సాంస్కృతిక ప్రదర్శనలతో “51వ ఇఫీ“ ప్రారంభం

సాంస్కృతిక ప్రదర్శనలతో “51వ ఇఫీ“ ప్రారంభం
సాంస్కృతిక ప్రదర్శనలతో “51వ ఇఫీ“ ప్రారంభం

గోవా: ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సినిమా పర్వదినమైన 51వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) శనివారం మొదలైంది. గోవాలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో అలంకరించిన వేదికపై చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో ఇఫీ  ఎంతో కోలాహలంగా ప్రారంభమైంది.  ఆసియాలో అతి ప్రాచీనమైనది, భారతదేశంలోనే అతి పెద్దది అయిన ఈ సినిమా పండుగ ప్రారంభోత్సవానికి ప్రపంచం నలుమూలలనుంచి పలువురు సినీతారలు, చిత్ర నిర్మాతలు, సినీ అభిమానులు హాజరయ్యారు. వారి హర్షధ్వానాల ప్రతిధ్వనులతో ప్రారంభోత్సవం మారుమోగింది.

ప్రముఖ నటుడు, సినీ రచయిత, నిర్మాత అయిన టిస్కా చోప్రా ఈ ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చారు. సినీ ప్రముఖుడు ప్రియదర్శన్ నాయర్, ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు సుదీప్, ఇతర సినీ ప్రముఖులు ప్రారంభోత్సవ సంబరానికి మరింత వన్నె తెచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

కిచ్చా సుదీప్.గా పేరుగాంచిన సినీ నటుడు సుదీప్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ,.. సినిమా కళ భారీ స్థాయిలో వ్యాప్తి చెందవలసిన అవసరం ఉందని, సినీ కుటుంబం మాత్రమే మనల్ని ఒకేచోటనుంచి మొత్తం ప్రపంచాన్ని చుట్టేసేలా చేస్తుందని, ప్రతి కుటుంబ సంస్కృతికీ సన్నిహితంగా తీసుకెళ్తుందని, ప్రపంచంలోని ప్రతి సంస్కృతినీ మనకు పరిచయం చేస్తుందని అన్నారు.

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఇఫీకోసం 600దాకా అంతర్జాతీయ ఎంట్రీలు, 190 భారతీయ ఎంట్రీలు అందాయంటే, ప్రపంచ దేశాలు ఈ ఉత్సవానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాయో అవగతమవుతుందని అన్నారు. వంగ బంధు షేక్ ముజిబూర్ రహ్మాన్ శత జయంతిని పురస్కరించుకుని భారత, బంగ్లాదేశ్ లు వంగబంధు పేరుతో ఒక చలనచిత్రాన్ని రూపొందిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడుఅయిన బిశ్వజిత్ చటర్జీని ఈ సంవత్సరపు భారతీయ విలక్షణ వ్యక్తి అన్న పురస్కారానికి ఎంపిక చేసినట్టు మంత్రి ప్రకటించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే, సినిమాల చిత్రీకరణకు తగిన స్థలాలు భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. అందువల్ల ‘భారతదేశంలోనే చిత్రీకరణ’ను ఎక్కువగా ప్రోత్సహించాల్సి ఉందన్నారు.

సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదని, వాణిజ్యానికి అవకాశం ఉన్న ఒక భారీ మార్కెట్ జవదేకర్ అన్నారు. “మానవుడు ఊహాశక్తి కలిగిన జీవి. ఊహాశక్తి, కల్పనా శక్తితో రూపొందిన సినిమాలు, మనలను నవ్విస్తాయి. ఏడిపిస్తాయి. కథలో లీనమయ్యేలా చేస్తాయి. కథనం చక్కగా ఉంటే సినిమా కూడా జనాదరణ పొందుతుంది.” అని జవదేకర్ వ్యాఖ్యానించారు. చలన చిత్రోత్సవంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని 52వ చలనచిత్రోత్సవం నుంచి ప్రారంభిస్తామని అన్నారు. 51వ చలనచిత్రోత్సవం ఏడు సినీ తెరలపై నడుస్తుందని,. లక్షలాది మొబైల్స్, టెలివిజన్ల తెరలపై కూడా సాగుతుందని, ప్రపంచ మొత్తానికి ఈ ఉత్సవం చేరువ అవుతుందని మంత్రి అన్నారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ,..సినిమాల చిత్రీకరణకు బాగా అనువైన  స్థలంగా గోవాకే ప్రాధాన్యం ఇవ్వాలని, భారతీయ, ప్రపంచ సినీ ప్రముఖులకు విజ్ఞప్తి చేశారు. “దేశం పశ్ఛిమ తీరానికే తలమానికమైన గోవాను గురించి తెలుసుకునేందుకు ప్రపంచంలోని సినీ ప్రముఖులందరికీ ఇఫీ ఉత్సవం అవకాశం ఇస్తుంది.” అని అన్నారు.

