కృష్ణశాస్త్రి సినీగీతాల కవితాహేల

ఆధునికాంధ్ర కవిత్వంలో 1920 సంవత్సరంలో వచ్చిన సరిక్రొత్త మలుపు భావ కవిత్వ రంగప్రవేశం. 1910-20 మధ్య భావ కవిత్వ ఉద్యమానికి రాయప్రోలు, అబ్బూరి ప్రారంభకులు అయితే అఖిలాంధ్ర ప్రాచుర్యం తెచ్చినవారు కృష్ణశాస్త్రి. ఆనాటి యువతరాన్ని తన కవితాగానంతో ఆకట్టుకున్నారు.

బి.ఎన్. రెడ్డిగారి ప్రోత్సాహంతో 1942లో కవిగా చలనచిత్రరంగంలో ప్రవేశించి మళ్లీ ఇల్లాంటి సాహిత్యం పుట్టదన్నట్టుగా మల్లీశ్వరి పాటలు వ్రాశారు. ఆనాటి నుండి తుదిఘడియ వరకు కొన్ని వందల పాటలను వందకుపై చిలుకు చిత్రాలకు అందించి, సినీ సాహిత్యానికి సాహిత్య జగత్తులో ఉన్నతస్థానాన్ని కల్పించారు.

సినీ గీతాలలో కూడా ఉదాత్త కవిత్వ పరిమళాలను వెదజల్లిన, కృష్ణశాస్త్రి పాటలు వింటుంటే మన హృదయాలు దేనికోరకో వెదుకుతాయి. ఏఏకాంత సీమలోనో మేలుకొంటాయి. కొసరి కొసరి వీచే చిరుగాలి వీచికల్లా మేలుకొంటాయి.

ప్రకృతిలో ఎంత సౌందర్య సంపద ఉన్నా తనంత తానుగా సుకృతి కాలేదు. రససిద్దిని ఆయత్తం చేసుకున్న కవి వాక్కు అందుకు సంసిద్ధంగా ఉండాలి. అక్షర సౌందర్యం గుభాళించాలి.

‘‘చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురియదు,
వేలి కొసలు తాకనిదే వీణపాట పాడదు’’
(మంచిరోజులొచ్చాయి)

అంటూ చల్లని వానజల్లులా యెద లోతుల్లో పాటలు జాలువారితే కవికి మంచిరోజు.

మందారినికి, మధుపానానికి ఉన్న సంబంధం ఎట్లాంటిదో కవికి, ప్రకృతికి గల సంబంధము కూడా అట్లాంటిదే. కవిత్వంలోని విలక్షణతను సినీగీతాలలో స్పష్టంగా భాసిస్తూ కృష్ణశాస్త్రిగారి ప్రత్యేక వాణీని, బాణీనీ ప్రస్ఫుటం చేస్తుంది. నాగరికతని, సభ్యతా సంస్కారాన్ని హార్ధక సౌకుమార్యాన్ని విశృంఖల శృంగారం కోసం ఆయన ఎప్పుడూ బలిపెట్టలేదు.

‘‘పెరటిలోని పూలపాన్పు త్వరగా రమ్మంది,
పొగడనీడ పొదరిల్లో దిగులు దిగులుగా ఉంది’’
(బలిపీఠం)

అన్న పంక్తులలోని ఆర్ధ్ర శృంగారం భావుక హృదయాలకు తెలుస్తుంది. అందుకే ఆయన రచించిన ప్రతిగీతం శ్రోతల హృదయాలలోనికి చొచ్చుకు పోయి నాలుకలపై నర్తిస్తుంటాయి. వాటికి పాటబడడమంటూ ఉండదు. మల్లీశ్వరి గీతాలే ఇందుకు నిదర్శనం. ఆయన పాటలన్నీ రసగుళికలే.

‘‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరే,
అందాల చందాల, నీలాల రాగాల,
మమత లెరిగిన – మనసు తెలిసిన
జాలిగుండెల మేఘమాల’
’గా

మేఘమాలను వర్ణించిన తీరు అత్యున్నత భావాంబర వీధుల్లో విహరించే కవి భావుకతకి సంకేతంగా నిలుస్తుంది. ఈ మేఘమాల మాటతో మరో మేఘసందేశాన్ని సృష్టించిన అపర కాళిదాసుగా కృష్ణశాస్త్రిగారు పలువురి ప్రశంసలందుకున్నారు.

వీరి సినీగేయాల్లో ప్రకృతి సౌందర్యం వర్ణనాత్మకమైనవి. లలిత పరిహాసాత్మకమైనవి. భక్తి, మధుర భక్తి భావనా విలసితమైనవి. సంయోగ, శృంగార మాధర్యోపేతమైనవి. వియోగ వేదనాభరితమైనవి, విషాదాత్మకమైనవి, మానవత, సామాజిక స్పృహలతో కూడు కున్నవి. జాతీయ భావనిర్భరమైనవిగా గోచరిస్తాయి.

కృష్ణశాస్త్రి పాటలు అనంత తరంగాలుగా అనంతరం మన హృదయాల్ని తట్టితట్టి పిలుస్తాయి. తెలుగు నుడి బ్రతికినంత కాలం మనలను సాదరంగా పలకరిస్తాయి. ‘కుశలమా, నీకు కుశలమేనా’ (బలిపీఠం) అని అంటూ ప్రతి మనిషిని అడుగు తూనే ఉంటాయి.

‘మనసు నిలుపుకోలేక మరీమరీ అడిగే’, కరుణార్ధ్ర కంఠస్వరంలో తెలుగు జాతికి వెలుతురు వలయాలందిస్తాయి. ‘ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరనీ నీ పాదపీఠం కర్పూర దీపం’ అంటూ తెలుగు చెవినిల్లుకట్టకొని హెచ్చరిస్తూనే ఉంటాయి.

కృష్ణశాస్త్రి పుట్టి పెరిగిన కాలం యుగసంధి. పెనుచీకటిలో లోకం కునారిల్లిపోవడం తాను కన్నులారా చూశారు. చీకటిని కొండలు దాటివెళ్లి పోమ్మని శాసించారు. వెలుగు వెండిరేకులను ఆహ్వానించారు. ఐనా చీకటి పూర్తిగా వైదొలగలేదు. వెలుతురు పూర్తిగా పునరాక్రమించనూలేదు. ఉన్న యదార్ధాన్ని ఆర్త హృదయంతో ఆక్రోశిస్తూ కూర్చోక సౌందర్య ప్రతీకగా మలచుకొని, ‘చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకు వన్నెల’ను (చీకటి వెలుగులు) ఆహ్లాదించారు.

లోకపు మెడచుట్టూ గులాబీలు నవసౌకుమార్యాలను భావించారు. ఐనా చీకటి సిగపాయల ఎర్రని మందారాల కాంతి గుచ్ఛాల నవలోకించారు. సౌందర్యం ఏకాకి కాదు, దాని కాంతులు దూరదూరాల వ్యాపిస్తుంది. శివసుందరమయంగా సత్యమయ ధ్యానంగా, ఆనందధామంగా సాగుతుంది. అలాంటపుడు,

‘‘గల గల మనకూడదు ఆకులలో గారీ
జలజల మనరాదు అలలో కొండవాగూ,
నిదురోయే కొలను నీరు కదపగూడదు
ఒదిగుండె పూలతీగ ఊపరాదు’’
(చీకటి వెలుగులు)

నిజమే మరి, ఊరకనే తీగను కదిలించడమెందుకు? తీగకదిలితే స్వరమా ఊడిపోతుంది. తొడిమలపై కులికే పూలబాలలు కూలిపోతాయి. అది కృష్ణశాస్త్రి భావుకత, ఆర్ధ్ర మనస్కత.

అలవోకగా కనులార మోడ్చిన కవికి ప్రతి పులుగు ఎందుకో ఏదో చెప్పబోతుంది. రామచంద్రోదయ సమయంలో చెట్టుచెట్టూ కనులు విప్పి చూస్తుంది. తెలియని ఆర్తిలోనూ, ఆశల పెను కడలిలోనూ అర్రట్లాడిపోతున్న సమయంలో ఆ రాముని దివ్యసుందర రూపం చూసేసరికి తోచి తోచని సందిగ్ధంలో కొట్టుమిట్టాడిన శబరిని మనముందు సాక్షాత్కరింప చేసిన దృశ్యము అపూర్వము.

