దీక్షితార్ వారి కృతుల విశేషాలు 2

తిరువారూరు త్యాగరాజస్వామివారిపై కీర్తనలు:

తిరువారూరు త్యాగరాజస్వామిపై ముత్తుస్వామివారు రచించిన కీర్తనలనేకం ప్రసిద్ధి చెందాయి. తిరువారూరులోనున్న అనేక ఆలయాలు రమణీయ శిల్పచాతుర్యంతో ఉట్టిపడుతుంటాయి. తిరువారూరులోని త్యాగరాజస్వామి, శ్రీ కమలాంబ, శ్రీనీలోత్పలాంబ, గణేశుడు, సుబ్రహ్మణ్యస్వామి, రేణుకాదేవిలపై దీక్షితులవారు పెక్కు రచనలు చేశారు. అచ్చటి త్యాగరాజస్వామివారిపై విభక్తి కృతులను రచించాటమేకాక అనేక ఇతర కృతులను కూడా రాశారు. అందు గౌళ రాగంలో ‘శ్రీ త్యాగరాజ పాలయాశుమాం’, ఆనందభైరవిలో ‘త్యాగరాజ యోగవైభవం’, శ్రీరాగమున ‘త్యాగరాజ మహాధ్వజారోహ’ అను కృతులు ప్రసిద్ధాలు. ఇక వారు రాసిన విభక్తి కృతులు…

1. త్యాగరాజో విరాజితే – అఠాణ రాగం – ప్రథమా విభక్తి

2. త్యాగరాజం భజరే – యదుకుల కాంభోజి – ద్వితీయా విభక్తి

3. త్యాగరాజేన సంరక్షితోహం – సాలగ భైరవి – తృతీయా విభక్తి

4. త్యాగరాజాయ నమస్తే – బేగడ – చతుర్థీ విభక్తి

5. త్యాగరాజాదన్యం – దర్బారు – పంచమీ విభక్తి

6. శ్రీ త్యాగరాజస్యభక్తో – రుద్రప్రియ – షష్ఠీ విభక్తి

7. శ్రీ త్యాగరాజే కృత్యకృత్యం – సారంగ – సప్తమీ విభక్తి

8. వీరవసంత త్యాగరాజ – వీరవసంత – సంభోదనా ప్రథమా విభక్తి

ఇక అచ్చటి అమ్మవారు శ్రీనీలోత్పలాంబ. ప్రాంతీయకథనాలననుసరించి, శివుని కొరకు తపస్సు చేసి స్వామివారిని వివాహమాడిన అనంతరం అమ్మవారి రూపం నీలోత్పలాంబ. ఆ అంబను కీర్తిస్తూ కూడా దీక్షితారు వారు విభక్తి కృతులు రచించారు. ఈ కృతులన్నీ గౌళవర్గ కృతులు కావటం విశేషం. అమ్మవారిపై రాసిన గౌళకృతులు….

1. నీలోత్పలాంబ జయతి – నారాయణ గౌళ – ప్రథమా విభక్తి

2. నీలోత్పలాంబాం భజరే – రీతిగౌళ – ద్వితీయా విభక్తి

3. నీలోత్పలాంబికయా – కన్నడగౌళ – తృతీయా విభక్తి

4. నీలోత్పలాంబికాయై – కేదారగౌళ – చతుర్ధీ విభక్తి

5. నీలోత్పలాంబికాయాః – – గౌళ – పంచమీ విభక్తి

6. నీలోత్పలాంబాయాస్తవ – మాయామాళవగౌళ – షష్ఠీ విభక్తి

7. నీలోత్పలాంబికాయాం – పూర్వగౌళ – సప్తమీ విభక్తి

8. శ్రీ నీలోత్పలాంబికే – ఛాయాగౌళ – సంభోధనా ప్రథమా విభక్తి

అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో గల పంచ శివలింగాలు అచలేశ్వరుడు, హటకేశ్వరుడు, వల్మీకేశ్వరుడు, ఆనందేశ్వరుడు మరియు సిద్ధీశ్వరులపై దీక్షితారువారు కృతులను రచించారు. కాగా, ఇచ్చటే ఆగమసంప్రదాయముననుసరించి, వివిధ మంత్ర, తాంత్రిక పూజా విధానాలతో, నామాలతో గణపతి మూర్తులు పదహారు కలవు. శ్రీ ముత్తుస్వామివారు ఆయా గణపతిమూర్తులను స్తుతిస్తూ ఆలపించిన హంసధ్వని రాగంలోని ‘వాతాపి గణపతిం’, గౌళలో ‘శ్రీ మహాగణపతి రవతు మాం’, శ్రీరాగంలో ‘శ్రీమూలాధారచక్ర వినాయక’, మలహరి రాగంలో ‘పంచమాతంగముఖ గణపతినా’, సావేరినందు ‘కరికలభముఖం’ కృతులు బహుళ ప్రాచుర్యం పొందాయి.

