నాగమల్లి కోనలోన… నక్కింది లేడికూన, ఎరవేసి..హ…గురి చూసి…హ… పట్టాలి మామా.. అంటూ హూషారెక్కించే, కైపెక్కించే, మధురమైన ఈ పాటను పాడిన గాయని ఎవరు? అని నేటి తరాన్ని ప్రశ్నిస్తే, తడబడతారు. ఈ పాట పాడింది కె. జమునా రాణిగారు. సినీ సంగీత స్వర్ణయుగానికి చెందిన ఒక్కొక్కగాయని నిష్క్రమిస్తుంటే, ఆ లోటు తీర్చే గాయకులు ఇకమీద పుడతారా అనిపించకమానదు. నిన్న జానకమ్మ నేడు కె. జమునారాణి. పేరుకు తగ్గట్టుగానే చివరిదాకా రాణీలా తన జీవనాన్ని సాగించి, ప్రశాంతంగా నిష్క్రమించారు.
తల్లి ద్రౌపది సంగీత విదూషీమణి. ఆవిడ సాంగత్యంలో, జమునారాణిగారు పిన్నవయస్సు నుంచి తల్లిగారి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆమె కంఠస్వరంలోని వైచిత్రి, సంగతులను నొక్కి,నొక్కి పాడేతీరు ఆమెను విశిష్టగాయనిగా నిలిపాయి. 1944లో ‘తాసిల్దారు’ సినిమాలో ‘ఏ మందునే చిన వదినా’ పాటతో బాలగాయనిగా తన ఏడవ ఏట సినీ రంగప్రవేశం చేశారు. తదనంతరం 1946లో చిత్తూరి నాగయ్యగారి ‘త్యాగయ్య’ చిత్రం లో ‘మధురానగరిలో చల్లనమ్మ బోదు’, 1947లో భానుమతిగారితో కలిసి భరణి వారి రత్నమాల సినిమాలో ‘పోయిరా మా తల్లి’ అనే అంపకాల పాట పాడారు. ఆ తర్వాత ద్రోహి, లైలామజ్ను, దేవదాసులలో పాటల పాడినా అంత పెద్దగా గుర్తింపురాలేదు. సేలం మోడరన్ థియేటర్స్ వారి ఆస్థాన గాయని మారిన తర్వాత జమునారాణి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సేలం వారు తమిళ, సింహళీ సినిమాలు ఎక్కువగా తీయడంతో ఆ భాషల్లో ఎక్కువ గుర్తింపు లభించింది. సుమారు పాతిక సినిమాల్లో 150దాకా సింహళీ పాటలు పాడారు జమునారాణిగారు.
జనసమ్మోహితం చేసే ఆవిడ వాణి జానపదగీతాలకు పెట్టింది పేరు. మంచి మనసులు చిత్రంలో ఘంటసాలతో కలిసి పాడిన ‘మావ మావ మావా మావా, ఏమే ఏమే భామా’ అనే పాట ఆమెకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. నేటికీ సినీపాట కచేరీలు ఈ పాట పాడకుండా ముగయవంటే అతిశయోక్తికాదు.
భీష్మ సినిమాలోని ఆరుద్రగారి సాహిత్యం ‘హైలో హైలేసా హంసకదా నా పడవ’ జమునారాణిగారి గొంతులో పరవళ్లు తొక్కింది. ఆత్మబంధువులో ‘దక్కెనులే నాకు నీ సొగసు,’ ఉషా పరిణయంలో ‘ఓ జవరాల ఉషాబాలా’, కులగోత్రాలో సినిమాలోని ‘నీ నల్లని జడలో పూలు’, అన్నదమ్ములు చిత్రంలో ‘ఎక్కుమామ బండెక్కుమామ’, మర్మయోగిలో ‘రావాలి రావాలి రమ్మంటే రావాలి’, ‘మధువు మనకేల సఖియరో’ బండరాముడులో ‘అద్దిర బల్లా బల్లగుద్ది’, కలెక్టర్ జానకిలో ‘నీవన్నది నేనుకున్నది’, చివరకు మిగిలేదిలో ‘అందినికి అందము నేనే జీవన మకరందం’, మాంగల్యబలంలో ‘తిరుపతి వేంకటేశ్వరా’, నాయకుడులో ‘నా నవ్వే దీపావళి’, పాటలు ఆమెకు ఎనలేని పేరును తెచ్చిపెట్టాయి.
ఆవిడ పాడిన అనేక కొంటె హాస్య గీతాలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. ముఖ్యంగా, కులగోత్రాలు చిత్రానికిగాను పి.బి. శ్రీనివాస్ గారితో పాడిన హాస్య యుగళగీతం ‘రావే, రావే బాల హలో మైడియర్ బాల’, రాముడు-భీముడు సినిమాలో మాధవపెద్ది సత్యంగారితో పాడిన ‘సరదా సరదా సిగిరెట్టూ…ఇది దొరలు తాగు బలే సిగరెట్టూ’, కులదైవంలో కొసరాజుగారి రచన ‘సూటుబూటు వేసిన బావ’, ‘పద,పదవే వయ్యారి గాలిపటమా’ వంటి పాటలు శ్రోతల నాలుకలపై నేటికి నర్తిస్తునే ఉంటాయి.
మూగమనుసులు సినిమాలో జమునగారికి పాడిన ‘ముక్కుమీద కోపం’ పాట టీజింగ్ పాటల్లో నాటికి, నేటికి కూడా ముందువరుసలో ఉంటుంది. ఇక నాగమల్లికోనలోనా పాటకు ఆవిడ ఇచ్చిన ఎఫెక్ట్స్ మరే గాయని వల్ల సాధ్యంకాదేమో. ముక్కుతోపాడటం వల్ల కావచ్చు జమునారాణిని ఉత్తరాది గాయని షంషద్ బేగంతో ఎక్కువగా పోల్చేవారు. ‘పాట మన గొంతుకు సరిపోతుందా లేదా అన్నది ప్రధానంగా చూసుకోవాలి. తరవాతే మిగిలిన విషయాలన్నీ. ముక్కుతో పాడటం నా ప్రత్యేకత అయ్యింది. దీన్ని నేను బలహీనతగా ఎంతమాత్రం అనుకోను. ప్రత్యేకతగానే భావిస్తాను,’ అనేవారు జమునారాణిగారు. తన సంగీత ప్రస్థానంలో తెలుగు, మళయాళం, కన్నడ, తమిళం, సింహళం భాషల్లో సుమారు 5వేల పాటల దాకా పాడి మేటి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కొత్తనీరు వచ్చి పాతనీరు తీసినట్టుగా, కొత్త సంగీతదర్శకులు, గాయనీమణుల రాకతో జమునారాణిగారికి క్రమంగా అవకాశాలు సన్నగిల్లాయి. అయినా ఆవిడ నిరాశ చెందలేదు. కాలమార్పును ఆహ్వానించారు. సంగీతానికి అంకింతమయిన జమునారాణిగారు చివరి వరకు అవివాహితగానే ఉన్నారు.
జమునారాణి తెలుగువారైనా, తెలుగు పరిశ్రమ. ప్రభుత్వం ఆవిడ ప్రతిభను గుర్తించలేకపోయింది. తమిళ ప్రభుత్వం ఆవిడను కలైమామణితో గౌరవించింది. శ్రీలంక ప్రభుత్వం లైఫటైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వ గౌరవాలు ఆవిడకు దక్కకపోయినా, శ్రోతల హృదయపీఠికపై మాత్రం ఆవిడ చిరస్థాయిగా నిలిచే ఉంటారు.
సౌమ్యశ్రీ రాళ్లభండి