‘‘అసలే ఆనదు చూపు, ఆపై కన్నీరు
తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ?
నీలమేఘ మోహనము నీ మంగళరూపము’’
(సంపూర్ణ రామాయణం)

స్వీయానుభవాన్ని అనుభూతిగా మార్చుకొని పాత్రలపరం చేయగల నేర్పు ఉంటే శబరినే కాదు, మందర అయినా కనులముందు నిలబడుతుంది.

కృష్ణశాస్త్రి పాటలు మన సంఘాన్ని పునఃనిర్మించే బాధ్యతలతో స్పర్శంచని తావులేదు. మన హృదయాలలో సకల మాలిన్యాన్ని క్షాళనం చేస్తూ చీకటి కోణాలన్నింటిపైనా సూర్యరశ్మి ప్రసరింప చేస్తాయి.

ఎవరూ అంటుకోని పనిని మాతృహృదయంతో నెరవేర్చే సంఘసేవకులు ఈ దేశానికి అంటరానివారు. దూరదూరంగా తరమబడుతున్నారు. భారంగా బ్రతుకులీడుస్తూ, బ్రతకడానికేనా వారు జన్మించారు అని కృష్ణశాస్త్రి గారిని కలవరపర్చింది. అందుకే ఆయన,

‘‘కలువపాపాయికి కొలను ఒడి ఉంది
చిలుక పాపాయికి చిగురు ఒడి ఉంది
ప్రాణములేని ఒక శిలకు గుడి ఉంది’’
(కాలం మారింది)

ఆదయనీయులకు మాత్రం ఏమీలేదు. వారి బ్రతుకలపై ఎవ్వరికి జాలిలేదు. అంటరానితనాన్ని, ఒంటరితనాన్ని అనాదిగా పదిలపర్చుకొన్న జాతి తన హృదయాలను మడిగా జాడీలలో దాచుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్పృత్యతపై ధ్వజమెత్తారు. ‘‘అందాల మనదేశము, అందచందాల మన దేశము పెంపొందాలి కలకాలం’ అంటూ జాతీయాభిమానాన్ని వ్యక్తం చేశారు.

మాతృభాషా మాధుర్యానికి పరవశించిన కవి ‘పాడనా తెలుగు పాట, మంచి ముత్యాలపేట, మధురామృతాల తేట’ (అమెరికా అమ్మాయి) అంటూ తెలుగు వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘ఒళ్లంతా ఒయ్యారి కోక, కళ్లకి కాటుక రేఖ, మెళ్లోతాళీ, కాళ్లకు పారాణి, మెరిసే కుంకుమబొట్టు’ అంటూ తెలుగు ఆడపడుచుని మనోహరంగా వర్ణించారు.

కృష్ణశాస్త్రి ప్రకృతి కవి. అందుకే ఆకులో ఆకు, పూవులో పూవు, రెమ్మలో రెమ్మైనారు. ‘పచ్చని తోటల విచ్చిన పూవులు, ఊగేగాలుల తూగే తీగలు, కొమ్మల మోగే కోయిల జంట’లను స్తుతించారు. ‘మనసున మల్లెలూగించారు. కన్నుల వెన్నెల డోలలూగించారు.’

‘సడిసేయకే గాలి, సడిసేయ బోకే, బడలి ఒడిలో రాజు పవ్వళించేనే’ (రాజమకుటం) అంటూ తన రాజుకు నిద్రాభంగం కలగరాదని వేడుకుంటున్న ప్రియురాలి ముగ్ధప్రణమాన్ని రూపకల్పన చేశారు.

పురులు విప్పిన నెమళ్లు నాట్యమాడినట్లు, కృష్ణశాస్త్రిగారి పాటలలో మృదువైన తెలుగు పదాలు దొర్లాయి. ఆయన పాటలు నవీన రసహృదయాలకు ఒయాసిస్సులై దప్పికతీరుస్తూనే తీరని పిపాసను కలిగించాయి.

శేషభార్గవి దేవులపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *