వాగ్గేయకారులు 4 ముత్తుస్వామి దీక్షితార్(1775-1835)

కర్ణాటక సంగీతత్రయంలో రెండవవాడైన ముత్తుస్వామి దీక్షితార్ సంగీత విధ్వాంసుల కుటుంబానికి చెందిన వారు. వీరి తండ్రి రామస్వామి దీక్షితార్ గొప్ప సంగీతవిధ్వాంసులేకాక, హంసధ్వని రాగం సృష్టికర్త . కర్ణాటక ప్రాంతానికి చెందిన రామస్వామి దీక్షితార్‌, సుబ్బలక్ష్మి అంబాళ్‌ పుణ్యదంపతులకు ముత్తుస్వామి 1775లో పుట్టారు. ఆయన తండ్రి వద్ద సంగీతంతోపాటు తెలుగు, సంస్కృత భాషలు కూడా నేర్చారు. ముత్తుస్వామి దేశమంతటా పర్వటించిన కారణంగా ఆయనపై హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతాల ప్రభావం చూపింది. ఒకసారి ఇంటికి అతిధిగా వచ్చిన చిదంబరనాధ యోగి బాలునిగా ఉన్న ముత్తుస్వామి దీక్షితార్‌ను కాశీకి తీసుకెళ్ళారు. అక్కడ ముత్తుస్వామికి ఉపాసనా మార్గాన్ని బోధించారు. వారణాసిలో ఉన్నప్పుడు ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు.

‘శ్రీనాథాదిగురుగుహో జయోతి జయతి’ ఆయన తొలి కీర్తన. తురుత్తణిలో వెలసిన శివుడి కుమారుడెైన కుమారస్వామి (మురుగన్) పై ఈ సంకీర్తనను ముత్తుస్వామి రచించారు. ఆ తర్వాతికాలంలో ‘గురుగుహ’ ఆయన ముద్రగా రూపుదిద్దుకుంది. వేదవేదాంగాలు, పౌరాణిక ధర్మాలను, వ్యాకరణ, జ్యోతిష్య, వైద్య విద్యలను క్షుణంగా అభ్యసించిన ముత్తుస్వామి కీర్తనలలో ధ్యాన యోగం, జ్యోతిష్యశాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలెైనవి ప్రస్ఫుటంగా మనకు గోచరిస్తాయి. దీక్షితార్ కృతులు మంద్రస్థాయిలో నున్నప్పటికీ, గమకాలను ఉపయోగించిన రీతి ఆయా రాగాల ఔనిత్యాన్ని వెలికితీస్తాయి. చాలావరకు ఈయన రచనలు సంస్కృతంలో ఉన్నప్పటికీ, కొన్ని కృతులను తెలుగులో కూడా రచించారు. మరికొన్ని కీర్తనలలో తెలుగు. తమిళం, సంస్కృత భాషలను కలిపి మణిప్రవాళిశైలిగా ఉపయోగించారు. మధ్యమకాల సాహిత్యాన్ని దీక్షితార్ తమ కృతులలో అద్భుతంగా పలికించారు. ఆయన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని 72 మేళకర్త రాగాల్లో, సూలాదిసప్త తాళాలకు మేళవిస్తూ రచనలు చేశారు. ఇందు ఆయన 191 రాగాలలో రాసిన 461 కృతులు మాత్రమే నేడు మనకు లభ్యమయ్యాయి.

ముత్తుస్వామి తన మాతృభాషైన తమిళంలోకాక, శ్రావ్యమైన తెలుగులోనూ కాక సంస్కృతంలో రచనలు చేయడానికి కారణమున్నది. సంస్కృత శబ్ధోచ్ఛరణలో గంభీర ధ్వని కల్గి ప్రత్యేకతను సంతరించుకుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలో ప్రత్యేకత వాటియందున్న రాగసంచారముల యొక్క సౌందర్యశ్రేష్టత, ఉత్కృష్టలలో ఉంది. ఆయన కీర్తనలన్ని దేవతా సంకీర్తనములగుట వల్ల ఆయనకు కావాల్సిన భాష గాంభీరత, సాహిత్య భావములు సంస్కృతభాష యందు అనంతముగా లభించింది. అందుకనే వారు ఆ భాషను ఎన్నుకున్నారని విశ్లేషకుల అభిప్రాయం.

దీక్షితార్ తండ్రిగారు వెంకటకృష్ణ మొదలియార్ ఆస్థానంలో సంగీతకారులుగా ఉన్నకాలంలో, ముత్తుస్వామివారికి ఈస్టిండియా కంపెనీవారి బ్యాండ్ వినే అవకాశం కల్గింది. దాని వలన ముత్తుస్వామి దీక్షితార్ పాశ్చాత్య సంగీతంలోని మర్మాలను గ్రహించగలిగారు. అనంతరం ఆంధ్రులకు తెలుగు నిఘంటవును ప్రసాదించిన బ్రౌను దొర ప్రోత్యాహంతో ఆంగ్లపాటలకు దీక్షితార్ బాణీలు కట్టారు. అందులో ప్రధానమైనది ‘గాడ్ సేవ్ ది కింగ్’ అనే బ్రిటన్ వారి జాతీయం గీతం. దీనికి ముత్తుస్వామి దీక్షితార్ సంస్కృత శబ్ధాల తొడుగును అమర్చి దేవీస్తుతి చేశారు. అదే,

‘సతతం పాహి మాం సంగీతశ్యామలే సర్వాధారే
జననీ చింతితార్ధప్రదే చిద్రూపిణీ శివే
శ్రీ గురుగుహ పూజితే శివమోహాకారే
సతతం పాహిమాం’

