీ నటరాజ రామకృష్ణ అంటారు.

క్షేత్రయ 49 రాగాలలో పదాలను అల్లినట్టు పరిశోధకులు తెలుపుతున్నారు. ఎక్కువగా కాంభోజి, పంతువరాళి, కేదారగౌళ, కల్యాణి, హుసేని, ముఖారి, తోడి, భైరవి, ఆనందభైరవి, మోహన, మధ్యమావతి, బిలహరి, శంకరాభరణం వాడారు. అయితే, కాంభోజి, కల్యాణి, హుసేని రాగాలను శృంగార రసాన్ని ఆవిష్కరించడానికి, ముఖారి, భైరవిలను శోకరసానికి, మోహన రాగాన్ని సంతోషాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించారు. క్షేత్రయ్య ఎక్కువగా భాషాంగరాగాలానే వాడారని మంచాళ జగన్నాథరావుగారు చెప్పారు. అలాగే క్షేత్రయ్య ఎక్కువగా త్రిపుట తాళంలో పదాలను పొందుపర్చాడు. సాంప్రదాయానికి విరుద్ధంగా క్షేత్రయ్య పదాలను పాడేటప్పుడు మొదట అనుపల్లవినీ, తర్వాత పల్లవిని పాడుతారు. క్షేత్రయ్య పదాలను భరతనాట్యం, కూచిపూడి పద్దతులలో సొగసుగా అభినయించి, బోధించినవారిలో ప్రముఖులు బాలసరస్వతి, వెంపటి సత్యం, నటరాజు రామకృష్ణ, కలానిధి నారాయణన్ గార్లు.

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *