కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అనేక విధాలుగా రాయితీలు, ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ కు అందవల్సిన ఆర్థిక సహాయాన్ని అందచేయడానికి కేంద్రం ముందుంటుందని ఆవిడ అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహుపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా ₹15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు. ఇక, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇక విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ సహా కొప్పర్తి వద్ద; హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వెంబడి ఓర్వకల్ వద్ద పారిశ్రామిక మండలాల ఏర్పాటుకు నిధులు కేటాయించనున్నారు.
ఈ సందర్భంగా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తామని నిర్మలమ్మ భరోసానిచ్చారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు బడ్జెట్లో రూ.620 కోట్లు కేటాయించింది. గతంతో పోలిస్తే రూ.63 కోట్లు కోత పెట్టింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర పన్నుల్లో ఏపీకి రూ.50 వేల కోట్ల వాటా రానుంది. గత సంవత్సరం కంటే 12.92% అధికం. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు 150 కోట్లు రూపాయలను కేటాయించింది. గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే ఇది రూ.126 కోట్లు తక్కువ.ఏపీ పునర్విభజన చట్టం (state reorganisation act) ప్రకారం విశాఖలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్లో రూ.78 కోట్లు పెంచింది.
తేటగీతి, జూలై 24, 2024