అన్నమయ్య పదాలలో లక్ష్మీవైభవం

అన్నమయ్య పదాలలో లక్ష్మీవైభవం
అన్నమయ్య పదాలలో లక్ష్మీవైభవం

ఈశానాం జగతో స్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షఃస్థలనిత్యవాసరసికాం త క్షాంతిసంవర్ధనీం
పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్

అమ్మవారు శ్రీవారి వక్షస్థలంమీద పద్మాసనం వేసుకొని, రెండు భుజాలతో, రెండు చేతుల్లో పద్మాలను ధరించి భక్తుల పాపాలను, దోషాలను తొలగించి స్వామివారి కృపకు పాత్రులుగా మారుస్తూ ‘వ్యూహాలక్ష్మి’ గా కొలువై ఉంది. పద్మంలో కూర్చొన్న అమ్మవారి వైభవం, చక్కదనం, ప్రౌఢతనాన్నితన శృంగార కీర్తనలలో రంగరించి అన్నమయ్య ఆ చక్కని తల్లికి చందనలేపానాలు అద్దాడు.

అలమేలుమంగ నీవభినవరూపము
జలజాక్షకన్నులకు చవులిచ్చేవమ్మా

గరుడాచలీధీశు ఘన వక్షమున నుండి
పరమానందసంభరితవై
నెరతనములు చూపి నిరంతరము నాథుని
హరుషించఁగఁ జేసితి గదమ్మా

శశికిరణములకు చలువల చూపులు
విశదముగా మీఁద వెదచల్లుచు
రసికత పెంపునఁ గరఁగించి యెప్పుడు నీ
వశము చేసుకొంటి వల్లభునోయమ్మా

రట్టడి శ్రీ వేంకరాయనికి నీవు
పట్టపురాణివై పరఁగుచు
వట్టిమాఁకులిగిరించు వలపుమాటల విభు
జట్టిగొని వురమున సతమైతివమ్మా.

భృగుమహర్షిపై ఆగ్రహంతో కొల్హాపూరిలో శ్రీమహాలక్ష్మిగా వెలసిన మహాలక్ష్మి శ్రీనివాసుని ప్రార్థన మేరకు తిరుచానూరులో పద్మావతిగా వెలసిందని పురాణగాథ. అమ్మవారు కార్తీకమాసం శుద్ధపంచమీ శుక్రవారంనాటి అభిజిత్ లగ్నంలో ఉత్తరాషాడ నక్షత్రంలో బంగారు పద్మంలో ఆవిర్భవించింది. పద్మంలో ఆవిర్భవించింది కాన ఆ జగన్మాత పద్మావతిగా ప్రసిద్ధికెక్కింది. ‘అలర్ మేల్ మంగ’ అంటే పద్మంపైన ప్రకాశిస్తూ వెలసిన దివ్యకాంతగాన అలువేలుమంగ అయ్యింది. అందుకే ఇప్పటికీ, ప్రతి ఏడు దసరా నవరాత్రుల సందర్భంగా కొల్హాపూరిలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి నుండి పసుపుకుంకుమ, చీరసారెలు పంపించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. అలాగే అమ్మవారి పుట్టినరోజున తిరుమల శ్రీవారి నుంచి తిరుచానూరు అమ్మవారికి రెండు పట్టుచీరలు, రెండు పట్టు రవికెలు, పసుపు ముద్ద, శ్రీగంధపు కర్ర, పచ్చి పసుపుకొమ్మలతో ఉన్న పసుపు చెట్లు, పూలమాలలు, తులసీమాలలతోపాటు, ఒక బంగారు హారం, పిండివంటలు ఒక పడి (51) పెద్ద లడ్లు, ఒక పడి వడలు, ఒక పడి అప్పాలు మరియు ఒక పడి దోసెలు కానుకలుగా పంపడం ఆనవాయితీ.

ఇంతట నిట్టె విచ్చేసి యింతిఁ గూడితేఁ గనక
వంతుకు నిన్ను జాణదేవర వనవచ్చును

తనలోనె తలపోసి తప్పక చూచేవేళ
వనితను దేవగన్య యనవచ్చును
పనివి నిన్నుఁ దలఁచి పాటలు వాడేవేళ
అనుగు గంధర్వకాంత యనవచ్చును

చలపట్టి విరహాన జలకేళి సేయువేళ
అలివేణి నాగకన్య యనవచ్చును
చలువకుఁ చంద్రకాంతశిలపైఁ బొరలు వేళ
అలరిన చంద్రకన్య యనవచ్చును

శ్రీవేంకటేశ నీవు చెలయఁ గూడినవేళ
ఆవటించి నిజలక్ష్మి యనవచ్చును
వోవల నీ సొమ్మలలో వురమున మోచువేళ
దేవి యలమేలుమంగ దిష్ట మనవచ్చును.

