ముచ్చటగా మూడోసారి మోదీ

ముచ్చటగా మూడోసారి మోదీ
ముచ్చటగా మూడోసారి మోదీ

దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలలో గెలిచి, మూడోసారి నరేంద్ర మోదీ దేశ పగ్గాలను పట్టనున్నారు. నువ్వా, నేనా అన్నట్టు సాగిన ఈ సార్వత్రిక ఎన్నికలలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ఎట్టకేలకు విజయం సాధించింది. కానీ, 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే, ఎన్డీయే, బీజేపీల సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ గణనీయంగా పుంజుకుంది.

బిజెపి కేవలం 240 స్థానాల్లో మాత్రమే గెలుపొంది, స్వతంత్ర్యంగా మెజారీటీని చేరుకోలేకపోయింది. ‘వై నాట్ 400’ అన్న బిజెపి పిలుపు అత్యాశే అయ్యింది. ఎన్డీయే కూటమితో కలిసి కూడా బిజెపి 400ల సంఖ్యకు చేరువ కాలేకపోయింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేవలం 292 సీట్లు గెలుచుకుంది. ఇది మెజారిటీకు కావల్సిన 272 కంటే 20 సీట్లు మాత్రమే ఎక్కువ. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా కూటమి’ 234 స్థానాలు గెలుచుకుంది. ఏడుగురు స్వతంత్రులు సహా ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. గత రెండు ఎన్నికలతో పోలిసే కాంగ్రెసు మెరుగైన ఫలితాలను రాబట్ట గలిగింది. 2019 లో కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెసు ఈసారి 99 స్థానాల్లో గెలుపొందింది. మరోవైపు గత లోక్ సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ, 240 సీట్లకు పరిమితమైంది.
బిజెపీ కీలకమైన ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రాలలో ఆ పార్టీ చతికలబడింది. గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఉత్తరప్రదేశ్ లో బిజెపీ కేవలం 33 స్థానాలను గెలుచుకుంది. ఆ పార్టీ నాయకురాలు స్మృతీ ఇరానీ అమేథీ నియోజకవర్గంలో ఘోరంగా ఓటమి పాలయ్యారు. కాకపోతే, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, దిల్లీలో దాదాపుగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రల్లో ఇండియా కూటమి దాదాపు 30కి పైగా స్థానాల్లో సత్తాచాటింది. అయితే, అరుణాచల్‌ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది.

బీజేపీ, ఎన్డీయే స్థానాల సంఖ్య భారీగా పడిపోవడం ప్రధాని నరేంద్ర మోదీకి నైతిక పరాజయమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. కాగా, ప్రధాని మోదీ మాత్రం 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలను ‘భారత చరిత్రలోనే అపూర్వ ఘట్టం’గా అభివర్ణించారు. దేశ ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై విశ్వాసం వ్యక్తం చేశారన్నారు. ‘‘భారత దేశ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టం. నా కుటుంబం చూపిన ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి, మేము కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త సంకల్పాలతో ముందుకు వెళ్తామని నేను దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ఎక్స్ లో రాశారు.

లోక్ సభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు సాధించిన సీట్లు

1. బీజేపీ – 240
2. కాంగ్రెస్ – 99
3. సమాజ్ వాదీ పార్టీ – 37
4. తృణమూల్ కాంగ్రెస్ – 29
5. డీఎంకే – 22
6. టీడీపీ – 16
7. జేడీ (యూ) – 12
8. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) – 9
9. ఎన్సీపీ (శరద్ పవార్) 8
10. శివసేన (షిండే) – 7
11. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) – 5
12. వైసీపీ – 4
13. ఆర్జేడీ – 4
14. సీపీఎం -4
15. ఐయూఎంఎల్ – 3
16. ఆప్ – 3
17. జేఎంఎం – 3
18. జనసేన – 2
19. సీపీఐఎంఎల్ – 2
20. జేడీఎస్ – 2
21. సీపీఐ – 2
22. ఆర్ఎల్డీ – 2
23. నేషనల్ కాన్ఫరెన్స్ – 2
24. యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ – 1
25. అసోం గణ పరిషత్ – 1
26. హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) – 1
27. కేరళ కాంగ్రెస్ – 1
28. రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ – 1
29. ఎన్సీపీ – 1
30. పీపుల్స్ పార్టీ వాయిస్ – 1
31. శిరోమణి అకాలీదళ్భారత్ ఆదివాసీ పార్టీ – 1
32. సిక్కిం క్రాంతికారి మోర్చా – 1
33. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం – 1
34. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) – 1
35. అప్నాదళ్ (సోనీలాల్) – 1
36. ఏజేఎస్ యూ పార్టీ – 1
37. ఎంఐఎం – 1
38. ఇండిపెండెంట్ – 7

తేటగీతి