జయ జయ జయ ప్రియభారతి

జయ జయ జయ ప్రియభారతి
జయ జయ జయ ప్రియభారతి

సినిమా పాటలు అనగానే మనకు ప్రణయ గీతాలే గుర్తుకువస్తాయి. సినిమా పాటల్లో అధికశాతం ప్రేమగీతాలే. అందులో సందేహం లేదు. అయితే, ప్రేమగీతాలతో పాటు భక్తి గీతాలు, విషాద గీతాలు, ప్రభోదాత్మక గీతాలు, హాస్య గీతాలు, దేశభక్తి గీతాలు కూడా విరివిగానే మన సినిమాల్లో విన్పిస్తాయి. దేశభక్తిని ప్రబోధిస్తూ సినిమాకవులు శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, సినారె రాసిన గీతాలు ఎంతో ప్రజాదరణ పొంది ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశాయి. ‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతిక’,‘ నీ ధర్మం నీ సంఘం నీదేశం నువు మరువద్దు’, ‘తెలుగుజాతిమనది – నిండుగ వెలుగుజాతిమనది’ అంటూ అనేక దేశభక్తి గీతాలు ప్రేక్షకులని ఉత్తేజపర్చి, వారిలో దేశభక్తిని నింపడానికి దోహదపడ్డాయి.

తెలుగులో చలనచిత్రాలు మొదలైన కాలంలో ఎక్కువగా గురజాడ, రాయప్రోలు, గరిమెల్ల సత్యనారాయణ వంటి కవుల గేయాలను సినిమాల్లో ఉపయోగించేవారు. 1938లో వచ్చిన కాలచక్రం సినిమాలో గరిమెళ్ల సత్యనారయణగారి ‘మా కొద్దీ తెల్లదొరతనము దేవ మా కొద్దీ తెల్లదొరతనము’ అనే 120 పంక్తుల కవితలోని కొన్ని పంక్తులను చిత్రంలో పాటగా వాడారు. అలాగే, ఉప్పుసత్యాగ్రహం సందర్భంగా త్రిపురనేని రామస్వామిగారు రాసిన ‘వీర గంధము తెచ్చినారము, వీరుడెవ్వడో తెల్పుడీ’ అనే గీతాన్ని కొద్దిమార్పులతో ‘వీరగంధము తెచ్చినామయా, వీరులెవరో లేచి రండయా, శూరులెవరో లేచి రండయా; వీరగంధము పూసుకుంటాం, వీర రక్తము ధారపోస్తాం’ అని జయం మనదే చిత్రంలో వెలువడింది.

భారత స్వాతంత్రోద్యమాన్ని ముందుకు నడిపిన రాట్నం, జాతీయ పతాకాలకు సినీకవులు పెద్దపీటవేయటంతోపాటు హరిజన, మద్యపాన సమస్యలను ఎత్తిచూపారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని కొనియాడిన శంకరంబాడి సుందరాచారిగారు, ‘పాడవే రాట్నమా, ప్రణవ భారత గీతి, ఏడు దీవులలోను ఏ పారు నీ ఖ్యాతి’, అనే పాటను విదేశీ వస్త్రాల బహిష్కరణ, స్వదేశీ వస్త్రాల వినియోగానికి పిలుపునిస్తూ, 1941లో విడుదలైన ‘మహాత్మాగాంధీ’ డాక్యుమెంటరీ సినిమాకుగాను రాసారు. దీనిని సినిమాలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను పాడిన టంగుటూరి సూర్యకుమారిగారే ఆలపించటం విశేషం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటను మొదట సుందరాచారిగారు దీనబంధు అనే సినిమా కోసం ఒక యుగళగీతంగా రాసారు. అయితే, ఆ పాటను ఆ సినిమాలో ఉపయోగించలేదు. కానీ సూర్యకుమారిగారి గొంతుకలో గ్రామఫోన్ రికార్డు ప్రసిద్ధికెక్కి, తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా మారింది.

మన తెలుగువాడైన పింగళి వెంకయ్య కాంగ్రెసు పార్టీ కొరకు తీర్చిదిద్దిన మువర్ణ జెండా మధ్యలో ఉన్న రాట్నానికి బదులు సారనాథ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చి, కొత్త రూపురేఖలతో 1947 జూలై 22న దేశ జాతీయ పతాకంగా ఆమోదించారు. కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, సత్యానికి, ఆకుపచ్చ నమ్మకానికి, ధర్మచక్రం ప్రగతికి ప్రతీకలుగా తయారైన త్రివర్ణ పతాకంపై అనేక సినీ గీతాలు మన కవులు వెలువరించారు. దీనబంధు సినిమాలో ‘ఎగురవే పతాకమా, ఎరుపు తెలుపు ఆకుపచ్చ, జాతిచిహ్నములను దెలుప, ఢిల్లీ కోటపైన వేగ’, అలాగే, 1946లో విడుదలైన మాయాలోకంలోని ‘జెండా జెండా జాతీయ జెండా అదిగో కనుడీ, త్రివర్ణములు ధరయించి, స్వరాజ్యమునె మది నెంచి, స్వతంత్ర సమరము జరిపిన జెండా’ కొన్ని మచ్చుతునకలు.

