విదుర నీతి 2
అది సభయే ప్రియంబెసఁగ నార్యులు నిల్వరయేని నార్యులే
మదిఁదలపంగ వారలు సమంచిత ధర్మలు వల్కరేని, న
ట్టిదియును ధర్మువే తగ ఘటించి నిక్కము లేద యేనిఁ దా
బదిలపు నిక్కమే యొక నెపం బిడు చొప్పగునేని భూవరా.
భావం: పూజ్యులైన పెద్దలు ఏ సభలో ఉండరో, అది సభ యగునా? ఆలోచించగా ఆ సభలో నున్న పెద్దలు సముచితమైన ధర్మం చెప్పని పక్షంలో వారు ఆర్యులు కాగలరా? వారు చెప్పిన ధర్మం సత్యం కానిదైతే అది నిజంగా ధర్మమవుతుందా? ఆ సత్యవచనం కూడా యదార్థాన్ని నిరూపించేది కానిచో అది సత్యం కాగలదా? వంటి ప్రశ్నలకు విదురుడందించిన వివరణే ఈ పద్యం. ఆర్యులున్నదే సభ. ధర్మం చెప్పెవారే ఆర్యులు. సత్యంతో కూడినదే ధర్మం. నెపంలేని మాటే సత్యం. పెద్దలు లేని సభ సభకాదు, ధర్మం చెప్పని వారు ఆర్యులు కారు. సత్యదూరమైన ధర్మం, ధర్మం కాజాలదు. ఏదో నెపంతో చెప్పే సత్యం, సత్యం కాజాలదని విదుర నీతి.