నరసింహ శతకం 2

నరసింహ శతకం 2
నరసింహ శతకం 2

సీ. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు
ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు
కనకమిమ్మని చాల గష్టపెట్టలేదు
పల్లకిమ్మనినోటఁ బలుకలేదు
సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు
భూములిమ్మని పేరు పొగడలేదు
బలము నిమ్మని నిన్ను బతిమాలగా లేదు
పనుల నిమ్మని పట్టు పట్టలేదు

తే. నే గోరిన దొక్కటే నీలవర్ణ
చయ్యనను మోక్షమిచ్చినఁ చాలునాకు
భూషణ వికాస శ్రీధర్మ పురనివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర

భావం: ఓ నరసింహా, సంపదలు, ధనము, బంగారము, వాహనములు, నగలు, భూములు, బలము, గోవులు మొదలగునవి యిమ్మని నిన్ను అనేక విధముల కోరుటలేదు. ఓ నీలవర్ణా, నేనొక మోక్షమునే కోరితిని. శీఘ్రముగా దానిని నాకిచ్చిన చాలును.