
భాగవతపుదైవము భారతములో దైవము
సాగినపురాణ వేదశాస్త్రదైవము
పోగులైన బ్రహ్మలను బొడ్డున గన్న దైవము
శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము ||
వేదాంతవేత్తలెల్ల వెదకేటి, ఆదిఅంతములు లేని రూపము, వైకుంఠాన వెలసిన పరిపూర్ణమైన రూపము, శేషగిరివాసి రూపము. బ్రహ్మాదులకు మూలమైన రూపము, పరబ్రహ్మమై మనల్ని ఏలేటి రూపము, అట్టి శ్రీ వేంకటేశ్వరుని సాకారమును ‘వెదికిన నిదియే వేదాంతార్ధము, మొదలు తుదలు హరిమూలంబు’ అంటూ, మనోఫలకంపై దర్శించి మనోరంజకంగా వర్ణించాడు అన్నమయ్య. ఆ సుందర స్వరూపాన్ని చూచి మోహించని వారుండరు.
చూచి మోహించకుందురా సురలైన నరులైన
తాచి నీవు ముందరఁ బ్రత్యక్షమైనను ||
భాగీరథి పుట్టిన పాదపద్మములు
భోగపుమరుని జన్మభూమి నీ తోడలు
యోగపునవ బ్రహ్మలుండిన నీనాభి
సాగరకన్యకలక్ష్మి సతమైనవురము ||
అందరి రక్షించేటి అభయహస్తము
కంద నసురలఁజంపే గదాహస్తము
సందడిలోకముల యాజ్ఞాచక్రహస్తము
చెంది ధ్రువు నుతియించఁజేయు శంఖహస్తము ||
సకల వేదముండే చక్కనినీమోము
వొకటై తులసిదేవివుండేటి శిరసు
ప్రకటపు మహిమలఁ బాయనినీరూపము
వెకలి శ్రీవేంకటాద్రివిభుఁడ నీభావము ||
ఆనందనిలయంలో బ్రహ్మస్థాన మనబడే దివ్యస్థలంలో స్వయంవ్యక్తమూర్తిగా వెలసిన ఆ ఆర్చారూపాన్ని, ‘‘స్థానకమూర్తి’’ అంటారు. స్థిరంగా కదలకుండా ఉన్నందున ‘ధ్రువమూర్తి’ లేక ‘ధ్రువ బేరం’ అని కూడా పిలుస్తారు. దేవేరులు లేకుండా కేవలం వ్యూహాలక్ష్మిని వక్షస్థలంలో కలిగి దర్శనమివ్వడం వల్ల ‘స్థానక విరహమూర్తి’ అని కూడా పిలవపడతాడు. వ్యూహాలక్ష్మిని వక్షఃస్థలంలో నిలుపుకొని, కుడి,ఎడమ చేతుల్లో శంఖచక్రాలనుంచుకొని, మరో ఎడమచేతిని కటిపై ఉంచి, వరదహస్తంతో వరాలనొసిగే ఆ ఏడుకొండలవాడు విచిత్రభంగిమతో భక్తులను భవసాగరం దాటిస్తానని అభయమిస్తుంటాడు.
భవాభ్దితారం కటివర్తిహస్తం
స్వర్ణాంబరం రత్నకిరీటకుండలమ్
ఆలంబిసూత్రోత్తమ మాల్యభూషితం
నమామ్యహం వేంకటశైల నాయకమ్ ||
శ్రీమన్నారాయణునికి ఐదు రూపాలున్నాయని శాస్ర్తాలు చెపుతున్నాయి. ముక్తపురుషులచే ఆరాధించపడే ‘పరస్వరూపం’, సృష్టి, స్థితిలయలను నిర్వహించే ‘వ్యూహా స్వరూపం’, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్ధం ‘విభవ స్వరూపం’, యోగులు ధ్యానించే చైతన్య రూపం‘ అంతర్యామి స్వరూపం’, ఆలయ గృహాదులందు పూజలందుకునే ‘అర్చాస్వరూపం’. సాలగ్రామ శిలారూపంతో వెలసిన శ్రీవారి మూలవిరాట్టు స్వయంభువు. చతుర్భుజాలతో అర్చారూపాన్ని పొందిన ఈ స్వరూపం శ్రీనివాసుని ధ్రువబేరం. ఇందుకు తార్కాణం, ‘వనమాలి గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీచ నందకీ, శ్రీమన్నారయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు’ అనే విష్ణుసహస్రనామ వర్ణనే!
బంగారు పద్మపీఠంపై, గజ్జెలు, అందెలు ఘల్లు, ఘల్లుమన బంగారు పాదాలతో, ఘనపట్టు పీతాంబరాలపై జిలుగుమంటూ వేలాడుతున్న సహస్రనామాల మాలతో, నడుమున వజ్రాలుతాపిన సూర్యకఠారి అనబడే నందకఖడ్గం, ఒడ్డాణాలతో, వజ్రఖచిత వరద, కటి హస్తాలతో, ఉరముపై కౌస్తుభమణితో, నవరత్నహారాల నుడుమ వక్షఃస్థలంలో పొదువుకున్న సిరితో, పసిడి యజ్ఞోపవీతంతో, నాగాభరణాలు, భుజకీర్తులు, సాలగ్రామ మాలలు, వజ్రకిరీటం, మకర తోరణంతో వెలుగొందుతన్న ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ‘సందడి సొమ్ములతోడి సాకరమిదె వీఁడె, యిందరు వర్ణించరే యీరూప’మంటూ, ఆపాదమస్తకం వర్ణించటం ఒక్క అన్నమయ్యకే సాధ్యం!
చేరి కొల్వరో యాతఁడు శ్రీ దేవుఁడు
యీరీతి శ్రేవేంకటాద్రి నిరవైన దేవుఁడు ||
అలమేలుమంగ నురమందిడుకొన్నదేవుడు
చెలఁగి శంఖచక్రాలచేతి దేవుఁడు
కలవరదహస్తముఁ గటిహస్తపుదేవుఁడు
మలసీ శ్రీవత్సవనమాలికలదేవుఁడు ||
ఘనమకరకుండలకర్ణముల దేవుఁడు
కనకపీతాంబర శృంగారదేవుఁడు
ననిచి బ్రహ్మాదుల నాభిఁగన్నదేవుఁడు
జనించెఁ బాదాల గంగ సంగతైనదేవుఁడు ||
కోటిమన్మథాకారాసంకులమైన దేవుఁడు
జాటపుఁగిరీటపుమించులదేవుఁడు
వాటపుసొమ్ములతోడి వసుధాపతి దేవుఁడు
యీటులేని శ్రీవేంకటేశుఁడైన దేవుఁడు ||
‘చూడ జూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి….కంటి గంటి ఘనమైన ముత్యాలు, కంటమాల లవె… పొడువైనట్టి మించు కిరీటం, జంటల వెలుగు శంఖచక్రా లవె…’ భుజకీర్తులును, మొలకఠారును, ముంగిటి నిధానమైన మూలభూతమదె, వేంకటాచలము మీద విశ్వరూపము, కందర్పు పుట్టించిన ఘన విశేషము, యోగీంద్రులెల్ల భావించిన వేదవేదాంతార్ధ విశేషము, అలమేలుమంగపతియైన దేవదేవుడితడే దివ్యమూరితి, ఎచ్చటజూచిన తానే యీరుపై ఉన్నాడంటూ, ఇహపరములన్నీ ఆ శ్రీనివాసుడేనని,
నీయందె బ్రహ్మ మరి నీయందే రుద్రుఁడు
నీయందే సచరాచరమును నీయందే యీజగము
చాయలనే యెడనెడ నే నేమిచూచినా సర్వము నీధ్యానమేకాక
యీయెడ నీయర్ధములో నితరంబిది యౌఁగాదన నెడమేదయ్య ||
అంటూ ఆ చిత్తజ గురుని, ఆ కొండల కోనలలోన కోనేటిరాయుని, నవ్వులమోముతో, సంకుజక్రముల సొంపుతో, బంగారుమేడలో వెలుగొందుతున్న ఆ శ్రీపతి, భూపతి రూపాన్ని మనోఫలకంపై ముద్రించాడు అన్నమయ్య.
వాడివో కంటిరటిరే వన్నెలవాడు
పైడి మోలముకటారుపరుజులవాడు ||
పెద్దకిరీటమువాడు పీతాంబరమువాడు
వొద్దిక కౌస్తుభమణిపురమువాడు
ముద్దులమొగమువాడు ముత్తేలనామమువాడు
అద్దిగో శంఖచక్రాల హస్తాలవాడు ||
అందిన కటిహస్తము నభయహస్తమువాడు
అందెల గజ్జల పాదాలమరువాడు
కుందణంపు యీ(?) మకరకుండలంబులవాడు
కందువ బాహుపురుల కడియాలవాడు ||
నగవుజూపులవాడు నాభికమలమువాడు
మొగవుల మొలనూళ్ళా మొలవాడు
చిగురుమోము (వి?)వాడు శ్రీవేంకటేశుడు (వాడు)
తగు నలమేలుమంగ తాళిమెడవాడు ||
సౌమ్యశ్రీ రాళ్లభండి