నా అభిమాన పాత్ర రావణాసురుడు

నా అభిమాన పాత్ర రావణాసురుడు
నా అభిమాన పాత్ర రావణాసురుడు

సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా రాసిన వ్యాసం

“నేను పుష్కరంగా నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండితెరమీద నేను ఇలా నిలిచి ఉండడానికి, మీ అభిమానం సంపాదించగలగడానికి కారణం నేను ధరించిన పాత్రలేనని నా విశ్వాసం.

అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకొనడటం కన్నా ఏ నటుడూ ఆశించేది మరొకటి లేదు. నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా అభిమానం. కాలేజి రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు కూడ అంతే. ఆడ వేషం వేయమంటే ఎక్కడలేని పౌరషమూ వచ్చేది. వేడి, వాడిగల పాత్రలు నాకు చాలా ఇష్టం. బెజవాడ కాలేజీలో మా మాస్టారు కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారు నా చేత ఆడవేషం వేయించాలని పట్టుపట్టడం.. అదో గమ్మత్తు కథ. రాచమల్లుని యుద్ధశాసనంలో నాగమ్మ పాత్ర నాకు ఇచ్చారు. పౌరుషానికి కావాలంటే మీసం తీయకుండా ఆ పాత్ర ధరిస్తానని నేను భీష్మించాను.

అలా భీష్మించుకునే అలవాటు అప్పటికి, ఇప్పటికీ నాలో ఉంది. భీష్మునివంటి గంభీర పాత్రలన్నా, వీరగాంభీర్యాలు, ఔదార్యం ఉట్టిపడే పాత్రలన్నా నాటికీ నేటికీ నాకు మక్కువ.

తొలిసారి ‘భూకైలాస్‌’ చిత్రంలో రావణ పాత్ర ధరించినప్పటి నుండీ నాకు అదో విశిష్ట పాత్రగా గోచరించింది.

‘రావణ’ అనగానే స్ఫురించేది వికృతమైన ఏదో భయంకర స్వరూపం, స్వభావం. సామాన్య దృష్టికి ‘రావణుడు’ ఉగ్రకోపి, క్రూరుడు అయిన రాక్షసుడుగా కనిపిస్తాడు. కానీ రామాయణం తరచి చూసినా, పూర్తిగా అర్థం చేసుకున్నా మనకు తోచే, కనిపించే ఆకృతి వేరు! శ్రీ మహావిష్ణువే అతని అంతానికి అవతారమెత్తవలసి వచ్చిందంటే ఆ పాత్రలో ఎంతో అసామాన్యమైన ఔన్నత్యం ఉండి ఉండాలి. దానికి తోడు అతని వంశం సాక్షాత్తూ బ్రహ్మవంశం. పులస్త్య బ్రహ్మ పౌత్రుడు. విశ్వవసువు పుత్రుడు. పుట్టుకచేత ఈతడు పుణ్యాత్ముడు. అంతే అని కొట్టివేయడం సాధ్యం కాదు. సద్బ్రాహ్మణవంశ సంజాతుడైన దశకంధరుడు పునీతమైన జీవితం గడిపినవాడు.

సూర్యోదయాత్పూర్వమే నవకోటి శివలింగాలను స్వకల్ప మంత్రోచ్ఛారణతో పూజించే శివపూజా దురంధురుడు రావణుడు. తలచినదే తడవుగా కైలాసవాసిని ప్రత్యక్షం చేసుకొనగల్గిన మహా తపస్వి. ఇందుకు తగిన పురాణ కావ్య నిదర్శనాలు, జనశ్రుతులు ఎన్నో ఉన్నాయి.

దశకంఠ రావణ చిరచితమైన ‘మహాన్యాసం’ వల్లించనిదే మహాదేవుని ఆర్చన పూర్తికాదు. అతడెంత సంస్కృతీ పరిజ్ఞానం కలవాడో చూడండి. అతడి పాండితిలో పారలౌకిక శిఖరాలు మహోన్నతమైనవి. ఆధ్యాత్మిక చింతన, తనకు అతీతమైన దైవత్వం పట్ల భక్తి విశ్వాసాలు అతనిలో ఉన్నాయి. రసజ్ఞుడుగా, కళాప్రపూర్ణుడుగా రావణుడు అద్వితీయుడు. త్రిలోకాలలోనే సాటిలేని వైణికుడు. సామవేదకర్త. తనపై అలిగిన శంకరుని ప్రీతికి పొట్టచీల్చి ప్రేగులతో రుద్రవీణ కట్టి జీవనాదంతో పార్వతీపతిని తన ముందుకు రప్పించుకొనగల్గిన సంగీత కళాతపస్వి.

ఇక శాస్త్రజ్ఞుడుగా మాత్రం రావణుడు సామాన్యుడా? ఈనాడు మన శాస్త్రజ్ఞులు చేరాలని కలలుకనే నభో మండలాన్ని ఏనాడో చూచిన శాస్త్ర పరిజ్ఞాని. వాతావరణాన్నీ, ఋతుక్రమాన్నీ హస్తగతం చేసుకుని తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్న స్థితప్రజ్ఞుడు. అనేక మారణాయుధాలను, మంత్ర తంత్రాలను, క్రియాకల్ప విద్యలను ఆకళించుకున్న శాస్త్రవేత్త. పుష్పక విమానంలో వాయుగమనం చేశాడని, దివిజ లోకాల మీద దండెత్తి అష్ట దిక్పాలకులను తన పాదాక్రాంతులుగా చేసుకున్నాడని వర్ణించారు. మేఘనాథుని జనన కాలంలో వక్రించిన శనిపై కినిసి గదాఘాతంగతో కుంటివానిని చేయడమే అతని జ్యోతిషశాస్త్ర ప్రజ్ఞకు నిదర్శనం. ఆవేశంలో ముక్కోటి ఆంధ్రులను తలపించే ఈ రావణబ్రహ్మ ఐరావతాన్నే ఢీకొనడం, అలిగినవేళ కైలాసాన్నే కంఠంపై మోయడం అతని భుజబల దర్పానికి గుర్తులు. రావణుడు కారణజన్ముడైన మహనీయుడు. పట్టినపట్టు విడువని కార్యసాధకుడు. అభిమానాన్ని ఆరాధించే ఆత్మాభిమాని. ఏ పరిస్థితులకు తలఒగ్గని ధీరుడు. అతన్ని ఈ రూపేణా తలచుకొనడం పుణ్య సంస్మరణమే!

ఈ రామాయణస్థమైన నిదర్శనాల వల్ల మనకు కనిపించే వ్యక్తి యెవరు? ఆ కనిపించే రావణుడు ఎటువంటి వాడు? బ్రహ్మ తేజస్సుతో నిర్వక్ర పరాక్రమ బలదర్పతుడై, మహాపండిత ప్రకాండడై, శివపూజా దురంధరుడై, శాస్త్రవేత్త అయిన మహా తపస్వి. కానీ .. ఇంతటి మహోదాత్తుడు రాక్షసుడుగా, శకుడుగా పరిగణింపబడటానికి గల కారణమేమిటి?

అతని వైష్ణవ ద్వేషం ముఖ్యంగా ఒక కారణం. తాను శైవుడు కావడంలో తప్పు లేదు. ఇష్ట దైవాన్ని నమ్మి కొలవడంలో అపకారమూ లేదు. కాని తన మతాన్ని ఇతరుల మీద రుద్ది పరమత ద్వేషంతో వైష్ణవ పూజలాటంకపరచి విష్ణుద్వేషిగా హింసాకాండకు ఉపక్రమించడమే అతడంటే మనం భయభ్రాంతుల మయ్యేటట్లు చేసినది. పరనారీ వ్యామోహమే నలకూబరుని శాపానికి దారితీసింది. అతని పతనానికి కారణమైనది. ఈ రెండూ అతనిపై దెబ్బ తీసినట్లు మరేవీ తీయలేదు. అహంభావంలో కూడా అతనికతనే సాటి. తనలో తనకు ఎంత నమ్మకమున్నా ఇతరులంటే నిర్లక్ష్యం, చులకన చేయడం, నందీశ్వరుని శాపానికి దారితీసింది. అతని వంశమంతా వానరబలంతో హతమైనది.

లక్ష్మీ అవతారమూర్తి అయిన మాతులుంగిని చెరపట్టబోయినప్పుడు పరాజయం పొందడం, వేదవతిగా ఉన్న ఆమెను తాను దక్కించుకొన లేకపోవడం, సీతగా జన్మించిన ఆమెను స్వయంవరంలో సాధించబూని పరాధూతుడు కావడం కడకు సీతను లంకలో చెరపెట్టేవరకు అతడు మూర్ఖించడం- ఇవన్నీ పై మహత్తరగుణాలతో జోడించి చూస్తే రావణుడు ఎలాంటివాడుగా మనకు కనిపిస్తాడు? నాకు అతడు దుర్మార్గుడుగా కనిపించడు. పట్టుదలగలవాడుగా కనిపిస్తాడు. అతనిలో లేని రసం లేదు. కావలసినంత సరసం, ఉండరానంత విరసం ఉన్నాయి. జీవన్నటులలో మేటి. అటువంటిపాత్ర అపురూపమైనదని నా నమ్మకం. అలాంటి పాత్ర ధరించాలని నా అభిలాష. అదే నన్ను ఈ పాత్రధారణకు ప్రోత్సహించింది.

రావణుడు వికృతాకారుడు కాదు. పెద్దపొట్టతో, బుర్రమీసాలతో, అనవసర ఘీంకారాలతో వికట ప్రవృత్తిగలిగిన మదోన్మత్తుడు, అలక్షణుడు కాదు. మనవాతీతుడైన ఒక మహత్తర వ్యక్తి, శక్తి. కుండెడు పాలలోనయినా ఒక విషం బొట్టు పడితే పాలన్నీ విషం అయినట్లు ఇన్ని సద్గుణాలు కలిగినా, సద్బ్రాహ్మణ వంశ సంజాతుడయిన రావణునిలో ఒక్క దుర్గుణమే అతని నాశనానికి దారి తీసింది. రావణపాత్ర సర్వావేశ సంకలితం. ఆనందం, అవేశం; అనుగ్రహం, ఆగ్రహం ; సహనం, అసూయ; భక్తి, ధిక్కారం- ఇన్ని ఆవేశాలు కావేషాలు రావణుని తీర్చి దిద్దాయి. ఈ పాత్ర సజీవం కావడం వల్లనే నన్నింతగా ఆకర్షించింది.

ఈ మహాపాత్ర ధరించగలిగినందుకు ధన్యుడననుకుంటాను. రావణుని పరస్పర విరుద్ధ ప్రవృత్తులన్నీ వ్యక్తీకరించడానికి ప్రయత్నించాను. ఎంతవరకు సఫలుడనైందీ అభిమానులు, పాఠకులు నాకు తెలియజేస్తే సంతోషిస్తాను.

పౌరాణిక గాథలలో కనిపించే అద్భుతమైన సజీవపాత్రలలో రావణపాత్ర ముఖ్యమైనది. అది నా అభిమానపాత్ర.

(ఆంధ్ర సచిత్ర వార పత్రిక, జనవరి 18, 1961లో ప్రచురితమైంది.)