ఏ మనిషికైన ఉనికిని, అస్థిత్వాన్ని ఇచ్చేది కుటుంబమైతే, అందు ప్రథమ గురువు తల్లి. అవడానికి రెండక్షరాలే అయినా, బ్రహ్మాండానే తనలో పొదవుకుటుందంటే అతిశయోక్తి కాదు. ఎదుగుతున్న బుడతడికి అడుగడుగునా, తన చుట్టూ ఉన్న ప్రకృతిని, సమాజాన్ని, కుటుంబాన్ని సున్నితంగా పరిచయం చేస్తుంది. మారుతున్నా కాలంలో గ్రామీణ పడతుల నోటి నుంచి వెలువడిన జానపదాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రవాసాంధ్రులనేకాదు, ఆంధ్రానాట కూడా నేడు తెలుగు పదాలు కరువైపొతున్నాయి. అలా మన జనజీవీనంలో కలిసిపోయి అప్పుడప్పుడు రాలే తోకచుక్కలా రాలే ఈ పల్లెపడుచుల పదాలు మన తెలుగు భాషకి, సంస్కృతికి పచ్చటి తోరణాలు.
అమ్మచేతి గోరుముద్ద తినని బాలకృష్ణులుండరు. అన్నం తినని మారాం చేసే పిల్లలను చంకనెత్తుకొని, మరిపించి, మురిపించి, బుజ్జగించి బొజ్జలు నింపే తల్లులకు శతకోటి వందనాలు. ఈ సందర్భంగా ప్రతీ తెలుగువాడి నోట పలికే పాట ఒక్కటే –
చందమామ రావె, జాబిల్లి రావె – కొండెక్కి రావె గోగుపూలు తేవె
బలవని పండు ఒళ్లో ఉంచుకొని – బల్చిన పండు చేత బుచ్చుకొని
వెండిగిన్నెలో వెన్న పెట్టుకొని – పమిడి గిన్నెలో పాలు పోసుకొని
అమ్మ, నువ్వు తిందురు గాని…
చిన్నయన్నకు శ్రీ రఘు శేఖరునకు – వెండి గిన్నియ లోపల వెన్నపోసి
పసిడి గిన్నియ లోపల పాలుపోసి – చాల దినిపించి పోగదే చందమామ
అన్నమయ్యంతటి వాగ్గేయకారుడే చందమామ రావో, జాబిల్లి రావో, మంచికుందనపు పైడికోర వెన్నపాలు తేవో అంటూ ఆ ఆనందనిలయునికే ఆరగింపులు చేసాడు. ఈ పాట మూలం ఏదైనా ఇది తెలుగునాట తల్లుల నోట అనేక రూపాంతరాలు చెంది తమ పిల్లల ఆకలి తీర్చింది, తీరుస్తూనే ఉంటుంది.
అలాగే, ఏడ్చే పిల్లలకు ఆకేసి, పీటేసి అంటూ చక్కిలిగింతలు పెట్టి, వారిని నవ్వించి, మురిపించి వారికి తినుపదార్ధాలను పరిచయం చేసే ఈ పాట ఇప్పటికి బామ్మల, అమ్మమ్మల నోట వింటూనే ఉంటాము.
అన్నంబెట్టి, అప్పబెట్టి, అప్పడం పెట్టి దప్పడం బెట్టి
కూర బెట్టి నారబెట్టి గారె బెట్టి బూరెపెట్టి
పాలుబోసి పరమాన్నం బోసి అంటూ ఒక్కొక్కవేలు మడుస్తూ,
గుంట గట్టి గుంట నిండ నెయ్యిబోసి
మా అబ్బాయి లేదా అమ్మాయి అత్తవారింటికి తోవేదంటే
తాళ్ళల్ల నుంచి తంగెళ్ళ నుంచి – అదేతోవ అదేతోవ అంటూ చక్కలిగింతలు పెడితే పిల్లల నవ్వులతో ఇల్లంతా బృందావనమవుతుంది.
అంతేనా –
గుమ్మడి గుమ్మాడమ్మా గుమ్మాడీ ఆకుల్లు వేసింది గుమ్మాడీ
పూవుల్లు పూసింది గుమ్మాడి, పండ్లు పండిందమ్మ గుమ్మాడీ
అందులో ఒక పండు ఆ పండు యెవరమ్మ గుమ్మడీ
మా చిట్టితండ్రమ్మ గుమ్మాడీ,
అంటూ పండులాంటి బాబుని మురిపెంగా ఎత్తుకొని,
ఏనుగమ్మా ఏనుగు ఏ ఊరొచ్చింది ఏనుగు?
మావూరొచ్చింది ఏనుగు ఏం చేసింది ఏనుగు?
మంచినీళ్లు తాగింది ఏనుగు, ఏనుగు ఏనుగునల్లన్న
ఏనుగు కొమ్ములు తెల్లన్న, ఏనుగు మీద రాముడు
ఏంతో చక్కని దేవుడు
అంటూ, తన బిడ్డడు కూడా ఆ సుగుణాల రాముడుకావాలని, ‘హాయి, హాయి, హాయి, ఆపదలుకాయి
చిన్నవాళ్లను గాయి శ్రీరంగశాయి’,‘ రక్ష, రక్ష సంధ్య రక్ష, సర్వ రక్ష, దీప రక్ష, దివ్య రక్ష – చిన్ని నా అబ్బాయికి శ్రీరామ రక్ష’ అని దిష్టిమంత్రాలతో దిగదిడుస్తుంది.
ఇక ఐదారు నెలల పిల్లలు రంగులకు ఆకర్షితులై తదేకంగా చూస్తుంటారు. పిల్లలకు ప్రకృతిని, రంగులను కూడా పాటలలో వర్ణించి వారికి తల్లులు పరిచయం చేస్తారు.
శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణా
పొడుస్తూ బాలుడు పొన్నపువ్వూఛాయ
పొన్నపువ్వుమీద బొగడపువ్వుఛాయ
ఉదయిస్తూ బాలుడు ఉల్లేపువ్వూఛాయ
గడియెక్కి బాలుడు, కంబపువ్వుఛాయ
కంబపువ్వుమీద, కాకారి పువ్వుఛాయ
వచ్చిరాని మాటలతో పిల్లాడు అమ్మపాట, మాట వల్లెవేస్తుంటే, మురిసిపోతూ, ‘అరటిపండు తీపి, ఆవుపాలు తీపి, మా చిన్ని అబ్బాయి మాటల్లు తీపి’ అంటూ ఆ పిచ్చితల్లులు మురిసిపోతుంటారు. ఇలా ఒకటేంటి అడుగడుగునా జానపదుల పాటలు, గేయాలు మనని తట్టిలేపుతూనే ఉంటాయి, తల్లిప్రేమను గుర్తు చేస్తూనే ఉంటాయి.
సౌమ్యశ్రీ రాళ్లభండి