తమ శిష్యుని శూల నొప్పి తీర్చే నిమిత్తం జోతిష్య పాండిత్యంలో నిష్ణాతులైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ వారు గురు, శని గ్రహాల శాంతి కొరకు ‘బృహస్పతే’ (అఠాణ రాగం), ‘దివాకర తనుజం’ (యదుకుల కాంభోజి) కృతులను రచించి వారిని నిత్యం గానం చేయవల్సిందిగా చెప్పారు. వారు అటులే చేసి నొప్పి నుంచి ఉపశమనం పొందారు. తదనంతరం ముత్తుస్వామి వారు మిగిలిన గ్రహాలపై కూడా కీర్తనలు రాసి నవగ్రహా (వార) కీర్తనలు పూర్తిచేశారు. ఈ కీర్తనలలో మొదటి ఏడు శూలాది సప్త తాళములలో (ధ్రువాది సప్తతాళాలాకు శూలాది తాళములని పేరు) నుండగా, పల్లవిలో గ్రహముద్రను నిక్షేపించారు. నవగ్రహ కీర్తనలు….

సూర్య గ్రహం – సూర్యమూర్తే — సౌరాష్ట్ర రాగం (ధ్రువతాళం)

చంద్ర గ్రహం – చంద్రం భజ – అసావేరి రాగం (మఠ్య తాళం)

కుజ గ్రహం – అంగారకం – సురటి రాగం (రూపక తాళం)

బుధ గ్రహం – బుధమాశ్రయామి – నాట కురంజి (ఝంపక తాళం)

గురు గ్రహం – బృహస్పతే – అఠాణ (త్రిపుట తాళం)

శుక్ర గ్రహం – శ్రీ శుక్ర భగవంతం – ఫరజు రాగం (అట తాళం)

శని గ్రహం – దివాకరతనూజం – యదుకుల కాంభోజి (ఏక తాళం)

రాహు గ్రహం – స్మరామ్యహం – రామ మనోహర రాగం

కేతు గ్రహం – మహాసూరం – చామర రాగం

ఇక మధుర మీనాక్షి అమ్మవారిపై ఎనిమిది భక్తి కీర్తనలు రచించారు. అందు దేవక్రియ రాగమున ‘మధురాంబా సంరక్షతు’, అఠాణా రాగామున ‘మధురాంబాయ’, దేవగాంధారి రాగమున ‘శ్రీ మీనాక్షికాయాః’, బేగడ రాగమున ‘మధురాంబికాయస్తవ’ కీర్తనలు ప్రచారమునందున్నవి.

శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో గోపుచ్ఛ, ‘స్రోతోవాహ’ యతి నిర్మాణము ప్రత్యేకత. ఉదాహరణకు శ్రీరాగంలో ‘శ్రీ వరలక్ష్మీ నమామ్యహం’ అనే కృతి నందు ‘శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే’ అని వస్తుంది. అలాగే పూర్ణచంద్ర బింబ అనే రాగమాలిక చివరలో ‘నాగధ్వనిసహితే, ధ్వనిసహితే, సహితే, హితే, తే’ అని, ఆనందభైరవి రాగంలో ‘త్యాగరాజయోగ వైభవం’ అనే కృతియందు ‘త్యాగరాజయోగ వైభవం, అగరాజ వైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం’ అని, ‘మాయేత్వంకయాహి’అను కృతిలో ‘సరసకాయే, రసకాయే, సకాయే, కాయే’ అని కలదు.

స్రోతోవాహయతి నిర్మాణమునకు ‘త్యాగరాజయోగ వైభవం’అను కృతిలో అనుపల్లవిలో ‘శివశక్త్యాది సకలతత్త్వ స్వరూప ప్రకాశం’ అనే చోట ‘స్రోతోవాహయతి – శం, ప్రకాశం, స్వరూపప్రకాశం, తత్త్వస్వరూపప్రకాశం, సకలతత్త్వ స్వరూపప్రకాశం, శివశక్త్యాది సకలతత్త్వ స్వరూప ప్రకాశం’ అని కలదు.


సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *