‘భాష’ అంటే భావాన్ని వ్యక్తం చేసేది. అలాంటి అమ్మభాషతో మనిషి బంధం ఉమ్మ నీటిలో ఉన్ననాటిది. అది మన పుట్టకతో మొదలవుతుంది. మనం గిట్టినా అనంత విశ్వంలో విహరిస్తూనే ఉంటుంది.
‘జో అత్యుతానంద, జోజో ముకుందా’ అని లాలిపాట పాడినా, ‘చందమామరావే, జాబిల్లిరావే’ అని పసిపాపలకు బువ్వ తినిపించినా, ‘వీరి, వీరి గుమ్మడిపండు వీరిపేరేమి’ అంటూ ఆటలు ఆడినా, ‘తారంగం, తారంగం తాండవ కృష్ణా తారంగం’ అని ఆ మువ్వగోపాలుని ముద్దుగా పిలిచినా ప్రతి కదలికలోనూ లాలిత్యాన్ని, సొగసుని, అమ్మతనాన్ని పొదవుకుని ఆహ్లాదాన్ని కలిగించే సుమధుర భాష మన తెలుగు భాష.
ఊట బావిలో నీరులాగా, స్వచ్ఛంగా, తియ్యగా, శ్రావ్యంగా తెలుగు భాష ఉండటానికి ముఖ్యకారణం, తెలుగు పదాలు అజంతాలు కావటమే. అంటే ప్రతి పదం అచ్చులతో అంతం అవుతుంది. అందుకే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వర్ణించారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్సా‘ అని నాటి కృష్ణదేవరాయలంటే, ‘సుందర తెలుగని’ మన పొరుగువాడైన తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి నేడు కొనియాడాడు. ‘ఏ భాష చెణుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగని,’ గర్వంగా పలికాడు మన సినారె.
అతి ప్రాచీనమైన మన తెలుగు భాషలో ప్రతి చిన్న శబ్ధానికి అక్షరం ఉందంటే దాని విశిష్టతను మనం గ్రహించవచ్చు. అంతెందుకు, తెలుగు భాషలో మాట్లాడితే, శరీరంలోని సుమారు 72000 నరాలు ఉత్తేజితమవుతాయని శాస్త్రీయంగా నిరూపమైన సత్యం. తెలుగ భాష గొప్పతనాన్ని,
సంధి సమాసముల్ సరిమువ్వగజ్జెలు
ధీయలంకారముల్ దివ్యనిధులు
రసములుపాకముల్ రమ్యమౌరీతులు
శయ్యలువ్యుత్పత్తి సాధనములు
ప్రకృతివికృతులును పర్యాయపదములు
సామెతల్ నానార్థసంగతులును
పద్యమ్ము గద్యమ్ము వచనమ్ము వ్యాసమ్ము
గీతమ్ము సర్వ సంగీతమయము
సరళమ్ము ప్రౌఢమ్ము సార్వజనీనమ్ము
శ్రవణసౌలభ్యమ్ము జాణతనము
బాలవాఙ్మయరూపమ్ము పరిఢవిల్ల
కథలు నవలలు నాటికల్ కాంతినింప
కలికితనమెల్ల నిండిన కావ్యభాష
దివ్య కావ్య సమున్మేష తెలుగు భాష.
అని శేషం సుప్రసన్నాచార్యులు గారు కొనియాడారు. అట్టి తెలుగు భాష తన మాతృభాష కావడం తన పూర్వ జన్మ సుకృతమని, మళ్లీ జన్మ అంటూ ఉంటే, మధురమైన తెలుగు తన మాతృభాష కావాలంటూ,
పాటకును పద్యమునకు నబ్రముగ నొదిగి
చవికి చాతుర్యమునకు సాజముగ సాగి
పోరునకు పొత్తునకు చాలి పొందిపొసగు
మా తెనుగుతల్లి మెడ కిదే మల్లెదండ
– అని రాయప్రోలు సుబ్బారావుగారు తెలుగు తల్లిని మల్లెదండతో అలంకరించగా, ‘నా కన్నతల్లికి మంగళారతులు’ అంటూ తన వంతుగా నీరాజనాలు అర్పించారు శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు. విభిన్న మాండలికాలు, నుడికారాలు, సామెతలు, పొడుపుకథలు, జాతీయాలు, పరిభాషలు, సూక్తులతో పరిపూర్ణమైనది మన తెలుగుభాష.
శతాబ్ధాల చరిత గల తెలుగు భాష గురించి కట్టె, కొట్టె, తెచ్చె అనే రీతిలో చెప్పడం సాధ్యంకాదు. సూర్యుడి తేజాన్ని చేతితో ఎలాగైతే ఆపాలేమో, సముద్రాన్ని ఎలాగైతే గుప్పిట పట్టాలేమో తీపిరుచుల తెలుగు భాషా ప్రాభవాన్ని కూడా కొద్ది మాటలలో కొద్ది సేపట్లో చెప్పలేము. అందుకే గుమ్మా సాంబశివరావుగారి మాటలను అరువు తెచ్చుకుంటూ, వారి తెలుగు బాల శతకంలోని పద్యాలలో తెలుగు వైభావాన్ని గుర్తుకు చేసుకుందాం. తెలుగు మన మాతృభాష అయినందుకు గర్విద్దాం.
అచ్చులంత మందు నలరు చుండెడి భాష
తెలుగు భాష కాదె తెలిసి కొనగ
గానయోగ్యమైన గాంధర్వ మే తెల్గు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
అన్యభాష నేర్చుట వసరమ్ముగాని
మాతృభాష నెపుడు మరువరాదు
తల్లి బాస మూల ధనమనుట నిజము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
మాతృభాష నేడు మాకు రాదని పల్కు
జనులు పెరుగు చుండె జగతిలోన
అమ్మబాస మరువ అధ మాధముండగు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల
సౌమ్యశ్రీ రాళ్లభండి