రాయప్రోలువారి ‘ఏ దేశమేగినా, ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కిన, ఎవ్వరేమనిన; పొగడరా నీ తల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతి నిండుగౌరమును’ అన్న గేయం, 1948లోని మదాలస, 1987లో తిరిగి అమెరికా అబ్బాయి చిత్రాల్లో స్ఫూర్తిదాయక గీతంగా శ్రోతలను అలరించింది. అలాగే, గురజాడవారి, ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి యన్నది పెంచుమన్నా; వట్టిమాటలు కట్టి పెట్టోయ్, గట్టిమేలు తలపెట్టవోయ్’ గేయం 1954లో విడుదలైన జ్యోతి అనే సినిమాలో వినబడింది. ఆ తర్వాత కూడా అనేక గేయాలకు, చిత్రాలకు ఈ పంక్తులు ప్రేరణగా నిలిచాయి.

నాటి చలనచిత్ర గీతాలలో ఎక్కువగా జాతీయోధ్యమాన్ని ప్రేరేపించడం, మాతృభూమిని, స్వాతంత్ర్య సమరయోధులను కొనియాడడం, బ్రిటీషు పాలనను తూర్పారబట్టడం వంటి అంశాలే చోటుచేసుకునేవి.
తెలుగువారందరికీ ఎంతో సుపరిచతమైన, దేవులపల్లివారి గీతం, ‘జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ జయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి’ అప్పట్లో జాతీయ గీతంగా చేయలానే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ పాటను కాకినాడలోని పి.ఆర్ కళాశాల విద్యార్ధుల కోసం రాయగా, వింజమూరి సీత, అవసరాల అనుసూయగార్లు ఆకాశవాణిలో ఆలపించారు. 1986లో ఈ పాట రాక్షసుడు సినిమాలో విన్పించింది.

నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగా హొయ్ హొయ్ నాసామిరంగా

అంటూ ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్న వాల్మీకి వాక్యానికి గేయ రూపానిచ్చారు ఆరుద్రగారు సిపాయి చిన్నయ్య సినిమా కోసం. బొబ్బిలిపులి సినిమాలో దాసరి నారాయణరావుగారు వాల్మీకి వాక్యాలకు ‘ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్నభూమి గొప్పదిరా,’ అంటూ కొనసాగింపునిచ్చారు. అందుకే, ‘భారతమాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు… ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు’ అంటూ ఆ జననికి జేజేలు పలికారు ఆత్రేయగారు.

‘నిర్వేద మేలా, కన్నీరదేలా; భరతజాతి కపూర్వ పర్వమూ యీ వేళ’ అంటూ జాతీయ సమైఖ్యతా శంఖారావాన్ని సముద్రాల సీనియర్ గారు అనేక చిత్రగీతాల్లో చొప్పించారు. ‘తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడా, మా నిదురించిన గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన వాడా, త్యాగాలే వరిస్తాం, కష్టాలే భరిస్తాం, నిశ్చయముగ, నిర్భయముగ నీ వెంటనే నడుస్తా’ అంటూ మన్నెందొర అల్లూరి సీతారామరాజు తెలుగువారిని చైతన్యవంతులను చేసిన విధానాన్ని శ్రీశ్రీగారు అల్లూరి సీతారామరాజు సినిమాల్లో కళ్లకు కట్టినట్టుగా తన పాటద్వారా చూపారు.

ఆయన బాటలోనే సాగుతూ, జాలాదిగారు ‘పుణ్యభూమి నా దేశం నమోనమామీ, ధన్యభూమి నా దేశం సదా స్మరామి’ పాటలో ‘అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్లున తెల్లారి, వస్తున్నాడదిగో.. మన అగ్గిపిడుగు అల్లూరి’ అంటూ, అల్లూరి సీతారామరాజు గాథను క్లుప్తంగా వివరించారు.

’కొల్లాయి గట్టితేనేమి, మన గాంధి మాలడై తిరిగితేనేమి’ అంటూ జాతిపిత బాపూజీ అంతరంగ, బాహ్య స్వరూపాలతోపాటు, స్వాతంత్రోద్యమానికి ఆయన జరిపిన సారధ్యాన్ని కొనియాడుతూ అనేకపాటలు మన తెలుగుసినిమాల్లో విన్పిస్తాయి.

