తెలుగు భాషకు గర్వంతో చెప్పుకోగల స్థాయిలో సాహిత్యముంది. ఆ తెలుగు సాహిత్య చరిత్రలో వేమన్న ఒక ధృవతార.తన కాలం నాటి మనుషుల కన్నా ముందు చూపు ప్రదర్శించగలిగిన వాళ్లే కవులు.దానినే ‘రవి గాంచనిచో కవి గాంచు’ నని సిద్ధాంతీకరించారు కవులు.తన సమకాలీన కవులకంటే కూడా ముందుచూపు కలిగిన వాడు వేమన. వేమన కవులకే కవి. వేమన ప్రదర్శించిన ముందు చూపుకు గల కారణాలేమిటి?
కవులకు తమ కవిత్వానికి ఎన్నుకునే వస్తువు వారి ప్రాపంచిక దృక్పథాన్ని,పరిధినీ నిర్ధారిస్తుంది.వస్తు ఎంపికలోనే కవులు ఎటువైపు నిలుచున్నారనేది స్పష్టమవుతుంది.వేమన తన కవిత్వానికి వస్తువును ప్రజల జీవితాలలోనుంచి తీసుకున్నాడు.ప్రజల జీవితాలలోనుంచి వస్తువును సంగ్రహించి అదే ప్రజలను చైతన్యం చేయటానికి కవిత్వాన్ని ఆయుధంగా వాడుకున్నాడు.ఆయన తన కాలంలోని కవులకు భిన్నంగా ఆలోచించాడు.కవిత్వానికి ప్రజలతో సంబంధాన్ని మొదటిసారిగా స్థాపించినవాడు వేమన.ఆయనరాసిన కవిత్వంలో అప్పటి ప్రజల జీవితం అనేక కోణాల్లో వ్యక్తమైంది.ఆనాటి సాంఘిక జీవితంలోని నైతికత ఎలా ఉండేదో ఆయన పద్యాలు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.
వేమన పదిహేడవ శతాబ్దిలో జీవించాడని పరిశోధకులు నిర్ణయించారు. ఆ కాలంలో కులమత వైరుధ్యాలు, మూఢ విశ్వాసాలు, అనాగరిక ఆచారాలు రాజ్యమేలుతుండేవి. ప్రజలు అవిద్య కారణంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ వాటిని పరిష్కరించుకునే మానసిక పరిపక్వత లేని పరిస్థితులు ఉండేవి.వాటిమీద తనదైన తాత్వికతో ఆలోచనలు చేసాడు వేమన..ఆ సమయంలో ప్రజలకు అచల సిద్ధాంతాల నేపథ్యంలో గురువులు హితబోధలు చేస్తుండేవారు. ఒకరకంగా అట్లాంటి పరంపరలోని వాడే వేమన్న.ఆయన తత్వం ఆ అచల సిద్ధాంతానికి సంబంధించినదే. వేమన తత్వ జ్ఞానములో అచలంతోపాటు రాజయోగము, శివయోగము కూడా ఉన్నాయి..ఈ తత్వంలో కులమత బేధాలు లేవు. జాతి బేధాలు లేవు.మనుషుల మధ్య ఎక్కువ తక్కువలు లేవు.అది అన్ని రకాల అసమానతలను నిర్ద్వంద్వంగా ఖండిస్తుంది.
తల్లినెరుగు వాడు దైవంబునెరుగును
మిన్నునెరుగు వాడు మన్నునెరుగు
మన్ను మిన్నెరిగిన తన్ను తానెరుగురా! అన్నది వేమన తత్వం.అర్థం కాని పెద్ద పెద్ద తాత్విక విషయాలను కూడా సాధారణ జనాలకు అర్థమయ్యేలా చెప్పటం ఆయన ప్రత్యేకత.
వేమన చెప్పిన లోకరీతులు తెలుగువారిని ఈనాటికీ నడిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. తనకన్నా ముందు సుమతీ శతకల్లాంటివి ఉన్నా వాటికంటే ఎన్నోరెట్ల గుర్తింపును,గౌరవాన్ని మూట గట్టుకున్నది వేమన శతకం. వేమన శతకంలోని ఒక్క పద్యమైనా కంఠత పట్టని తెలుగువారుండరు. వేమన శతకపద్యాలు ప్రజల జీవితాలతో పెనవేసుకొని ఉంటాయి. ఎందుకంటే మిగిలిన శతక కవులకంటే భిన్నంగా సామాజిక సంస్కరణను ఆశించినవాడు వేమన్న. తాను మిగిలిన కవుల వలె తనకు తోచిన నీతివాక్యాలు చెప్పి చేతులు దులుపుకోలేదు. ఆనాటి సాంఘిక అసమానతలకు గల కారణాలను కూడా పేర్కొన్నాడు. దానిని ఎట్లా అధిగమించవచ్చో స్పష్టంగా చెప్పాడు. అందుకే వేమన మిగిలిన కవుల కంటే భిన్నంగా కనిపిస్తాడు.
వేమన పద్యాన్ని సాహిత్యం కోణంలో కాకుండా ప్రజాప్రయోజనం కోణంలో చూశాడు. తాను ఒకగురువుగా దేశాటనం చేస్తూ ఆయా ప్రాంతాల సమస్యలను ప్రతిఫలిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తూ కవిత్వం చెప్పాడు. సామాన్య ప్రజలకు సైతం అర్థం కావాలనే ఉద్దేశ్యంతోనే తన కవిత్వానికి ప్రధాన వాహికగా ఆటవెలది ఛందాన్ని ఎంచుకున్నాడు. తాను చెప్పదలుచుకున్న విషయానికి అద్భుతమైన పోలికలు తెచ్చి చెప్పే విషయాన్ని బలోపేతం చేయటమనే శిల్పంతో వేమన పద్యాలు నడుస్తాయి. వేమనకు ముందు ఈ తరహా శిల్ప చాతుర్యాన్ని పాటించిన తెలుగు కవులు లేరు. ఈ విషయంలో వేమన తరువాత వచ్చిన తెలుగు కవులకు గురువులాంటివాడు.సాహిత్యం ద్వారా సామాజిక ప్రయోజనాన్ని ఆశించిన తదనంతర కవులకు మార్గదర్శకుడు కాబట్టే చాలా మంది తెలుగు కవులు ఆయనను తమ రచనల్లో భాగంగా స్మరించుకున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి లాంటివారి మీద కూడా వేమన ప్రభావం ఉంది. అందుకే తన కాళికాంబా సప్తశతి లో(84 వ పద్యం).
చిక్కు విప్పి కటిక చీకటి పోగొట్టి
టక్కుపిక్కు తెలిపి నిక్కమైన
వెలుగు చూపు యోగి వేమన్న మాయన్న -అని వేమన మీద తన గౌరవాన్ని ప్రకటించాడు.సామాజిక సంస్కరణే ధ్యేయంగా జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేసి సాహిత్యాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన ప్రజాకవి వేమన.
తోకల రాజేశం