బంగ్లాదేశ్.లో భారతీయ హైకమిషనర్ మొహ్మద్ ఇమ్రాన్ కూడా ఇఫీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సారి ఇఫీ ఉత్సవంలో బంగ్లాదేశ్.పై దృష్టిని కేంద్రీకరించారు. బంగ్లాదేశ్ సినీ ప్రముఖుల సృజనాత్మకతను, ప్రతిభా నైపుణ్యాలను గుర్తించడానికి ఈ ఉత్సవం దోహదపడుతుందని. ఉభయదేశాల మధ్య సంబంధాలకు, చారిత్రాత్మక బంధానికి ఇది సాక్ష్యంగా నిలుస్తుందని హై కమిషనర్ అన్నారు.  ఎన్నో సవాళ్లు ఎదురైన ఈ తరుణంలో చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్న సమాచార ప్రసార భారత మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి తాము కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనడంలో భారత ప్రభుత్వ ధైర్య సాహసాలను, కళలపై, సంస్కృతిపై భారతదేశానికి ఉన్న శ్రద్ధాసక్తులను ఇది సూచిస్తోందన్నారు. బంగ్లాదేశ్ కు చెందిన పది ఉత్తమ చిత్రాలను ఈ సారి చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు. బంగ్లాదేశ్ చలనచిత్ర ప్రతిభను, ప్రపంచ సినీ రంగానికి అందించిన సేవలను ఈ సినిమాలు ప్రతిబింబిస్తాయన్నారు.

51వ ఇఫీకి సంబంధించిన జీవన సాఫల్య పురస్కారానికి ఇటలీకి చెందిన సినిమాటోగ్రాఫర్ విట్టోరియో స్టొరారోను ఎంపిక చేశారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు స్టొరారో ఒక వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. “నీవేమి చేస్తున్నావో దాన్నే ప్రేమించు. దేన్నయినా ప్రేమించి, విశ్వసించినపుడే సదరు లక్ష్యం సాధించగలుగుతావు“ ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. తన సహచరులు, ప్రముఖ దర్శకులు అయిన బెర్నార్డో బెర్తోలూక్కీ, ఫ్రాన్సిస్ కొప్పోలా, కార్లోస్ ఒలీవీరా, వుడీ అలెన్ సాహచర్యంవల్లనే తనకు ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. భారతదేశం ఒక అద్భుతమైన విశ్వంవంటిదని, ప్రతి రోజూ స్వప్నించేందుకు అవకాశం ఇస్తుందని, భారతదేశంలో ఏదైనా సాధ్యమేనని అంతర్జాతీయ న్యాయ నిర్ణేతల సంఘం అధ్యక్షుడు, అర్జెంటీనా సినీ దర్శకుడు పాబ్లో సీజర్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్.ఎఫ్.డి.సి.) ఆధ్వర్యంలో 14వ ఫిల్మ్ బజార్ ను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ ఫిల్మ్ బజార్ ను ఆఫ్ లైన్, ఆన్.లైన్ మార్గాల్లో సమ్మిశ్రితంగా నిర్వహిస్తారు. ఫిల్మ్ బజార్ ను వర్చువల్ విధానంలో నిర్వహించనున్నప్పటికీ, ఇదివరకు నిర్వహించన విభాగాలన్నింటినీ ఇందులో కూడా పొందుపరుస్తారు. దక్షిణాసియా చలనిచిత్ర మార్కెట్లో ఫిల్మ్ బజార్.కు ఎంతో కీలక పాత్ర ఉంది. దక్షిణాసియా, అంతర్జాతీయ చలనచిత్ర వర్గాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఫిల్మ్ బజార్ ప్రోత్సహిస్తుంది.

ఇఫీ ప్రారంభ చిత్రమైన అనదర్ రౌండ్ అనే చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ ను ఇఫీ ప్రారంభోత్సవంలో ప్రదర్శించారు. డెన్మార్క్ చిత్రప్రముఖుడు థామస్ వింటెర్.బెర్గ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని గురించి వివరిస్తూ, థామస్ వింటెర్.బెర్గ్ ఒక వీడియో సందేశం పంపించారు. కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డు సాధించిన మాడ్స్ మిక్కెల్సెన్ నటించిన ఈ సినిమాను ఆస్కర్స్ అవార్డులకు అధికారిక ఎంట్రీగా డెన్మార్క్ ఇదివరకే పంపించింది.

51వ ఇఫీ ఉత్సవం అంతర్జాతీయ విభాగంలో,.. 60దేశాలకు చెందిన 126 చలనచిత్రాలను ఈ సారి  ప్రదర్శించబోతున్నారు.  వీటిల్లో 85 సినిమాలను ప్రీమియర్ సినిమాలుగా పరిగణిస్తారు. 7 ప్రపంచ స్థాయి ప్రీమియర్లు, 6 అంతర్జాతీయ ప్రీమియర్లు, 22 ఆసియా స్థాయి ప్రీమియర్ సినిమాలు, 50 భారతీయ ప్రీమియర్ సినిమాలు వీటిలో ఉన్నాయి.