‘గాంధీపుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు, మమతకు సంకేత’మంటూ, ‘నమో నమో బాపు, మాకు న్యాయమార్గమే చూపు,’ అని కోరారు మన సినీకవులు. ‘గాంధి పుట్టిన దేశమా ఇది, నెహ్రు కోరిన సంఘమా ఇది’, అని నిలదీశారు. ‘ఊరికొక్క వీథి పేరు కాదుర గాంధీ; కరెన్సీ నోటు మీద ఇలా నడిరోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మకాదుర గాంధీ’ అని ఉద్భోధలు చేయటమేకాక, ‘అణగారిన బ్రతుకులలో ఆశాజ్యోతులు వెలిగించీ, మానవత్వమే మతమని చాటిన మహాత్మడే మన దైవం’ అని సందేశానిచ్చారు.
అలాగే, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి జీవితం ఆధారంగా విజయ్ చందర్ నిర్మించిన ‘ఆంధ్రకేసరి’ సినిమాలో ‘పదండి దండయాత్రగా, పదండి దండి దండుగా, ప్రకాశ సంహగర్జన దింగతరాలు నిండగా’ అంటూ ఉప్పు సత్యాగ్రహాం నేపథ్యాన్ని తెలిపే పాటలో, ‘ఆయుధాల శక్తి కన్న ఆత్మ శక్తి మెండురా, అలనాడిది చాటిచెప్పె టంగుటూరి గుండెరా, ప్రతి మనిషీ యీనాడొక ప్రకాశమై వెలుగురా’ అని చాటారు.
‘నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత, సీత; నా దేశం కరుణాతరంగ, నా దేశం సంస్కారగంగ’ అని బంగారు మనిషి సినిమాలో కొనియాడిన సి. నారాయణరెడ్డిగారు,

ఒక తలపై రుమీ టోపి
ఒక తలపై గాంధీ టోపీ
క్యా భాయ్ అని అంటాడొకడు
ఏమోయ్ అని అంటాడొకడు
మతాలు భాషలు వేరైనా
మనమంతా భాయీ, భాయీ

అంటూ భారత దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వం గురించి ఎలుగెత్తిచాటారు. అక్కడితో ఆగకుండా, మారుతున్న కాలంలో మారుతున్న మానవవిలువలను ప్రశ్నిస్తూ, ‘వందేమాతర గీతం వరుస మారుతోందని’ గాడి తప్పుతున్న జాతిని వందేమాతరం సినిమాలో హెచ్చరించారు.

తెలుగు సినిమాల్లో స్వాతంత్రోద్యమం, కేవలం భారతావని వరకే పరిమితం కాలేదు. ఆంధ్రోధ్యమము, నదీ ప్రాశస్త్యం, తెలుగు వీరుల పౌరుషాగ్నులను కీర్తిన, తెలుగుజాతి వైభవం కూడా చోటుచేసుకున్నాయి.
‘చెయెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవాడా; కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మ, తుంగభద్రా తల్లి పొంగి పారిన చాలు; ధాన్యరాసులె పండు దేశాన, కూడు గుడ్డకు కొదవ లేదోయ్’ అంటూ సస్యశ్యామలమైన తెలుగునేలను కీర్తించారు.

నాగార్జుని బోధనలు ఫలించిన చోట
బౌద్ధమత వృక్షమ్ము పల్లవించిన చోట
కృష్ణవేణి తరంగణి జారిగుండెయే
సాగరమ్మె రూపు సవరించుకొను చోట
ఆడవే జలకమ్ములాడవే,
కలహంసలాగా, జలకన్యలాగా

తెలుగునాట ప్రవహించే నదీమతల్లులకు విచిత్ర కుటుంబం అనే సినిమాలో నీరాజనాలు పలికారు సి. నారాయణరెడ్డిగారు. చివరగా,

కనుల జలజల బాష్పముల్ కార్చుచున్న
తల్లివదనమ్ము కనలేము, తాళలేము
కలము ఖడ్గమ్ము పూనెడు కరములెత్తి
పిలచుచున్నాము రారమ్ము తెలుగువీర

అంటూ తెలుగుతల్లికి స్వేచ్ఛనొసగమని ఎలుగెత్తి పిలుపునిచ్చారు మన సినీకవులు. ఇలా అనేక సినిమాల్లో అనేక పాటలు మన జాతి గౌరవాన్ని, స్వతంత్ర్య భావనలను ఇనుమడించుకొని ఈ రోజుకి నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

సౌమ్యశ్రీ రాళ్లభండి