గమకాలకు ఆస్కారంలేని నొట్టుస్వర సాహిత్యాన్ని పాశ్చాత్యసంగీత బాణీలలో ముత్తుస్వామి రచించి, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలకు శేతుబంధం చేయటంతోపాటు, పాశ్చాత్య సంగీతానికేపరమైన వయలిన్ (ఫిడేల్)ను కర్ణాటక సంగీతానికి పక్క వాయిద్యంగా చేసి రెండు సంగీతాలను పెనవేశారు. అయితే ఫిడేల్ను కర్ణాటకసంగీతంతో మేళవించిన ఘనత ముత్తుస్వామి కనిష్ట సోదరుడు బాలస్వామి దీక్షితులకు చెందుతుంది. నేటికీ హిందుస్తానీ సంగీతంలో వయలిన్ కు చోటులేదు.

తన తమ్ముడు చిన్నస్వామి చనిపోయిన దుఃఖ సమయంలో ఆయన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. అక్కడే అతడు ‘మీనాక్షి మేముదం దేహి, మామన మీనాక్షి’ అనే కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించారు. ఆ తదనంతర కాలంలో ముత్తుస్వామి కమలాంబ అమ్మవారిపై ‘నవావర్ణ కీర్తనలను’ ఆలపించారు. దేవీనవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజుకు ఒక కీర్తన చొప్పున ఈ రచనలు చేశారు. ఈ కీర్తనలలో ఆయన శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యాలను నిగూఢపర్చారు. అదేవిధంగా ‘వర కృతుల’ను ఆయన వారంలోని ఒక్కొక్కరోజుకి ఒకటి చొప్పున రచించారు. అలాగే షోడశ (పదహారు) గణపతి కృతులను వ్రాశారు. అందులోనిదే ఎంతో ప్రసిద్ధి చెందిన హంసధ్వని రాగంలోని ‘వాతాపి గణపతిం భజే’ కృతి.

ఈ కృతిలో ముత్తుస్వామి ఎంతో అందంగా ఆద్యక్షర ప్రాసను పల్లవిలో (ఉదా: వాతాపి, వారణాస్యం, వరప్రదం), అనుపల్లవిలో (ఉదా: భూతాది, భూతభౌతిక; అలాగే వీత, వినుత, విఘ్న, విశ్వ మొదలయినవి) వాడారు. ఇక ద్వితీయాక్షర ప్రాస (పురా, మురా, పరా, నిర, కరా, హరా) మరియు అంత్యాక్షరప్రాస (చరణం, భరణం, రాగిణం, యోగినం, కారణం, వారణం; అలాగే తుండం, ఖండం, దండం మొదలయినవి) లను చొప్పించటం ఆయన ప్రతిభకు తార్కాణం. ఇవికాక, భూత అనే పదాన్ని మూడు చోట్ల మూడు వేర్వేరు అర్ధాలతో వాడారు – భూతాది, భూత-భౌతిక, భూతాకారం. అంతే కాక, తన వాగ్గేయకార ముద్ర అయిన ‘గురుగుహ’ను, రాగం పేరైన ‘హంసధ్వని’ని కృతి సాహిత్యంలో నిక్షిప్తం చేసి ఈ కృతికి మరింత సొగసు తెచ్చిపెట్టారు.

ఆయన రూపొందించిన కృతులలో కమలాంబా నవావర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు, పంచలింగ కృతులు, తమ గురువుగారిని స్తుతిస్తూ చేసిన గురుగుహ కృతులు ప్రత్యేక స్థానాన్ని కలిగి వున్నాయి. వాతాపి గణపతిం భజే, మహా గణపతిం, శ్రీనాథాది గురుగుహో, అక్షయలింగ విభో, బాలగోపాల, అఖిలాండేశ్వరి, రామచంద్రం భావయామి, చేతః శ్రీబాలకృష్ణం, శ్రీ వరలక్ష్మి, సిద్ధి వినాయకం, త్యాగరాజ యోగవెైభవం, అన్నపూర్ణే, అరుణాచలనాథం, ఆనందామృతకర్షిణి, మామవ మీనాక్షి, మీనాక్షి మే ముదం దేహి, నీలకంఠం భజే, స్వామినాథ, శ్రీ సుబ్రహ్మణ్యాయ, పరిమళ రంగనాథం, మొదలెైనవి వీరి యితర ప్రముఖ రచనలు.

పున్నాగవరాళి రాగంలోని ‘ఏహి అన్నపూర్ణే సన్నిధేహి, సదాపూర్ణే, సువర్ణే, చిదానందవిలాసిని’ అను కృతి ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఆఖరి కీర్తన. క్రీ.శ. 1835 సంత్సరం ఆశ్వయుజ బహుళ చతుర్ధశి, నరకచతుర్ధశి దినమున ఆయన శిష్యులు ‘మీనాక్షి మేముదం దేహి’ (గమక క్రియరాగం) అను కృతి ఆలపిస్తుండగా, అందు అనుపల్లవిలో ‘మీనిలోచనను, పాశమోచని’ అను పదాలు రాగా ఆయన చేతులు జోడించి కనులు మూసుకొని, ‘శివే పాహి’ అనుచు ప్రాణాలు వదిలారని కథనం.

(తరవాయిభాగంలో ముత్తుస్వామి దీక్షితార్ రచనలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.)

సౌమ్యశ్రీ రాళ్లభండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *