
నిర్ధిష్టమైన రూపం, రసం, భావం కల్గిన అద్భుతమైన, సమ్మోహనమైన, అందమైన, మోహనకరమైన రాగం ‘మోహన’. ప్రపంచంలోని అన్ని సంగీతరీతుల్లోనూ ఈ రాగం బహుళ ప్రసిద్ధిచెందింది. ఇది ఉపాంగ, వర్జ్య, ఔడవరాగం మరియు 28వ మేళకర్త హరికాంభోజి జన్యరాగం. అయితే మధ్యమం, నిషాదాలను గ్రహంచేస్తే మేచకళ్యాణి, ధీరశంకరాభరణ రాగాలు కూడా మోహనకు జన్యరాగాలుగా పేర్కోనవచ్చు. ముత్తుస్వామి దీక్షితార్ మనవడు బ్రహ్మశ్రీ సుబ్బరామ దీక్షితార్ రచించిన ‘సంగీత సాంప్రదాయ ప్రదర్శిని’లో మోహన మేచకళ్యాణి జన్యరాగంగా పేర్కొన్నారు.
ఈ రాగం స్వరస్థానాలు: షడ్జమం, చతుశృతి రిషభం, పంచమం, అంతరగాంధారం, చతుశృతి దైవతం (స,రి,గ,ప,నద,స / S R2 G3 P D2 S). ఇందు రిషభాన్ని గ్రహం చేస్తే మధ్యమావతి, గాంధారాన్ని గ్రహం చేస్తే హిందోళ, పంచమాన్ని గ్రహంచేస్తే శుద్ధసావేరి, చివరగా ధైవతాన్ని గ్రహం చేస్తే ఉదయరవిచంద్రిక రాగాలు వస్తాయి.
ఇది చాలా అవకాశంము కల్గిన రాగం. రాగాలాపన, నెరవు, స్వరకల్పన, తానం, పల్లవి పాడుటకు అనువైన రాగం. త్రిస్థాయి రాగం. విళంబ, మధ్య, ధృతలయలుగా గల రాగం. అన్నివేళలందు పాడుకొను రాగం. శృంగార, భక్తి, శాంత, వీరరస ప్రధానమైన రాగం. శ్రోతలకు సులభంగా అర్ధమగుటయేకాక, పాడుటకు, ఆస్వాధించుటకు సులభమైన రాగం. తక్కువ స్వరాలతో ఎక్కువ రక్తి కల్గించే రాగం. స్వరకల్పనకు కష్టమైన రాగమైనా పద్యాలు, శ్లోకాలు, వర్ణనలు అద్భుతంగా పలికించే రాగం. జానపద, భజన కీర్తనలు ఈ రాగంలో విరివిగా కలవు.
హిందుస్థానీ సంగీతంలో మోహనకు దగ్గరగా గల రాగాలు భూప్, భూపాల్, దేశికార్. జయదేవుని అష్టపది ధీరసమీరే, మామియం చలితావిలోక్యవృతం భూప్ రాగంలో ఎంతో ప్రసిద్ధికెక్కింది. అలాగే హరేరామ, హరే కృష్ణలోని కాంఛీ రే కాంఛీరే, ఆరాధనలో చందాహై తు, సూరజ్హై తు, సిల్ సిలాలో దేఖ ఏక్ క్వాబ్ తో యే సిల్ సిలేహువే, రుడాలీలోని దిల్ హూ హూ కరే, లవ్ ఇన్ టోక్యోలోని సాయనారా, సాయనారాలు ఈ రాగంలో స్వరపర్చిన పాటలే. ఇక ఉమరో జావ్ లోని ఇన్ ఆంఖోంకి మస్తీమే, భాభీ కీ ఛూడియా సినిమాలోని జ్యోతికలశ్ ఛలకేలు ఎంత ప్రజాదరణ పొందాయో చెప్పనక్కర్లేదు.
