మన భాషకు తెనుంగు, తెలుంగు, ఆంధ్రమని మూడు పేర్లు. తెలుగు భాష తేనెవలె తీయనైనది. పాశ్చాత్యులచే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని, దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణ దేవరాయలచే ప్రశంసించబడినది తెలుగు భాష. హిందీ భాష తరువాత రెండవ స్థానాన్ని ఆక్రమించి ప్రపంచములో తన ఉనికిని సుస్థిరము చేసుకోబోతున్న తెలుగు భాషకు కావ్య రూపమిచ్చి ప్రాణం పోసిన ఆదికవి నన్నయ భట్టారకుడు తెలుగువారందరికి ప్రాతః స్మరణీయుడు.
11 వ శతాబ్దమున చెందిన నన్నయభట్టు వేంగీ రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న చాళుక్య వంశీయుడైన రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. విద్వాంసుడైన రాజరాజనరేంద్రుని కోరిక మీద తెలుగులో నన్నయ మహాభారత రచన ప్రారంభించినాడు. ఆది, సభా, అరణ్య పర్వంలో కొంత భాగం రచించాడు. ఆ తరువాత రెండు వందల సంవత్సరాలు మహాభారత రచన ఆగిపోయింది. అందుకు కారణం అప్పటి రాజకీయ పరిస్థితులు అని చెప్పవచ్చు. అటు తరువాత 13వ శతాబ్దంలో నిర్వచనోత్తర రామాయణం వ్రాసిన తిక్కన కవి విరాట పర్వం మొదలు 15 పర్వములు తెనిగించాడు. ఆ తరువాత వచ్చిన ఎఱ్ఱన మిగిలిన అరణ్య పర్వాన్ని పూర్తి చేసి నృసింహ పురాణమును, హరివంశాన్ని కూడా వ్రాసాడు. ఎఱ్ఱన చేసిన భాగం చిన్నదైనా మూడవ వ్యక్తి రాశాడా అనే తేడా లేకుండా నన్నయ శైలిలో మొదలు పెట్టి తిక్కన శైలిలో ముగించాడు. రెండు మహా సముద్రాలను కలిపే జలసంధిలా ఎఱ్ఱన తన భాగం తెనిగించడం విశేషం.
పోతే, నన్నయ కావ్యరచన ప్రారంభించేనాటికి ఆనాటి భాష ఏ విధంగా వున్నదని పరిశీలిస్తే తెలుగు భాష శాసనములకే పరిమితమైనదని తెలియ వస్తుంది. అది కూడా కేవలం దానములను ఇచ్చుట, గ్రహించుట అను వాటిని తెలుపుటకే భాష ఉపయోగించబడింది. శాసనాలలో గ్రామనామాలు, మనుషుల పేరులు చాల కొద్దిగా కనబడుతున్నాయి. ఉదాహరణకు పాంబఱ్ఱు, దొంతికుఱ్ఱు, తాండివాడ, కలుచెఱువుల, పెనుంబూడి అనే గ్రామ, నామ వాచక పదములు, దోచి శర్మ,అగ్గి శర్మ,కుండి శర్మ, నన్ని శర్మ,కాటి శర్మ మొదలైన వంటి మనుషుల పేర్లు. ఆ విధంగా దొరికిన శాసనములలో మొట్టమొదట “నాగబు” అనే పదము అమరావతి స్థూప శాసనములో కనబడుతోంది.
క్రీస్తు శకం మొదటి ఐదు ఆరు శతాబ్దాలలో తెలుగు భాష ఒక పరిణామాన్ని పొందింది. ఉదా: హాలుని “గాధా సప్తశతి“ లో తెలుగు పదాలు కనిపిస్తాయి. ఏడూ, ఎనిమిది, తొమ్మిది, పది శతాబ్దాలలో భాషా వికాసానికి ఒక స్పష్ట మైన స్వరూపం కనబడుతుంది. క్రీస్తు శకం ౮౪౮ (848 )నుండి ౮౯౨(892) వరకు ఆంధ్ర దేశమును పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు గుణగా విజయాదిత్యుని కాలం నాటి శాసనాలలో మొదటి పద్యం (తరువోజ) లభించినది. తరువాత వచ్చిన యుద్దమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాకర ఛందస్సులో ఉన్న పద్యం తెలియవచ్చింది. తేటగీతి, సీసము, అటవెలది, కందం మొదలైన పద్యాలు శాసనాలలో కనబడటం వలన నన్నయ కాలం నాటికే సంస్కృత పదములతో నిండిన భాష పద్య గద్యముతో కూడిన చంపూ పద్ధతి, పురాణ రచనా రీతి సంస్కృత దేశీయ చందోవిధానం కొంత వరకు ఉండేదని పరిశీలకుల ఆభిప్రాయం. ఏది ఏమైనా భాష భారత రచనకు సరిపడాలేదని తలచిన నన్నయ గారు ప్రజల వ్యావహారిక భాషలో ఉన్న పదజాలాన్ని ఏర్చి, కూర్చి ఆ భాష గ్రంధస్థం చేయడానికి తగిన పద్ధతిని నిర్ణయించుకొని “ఆంధ్ర శబ్ద చింతామణి” అనే వ్యాకరణ గ్రంధం వ్రాసి ఆనాటి పండితుల ఆమోదం పొందాడు. చంపకమాల, ఉత్పలమాల అనే సంస్కృత వృత్తాలనే గాక తరువోజ, మధ్యాకర మున్నగు దేశి ఛందస్సులను తీసికొని కొనసాగించిన రచనా విధానం తరువాత కవులు అనుసరించారు. అప్పటికే తమిళ, కన్నడ భాషలలో ఉన్న భారతాలు నన్నయ చదివి ఉండి ఉండడంతో కన్నడ భాషలోని పంపని భారతంలో ఉన్న ప్రసన్న కవితా గుణo, లలిత పద ప్రయోగం నన్నయ తన భారతంలో ప్రవేశ పెట్టాడు. అందుకే తెలుగు భారతం అంత ప్రసిద్ధి చెందింది. అందువలనేమో “తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి” అనే సామెత వచ్చింది.
భారతం అనువదించడానికి కారకులు ముగ్గురు. రాజరాజు, నన్నయ, నారాయణభట్టు. రాజరాజు తానూ తన ప్రజలు మాట్లాడే తెలుగు భాషలో భరతం వినాలనే దృఢ సంకల్పం, నారయణ భట్టు తోడ్పాటుతో ఆస్థాన కవి నన్నయభట్టు త్రిమూర్తులను ప్రార్థిస్తూ భారతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు.
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావ హన్త్యవిహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయ స్త్రీపురుష స్సంపూజితా వ స్సురై
ర్భూయాసు: పురుషోత్తమాంమ్బుజభవ శ్రీకన్ధరా శ్రేయసే
శ్రీమతి దేవులపల్లి శేష భార్గవి