అన్నమయ్యకు అలమేలుమంగాకు అవినాభావ సంబంధం ఉంది. పాదరక్షలతో తిరుమలకొండ ఎక్కడానికి ప్రయత్నించి విఫలుడై, ఆకలి,దప్పికలతో స్పృహ కోల్పోయిన అన్నమయ్యకు ఆకలి దప్పులు తీర్చి ఆనందనిలయానికి ఆ తల్లి దారి చూపిందని గాథ. ఆశ్రవులు తుడిచిన అమ్మను ఆశువుగా తన కవితామృతంతో స్తుతించి, ప్రార్థించాడు అన్నమయ్య.

చొచ్చితిఁదల్లి నీమఱుఁగు సొంపుగ నీ కరుణా కటాక్షమె
ట్లిచ్చెదొ నాకు నేఁడు పరమేశ్వరి యో యలుమేలుమంగ నీ
మచ్చిక నందు నీ తరుణి మన్నన నే నిను గంటి నీకు నా
బచ్చెనమాట లేమిటికి బ్రాతివి చూడగ వేంకటేశ్వరా.

‘వేంకటేశ్వర’ అన్న మకుటంతో అన్నమయ్య అలమేలుమంగపై శతకాన్ని రచించించటంతోపాటు అలమేలుమంగా, శ్రీనివాసుల శృంగారతత్త్వాన్ని తెలియపరిచే ‘శృంగార మంజరి’ అనే ద్విపద కావ్యాన్ని కూడా రచించాడు.

అమ్మకుఁదాళ్లపాకఘనుఁడన్నడు పద్యశతంబుజెప్పెగో
కొమ్మని వాక్ఫ్రసూనముల గూరిమితోఁనలమేలుమంగకున్
నెమ్మది నీవు చేకొని యనేక యుగంబుల బ్రహ్మకల్పముల్
సమ్మదమంది వర్ధిలను జవ్వన లీలల వేంకటేశ్వర

మీనాలవంటి కన్నులకు, ధనస్సువంటి కనుబొమ్మలతో, కుంభముల వంటి స్తనములతో, బంగారు వన్నెలతో, వృశ్చికపు మొనల వలెనున్న వాడి గోళ్లతో, సింహంపు నడుముతో, పట్టిన పట్టు విడవని ఎండ్రకాయ మనస్తత్వంతో వేంకటేశ్వరుని మత్తిల్లజేయు సౌందర్యముతో ఆ సొగసుల రాశి అలువేలు మంగ వేంకటవిభునితో కూడి ఉందని, అన్నమయ్య అలమేలుమంగ హావభావాలను, మేష, వృషాభాది పన్నెండు రాశులతో పోల్చచమేకాక, నవరసాలతో మేళవించి మనోజ్ఞంగా వర్ణించటం అనన్యసామాన్యం.

నవరసములదీ నళినాక్షి
జవకట్టి నీకుఁ జవిసేసీని

శృంగారరసము చెలియమొకంబున
సంగతి వీరరసము గోళ్ళ
రంగగు కరుణారసము పెదవులను
అంగపుఁ గుచముల నద్భుతరసము

చెలి హాస్యరసము సెలవుల నిండీ
పలుచని నడుమున భయరసము
కలికి వాడుఁగన్నుల బీభత్సము
అలబొమ జంకెన(ల) నదె రౌద్రంబు

సతిరతి మరపుల శాంతరసంబదె
అతి మోహము పదియవరసము
ఇతవుగ శ్రీ వేంకటేశ కూడితివి
సతమై యీపెకు సంతోషరసము

అష్టైశ్వర్యప్రదాతియైన శ్రీ మహాలక్ష్మి అందాలకు, అలంకారాలకు ఏమి కొదవ. కాముని తల్లికి చక్కదనానికి ఏమి కొదవ. సోముని తోబుట్టువు సొంపులకేమి కొదవ. కలశాబ్ధికూతిరి గంభీరాకేమరుదు, జలజనివాసి చల్లదనానికేమరుదు, అమరవందితకు, అమృతపు చుట్టమయిన లక్ష్మీదేవి చెంత ఆనందానికేమిలోటని అమ్మవారి మహిమాన్వితాన్నిపొగడుతూనే,

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం

జలజాక్షిమోమునకు జక్కవ కుచంబులకు
నెలకున్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజ నాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం

పై సంకీర్తనలో అమ్మవారి అవయవ వర్ణనలను జలజాక్షి మోము – వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా, జక్కవ కుచంబులు – కామేశ్వరప్రేమ రత్నప్రతిపణ స్తనీ, అలివేణి తురుము – చంపకాశోగ పున్నాగ సౌగన్ధికలసత్కచా, చరణ కిసలయములు – పదద్వయ ప్రభాజాల పరాకృ సరోరుహా, సకియ రంభోరులు – కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దువోరు ద్వయనితా, అరిది జఘనంబునకు – అరుణారుణ కౌస్తుభ వస్త్రభాస్వత్కటీతటీ అంటూ లలితా సహస్రనామాలతో పోలుస్తూ నీరాజనం పాడి ధన్యుడయ్యాడు అన్నమయ్య.

నారాయణస్య హృదయే భవతీ యథాస్తే
నారాయణోపి తమ హృత్కమలే యథాస్తే
నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ
తౌ తిష్ఠతాం మది మమాపి దయావతి శ్రీః

సౌమ్యశ్రీ రాళ్లభండి