ఆ గానమాగదులే...

ఆ గానమాగదులే...
ఆ గానమాగదులే...

ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతమో, మన మదిలో నిండుగా యాభై వసంతాలపాటు నిండిపోయింది. కోదండపాణి అంబుల పొది నుంచి సంధించబడ్డ ఈ ఓంకారనాదం సామవేద మంత్రమై శంకారాభరణమైంది. శ్రీతుంబురనారద నాదామృతం, చినుకులా రాలి, నదులుగా పొంగి, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలుగా శ్రోతల ఉచ్ఛ్వాస నిశ్వాసముల వాయులీనాలయ్యింది. ఆబాలగోపాలాన్ని మరిపించి, మురిపించి, డోలలాడించిన ఆ సుస్వరం మరెవరిదో కాదు, గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిది. పేరుకు బాలుడైనా పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టు ఏడుపదుల వయసులో కూడా గాంభీర్యమైన స్వరధార ఆ కంఠం నుంచి జాలువారి శ్రోతలను ఆనందవృష్ఠిలో తడిపింది.

కృషి ఉంటే మనుష్యులు ఋషులవుతారు అనడానికి నిలువెత్తు నిదర్శనం బాలుగారు. సాంప్రదాయ సంగీతంలో ప్రవేశంలేకపోయినా, కాళిదాసులాగా బాలుగారు కూడా ఆ శారదాంబ వరపుత్రులు. అందుకే అచ్చతెలుగు నుడికారం, మచ్చలేని మమకారంలా, తుంగభద్రా తరంగంలా సంగీతం ఆయన నోటిలో పదమై భారతవనిలో జీవనదై ప్రవహిస్తోంది. ఆయన పాడిన అనేకానేక భక్తి గీతాలు, భావ గీతాలు, విరహగీతాలు, విప్లవ గీతాలు, హూషారైన గీతాలు, ఉర్రెత్తించే గీతాలు లలిత కళారాధనలో వెలిగించిన చిరుదివ్వెలే.

ఎవరిరాకతో గళమున పాటలు ఏరువాక సాగెనో, ఎవరి మాటతో పులకరించి తనువు పురివిప్పి ఊగేనో, నేడు ఆ గళం మూగబోయింది. అయినా ప్రతి శ్రోత గొంతు శృతిలోన, ప్రతి గుండె లయలోనా బాలుగారు పాడిన పాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. తొలి సంధ్యవేళలో, తొలిపొద్దు పొడుపులో భూపాల రాగమై వినిపిస్తూనే ఉంటాయి. నూటికో కోటికో ఒక్కరు, ఎప్పుడో ఎక్కడో బాలులాంటి వారు పుడతారు. ఆ ఒక్కరు మన తెలుగు వారు కావటం మన జాతికి దక్కిన వరం.

ఏ రాగమైనా, ఏ తాళమైనా ఆయన గొంతుకలో గీతమై అది స్వర రాగ గంగా ప్రవాహమై సంగీత ప్రపంచాన్ని ముంచెత్తింది. వేల వేల వత్సరాలకేళిలో, మానవుడుదయించిన శుభవేళలో వీచే మలయమారుతాలు, పుడమి పలికె స్వాగతాలు, మాలికలై తారకలై, మలిచెకాంతి తోరణాలైన వేళ తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో వినిపించే ఉదయరాగం బాలుగారిదే అవుతుంది. ఘంటశాలగారి రాగాలాపన, ఉచ్ఛారణను, మహ్మద్ రఫీ భావవ్యక్తీకరణను మమేకం చేసి తనకంటూ ఒక వినూత్న శైలితో శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ, అంటూ ఆ శార్వాణికి ఆయన ‘సర్వాభిషేకం’ చేశారు.

‘‘పాటపాడడం కొద్దిగా వచ్చు. మాట్లాడటం బాగా వచ్చు’’ అని ఒకానొక సందర్భంలో బాలుగారు చెప్పుకున్నారు. ఆ మాటే ‘పాడుతా తీయగా చల్లగా’ కార్యక్రమానికి ఊపిరి, ప్రాణం. కళాకారుడు మానవతా విలువలు కలిగి ఉండాలనుకునే శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న ఆయన. ఆ విలువలను, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను, తెలుగు భాషను, భావితరాలవారికి ఎంతో ఓర్పుతో, సహనంతో ఆ కార్యక్రమం ద్వారా అందించి పాటకు, మాటకు నిర్వచనమయ్యారు. పొలిమేర దాటిపోతున్న ఆ గువ్వలచెన్నుడి, పొరుగూరికి చేరిపోయిన ఆ గువ్వల చెన్నుడి గళం, గానం మూగబోవు, అజరామరమైన ఆయన గానమాగదు. ప్రేక్షకుల హృదయపు కోవెలలో, వారి బంగారు లోగిళ్లలో ఇదే పాట, ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటారు.

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృతవర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా
నా గానమాగదులే ఇక ఆ గానమాగదులే…..

 

బాలుగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళి…

సౌమ్యశ్రీ రాళ్లభండి