నా స్మృతి పథం – 2

నా స్మృతి పథం – 2
నా స్మృతి పథం – 2

జర్నలిజం స్కూలు

నేను చిన్నప్పటి నుంచి కాలేజీ చదువు పూర్తయ్యే వరకు హైద్రాబాద్ లోని ఆంధ్రమహిళా సభ స్కూలు, కాలేజీలలోనే చదివాను. స్కూలు చదువంతా తెలుగు మీడియం కావటంతో తెలుగులో పట్టు సాధించగలిగాను కానీ, ఇంగ్లీషు అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కూర్చుంటాను. జూనియర్, డిగ్రీ చదువు ఇంగ్లీషు మీడియం అయినప్పట్టికీ, అది చాలాకాలం పర భాషగానే మిగిలిపోయింది. భాష ఎలా ఉన్నా పూర్తిగా ఆడపిల్లల పాఠశాల, కాలేజీ కావటంతో జర్నలిజం కోర్సుకు వెళ్లినప్పుడు కొత్తలో కొంత బెరుకుగా ఉండేది. ఆడ, మగపిల్లలు కలిసి ఒకే బెంచీ మీద కూర్చోవడం, మాట్లాడుకోవడం, దానికి తోడు మనది బట్లర్ ఇంగ్లీషు. నేనేదో ఆలిస్ ఇన్ వండర్లాండ్ కు వెళ్లినట్టుండేది. రాను, రాను రాటుదేలిపోయాననుకోండి. అది వేరే విషయం. కానీ ఏ మాట కా మాటే చెప్పాలి. మా బ్యాచ్ లాంటి బ్యాచ్ జర్నలిజం డిపార్టమెంటులో అంతకు ముందు లేదు, ఇక ముందు రాదు కూడా. నాడు మా మధ్య ఏర్పడిన స్నేహబంధం పాతిక వసంతాల తర్వాత కూడా నిండు పున్నమిలా అలాగే ఉండటమే అందుకు తార్కాణం.

జర్నలిజం రెండేళ్లు రెండు నిమిషాలలాగా గడిచిపోయాయి. ఆ కాలంలో మాకు ప్రోఫెసర్ బషీరుద్దీన్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్టమెంట్ గా ఉండేవారు. మాకు భారత రాజ్యాంగం, పత్రికా విలువలు, హక్కులు, బాధ్యతల గురించి చెప్పేవారు. ఆయన క్లాస్ అంటే చాలు తుపాకీ గుండుకు దొరకకుండా పారిపోయేవాళ్లం. అది ఆయన గొప్పతనమో, మా చిలిపితనమో తెలియదు కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా మాకు ఆయన మమ్మల్ని పట్టుకుని మరీ పాఠాలు చెప్పేవారు. ఆయన క్లాసు అనగానే తుర్రుమని క్యాంటీనికి పరిగెత్తి అక్కడి తిష్టవేసే వాళ్లం. ఆయన క్లాసులో మేము లేకపోవడం చూసి ఆఫీసు బాయ్ ని క్యాంటీన్ కి పంపేవారు. వస్తున్నాం అని చెప్పి రెండుగంటలైనా వెళ్లేవాళ్లంకాదు. ఆయన అంతే ఓపికగా క్లాసులో కూర్చుని మళ్లీ,మళ్లీ ఆఫీసు బాయ్ ని పంపేవారు. చివరికి మేమే విసిగి, ఇంకా ఆ పెద్దాయనని అలా వేధించడం, వేచి చూసేటట్టు చేయడం భావ్యంకాదని ఈసురోమని క్లాసుకు వెళ్లేవాళ్లం. ఆయన విసుగు, విరామం లేకుండా రెండు, మూడు గంటలపాటు క్లాసు పీకేవారు కానీ, ఏరోజు మమ్మల్ని మందలించిన పాపాన పోలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటిన్లో మాము తాగినన్ని టీలు, తిన్నన్ని సమోసాలు మరెవ్వరూ తాగుండరు, తినుండరు. మేమెంత అల్లరి చేసినా, పని కూడా అంత శ్రద్ధతోనూ చేసేవాళ్లం.

నేడంటే అంతా కంప్యూటర్ల మయం. అప్పట్లో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే న్యూస్ ఏజెన్సీలు టెలీ ప్రింటర్ల ద్వారా వార్తలను సరఫరా చేసేవి. మా కాలేజీలో కూడా పిటిఐ వారి ప్రింటర్ ఒకటి ఉండేది. నిరంతరం ఎప్పటి వార్తలు, అప్పుడు కాగితం మీద అచ్చవుతుండేవి. ఇప్పుడవన్నీ కంప్యూటర్లలో డిజిటల్ గా లభిస్తున్నాయి. జర్నలిజం కోర్సలో భాగంగా ప్రతీ రోజు ఈ స్టోరీ బోర్డు ఒకటి మేము తయారు చేయాలి. మా ముందు బ్యాచ్ లు వాటిని చేసిన దాఖలాలు లేవు. కానీ మేము మాత్రం క్లాసులు హాజరైనా కాకపోయినా, ప్రతీ సాయంత్రం ఏదో చిన్నసైజు దినపత్రిక ప్రచురిస్తున్నట్టు ఊహించుకుంటూ, ఈ స్టోరీ బోర్డును తయారు చేసి, ఆర్ట్స్ కాలేజీ ప్రాగంణంలో పెట్టేవారం. బోర్డు అంటే ఏదో అషామాషీగా చిన్న నోటీసు బోర్డు అనుకోకండి. అచ్చయిన ప్రతిని చూసి, అందులో ప్రాముఖ్యం ఉన్న, రాజకీయ, ఆర్ధిక, సాంకేతిక, సాంస్కృతిక, క్రీడా రంగాలకు సంబంధించిన వార్తలను కత్తరించి, వాటికి హెడ్డింగలు రాసి, పత్రికలో వివిధ పేజీలలలో పెట్టినట్టుగా బోర్డు మీద అతికించేవాళ్లం. ఒక వార్త సేకరించటం దగ్గర నుంచి, అచ్చు తప్పులు దిద్దటం, ముఖ్యాంశాలను గుర్తించి, హెడ్డింగ్ లు పెట్టి, ప్రాముఖ్యాననుసరించి ఏ వార్తను ఎక్కడ పెట్టాలి లాంటి పత్రికలకు సంబంధించిన కీలక విషయాలన్నింటినీ తద్వారా నేర్చుకోగలిగాం. ముందు, ముందు మా పాత్రికేయ వృత్తిలో ఈ అనుభావం మా అందరికి కొద్దో, గొప్పో ఉపయోగపడిందనే అనుకుంటున్నాను.

అలాగే, ఉస్మానియా కొరియర్ అనే చిన్న త్రైమాసిక పత్రికను కూడా జర్నలిజం కోర్సులో భాగంగా కనీసం రెండు, మూడు సార్లు ముద్రించిన ఘనత కూడా మా బ్యాచే కే దక్కింది. కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యకలాపాలను, సమస్యలను, విలేఖర్లలా వెళ్లి తెలుసుకోవడం, వార్తలను సేకరించడం అదో తుత్తి. కొన్నిసార్లు మేము జర్నలిజం విద్యార్ధులమని చెప్పగానే, చెపుతున్న విషయాన్ని ఆపేసి మీ దగ్గర చెపితే తంటా అన్న సందర్భాలు లేకపోలేదు. అప్పుడే విలేఖర్ల పట్ల సమాజంలో ఉండే భయం, గౌరవం కూడా తెలిసి వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే, జర్నలిజం కోర్సు నాకు అనేక పాఠాలు నేర్పింది.

జర్నలిజం కోర్సులో భాగంగా స్టడీ టూర్కి న్యూఢిల్లీ వెళ్లి పత్రికారంగంలోని ప్రముఖులను కలుసుకుని ముచ్చటించి, వారి అనుభావలను తెలుసుకునే అవకాశం కూడా కల్గింది. కానీ రెండేళ్ల తర్వాత అదే న్యూఢిల్లీ వీథులలో నేను నా పాత్రికేయరాలిగా తిరుగుతానని కలలో కూడా అనుకోలేదు. ఆ విషయాలు మున్ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం, ఉస్మానియా కొరియర్ పత్రికకు నేను రాసిన చిన్న సమీక్ష మీ కోసం. ఇది నేను మొదటిసారిగా ఇంగ్లీషులో చేసిన రచన. ఇంగ్లీషేం ఖర్మ, అసలు ఒక రకంగా ఇదే నా మొట్టమొదటి పత్రికా రచన. అప్పట్లో దూరదర్శన్ లో బ్యోమకేష్ భక్షి అని ఒక డిటెక్టివ్ ధారావాహికం వచ్చేది. అప్పటి వరకు నేను ఎప్పడు చదువులో భాగమైతే తప్పిస్తే నవలలు చదివి ఎరగను. ఇంగ్లీషు నవలలైతే చెప్పనే అక్కర్లేదు. రచనా వ్యాసాంగం చేసేవారికి పుస్తక పఠనం ఎంత అవసరం అనేది నాకు తర్వాత కాలంలో తెలిసింది. జర్నలిజం చదివేనాటికి ఒక్క ఇంగ్లీషు నవల కూడా చదవని నేను, ఇప్పుడు వందకు పై చిలుకు ఇంగ్లీషు నవలలు చదివుంటాను. ఇంగ్లీషు నవలలు చదవకపోయినా, ప్రతిరోజు ఇంగ్లీషు అని కాదు పేపరు మాత్రం తప్పనిసరిగా చదవడం మా నాన్నగారు మాకు అలవాటు చేసేవారు. ఈ రోజు ఈ చిన్ని సమీక్ష్ చూస్తే, ఇది నేనేనా రాసింది అన్పిస్తుంది. కానీ ఇది నా రచనా ప్రయాణంలో మొదటి మెట్టు. మార్చి 6, 1993లో ఉస్మానియా కొరియర్ పత్రికలో వెలువడ్డ ఈ చిన్ని సమీక్ష నా తుత్తి కోసం.

Bakshi Lets down
After a long time Doordarshan (DD) has come out with a detective serial Byomkesh Bakshi, which different from the likes of Karamchand and Barrister Vinod. In the hand of eminent film director Basu Chatterji, the serial has acquired a new shape. The first few episodes promised a lot, thanks to a good mix of drama, dialogue and light humour. But somehow, it got lost midway.
Among the earlier episodes, ‘Raste ka Kante’ is simply superb, where the director tried to bring out the scientific reasoning and intelligence in using the cycle bell as a weapon to kill. However, the element of drama and the gripping manner in which Vyomakesh narrates how he unravelled the mystery seem to be missing in the later ones. There seems to be an over-dose of dialogues and one gets the impression that a whizkid is solving puzzles is bout to succeed in doing so.

Saradindu Bandhopadya’s story too lacks novelty. Anand Shankar’s music fails to maintain the tempo of suspense. Rajat Kapoor in the title role and K K Raina as Ajit in supporting role are impressive which alone sustains the interest of the viewers. Veteran actor Utpal Dutt stole the show in one of the episodes. Overall, though it is a good attempt, Basu’s touch is missing.

సౌమ్యశ్రీ రాళ్లభండి