ఇఫీలో ప్రతి ఏడాదీ ప్రధానంగా జరిగే మాస్టర్ క్లాసులను, ఇష్టాగోష్టి సంభాషణా కార్యక్రమాలను ఈసారి వర్చువల్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. శేఖర్ కపూర్, ప్రియదర్శన్, పాబ్లో సీజర్ (అర్జెంటీనా), ప్రసన్న వితనాగే (శ్రీలంక) వంటి సినీ ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో తమ విలువైన అనుభవాలను పంచుకుంటారు.

ఇఫీ పునరావలోకనం విభాగంలో సత్యజిత్ రే దృశ్యకావ్యాలైన పథేర్ పాంచాలీ, షత్రంజ్ కే కిలారీ, చారులత, ఘరే బైరే, సోనార్ కెల్లా వంటి సినిమాలను ప్రదర్శిస్తారు. భారతీయ చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే 150వ జయంతిని పురస్కరించుకుని ఫాల్కే రూపొందించిన  నాలుగు చలన చిత్రాలను ప్రదర్శిస్తారు. గత ఏడాది మరణించిన 18మంది చలనచిత్ర ప్రముఖులకు ఇఫీ ఉత్సవం నివాళులు అర్పిస్తుంది. ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్, ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, సోమిత్రా చటర్జీ, సుశాంత్ సింగ్ రాజపుత్, బాసు చటర్జీలకు ఇఫీ ఈ సందర్భంగా నివాళులర్పిస్తుంది. ప్రపంచ స్థాయి ప్రీమియర్ చిత్రమైన ‘మెహ్రున్నీసా’ను ఉత్సవం మధ్యలో ప్రదర్శించనున్నారు. కియోషీ కురోసోవా దర్శకత్వం వహించిన ‘వైఫ్ ఆఫ్ స్పై’ జపాన్ సినిమాను ముగింపు చిత్రంగా ప్రదర్శిస్తారు.

ఈ ఉత్సవంలో,.. పెడ్రో అస్మోదోవర్ కబాల్లెరో,  రూబెన్ ఒస్ట్.లుండ్, కిమ్ కీ డ్యుక్ వంటి సినీ ప్రముఖుల చిత్రాలను అభిమానులు వీక్షించి, ఆస్వాదించే అవకాశం ఉంది. దర్శకులు తొలి ఉత్తమ చిత్రాల కేటగిరీకి కింద ఎంపిక చేసిన ఏడు గొప్ప చిత్రాలను కూడా కూడా ఇఫీ ప్రతినిధులు వీక్షించవచ్చు. వీటికి తోడు ఐ.సి.ఎఫ్.టి-యునెస్కో గాంధీ మెడల్ పోటీ కింద మరో పది చిత్రాలను కూడా ఈ సారి ప్రదర్శిస్తారు.  మహాత్మాగాంధీ బోధించిన శాంతి, సహనం, అహింస వంటి ఆశయాలను ప్రతిబింబించే సినిమాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు.

ఇఫీ డైరెక్టర్ చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ, : “51వ ఇఫీ ఉత్సవం మనకు కొత్త మార్గాన్ని సూచించింది. ఇతర చలనచిత్రోత్సవాల్లో కూడా,.. ప్రతిభా ప్రదర్శనకు కొత్త రూపాలను అనుసరించేందుకు ఇది వీలు కల్పించింది. పునరుత్థాన భారతావని, స్ఫూర్తిదాయక భారతదేశం, నవ భారతదేశం వంటి అంశాలకు సంబంధించి, సినీ మాధ్యమాలతోనే ఈ ఉత్సవాన్ని తీర్చిదిద్దాం. సాంకేతి పరిజ్ఞానంతో సినిమాల ఇతివృత్తాన్ని ఎలా మేళవించాలో ఈ ఉత్సవం మాకు నేర్పించింది. వివిధ రూపాల సమ్మిశ్రితంగా ఈ ఉత్సవాన్ని తీర్చిదిద్దగలిగినందుకు మేం ఎంతగానో సంతోషిస్తున్నాం. రానున్న కొన్ని రోజుల్లోనే ఇతర చలన చిత్రోత్సవాలకు మేం ప్రమాణాలను నిర్దేశించబోతున్నాం.” అని అన్నారు.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నీరజా శేఖర్ ప్రారంభోన్యాసం చేస్తూ, దేశంలో చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు తాము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని, అనిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ వంటి అంశాలను కూడా చురుగ్గా ప్రోత్సహిస్తామని చెప్పారు. గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ పునీత్ కుమార్, గోవా వినోద పరిశ్రమల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ సతీజా, భారతీయ చలనచిత్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి, ఇఫీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు రవి కొత్తరకార, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ చైతన్య ప్రసాద్ తో పాటు, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇఫీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గోవా స్థానిక జానపద సంస్కృతికి, సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2004వ సంవత్సరం నుంచి గోవా కేంద్రంగానే ఇఫీ ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి.

PIB, January 16, 2021