ఈ రాగంలో అనేక పద్యాలు, లలిత సంగీత పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. వీటిలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పాపాయి పద్యాలు, అద్వైతమూర్తి, కుంతీకుమారిలోని కన్నియలాగ వాలకము, ఆటపాటలలో మరచినావా రాజా, యెంకి ఊగెను కొమ్మ ఊయ్యాల, నీతోటే ఉంటాను నాయుడుబావ వంటి ఎంకిపాటలతోపాటు, భామాకలాపమనే యక్షగానంలోని శకునాలు మంచివాయే అనే గీతం , భారతీయుల కళాప్రభవమ్ము, ఆ మొఘల్ రణధీరులు వంటి పద్యాలు, చల్లగాలిలో యమునాతటిపై, మనసాయెరా మదనా, నినుజూడ వంటి లలితగీతాలున్నాయి.
ఈ రాగంలో ప్రఖ్యాతి చెందిన రచనలు :
1. వరవీణ మృదుపాణి (గీతం)
2. నిన్నకోరి (తాన వర్ణం)
3. ఎవరురా, ననుపాలింప, రామా నిన్నే నమ్మి, మోహనరామ, భవనుత నా హృదయము, రారా రాజీవ లోచన, వేద వాక్యమని — త్యాగరాజ స్వామి
4. నాగలింగం – దీక్షితార్
5. నారాయణ దివ్యనామం – పాపనాశం శివన్
6. చేరియశోదకు శిశువితడు – అన్నమాచార్య
7. బాలగోపాల – నారాయణతీర్ధుల తరంగం
మోహన రాగం లో ప్రసిద్ధ సినీ పాటలు:
1. లాహిరి లాహిరి లాహిరిలో –మాయాబజార్
2. చందనచర్చిత నీలకళేభర –తెనాలి రామకృష్ణ
3. మాణిక్యవీణాం(శ్యామల దండకం) – మహాకవి కాళిదాసు
4. లేరు కుశలవులకు సాటి – లవకుశ
5. నెమలికి నేర్పిన నడకలివే – సప్తపది
6. ఆకాశంలో ఆశలహరివిల్లు – స్వర్ణ కమలం
7. మధురమే సుధాగానం — బృందావనం
8. చెంగు చెంగునా గంతులు వేయండి –నమ్మిన బంటు
9. ఎచటనుండి వీచెనో –అప్పుచేసి పప్పుకూడు
10. మనసు పరిమళించెను –శ్రీ కృష్ణార్జున యుద్ధం
11. అయినదేమో అయినది ప్రియ –జగదేకవీరుని కధ
12. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే –సాగర సంగమం
13. పాడవేల రాధికా –ఇద్దరు మిత్రులు
14. ఘనా ఘన సుందరా –చక్రధారి
15. సిరిమల్లే నీవె విరిజల్లు కావే – పంతులమ్మ
16. మదిలో వీణలు మ్రోగె –ఆత్మీయులు
17. నిన్ను కోరి వర్ణం – ఘర్షణ
18. మధుర మధురమీ చల్లని రేయ – విప్రనారాయణ
19. తెల్ల వార వచ్చె తెలియక నా స్వామి – చిరంజీవులు
20. మౌనముగా నీ మనసు పాడినా –గుండమ్మ కధ
21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె – మిస్సమ్మ
22. శివ శివ శంకరా –భక్త కన్నప్ప
23. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో –అమరశిల్పి జక్కన్న
24. పులకించని మది పులకించు – పెళ్ళికానుక
25. ఈనాటి ఈ హాయి, కలకాదోయి నిజమోయీ – జయసింహ
26. తూనీగ, తూనీగా – మనసంతా నువ్వే
27. మాటేరాని చిన్నదాని – ఓ పాపాలాలీ
28. ఆదిభిక్షువు వాడినేది కోరేది – సిరివెన్నల
సౌమ్యశ్రీ రాళ్లభండి